
వ్యక్తిగత ఫొటోలు ఏఐకి ఇవ్వటం ప్రమాదమంటున్న నిపుణులు
డేటా చౌర్యం, వేధింపులకు కారణం అవుతుందని హెచ్చరిక
జీబ్లీ ఇమేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇమేజ్ టూల్. ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ ఏఐ టూల్ ద్వారా తీసుకొచి్చన ఈ జీబ్లీ ఇమేజ్ క్రియేషన్ టూల్‌ను పిల్లల నుంచి ప్రముఖులు, దేశాధినేతల వరకు తెగ వాడేస్తున్నారు. ఎక్స్ గ్రోక్, గూగుల్ జెమినీ ఏఐ టూల్స్ కూడా జీబ్లీ చిత్రాలను అందిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ జనరేటెడ్ జీబ్లీ ఆర్ట్‌వర్క్ చిత్రాలు సోషల్‌మీడియాను ముంచెత్తుతున్నాయి. కానీ, ఇది యూజర్ల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమస్య ఏమిటి?
జీబ్లీ ఇమేజ్ కోసం మనం ఫొటో ఇస్తున్నామంటే మన వ్యక్తిగత ఫొటోలను ఏఐ టూల్ తన ఇష్టంవచి్చనట్లు వాడుకొనేందుకు ఒప్పుకుంటున్నట్లు లెక్క. మనమిచ్చే ఫొటో ఆధారంగా జీబ్లీ ఇమేజ్‌ను సృష్టించిన తర్వాత ఏఐ టూల్ ఒరిజినల్ ఫొటోను తన డేటా బేస్ నుంచి తొలగించదు. దానిని సదరు కంపెనీ ఏఐ శిక్షణ కోసమో, మరే ఇతర అవసరాలకైనా వాడుకొనే అవకాశం ఉంది. అప్పుడు మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు దుర్వినియోగం కావచ్చని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ జీబ్లీ?
చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఇమేజ్ జనరేటివ్ ఆర్ట్‌వర్క్ ఇది. ముఖ్యంగా చాట్‌జీపీటీలో బాగా పాపులర్ అయ్యింది. మన సొంత ఫొటోలు లేదంటే మనకు ఇష్టమైన ఏ ఇతర ఫొటోలైనా చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి జీబ్లీ స్టైల్ ఇమేజ్ కావాలని అడిగితే వెంటనే చూడముచ్చటైన చిత్రాన్ని అందిస్తుంది. మనకు ఏ విధమైన చిత్రం కావాలో సూచనలు ఇచ్చినా అలాంటి చిత్రాన్ని సృష్టించి ఇస్తుంది.
మీ వ్యక్తిగత ఫొటోలు ఒకసారి ఏఐ టూల్‌కు షేర్ చేశారంటే ఇక మీరు వాటిపై నియంత్రణ కోల్పోయినట్లే. ఆ ఫొటోలతో ఏఐ ట్రైనింగ్‌తోపాటు ఏ రకంగానైనా వాడుకొనేందుకు ఆ కంపెనీకి అవకాశం ఇచ్చినట్లే. అది డేటా చౌర్యం ప్రమాదానికి దారితీస్తుంది. ఆ ఫొటోలు, కంటెంట్‌తో మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయటానికి, వేధింపులకు గురిచేయటానికి కూడా అవకాశం ఉందని ప్రముఖ డేటా సెక్యూరిటీ సంస్థ ప్రొటాన్ హెచ్చరించింది.
‘ప్రస్తుతం ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్ చిత్రాలే కనిపిస్తున్నాయి. కానీ, దీనివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ చిత్రాలు, ఆలోచనలను ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్ చేయటం వల్ల డేటా చౌర్యంతోపాటు మీ ఉనికి (లొకేషన్) సదరు సంస్థ చేతుల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన అత్యంత సున్నిత డేటా కూడా మీ చేయిదాటిపోతుంది. జీబ్లీ ఇమేజ్ జనరేషన్ ఉచితమే కావచ్చు. కానీ, అది మీ జీవితం (డేటా) విలువ కూడా అవుతుంది. అది మీకు సమ్మతమే అయితే ఇబ్బంది లేదు. అప్రమత్తంగా ఉండటం ఎందుకైనా మంచిది.’
– ఎలీ ఫారెల్ కింగ్‌స్లే, బ్రిటిష్ టెక్ నిపుణురాలు.
జీబ్లీ స్టైల్‌కు ఆద్యుడెవరు?
జీబ్లీ ఆర్ట్ ఇమేజెస్‌కు ఆద్యుడెవరు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ చిత్రాలు అచ్చం జపనీస్ యానిమేటర్ హయావో మియాజాకీ సృష్టించిన ఆర్ట్‌వర్క్‌లాగే ఉన్నాయి. అయితే, ఈ ఏఐ జీబ్లీ చిత్రాన్ని తొలి సారి పొందింది మాత్రం అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రాంట్ స్లాటన్. 2023 డిసెంబర్‌లోనే ఈయన ఓపెన్ ఏఐ డాల్–ఈ టూల్‌ను వాడి తన కుటుంబ జీబ్లీ ఇమేజ్‌ను సృష్టించాడు.