
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఏఐ జనరేటివ్ ఆర్ట్ జీబ్లీ టూల్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక సంస్థ ప్రజల్లో ఆదరణ పొందే సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే పోటీ కంపెనీలు కూడా తమ యూజర్లను కాపాడుకునేందుకు ఎలాగైనా అదే తరహా, అంతకంటే మెరుగైన సేవలు అందించేందుకు పావులు కదుపుతాయి. అందులో భాగంగానే గూగుల్, గ్రోక్‌ఏఐ వంటి సంస్థలు కూడా ఏఐ ఆర్ట్ జనరేషన్ ఇమేజ్‌ను అందిస్తున్నాయి. కానీ ఇది నిజమైన కళాకారుల కళలను అనుసరిస్తూ, కాపీ రైట్ ఆందోళలనలకు దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాపీరైట్ ఆందోళనలు
ఏఐ నమూనాలు శిక్షణ కోసం చాలాసార్లు కాపీరైట్ చేసిన కంటెంట్ డేటాసెట్లపై ఆధారపడతాయి. స్పష్టమైన అనుమతి లేకుండా ఇటువంటి కంటెంట్‌ను ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. దాంతో కృత్రిమ మేధ సృష్టించిన ఆర్ట్ కంటెంట్ ఓనర్‌షిప్ ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంటుంది. ఏఐ ఆర్ట్ జనరేటర్లు నిర్దిష్ట కళాత్మక శైలులను అనుకరిస్తాయి. ఇది మానవ కళాకారుల ఒరిజినాలిటీని బలహీనపరుస్తుంది. ఏఐ ఆర్ట్ కంటెంట్ మానవ కళాకారుల పనిని తగ్గిస్తుంది. ఇది వారిని ఆర్థిక ఊబిలోకి నెట్టివేస్తుందనే అభిప్రాయాలున్నాయి.
దుర్వినియోగం
ఏఐ జనరేటెడ్ ఆర్ట్ ఒక కళాకారుడి శైలిని ప్రతిబింబించగలదేమో కానీ తన విలువలను, ఉద్దేశాలను తెలుపలేదు. ఉదాహరణకు, హయావో మియాజాకి(శాంతికి సంబంధించిన కళాకండాలు వేసే చిత్రకారుడు) వంటి కళాకారుడి శైలికి విరుద్ధంగా సైనిక, హింసాత్మక చిత్రాలను ఏఐ సృష్టిస్తోంది.
భావోద్వేగాలు
కృత్రిమ మేధ చారిత్రక విషాదాలు లేదా సాంస్కృతిక సంఘటనలు వంటి సున్నితమైన అంశాలను చిత్రాల రూపంలో స్టైలిష్‌గా చూపుతుంది. కొన్నిసార్లు విచిత్రమైన రీతిలో వాటిని ప్రదర్శిస్తుంది. ఇది ఆయా సంఘటనల వల్ల ప్రభావితమైన వారికి ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది.
ఇదీ చదవండి: పట్టణాల్లో అధిక ఖర్చు వీటికే..
ప్రముఖ కంపెనీల ఏఐ ఆర్ట్ జనరేటివ్ ఇమేజింగ్ వ్యవస్థలు సృష్టిస్తున్న కంటెంట్‌కు పరిమితులుండాలని కొందరు అంటున్నారు. ఎదుటివారి మనోభావాలు, ఆర్థిక, సామాజిక స్థితి దిగజారకుండా ఉండేంతవరకు పరిమితులకు లోబడి ఏఐ కంటెంట్ ఉండే సరిపోతుందని తెలుపుతున్నారు. అందుకు సమగ్ర విధానాలు రూపొందించడానికి ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు.