నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం కలగడం సాధారణంగా దాదాపు అందరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కోసారి 24 గంటలైనా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. అయినా ప్లాన్ గడువులో ఎలాంటి మార్పులుండవు. సర్వీస్ ప్రొవైడర్లు ప్రతిపాదించిన రీచార్జ్ చెల్లించాల్సిందే. పోస్ట్‌పోయిడ్ కస్లమర్ల పరిస్థితి అంతే. ఇకపై ఏదైనా నెట్‌వర్క్ సమస్య తలెత్తితే అందుకు అనుగుణంగా బిల్లు చెల్లింపుల్లో రాయితీ పొందేలా టెలికాం ప్రాధికార సంస్థ(ట్రాయ్) నిబంధనలను తీసుకొచ్చింది.
ట్రాయ్ విడుదల చేసిన క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం..టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో అందించే నెట్‌వర్క్ సేవల్లో 24 గంటల కంటే ఎక్కువసేపు అంతరాయం కలిగితే పరిహారం చెల్లించాలి. ఈమేరకు గతంలోని జరిమానాను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. దాంతోపాటు వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు ‘ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెస్ (వైర్‌లైన్స్ అండ్ వైర్‌లెస్), బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 2024’ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు ఆరునెలల తర్వాత అమల్లోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది.
గతంలోని సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ సేవల నాణ్యత వంటి మూడు నిబంధనలను భర్తీ చేస్తూ కొత్తవాటిని ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం..పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందించే సేవల్లో అంతరాయం ఏర్పడితే నెలవారీ బిల్లులో రాయితీ ఇవ్వాలి. ప్రీ-పెయిడ్ కస్టమర్‌లకు ప్లాన్ వ్యాలిడిటీ గడువు పెంచాలి. అయితే ఏదైనా వాతావరణ విపత్తు వల్ల నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడితే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: బీఎన్‌ఎన్‌ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదల
ఫిక్స్‌డ్-లైన్ సర్వీస్ ప్రొవైడర్లు(కేబుల్ నెట్‌వర్క్) కూడా పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్‌ల సమస్యలను మూడు రోజులలోపు పరిష్కరించాలి. లేదంటే పరిహారం చెల్లించాలి. మొబైల్ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు సహాయపడే సేవల వారీగా (2G, 3G, 4G, 5G) జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను అందించాలని ట్రాయ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment