art
-
ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!
కళాభిరుచిని కొనసాగించాలంటే.. కలలు కనాలి. అలాంటి కలలే కన్న మరో జత కనులు తోడైతే.. కల సాకారం అవడం తథ్యం. నచ్చిన అభిరుచిని పంచుకుంటూ పరస్పరం ప్రేమను పెంచుకుంటూ దగ్గరైన హృదయాలు ఆలపించే యుగళగీతం మృదు మధురంగా ఉంటుంది. ఆ మధురిమలు ఆస్వాదిస్తున్న కొన్ని జంటల్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలకరించినప్పుడు.. తమ రెండు హృదయాలను ఒకటి చేసిన కళాత్మక జ్ఞాపకాలను నెమరువేసుకున్నారిలా.. ప్రేమించాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నా..నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు గాయనిగా, ఆయన(రేణుకాప్రసాద్) ఇంటర్లో ఉండగా మృదంగం కళాకారుడిగా.. మా ఇద్దరికీ ప్రథమ పరిచయం. సంప్రదాయ సంగీతం అంటే ఇద్దరికీ ప్రాణం. చిన్న వయసు నుంచే కలిసి ‘కళ’లు పండించుకున్నాం. ఎన్నో వేదికలపై ఎన్నో కార్యక్రమాలు కలిసి చేయడం వల్ల సహజంగానే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం, అభిమానం.. ఆ తర్వాత నాకు పెళ్లి వయసు వచ్చే సమయానికి నా ఫ్రెండ్స్ అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని తమకెంతో ఇష్టమైన కళకు వీడ్కోలు పలకాల్సి రావడం కళ్లారా చూశాను. చాలా వరకూ అత్తింటి ఆంక్షలే అందుకు కారణం అవడం కూడా గమనించాను. ఎంతో శ్రమించి అభిమానించి ప్రాణంగా ప్రేమించిన కళను పెళ్లి కోసం వదిలేసుకోవాల్సి రావడం చూశాక.. తప్పనిసరిగా నాతో పాటు ఇదే రంగంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న వెంటనే నా మదిలో ఆయనే మెదలడం.. బహుశా దాన్నే ప్రేమ అనుకోవచ్చేమో.. ధైర్యంగా నా మనసులో మాట ఆయనకు చెప్పడం.. ఆయన కొంత సమయం తీసుకుని ఓకే చెప్పడం.. నేను ఇంట్లో వాళ్లని కన్విన్స్ చేయడం.. వరుసగా జరిగిపోయాయి. మా పెళ్లితో సహా.. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ కలిసి సాగుతున్న మా కళాత్మక ప్రయాణం.. చక్కని చిక్కని సంగీతంలా కన–వినసొంపుగా సాగిపోతూనే ఉంది. శ్వేత, ప్రముఖ గాయని కలర్ ఫుల్.. కళ కపుల్.. కలిసి చదువుకున్నాం.. కలిసి బొమ్మలేశాం.. కలిసి ఏడడుగులు నడిచాం.. నగరంలోని జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు తొలుత పెయింటింగ్ అంటే మాకున్న ఇష్టాల్ని పంచుకున్నాం. అలా అలా పరస్పరం ప్రేమను పెంచుకున్నాం. మా ప్రేమ ప్రయాణం మీద మాకెంత నమ్మకం వచ్చిందంటే.. వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడాలి ఆ తర్వాతే పెళ్లి అనే ఆలోచన కూడా చేయకుండా.. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేసేసుకున్నాం. ఆ తర్వాత స్ట్రీట్ ఆర్టిస్ట్స్‌గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన ఆర్ట్ వర్క్స్ గీశాం. తద్వారా సిటీలో పుట్టిన క్యూరియాసిటీ.. మా కపుల్ ఆర్ట్‌కి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరం కలిసి నగరంలోని పలు గోడలమీద బొమ్మలు గీసిన రోజులు మాకు ఇంకా గుర్తున్నాయి. ఫ్రెండ్స్‌గా మొదలుపెట్టి ఫ్రాన్స్ ఆర్ట్ ఫెస్టివల్ దాకా.. ఇంకా అనేకానేక జ్ఞాపకాలతో సాగుతున్న మా కలర్‌ఫుల్ జర్నీకి బాటలు వేసింది మా ప్రేమే.. – విజయ్, స్వాతి ప్రముఖ చిత్రకారులు పాట కలిపిన ప్రేమ బాట గురించి వారి మాటల్లోనే.. పాటల ప్రయాణంలో.. చిగురించిన ప్రేమ.. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.., ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా.., ఈ రాతలే దోబూచులే.. అంటూ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అద్భుతమైన ప్రేమ గీతం పాడిన సింగర్ హరిణి ఇవటూరి.. తన జీవితంలో మాత్రం కలవని ఇరు ప్రేమికుల్లా ఉండకూడదు అనుకుందో ఏమో.. తన స్వరానికి తోడుగా మరో స్వరాన్ని ప్రేమతో కలిపేసుకుంది. సలార్‌లో తను పాడిన.. సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజం తట్టి.. చిమ్మచీకటిలోనూ నీడలా ఉండేటోడు.. రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు.. అనే పాటను ప్రతిబింబించేలా తన ప్రియసఖుడు భాస్కరుని సాయిచరణ్ ఆమె ప్రేమకు పెళ్లి కానుక అందించారు. ఆయనెవరో కాదు.. ప్రముఖ హిట్ మూవీస్ హనుమాన్, కాటమరాయుడు, సుప్రీమ్ వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో తెలుగు సంగీత ప్రియుల మన్ననలను పొందినవాడే..మా మొదటి పరిచయం 2011–12 సంవత్సర కాలంలో ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన పాటల కార్యక్రమంలో.., కానీ మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో నిర్వహించిన సంగీత ప్రదర్శనల్లోనే.. ఈ ప్రదర్శనల కోసం చాలా చోట్లకు ప్రయాణం చేశాం.. ఈ సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాం.. ఒకానొక సమయంలో మా బంధం స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అనిపించింది. అలా 2014లో మా స్నేహం కాస్త ప్రేమని తెలుసుకున్నాం. ‘హరిణికి తన పైన ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని.. ‘స్నేహానికి మించిన బంధంమనది అనిపిస్తుంది, ఇకపై నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు’ అని సాయి చరణ్ ఆర్డర్ వేయగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య అని పిలువను అని చెప్పకనే తన ప్రేమను చెప్పిందని తమ ప్రేమ స్మృతులను గుర్తు చేసుకున్నారు’. మేమే కాకుండా మా స్నేహం వల్ల మా ఇద్దరి కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కానీ.. అప్పటికీ మేమింకా సెటిల్ కాలేదు. మా కుటుంబాల్లో ప్రేమ పెళ్లి ఒప్పుకుంటారా అనే అనుమానంతో భయపడ్డాం. ఇరు కుటుంబాలపైన ఉన్న నమ్మకంతో నిజాయితీగా మా ప్రేమ విషయం చెప్పడం, మా ప్రేమను గౌరవించి వారు కూడా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ మీరు సెటిల్ అయ్యాకే కలిసి జీవితాన్ని ప్రారంభించండి అనే వారి సూచన మేరకు మూడేళ్ల తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మాకొక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు ఈ ప్రేమ గురించి మా గురువు బాలసుబ్రహ్మణ్యంకు తెలపగా., కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే తను మాట్లాడతానని భరోసా ఇచ్చారు. పెళ్లికి రావడంతో పాటు పెళ్లి కానుకగా మా కోరిక మేరకు మా ఇంటికి భోజనానికి వచ్చి ఆశీర్వదించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, విశ్వంభర వంటి సినిమాల్లో పాటలు పాడుతున్నాం. ఆస్కార్ విజేత కీరవాణి సంగీత దర్శకత్వంలో రాజమౌళి–మహేష్ బాబు ప్రాజెక్టుకు సైతం పాడుతున్నాం. ప్రేమికులు ఎవరికైనా వేరు వేరు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. కేవలం 10 శాతం మాత్రమే ఆ ఇద్దరికీ ఆలోచనలు కలుస్తాయి. ఈ విషయంలో సమన్వయం ఉంటే ప్రేమ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. – భాస్కరుని సాయి చరణ్, హరిణి నాటి అభిమాని.. నేటి జీవిత భాగస్వామి..తను (డా.బిజినా సురేంద్రనాథ్) కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ విద్యార్థినిగా ఉన్నప్పుడు నేను కూచిపూడి నృత్యకళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తుండేవాడిని. ఒకసారి సిలికానాంధ్ర కార్యక్రమంలో మేము ఇద్దరం కలిసి ప్రదర్శన ఇచ్చాం. అప్పుడే తను నా ప్రదర్శనలు చూస్తున్నానని, నా నృత్యానికి అభిమానినని చెప్పింది. నిజం చెప్పాలంటే ఆ ప్రదర్శనలో నాకన్నా తనే బాగా నృత్యం చేసింది. ఆ విషయం తనతో చెప్పాను. అక్కడి నుంచి ఇద్దరం సన్నిహితులమయ్యాం. నృత్యం అంటే ఉన్న ఇష్టం పరస్పరం ఒకరి మీద ఒకరికి కూడా ఏర్పడింది. కొంత కాలం తర్వాత మేం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నాకు సరైన ఉద్యోగం లేదని ఆమె ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టారు. దాంతో నేను సెటిలయ్యాకే వివాహం చేసుకుందామని అనుకుని.. ఇద్దరం కలిసి ప్రణాళికాబద్ధంగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాం. ఏడాదిలోనే నేను మంచి స్థితికి రావడంతో మా పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. మా నడక నర్తన సంతోష భరితంగా సాగిపోతున్నాయి. – సురేంద్రనాథ్, కూచిపూడి నృత్యకళాకారుడు. (చదవండి: చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!) -
చూసేందుకు చిన్నదే..కానీ ఆదరణ పెద్దది..!
ఆభరణాల పెట్టెలో భారీ విశ్వం, నాలుగు అంగుళాలకు మించని మినీ బీచ్‌లో బృందాల జలకాలాటలు, అతి పెద్ద గొడపై నిలిచిన అతి చిన్ని డబుల్ థ్రెషోల్డ్... అబ్బురం అనిపించే ఈ సూక్ష్మ చిత్ర కళ ఇప్పుడు ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ పొందుతోంది. ఆర్ట్ గ్యాలరీలు, ఆర్ట్ ఫెయిర్స్లో ఈ కళ కొత్తగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ ఆర్ట్ ప్రియులు కళ ఇలా రూపు మారడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఆర్ట్ మార్కెట్‌ను మినియేచర్ ఆర్టిస్టులు ఏలేస్తున్నారు అని ప్రశంసిస్తున్నారు. దేశీయ మినియేచర్ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక మినీయేచర్ పెయింటింగ్ స్కూళ్లు పుట్టుకువచ్చాయి. ప్రతి ఒక్కటి దాని సాంస్కృతిక, ప్రాంతీయ, చారిత్రక సందర్భాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది మొఘల్ స్కూల్ ఆఫ్ మినియేచర్. దీనిలో కిషన్‌గఢ్ శైలి, రాధా కృష్ణుల దైవిక ప్రేమలు మరింత ప్రత్యేకమైనవి. పహారీ స్కూల్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని కొండ ప్రాంతాలలో అభివృద్ధి చెందింది. దక్కన్ స్కూల్ పర్షియన్, టర్కిష్, భారతీయ అంశాల కలయికను ప్రదర్శిస్తుంది. సూక్ష్మ చిత్రాలలో వెలసిన పచ్చని ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన థీమ్‌లో ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. విదేశాలలో సూక్ష్మ కళసంవత్సరాల క్రితం కెనడియన్ మినియేచర్ ఆర్టిస్ట్ శాంటియాగో తనదైన పనితనంతో ఇంట్లోనే చిన్న చిన్న పెయింటింగ్స్ వేస్తూ, శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. కెనడియన్ కలెక్టర్ బ్రూస్ బెయిలీ శాంటియోగోను కలిసినప్పుడు అతని కళా నైపుణ్యాన్ని చూసి కొంతకాలం ‘ఓపికపట్టండి’ అని చెప్పాడట. శాంటియాగో నవ్వుతూనే కాలక్రమంలో అందరూ వదిలేసిన వుస్తవులను అతి చిన్న నమూనా బొమ్మలను తయారుచేశాడు. ఒక జత కఫ్లింగ్లకు సరిపోయేంత పెట్టెలో ఒక సముద్రాన్నే సృష్టించాడు. కాలక్రమంలో కళాభిరుచిగలవారు ఈ సూక్ష్మ కళ ప్రాముఖ్యతను గుర్తిస్తారని అతను నమ్మాడు. ఈ విషయాన్ని బెయిలీ ప్రస్తావిస్తూ ‘2018లో శాంటియాగో పని తనాన్ని చూసినప్పుడు, నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇన్నాళ్లకు నిజమయ్యింది’ అంటాడు. ఇటీవల గ్యాలరీలలో అతి చిన్న కళాకృతులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మనుషుల ఆలోచనలు ఎలా మారతాయో చూడటం ఆసక్తికరంగా ఉంది’ అంటాడు శాంటియాగో. 2010 చివర 2020ల ప్రారంభంలో సూక్ష్మ కళ అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన సమయంగా చెప్పుకోవచ్చు. దీనిని యువ చిత్రకారులు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఈవిషయం గురించి శాంటియోగో వివరిస్తూ ‘నేను ఇంతటి ఆదరణను ఊహించలేదు. ఆర్ట్నెట్ ప్రైస్ డేటాబేస్ ద్వారా సెకండరీ మార్కెట్లో ప్రదర్శించిన ఆర్ట్‌ను పరిశీలిస్తే కిందటి సంవత్సరం దాదాపు 2 మిలియన్లకు అమ్ముడైన పెయింటింగ్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పెయింటింగ్‌లు, సైక్లాడిక్ మాస్క్, జపనీస్ హెల్మెట్ స్టాండ్ వంటివి ఉన్నాయి. మెక్సికోలో సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీమహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడు వారి చూపు తమ ఇంటీరీయర్ వైపు మళ్లింది. అప్పుడే తమలోని సృజనకు పదును పెట్టినవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది. షార్ప్ టైలర్ అనే కళాకారుడు మెక్సికో నగరంలో ‘లులు’ అనే సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీని నడిపేవాడు. ఆ తరువాత లాస్ ఏంజిల్స్‌లోని పెద్ద స్టూడియోకు తన చిత్రకళను మార్చాడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ దేశీయ సంస్కృతికి కళాకారులు అద్దం పడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావంపరిమాణంతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో ఈ చిత్రకళా ప్రదర్శన నిత్యం జరుగుతూనే ఉంది. అతి పెద్ద గోడలపైన అతి చిన్న కళాకృతి ఆసక్తిని రేపుతుంది.‘ చిత్రాలలో అంతర్లీనంగా ఉన్న సున్నితత్వం తోపాటు రహస్యం దాగుంటుంది. దానిని కనుక్కోవడంలో చేసే ప్రయత్నం అత్యంత మనోహరంగా ఉంటుంది’ అంటున్నారీ కళాకారులు. (చదవండి: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి) -
ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోమని న్యాకోనే చెప్పిందట!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు పాతరేసింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. గోప్యంగా ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కావాల్సిన వారికి పోస్టులు కట్టబెడుతోంది. తాజాగా ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (శాక్స్)లో వైద్య పోస్టులను ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వైద్య శాఖ భర్తీ చేయడం విమర్శలకు దారితీసింది. ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటి రెట్రోవైరల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్స్‌లో మెడికల్ ఆఫీసర్(ఎంవో) పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే హార్మోని కన్సల్టెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే విధానంలో మంగళవారం ముగ్గురు వైద్యులను నియమించారు. ఈ వ్యవహారంపై ‘నోటిఫికేషన్ ఇవ్వకుండా వైద్యుల నియామకమా?’ శీర్షికతో బుధవారం “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో న్యాకో మార్గదర్శకాలను అనుసరించే ఔట్‌సోర్సింగ్‌లో వైద్యులను నియమిస్తున్నామని శాక్స్ అధికారులు సమర్ధించుకున్నారు.వాస్తవానికి ఏఆర్టీ సెంటర్స్‌లో వైద్య, ఇతర సిబ్బంది పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని జాతీయ ఏఆర్టీ సేవల నిర్వహణ మార్గదర్శకాలు–2021లోనే న్యాకో స్పష్టంగా చెప్పింది. ఒక పోస్టుకు ఐదు దరఖాస్తులు దాటితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ కలిగిన వారిని నియమించాలని న్యాకో నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను అనుసరిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శాక్స్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో శాక్స్‌లో సమన్వయకర్తలు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది పోస్టులన్నింటినీ బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వనించి, ఆర్ఓఆర్ పాటిస్తూ ప్రతిభ కలిగిన, అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. రూ. లక్షల్లో వసూళ్లుకూటమి ప్రభుత్వం మాత్రం న్యాకో నిబంధనలంటూ ఔట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తోంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న వైద్యులకు నెలకు రూ.72 వేల వేతనం ఉంటుంది. ఎన్హెచ్ఎం పరిధిలో ఇంతకంటే తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఏఆర్టీ సెంటర్లలో వేతనం కొంత ఎక్కువ, పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీటికి బహిరంగ నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మంది యువ వైద్యులు ముందుకు వస్తారని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినా, అర్హులకు అన్యాయం చేస్తూ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం అవుట్సోర్సింగ్ రూ. లక్షల్లో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక శాక్స్‌లో ఇదే తరహాలో క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో ఓ కీలక అధికారి బంధువుకు గుంటూరు జిల్లాలో ఓ పోస్టును కట్టబెట్టారు. -
కాలానుగుణంగా కోలాటం : ప్రొద్దుటూరు మహిళల విజయం
‘చీరలంటే చీరలు... చీరల మీద చిలకలు/ రైకలంటే రైకలు... రైకల మీద రంగులు’‘జానపదమైనా సరే–‘అబ్బబ్బా దేవుడూ... అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు... శ్రీరామచంద్రుడు’... ఇలా ఆధాత్మికమైనా సరే–ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలం కోలాటం సంబరాల సందడిలో ఉత్సాహతరంగమై ఎగరాల్సిందే.తెలుగు వారి సాంస్కృతిక చిరునామాలలో ఒకటి... కోలాటం. కళ అనేది పుస్తకాల్లో కాదు ప్రజల మధ్య, ప్రజలతో ఉంటేనే నిత్యనూతనంగా వెలిగిపోతుంది. ఈ ఎరుకతో కోలాటానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకు కదిలారు ప్రొద్దుటూరు మహిళలు.కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు కోలాట నృత్యానికి కొత్త హంగులను జోడించి ఆ కళకు మరింత ఆదరణ వచ్చేలా కృషి చేస్తున్నారు. బండి మల్లిక ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మాస్టర్ సాయి భరత్ దగ్గర కోలాటంలో శిక్షణ తీసుకుంది. తనలాగే శిక్షణ తీసుకున్న దాదాపు నాలుగు వందలమందితో ‘సావిత్రి బాయి పూలే అభ్యుదయ మహిళా కోలాట బృందం’ ఏర్పాటు చేసింది. అందరినీ ఒకే తాటి పైకి...కోలాటం సంప్రదాయ స్ఫూర్తిని పదిలంగా కా΄ాడేలా పూలమాలలు, లెజిన్స్, భజన తాళాలు... మొదలైన వాటితో అన్నమాచార్య కీర్తనలతో నృత్యప్రదర్శనలు చేస్తూ కోలాటానికి కొత్త శోభను తీసుకువస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోలాటం నేర్చుకున్న వారు ఎవరికి వారు బృందాలుగా వుండడంతో వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి కొత్తగా ఏదైనా సాధించాలనే ఆలోచన మల్లికకు వచ్చింది.వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి దశావతార కోలాటంపశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో 222 మంది మహిళలు కోలాటంతో దశావతార జానపద నృత్య ప్రదర్శన చేశారు. ‘గోవిందుడేలరాడే.. గోపాలుడేలరాడే.. మా అయ్య ఏలరాడే..’ అనే పాటతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన తో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు సాధించారు. కాలంతో పాటు ప్రవహించాలి...ప్రొద్దుటూరుకు మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్, తిరుచానూరు, శ్రీకాళహస్తి, ఒంటిమిట్ట, అరుణాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తిరుమల తిరుపతి ఆలయాల బ్రహ్మోత్సవాలలో తమ కోలాటంతో కనుల పండగ చేస్తున్నారు బృందం సభ్యులు.‘కాలేజీలో పనిచేస్తూనే సాయంత్రం వేళల్లో, సెలవుల్లో కోలాటం నేర్చుకున్నాను. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపకరించే కళ ఇది. ్ర΄ాచీన జానపద కళలకు జీవం పోయాలనే లక్ష్యంతో కోలాటం ఆడుతున్నాం. ఈ కళ నిలువ నీరులా ఉండకూడదు. కాలంతోపాటు ప్రవహించాలి. ప్రతి తరం సొంతం చేసుకోవాలి’ అంటుంది ‘గౌతమి ఇంజినీరింగ్ కాలేజీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భూమిరెడ్డి నాగమణి.ఇక అయోధ్య రాముడి దగ్గరికి... ‘దశావతారం’ కోలాట నృత్య ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రదర్శనల కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోకుండా సొంత ఖర్చులతో దేవస్థానాలలో ప్రదర్శనలు చేస్తున్నాం. బయట ఎక్కడా ప్రదర్శనలు చేయం. అయోధ్యలో కోలాటం ప్రదర్శన చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ తరం పిల్లలు కూడా కోలాటానికి దగ్గర కావాలి. ఏ కళా దానికి అదే దూరం కాదు. సంప్రదాయ కళలకు చేరువ కావడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కరిద్దరు కాకుండా కళాకారులందరూ ఐక్యంగా కృషి చేస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో నిరూపించాం. – బండి మల్లిక అరుణాచల కొండల్లో... అలుపెరగని కోలాటంబండి మల్లిక నేతృత్వంలో తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణ సందర్భంగా ‘సావిత్రి బాయి పూలే కోలాట బృందం’లోని 111 మంది మహిళా కళాకారులు 14 కిలోమీటర్లు కోలాటాన్ని ప్రదర్శించారు. కోలాట కర్రలతో అన్నమయ్య, శివనామస్మరణ కీర్తనలకు లయబద్ధంగా నృత్యం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన కోలాట నృత్యం మరుసటి రోజు ఉదయం 3.40 గంటల వరకు కొనసాగింది. ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు గిరి నృత్య ప్రదక్షిణలో అలసిపోకుండా కోలాటం పూర్తి చేసిన వీరి ప్రతిభ ఉత్తర అమెరికాలోని ‘తానా బుక్ ఆఫ్ రికార్డు’ లో నమోదైంది. ‘భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లోనూ చోటు సాధించారు. – మోపూరు బాలకృష్ణారెడ్డి సాక్షి ప్రతినిధి, కడపఫొటోలు: షేక్ మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు. -
కళాత్మక రాజసం జైపూర్ ఆర్ట్ సెంటర్
‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్‌సిటీ జైపూర్‌లోని గంగోరి బజార్లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.సర్వతో రుచులుఈ ప్యాలెస్‌ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి. అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్‌కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్‌ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్‌లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్లో సిటీ ప్యాలెస్ విజిట్‌ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. -
అభిరామం నృత్యంతో చెప్పే రామాయణం : ఎవరీ ఐశ్వర్య హరీష్!
ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్‌లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.నృత్యంతో అన్వేషణ‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.ఆత్మను కదిలించాలిఅభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్‌లైన్‌ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్‌లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్‌ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్‌గా మార్చాలనుకున్నాను. ఆకర్షించిన అంశాలుమొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్‌ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్లో ఇది మూడో ఎపిసోడ్‌గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి. తల్లే గురువుమా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను. కూర్పులో సవాల్ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ. -
తరం నుంచి తరానికి దేశానికో సంస్కృతి
ప్రాంతాలు, జాతుల వారీగా తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఎప్పటికీ వదులుకోలేరు. దేశ దేశాల్లో వేల ఏళ్లుగా వస్తున్న సంస్కృతిలో వారి మనుగడ కూడా ఉండటం విశేషం. తమ ఆచారాలను ముందు తరాలకూ పరిచయం చేస్తూతమ కమ్యూనిటీ సంప్రదాయాన్ని బతికించుకుంటున్నారు. ఈ సంప్రదాయాలన్నీ యునెస్కో వారసత్వ సంపదలోకి చేరి, ఆ దేశాల గొప్పతనాన్ని చాటుతున్నాయి. సౌదీ అరేబియాలోని తైఫ్ ప్రాంతంలో గులాబీ తోటలను విరివిగా సాగు చేస్తారు. ఇక్కడి సామాజిక, మతపరమైన ఆచారాలలో అంతర్భాగంగానూ, ముఖ్యమైన ఆదాయ వనరగానూ ఉంటుంది. మార్చిలో ప్రారంభమయ్యే పంట కాలంలో రైతులు, వారి కుటుంబాలు తెల్లవారుజామున గులాబీలను ఎంచుకొని స్థానిక మార్కెట్‌కు విక్రయించడానికి వెళతారు. కొన్ని కమ్యూనిటీలు ఈ గులాబీలతో సౌందర్య ఉత్పత్తులు, సాంప్రదాయ ఔషధం, ఆహారం, పానీయాలలో రోజ్ వాటర్, నూనెను తయారుచేస్తాయిజపాన్లో కోజి అచ్చుతో సాకే తయారీజపాన్లో పవిత్రమైన బహుమతిగా భావించే పానీయం ఒకటుంది. దానిపేరు సాకే. గింజలు, నీటితో తయారు చేసే ఆ ఆల్కహాలిక్ పానీయం జపాన్ లో పండుగలు, వివాహాలు, ఆచారాలు, ఇతర సామాజిక సాంçస్కృతిక సందర్భాలలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. జపనీస్ సంస్కృతిలో భాగమై΄ోయిన ఈ పానీయం పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడానికి కోజి అచ్చును ఉపయోగిస్తారు. ఈ అచ్చును హస్తకళాకారులు తయారు చేస్తారు. వీటిలో పదార్ధం దీనికి అవసరమైన ఉష్ణోగ్రత అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సిరియాలోని అలెప్పో ఘర్ సబ్బు కళఆలివ్ నూనె, లారెల్ ఆయిల్‌ను ఉపయోగించి సిరియాలో సబ్బు తయారుచేస్తారు. కొంతమంది కలిసి చేసే ప్రక్రియలో తరతరాల అనుభవం ఉంటుంది. ముందుగా పదార్థాలను ఎంపిక చేసి వండుతారు. ఆపై సంప్రదాయ సబ్బు మిశ్రమాన్ని కలిపి, మిద్దెలపైన ΄ోస్తారు. మిశ్రమం చల్లబడిన తర్వాత హస్తకళాకారులు పెద్ద చెక్క బూట్లు ధరించి, తగిన పరిమాణంలో కత్తిరిస్తారు. ఆ తర్వాత ఆ సబ్బులను చేతితో స్టాంప్ చేసి, వరుసగా పేర్చుతారు.ఉత్తర ఆఫ్రికా హెన్నా ఆచారాలుఉత్తర ఆఫ్రికా, మధ్య్ర ప్రాచ్యంలోని కమ్యూనిటీలు గోరింటాకు తోటలను సాగుచేస్తారు. హెన్నా పేస్ట్‌ను సాధారణంగా మహిళల అలంకారానికి ఉపయోగిస్తారు. ఇది ఆనందానికి చిహ్నం, దైనందిన జీవితంలో, పుట్టినరోజులు, వివాహాల వంటి పండుగ సందర్భాలలో ఉపయోగించబడుతుంది. దీని ఉపయోగం శతాబ్దాల నాటి సామాజిక నియమాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉంది.థాయిలాండ్ టోమ్యుమ్ కుంగ్ సూప్టోమ్యుమ్ కుంగ్ అనేది థాయిలాండ్‌లో ఒక సంప్రదాయ రొయ్యల సూప్. మూలికలతో ఉడకబెట్టి, స్థానిక మసాలా దినుసులను కలిపి ఈ రొయ్యల సూప్‌ను రుచిగా తయారుచేస్తారు. సూప్ ఒక విలక్షణమైన వాసన, శక్తివంతమైన రంగులను కలిగి ఉంటుంది. తీపి, పులుపు, కారం, క్రీము, కొద్దిగా చేదు వంటి అనేక రుచులను మిళితం చేస్తుంది. ఈ వంటకం ముఖ్యంగా వర్షాకాలంలో శక్తిని, ఆరోగ్యాన్నిప్రోత్సహిస్తుందని నమ్ముతారు. ఇది థాయిలాండ్‌లోని సెంట్రల్ ప్లెయిన్స్‌లోని బౌద్ధ నదీతీర సమాజాల పాక జ్ఞానం, పర్యావరణం, ఔషధ మూలికల గురించి వారి సాంప్రదాయ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. గుడ్లను అలంకరించే కళఉక్రెయిన్, ఎస్టోనియాలో మైనాన్ని ఉపయోగించి గుడ్డుకు సాంప్రదాయ నమూనాలు, చిహ్నాలను తీసుకువస్తారు. గుడ్లను అలంకరించే ఈ కళ ఈస్టర్‌తో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, మతంతో సంబంధం లేకుండా ఉక్రేనియన్ కమ్యూనిటీలకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. (చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!) -
కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..
గోవా కళాప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహిళ శారదా కేర్కర్. ఆమె యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్పెషలైజేషన్ చేసింది. ఇండియాకి వచ్చి గోవాలో మ్యూజియం ఆఫ్ గోవా (ఎంఓజీ)కి చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం కోసం కొంత సమయాన్ని కేటాయించే అవకాశం కల్పించింది. కళారంగంలో ఉపాధి పొందడానికి అవసరమైన భరోసా కల్పిస్తూ కళాసాధనను లాభదాయకమైన వృత్తిగా మార్చింది.గోవా రాష్ట్రాన్ని కళలు, కళారంగం, వాటికి మార్కెట్ కల్పిస్తూ సామాజిక వ్యవస్థాపనల దిశగా నడిపిస్తోంది శారదాకేర్కర్. సాహిత్యం, రంగస్థలం, విజువల్ ఆర్ట్స్, సంగీతం, నాట్యరీతులను సుసంపన్నం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులను ఒక్కో విభాగాన్ని ఒక్కో కేటగిరీగా వర్గీకరించి వారి కళారూపాల ప్రదర్శనలను నిర్వహిస్తోందామె. అలాగే సాంకేతికత సహకారంతో సృజనాత్మక రంగంలో ఎన్ని ప్రయోగాలు చేయవచ్చనేది ఆచరణలో చూపిస్తోంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, యానిమేషన్, గేమింగ్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి సృజనాత్మకమైన ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద కేర్కర్. గడచిన తొమ్మిదేళ్లలో 600 మంది హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో ఎమ్ఓజీ నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు. దివ్యాంగులైన కళాకారుల చిత్రాలతో ‘ఆర్ట్ ఇంక్’, పిల్లల చిత్రాలతో ‘ఏ వరల్డ్ ఆఫ్ మై ఓన్’, మహిళా చిత్రకారులతో ‘అన్ ఎర్త్డ్’ చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది శారద. ఎమ్ఓజీని రోజుకు 200 మంది సందర్శిస్తారు.సంస్కృతి ప్రతిబింబాలుమ్యూజియం ఆఫ్ గోవా కోసం శారద పాతికమంది గోవా ఆర్టిస్టులు చిత్రించిన గోవా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను సేకరించింది వీటిని ఎమ్ఓజీ నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌లోనూ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ‘హోమోలూడెన్స్: ద ఆర్ట్ ఆఫ్ ప్లే’ ప్రదర్శన జరుగుతోంది. అందులో గోవా ఆర్టిస్టులతోపాటు అనేక రాష్ట్రాలు, నెదర్లాండ్ దేశం నుంచి కూడా ఆర్టిస్టులు మొత్తం వంద మంది చిత్రకారుల కళారూపాలున్నాయి. బీచ్ కంటే మ్యూజియం సందర్శనలోనే ఎక్కువ ఎంజాయ్ చేశాం అని ఫీడ్‌బ్యాక్ బుక్‌లో రాస్తున్నారు. ఏడాదికి పదివేల మంది స్టూడెంట్స్ సందర్శిస్తున్నారు. వాళ్లు సమకాలీన కళలతోపాటు గోవా చరిత్రను తెలుసుకుంటున్నారు.కళాకృతులకు మార్కెట్ వేదికగడచిన ఎనిమిదేళ్లుగా ప్రతి ఆదివారం ఎంఓజీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వివిధ రంగాలకు చెందిన నాలుగు వందల మంది నిపుణులు హాజరై ప్రసంగించారు. ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్, మేనేజ్మెంట్, బిజినెస్, ఎన్విరాన్మెంట్, పాలసీ మేకింగ్, యాక్టివిజమ్ అంశాల్లో కళాకారులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. ‘ఆమి గోవా’ నాన్‌ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసింది శారద. ఇందులో మహిళల స్వావలంబన సాధికారత, గోవా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అనే రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. శారద కేర్కర్ చొరవతో గోవా హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ కొత్త రూపు సంతరించుకుంటోంది. (చదవండి: కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..) -
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
పుష్పరాజ్ క్రేజ్.. అభిమాని కళకు ఫిదా అయిన బన్నీ!
ఇప్పుడంతా పుష్ప-2 ఫీవర్ నడుస్తోంది. విడుదలకు మరో వారం రోజుల సమయం ఉండగానే హడావుడి మొదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్.ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నారు. దివ్యాండైనప్పటికీ పుష్పరాజ్ స్టైల్లో అల్లు అర్జున్ బొమ్మను గీశారు. తన కాళ్లతో అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.తన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ..'అల్లు అర్జున్ సార్ దయేచేసి నా కళను చూడండి. మీకోసం పుష్ప బొమ్మను గీశాను. మిమ్మల్ని కలవాలన్న కోరిక ఉంది సార్. ఇట్లు ధీరజ్ సాత్విల్కర్' అంటూ రాసుకొచ్చారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. నా గుండెను టచ్ చేశావ్ అంటూ అతనికి రిప్లై ఇచ్చారు బన్నీ.బన్నీ రిప్లై ఇవ్వడంతో ధీరజ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్.. నేను మీకు పెద్ద ఫ్యాన్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం సూపర్ ఆర్ట్ అంటూ ధీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Heart Touching . Thank you 🖤— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!
‘నృత్యశాస్త్రం నుంచి నృత్యం పుట్టదు. హృదయంలో కలిగే భాధ నుండి ఉద్భవిస్తుంది’ అంటారు కూచిపూడి నృత్యకారిణి, దేవదాసి నృత్యంలో ప్రావీణ్యత గల యశోదా ఠాకోర్. ఇటీవల ఆమె విదేశాల్లో దేవదాసీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కళావంతుల సంఘంచే స్వరపరిచి రూపొందించిన దానిని యశోద మరింత అందంగా ఆవిష్కరిస్తారు. ఒక ప్రేమికురాలు కృష్ణుడిని కోల్పోవడంపై కలిగిన ఆందోళనను అద్భుతంగా వర్ణిస్తుంది. కథానాయిక తనవాడైన వ్యక్తిని పొడవాటి వస్త్రాలతో కట్టివేయాలనే కోరికను అణుచు కుంటూ ఎటూ వెళ్లొద్దని వేడుకోవడాన్ని కళ్లకు కడుతుంది. యు.కెలోని గ్లెన్బర్గ్లో జరిగిన వేడుకలో ప్రదర్శన అనంతరం....ఈ నృత్యం వేరొకరి జీవితంపై రూపొందించిందిదేవదాసీ నృత్యం భారతదేశ చరిత్ర, రాజకీయాలలో ఎలా ప్రధానంగా ఉంటూ వచ్చిందో ఠాకోర్ వివరించారు. ‘భారత శాస్త్రీయ కళలు క్లిష్టమైన పరిస్థితులలో కొన్నిసార్లు అట్టడుగుకు చేరుకున్నాయి. కొన్ని హింసాత్మక చరిత్రలనూ పరిచయం చేశాయి. దక్షిణాదిన వ్యాపించి ఉన్న దేవదాసి సంఘాలు తమ కళతో తరతరాలుగా దేవాలయాలు, జమీందార్లను ఆశ్రయించాయి. దేవదాసీ కళాకారులు తమ కుటుంబ సభ్యులతో వాయిద్యాలతో ప్రదర్శనలను నిర్వహించారు. వారు భూమి, ఆస్తి, ఆభరణాలకు యజమానులు కాకపోయినా సంరక్షకులుగా ఉండేవారు. ఒక కళారూపానికి బాధ్యత వహించే శక్తిమంతమైన ప్రదర్శనకారులు ఇప్పటికీ ఉన్నారు. కానీ సామ్రాజ్యపాలన, కొత్త జాతీయవాద ఎజెండా ఈ ప్రదర్శనకారులకు కఠినమైన రోజులను తెచ్చిపెట్టింది. జాతీయవాద – వలసవాద పితృస్వామ్యాల మధ్య ప్రదర్శన కళలు సంప్రదాయాలలోని లైంగికశక్తితో అణగదొక్కడానికి వ్యవస్థ మొగ్గు చూపింది. మధ్యతరగతి డ్రాయింగ్ రూమ్‌లలో ’సంస్కృతి’ని కొత్తగా చూపడానికి దేశీయ రూపాలను ప్రభావవంతంగా శుద్ధి చేసింది. కోల్‌కతాలోని ఝుమూర్ నృత్య కథలో, కథక్ వంటి నృత్య రూపాల ప్రసిద్ధ చరిత్రలలో కూడా ఇది గమనించవచ్చు. దీంతో దేవదాసీ అవమానకరమైన, బలహీనమైన వ్యక్తిగా ఎదిగింది.హృదయాన్ని కదిలించేలా!లోతుగా చీలి΄ోయిన కుల సమాజంలో బ్రిటీషర్ల కాలంలో ఈ కళలు అక్షర రూపంలోకి వచ్చాయి. 1947లో దేవదాసీ నిర్మూలన చట్టం రావడంతో ఈ కళాకారులు ప్రదర్శన చేసే హక్కును కోల్పోయారు. ప్రదర్శకులుగా వారి శ్రమ, నైపుణ్యం పూర్తిగా కనిపించకుండా పోవడంతో దేవదాసీలు వ్యభిచారంలోకి నెట్టబడ్డారు. పెత్తందార్లు, ΄ోలీసుల నుండి వేధింపులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒంటరి మహిళలు కావడంతో వారి కుటుంబాలు అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఒకప్పుడు గౌరవనీయమైన మాతృకగా, అన్నదాతగా ఉన్న దేవదాసీలు ఇప్పుడు లేమితో జీవన ΄ోరాటం చేస్తున్నారు. కడుపులోని కేన్సర్ మెలిపెడుతుంటే ఆకలిని చంపుకోవడానికి బీడీలు కాల్చే మహిళలు నాకు తెలుసు. డబ్బు కోసం కాదు, మోక్షం కోసం నృత్యం చేయాలి... దేవదాసీ నిర్మూలన చట్టం వల్ల కొంతమంది మహిళలు తమ కళను కోల్పోతే, మరికొందరు సిగ్గుతో కుటుంబాలను, సంబంధాలను విచ్ఛిన్నం చేసే మార్గాల్లో తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక చట్టాన్ని ఆమోదించినప్పుడు ఆ కళ పై ఆధారపడి జీవించే వారికి ఏం జరుగుతుందో ఎవరికీ పట్టదు. దేవదాసీలు ప్రజా జీవితం నుండి తొలగించిన తర్వాత వారి కళ మాత్రం ‘గౌరవనీయమైన’ శరీరాలపై నాటబడింది. మీరు వెళ్లిపొండి, మీ కళను మాత్రం తీసుకుంటాము అన్నట్టుగా చేశారు. ఉన్నత–కులాల పురుషులు ఈ నృత్య రూపాలను స్వీకరించి, ఆధిపత్యం చెలాయించారు. వాటి మూలాలను మాత్రం చెరిపివేశారు. దేవదాసీల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి, నృత్యాన్ని మాత్రం ’క్లాసికల్’ నిబంధనలలో ఉంచారు. కళ‘డబ్బు కోసం కాదు, మోక్షం కోసం జీవిస్తుంది. నాట్యం నాట్యశాస్త్రం నుండి రాదు, హృదయం లోని భాధ నుండి ఉత్పన్నం అవుతుంది’ అంటారు యశోదా ఠాకూర్. ఇదీ చదవండి: రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు! -
అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన... 1,400 పై చిలుకు కళాకృతులు
భారత్ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400కు పైగా పురాతన కళాకృతులను అమెరికా తాజాగా తిరిగి అప్పగించింది. వీటి విలువ కోటి డాలర్ల పై చిలుకే. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు స్వాదీనం చేసే చర్యల్లో ఇది భాగమని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలోని యాంటిక్విటీ స్మగ్లింగ్ విభాగం తెలిపింది. భారత్ నుంచి లండన్‌కు తరలించిన దేవ నర్తకి శిల్పం వంటి అపురూప కళాకృతులు వీటిలో ఉన్నాయి. దీన్ని శాండ్‌స్టోన్‌లో అత్యంత సుందరంగా మలిచారు. వీటిని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ తదితర చోట్ల భద్రపరిచి ఉంచారు. నాన్సీ వెయినర్ వంటి అమెరికా స్మగ్లర్లతో పాటు భారత్‌కు చెందిన పలువురు గ్యాంగ్ లీడర్లను ఇప్పటికే అరెస్టు చేశారు. యాంటిక్విటీ విభాగం ఇప్పటిదాకా 46 కోట్ల డాలర్ల విలువైన 5,800కు పైగా కళాకృతులను స్మగ్లర్ల నుంచి స్వా«దీనం చేసుకుంది. 16 మందికి పైగా స్మగ్లర్లకు శిక్షలు పడేలా చూసింది. -
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..
అవసరం ఒక ఆవిష్కరణకు దారి వేసింది. ఆర్థిక అవసరాలే తనను హ్యాండీక్రాఫ్ట్ కళాకారిణిగా తీర్చిదిద్దాయని చెప్పారు బాల త్రిపుర సుందరి. తాటి ఆకులతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తారామె. వీటి తయారీలో మహిళలకు శిక్షణనిస్తారు కూడా. తాటి ఆకు కళారూపాల తయారీలో యాభై ఏళ్ల అనుభవం ఆమెది. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేసింది! త్రిపుర సుందరికి 75 ఏళ్ల వయసు. ఆమెది తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుగ్రామం. చదువుకు నోచుకోని త్రిపుర సుందరి 1972లో ముంబయికి వెళ్లి హస్తకళాకృతుల తయారీలో సర్టిఫికేట్ కోర్సు చేశారు. అక్కడ నేర్పించిన కళారూపాల తోపాటు తన క్రియేటివిటీతో మరికొన్ని రూపాలను తయారు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హస్తకళాకృతుల ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో పామ్ క్రాఫ్ట్ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. పనిలోనే ఆనందం ‘‘మా ఊరిలో తెలిసిన వాళ్ల ద్వారా ముంబయిలో శిక్షణ కోర్సు గురించి తెలిసింది.. మూడు నెలల కోర్సు, బస భోజన వసతులు వాళ్లే ఏర్పాటు చేస్తారని చెప్పారు. చదువు లేదు, భాష ఇబ్బందవుతుందేమోనని భయంతోనే వెళ్లాను. కానీ అక్కడ తెలుగు వాళ్లు కూడా ఉండడంతో ఇబ్బంది కలగలేదు. క్రమంగా హిందీలో చెప్తున్న విషయాలు అర్థం కాసాగాయి. కోర్సు పూర్తయిన తర్వాత మా ఊరికి వచ్చి, నిడదవోలులో ఉన్న తాటిబెల్లం ఫెడరేషన్ లో ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరాను. బదలీ మీద 1983లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కి వచ్చాను. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో కూడా పని చేశాను. ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కూకట్పల్లి, హౌసింగ్ బోర్డులో మా ఇంటి దగ్గర నాకు నచ్చిన కళారూపాలు అల్లుకుంటూ, ఎగ్జిబిషన్లలో స్టాల్ పెడుతున్నాను. వీటితోపాటు తుక్కుగూడలోని నీరా యూనిట్లో శిక్షణనిస్తున్నాను. బంధువులు, స్నేహితులు ఇంకా పని చేయడం ఎందుకని అడుగుతుంటారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి, నేను పని చేయకపోతే అడిగేవాళ్లు కూడా లేరు. కానీ నాకు పని చేయకుండా కూర్చుని తినడం ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగున్నప్పుడు పని మానేయడం ఎందుకు?’’ అంటూ స్టాల్లో ఆమె బొమ్మల ధరలు అడుగుతున్న వారికి బదులివ్వడంలో మునిగిపోయారామె. -విఎమ్ఆర్ఫోటోలు: ఎస్ఎస్ ఠాకూర్(చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?) -
ప్రయాణం, ప్రయత్నం..ముగ్గురు మహిళా కళాకారుల విజయం..!
నీనా జాకబ్, దిపాలి గుప్తా, మానికా శ్రీవాస్తవ్.... ఈ ముగ్గురు కళాకారులు వారి కళాత్మక ప్రయాణాలు,సృజనాత్మక ప్రక్రియల గురించి తెలుసుకోవాలంటే బెంగుళూరు ఇంటర్నేషనల్ సెంటర్ ను సందర్శించాలి. సమాజంలో కళాభిమానాన్ని మెరుగుపరచడానికి ఔత్సాహిక కళాకారులకు సలహాలనూ అందిస్తున్నారు. వీరి కళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు ప్రతిబింబిస్తాయి.కళాత్మక ప్రయాణం... మానికా శ్రీవాస్తవ్ ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు స్నేహితులు, బంధువుల కోసం ఆర్ట్‌వర్క్‌లను ప్రారంభించింది మానికా శ్రీ వాస్తవ్. ‘పెళ్లయ్యాక కూడా ఈ కళా ప్రయాణం ఏమీ ఆగిపోలేదు. క్లబ్బులు, కాఫీ షాపుల వంటి చోట్ల నా పనితనాన్ని చూపడం మొదలుపెట్టాను. 1990 ప్రారంభంలో ఢిల్లీలో నా మొదటి పెయింటింగ్ ప్రదర్శన జరిగింది. ఎక్కడ ఉన్నా, ప్రయాణాల్లోనూ, నా గది మూలల్లోనూ నా కళకు ఊపిరి΄ోస్తూనే ఉంటాను. ఆ ప్రయత్నం విదేశాల్లోనూ సోలో, గ్రూప్ షోలకు దారితీసింది. హ్యూస్టన్, దుబాయ్, బెంగళూరులోనూ ప్రదర్శనలు ఇచ్చాను. ఇన్నేళ్లలో ఏ రోజూ నా నుంచి సృజనాత్మక పని ఆగలేదు. 30ఏళ్లుగా ఈ పనిని కొనసాగిస్తూనే ఉన్నాను‘ అని గర్వంగా చెబుతుంది శ్రీవాస్తవ్.ప్రత్యేకమైన శైలి.. దిపాలి గుప్తాసింగపూర్లోని ప్రఖ్యాత ఇరానియన్ మాస్టర్ అలీ ఎస్మాయిల్ వద్ద శిక్షణ పొందింది దిపాలి గుప్తా 16 ఏళ్లుగా అక్కడే ఉంది. ‘చాలా ప్రయోగాల తర్వాత, నాదైన ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేశాను. ఇది బోల్డ్, అసాధారణమైనది. చాలా వరకు సంప్రదాయ పెయింటింగ్ నియమాలను ఉల్లంఘిస్తారు. నేను కొల్లాజ్ టెక్నిక్‌ని ఇష్టపడతాను. అశాంతిగా ఉండే, చెదిరిన ప్రపంచాన్ని వివరించే వార్తాపత్రికలలోని సారాంశానికి ఒక రూ΄ాన్ని తీసుకువస్తాను. నా పనిలో ఎప్పుడూ ఒక అంతర్లీన సూక్ష్మ సందేశం ఉంటుంది’ అని వివరిస్తారు గుప్తా. కేరళకు చెందిన నీనా జాకబ్ తనను తాను సెమీ–అబ్స్ట్రాక్ట్ ఫిగ్రేటివ్ ఆర్టిస్ట్‌గా అభివర్ణించుకుంటుంది. ‘నా చిత్రణలో చాలా వరకు కాంతి, నీడల దోబూచులాట ఉంటుంది. సామాజిక మార్పుకు నడిపించే కళ అత్యంత శక్తిమంతమైనదని నమ్ముతాను. డ్రాయింగ్, స్కెచింగ్, ఫోటోలు తీయడం, గమనించడం నా పరిశోధనలో ఉంటాయి. ఒక్కోసారి నా కళలో ఎంబ్రాయిడరీని వాడాలనుకుంటాను. అలాంటప్పుడు దారాన్ని ఉపయోగిస్తాను. ప్రేక్షకులు కేవలం అందమైన చిత్రాన్ని ఆరాధించడం మాత్రమే కాదు. కళాకారుడి కథలో నిమగ్నమవ్వాలి. నా కుంచె రంగులను అద్దడానికే కాదు రాయడానికి కూడా ఉపయోగిస్తాను. ధ్యాన పదాలు, కవిత్వం కూడా నా కుంచె రాస్తుంటుంది. ఈ పని ద్వారా ఆధ్యాత్మికతకు చేరువవుతాను. నా సొంత శైలిని అభివృద్ధి చేయడానికి దారితీసే దశలు ఇవి’అని శ్రీవాస్తవ్ జతచేస్తుంది. దేశ, విదేశాల్లో జరిగే ప్రదర్శనలలో వీరి ఆర్ట్ ఫ్రేమ్స్‌కు ధర రూ. 10,000 నుండి లక్షల రూపాయల వరకు పలుకుతాయి. ఆ మొత్తాలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకూ అందజేస్తుంటారు. కళ ద్వారా తమ మహోన్నతమైన మనసునూ చాటుకుంటున్నారు. (చదవండి: అత్యంత అందమైన రహదారి 'రోడ్ టు హెవెన్'..!) -
ఏరియల్ ఆర్ట్ : ఆకాశమే హద్దుకళ
అథ్లెటిసిజం కలగలసి వైమానిక విన్యాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చూడటానికి జిమ్నాస్ట్‌గా అనిపిస్తూనే ఆకాశంలో హరివిల్లులా మారే నృత్యప్రదర్శన ఓ అద్భుత ప్రకియగా అందరి మనసులను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డును గెలుచుకున్న తర్వాత, అదితి దేశ్‌పాండే ప్రజలకు వైమానిక విన్యాసాలలో శిక్షణ ఇస్తోంది. ముంబైలోని తన అకాడమీ ఫ్లై హై ఏరియల్ ఆర్ట్ గురించి దేశ్‌పాండే మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లినట్లుగానే, చాలామంది ఏరియల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని.. ఆఫీసులు, స్కూళ్ల టైమ్ తర్వాత శిక్షణ కోసం క్లాసులకు రావాలని కోరుకుంటున్నారని’ చెబుతోంది. శరీర బరువులో సమతుల్యతసిల్క్ ఫ్యాబ్రిక్, హూప్స్, తాళ్లు లేదా ట్రాపెజెస్ని ఉపయోగించి గాలిలో నృత్యం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్యాన్స్ సంగీతంతో సెట్ చేసి ఉంటుంది. ప్రదర్శనలు చేయడానికి వ్యక్తుల బలం, సౌలభ్యాన్ని మిళితం చేసి దృశ్యంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక సాధారణ వ్యక్తి ఈ విన్యాసాలను చాలావరకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయడానికి తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తాడు. వైమానిక స్కిల్స్ ప్రదర్శించే సమయంలో వెనుక కండరాలను ఉపయోగిస్తాడు. దీనికి శరీర బరువులో ఒక సమతుల్యతను తీసుకురావాల్సి ఉంటుంది’అని వివరిస్తుంది దేశ్‌పాండే ఎలా చేస్తారంటే...ఈ వైమానిక ప్రదర్శనలో డ్రాప్స్, రోజులు, స్పిన్‌లను అమలు చేయడానికి ముందు వ్యక్తులు తమను తాము ఫాబ్రిక్లో చుట్టుకుంటారు. ఏరియల్ రోప్ అనేది లైక్రాతో తయారు చేయబడిన వృత్తాకార ఉపకరణం. దీనిని కళాకారులు విన్యాసాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ట్రాపెజ్ అనేది తాళ్లు, తీగలతో చేసేది. ఇక్కడ ప్రదర్శనకారులు గాలిలో ఊగుతూ విన్యాసాలు చేస్తారు. స్ట్రాప్స్లో కళాకారులు సీలింగ్‌కు జోడించిన పట్టీలపై ప్రదర్శనలు చేస్తారు. అక్టోబర్‌లో ఢిల్లీలోని స్విస్ దగ్గర ప్రదర్శనస్విస్ కళాకారుడు జాసన్ బ్రూగర్, భారతీయ హులా హూప్ ప్రాక్టీషనర్ ఎష్నా కుట్టి అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయంలో రెండు దేశాలు 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. వైమానిక కళలకు ‘ఉన్నత స్థాయి సాంకేతికత అవసరం కాబట్టి ఇది కచ్చితంగా జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలతో పోల్చవచ్చు. కానీ కదలిక, సంగీతం, కోర్సు సాంకేతికత ద్వారా కళ సృష్టించడం‘ అని బ్రూగర్ చెప్పారు. ‘వేదికపై ఉన్నప్పుడు నా వ్యక్తిగత లక్ష్యం నా శరీరం ఏమి చేయగలదో చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం‘ అంటారు. వైమానిక కళ అందరికీ అందుబాటులో ఉందా?అహ్మదాబాద్‌లోని ఏరియల్ ఆర్ట్స్ ఇండియా అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ ట్రైనర్ అయిన జీల్ సోనీ– ‘మా దగ్గర 55 ఏళ్ల వ్యక్తి నుండి 12 ఏళ్ల అమ్మాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఏరియల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కొంచెం సాహసం చేయాలని చూస్తున్నందున జిమ్‌కి వెళ్లకుండా ఏరియల్ ఆర్ట్‌లను ఎంచుకుంటారు. పరికరాలు, మౌలిక సదు΄ాయాల విషయానికొస్తే క్రాష్ మ్యాట్లు, ప్రథమ చికిత్స, సేఫ్టీ గ్రిప్ ఎయిడ్ నుండి అన్నింటినీ అందిస్తాం’ అని చెబుతోంది.ఖర్చు ఎంతంటే..! సోని ఎనిమిది వైమానిక కళల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. ఒకటి నుండి నాలుగు స్థాయిలు వైమానిక కళలను పరిచయం చేస్తాయి. ఐదు నుండి ఎనిమిది ఋత్తిపరమైన స్థాయి లు. ప్రతి పరిచయ స్థాయి శిక్షణకు ఒకటిన్నర నెలలకు సుమారు రూ. 6,500, ప్రతి ఉన్నత స్థాయికి మూడు నెలలకు రూ. 13,500 ఖర్చు అవుతుంది. సృజనాత్మకత, శిక్షణ, కఠినమైన మనస్తత్వం కూడా ఈ కళకు చాలా ముఖ్యమైనవి. మంచి కోచ్‌తో పని చేస్తే సరైన శిక్షణ లభిస్తుంది. సర్కస్‌లు, డ్యాన్స్ షోలు లేదా థియేటర్లలో ప్రదర్శించే ఏరియల్ ఆర్టిస్టులకు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణేలోని స్టూడియోలు సెషన్ల సంఖ్య ఆధారంగా తరచుగా ప్యాకేజీలుగా ఉండే తరగతులను అందిస్తాయి. ప్లేస్, శిక్షణ రకం, కోచ్, కోర్సు వ్యవధి ఆధారంగా ట్రెయినింగ్ ఫీజు ఉంటుంది. -
అంతర్జాతీయ స్థాయిలో టెర్రకోట కళ
సంప్రదాయ టెర్రకోట కళనుప్రోత్సహించి కళాకారులను ఆదుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్దమయ్యింది. గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన ఈ అరుదైన కళను కాపాడటమే కాదు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో నాలుగు ప్రత్యేక స్టాల్స్‌లో కళాకారుల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 25–29 వరకు జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా టెర్రకోట కళను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది యూపీ సర్కార్.టెర్రకోట కళను ప్రోత్సహించే దిశగా 2018లోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయమే టెర్రకోట పరిశ్రమను పూర్తిగా మార్చేసిందని జాతీయ అవార్డు గ్రహీత, టెర్రకోట కళాకారుడు రాజన్ ప్రజాపతి అన్నారు. 2017కి ముందు కష్టాల్లో ఉన్న ఈ కళ ఇప్పుడు కొత్త ఎత్తుకు చేరుకుందని, ఈ ఒక్క ఏడాదే వివిధ రాష్ట్రాల నుండి రూ.7 కోట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలియజేశారు.ప్రపంచ మార్కెట్లోకి...త్వరలో జరగనున్న వాణిజ్య ప్రదర్శనలో విభిన్న రకాల టెర్రకోట ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, ఇది ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడానికి కళాకారులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కళను బ్రతికించేందుకు, కళాకారులను ఆదుకునేందుకు నిరంతర బ్రాండింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వ ప్రయత్నాలూ కళకు చేదోడుఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా సిఎం యోగి టెర్రకోట గణేష్ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు టెర్రకోట విగ్రహాలను అందజేసారు. ఇలా ఈ కళకు ప్రచారం కల్పంచేందకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ ప్రయత్నాలు కళను ప్రోత్సహించమే కాకుండా దాని నాణ్యత, ఆకర్షణను కూడా నిర్ధారించాయి. దీని ఫలితంగా ప్రముఖులు, వారి సిబ్బంది గణనీయమైన కొనుగోళ్లు చేశారు. ప్రపంచ మార్కెట్ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో గోరఖ్‌పూర్ టెర్రకోట క్రాఫ్ట్ అపూర్వమైన ప్రఖ్యాతిని సొంతం చేసుకుంటోంది. -
An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం!
అద్భుతమైన కళాకృతిని సృష్టించాలంటే అతిపెద్ద కాన్వాస్లే అక్కర్లేదు.. అంగుళం చోటు చాలు.. అని నిరూపిస్తున్నారీ సృజనాత్మక చిత్రకారులు. నగరానికి చెందిన యువ ఆర్కిటెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాన్ ఇంచ్ ఆగస్ట్.. సృజనలోని లోతుల్ని స్పృశిస్తూ కళా ప్రపంచంలోని విశేషాలను, విచిత్రాలను ఆవిష్కరిస్తోంది.ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించే ఆన్లైన్ ప్రాజెక్ట్ ‘యాన్ ఇంచ్ ఆగస్ట్’ ఈ నెల అంతా జరుగుతుంది. అత్యంత చిన్నదైన ప్రదేశంలో అత్యుత్తమ కళాప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీలో వైవిధ్యం. కేవలం ఒక అంగుళం చతురస్రంలో క్లిష్టమైన, అర్థవంతమైన కళాఖండాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఈ ఆన్లైన్ ఈవెంట్ ఆహా్వనిస్తోంది. సూక్ష్మ కళారూపాలలో సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రేరేపిస్తూ యువ ఆరి్టస్టులకు సవాల్ విసురుతోంది. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని కళాభిమానులు, ఆర్కిటెక్ట్స్ మేఘాలికా, నేహా శర్మలు 2018లో వార్షిక ఛాలెంజ్‌గా ప్రారంభించారు. డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్పి్టంగ్, 3డీ మోడలింగ్, మ్యాక్రో ఫొటోగ్రఫీలలో ప్రవేశం ఉన్నవారి కోసం దీనిని నిర్వహిస్తున్నారు.అంగుళంలో భళా.. అనిపించండి ఇలా..ఈ ఆన్లైన్ ఛాలెంజ్ అధికారికంగా ప్రారంభం అవడానికి ముందు, ఎప్పటిలాగే బేగంపేటలోని పంచతంత్ర కెఫెలో జులై ఆఖరి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కళాభిమానులకు ప్రీ–ఓపెనింగ్ మీట్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్ గురించి విశేషాలు వివరించడంతో పాటు తోటి కళాకారులతో పరస్పర చర్చలు జరిగాయి. ఒక అంగుళం పరిమితిలో సృజనాత్మక ఆవిష్కరణ ప్రక్రియ ఎలా అనేదానిపై సూచనలు కూడా ఈ మీట్ ద్వారా నిర్వాహకులు అందించారు. రోజుకు ఒకటికి తగ్గకుండా కళాకృతిని పోస్ట్ చేయడం ద్వారా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.ఇంచ్ ఇంచై.. వటుడింతై.. అంగుళం–పరిమాణంలోని ఆవిష్కరణల్లో పాల్గొనడానికి వయస్సు, నైపుణ్య స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆన్లైన్ పోటీ అవకాశం అందిస్తోంది. దీంతో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7వేలకు పైగా వన్ ఇంచ్ ఆర్ట్ వర్క్స్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా కళాకారులతో సమావేశాలు నిర్వహించడం, టీ–వర్క్స్‌లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా ఈ ఛాలెంజ్ ఇంచ్ ఇంచై వటుడింతై అన్నట్టుగా ప్రాచుర్యం పెంచుకుంటోంది.సృజనకు పదును పెట్టడమే లక్ష్యం..కళలకైనా, సృజనకైనా ఆకాశమే హద్దు. చిట్టి చిట్టి కళాకృతులను సృష్టించడం ద్వారా కళాసృష్టిలోని వైవిధ్యాన్ని చూపించడమే ఈ యాన్ ఇంచ్ ఆగస్ట్ ముఖ్యోద్దేశ్యం. ఈ కార్యక్రమం తొలిదశలో ఫొటోగ్రఫీ యాడ్ చేయలేదు. కానీ కొందరి అభ్యర్థన మేరకు అంగుళం లోపల ఉన్న సబ్జెక్ట్‌ని ఫొటో తీయడాన్ని కూడా జతచేశాం. హైదరాబాద్‌లో ఇంత మంది మ్యాక్రో ఫొటోగ్రాఫర్స్ ఉన్నారని మాకు తెలీదు అని మాతో ఇప్పుడు చాలా మంది అంటున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది కళాకారులకు గుర్తింపు లభిస్తోంది. అంతకు మించి మేం దీని నుంచి ఏమీ ఆశించడం లేదు. ఛాలెంజ్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో పోస్ట్ మీటప్ను నిర్వహించనున్నాం. దానిలో కళాకారులు పాల్గొని నెల రోజుల పాటు తాము అందుకున్న సృజనాత్మక అనుభవాలను పంచుకుంటారు. – మేఘాలిక, నేహాశర్మ, నిర్వాహకులుఇవి చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ -
ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..!
మానవ పరిణామంలోని తొలి నాగరిక కళ చేనేత. నాగరికతల ప్రస్థానంలో ఇది పడుగు పేకల పోగుబంధం. ఇది తరతరాల చేనేత కళాకారుల రంగుల కళ. ఆచ్ఛాదనతో అందానికి మెరుగులు దిద్దే అరుదైన కళ. ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ. ఒంటికి హత్తుకుపోయే చేనేత వస్త్రాల సుతిమెత్తదనాన్ని ఆస్వాదించాలనుకోవడం ఒక రంగుల కల.నాగరికతకు తొలి గుర్తు వస్త్ర«ధారణ. వస్త్రాలను తయారు చేసే చేనేత తొలి నాగరిక కళ. చేనేత వెనుక సహస్రాబ్దాల చరిత్ర ఉంది. పత్తి నుంచి నూలు వడికి వస్త్రాలను నేయడం క్రీస్తుపూర్వం 3000 నాటికే విరివిగా ఉండేది. ఉన్ని కంటే పత్తితో వస్త్రాలు నేయడం సులువు కావడంతో వివిధ ప్రాచీన నాగరికతల ప్రజలు చేనేత వస్త్రాలవైపే మొగ్గు చూపేవారు. సింధులోయ నాగరికత వర్ధిల్లిన మొహెంజదారో శిథిలాల్లో ప్రాచీన చేనేతకు సంబంధించిన ఆనవాళ్లు, నాణ్యమైన నూలు దారపు పోగులు, అద్దకానికి ఉపయోగించే రంగుల అవశేషాలు ఉన్న కుండలు దొరికాయి.ఇవి మన దేశంలో చేనేత కళ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మరమగ్గాల వినియోగం పెరిగినప్పటి నుంచి చేనేత ప్రాభవం కొంత తగ్గుముఖం పట్టిందేగాని, అదృష్టవశాత్తు కొన్ని ఇతర ప్రాచీన కళల మాదిరిగా అంతరించిపోలేదు. చేనేతకు మన దేశంలో ఇప్పటికీ అద్భుతమైన ఆదరణ ఉంది. కొన్ని నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేతకు చిరునామాగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం...మన దేశంలో వారణాసి, చందేరి, జైపూర్, సూరత్, పానిపట్, లక్నో, భదోహీ, అల్మోరా, బాగేశ్వర్, కోటా, మహేశ్వర్, చెన్నై, కంచి, కన్నూర్, కాసర్గోడ్, మైసూరు, మంగళూరు, భాగల్పూర్, బంకా, ముర్షిదాబాద్, బిష్ణుపూర్, ధనియాఖలి, సంబల్పూర్, బరంపురం వంటి ఎన్నో నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేత కళను, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తమ ప్రత్యేకతను చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019–20లో విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు పూర్తిగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. చేనేత రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 43 లక్షలకు పైగానే ఉంటుంది. చేనేత రంగంలో నేత, అద్దకం, నేతకు సంబంధించిన ఇతర పనులను చేసే ఈ కార్మికుల్లో దాదాపు 70 శాతం మహిళలే! దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయగలగడమే కాకుండా, తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నారు.ఫ్యాషన్లలోనూ చేనేత ముద్ర..యంత్రాల ద్వారా తయారయ్యే వస్త్రాల్లోని యాంత్రికతకు భిన్నంగా ఉండటమే చేనేత వస్త్రాల ప్రత్యేకత. అందుకే, ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా, చేనేత వస్త్రాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూనే వస్తున్నాయి. చేనేత కార్మికుల కళానైపుణ్యం, ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కే వారి సృజనాత్మకత కారణంగా కూడా ఆధునిక ఫ్యాషన్ల పోటీని చేనేత వస్త్రాలు సమర్థంగా తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. రంగులు, డిజైన్లు, అద్దకం పద్ధతుల్లో చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో తయారయ్యే చేనేత చీరలు, పంచెలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ఇతర వస్త్రాలకు విదేశాల్లో కూడా బాగా గిరాకీ ఉంది.మన దేశం నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లండ్స్, గ్రీస్, పోర్చుగల్, స్వీడన్, యూఏఈ, మలేసియా, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇరవైకి పైగా దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లు (రూ. 93,931 కోట్లు) విలువ చేసే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల కంటే 6.71 శాతం ఎక్కువ. ఆధునిక ఫ్యాషన్ల హవాలోనూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా, పెరుగుతూ వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.తెలుగు రాష్ట్రాల్లో చేనేత చిరునామాలు..మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతకు చిరునామాలైన ఊళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు మొదలుకొని వెంకటగిరి వరకు, తెలంగాణలో పోచంపల్లి మొదలుకొని గద్వాల వరకు చేనేత కళలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఊళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణం ఖద్దరు చేనేతకు చిరకాలంగా ప్రసిద్ధి పొందింది. పొందూరు ఖద్దరు హోదాకు చిహ్నంగా గుర్తింపు పొందింది. పొందూరు ఖద్దరు పంచెలను అమితంగా ఇష్టపడేవారిలో మహాత్మాగాంధీ సహా ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి సినీ ప్రముఖులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. పొందూరు ఖద్దరు నాణ్యత చూసి ముచ్చటపడిన గాంధీజీ, ఆ నేత మెలకువలను నేర్చుకునేందుకు తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పొందూరు చేనేత కళాకారులు బల్ల భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ గత ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడ చేనేత కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని ఉప్పాడ పరిసరాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లోని చేనేత కార్మికులు సంప్రదాయ జాంధానీ చీరల నేతలో అత్యంత నిష్ణాతులు. ఈ గ్రామాల్లో తయారయ్యే చీరలు ఉప్పాడ జాంధానీ చీరలుగా ప్రసిద్ధి పొందాయి. బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించే ఉప్పాడ జాంధానీ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించింది. కర్నూలు జిల్లా కోడుమూరు చేనేత కార్మికులు గద్వాల చీరల నేతకు ప్రసిద్ధి పొందారు. ఇదే జిల్లా ఆదోనిలో చేనేత కార్పెట్లు, యోగా మ్యాట్లు వంటివి తయారు చేస్తున్నారు.అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ప్రాచీన కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన ఘనత సాధించారు. ఇక్కడి చీరలకు కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) దక్కింది. బంగారు తాపడం చేసిన జరీతో రూపొందించిన ధర్మవరం చీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు దీటుగా ఇక్కడి చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తూ, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఇక్కత్ చీరలు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగేటే మెక్రాన్‌కు పోచంపల్లి ఇక్కత్ చీరను ప్రత్యేకంగా బహూకరించారు. పోచంపల్లిలో తయారయ్యే పట్టు, నూలు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, రజాయిలు, స్టోల్స్ స్కార్వ్స్, కర్టెన్లు వంటి వాటికి సూడాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, యూఏఈ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాపోలు రామలింగం 2015లో జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వచ్చినప్పుడు పోచంపల్లి చేనేత కళాకారులు భోగ బాలయ్య, సరస్వతి దంపతులు తాము స్వయంగా నేసిన భారత చిత్రపటం గల వస్త్రాన్ని బహూకరించారు.నల్లగొండ జిల్లా పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొందింది. నేతకు ముందుగా దారాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి తయారు చేసే ఈ వస్త్రాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కూడా లభించింది. పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు దుపియన్ చీరలకు కూడా అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. పుట్టపాక వస్త్రాలు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మనసు దోచుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటివారు పుట్టపాక వస్త్రాలకు ఫిదా అయిన వారే! ఇక్కడి తేలియా రుమాల్ వస్త్రాలు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, లండన్ మ్యూజియంలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. పుట్టపాక చేనేత కళాకారులు గజం గోవర్ధన్, గజం అంజయ్య ‘పద్మశ్రీ’ అవార్డు పొందారు. ఇక్కడకు సమీపంలోని ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రం తయారీకి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పొందారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ‘పద్మశ్రీ’ అవార్డు పొందడం దేశంలోనే అరుదైన విశేషం.మన దేశంలో 5000 ఏళ్ల చరిత్ర!మన దేశంలో చేనేతకు ఐదువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఇక్కడి జనాలు వస్త్రాలను నేసేవారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ చేనేతకారుల కుటుంబం కనీసం ఒక్కటైనా ఉండేది. పదహారో శతాబ్ది నాటికి చేనేత ఉత్కృష్టమైన కళ స్థాయికి ఎదిగింది. మంచి నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు రాజాదరణ ఉండేది. ఎందరో రాజులు తమ విజయగాథల చిత్రాలను చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా నేయించుకునేవారు. మొగల్ పరిపాలన కొనసాగినంత కాలం మన దేశంలో చేనేతకు అద్భుతమైన ఆదరణ ఉండేది.బ్రిటిష్ హయాంలో మరమగ్గాలు ప్రవేశించడంతో చేనేతకు గడ్డురోజులు మొదలయ్యాయి. బ్రిటిష్‌వారు ఇక్కడి నుంచి నూలును ఇంగ్లండ్‌కు తరలించి, అక్కడి మిల్లుల్లో తయారయ్యే వస్త్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మేవారు. ఈ పరిస్థితి కారణంగానే ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మారాయి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమం’ 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైంది. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7ను కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అప్పట్లో మహాత్మాగాంధీ స్వయంగా రాట్నం నుంచి నూలు వడికేవారు.అప్పట్లో ఊరూరా ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీ పంథాలోనే రాట్నంపై నూలు వడికి, ఆ నూలుతో నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. సంప్రదాయ కుటీర పరిశ్రమగా చేనేత పరిశ్రమ ఈనాటికీ కొనసాగుతోంది. వస్త్రధారణలో వస్తున్న మార్పులను, జనాల అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనను తాను నవీకరించుకుంటూ చేనేత పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), 28 చేనేతకారుల సేవా కేంద్రాలు ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాయి. పలుచోట్ల చేనేత వస్త్రాల ప్రదర్శనలను నిర్వహిస్తాయి.చేనేతలో మన ఘనత..– చేనేత చీరలు కేవలం చీరలు మాత్రమే కాదు, ఏ చీరకు ఆ చీరను ఒక కళాఖండంగా పరిగణిస్తారు ఫ్యాషన్ నిపుణులు. అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు తమ సేకరణలో భారత్ చేనేత చీరలను తప్పకుండా చేర్చుకోవడమే మన చేనేత ఘనతకు నిదర్శనం.– ప్రపంచవ్యాప్తంగా వినిగించే చేనేత వస్త్రాల్లో మన దేశంలో తయారైనవి 95 శాతం వరకు ఉంటాయి. చేనేతలో ఇప్పటికీ మనది తిరుగులేని స్థానం.– చేనేత వస్త్రాల తయారీలో బెనారస్ మొదలుకొని కంచి వరకు ఏ ప్రాంతానికి చెందిన వైవిధ్యం ఆ ప్రాంతానికే సొంతం. చేనేత కళలోని ఈ వైవిధ్యం కారణంగానే వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును సాధించగలిగాయి.– చేనేత పరిశ్రమ మన దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. వస్త్రాల రూపకల్పన శైలిలో సంప్రదాయ పరంపర, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యం ఫలితంగా మన చేనేత కళాకారులు అంతర్జాతీయంగా కూడా మన్ననలు పొందగలుగుతున్నారు.– భారత గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నది చేనేత రంగమే!– మన దేశం నలుమూలలకు చెందిన 65 చేనేత ఉత్పత్తులకు, ఆరు ఉత్పత్తి చిహ్నాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉంది. ఇన్ని ఉత్పత్తులకు జీఐ లభించడం చేనేత పరిశ్రమ వైవిధ్యానికి నిదర్శనం. -
అద్భుతమైన ప్రకృతిని.. చిన్న ప్రదేశంలో చూపించే 'ఇకబెనా ఆర్ట్'.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్ హోటల్లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్ గౌరవనీయమైన కాన్సుల్ జనరల్ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ రేఖారెడ్డి, ప్రెసిడెంట్ నిర్మలా అగర్వాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి.. హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్ డెకరేషన్ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్.అరుదైన కళ.. పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి. – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్.ఏకాగ్రతతోనే సాధ్యం.. ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తికి కలర్ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్ -
జగన్నాథ రూపాలు... చిత్రకారుడి కుంచెలో! (ఫొటోలు)
-
అమ్మానాన్న బొమ్మను రక్తంతో గీసి...
యాక్రలిక్, ఆబ్స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్‌కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్‌పై యాక్రిలిక్‌తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్‌ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు. అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు. దైవకృపతో అబ్బిన కళ... దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్‌కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ... బెంగుళూర్‌కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్‌ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి... అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు. జాగ్రత్తలు తప్పనిసరి..‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు. తమకు కావాల్సిన పోట్రెయిట్‌ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్‌కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్టెయిట్ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్‌వర్క్‌ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్. -
నేటి నుంచి ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్..
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆర్జేడీ బి జయప్రదబాయి, ఎస్ఐవీఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ జ్యోష్ణారాణి పాల్గొంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
గీసుకునే బొమ్మలివి! ఇదే నా ప్రేయసి, ఆస్తి..!
వెన్నెల ఎందుకు కాస్తుంది? కృష్ణశాస్త్రి పొయెట్రీ ఎందుకు రాస్తాడు? ముళ్ళపూడి అప్పారావు ఎందుకని అప్పులు చేస్తాడు? డబ్బులు రాలవని తెలిసినా మా నూనెపల్లె జెండాచెట్టు కింద కూచుని గుడ్డి మగ్బుల్ ‘బహారో ఫూల్ బర్సావో…’ అని నవ్వుతూ పాటను తగులుకుంటూ ఉండేవాడెందుకు? ఏమో! ఎవడికి తెలుసో నాకేం తెలుసు? కానీ ఇలా అకారణంగా నేనెందుకు స్కెచింగ్ చేస్తానో నాకు మాత్రం తెలీదు. ఏం వస్తుంది ఇలా గీస్తే? ఏం తెస్తాయి ఈ స్కెచ్‌లు? పుస్తకాలు పుస్తకాలుగా నిలువుగా పెరుగుతూ పోతే? ఎప్పటికీ చేతరాని బొమ్మల గురించి వ్రాయరాని మాటలు ఇలా అల్లుకుంటూ పోతే? ఏం తెలీదు. ఈ పని ఒక్క మనసుకు ఇష్టమని తెలియడం తప్ప. జీవితం అంతం వరకు ఇలా గీతలపై గీతలు అకారణంగా గీసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఆకలేసినపుడు కాసింత అన్నం చాలు. చెవులకు కొంచెం సంగీతం చాలు, పుస్తకాల గూళ్ళో ఏరి దాచుకున్న కాసిని పుస్తకాలు చాలు. ఇంకేం, ఇంతకన్నా మరింకేం గీతల వెంట సాగడానికి? జీవితాన్ని ఇలా కొద్దికొద్దితో నింపుకుని భద్రంగా అపురూపంగా రేఖల్ని, రంగుల్ని ఏరుకుని మరీ ‘నేనొక పుష్పాన్ని, నీ కోమల పాదాలతాగ్రాల పూచిన పుష్పాన్ని నేనని, తొట్టతొలి రుషులు అగ్నికీలల్లో మంత్రగ్రామాలు దర్శించినట్లు నీ కౌగిట్లో ప్రేమ జ్యోతిని చూసినట్లు, నీ వలలో చిక్కిన శబలవర్ణసంచాలిత శఫరి నేనేనని…’ గీసుకునే బొమ్మలివి. వట్టి గాలి వేళ్ళు సుడులు సుడులుగా శూన్యంలో తిప్పి వేసిన వందల వేల బొమ్మలు జేబులో దాచుకోలేక ఆ ఊహలన్నిటిని గాలిపటం కట్టి ఆ మఖ్మల్ దారం వెంటపడి సాగిన స్కెచ్‌ల లేఖలివి.ఫైనల్ డ్రాయింగ్ పెళ్ళాం వంటిది. బొమ్మ పూర్తికాగానే మోహం నశిస్తుంది. మాయ ఆవిరవుతుంది. ఈ నా గీసుకునే స్కెచ్‌లన్నీ దరిచేరని నా ప్రేయసికి వ్రాసుకునే ప్రేమ లేఖలే! ఎందాకా ఎందాకా ఎగిరేవంటూ తన వెంట అనంతకాలం తరమనిస్తుంది. మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి, నా నాస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహారం కథ ఇది. తాళం చెవి పుట్టని, కనిపెట్టని నా బొమ్మల ప్రపంచపు తలుపు తెరుచుకోడానికి నేను దొంగిలించి తెచ్చిన జవరాలి పక్క పిన్ను కథ ఇది. ఓపిక ఉంటే వినండి. ఎందుకు స్కెచింగ్ అంటే, అక్షరమాలలో ముందు ‘అ’ నేర్చుకుంటాం కదా! కొంత తరువాత ‘మ’ కూడా నేర్చుకుంటాం. ఇంకా వత్తులు, దీర్ఘాలు గట్రా గట్రా… ఆ పై ‘అ’ పక్కన ‘మ’ వ్రాసి ‘మ’కు ‘మ’ వత్తు ఇచ్చి ‘అమ్మ’ అని నేర్చుకున్నదాన్ని ఏం చేస్తాం? అమ్మ వస్తుంది, అమ్మ పోతుంది, అమ్మ కూచుంటుంది, అమ్మ తల దువ్వుకుంటుంది, అమ్మ చదువుకుంటుంది, అమ్మ నాన్నకు ప్రయివేట్ చెబుతుంది… ఇట్లా బోలెడు మాటలు అక్షరాల్లో నేర్చుకుని వ్రాసినంత అంతే ఇదిగా బొమ్మల్లో కూడా గీతల అమ్మ ఈ పనులన్నీ చేస్తుంది. కాదు… చచ్చినట్లు మీరు చేయించాలి. ఊరికే మాటలు చెప్పినట్లు పుట్టుకతోపాటు బొమ్మలు తెచ్చుకోడం, దేవుడు ప్రత్యేక శ్రద్దతో మన మునివేళ్ళని తీర్చిదిద్దడం, భూమ్మీదకు పంపడం అంతా హంబక్, వట్టి సొల్లు మాటలు, పంచదార పూతల కవిత్వపు కబుర్లు. నిజానికి సత్యం అనునది సత్యప్రమాణకంగా ఏవిటంటే, చచ్చేదాకా 24 ఇంటూ 7 బై 365 అనే కాలమానంలో ఇలలో కలలో స్కెచింగ్ చేస్తూనే ఉండాలి. బొమ్మని రకరకాలుగా ఊహల్లో చిలుకుతూనే ఉండాలి. ఆర్టిస్ట్‌గా పుట్టడం ఈజీ, అది డిఫాల్ట్. కానీ క్రాఫ్ట్‌మన్ కావడం కఠినాతి కష్టం. ఆర్టిస్ట్‌గా ప్రపంచాన్ని నమ్మించడం పరమ ఈజీ. దునియా మూర్ఖపుది, అది దేన్నయినా నమ్మేస్తుంది. బట్ ఆర్టిస్ట్‌గా సిసలు క్రాఫ్ట్మన్గా నిన్ను నువ్వు ఒప్పించుకోడం కుదరని కార్యం, అది అందని ఎత్తు. ఆ విషయం ఎరిగి సాధన చేయడమే నువ్వు కనీసం ఎక్కగలిగిన ఎత్తు. ‘టు హూమ్ ఇట్ మే కన్సర్న్’ వోలె ఎవరికి వారికి వారి స్కెచింగ్ అర్థం ఏమైనా కాని, కానీ నేనదేవిటంటే స్కెచింగ్ అంటే గీస్తూనే వుండు అని అర్థం. గీతని ముచ్చటపడమని కూడా ఒక అర్థం. కదులుతున్న పిల్లి తోకపై ముచ్చటపడ్డం ఆరంభించి దాని మీసాల దాకా గీత గీసి చటుక్కున ఆపడం ఒక ముచ్చట. యూఅన్ అగ్లో (Euan Uglow) పెయింటింగ్ పనితనంపై మనసు పారేసుకుని ముని వేళ్ళతో కుంచెని తడిగా సాపుచేసి సుతారంగా అతనిలా రంగుని అద్దడానికి ప్రయత్నం చెయ్యడం ఒక ముచ్చట అన్నమాట. ఆర్టిస్ట్ మిన్యోలా (Mike Mignola)లాగా పలకలు పలకలుగా నల్ల రంగుని పులిమేసి హెల్‌బాయ్ అనే ఒక కామికి క్యారెక్టర్ పెదవి చివర, ఓవర్ కోటు అంచున చిన్న ఎరుపుని మరకలా అంటించడం కూడా అచ్చం ముచ్చటే. చూపుడు వేలు చివరని గుండ్రంగా గులాబి గోరు గీసేసి ఆ పై చిన్న స్కిన్ ముద్దని సున్నితంగా బాపు గీసినట్టు గీయాలని చూడటం అదో ముచ్చట; వేలి ముద్రల, కాగితపు అచ్చుల, ఎండుటాకుల ముద్రలని భద్రంగా కాగితంపైకి తర్జుమా చెయ్యడం కూడా బత్తాల్యా వోలె (Dino Battaglia) ఒక ముచ్చటే. ఇదంతా స్రష్టల వారి వారి పనితనంపై నా వంటి బుడత బుడిబుడి అడుగుల మర్యాద ముచ్చట. స్కెచింగ్ అంటే నాకు బొమ్మ నుంచి బొమ్మ కాపీ చెయ్యడం. (అనగా, నచ్చిన బొమ్మ ఏదైనా దాన్ని చూసి అలాగే గీసెయ్యడం అన్నమాట.) పత్రికల్లో అచ్చయిన ఫోటోలని రేఖాచిత్రాలుగా, రంగు నకళ్ళుగా గీసుకోడం. అలా బయటికి వెళ్ళి కదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, సభల్లో కవి కవిత్వ పఠనం వినలేక చచ్చినట్లు వినే పాపం వాళ్ళు, ఫేస్బుక్లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఔఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్‌కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్ల మధ్య తేడా, ఇదీ అదని కాదు, సమస్తాన్ని చూస్తూనే ఉంటూ బుర్రలోని బోల్దంత ఖాళీని, స్కెచ్‌బుక్ లోని పేజీల ఖాళీని వీలయినంత నింపుతూనే ఉండాలి. ఇదంతా స్కెచింగే. ఇక్కడ ప్రస్తావించిన ఏ విషయం కూడా నేను ఇతరులనుండి విన్నది కాదు, చదివినదీ కాదు; నాకు నేనుగా తెలుసుకున్నవివన్నీనూ. ఇన్నేళ్ళ బొమ్మల జీవితంలో ప్రత్యక్షంగా ఏ గురువూ తగిలింది లేదు, తట్టింది లేదు. ఇదిగో ఇదే దారీ అదే చెట్టు అక్కడే పిట్ట అని గురి చూపించిందీ లేదు. నాకు నేను గురువునై శిష్యుడనై నేర్చుకున్న చాలా చిన్నచిన్న పాఠాలు ఇవన్నీ. మొన్నటికి మొన్న కూడా అత్యంత మొదటిసారిగా ‘ఇది ఇలా కదా’ అని తట్టినపుడు అమితాశ్చర్యంతో ‘అరే అవును కదా’ అనుకోవడం. మనం మళ్ళీ మళ్ళీ ఎంత ఫూలిష్ అని తెలుసుకోడం. ఇవన్నీ పాఠాలే. ఇక్కడే కొన్ని బొమ్మలు భోజనం చేస్తున్న వారివి. గుర్తులేదు దేనికని వేసుకున్న స్కెచ్‌లో ఇవి. భోజనం అంటే ఏవుంది, ఒకణ్ణి కూచోబెట్టి వాడి ముందు కంచంతో సహా రకరకాల గిన్నెలుగా వడ్డించడం, అంతే కదా! పరమ మెకానికల్‌గా గీసుకున్న స్కెచ్‌లు. బుర్ర ఏమాత్రం వాడకుండా వేసుకెళ్ళిన బొమ్మలు. అలా వేస్తూ ఉండగా మధ్యలో తట్టింది! “ఏవిరా ఫూలిష్ ఫెలో! మనిషి కుడి చేత్తో అన్నం తింటున్నాడు. నువ్వు వాడి ముందు పెట్టిన నీళ్ల గ్లాసు కుడి చేతి వైపే వుంది. గిన్నెలు, గరిటలు అన్నీ కుడి చేయి వైపే పెడితే వాడు ఆ ఎంగిలి చెయ్యే ఉపయోగించి, ఎంగిలి చేత్తో పనులన్నీ చేసుకోవాలా!” అనుకున్నా. అరే, ఎంత బుద్దితక్కువ బొమ్మలు! ఆ పక్కనే పచ్చ చొక్కావాడు పద్దతిగా తింటున్నాడు. వాడు కూచున్న తీరు, పళ్ళెం, చెంబూ అన్నీ గ్రామర్ని అనుసరించి ఉన్నాయ్. ఇక్కడ ఇది ఓ మంచి పాఠం. ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ నేను ఎక్కడో ఫోటోగ్రాఫ్ చూసి వేసుకున్నది, స్వంతంగా గీసినది కాదు. మన మూలాలు మన బొమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అదెలా అనడుగుతే, నేను ముసల్మానుల ఇంట పుట్టి పెరిగిన వాణ్ణి. నేను మసలిన వాతావరణంలో పీట వేసుకుని భోజనం చేసే సంప్రదాయం లేదు కాబట్టి, నాకు స్పృహ కలిగి ఎన్నడూ నా బొమ్మల్లో పీట తేను. ఇంకోటి మానసికమైనది. నాకు మొహమాటం చాలఎక్కువ. కొన్ని చెడ్డ అనుభవాల వలన జనానికి అనునిత్యం స్పృహలో ఉండే స్థాయీభేదం వల్ల ఎవరి ఇంటికి వెళ్ళినా భోజనం చెయ్యను. అత్యంత బలవంతం మీద వెళ్ళినా అక్కడి తిండి తినాల్సి వచ్చినా ప్రాణం పోతున్నంత గాభరాగా నిముషాల్లో విషయం ముగించి ప్రాణవాయువు కొరకు బయటపడతాను. ఈ గందరగోళంలో అక్కడ ఆ వాతావరణం, ఆ కప్పులు, స్పూన్లు, చెంబులు, లోటాలు, డైనింగ్ టేబుల్, నాప్కిన్ గుడ్డలు గమనించేదెక్కడా? నిజానికి ఇది ఒక ఆర్టిస్ట్‌గా నా పెద్ద లోపం. మనం ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వేషన్ అనే స్కెచింగ్ చెయ్యాలి. అందుకని ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ టెక్నికల్‌గా కరెక్ట్. కానీ ఆ పీట, ఆ చెంబు, ఆ మనిషి నావాడు కాదు. ఇంత చెబుతున్నందుకైనా నా పాఠం నేనే నేర్చుకుంటూ విషయాన్ని గ్రహించుకునే సామర్ధ్యం పెంచుకోవాలి, శక్తి ఏర్పరుచుకోవాలి. మరోటి, నెలలు నిండిన గర్భిణి స్త్రీ బొమ్మ వేయబోతాం. గట్టిగా గమనిస్తే ఆయమ్మ బ్రస్ట్ లైన్, కడుపు ఆ సమయంలో దాదాపూ వేరు వేరుగా ఉండవు. ఛాతీదాక దిగిన గీత సుతారంగా మర్యాదగా చాలా చిన్న జర్క్ ఇచ్చి పెద్ద కడుపు ఆర్క్ అల్లా దిగాలి. కానీ చాలామంది ఆ పెద్ద నిండు వక్షోజాలు వేరుగా, కడుపు వేరుగా అలా వేసేస్తారు. ఎప్పుడైనా చొక్కా లేని బ్రాహ్మణుల బొమ్మ గీయాలంటే నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే, జంధ్యం ఏ వైపునుండి ఏ వైపుకు వేసుకుంటారబ్బా అని. ఇలా రకరకాల డిటైళ్ళ గురించి ఆలోచించుకోవాలి. సిగరెట్ ముట్టించుకున్నవాడు తదనంతరం అగ్గిపుల్లని గాల్లో ఆర్పేసి ఎలా చెయ్యిని మెలితిప్పి విసిరి పడేస్తాడో అలాంటి వాళ్ళని ఊహించుకుని స్కెచ్‌లు గీసుకుని మన బంధుమిత్రసపరివారంలో ఎవరైనా పనీపాటా లేకుండా దొరికినపుడు అలాంటి అగ్గిపుల్ల పడేసే యాక్షన్ వాడితో చేయించి, దాన్ని మనం గీసుకున్న ఊహాచిత్రాల పక్కని గీసుకుని తేడా చూసుకోవాలి ఇక్కడో గులాబీ చొక్కా వాడు వున్నాడు, ఊరికే పని వున్నా లేకపోయినా ఒక క్యారెక్టర్ని అనుకునో, చదివో, ఊహించో వాడిని రకరకాలుగా వేయ ప్రయత్నించండి. ఆ పక్కనే కప్పు కాఫీనో ఉగ్గెడు పెగ్గో పుచ్చుకునేవాణ్ణి కూడా గీయండి. బొమ్మ అంటే అన్నిసార్లు తలనుంచి కాళ్ళదాక గీయనక్కరలేదు. ఆ మొహం, ఆ చేతులు, వాడి మూడ్ చూపించగలిగితే చాలు- అదే మజా ఇస్తుంది కొన్నిసార్లు. ఆ తరువాత ఆ పైన కార్నర్లో చిన్న మురిపమైన ముద్దు బొమ్మ, ఈ కింద ఒక నాగుపాము బుసలవంటి కురుల అందం. తొలినాళ్ళల్లో ఈ శ్రమ అంతా తెగ శ్రమ అనిపిస్తుంది. కానీ అలా వేసి వేసి మీరు మరిచిపోయిన ఈ బొమ్మలు అకస్మాత్తుగా ఓ రోజు మీ కంటపడి ఒక వెర్రి ఆనందం అవుతుంది. శ్రమైకజీవనసౌందర్యం అనేది రంపపు మిల్లులో రిక్షా చక్రంలోనే కాదు, అరిగిన పెన్సిల్ ములుకులో కూడా వుంటుంది. ఎటొచ్చీ ఈ అందం శ్రీశ్రీతో సహా ఎవరికీ అందనిది, మీకు మాత్రమే ఎరుకైనది. అందుకు కంగ్రాట్స్! ఇక్కడ పక్కకు ఒత్తిగిలించి పడుకున్న ముసలివాడి బొమ్మ మళ్ళీ మళ్ళీ వేసుకున్నది, అలా సాధన చేసుకున్నది. అయితే మళ్ళీ మళ్ళీ అదే బొమ్మని సాధన చెయ్యడం మా చెడ్డ బోరింగ్ కావచ్చు. కానీ ఒకదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే దాన్ని ఆధారం చేసుకునే మిగతా అంతా కథ నడుస్తుంది. రెండు రెక్కలు, ఒక ముక్కు, కాసింత కడుపు, బారచాచిన కాళ్ళు ఇంత ఆకాశం చాలు. కాకి, చిలుక, కంజు, పిట్ట అంతా ఒకే సూత్రం. పిల్లి బొమ్మ వచ్చినవాడికి పులి కూడా తెలుస్తుంది. లెజెండ్ బ్రూస్ లీ ఇలా అన్నాడు: “నేను పదివేల కరాటే విన్యాసాల్ని సాధన చేసినవాడిని లెక్కచెయ్యను కానీ ఒకే విన్యాసాన్ని పదివేలసార్లు సాధన చేసిన వాడంటే భయభక్తులు చూపిస్తాను.” ఎంత గొప్ప సూత్రం! అయితే అన్నిసార్లు వద్దు కానీ ఒక బొమ్మని పదిసార్లో ముప్ఫై సార్లో గీద్దాం రండి. మరి ఇంకా బొమ్మలు వేసేవాళ్ళు ముఖ్యంగా ఏం చెయ్యాలంటే, మానవుడి వెన్నెముకకు ఫెవికాల్, గంజి కలిపి పెట్టి ఇస్త్రీ చేయించినట్లు వాడిని నీలిగినట్లు వేయకండి. మీ బొమ్మల్లో కొద్దిగా యాక్షన్ జోడించండి. నటుడు అమోల్ పలేకర్ తెలుసుగా, తను తన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జ్ఞాపకాలు చెబుతూ ఇట్లా అంటాడు: “నేను నటుడిగా శిక్షణ పొందిన సమయంలో హావభావాలు ఎలా పలికించాలో, డైలాగ్‌ని ఏ ఏ సంధర్భాల్లో ఎట్లా చెప్పాలో, నవరసాలు ఎట్లా ఒలికించాలో అన్నీ శుభ్రంగా చేసేవాణ్ణి. కానీ నా ఈ రెండు చేతులు వున్నాయే, వాటిని మాత్రం ఏంచెయ్యాలో నాకు అర్థంకాలేదు. చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని తెగ ఊపుతూ మాట్లాళ్ళేను, అండర్ ప్లే అనేది ఒకటి ఉంటుంది కదా! అప్పుడు నేనేం చేశానంటే నా చేతులకు పెన్నునో, పెన్సిల్‌నో, సిగరెట్నో ఆ సన్నివేశానికి తగినట్లు అలవాటు చేశాను. ఇక అంతే, నా సమస్య తీరిపోయింది. రెండు చేతులు పెన్నుతో ఆడుతూ తన పని చేస్తుంటే మిగతా శరీరంతో నా నటన నేను కానిచ్చాను.” ఈ చిన్న ఎక్సర్సైజ్ తెలీక ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. నటుడు కాలేదు. మీ బొమ్మ సూపర్ స్టార్ కావడానికి మీరు పెద్ద కష్టపడనక్కరలేదు. ఆల్రెడీ తెలుగులో బొమ్మలు వేసేవారు చాలా మంది సూపర్ స్టార్లే. అయితే మీ బొమ్మని నటుడిగా మలచడానికి మాత్రం మీరు తెగ కష్టపడక తప్పదు. ఆ సదరు బొమ్మ వాడిని ఊరికే నిలబెట్టకండి, వాడికో బొమ్మల చొక్కా తొడగండి, చేతిలో సిగరెట్ అంటించండి, భుజాన సంచో ఫ్లాస్కో తగిలించండి, నెత్తి మీద మూట ఎక్కించండి, ఆ బరువుకు తగిన నడక అలవాటు చెయ్యండి, ఆ పై వాడిని ఒక పరుగు తీయించండి… ఇదంతా సోది అంటారా? అయితే ఓకే. నో ప్రోబ్లెమ్! మామూలుగా ఎప్పటిలాగే మీ బొమ్మకి కృష్ణలాగే చంకలు గట్టిగా అంటించండి, ఏం భయం లేదు. పోలీసులు ఎన్కౌంటర్ కాదు కదా, కనీసం ఉరి కూడా వెయ్యరు. కడమకి మీ అభిమానులెవరూ మిమల్ని ఫేస్బుక్ నుంచి అన్‌ఫ్రెండ్ కూడా చెయ్యరు, నో వర్రీస్. లైఫ్ ఈజ్ గుడ్ పైగా ఇగ్నోరెన్స్ బ్లెస్సు కూడానూ. ఇంకా, స్కెచ్ పుస్తకాలు మూడు రకాలువి ఏ3, ఏ4, ఏ5 అని ఎప్పుడూ వెంట వుంచుకోడం మంచిదంటాడు రాన్ టైనర్ (Ron Tiner) అనే ఒక చిత్రకళా గురువు. నేను రెండు చాల్లే నాకు అనుకున్నా. ఒకటి ఏ5, ఇంకా జేబులో పట్టే పాకెట్ స్కెచ్ పుస్తకానికే పరిమితమయ్యా; అదీ కాదూ అనుకుంటే మడతలుగా పెట్టుకున్న తెల్ల కాగితం కూడా మోర్ దాన్ ఎనఫ్. నిజానికి ఓ అయిదారు సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో మంచి స్కెచ్ బుక్‌లు మార్కెట్లో అందుబాట్లో వుండేవి కావు. ఇప్పుడు చాలా నయం, ఆన్లైన్లో అమెజాన్‌లో, హైద్రాబాద్‌లో అయితే పంజాగుట్ట హిమాలయలో చాలా రకాల స్కెచ్ బుక్‌లు అందుబాటులో వున్నాయి. ఆ స్కెచ్ పుస్తకాల పక్కనే బోల్డని పెన్నులు కూడా వుంటాయి. ఒకటో రెండో పద్నాలుగో మీ పర్స్ ఓపిక మేరకు ఎన్నుకోవచ్చు. సరే ఈ సరంజామా మంచి చెడ్డలు చాలా విస్తృతంగా తరువాతెప్పుడయినా తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు. చివరగా, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువేనంటారు. ఇలా నాకు తెలిసీ తెలీని సంగతులు బోల్డన్ని ఈ కచేరీలో వెయ్యొచ్చు. కానీ దానికి కూడా ఒక ఓపికుండాలి. అదీ కాక నాకు ఈ చెవిటి ప్రపంచం మీద చాలా నమ్మకం, నేను చచ్చుకుంటూ వ్రాసే ఇదంతా వినడానికి చదవడానికి కోరి ఈ జన్మ మీరు ఎత్తలేదు. జానేభీదో యార్! సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం “ప్రియం చ న అనృతం బ్రూయాత్”ఏషా ధర్మః సనాతనః అనగా… ఈ భగవంతుని సృష్టిలో కరీనా కపూర్ బొడ్డుని మించిన మాస్టర్ పీస్ గీయబడలేదు, ఇది సత్యం. కింబర్లీ కేన్ క్లియవేజ్ని బోలిన ప్రకృతి సృష్టించబడలేదు, ఇదీనూ సత్యమే. పరనిందని మించిన పరమగాంధర్వమగు రాగం పాడబడలేదు, దీని సంగతి అతి సత్యమని కొత్తగా చెప్పనక్కరయే లేదు. శుభమ్ భూయాత్! చిట్టి సలహా: నిజానికి ఈ రాతలు చాలా కాలం క్రితం, నేను బొమ్మలు మొదలెట్టిన సమయంలో, నా ఊహకు బొమ్మలు, పుస్తకాలు అందిన సమయంలోనే ఎవరైనా ఒక మంచి చిత్రకారుడు, కాస్త నాలెడ్జ్ షేరింగ్ మీద నమ్మకం ఉన్నవాడు, ముందు తరాల బొమ్మల పిల్లలపై కరుణ, దయ ఉన్నవాడు ఎవరో అప్పుడే వ్రాసిపెట్టి ఉండాల్సింది. అవి చదుకుని అన్వర్ అనే కాసింత మంచి చిత్రకారుడు ఇప్పుడు నాకు తగిలేవాడు. అటువంటి వాడెవడూ మనకు రాసిపెట్టి ఉండలేదు కాబట్టి కనుకొలను చివరి వెచ్చని చిరు చెమ్మంత స్కెచ్ బుక్ సలహా ఏవిటంటే, నాకు మల్లే పుస్తకాన్ని ర్యాండమ్‌గా నింపొద్దు . సబ్జెక్ట్‌కు కొన్ని పేజీలు వదులుకోండి. నిలబడ్డ మనుషులంతా ఒక చోట, కుక్కలు పిల్లులు వంటి జంతుజాలం ఒక చోట, కుర్చీలు మేజాలు భోజనాల బల్ల ఇత్యాది ఒక దగ్గర, మసీదులు గుళ్ళు గోపురాలు ఒకే సైడునా… ఇది అవసరమైనప్పుడు మీ సబ్జెక్ట్‌ని ఎక్కువ కష్టపడి వెదుక్కునేట్టు చెయ్యదు. ఆ స్కెచ్‌లోంచి మీరు మీకు కావాల్సిన రిఫరెన్స్‌ను అనాయాసంగా పొందగలరు. ప్రస్తుతానికి ఇదింతే భశుం.--అన్వర్(చదవండి: రవి పరంజపే : చిత్రకారుల సంపద..!) -
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
హింసకు కళాత్మక ప్రతీకారం!
న్యూయార్క్‌లోని చౌటక్వా ఇన్స్టిట్యూషన్లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్: మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్: మెడిటే షన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్‌గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు. ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’ బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ. ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్ యెన్తోబ్‌తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు), బైడెన్ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్ జాన్సన్ (ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ. ఎంత సిగ్గుచేటు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్‌స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్‌గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్‌లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్‌కి, ఫ్రెండ్స్‌కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్‌కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్‌లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
సంతకాన్ని జంతర్‌మంతర్ చేసినచో...
శూన్యంలో నుంచి కూడా కళను సృష్టించే నైపుణ్యం ఆర్టిస్ట్‌ల సొంతం. తాజా విషయానికి వస్తే... ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తెల్లకాగితంపై చేసిన సంతకాన్ని క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చాడు రాబిన్ బార్. సంతకం నుంచి అప్పటికప్పుడు ప్రేయసీప్రియులను సృష్టించిన రాబిన్ బార్ ఇలాంటి అలాంటి ఆర్టిస్ట్ కాదు...రికార్డ్ హోల్డర్ స్పీడ్ పెయింటర్. జస్ట్...కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ 21 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రాబిన్ బార్‌పై నెటిజనుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. -
నేడు వరల్డ్ థియేటర్ డే
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది.... తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్‌షాప్‌లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో నిరీక్షణ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్. బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్‌లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది. పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ. కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్‌ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ. మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది. తమాషాగా సంతోషంగా... ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు. తోడా ధ్యాన్ సే... సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది. రంగస్థలమే పాఠశాల మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్‌పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే. -
నిజమైన కళకు నీరాజనాలు
‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత, మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు విశ్వనాథ సత్యనారాయణ. నాటక, సాహిత్యాది రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. అయితే తెలుగునాట నాటక రంగానిది మహా వైభవోపేత చరిత్ర. అవి జనజీవితాన్ని ఎల్లెడలా ప్రభావితం చేశాయి. జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పాయి. నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అని చాటాయి. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో! మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో!! ఆ మహానుభావులకు వందనం!!! నాటక, సాహిత్యాది రంగాలకు చెందిన వివిధ రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో 1930లలో భారత పర్యంతం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ సారథ్యంలోని ‘మా భూమి’ ఇత్యాది కళా రూపాలను ప్రస్తావిస్తూ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది. ప్రజాకళలు ఎలా ఉండాలో ‘మా భూమి’, ‘అంతా పెద్దలే’ నాటకాలు నిరూపించా’’యని ప్రశంసల వర్షం కురిపించారు! ఈ కితాబు నాటికీ, నేటికీ మరపురాని సందేశంగా నిలిచిపోయింది. ఆ ఒరవడిలో ముందుకు సాగి, అఖిల భారత స్థాయిలోనే ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ రాష్ట్రీయ విశిష్ఠ శాఖలలో ఒకటి గుంటూరు జిల్లా ‘ప్రజా నాట్యమండలి’. భారత ప్రజానాట్య మండలికి ఆంధ్ర ప్రజానాట్య మండలి ఎలా ‘ఒజ్జ బంతి’ అయిందో, అలాగే గుంటూరు ప్రజా నాట్యమండలి వివిధ శాఖలతో పరిఢవిల్లింది. మానవ జీవన దర్పణంగా పలువురు ఆంధ్ర పండితుల, కవుల ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. సందేశాలు సమకాలీనం విశ్వనాథ వారు ఎంతటి మహాకవో, అంతటి సరసుడు, ‘గడగ్గాయి’ కూడా! పెళ్లయి, కాపురాలకు వెళ్లబోయే నూతన దంపతులందరికీ కంటికి కనిపించినా, కనిపించకపోయినా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూపడానికి మన పెద్దలు ప్రయత్నిస్తారు. కానీ విశ్వనా«థను ఒకరు మీరెప్పుడైనా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూశారా అని ప్రశ్నించగా... నాకైతే ‘అరుంధతి కనిపించలేదుగానీ చేసిన ‘అప్పులయితే’ కనిపించి, వేధించాయని చమత్కరించారు. బహుశా కొన్ని జీవితానుభవాల తర్వాత, ‘చింతామణి’ నాటక కర్తగా సుప్రసిద్ధుడైన మహాకవి కాళ్లకూరి... భార్యాభర్తల మధ్య ఉదాత్తమైన సంసార అవగాహన ఎలా ఉండాలో చెప్పడానికి ఒక పద్యాన్ని రాశారు. సందేశాత్మకంగా ఉండటానికి సరళమైన భాషలో రాసి మనకు అందించారు! ఆరోజుల్లో వేశ్యా లంపటత్వం వల్ల సంసార జీవితాలు ఎలా బుగ్గిపాలవుతున్నాయో చెప్పి, ఆ వినాశం వల్ల సంసార జీవితాల్ని రక్షించడం అవసరమని భావించి కాళ్లకూరి ఆ నాటకం రాశారు! ఫలితంగా గంభీర సంసార జీవితాల అవగాహనకు ఆ పద్యం ద్వారా సమకాలీన సందేశం అందింది. కనుకనే కాళ్లకూరి రచనకు అంత విలువ పెరిగింది. ‘కష్ట ఫలితంబు బహుళ దుఃఖ ప్రదంబు సార రహితమైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనంబు చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషులుండు!’ ప్రశ్నించే సంస్కారం బుద్ధి జీవుల్లో పెరగనంతవరకూ మనిషికి వికాసం ఉండదని కవి మీగడ రామలింగస్వామి స్పష్టం చేస్తాడు. ఎందుకని? ఆయన మాటల్లోనే నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అంటారు. ‘ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు ప్రశ్న యందే సకల దిశా ప్రగతి యుండు కాన, ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను’ అంటారు. అంతేగాదు, ‘ఈర్ష్య’ అనేది ఏ కళకూ, నాటకానికీ పనికి రాదనీ, ఈర్ష్య అనారోగ్యం, హానికరమని స్పష్టం చేశారు! ఇలా ఎన్నెన్నో దృశ్య మాలికలను ‘దర్పణం’ పేరిట గుంటూరు కళా పరిషత్ 1997–2022 సంవత్సరాల మధ్య కార్యక్రమాలన్నింటిని రసవత్తరమైన రచనా శైలిలో ‘కళ ప్రజలది’ అన్న మకుటం కింద రజతోత్సవ ప్రత్యేక సంచికగా అందించింది. ‘దర్పణం’ సంపాదకులు, సహ సంపాదకులు వల్లూరు శివప్రసాద్, వల్లూరు తాండవకృష్ణ అభినందనీయులు. నాటక రంగంలో ప్రజాకళలకు ప్రాధాన్యం కల్పించడంలో సుప్రసిద్ధులైన నవీన పథకులుగా ఖ్యాతి పొందిన నటశేఖరులు బళ్లారి రాఘవ, గరికపాటి రాజారావు ప్రఖ్యాతులకు ఈ ప్రత్యేక సంపుటిని అంకితమిచ్చారు. గుంటూరు కళాపరిషత్ కార్యక్రమాల ప్రత్యేక దృశ్యమాలిక ఈ సంచికకు ప్రత్యేక కళాకాంతులు అందించింది. ఎందరో మహానుభావులు జీవితాంతం ఆధునికులను వెన్నుతట్టి ప్రోత్సహించినవారు... కందుకూరి, తిరుపతి కవులు, చిలకమర్తి, బలిజేపల్లి, పరబ్రహ్మ పరమేశ్వరి, ఒద్దిరాజు సోదరులు, కోదాటి నరసింహం, రామరాజు, గురజాడ, బళ్లారి రాఘవ, వాసిరెడ్డి, సుంకర, ఆత్రేయ, గరికపాటి, ఆత్రేయ ఇత్యాదులు. ఇలా తెలుగు నాటక పరిణామానికి దోహదం చేసినవారి గురించి మేడిచర్ల సత్యనారాయణమూర్తి కవితాత్మకంగా కురిపించిన ప్రశంస ద్వారా దర్పణం సంచిక వైశిష్ట్యం తెలుస్తుంది. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో, మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో, నటనకు జీవం పోసి దైవాలుగా పూజలంది శిలారూపమందిన పాత్రధారులెందరో, ఎవని కళకు, యువనికలకు ఊపిరినిచ్చెనో ఈ రంగస్థలి చిత్రకారులెందరో ఆ మహానుభావులకు వందనం సాష్టాంగ వందనం!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ముత్యమే.. కదులుతూంటుంది!
-
'మైండ్ బ్లోయింగ్ ఆర్ట్'! ఏకంగా సూది రంధ్రంలోని బబుల్‌పై కళాఖండం!
ఎన్నో ఆర్ట్‌లు చూసి ఉంటాం. ఇలాంటి నెవ్వర్ బీఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఆర్ట్‌ని చూసి ఉండటం అసాధ్యం. ఎందుకంటే..? ఇంతలా సూక్షంగా వేయడం ఒక ఎత్తైతే..పైగా బబుల్ పగిలిపోకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా వేయడం అనితర సాధ్యం. సుసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ అసాధారణ వ్యక్తి. ఇతనేం అందరిలాంటి వ్యక్తి కాదు కూడా. ఎందుకంటే? ఇతను చిన్నతనంలో ఆటిజంతో బాధపడిన వ్యక్తి. తస ఆర్ట్‌తో అందర్నీ విస్మయపరచడమే కాదు శభాష్ అని ప్రసంశలు అందుకున్నాడు. ఆ వ్యక్తి ఆర్ట్ జర్నీ ఎలా సాగింది? అనితర సాధ్యమైన ఆర్ట్ ఎందుకు వేశాడో అతని మాటాల్లో తెలుసుకుందామా! విల్లార్డ్ విగాన్ ఇంగ్లాండ్‌లోని వెడ్నెస్ఫీల్డ్లోని అష్మోర్ పార్క్ ఎస్టేట్‌కు చెందిన బ్రిటిష్ శిల్పి. అతడు సూక్ష్మ శిల్పాలను రూపొందిస్తాడు. చాలామంది ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మ శిల్పలు రూపొందిస్తారు కానీ అతడు కేవడం సూదీ తల భాగంలో లేదా రంధ్రంలో వేస్తాడు. ఈసారి సూదీ రంధ్రంలో ఓ బబుల్‌పై ముగ్గురు వ్యక్తులు ఒంటెలపై ప్రయాణిస్తున్నట్లు వేశాడు. బబుల్ పగలకుంటా అత్యంత జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అతడు రోజూకు 16 గంటలకు పైగా శ్రమను ఓర్చీ మరీ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. దీన్ని వేసేందుకు కంటి రెప్ప వెంట్రుకలతో తయారు చేసిన పెయింట్ బ్రెష్‌ని వినియోగించడం విశేషం. నిజం చెప్పాలంటే ప్రతి నిమిషం ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి గుండె లయలను వింటూ వేయాల్సింది. ఎందుకంట? ఆ ఆర్ట్ వేస్తున్నప్పుడూ ఏ క్షణమైన బబుల్ పగిలిందే మొత్తం నాశనమైపోతుంది. పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆర్ట్ అనితరసాధ్యమైన ఫీట్ అనే చెప్పాలి. ఆ ఆర్ట్‌లో ఒంటెలను నైలాన్‌తో రూపొందించగా, వాటిపై రాజుల్లా ఉన్న వ్యక్తుల కిరిటీలను 24 క్యారెట్ల బంగారంతో మెరిసేట్లు రూపొందించాడు. సూదీ రంధ్రంలో బుడగ పగిలిపోకుండా ఆధ్యంతం అత్యంత ఓపికతో శ్రమతో వేశాడు. చూసిన వాళ్లు సైతం ఇది సాధ్యమాఝ అని నోరెళ్లబెట్టేలా వేశాడు విల్లార్డ్ విగాన్. ఈ అసాధారణ కళా నైపుణ్యానికి గాను విల్లార్డ్ని 2007లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ సభ్యుడిగా నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. విల్లార్డ్ సుమారు 5 ఏళ్ల ప్రాయంలోనే చీమలకు ఇళ్లను కట్టే మైక్రో శిల్పాన్ని వేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఆర్ట్ వైపుకి ఎలా వచ్చాడంటే.. విల్లార్డ్ ఆటిజం కారణంగా చిన్నతనంలో అన్నింటిలోనూ వెనుకబడి ఉండేవాడు. దీంతో స్నేహితులు, టీచర్లు పదేపదే ఎగతాళి చేసేవారు. ఈ అవమానాల కారణంగా అతడి చదువు సరిగా కొనసాగలేదు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు చదవడం, రాయడంలో చాలా వెనబడి ఉంటారు. ఈ రకమైన పిల్లలకు బోధించడం టీచర్లకు కూడా ఓ పరీక్ష లేదా సవాలుగానే ఉంటుంది. ఇక్కడ విల్లార్డ్ ఈ అవమానాలకు చెక్‌పెట్టేలా ఏదో ఒక టాలెంట్‌తో తానెంటో చూపించాలి. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని బలంగా అనుకునేవాడు. ఆ జిజ్ఞాశే విల్లార్డ్ని మైక్రో ఆర్ట్ వైపుకి నడిపించింది. చిన్న వయసు నుంచే ఈ మైక్రో ఆర్ట్‌లు వేసి టీచర్లను తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు. దీంతో క్రమంగా వారు కూడా అతడిని అవమానించటం, ఎగతాళి చేయటం మానేశారు. ఈ కళ అతడికి మంచి పేరునేగాక అందరీ ముందు విలక్షణమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. మనకు కొన్ని విషయాల్లో రోల్ మోడల్స్ ఉండాలి గానీ నాలాంటి వాళ్లకు రోల్‌మోడల్స్ ఉండరు. అందుకుని వారికీ తాను స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా ఉండాలనుకున్నాను. అని చెబుతున్నాడు విల్లార్డ్. మనం నిత్యం ఎన్నో సమస్యలు, బాధలతో సతమతమవుతాం. దాన్ని మనలో దాగున్న ఏదో నైపుణ్యంతో వాటిని పారద్రోలాలి. ఆ స్కిల్ తెయకుండానే.. మీకు ఎదురైన చేదు అనుభవాలను సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకు తానే ప్రేరణ అని విల్లార్డ్ చెబుతుంటాడు. అంతేగాదు ప్రపంచానికి సరికొత్త వెలుగునిచ్చేందుకు తాను ఈ కష్టతరమైన మైక్రో ఆర్ట్ వైపుకి వచ్చానంటున్నాడు. ఈ ఆర్ట్ ప్రతి ఒక్కరిలో ఆశ అనే ఒక మ్యాజికల్ కాంతిని, శాంతిని అందజేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు విల్లార్డ్. దీని అర్థం చిన్న చిన్న సమస్య లేదా పర్వతం లాంటి సమస్య అయినా నువ్వు తల్చుకుంటే సాధ్యమే! అని విల్లార్డ్ తన ఆర్ట్‌తో చెప్పకనే చెబుతున్నాడు కదా!. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్ ఆఫ్ జోషిగా..
‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్ ‘టాప్ డిజిటల్ స్టార్స్–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్‌లో ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్లో తన స్కెచ్–మేకింగ్ వీడియోలను పోస్ట్ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్ ధోనీ’ టైటిల్‌తో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్డౌన్ టైమ్‌లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్ ఇన్ 365 డేస్’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్ అతడి జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌరవ్ జోషిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్లతో జోషి చానల్ ‘ఫాస్టెస్ట్–గ్రోయింగ్ యూట్యూబ్ చానల్’జాబితాలో చేరింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్ఫెక్ట్ ఐ, హూ టూ యూజ్ చార్కోల్ పెన్సిల్, డ్రాయింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్... ఒకటా రెండా జోషి చానల్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్ అయ్యాయి. ఎంతోమందిని ఆర్టిస్ట్‌లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్ పెన్సిల్‌కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్‌గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్‌లోనే కాదు ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్ జోషి. ఒక్క ఐడియా చాలు మనం వెళ్లగానే ‘సక్సెస్’ వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది. – సౌరవ్ జోషి (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!
ఆర్ట్ సైంటిస్ట్ ఆర్ట్, ఫ్యాషన్‌ను కలిపి తనదైన కళను ఆవిష్కరించింది ఢిల్లీకి చెందిన పాయల్ జైన్. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన పాయల్ జైన్ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆమె తాజా ఎగ్జిబిషన్....సోల్ ఆఫ్ ఏ ఉమెన్. ఎగ్జిబిషన్లో కనిపించే 30 పీస్‌లలో ప్రతిదాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చరిత్ర నుంచి కవిత్వం వరకు ఏదో ఒక అంశ ధ్వనిస్తుంది. ‘ఆర్ట్‌లో సైన్స్ ఉంటుంది. సైన్స్‌లో ఆర్ట్ ఉంటుంది’ అనే పాయల్ జైన్‌ను ఆర్ట్ సైంటిస్ట్‌గా పిలుచుకోవచ్చు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మూడు దశాబ్దాల ప్రయాణానికి ‘సోల్ ఆఫ్ ఏ ఉమెన్’ ప్రతిబింబం అంటుంది పాయల్. ఈ ఎగ్జిబిషన్‌లోని ముప్ఫై పీస్‌లలో ప్రతి పీస్‌కు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మెక్సికన్ పెయింటర్ ప్రీదా ఖాలోను స్ఫూర్తిగా తీసుకొని ‘ఫర్బిడెన్ లవ్’ కలెక్షన్ రూపొందించింది. పాయల్ అభిమానించే ఖాలో పెయింటర్, మ్యాజికల్ సర్రియలిస్ట్, ఫెమినిస్ట్, రెవల్యూషనరీ. పాయల్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం చిత్రకళ పట్ల తనకు ఉన్న అనురక్తి. స్కెచ్చింగ్ తనకు ఇష్టమైన పని. ఆమె తల్లి కూడా ఆర్టిస్టే. సితార్ అద్భుతంగా వాయించేది. తన కలల గురించి తల్లిదండ్రులకు చెప్పిప్పుడు ‘ ఏదో ఒక డిగ్రీ నీ చేతిలో కనిపించాలి. ఆ తరువాతే ఏదైనా’ అన్నారు. అలా బీకామ్ పూర్తి చేసింది. పాయల్ స్కెచ్చింగ్ నైపుణ్యాన్ని చూసి ‘నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రయత్నించవచ్చు’ అని సలహా ఇచ్చారు సన్నిహితులు. మొదట ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్స్ విరివిగా చదివేది. అలా ఫ్యాషన్ కూడా తన ప్యాషన్‌గా మారింది. శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ‘ఫ్యాషన్‌కు ఆర్ట్, సైన్స్ అనే రెండు కోణాలు ఉంటాయి. ఆర్ట్ అనేది సృజనాత్మకతకు సంబంధించిన కోణం, సైన్స్ అనేది సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన కోణం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నా దృష్టిని విశాలం చేసింది. ప్యాటర్న్మేకింగ్, డ్రాపింగ్, గ్రేడింగ్, ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’ అంటున్న పాయల్ ఎన్నో కార్పొరేట్ హోటల్స్‌కు ఆకట్టుకునేలా ‘హోటల్ యూనిఫామ్’ను డిజైన్ చేసి ఇచ్చింది. ‘డిజైనర్స్ అంటే గొప్ప ఏమీ కాదు. గ్లోరిఫైడ్ టైలర్స్ మాత్రమే’ అని చాలామంది అనుకొని అపోహపడే కాలంలో డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించింది పాయల్. ఆమె వెస్ట్రన్ క్లాతింగ్ మొదలుపెట్టినప్పుడు దానికి మార్కెట్ లేదు. అయితే ఆ తరువాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. పాయల్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆమె మాటల్లోనే చెప్పాలంటే...‘చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మనం చేస్తున్న పనిని మనసారా ప్రేమించాలి. నిద్ర, శ్వాస, కలలో మన లక్ష్యం కనిపించాలి. ఫెయిల్యూర్‌కు చోటివ్వకుండా సాంకేతిక జ్ఞానంపై గట్టి పట్టు సంపాదించాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో కొత్తదనం వచ్చేలా చూసుకోవాలి. ప్రశంసలు ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోకుండా అన్ని కోణాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. మార్పులు చేర్పులు చేసుకోవాలి. సానుకూల శక్తి, సంకల్పబలం ఎప్పటికీ మనకు తోడుగా ఉండాలి’ కెరీర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పాయల్. చేదుజ్ఞాపకాలుగా కాదు...ఆ సమయంలోనూ తాను ఎంత ధైర్యంగా ఉందో మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి. ‘విజయం ధైర్యవంతులను వెదుక్కుంటూ వస్తుంది’ అని చెప్పడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె తెచ్చుకున్న పేరే నిదర్శనం. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
మ్యాథ్స్‌తో ఆర్ట్‌ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!
‘ఆర్టిస్ట్‌గా అన్నీ కుమారి ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు ఒక ముక్కలో జవాబు చెప్పాలంటే... ‘మాథ్స్, ఆర్ట్‌ను మిళితం చేసి సరికొత్త ఆర్ట్‌ను సృష్టించింది’ జీవితం కూడా గణితంలాంటిదే. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొన్ని ఎంతకీ కావు... ఈ సారాంశం కుమారి చిత్రాల్లో ప్రతిఫలిస్తుంది... మనం పుట్టి పెరిగిన వాతావరణం ఆలోచనల్లో, ఆచరణలో, చివరికి ఆర్ట్‌లో కూడా ప్రభావం చూపుతుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం అన్నీ కుమారి ఆర్ట్. గణితం, సంగీతం, క్రాఫ్ట్‌ల గురించి విలువైన చర్చలు జరిగే ఇంట్లో పెరిగింది కుమారి. చిన్నటిప్పటి నుంచి తనకు లెక్కలు అంటే ఇష్టం. లెక్కలంటే భయపడే పిల్లలకు భిన్నంగా అన్నీ కుమారి గంటల తరబడి లెక్కలు చేస్తూ కూర్చునేది. అంకెలు, సంఖ్యలు తన ప్రియ నేస్తాలుగా మారాయి. ‘ఆర్ట్‌కు లెక్కలకు దోస్తు కుదరదు’ అంటారు. అయితే అన్నీకి లెక్కలు అంటే ఎంత ఇష్టమో, ఆర్ట్ అంటే కూడా అంతే ఇష్టం. అయితే ఆర్ట్ స్కూల్లో మాత్రం అంకెలు నచ్చినంతగా చిత్రాలు నచ్చలేదు. తనకు కావాల్సినదేదో ఆ చిత్రాల్లో లోపించినట్లుగా అనిపించేది. ఆ సమయంలో రకరకాల ప్రయోగాల గురించి ఆలోచించేది. విజువల్ వకాబులరీ సృష్టించాలనే ఆలోచన అలా వచ్చిందే. ఆర్ట్ స్కూల్ తరువాత... బొమ్మలు గీస్తూ కూర్చోలేదు. తనలోని శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయాణాన్ని సాధనంగా ఎంచుకుంది. జార్ఖండ్‌లోని హజరీబాగ్కు వెళ్లి సోరాయి మ్యూరల్ ఆర్ట్ సంప్రదాయాన్ని, తమిళనాడు వెళ్లి కోలమ్ ఫ్లోర్ డ్రాయింగ్ సంప్రదాయాన్ని అధ్యయనం చేసింది. ఆ కళలో చుక్కలు, గీతలు, వంకలు చూస్తుంటే రకరకాల గణిత సూత్రాలు కంటిముందుకు వచ్చేవి. దీనికితోడు ప్రాచీన భారతీయ ఆలయాలలోని ఆర్కిటెక్చర్లో గణితం ఒక భాగమై ఉందనే విషయాన్ని అర్థం చేసుకుంది. ప్రకృతి ప్రపంచానికి, గణిత సూత్రాలకు మధ్య ఉండే అంతర్లీన సంబంధం కుమారిని ఆకట్టుకుంది. సైన్స్‌కు ఉండే శక్తి అది సృష్టించే వస్తువుల్లో కనబడుతుంది. ఇక ఆర్ట్‌కు ఉండే శక్తి మానవ ఉద్వేగాలను, అనుభవాలను ప్రతిఫలించే వేదికలో కనబడుతుంది. ముఖ్య అంశం ఏమిటంటే గణితానికి సంబంధించిన సంక్లిష్ఠతను సరళీకరించి జనాలలోకి తీసుకువెళ్లే శక్తి ఆర్ట్‌కు ఉంది. అందుకే ఈ రెండు బలమైన మాధ్యమాలను ఒకేచోటుకి తీసుకురావాలనుకుంది. తను సృష్టించే ఆర్ట్ ఎలా ఉండాలంటే... మన సంస్కృతీ, సంప్రదాయాలలోకి తిరిగి ప్రయాణించేలా, మన కళలను పండగలా సెలబ్రేట్ చేసుకునేలా, మన మూలాలతో ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అనే లక్ష్యంతో బయలుదేరింది. ఆ లక్ష్యసాధనలో విజయం సాధించి ఆర్టిస్ట్‌గా తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. తాజాగా అన్నీ కుమారి ఆర్ట్ ఎగ్జిబిషన్ ముంబైలోని తావో ఆర్ట్ గ్యాలరీలో జరుగుతోంది. (చదవండి: ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!) -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్‌తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్‌లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
చిత్రకారుల్లో ఇతడు వేరయా..! సైన్సుకే చిత్ర రూపం ఇచ్చి..
బొమ్మల భాషఅక్షరం పుట్టక ముందే చిత్రం రూపుదిద్దుకుంది. ప్రపంచంలో సైగల తర్వాత భాష బొమ్మలదే. పది వాక్యాల విషయాన్ని ఒక బొమ్మ చెప్తుంది. ఆ బొమ్మలతోనే శాస్త్రాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం వినోద శాస్త్రమవుతుంది. ఆనందంగా మెదడుకు చేరుతుంది. మరిచిపోలేని జ్ఞానంగా మిగులుతుంది. అధ్యయనానికి అక్షర రూపమిస్తే మహాగ్రంథమవుతుంది. అధ్యయనానికి చిత్రరూపమిస్తే అద్భుతమైన చిత్రకావ్యం అవుతుంది. అలాంటి వందల చిత్రకావ్యాలకు రూపమిచ్చారు అబ్దుల్ మన్నాన్. డెబ్బై ఏళ్ల మన్నాన్ ఐదు వేలకు పైగా బొమ్మలు వేశారు. ‘‘నా వయసులో నుంచి మూడేళ్లు తగ్గిస్తే నాలోని చిత్రకారుడి వయసది. నా బొమ్మల్లో ఒక్కొక్క థీమ్‌తో కొన్ని వందల చిత్రాలున్నాయి. ఆ చిత్రాల్లో ఒక్కటి చేజారినా చిత్రకావ్యంలో అనుసంధానత లోపిస్తుంది. అందుకే నా బొమ్మలను ఎవరికీ ఇవ్వలేదు, డబ్బు కోసం అమ్మనూ లేదు’’ అన్నారు అబ్దుల్ మన్నాన్. బొమ్మల చదువు! మా సొంతూరు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, బంటుమిల్లి దగ్గర చిన పాండ్రాక. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నా చదువు గుడివాడలో సాగింది. ఏఎన్నార్ కాలేజ్‌లో బీఎస్సీ చదివాను. బొమ్మల మీదున్న ఆసక్తి కొద్దీ చెన్నైకి వెళ్లి ‘శంతనుస్ చిత్ర విద్యాలయం’లో ఆర్ట్ డిప్లమో చేశాను. చెన్నైలోనే బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి వంటి పిల్లల పత్రికల్లో ఇలస్ట్రేటర్‌గా ఐదారేళ్లపాటు ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి నా అడుగులు సినీఫీల్డ్ వైపు పడ్డాయి. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా సుమారు ఐదేళ్లు చేశాను. చెన్నైలో కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేవి. మహాలక్ష్మి క్లబ్లో తెలుగు వాళ్ల కార్యక్రమాలు జరిగేవి. దాదాపుగా అన్నింటికీ హాజరయ్యేవాడిని. అలా శ్రీశ్రీ,, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి కవులతోపాటు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆర్ నారాయణమూర్తి వంటి చాలామందితో పరిచయాలయ్యాయి. దక్షిణాది భాషలు వచ్చాయి. ఇలా కొంత వైవిధ్యంగానే మొదలైంది నా కెరీర్. వైవిధ్యత ఆకట్టుకుంది! సైన్స్ చిత్రాల చిత్రకారుడిగా మారడానికి బీజం పడింది మాత్రం ఇంటర్‌లోనే. డార్విన్ సిద్ధాంతం ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ చదవడం నా మెదడులో కొత్త ప్రపంచానికి ఆవిష్కారం జరిగింది. అలాగే మరో పుస్తకం ‘ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’. ప్రపంచంలోని చిత్రకారులను చదివినప్పుడు పికాసో నుంచి డావిన్సీ వరకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులెవ్వరూ సైన్స్ ఇతివృత్తంగా బొమ్మలు వేయలేదని అవగతమైంది. దాంతో ఆ ఖాళీని పూరించాలనుకున్నాను. అలా నా చిత్రాలకు సైన్స్, నేచర్ ప్రధానమైన టాపిక్స్ అయ్యాయి. జీవ వైవిధ్యత నన్ను కట్టి పడేసే అంశం. దాంతో ప్రతి జీవి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. డార్విన్ సిద్ధాంతం చదివినప్పుడు కలిగిన సందేహాలకు సమాధానాల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను. ఉదాహరణకు క్యాట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ఖండంలో ఎలాంటి జాతి క్యాట్లుంటాయో అనర్గళంగా చెప్పగలను. శిలాజాలను అధ్యయనం చేసి ఆ ప్రాణి ఊహాచిత్రాన్ని వేయడం, ఎండమిక్ స్పీసీస్ బొమ్మలేయడంలో అనంతమైన సంతృప్తి కలగడం మొదలైంది. ఇక ఆ అలవాటును కొనసాగించాను. సైన్స్ పాఠాల బోధన! నా వృత్తి ప్రవృత్తి రెండూ సైన్స్‌లోనే వెతుక్కున్నాను. ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడిని. నా భార్య గవర్నమెంట్ టీచర్. నేను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్యూటోరియల్స్ నిర్వహించాను. స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించాను. నేను అందుకున్న అవార్డులకంటే నా విద్యార్థులు అందుకున్న అవార్డులే ఎక్కువ. నేను పీటీరెడ్డి అవార్డు, మూడు జాతీయ స్థాయి అవార్డులందుకున్నాను. నా బొమ్మలు ఆహ్లాదం కోసం చూసేవి కాదు. అవి అధ్యయన మాధ్యమాలు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలు, వైజాగ్‌లో కాలేజీలు, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలాచోట్ల స్కూళ్లలోనూ ప్రదర్శనలు నిర్వహించాను’’ అని తన చిత్రప్రస్థానాన్ని వివరించారు అబ్దుల్ మన్నాన్. ‘చిత్ర’ ప్రమాదాలు చిత్రకారుడు తన దేహానికి గాయమైనా పట్టించుకోడు. కానీ తన బొమ్మలకు ప్రమాదం వాటిల్లితే ప్రాణం పోయినట్లు విలవిలలాడుతాడు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా చిత్రకార జీవితంలో మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నాను. గుడివాడలో ఇల్లు అగ్నిప్రమాదానికి గురయ్యి చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కాలిపోయాయి. మరోసారి చెన్నైలో ఇంట్లో దొంగలు పడి నా పెయింటింగ్స్ పెట్టెను కూడా దోచుకుపోయారు. ఇక మూడవది హైదరాబాద్‌లో. ఈ ఏడాది వరదల్లో టోలిచౌకిలోని మా ఇంట్లో మూడు రోజులు నీళ్లు నిలిచిపోయాయి. అప్పుడు తడిసిపోయినవి పోగా మళ్లీ వేసిన బొమ్మలు ఐదు వందలు ఎగ్జిబిషన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం తర్వాత నాలోని చిత్రకారుడు మళ్లీ మళ్లీ పుట్టాడు. – అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..
ప్రతి మనిషికి ఏదోఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ముందుకెళ్తుంటారు చాలామంది. మినీషా భరద్వాజ్ మాత్రం భయంతో ఇంట్లో గదికే పరిమితమైపోయింది. మినీషాకు ఉన్న ‘అఘోరా ఫోబియా’తో... కొత్త వ్యక్తుల్ని కలిసినా, తెలియని ప్రాంతాలకు వెళ్ళినా తెగ భయపడిపోయేది. గుంపుగా ఉన్న జనాలను చూసి ‘‘అమ్మో అంతా నా వైపు చూస్తున్నారు’’ అని వణికి పోయేది. చిన్నప్పటి నుంచి ఈ భయంతో పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికీ వెళ్లనే లేదు. ఇక స్నేహితులు కూడా ఎవరు లేరు. జీవితాంతం ఇలానే ఉంటానేమో అనుకునే మినీషా..బొమ్మలు వేసే అలవాటు ద్వారా తన ఫోబియాను అధిగమించడమేగాక, ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బొమ్మలు వేస్తూ తన భయాన్ని ఎలా పోగొట్టుకుందో తన మాటల్లోనే..... మాది గురుగావ్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా బాల్యమంతా డెహ్రాడూన్‌లో గడిచింది. చిన్నప్పటి నుంచి తెల్లని పేపర్ మీద పెన్సిల్‌తో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ఒక మ్యాగజీన్లో ఉన్న తెల్లటి పేపర్‌పై నటి రేఖ చిత్రాన్ని గీసాను. అప్పుడు మా అమ్మానాన్నలు నా టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయారు. పదోతరగతి వరకు పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. ప్రతి నోట్‌బుక్ చివరి పేజీలో నా పెయింటింగ్ ఒకటి కచ్చితంగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షపేపర్లో జవాబు తెలియని ప్రశ్నకు బాధపడుతోన్న అమ్మాయి చిత్రాన్ని గీసేదాన్ని. పదో తరగతిలో అంతర జిల్లా పోటీలలో పాల్గొని డెహ్రాడూన్ మొత్తంలోనే మొదటి బహుమతి అందుకున్నాను. అలా ఎక్కువ సమయం బొమ్మలు గీస్తూ ఉంటే అఘోరా ఫోబియా కూడా గుర్తు వచ్చేది కాదు. ప్రత్యేకమైన కోర్సు చేయలేదు... నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అమ్మావాళ్లు సీఏ చదివించారు. కానీ నా మనస్సంతా ఆర్ట్మీదే ఉండేది. చదువు పూర్తి అయినప్పటికీ కార్పోరేట్ ప్రపంచంలో కాలుపెట్టలేదు. 1995 లో పెళ్లి అయ్యింది. ఆయన ఉద్యోగం దుబాయ్‌లో కావడంతో అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకసారి ఖాళీ సమయం దొరకడంతో..పేపర్ మీద బొమ్మను గీసాను. బొమ్మ పూర్తయ్యే సమయానికి మా ఆయన, ఆయన స్నేహితుడు వచ్చారు. ఆ బొమ్మను చూసి.. ‘‘చాలా బావుంది. బొమ్మలు గీయడంలో మంచి ప్రతిభ ఉంది. ఎందుకు దాచుకుంటావు. బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యచ్చు కదా...’’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆర్ట్‌కు ప్రాణం పోస్తున్నాను. చార్కోల్ పెన్సిల్స్‌తో.. ఆయన ప్రోత్సాహంతో స్కెచ్‌లు గీయడం మొదలు పెట్టాను. ఆయన ఒక ఆర్ట్గ్రూప్ను పరిచయం చేయడంతో అక్కడకు వెళ్లి స్కెచ్‌లు గీసేదాన్ని. కమ్యూనిటీకి వెళ్లిన రెండేళ్లలోనే ‘జి ఆర్ట్ కమ్యూనిటీ’ వాళ్లు నన్ను కలిసి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్‌కు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. మీరు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించండి’’అన్నారు. అది నాకు చాలా పెద్ద అవకాశం. కానీ ‘‘అందరూ రంగులతో స్కెచ్‌లు గీస్తున్నారు. నేను మాత్రం పెన్సిల్, చార్కోల్తో గీస్తాను. నేను నిలబడగలనా’’ అని నిర్వాహకులను అడిగాను. అందుకు వాళ్లు ... నువ్వుతప్ప ఎవరూ చార్ కోల్ వాడడం లేదు. అందరికంటే భిన్నంగా నీ స్కెచెస్ ఆకర్షిస్తాయి అని చెప్పి ‘డేర్ టు డ్రీమ్’ ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేశారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రమంగా వాటర్ కలర్స్ కూడా వేయడం ప్రారంభించాను. చార్కోల్ పెయింటింగ్స్‌కు అనేక అవార్డులు అందుకున్నాను. రోలెక్స్ టవర్‌పై నేను వేసిన పెయింటింగ్‌ను ఇప్పటికీప్రదర్శిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ‘పీపుల్స్ ఛాయిస్ ఆవార్డు’ వచ్చింది. అబుదాబిలోని లువురే మ్యూజియంలో నా పెయింటింగ్స్ ఉన్నాయి. ఏడు వేలమంది ముందు... దుబాయ్ మాల్స్‌లో ఏడు వేలమంది ముందు చార్కోల్తో పెయింటింగ్ వేశాను. ఆ పెయింటింగ్ వెంటనే అమ్మడు పోయింది. ‘స్పెషల్ నీడ్ దుబాయ్ కేర్’ తో కలిసి చికిత్స పొందుతోన్న పిల్లలకోసం ‘లిటిల్ పికాసో’పేరిట పెయింటింగ్స్ వేసి వారికి సాయం చేశా. 2017లో గుర్గావ్ వచ్చేసి, ఇక్కడ పెయింటింగ్స్ నేర్పిస్తున్నాను. ఇండియా ఆర్ట్ కమ్యూనిటీ, ఇండియా స్పీకింగ్ ఆర్ట్ ఫౌండేషన్, వారి సాయంతో పెయింటింగ్ నేర్పిస్తున్నాను. దుబాయ్‌లో వేలమందికి నేర్పిన నేను, నా అనుభవాల ద్వారా నేర్చుకున్న ట్రిక్స్‌ను ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్నాను’’ అలా నా భయాన్ని అధిగమించడంతోపాటు నా విద్యను అందరికీ నేర్పించగలగడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది అని చెప్పింది మినీషా. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వ్యాపారం మొదలుపెట్టింది
‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ! స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సంప్రీత్కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కౌర్‌కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్‌కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్. ఆ ఆర్ట్‌కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని. పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్‌గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్‌లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్‌స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్‌ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది. ‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్‌ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్‌లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్‌వర్క్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన. ‘కౌర్ ఆర్ట్‌వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్‌లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్‌కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్. View this post on Instagram A post shared by Atinytwisted| MacrameIndia (@atinytwisted) -
ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!
కవితకేదీ కాదు అనర్హం అన్న చందాన మెటల్, ప్లాస్టిక్, పాత గాడ్జెట్స్ ఏదైనా ఆయన చేతిలో పెట్టారంటే అందమైన శిల్పంగా మారాల్సిందే. అరవైఏళ్ల వయసులో చిన్నప్పటి హాబీని కెరీర్‌గా మలుచుకున్నాడు విశ్వనాథ్ మల్లాబ్డి దావంగిరె. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్‌గా మార్చి అబ్బురపరుస్తున్నాడు ఈ పెద్దాయన. బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి డీఎమ్ శంభు ప్రముఖ శిల్పి ఇంకా పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని శంభు కలలు కనేవారు. చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను సరికొత్తగా మార్చడమంటే విశ్వనాథ్‌కు ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూరై్తన తరువాత తరువాత మీడియాలోకంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా చేరాడు. అలా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్ ఒక్కోమెట్టు ఎదుగుతూ విప్రోలో చేరాడు. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయం, వారాంతాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకోఆర్ట్గా ఎలా మార్చాలని పరిశోధిస్తుండేవాడు. రకరకాల ప్రయోగాల తరువాత.. గాడ్జెట్స్ వ్యర్థాలను ఉపయోగించి చిన్నచిన్న జంతువులు తయారు చేశాడు. అవి ముద్దుగా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో తన ఇకో ఆర్ట్‌ను పెంచుకుంటూ పోయాడు. ఫ్యాషన్ జ్యూవెలరీ నుంచి అందమైన శిల్పాలు, రోబోలదాకా అన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నాడు. ఏరికోరి ఎంచుకుని... ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ప్రాణాంతకంగా మారాయని తెలుసుకుని ఇకో ఆర్ట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఈ వ్యర్థాలను కొనుక్కునేవాడు. అన్నింటిని గంపగుత్తగా కొనకుండా కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్టాప్స్, డేటా కార్డులు, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెట్–టాప్బాక్స్లు, ల్యాండ్‌లైన్, కార్డ్‌లెస్ ఫోన్లు, గ్లూకో మీటర్లను ఏరికోరి ఎంచుకుని తీసుకునేవాడు. వీటిలో కూడా రాగి, బంగారం, రంగురంగుల వైర్లు, కీబోర్డులను ప్రత్యేకంగా సేకరించి రకరకాల బొమ్మల రూపకల్పనకు ఉపయోగిస్తున్నాడు. ఆరు అడుగుల అమ్మాయి రూపంతో విగ్రహం, ప్రముఖ వ్యాపారవేత్త అజీం ప్రేమ్‌జీ ఫోటో, ఇకో జ్యూవెలరీ, కీబోర్డు కామధేనువు వంటి బొమ్మలు ఐదు వందలకు పైగానే తయారు చేశాడు. హాబీని కెరీర్‌గా... విశ్వనాథ్ తయారు చేసిన బొమ్మలు ఆకర్షణీయంగా అందంగా ఆకట్టుకుంటుండడంతో విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయిన విశ్వనాథ్.. తొలినాళ్లల్లో హాబీగా ఉన్న ఇకోఆర్ట్ను పూర్తి సమయం కేటాయిస్తూ ఇకోఆర్ట్ వస్తువులు విక్రయిస్తూ సరికొత్త కెరీర్‌ను సృష్టించుకున్నాడు. ఇకోఆర్ట్ వస్తువులు కొనే కస్టమర్లు ఢిల్లీలోనేగాక, యూరప్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో ఇకో ఆర్ట్ కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. దేశంలోనేగాక విదేశాల్లో తన ఇకో ఆర్ట్‌ను ప్రదర్శిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు. వందల కేజీలపైనే... కీబోర్డు కీల నుంచి గోడగడియారంలో భాగాల వరకు అన్నీ సేకరించి ఇకో ఆర్ట్ రూపొందిస్తోన్న విశ్వనాథ్ ఇప్పటిదాకా రెండువందల కేజీల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్స్‌గా మార్చాడు. అయితే ఈ ఇకో ఆర్ట్ అంత సులభం కాదని విశ్వనాథ్ చెబుతున్నాడు. ‘‘ఈ – వ్యర్థాల నుంచి ఆర్ట్ కావాల్సిన భాగాలను సేకరించి వాటికి ఆకారం, రంగు వేసి తుదిమెరుగులు దిద్దడానికి చాలా సమయం పడుతుంది. జ్యూవెలరీ తయారు చేయడానికి రెండు మూడు నిమిషాలు పడితే, శిల్పాలు తయారు చేయడానికి వారాలు, నెలలు పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇటు కస్టమర్ల మనసు దోచుకోవడంతోపాటూ, పర్యావరణానికి హానీ కలగకుండా ఈ ఇకోఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది. ముందు ముందు మరిన్ని కళారూపాలు తీసుకురానున్నాను’’అని విశ్వనాథ్ చెబుతున్నాడు. (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది. చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు. చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు. ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది. అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో. బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట. ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట. "నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట. "బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట. తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు) నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది. పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
రంగులతో ఎంత మాయో.?
-
అను చౌహాన్.. ఆర్ట్వర్క్కి బోలెడంత ఫాలోయింగ్
పంజాబీ–కెనడియన్ అను చౌహాన్ ఇలస్ట్రేటర్, వీడియో గేమ్ ఆర్టిస్ట్. సాంస్కృతిక–సాహిత్య వైభవాన్ని కళలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది అను. ఆమె చిత్రాల్లో ఎన్నడూ చూడని మొక్కల నుంచి గ్లోబల్ ఫ్యాషన్ వరకు కనువిందు చేస్తాయి... కెనడాలో పుట్టి పెరిగిన అను చౌహాన్‌కు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాలుగు సంవత్సరాల వయసులో స్క్రీన్‌పై కనిపిస్తున్న డిస్నీ కార్టూన్‌ను చూస్తూ బొమ్మ వేయడానికి ప్రయత్నించింది. హైస్కూల్ రోజులకు వచ్చేసరికి ఇలస్ట్రేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఆ సమయంలోనే ఇలస్ట్రేటర్ కావాలని బలంగా అనుకుంది. అను అభిరుచికి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇంటరాక్టివ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ చేసి, యానిమేషన్ సబ్జెక్ట్ చదువుకున్న అను చౌహాన్ తనలోని సృజనాత్మకతను కాపాడుకోవడానికి నిత్యనూతనంగా ఆలోచించేది. చిత్రకళలో తనదైన శైలిని రూపొందించుకునే ప్రయత్నం చేసేది. చదువు పూర్తయిన తరువాత మొబైల్ గేమ్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది. అంతర్జాలంలో పోస్ట్ చేసిన ఆమె ఆర్ట్వర్క్స్కు మంచి స్పందన లభించేది. కొద్ది కాలంలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య వందలు దాటి వేలల్లోకి వచ్చింది. ‘నా ప్రతి చిత్రం ఒక కథ చెప్పాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా కథలోని పాత్రలు దక్షిణ ఆసియాకు చెందినవి. ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లు కాకుండా ఆ పాత్రలు మనకు సుపరిచితమైనవి అన్నట్లుగా ఉండాలి. బొమ్మల ద్వారా కూడా స్త్రీ సాధికారతకు సంబంధించిన విషయాలను ప్రచారం చేయవచ్చు’ అంటుంది అను. ప్రపంచంలో ఏ మూల ఏ కొత్త డిజైన్ వచ్చినా దాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంటుంది అను. 1960– 1970లలో వచ్చిన ఫ్యాషన్ అండ్ ఆర్ట్ వర్క్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ‘వీడియో గేమ్స్, డిస్నీ, బాలీవుడ్...ఇలా ఎన్నో అంశాలు నా ఆర్ట్‌పై ప్రభావం చూపాయి’ అంటున్న అను చౌహాన్ తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కూడా స్ఫూర్తి పొందుతుంది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లింగ్ బుక్ ‘అరు షా అండ్ ది ఎండ్ ఆఫ్ టైమ్’ గ్రాఫిక్ ఎడాప్షన్ కోసం వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. మహక్ జైన్ రాసిన ‘భరతనాట్యం ఇన్ బాలెట్ షూస్’ పుస్తకానికి అను చౌహాన్ వేసిన బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పిల్లల కోసం అను రూపొందించిన ‘ఏ దుపట్టా ఈజ్’ ‘హెన్నా ఈజ్’ పుస్తకాలు సూపర్‌హిట్ అయ్యాయి. ‘క్రియేటిక్ వర్క్ ద్వారా జీవితాన్ని సంతోషంగా గడపాలనేది నా కోరిక. వెబ్‌కామిక్ చేయాలనేది నా కల. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో తెలియదు అనే ఎరుకతో చిత్రకళ ద్వారా ప్రతి క్షణం ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది అను. -
చిన్న పెట్టుబడి.. పెద్ద నిధిగా మారాలంటే?
వివేక్, బలరామ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ, ఈక్విటీ పెట్టుబడుల విషయానికొచ్చే సరికి ఇద్దరిదీ చెరోదారి. 2002లో ఇద్దరూ ఓ చెరో నాలుగైదు స్మాల్‌క్యాప్ కంపెనీల్లో రూ. 50 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. 2023 జనవరి నాటికి వివేక్ ఇన్వెస్ట్ చేసిన ఐదు కంపెనీల్లో రెండు మలీ్టబ్యాగర్లు అయ్యాయి. రెండు నష్టాలను ఇవ్వగా, ఒక్కటి మంచి రాబడులను ఇచి్చంది. మొత్తంగా అతడి రూ. 50వేల పెట్టుబడి 20 ఏళ్లలో రూ.18 లక్షలు అయింది. బలరామ్ నాలుగు కంపెనీల్లో మొత్తంగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. కానీ, 2023 జనవరిలో అతడి మొత్తం పెట్టుబడి రాబడితో కలసి రూ.6 లక్షలుగా మారింది. ఇద్దరి రాబడుల్లో అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే? వారు ఎంపిక చేసుకున్న కంపెనీల వల్లే. ఇక్కడ బలరామ్‌తో పోలిస్తే వివేక్ అంత భారీ రాబడులు పోగేసుకోవడం వెనుక అతడు నేర్చుకుని, తెలుసుకుని, తగినంత అధ్యయనం తర్వాత పెట్టుబడి పెట్టడం వల్లేనని చెప్పుకోవాలి. అందుకే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి ఓ కళగా నిపుణులు చెబుతారు. అన్నీ తెలుసుకుని, అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు అంటే చాలా చౌకగా లభిస్తున్నాయనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది సరికాదు. రూ.16,472 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇప్పుడు స్మాల్‌క్యాప్ కంపెనీలుగానే పరిగణిస్తున్నారు. లోగడ రూ.8,579 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇలా పరిగణించేవారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో చాలా వరకు దశాబ్దాలుగా అదే స్థాయిలో ఉండిపోతాయి. కేవలం కొన్ని మాత్రం ఆయా రంగాల్లో లీడర్లుగా, పెద్ద స్థాయి కంపెనీలుగా అవతరిస్తాయి. వ్యాపారంలో వృద్ధి లేక అక్కడే ఉండిపోయే కంపెనీలు కూడా బోలెడు. కంపెనీ యాజమాన్యంలో సత్తా లేకపోవచ్చు. లేదా ఆ కంపెనీ చేస్తున్న వ్యాపారానికి పరిమిత అవకాశాలు ఉండొచ్చు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, మూలధన నిధుల నిర్వహణ మెరుగ్గా లేకపోవచ్చు. సాధారణంగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇలాంటివే కనిపిస్తుంటాయి. కానీ, కొన్ని మార్కెట్ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా తక్కువ వేల్యూషన్ల వద్ద లభిస్తుంటాయి. లేదంటే అప్పటి వ్యాపార స్థాయి ఆధారంగా చిన్న కంపెనీలుగా ఉండి ఉండొచ్చు. ఇలాంటి నాణ్యమైన కొన్ని ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మల్టీబ్యాగర్ రాబడులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లలో ఒక ధోరణి కనిపిస్తుంది. స్టాక్ ధర రూ.100 లోపు లేదా రూ.10–50 లోపు ఉంటే చౌక అని భావిస్తుంటారు. రేటు తక్కువలో ఉంటే ఎక్కువ స్టాక్స్ వస్తాయని, వేగంగా రెండు మూడు రెట్లు పెరుగుతాయనే అపోహ ఉంటుంది. స్మాల్‌క్యాప్ కంపెనీయే అయినా ఒక్కో షేరు రూ.5,000 ఉండొచ్చు. మరో కంపెనీ షేరు ధర రూ.10 ఉండొచ్చు. షేరు ధర కంపెనీ ఆర్థిక మూలాలనే ప్రతిఫలిస్తుందన్నది మర్చిపోవద్దు. షేరు ధర తక్కువ, ఎక్కువలో ఉండడం అన్నది చౌక, ఖరీదైన దానికి నిదర్శనం కాదు. ఉదాహరణకు.. ‘ఏ’ అనే కంపెనీ మూలధనం రూ.10కోట్లు. షేరు ముఖ విలువ రూ.10 అప్పుడు కోటి షేర్లు ఉంటాయి. ‘బీ’ అనే కంపెనీ మూలధనం కూడా రూ.10 కోట్లు. కానీ షేరు ముఖ విలువ ఒక్కరూపాయే. కనుక 10 కోట్ల షేర్లు ఉంటాయని తెలుసుకోవాలి. కేవలం పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్ రేషియో/ఆర్జనకు షేరు ఎన్ని రెట్లు ఉంది) చూసి, తక్కువలో ఉందని కొనుగోలు చేయడం కూడా అన్ని సందర్భాల్లో సరైన ఫలితం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. స్మాల్‌క్యాప్ అనేది పెద్ద ప్రపంచం. టాప్ 250 కాకుండా మార్కెట్లో ఉన్న మిగిలినవన్నీ కూడా స్మాల్‌క్యాప్ విభాగంలోకే వస్తాయి. అన్ని వందలు, వేల కంపెనీల నుంచి మాణిక్యాలను (చెత్త నుంచి మణి) వెలికితీయాలంటే లోతైన పరిశోధ న అవసరం. మెరుగైన అవకాశాలు రూ.16,472 కోట్ల వరకు స్మాల్‌క్యాప్ కంపెనీల కిందకే వస్తున్నాయి కనుక ఈ విభాగంలో ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. నిర్వచనం మార్చడం వల్ల స్మాల్‌క్యాప్ పప్రంచం ఇప్పుడు మరింత విస్తృతం అయింది. మన మార్కెట్ విస్తృతి పెరిగింది. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా, మరి కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించొచ్చు. కనుక దీర్ఘదృష్టితో ఆలోచించి, ఇప్పుడు స్మాల్‌క్యాప్ ప్రపంచంలో కొంచెం పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకున్నా.. అవి జెయింట్ క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు లేకపోలేదు. 2012 జనవరి 10 నుంచి 2022 జనవరి 10 వరకు గణాంకాలను పరిశీలించి చూస్తే.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ నుంచి మూడు కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. అవి చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్. ఇక స్మాల్‌క్యాప్ నుంచి మరో 21 కంపెనీలు మిడ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. 72 కంపెనీలు అదే స్థాయిలో ఉంటే, 64 కంపెనీలు మైక్రోక్యాప్ (మరీ చిన్నవి)గా కరిగిపోయాయి. ఎంపిక ఎలా..? ‘‘చిన్న కంపెనీలు అధిక వృద్ధి సామర్థ్యాలతో ఉంటాయి. దాదాపు ఇవి అనలిస్టుల సెల్ కాల్ పరిధిలో ఉండవు. కనుక స్మాల్ క్యాప్ కంపెనీలను అధ్యయనం చేసేందుకు ప్రాథమిక పరిశోధన అవసరం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ ఇవి అధిక రాబడులను ఇవ్వగలవు’’ అని ఓపీసీ అస్సెట్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజయ్ బగ్గా పేర్కొన్నారు. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ అంబరీశ్ బలిగ అభిప్రాయంలో.. ‘‘స్మాల్‌క్యాప్ స్టాక్ ఎంపికకు ఏ ఒక్క విధానం అంటూ లేదు. కాకపోతే నేను అనుసరించే మార్గదర్శకాలు ఏమిటంటే.. ఎంపిక చేసుకోబోయే స్టాక్ మంచి పనితీరు చూపిస్తున్న రంగానికి చెందినదై ఉండాలి. లేదా మంచి పనితీరు చూపించేందుకు అవకాశం ఉన్న రంగంలో పనిచేస్తూ ఉండాలి. ఆయా కంపెనీ ఏదైనా ఉప విభాగంలో లీడర్‌గా ఉందా అని చూస్తాను. లేదంటే లీడర్‌గా ఎదిగే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తాను. ఆయా రంగం వృద్ధికి మించి పనితీరు చూపిస్తూ ఉండాలి’’అని వివరించారు. ఇక స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో లిక్విడిటీ (షేర్ల లభ్యత) కూడా కీలకమేనని అంబరీశ్ తెలిపారు. ‘‘బ్యాలన్స్ షీటులో రుణ భారం ఎక్కువగా ఉండకూడదు. రుణ భారం ఉంటే, భవిష్యత్తులో పెరిగే నగదు ప్రవాహాల పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడే ఈక్విటీ–రుణభారం నిష్పత్తి దిగొస్తుంది’’అని వివరించారు. లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే అది షేరు ధర పతనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యతపై దృష్టి కీలకం ‘‘స్మాల్‌క్యాప్ కంపెనీలు ఎప్పుడూ కూడా లిక్విడిటీ పరంగా సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటే ర్యాలీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, షేరు ధర వేగంగా పడిపోయే అవకాశాలు సైతం ఉంటాయి. స్మాల్‌క్యాప్ పరంగా ఉండే కీలకమైన అంశం ఇదే. అందుకే మార్కెట్లో వాటి ధరలు మానిప్యులేషన్‌కు లోనవుతుంటాయి’’అని కేఆర్ చోక్సే ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దేవేన్ చోక్సే వివరించారు. ఇక యాజమాన్యం సమర్థత, నిజాయితీ తదితర అంశాలు కూడా ఈ విభాగంలో కీలకంగా పనిచేస్తాయని అంబరీష్ బలిగ వివరించారు. యాజమాన్యం విషయంలో కనిపించని విషయాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని సూచించారు. షేరు ధర చౌకగా ఉందా లేక స్మాల్‌క్యాప్ అని కాకుండా, నాణ్యతకు సంబంధించిన అంశాలు చూడాలని నిపుణుల సూచన. యాజమాన్యానికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా? కంపెనీ భిన్నంగా ఏదైనా చేయగలదా? పోటీ తత్వం లేదా టైఅప్‌ల ద్వారా భిన్నంగా ప్రయతి్నంచగలదా? పరిమిత మూలధన నిధులతోనే వృద్ధి చెందగలదా? భారీ వృద్దికి అవకాశం ఉన్న రంగంలోనే పనిచేస్తుందా? అన్న అంశాలను చూడాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు మధ్యలో తాత్కాలికంగా ఏవైనా ఆటుపోట్లతో దారి తప్పినా.. తిరిగి మళ్లీ గాడిలో పడి దూసుకుపోయే అవకాశాలుంటాయి. యాజమాన్యం సామార్థ్యాలు, బలాలకు తోడు ఆ వ్యాపారం విస్తరణకు అవకాశం ఉందా? అప్పటికే ఆ కంపెనీలో ఇనిస్టిట్యూషన్స్ లేదా హెచ్ఎన్ఐలకు (బడా ఇన్వెస్టర్లు) వాటాలున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఆయా కంపెనీ కస్టమర్లు, వెండర్లు, పోటీ కంపెనీలను కలసి మాట్లాడడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అంబరీష్ బలిగ సూచించారు. పైగా అన్ని సానుకూలతలు ఉండి, కంపెనీని ఎంపిక చేసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు వేచి చూసే ఓపిక కూడా దండిగా ఉండాలన్నది మార్కెట్ పండితుల స్వీయ అనుభవం. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అన్న చందంగా ప్రతీ నాణ్యమైన కంపెనీకి అనుకూల తరుణం వచ్చే వరకు ఆగాల్సిందే. పైగా ఒక్కసారి పెట్టుబడి పెట్టి రిలాక్స్ అయ్యే ధోరణి స్మాల్‌క్యాప్ కంపెనీలకు అస్సలే పనికిరాదు. ఎలాంటి సానుకూలతలు చూసి, సంబంధిత కంపెనీలో పెట్టుబడి పెట్టారో.. వాటిల్లో మార్పు లేనంత వరకు పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. తేడా వస్తే బయటకు వచ్చేందుకు సిద్ధంగానూ ఉండాలి. కంపెనీ వృద్ధి పథంలో సాగుతున్నంత కాలం ర్యాలీ చేస్తున్నప్పటికీ ఆ పెట్టుబడితో కొనసాగొచ్చు. అలాంటప్పుడే అవి మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌గా అవతరించగలవు. అలా మంచి పనితీరును క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న సమయంలో మరింత మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులకు ముందుకు వస్తారు. దీంతో విస్తృతి పెరుగుతుంది. -
పెళ్లికొడుకు లుక్‌లో జబర్దస్త్‌గా..మస్క్: ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కొత్త పెళ్లి కొడుకు ఫోజులో మెరిసిపోతున్నాడు. షేర్వాణీలో, గుర్రపు స్వారీ చేస్తూ, అతిథులతో డ్యాన్స్ చేస్తున్న మస్క్ డిఫరెంట్ లుక్‌లో అదిరిపోతున్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆగండి ఆగండి ..మస్క్ మళ్లీ పెళ్లి అంటూ ఏవేవో ఊహించేసుకోకండి.. ఇదంతా ఏఐ ఆర్ట్మాయ. రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే హ్యాండిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మస్క్ పోటోలను షేర్ చేసింది. అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్ట్ కూడా నాలుగు రోజులు క్రితం ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ చివరికి మస్క్ దాకా చేరాయి. దీంతో ఐ లవ్ ఇట్ అంటూ మస్క్ మురిసిపోవడం విశేషం. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) A midjourney art of Elon Musk in an Indian attire is going viral in India. 🇮🇳 pic.twitter.com/LD1KuIAHET — DogeDesigner (@cb_doge) June 3, 2023 కాగా ప్రపంచకుబేరుడు టైటిల్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ దక్కించుకున్నాడు. ఎలోన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి టైటిల్‌ను తిరిగి పొందాడు. ప్యారిస్ ట్రేడింగ్‌లో ఆర్నాల్ట్ షేర్ల 2.6 శాతం పతనం కావడంతో లగ్జరీ టైకూన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించిన మస్క్ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. (వారెవ్వా ఓనరు..ఫిదా చేశావ్ గురూ! ఏం చేశాడో తెలిస్తే!) -
మెట్‌గాలాలో బిలియనీర్లు అంబానీ, మస్క్, రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర: ఫోటోలు వైరల్
సాక్షి,ముంబై: మెట్‌గాలాలో బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు సందడి చేశారు. అదేంటి ఫ్యాషన్ ఈవెంట్లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? ఇదంతా ఏఐ ఆర్ట్ మహిమ. ఏఐ ఆర్టిస్ట్ అబూ సాహిద్ బుర్రలో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ చిత్రాలు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇంట్రస్టింగ్ ఫోటోలతో ఇన్‌స్టాలో పాపులర్ అవుతున్నారు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విటర్ అధినేత, ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్‌జుకర్ బర్గ్ మెట్ గాలాకు హాజరవుతున్నట్లు ఊహించి ఈ ఫోటోలను సృష్టించారు. మిడ్ జర్నీ సాయంతోరూపుదిద్దిన ఈ ఫోటోల్లోబాబా రాందేవ్, అజీం ప్రేమ్‌జీతో పాటు, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి మెట్‌గాలా. ఈ ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్‌ను న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా కృత్రిమ మేధస్సుతో (ఏఐ) రూపొందించిన చిత్రాలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు , డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ డిజిటల్ ఆర్టిస్ అబూ సాహిత్ ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇన్‌స్టాలో ఆయనకు 21.6వేల గ్రామ్ ఫాలోవర్లున్నారు. ఆయన పేజీ నిండా ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
కాదేదీ బిజినెస్‌కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్‌లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్‌లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్‌తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్‌తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్‌కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్‌పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
వాచీలు, హ్యాండ్ బ్యాగులు అంటే మక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అధిక ధనవంతుల్లో (రూ.250 కోట్ల, అంతకంటే ఎక్కువ) సగానికి పైనే ఈ ఏడాది వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, కళాకృతులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా తమ అభిరుచులపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ రూపంలో వెల్లడించింది. పది రకాల విలాసవంతమైన ఉత్పత్తులపై పెట్టుబడులను నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ఏటా ట్రాక్ చేస్తుంటుంది. 2022లో వీటిపై పెట్టుబడులు 16 శాతం పెరిగినట్టు తెలిపింది. ► అన్నింటికంటే కళాకృతులకు డిమాండ్ నెలకొంది. 2022లో వీటిపై రాబడులు 29 శాతంగా ఉండడం ఆసక్తికరం. ► క్లాసిక్ కార్లు (పాతం కాలం నాటి) 25 శాతం రాబడులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ స్థాయి రాబడులు 9 ఏళ్ల కాలంలోనే అధికం కావడం గమనార్హం. ఉదాహరణకు మెర్సిడెజ్ బెంజ్ ‘ఉహ్లెన్‌హాట్ కూప్’ 2022లో 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. క్లాసిక్ కార్లలో ఇప్పటి వరకు గరిష్ట ధర పలికింది ఇదే కావడం గమనించాలి. ► గతేడాది లగ్జరీ వాచీల ధరలు 18 శాతం వృద్ధి చెందడంతో ఇవి మూడో స్థానంలో నిలిచాయి. ► లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, జ్యుయలరీ రాబడుల పరంగా 5, 6, 8వ స్థానాల్లో నిలిచాయి. ► అరుదైన విస్కీ ధరలు 3 శాతం పెరిగాయి. కానీ, గత పదేళ్ల కాలంలో ఈ పది పెట్టుబడుల్లోనూ అరుదైన విస్కీ అత్యధికంగా 373 శాతం రాబడులతో మొదటి స్థానంలో నిలిచింది. -
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్‌లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్‌కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్‌లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్‌తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్‌ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
భళా చిత్రం.. కళా యజ్ఞం!
సాక్షి, హైదరాబాద్: అప్పుడే కుంచె పట్టడం మొదలుపెట్టినవారి నుంచి అలవోకగా కళాకృతులను సృష్టించే చిత్రకారులు. చూడగానే ఆకట్టుకునే, ఆలోచింపజేసే చిత్రాలు. ఓ సరికొత్త కళాయజ్ఞం. 21 రోజులపాటు రోజూ ఒక చిత్రాన్ని గీయాలంటూ ప్రముఖ చిత్రకారుడు యేలూరి శేషబ్రహ్మం ఇచ్చిన పిలుపునకు స్పందన ఇది. దేశంలోనే తొలిసారిగా ఫేస్బుక్ వేదికగా డిసెంబర్ 11న మొదలైన ఈ ‘చాలెంజ్’శనివారం (31వ తేదీ)తో ముగిసింది. 400 మందికిపైగా చిత్రకారులు, వేలకొద్దీ చిత్రాలను గీసి ఈ ‘కళాయజ్ఞం’లో పాల్గొన్నారు. ఇందులో పదుల సంఖ్యలో విదేశీ చిత్రకారులూ ఉండటం గమనార్హం. ఆర్ట్ చాలెంజ్ లాంటిదే.. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ‘21 రోజుల కళాయజ్ఞ’.. సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న పలు చాలెంజ్‌ల తరహాలో ఒక ఆర్ట్ చాలెంజ్ అని చెప్పొచ్చు. అయితే దాన్ని ‘కళాయజ్ఞ’గా పేర్కొనడంతో మరింత భారతీయతను సంతరించుకుంది. నిర్వాహకులు ముందే ప్రకటించిన 21 అంశాలలో రోజుకొక అంశం చొప్పున సింగిల్ కలర్ లేక మోనోక్రోమ్ విధానంలో 21 రోజుల పాటు చిత్రాలు గీయడమే దీని లక్ష్యం. ప్రకటిత అంశాలన్నీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, సామాన్య జనజీవన విధానాన్ని తెలిపేలా రూపొందించారు. దీనికోసం ‘ఫేస్బుక్’లో ప్రత్యేకంగా ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడే కుంచె పట్టిన చేతుల నుంచి కళాత్మకంగా కుంచెను నాట్యమాడించే వారి వరకు ప్రతిఒక్కరూ అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు. ప్రొఫెషనల్ చిత్రకారులే కాక ఇల్లస్ట్రేటర్స్, కార్టూనిస్ట్‌లు, స్థపతులు, డిజైనర్లు ఇంకా అనేక రంగాలలో ఉండి అభిరుచితో చిత్రాలు గీసేవారు కూడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. డ్రాయింగ్స్, పెయింటింగ్స్, శాండ్ ఆర్ట్, ప్రింట్ మేకింగ్, గ్రానైట్ ఎచింగ్స్ ద్వారా కూడా చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్ర ప్రదర్శన నిబంధనల మేరకు కళాయజ్ఞంలో పాల్గొన్న కళాకారుల నుంచి మంచి కౌశలం చూపిన 21 మందిని ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ చిత్రకారులు ఐదుగురు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఎంపిక చేసిన అద్భుత చిత్రాలతో హైదరాబాద్‌లో 3 రోజులపాటు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కళాయజ్ఞంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోలేని ఔత్సాహిక కళాకారులకు గెస్ట్ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాలు గీసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అనూహ్య స్పందన వస్తోంది విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఆర్ట్ చాలెంజ్‌లు అరుదు. అందుకే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల థీమ్‌తో దీన్ని డిజైన్ చేశాం. పదుల సంఖ్యలో వస్తారనుకున్నాం. కానీ అనుకోని విధంగా భారీ స్పందన లభించింది. వందలాది మంది వర్క్స్ ఒకేరోజు చూసే అవకాశం కళాభిమానులకు కనువిందు చేస్తుంది. చిత్రకారులకు ఒక చక్కని సాధనలా కూడా ఉపకరిస్తుంది. ఇప్పటికే వేలాది చిత్రాలతో ఈ కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటిని ’'BrahmamKalaYajna' ఫేస్బుక్ పేజీలో వీక్షించవచ్చు. –శేషబ్రహ్మం, ప్రముఖ చిత్రకారుడు -
అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కొన్ని నియమాలు..
రంగురంగుల పూలు కంటికి హాయినిస్తాయి. పూల అమరిక మనసుకు సాంత్వననిస్తుంది. ఫ్లవర్‌వాజ్ ఇంటి ఆహ్లాదానికి చిరునామా. భూమి... స్వర్గం... మధ్యలో మనిషి... జీవిత తత్వానికి, జీవన సూత్రానికి ప్రతీక పువ్వు. ఈ తాత్వికతకు ప్రతిబింబం ఇకబెనా పూల అమరిక. కళ... పాటలు పాడడం ఒక కళ. నాట్యం చేయడం ఒక కళ. చెట్టు మీద ఉండాల్సిన ఆకులు, పూలను... నేల మీదకు తెచ్చి రంగవల్లిక ఆవిష్కరించడం ఓ కళ... అలాగే కాన్వాస్ మీద ఆవిష్కరించడం మరో కళ. అదే పూలు, లతలను వస్త్రం మీద కుట్టడం ఓ కళ. తాజా పూలను కుండీలో అమర్చడమూ ఓ కళ. అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ కళను సాధన చేయడం ధ్యానంతో సమానం అంటారు ఇకబెనా కళాకారిణి రేఖారెడ్డి. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన పూల అలంకరణ విధానం. జీవితానికి అన్వయిస్తూ సూత్రబద్ధంగా చేసే అమరిక. జపాన్ కళకు భారతీయ సొగసులద్ది విదేశాల్లో భారతీయతకు రాయబారిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న రేఖారెడ్డి. ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి నేపథ్యాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ప్రకృతికి ఆహ్వానం ‘‘ఇది బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న కళ. బుద్ధుని ప్రతిమ ఎదురుగా ఒక పాత్రలో నీటిని పెట్టి అందులో కొన్ని పూలను సమర్పించడం నుంచి ఆ పూల అమరిక మరికొంత సూత్రబద్ధతను ఇముడ్చుకుంటూ ఎన్నో ఏళ్లకు ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ అనే రూపం సంతరించుకుంది. పూలను చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాట. అలా బౌద్ధ చైత్యాల నుంచి ఈ సంస్కృతి బౌద్ధావలంబకుల ఇళ్లలోకి వచ్చింది. ఈ పూల అలంకరణ ప్రకృతికి, మనిషి జీవితానికి మధ్య ఉండాల్సిన అనుబంధానికి ప్రతీక. ఒక త్రికోణాకారంలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపంగా ఉంటుందీ అమరిక. మనిషి జీవన చక్రం ఇమిడి ఉంటుంది. పై నుంచి కిందకు... ఒకటి విచ్చుకోవాల్సిన మొగ్గ, ఒకటి అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు పూలు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలన్నమాట. ఫ్లవర్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ ధ్యానం వంటిదే. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో గడిపితే ధ్యానం తర్వాత కలిగే ప్రశాంతత కలుగుతుంది. ఇక నాకు ఈ ఆర్ట్ మీద ఆసక్తి ఎలా కలిగింది... అంటే ఈ కళ మా ఇంట్లో నేను పుట్టకముందే విచ్చుకుంది. ఆకట్టుకున్న జపాన్ మా నాన్న పిల్లల డాక్టర్. కెనడాకు వెళ్లే ప్రయాణంలో మధ్యలో నాలుగు రోజులు జపాన్‌లో ఉన్నారు. నాన్నతోపాటు అమ్మ కూడా వెళ్లిందప్పుడు. ఆమెకు స్వతహాగా ఇంటిని పూలతో అలంకరించడం ఇష్టం. ఫ్లవర్‌వాజ్‌లో తాజా పూలను అమర్చేది. జపాన్‌లో ఉన్న నాలుగు రోజుల్లో ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఆమెను బాగా ఆకర్షించింది. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మీనా అనంతనారాయణ్ గారి దగ్గర కోర్సు చేసింది అమ్మ. సిటీలో అనేక పోటీల్లో పాల్గొని ప్రైజ్‌లు తెచ్చుకునేది. ఇదంతా చూస్తూ పెరిగినా కూడా నాకు అప్పట్లో పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ అవగాహన మాత్రం ఉండేది. కాలేజ్ పోటీలప్పుడు ఫ్లవర్‌వేజ్‌లో తాజా పూలను చక్కగా అలంకరించి ప్రైజ్‌లు తెచ్చుకోవడం వరకే ఇంటరెస్ట్. నా కెరీర్ ప్లాన్స్ అన్నీ న్యూట్రిషన్లోనే ఉండేవి. ఎన్.జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ హోమ్‌సైన్స్‌లో న్యూట్రిషన్ చేశాను, యూనివర్సిటీ టాపర్‌ని. పీహెచ్డీ చేసి ప్రపంచంలో అనేక దేశాల్లో పిల్లలు పోషకాహారలోపంతో బాధపడడానికి కారణాలను, నివారించడానికి చర్యల మీద పరిశోధనలు చేయాలనుకున్నాను. అలాంటిది హఠాత్తుగా నాన్న పోవడం, నాకు పెళ్లి చేసి తన బాధ్యత పూర్తి చేసుకోవాలని అమ్మ అనుకోవడం... నా న్యూట్రిషన్ కెరీర్ కల కలగానే ఉండిపోయింది. నా పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబంతో గృహిణిగా కొనసాగుతున్న సమయంలో కాలక్షేపం కోసం ఫ్లవర్ అరేంజ్మెంట్ మొదలుపెట్టాను. ఒక్కో డౌట్ అమ్మను అడుగుతూ పూలను అమర్చేదాన్ని. అప్పుడు అమ్మ సూచన మేరకు ఆమె టీచర్ దగ్గరే నేను కూడా ఇకబెనా కోర్సు చేశాను. ఇది ముప్ఫైఐదేళ్ల నాటి సంగతి. ఇందులో ఇంట్రడక్టరీ నుంచి టీచింగ్ వరకు ఉన్న దశలన్నీ పూర్తిచేసి 1995 నుంచి ఇకబెనా టీచింగ్ మొదలు పెట్టాను. ఇన్నేళ్లలో వందలాది మందికి నేర్పించాను. నా స్టూడెంట్స్‌లో చాలామంది టీచర్లయ్యారు. మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు నన్ను చూసి ఓసారి ‘గోల్డ్ మెడలిస్ట్వి. న్యూట్రిషన్ కోసం చాలా సర్వీస్ ఇస్తావని ఊహించాం. ఇలా పూల డెకరేషన్ చేసుకుంటున్నావా’ అని నొచ్చుకున్నారు. మనను నడిపించే ఓ శక్తి మన గమనాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతాను. ఇకబెనా కోసం పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇందులోనే ప్రయోగాలు చేస్తున్నాను. నేను విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయతకు ప్రాతినిధ్యం వహించినట్లే, కాబట్టి మన వస్త్రధారణనే పాటిస్తాను. ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో భారతీయత ప్రతిబింబించేటట్లు మన పసుపు, కుంకుమను థీమ్ ప్రకారం చేరుస్తాను. ఈ ప్రయోగం నాకు గర్వంగా ఉంటోంది కూడా. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ అనే పుస్తకం ద్వారా జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేశాను. అలాగే ‘మిశ్రణం’ పుస్తకంలో మన ఆహారంలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్‌కి– జపాన్ పూల అలంకరణను మమేకం చేశాను. సంస్కృతుల సమ్మేళనంగా నేను చేసిన ఈ ప్రయోగాలే నన్ను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ ఎంపిక చేశాయనుకుంటున్నాను. ఈ పురస్కారాన్ని ఈ నెలలో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ తగా మసాయుకి అందిస్తారు’’ అని తన ఇకబెనా ప్రయాణాన్ని వివరించారు రేఖారెడ్డి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి సమాజ హితం కోసం పాఠాలు ఇంట్లో నేనే చిన్నదాన్ని. అన్న, అక్క ఉన్నత విద్య కోసం హాస్టల్కెళ్లిపోయిన తరవాత నన్ను కూడా హాస్టల్‌కి పంపించడానికి అమ్మానాన్న ఇష్టపడలేదు. అలా ఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజ్‌లో సీటు వదులుకున్నాను. న్యూట్రిషన్లో పీహెచ్డీ సీటు వచ్చినా చేయలేకపోయాను. నేను హాబీగా మొదలు పెట్టిన ఇకబెనా కోసం విస్తృతంగా పని చేస్తున్నాను. మనదేశంలో దాదాపుగా పది రాష్ట్రాల్లో, పద్నాలుగు దేశాల్లో వర్క్‌షాప్‌లు, డెమోలలో పాల్గొన్నాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా నా విద్యార్థుల పరిధి ఖండాలు దాటింది. లిథువేనియా స్టూడెంట్స్‌కి కూడా నేర్పించాను. పిల్లల ఆరోగ్యం కోసం పని చేసే రుగుటె ఫౌండేషన్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కోసం ఇకబెనా పాఠాలు చెప్పాను. రష్యా– ఉక్రెయిన్ వార్ రిలీఫ్ ఫండ్ కోసం కూడా ఇకబెనా పాఠాలు చెప్పాను. ఈ జర్నీ నాకు సంతృప్తిగా ఉంది. – రేఖారెడ్డి, ఇకబెనా ఆర్టిస్ట్ -
500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..) -
‘ఊపిరి’ సినిమాలో సీన్ మాదిరిగా, పికిల్ ఆర్ట్ 4 లక్షలు.. నెటిజన్ల ట్రోలింగ్
‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో మోడర్న్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లిన హీరో... జనం వాటికి ఎందుకన్ని లక్షల పెడుతున్నారో అర్థంకాక.. నవ్వుకుంటాడు. ఇంటికొచ్చి తనూ ఓ పెయింటింగ్ వేసి లక్షలకు అమ్మేస్తాడు. గుర్తుందా? అచ్చం అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా లో జరిగింది. ఆర్టిస్ట్ మాథ్యూ గ్రిఫిన్... మెక్‌డొనాల్డ్స్ చీజ్ బర్గర్ తింటుండగా, అందులోని ఓ పికిల్ పీస్ వెళ్లి సీలింగ్‌కు తగిలింది. తెల్లని సీలింగ్‌పై అదో అద్భుతమైన చిత్రంగా తోచిందతనికి. ఇంకేముంది... ఆ పాపులర్ పికిల్‌తో చిత్రాన్ని రూపొందించి.. ఓ ఆస్ట్రేలియన్ ఎగ్జిబిషన్లో ఉంచాడు. దానికి ‘పికిల్’ అని పేరు పెట్టి, రూ.4లక్షలు ధర నిర్ణయించాడు. సిడ్నీ ఎగ్జిబిషన్‌లోని ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించిన 4 ఆర్ట్ వర్క్స్‌లో అదీ ఒకటి. జూలై 30 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్ వివరాలను సిడ్నీ ఫైన్ ఆర్ట్స్ ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో పంచుకున్నారు. అంతే.. అది చూసిన నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి అలా చేసినందుకు నన్ను పోలీసులు అక్కడి నుంచి తరిమారు. ఇప్పుడు మాత్రం కళాఖండమైంది’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు. ఇక ‘ఇలాంటి ఆర్ట్‌వర్క్‌ను ఎలా ప్రదర్శిస్తారు?’ అంటూ చిరాకు పడ్డవారూ ఉన్నారు. అయితే ‘ఆన్లైన్లో ఆ పెయింటింగ్‌పై వచ్చిన హాస్యా స్పద స్పందనను పట్టించుకోవద్దు’ అంటున్నా డు ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ ర్యాన్ మూరే. ఫన్నీగా ఉన్నంత మాత్రాన దానికున్న విలువ, దాని అర్థం మారిపోదని చెబుతున్నాడు. -
పెంగ్విన్ ఆర్ట్
పెంగ్విన్ పెయింటింగ్స్ గీసిన చిత్రకారులెందరినో చూసుంటారు. కానీ పెయింటింగ్ వేసే పెంగ్విన్ ఒకటుంది. అద్భుతమైన చిత్రాలను గీయడమే కాదు... వాటితో ఓ ప్రదర్శన కూడా ఏర్పాటయ్యింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. యూకేలోని హెల్స్టన్ సమీపంలో ఉన్న ‘గ్వీక్ కార్నిష్ సీల్ సంరక్షణ కేంద్రం’లో స్క్విడ్జ్ అనే పెంగ్విన్ ఉంది. అది తన పాదముద్రలతో అద్భుతమైన పెయింటింగ్స్ గీసింది. ఆ చిత్రాలను పెన్జేన్స్లో జాతీయ, అంతర్జాతీయంగా ప్రముఖ చిత్రకారుల ప్రదర్శనలు జరిగే... ‘దఎక్సే్ఛంజ్’ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఇలా పెంగ్విన్ గీసిన చిత్రాలతో యూకేలో ఎగ్జిబిషన్ జరగడం మొదటిసారి. ఆ పెయింటింగ్స్‌ను ‘ఫండ్ అవర్ ఫ్యూచర్’ పేరుతో https://uk.givergy. com/sealsanctuary వేలంలో కూడా పెట్టారు. వేలంలో పాల్గొనలేనివాళ్లు... ఇదే వెబ్సైట్లో టికెట్ కొంటే ప్రతి ఇద్దరిలో ఒకరు స్క్విడ్జ్ గీసిన చిన్న చిన్న ఆర్ట్ పీస్‌లను గెలుచుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బును సంరక్షణ కేంద్రం అభివృద్ధి, జంతువుల సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు. -
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. -
గర్ల్‌ఫ్రెండ్ పై ఉన్న పిచ్చి ఎంత పనిచేసింది...సుమారు రూ.40 కోట్లు..
కొంతమంది కోపం వప్తే మనిషిలా ప్రవర్తించారు. అనుకున్నది జరగకపోయిన, తాను అనుకున్నట్లుగా లేకపోయిన కొంతమందికి భలే కోపం ముంచుకోస్తుంది. దీంతో వాళ్ల చేసే హంగామా ఇంత అంత కాదు. మరికొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు హాని కలిగించుకోవడమే వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేనిపోనీ సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే అమెరికాకు చెందిన బ్రియాన్ హెర్నాండెజ్. తన ప్రియురాలితో గొడవపడి కోపంతో చేసిన దారుణమైన పనికి ఊచలెక్కపెడుతున్నాడు. అసలేం జరగిందంటే...అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ టెక్సాస్‌లోని డల్లాస్ మ్యూజియం ఆప్ ఆర్ట్‌లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువ చేసే గొప్ప గొప్ప కళాఖండాలుంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటిని ధ్వంసం చేశాడు. బ్రియాన్ మ్యూజియంలో నష్ట పరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు. దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పోలీసులు విచారణలో అతన్ని ఎందుకిలా చేశావని ప్రశ్నించిగా...అతను చెప్పింది విని ఒక్కసారిగి షాక్ అయ్యిపోయారు. గర్లఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని ఇటీవలే తనతో గొడపడ్డానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడటంతో తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు. ఏదిఏమైన పిచ్చివ్యామోహంతోనూ, కోపంతోనూ చేసే పనులు మిగిల్చే నష్టం ఊహకందనంతా ఘోరంగా ఉంటుంది. (చదవండి: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ) -
నేర్చుకుంటున్నాను.. వస్తుంది... అని మాత్రమే అనుకోవాలి!
3డి డిజిటల్ ఆర్ట్ అనేది యాంత్రిక పనికాదు. మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే మ్యాజిక్. ఆ మ్యాజిక్ మ్యూజిక్‌పై పట్టు ఉన్న ఆర్టిస్ట్ ఖ్యాతి త్రెహాన్. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఆమె సృజనకు ఖ్యాతి వచ్చింది... త్రీడిలో అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించిన ఖ్యాతి...ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. దిల్లీకి చెందిన ఖ్యాతికి కథలు వింటున్నప్పుడో, సినిమాలు చూస్తున్నప్పుడో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం ఇష్టం. ఆ ప్రపంచంలో ఎన్నెన్నో అందమైన దృశ్యాలు ఉంటాయి. అయితే ఆ అలవాటు వృథా పోలేదు. తనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అహ్మదాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్’లో చదువుకుంటున్న రోజుల్లో విజువల్ వరల్డ్‌కు ఉన్న పవర్ ఏమిటో తెలుసుకుంది. అందమైన, అద్భుతమైన, అనూహ్యమైన ఊహాప్రపంచం అయినప్పటికీ.. దానికి కావాల్సిన వనరు వాస్తవ జీవితంలో నుంచే వస్తుంది అని నమ్ముతుంది ఖ్యాతి. ‘ప్రతి పనిలో మనదైన క్రియేటివ్ సిగ్నేచర్, స్టైల్ ఉండాలి’ అంటున్న ఖ్యాతి ఒక ప్రాజెక్ట్ ముందుకు రాగానే పని ప్రారంభించడం అని కాకుండా రకరకాలుగా రిసెర్చ్ చేసి, ఆ సారాంశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని పనిలోకి దిగుతుంది. ప్రతి కొత్త ప్రాజెక్ట్ తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశంగా భావించి కష్టపడుతుంది. సృజన ఆవిష్కరణకు ఖ్యాతి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతుంది? ఆమె మాటల్లోనే చెప్పాలంటే... ‘ఎవ్రీ థింగ్ అండ్ ఎవ్రీ వన్’ అలా శూన్యంలోకి చూస్తున్నప్పుడు ఆకాశంలో ఈదుతూ వెళ్లే పక్షి కావచ్చు. నుదుటిని సుతారంగా తాకే గాలిరాగం కావచ్చు... ఏదైనా సరే... ఎప్పుడైనా సరే. అందుకే ఖ్యాతి ఆర్ట్‌వర్క్‌లో మనుషులతో పాటు ప్రకృతి కనిపిస్తుంది. ‘నేర్చుకున్నాం. వచ్చేసింది... అనే భావన మంచిది కాదు. నేర్చుకుంటున్నాను. వస్తుంది...అని మాత్రమే అనుకోవాలి. మన మేథోమధనంలో నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు వస్తుంటాయి’ అని చెబుతున్న ఖ్యాతిలో ఒక ఆలోచన తళుక్కున మెరవగానే, ఆ ఐడియా ఫాబ్రిక్ బ్లూప్రింట్ టెక్చర్ లైబ్రరీ నుంచి ఇమేజ్‌గా మారవచ్చు. లేదా ఎడోబ్ సూట్, సినిమా 4డీ, ఫిగ్మాలలో అబ్బురపరిచే కళారూపం కావచ్చు. ఖ్యాతికి ప్రపంచవ్యాప్తంగా బోలెడుమంది అభిమానులు ఉన్నారు. ఆమె క్లయింట్స్ జాబితాలో శాంసంగ్, యాపిల్, అడోబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్... ఇలా బోలెడు పేరున్న కంపెనీలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ మరో ఘనత ఏమిటంటే... 94వ అకాడమీ (ఆస్కార్)అవార్డ్‌ల వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది ఆర్టిస్ట్‌లను ఆహ్వానించారు. అందులో ఖ్యాతి కూడా ఒకరు. ‘సినిమా మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది?’ అనే ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని ఆస్కార్ స్టాచ్యూకు ప్రతీకాత్మకరూపాన్ని సృష్టించాలి. ఖ్యాతి సృష్టించిన దానికి మంచి పేరు వచ్చింది. కళాప్రపంచంలో ఒక మాట వినిపిస్తుంటుంది. ‘నేను ఆలోచించిందే చిత్రిస్తాను. చూసింది కాదు’ కానీ 29 సంవత్సరాల ఖ్యాతీ త్రీడి ఆర్ట్ చూస్తే...తాను చూసిన దృశ్యాలతో పాటు, ఆలోచనలూ కనిపిస్తాయి. చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి? -
ఆద్యకళలకూ ఓ ఆశ్రయం!
ఆది కళా రూపాలు ఆదిమ చరిత్రకు చిరు నామాలు. అవి మనం నడిచొచ్చిన దారులు. తరతరాల రాతలను, మాటలను, పాటలను, పది రకాల వస్తువులను పదిల పర్చుకోవాల్సిన చారిత్రక బాధ్యత మన పైన ఉన్నది. చాలా వరకు ఆద్య (ఆది) కళా రూపాలు అంతరించిపోతున్నాయి. మిగిలిన వాటినైనా కాపాడుకోవాలి కదా! ఈటెలు, కొత్త–పాత రాతియుగాల పని ముట్లు గత కాలపు మానవుల జయాపజయా లను రికార్డు చేసినట్లే... అలనాటì రాతి పలకలు, రాత పనిముట్లు, ఇప్పటికీ కొనసాగుతున్న అరుదైన ఇంపుసొంపైన వాద్య పరికరాలు, మానవ జీవిత భిన్న కోణాలకు ప్రతిబింబాలు. ఈ నేలపై జీవించిన వీరుల పరాక్రమాలు, సామాన్యుల వీరోచిత గాథలకు ఈ ఆద్యకళలు అద్దం పడతాయి. అనేక ఉద్యమాలు విజయ వంతం కావడానికి ఈ ఆద్యకళలు వాహికలుగా నిలిచిన సంగతీ మరువరాదు. బొమ్మల పటం ద్వారానో... గోండు, కోయ, చెంచు, దాసరి, జంగం, బైండ్ల, బైరా గుల రాగి రేకులు, తాళపత్రాలపై రాతల ద్వారా మన ఉన్నతికి పునాదులైన పూర్వీకుల సంస్కృతి, టెక్నాలజీలు తెలుస్తాయి. నాటి బొమ్మల పటాలు, తాళ పత్ర గ్రంథాలు, అరు దైన సంగీత వాద్యాలూ వేలాదిగా ఉన్నాయి. వీటిని దాచడానికి, ముందు తరాలకు చూపడా నికి ఇంత చోటు చూపాలి. పద్మశ్రీ మొగి లయ్యతో అంతరించి పోతుందని భయపడు తున్న 12 మెట్ల కిన్నెర వంటి ఎన్నో వాద్య పరికరాలు ముందు తరాలకు అందాలంటే అచ్చంగా వీటికోసం మ్యూజియాలు నిర్మించ వలసిన అవసరం ఉంది. భూమి లోపల నిక్షిప్తం అయిన వాటిని వెలికి తీసి చరిత్రను కాపాడుకోవడం ఒక అంశం అయితే... మన కళ్ల ముందు సజీవంగా వివిధ రూపాల్లో... ఐసీయూలో ఉన్న అద్భుత కళా ఖండాలను అక్కున చేర్చుకోవడం అన్నింటి కంటే ముఖ్యమైన అంశం. సంగీత సాహిత్యా లను ఆస్వాదించే హృదయాలు ఉన్నట్టే... వాటి మూల రూపాలను ఒడిసి పట్టుకుని ముందు తరాలకు అందించే ముందుచూపున్న మనసులు అవసరం. ఈ కళాఖండాలు అటువంటి మనసున్న మారాజుల కోసం వేచి ఉన్నాయి. అసలు, సిసలైన మూలవాసుల, ఆది వాసుల, ఆది మానవుల ఉనికిని సగర్వంగా చాటి చెప్పే కళాకారులను, కళారూపాలను, సాహిత్య సారాలను పాలకులు పట్టించుకోవాలి. ఈ కళారూపాలను ఆదరించడం, అక్కున చేర్చుకోవడం అంటే అట్టడుగు వర్గాల, అశేష ప్రజారాశుల నిజ జీవిత గాథలను, చారిత్రక అనవాళ్లను గుర్తించినట్లే. వాటికి సామాజిక గౌరవాన్ని ఇచ్చినట్లే. ఇలాంటి సంగీత, సాహిత్య చారిత్రక ఆనవాళ్లను భద్రపర్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చొరవ తీసుకోవాలి. భిన్న సాంస్కృతిక, సామాజిక, సామూహిక చైతన్య కేంద్రం హైదరాబాద్. ఇక్కడ పరిమిత కాలానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లతో ఓ మ్యూజియం ఉంది. కానీ అనంతానంత యుగాల మానవ జీవిత పరిణామ క్రమ ప్రతి బింబాలైన అశేషజన సమూహాల ఆట, పాట, మాట, కళాసంస్కృతుల చైతన్యమూటలైన బొమ్మలు, పటాలు, రాగిరేకుల, జంట డోళ్ల, కిన్నెర, కొమ్ముబూరల, డప్పుల వంటి వాటికి ఆలవాలమైన మ్యూజియం లేదు. అటువంటి సంగ్రహాలయ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు ఎలా ఉన్నా సినీ, మార్కెట్ శక్తులు మాత్రం ఆద్య కళారూపాలను అత్యంత చాకచక్యంగా వాడు కోవటం విశేషం. గోర్ల బుచ్చన్న వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 87909 99116 -
శభాష్ బాబు.. ఆయన చిత్రం సజీవ దృశ్యం
సిరిసిల్ల కల్చరల్: అతను చిత్రం గీస్తే సజీవ దృశ్యం అన్న భావన కలుగుతుంది. అత్యంత అలవోకగా గీసే రేఖాచిత్రాల్లో సైతం అరుదైన సృజనాత్మకతను ప్రదర్శించే నైపుణ్యం ఆయనకే సొంతం. పుస్తకాల ముఖచిత్రాలు, లోపల సందర్భానుసారం వచ్చే బొమ్మలు, వివిధస్థాయిల్లోని రాజకీయ నాయకుల చిత్రపటాలు అతని చేతిలో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంటాయి. పసి వయసు నుంచే పెంచుకున్న అభిరుచి అంచెలంచెలుగా పరిణామం చెంది చెయ్యి తిరిగిన కళాకారుడిగా ఎదిగిన ఆయనే దుండ్రపెల్లి బాబు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని గీసి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టిని ఆకర్షించాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యం మా ఊరులో ఉన్న సొంత ఇల్లు, కొంత పొలం, మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం కారణంగా మునిగిపోయింది. చిన్న కుటుంబం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. నా కళే నా పెట్టుబడి. చేతిలో ఉన్న కళనే పూర్తిగా నమ్ముకున్నా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న. ఎప్పటికైనా సరే అంతర్జాతీయ స్థాయి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నది నా సంకల్పం. – దుండ్రపల్లి బాబు పేద కుటుంబం నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన దుండ్రపెల్లి లక్ష్మి, దుర్గయ్య రెండోసంతానంగా 1988లో జన్మించా డు బాబు. పేద వ్యవసాయ కుటుంబం. ఆర్థిక వనరుల లేమితో చొప్పదండిలోని తన మేనమామ దగ్గర పెరిగా డు.పదోతరగతి వరకు మంథనిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో, రుక్మాపూర్‌లో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి, జెఎన్టీయూ నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా తనకు ఎంతో ఇష్టమైన బ్యాచ్‌లర్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరిపోయాడు. 2014లో బీఎఫ్ఏ పూర్తి చేసి ఆరో అనే కంపెనీలో ఇలస్ట్రేటర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. మరింత నైపుణ్యాల కోసం ఎంఎఫ్‌ఏలో చేరాడు. ఇదీ.. బాబు ప్రతిభ 2016లో ఎంఎఫ్ఏ పూర్తయ్యాక పుస్తకాలకు వేసే ముఖపత్రాలకు అందమైన ఇలస్ట్రేషన్ ఇవ్వడంతో పేరు తెచ్చుకున్నాడు. ఓ ప్రవాస భారతీయుడి కోరిక మేరకు ‘చిన్ననాటి ఆటలు. జ్ఞాపకాల మూటలు’ అనే పుస్తకానికి సుమారు 100 చిత్రాలు గీసి ఇచ్చారు. కందుకూరి రాము, శివజాస్తితో కలిసి చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇచ్చింది. రామాయణం, మహాభారతం సహా అంతర్జాతీయస్థాయి పుస్తకాలకు వేసిన చిత్రాలు ఆదరణ పొందాయి. భారతీయ నేపథ్య వస్త్రాలంకరణతో రూపొందించిన రాజులు, చక్రవర్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నేతలు సుమారు 500 క్యారెక్టర్ల చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. మరో వందచిత్రాల రూపకల్పన కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్రాలకు సంబంధించిన స్టోరీబోర్డు వర్క్‌లో బిజీగా ఉంటున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రానువాద స్క్రిప్ట్‌తో చిత్రాలకు అక్కడికక్కడే గీసి ఇవ్వడం మనోడి ప్రత్యేకత. -
బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్ భారత దేశం తుది వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, పౌరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అందరికంటే భిన్నంగా ఇక్కడొక వ్యకి తన కళా నైపుణ్యంతో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కి నివాళులర్పించాడు. ఈ మేరకు కళాకారుడు శశి అడ్కర్ అనే వ్యక్తి రావి ఆకుపై పై బిపిన్ రావత్ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. అంతేకాదు ఆ కళాకారుడు ఆకు కళను చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి 'తేరి మిట్టి' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర మంత్రి 'నీ కళాకృతికి సెల్యూట్" అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలో నెటిజన్లు కూడా స్పందిస్తూ... 'సీడీఎస్ జనరల్ శ్రీ బిపిన్ సింగ్ రావత్‌కు సెల్యూట్ ' అని ఒకరు, 'అల్విదా జనరల్ మీరు మా హృదయాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు' అని మరొకరు ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. ఈ మేరకు సీడిఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ భారత సైన్యం ఇక వెబ్ లింక్‌ని కూడా జారీ చేసింది. (చదవండి: "సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!) Salute! pic.twitter.com/BVb8grqpgX — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2021 -
ఊహలకు అందని రూపాలు
టీ కప్పులు, మగ్‌లను అందమైన కళారూపాలుగా మార్చుతూ, ఫంక్షనల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మార్కెటింగ్ చేస్తూ, ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారింది శ్రీనియా చౌదరి. ఈ కళారూపం అంతగా సక్సెస్ కాదన్న వారి నోళ్లను మూయిస్తూ, ఛాలెంజ్‌గా తీసుకొని మరీ ఈ కళలో రాణిస్తోంది. ఢిల్లీలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన కళారూపాలను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఎవరి ఊహకూ అందని కళారూపాలు శ్రీనియా చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. పదేళ్లుగా సిరామిక్ మెటీరియల్‌తో మగ్‌లను తయారుచేస్తూ, వాటినే అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. యూరప్‌లోని లాట్వియాలో సిరామిక్స్ బియన్నాలే, మార్క్ రోత్కో మ్యూజియంలలోనూ తన కళారూపాలు స్థానాన్ని పొందాయంటే శ్రీనియా కృషి, పట్టుదల ఎంత బలమైనవో ఇట్టే తెలిసిపోతాయి. సాధనమున సమకూరిన కళ స్వతహాగా చిత్రకారిణి అయిన శ్రీనియా ఈ కళలో రాణించడానికి మట్టిపైనే చిత్రాలు వేసేది. ఆ తర్వాత మట్టితో కళారూపాలు తయారుచేసి వాటిపైనే చిత్రీకరించేది. తన ప్రతి చిత్రంలోనూ సమాజం గురించిన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ‘సెరామిక్స్‌తో రకరకాల కళాత్మక రూపాలను తయారుచేయడం అనేది శతాబ్దాలుగా ఉంది. కానీ, నేను ప్రత్యేకంగా ఎంచుకున్న మగ్గులతో డిజైన్లు, మగ్గులపై పెయింటింగ్.. ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అనుసరించే నేను నా దైన సృజనను జోడించాను. అభ్యాసనకు మట్టితోనే కళారూపాలను తీర్చడంలో కొన్నాళ్లు నిమగ్నమయ్యాను. ఎంతోమందిని అవి ఆకట్టుకున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాను. నెలల సమయం.. కోవిడ్ టైమ్‌లోనూ నా ఆలోచనా విధానాన్ని నలుగురితో పంచుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి వెబ్‌షాప్‌ను ప్రారంభించాను. కొన్ని వారాల పాటు వెబ్‌షాప్‌ను నిర్వహించాను. వ్యూవర్స్‌లో మంచి ఆసక్తి కనపడింది. కానీ, నిత్యసాధనతోనే ఈ కళలో రాణించగలరు. ఏ కాలమైనా సరే యంత్రంతో తయారుచేసిన వస్తువుకన్నా, పూర్తిగా చేతితో తయారుచేసిన వస్తువు ఖరీదు ఎక్కువ. అందుకే, సిరామిక్‌తో మగ్ తయారీ నుంచి వాటి రూపాల్లో మార్పులతో పాటు.. ఒక కళాఖండంగా తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నేను అనుకున్న కళారూపం స్కెచ్ వేసుకుంటాను. అది సంతృప్తిగా అనిపించాక దానిని వాస్తవ రూపానికి తీసుకు రావడానికి నెలల సమయం పడుతుంది. ఒక్కో సమయంలో అయితే ఒక చిన్న పీస్‌ను మాత్రమే తయారు చేస్తుంటాను. ఒకదానితో మరోటి అస్సలు పోలికే ఉండదు. దేనికది ప్రత్యేకం. కానీ, అన్ని కళారూపాలకు మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్ వేదిక ద్వారా నా కళారూపాలను నేనే మార్కెటింగ్ చేస్తుంటాను. విదేశీయులు కూడా ఈ ఫంక్షనల్ ఆర్ట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. వ్యాపారిగా మారినప్పటికీ ప్రతీ కళారూపాన్ని నేనే స్వయంగా సృష్టిస్తాను. ఎవరి సాయమూ తీసుకోను. అచ్చులు పోయడం అనేది నా ఆలోచనకు పూర్తి విరుద్ధం. అందుకే ప్రతీ కళాఖండం విభిన్నంగా ఉంటుంది’ అని వివరిస్తారు శ్రీనియా. -
లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!
మనం చాలా రకాలుగా చిత్రాలను గీయడం చూశాం. కానీ జుట్టుతో చిత్రాలను రూపొందించడం తెలుసా? అది కూడా యూకే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అసలు ఎవరు ఈ చిత్రాన్ని రూపొందించారు ఎక్కడ ఏంటో చూద్దాం రండి. (చదవండి: ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి) వివరాల్లోకెళ్లితే.....కోవిడ్ 19 విపత్కర సమయాల్లో తనదైన వ్యూహంతో దేశాన్ని సమర్ధవంతంగా నడిపించిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం డేవినియా ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మేరకు సోమర్సెట్లో సెలూన్‌ను నడుపుతున్న డావినియా సెలూన్లో సేకరించిన జుట్టు వ్యర్థాలతో 5 అడుగుల బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అయితే ఆమె ఈ పనిని కేవలం రెండు రోజుల్లో పూర్తి చేసింది. ఈ మేరకు డేవినియా మాట్లాడుతూ.... లాక్డౌన్లలో ప్రజల జుట్టు ఎంత పెరిగిందో చెప్పేందుకు ఈ చిత్రం ఒకరకరంగా దోహదపడుతుంది. అంతేకాదు ఈ లాక్డౌన్ వేళ సెలున్ల ప్రాముఖ్యతను ప్రజలందరు గుర్తించారు. ఈ కుడ్యచిత్రాన్ని బోరిస్ వ్యక్తిగతంగా వీక్షించాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది. (చదవండి: కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్) -
ఐదేళ్ల పాప.. పేద్ద పెయింటింగ్!
న్యూఢిల్లీ: పిట్ట కొంచెం కుతం ఘనం అంటే ఇదేనేమో. ఇలా ఎందుకు అన్నానంటే కొంత మంది పిల్లలు చిన్న వయసులోనే వాళ్ల అసాధారణ ప్రతిభతో భలే ఆకట్టుకుంటారు. అచ్చం అలానే ఇక్కడ ఒక ఐదేళ్ల పాప తన పెయింటింగ్ స్కిల్‌తో భలే ఆకర్షిస్తోంది. ఎంత అద్భుతంగా పేయింటింగ్స్ వేస్తుందంటే మనం చూపు కూడా తిప్పకుండా అలా చూస్తూనే ఉండిపోతాం. అయితే ఆ పాప పెద్ద కాన్వాస్‌పై అత్యద్భుతంగా పెయింటింగ్స్ వేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు) పైగా ఆ వీడియో మొదలు పెట్టినప్పుడు ఒకలా తర్వాత పూర్తైయ్యాక మరింత అద్భుతమైన పెయింటింగ్‌లా ఆవిష్కృతమవుతుంది. దీంతో నెటిజన్లు చాలామంది పిల్లలు ఏదో ఒక దానిపై మూడు నిమిషాలకు మించి దృష్టి పెట్టలేరు కానీ ఆమె అలా నిర్విరామంగా అంతసేపు అంతా పెద్ద పెయింటింగ్ వేయడం అత్యద్భుతం అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ) 5-year-old artist doing her thing.. 👌 pic.twitter.com/R4g4idMMmA — Buitengebieden (@buitengebieden_) October 25, 2021 -
డబ్బులు లేక ఆ రోజు చేసిన పని.. నేడు ట్రెండ్‌గా మారింది
జూలియా సయూద్ సిరియాకు చెందిన యువతి. ఆమెకు పెయింటింగ్స్ అంటే ప్రాణం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జూలియా తన ఇంటిని వదిలి బయటకు రావల్సివచ్చింది. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ కిట్‌ను అక్కడే వదిలేసింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందంటే.. తనకు నచ్చిన పెయింటింగ్ వేయడం కోసం కలర్స్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. తనకు నచ్చిన పెయింటింగ్స్‌ను ఆపడం ఇష్టం లేని ఆ యువతి.. కలర్స్ లేకపోయనా తన కళను కొనసాగించాలనుకుంది. అందుకోసం ఆమె ఓ కొత్త ఐడియా ఆలోచించింది. అదే.. కలర్స్ బదులుగా మట్టిని ఉపయోగించి పెయింటింగ్స్‌ను వేయాలని నిర్ణయించుకుంది. అలా మొదలు పెట్టిన జూలియా ప్రస్తుతం ఆ మట్టి పెయింటింగ్స్ నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. అప్పుడు మట్టితో పెయింటింగ్స్ వేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందనుకున్నా. మొదట, నేను నా కలను కొనసాగించాలని ఆలోచనతో అలా మట్టితో మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు అప్పుడు వేరే మార్గం లేదు .. కానీ ఇప్పుడు కలర్స్ ఉన్నా కూడా మట్టితో పెయింటింగ్ వేయడమే నాకు నచ్చుతోందని తెలిపింది. మట్టితో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు తన వేసిన సాయిల్ పెయింటింగ్స్ ఆ ప్రాంతంలో ట్రెండ్‌గా మారడంతో పాటు ఆ పరిసరాల్లోని పిల్లలకు కూడా ఈ మట్టితో పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నారు. WATCH: Syrian artist Julia Saeed started painting with soil after she fled her home in Raqqa and could not afford to buy paint. Now she has made painting with soil her unique style pic.twitter.com/JsE64Imai5 — Reuters (@Reuters) October 10, 2021 -
వరుస పండగలు.. వింటేజ్ వేడుక
ఆషాఢమాసం... బోనాలు శ్రావణం... వరలక్ష్మీ వ్రతాలు వరుస పండగలు, వేడుకలు మనల్ని పలకరించబోతున్నాయి. ఇన్ని రోజులూ మహమ్మారి కారణంగా సందడికి దూరంగా ఉన్నా ఇక ముందు వేడుకలు కొత్తగా ముస్తాబు కానున్నాయి. యాభై ఏళ్ల కిందటి వింటేజ్ కళతో ఇప్పుడిక మెరిసిపోనున్నాయి. కొన్ని చీరకట్టులను చూస్తే ప్రసిద్ధ వ్యక్తుల పరిచయం అక్కర్లేకుండా కళ్ల ముందు మెదలుతారు. అలాంటి వారిలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాలీవుడ్ నటి రేఖ వంటి వారుంటారు. పెద్ద అంచు కంచి పట్టు చీరలైనా, రంగుల హంగులైనా, ఆభరణాల జిలుగులైనా, కేశాలంకరణ అయినా.. ఎటు కదిలినా ఆ అందం వారి ప్రత్యేకతను కళ్లకు కడుతుంది. ప్రసిద్ధ వ్యక్తులను తలపించేలా నేటి తరం అమ్మాయిల ఆహార్యం ఉంటే ఒక వింటేజ్ అట్రాక్షన్‌తో ఇట్టే ఆకట్టుకుంటారు. ఎప్పటికీ ఉండిపోవాలనే.. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి.. ఇలా తరతరాలకు ఈ గొప్పతనం అందాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికీ ఆ కళ నిలిచిపోయే విధంగా డిజైన్ చేసిన చీరలు ఇవి. ప్యూర్ పట్టుతో మగ్గం మీద నేసిన చీరలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా కంచిపట్టు అనగానే అందరికీ తెలిసిన రంగులు ఎరుపు, పసుపు, గోల్డ్ టిష్యూ. కానీ, చాలా అరుదైన రంగుల చీరలను ఎంచుకొని యాభై ఏళ్ల కిందటి లుక్ వచ్చేలా చేనేతకారులతో డిజైన్ చేసిన చీరలు ఇవి. నటి రేఖను తలచుకోగానే ఆమె కంజీవరం చీరలో గ్రాండ్‌గా కనిపిస్తారు. దక్షిణభారత అందాన్ని ప్రపంచ ప్రసిద్ధి చేశారు. ఈ థీమ్‌ని బేస్‌గా చేసుకొని రంగులను ఎంపిక చేసి, ప్రత్యేకంగా రూపొందించిన చీరలు ఇవి. నిన్నటి తరం నుంచి నేడు, అలాగే రేపటి తరానికి కూడా ఈ కళను తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన కలెక్షన్ ఇది. – భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
అద్భుతం: గుండుసూదిపై ఫ్లెమింగో
సాక్షి, యలమంచిలి రూరల్ (విశాఖపట్నం): ఏటికొప్పాక హస్తకళాకారుడు మరో అద్భుత కళాఖండం ఆవిష్కరించారు. ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎస్.చిన్నయాచారి గుండుసూదిపై ఫ్లెమింగో పక్షి బొమ్మను రూపొందించారు. దీన్ని తయారు చేసేందుకు రాగి తీగలు, చెక్క ఉపయోగించి మూడు రోజులపాటు శ్రమించినట్లు ఆయన వివరించారు. పొడవు 4.80, వెడల్పు 1.75 ఎంఎం సైజులో తయారు చేసిన పక్షి రూపాన్ని పుటాకార దర్పణంతో వీక్షించేలా తయారు చేశారు. వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దీన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఏటికొప్పాక కళాకారులు చిన్నయాచారిని అభినందించారు. చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..! -
నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ
సాక్షి, సిద్దిపేట: కళ కలకాలం నిలవాలి.. కాలగర్భంలో కలిసిపోకూడదనే మూడు కుటుంబాల సంకల్పంతో 450 ఏళ్ల నేపథ్యం కలిగిన నకాశీ చిత్రకళను సజీవంగా ఉంచుతోంది. భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ ఉన్న ఈ అపురూప నకాశీ చిత్రకళే టీవీ, సినిమా మాధ్యమాల్లేని ఆ రోజుల్లో ప్రజలకు వినోదాన్ని, విద్యను, కాలక్షేపాన్ని అందించేది. రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన కుల పురాణాలు, జానపదాలు, చంద్రహాసుడు, గొల్ల కేతమ్మ, ఎల్లమ్మ, కాటమరాజు తదితర సబ్బండ వర్ణాల అనుబంధ కథలను చెప్పేందుకు కాకిపడగలు, సాధనాశూరులు వంటి ఉపకులాలు ఉండేవి. వీరు బొమ్మలపటాన్ని ప్రదర్శిస్తూ, అందులోని బొమ్మలకు అనుగుణంగా కథను చెప్పేవారు. ఈ పటంపై కథలకనుగుణమైన బొమ్మలను చిత్రించేవారే నకాశీలు. తెలంగాణలోని వేములవాడ, చేర్యాల ప్రాంతాల్లో 300 వరకు కుటుంబాలు ఈ చిత్రకళపైనే ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం దీనికి ఆధ్యుడైన ధనాలకోట వెంకటరామయ్య కుటుంబంలోని నాలుగో తరం.. హైదరాబాద్‌లోనూ, గణేశ్, మల్లేశం కుటుంబాలు చేర్యాలలోనూ అంతర్థాన దశలో ఉన్న ఈ కళకు ఊపిరిలూదుతున్నాయి. ఈ చిత్రకళకు చేర్యాల పుట్టినిల్లైనందున వీటిని చేర్యాల పెయింటింగ్స్గానూ వ్యవహరిస్తారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 1625 నాటి తొలి నకాశీ పటం ఉందని అంటారు. నకాశీ.. ప్రకృతి చిత్రం ఖద్దరు లేదా చేనేత ముతక గుడ్డ ఈ చిత్రకళకు కాన్వాస్. ఇది గజం వెడల్పు.. కథలోని ఘట్టాలను బట్టి 40 – 50 గజాల పొడవు ఉంటుంది. గుడ్డకు తొలుత వివిధ చెట్ల నుంచి సేకరించిన జిగురు పదార్థాలు, గంజి, చెక్కపొట్టు, సుద్ద పొడి, చింతగింజల పిండిని కలిపి పట్టిస్తారు. ఆరాక గుడ్డ దళసరిగా మారి బొమ్మలు గీయడానికి అనువుగా మారుతుంది. ఆకులు, పువ్వులు, బెరడు, పసర్లు, రంగురాళ్లు, గింజలు, గవ్వలు తదితర మిశ్రమాల నుంచి కావాల్సిన రంగులను రాబట్టి బొమ్మలకు అద్దుతారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రంగులనే వాడుతున్నారు. మేక, ఉడుత తోకల నుంచి సేకరించిన వెంట్రుకలతో బ్రష్‌లు తయారుచేస్తారు. వీటితోనే ఇతిహాసాలు, పురాణాల్లోని వివిధ పాత్రధారుల బొమ్మలకు రూపాన్నిస్తారు. కథలు చెప్పడం ద్వారా పొట్టపోసుకునే కాకిపడగల వారు దగ్గరుండి తమకు కావాల్సిన బొమ్మలను నకాశీల చేత గీయించుకునే వారు. ఈ రూపేణా వచ్చే ఆదాయమే నకాశీల జీవనాధారం. కథకులు తాము చెప్పబోయే కథకు సంబంధించిన చిత్రపటాన్ని గుండ్రంగా చుట్టి.. కథను చెబుతూ తాము చెప్పే సన్నివేశానికి సంబంధించిన దృశ్యం వచ్చేలా దానిని తిప్పుతుంటారు. అందువల్లే దీన్ని స్క్రోల్ పెయింటింగ్ అంటారు. ఈ బొమ్మలకద్దే రంగులు ప్రకాశవంతంగా ఉండి కళ్లలో నిలిచిపోతాయి. అదంతా గత వైభవమే.. అప్పట్లో కథను బట్టి ఒక్కో చిత్రపటం తయారీకి నకాశీలు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకునేవారు. ఆదరణ బాగున్న రోజుల్లో ఈ మొత్తం పది వేల రూపాయల వరకూ ఉండేది. ప్రస్తుతం పటం చిత్రించడానికి గజానికి రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పుడు స్క్రోల్ పెయింటింగ్‌కు ఆదరణ తగ్గిపోవడంతో మాస్క్‌ల తయారీపై దృష్టిపెట్టారు. రాజు, రైతు, గ్రామీణ మహిళలు, కుల–మత ఆచారాలు, గ్రామ దేవతలు, జంతువులు, సంప్రదాయాలను ప్రతిబింబించే ముఖచిత్రాలను తీర్చిదిద్దుతూ ఆన్లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జనంలోకి తీసుకెళ్లే యత్నం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నకాశీ చిత్రాలతో ఫేస్మాస్క్లనూ తయారుచేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మొబైల్ ఫోన్ కవర్లు, బ్యాగులు, టీషర్టులు, ప్లాస్టిక్ ప్లేట్లు, పెన్నులు, కీచైన్లు, టీ, కాఫీ కప్పులు, కరోనా ఫేస్ మాస్కులు, టిష్యూ పేపర్లకు ఉపయోగించే డబ్బాలపై నకాశీ చిత్రాలను చిత్రిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చెన్నై, కోల్‌కతాతో పాటు విదేశాల నుంచి అడపాదడపా ఆర్డర్లు వస్తున్నాయని కళాకారులు చెబుతున్నారు. టూరిజం శాఖ స్టాల్స్‌లో నకాశీ వస్తువులను ఉంచుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పట్టణాల్లోని స్టార్ హోటళ్లలో, మీటింగ్ హాళ్లలో అలంకరణ కోసం నకాశీ వాల్ పెయింటింగ్‌లను గీయించుకుంటున్నారు. కాగా, తెలంగాణ వారసత్వ సంపదైన నకాశీ కళను పరిరక్షించే లక్ష్యంతో చేర్యాలలో 2018లో నకాశీ కళా క్షేత్రాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక మహిళలకు నెలకు రూ.7,500 స్టైఫండ్నిస్తూ రెండు నెలల శిక్షణనిస్తున్నారు. నాడు.. కాకతీయుల చివరి కాలంలో, నవాబుల హయాంలో నకాశీ చిత్రకళ రాచ మర్యాదలందుకుంది. పురాణ గాథలు, తెలంగాణ ప్రజల జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే నకాశీ స్క్రోల్ పెయింటింగ్స్‌ను రాజమహళ్లలో అలంకరణగా పెట్టుకునేవారు. తాము తయారుచేసే రాజులు, రాక్షసులు, జంతువుల వంటి ముఖాలతో కూడిన మాస్క్‌లను కాకతీయ రాజులు, నవాబులు ఉత్సవాలప్పుడు సైనికుల చేత ధరింపచేసి.. ఆనందించేవారని నకాశీలు చెబుతారు. నేడు.. నకాశీ చిత్రం రూపుమార్చుకుంది. హోటళ్లు, ఇళ్లలో వాల్పెయింట్గా వేలాడుతోంది. స్క్రోల్ పెయింటింగ్ కనుమరుగైపోగా, జంతువులు, మనుషుల ఆకృతుల్లోని ముఖమాస్కులు వంటివి మాత్రం అరకొర ఆదరణ పొందుతున్నాయి. జన బాహుళ్యంలోకి తమ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు.. కోవిడ్ నివారణకు వాడే ఫేస్మాస్క్పైనా నకాశీ బొమ్మల్ని తళుక్కుమనిపిస్తున్నారు చిత్రకారులు. అయినా అంతంత ఆదరణతో ఈ కళ మిణుకుమిణుకుమంటోంది. ఖ్యాతి ఖండాంతరాలు దాటినా.. మా ఇంటి పక్కనుండే ధనాలకోట చంద్రయ్య గారి వద్ద ఈ కళ నేర్చుకున్నాను. నకాశీ చిత్రాల ఖ్యాతిని మేం ఖండాంతరాలు దాటించినా.. పేదరికంతో ఇంటి గడప దాటలేకపోతున్నాం. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా చిత్రాలు గీస్తున్నా.. ఆదరణ అంతం తగానే ఉంది. ప్రభుత్వం కళాకారులకు ఆర్థికసాయంచేస్తే నకాశీ కళ మరింత ఖ్యాతిని సాధిస్తుంది. – మల్లేశం, నకాశీ చిత్రకారుడు, చేర్యాల కళపై మక్కువతో.. మాది సిద్దిపేట జిల్లా చేర్యాల. పైనార్ట్స్లో డిగ్రీ పూర్తి చేశాను. నకాశీ కళపై ఉన్న మక్కువతో మా కుటుంబాలన్నీ దీని మీదే ఆధారపడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా మేం వేసిన చిత్రాలు, మాస్క్‌లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఈ రంగంలో చేస్తున్న కృషిని గుర్తించి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డు కూడా అందచేశారు. – ధనాలకోట సాయికిరణ్, నకాశీ చిత్రకారుడు, హైదరాబాద్ చెప్పడానికేం లేదు.. చేర్యాలలో ఇరుకుదార్ల రోడ్డులోని ఓ మట్టి గోడల ఇంట్లో గణేశ్ దంపతులు తదేకదీక్షతో బొమ్మలకు రంగులద్దుతూ కనిపించారు. తన చేతిలోని నకాశీ బొమ్మకు రంగులద్దుతూనే.. ‘స్క్రోల్ పెయింటింగ్‌కు ఇప్పుడు ఆదరణ లేదు. అందుకే మాస్కులు, వాల్‌పెయింట్లు, కీ చెయిన్లు వంటి రూపాల్లోకి నకాశీ కళను మళ్లించాం. ఆన్‌లైన్‌లోనూ అమ్మకానికి ఉంచుతున్నాం. గత ఆగస్టులో దేబస్మిత అనే ఎన్ఆర్ఐ రూ.15వేలకు పల్లెపడుచు పెయింటింగ్ కొన్నారు. నెల క్రితం అమెరికాలో ఉంటున్న హనుమంతరావు రామాయణ బొమ్మల కోసం రూ.30 వేలకు ఆర్డర్ ఇచ్చారు. అంతకుమించి చెప్పడానికేమీ లేదు’ అని గణేశ్ వాపోయాడు. కాచిగూడ, లాలాగూడ రైల్వేస్టేషన్ ప్రాంగణాలలో కనిపించే స్క్రోల్ పెయింటింగ్స్ గణేశ్ చిత్రించినవే. చదవండి: వావ్.. సిద్దిపేట! విద్యార్ధులు వల విసరడం కూడా నేర్చుకోవాలి.. -
శశి సమయం
కవి సమయం అనే మాట ఉంది. సృజనాత్మకత జనియించే క్షణాలవి! అతిరా శశికి లాక్డౌన్ కాలమంతా ‘కళా సమయం’ అయింది. ఆ తీరిక వేళ ప్రాచీన మండల కళతో ఆమె తన భావాలకు రూపం ఇచ్చి రికార్డులు నెలకొల్పారు. అందుకే లాక్డౌన్లో ఆమె సద్వినియోగం చేసుకున్న సమయాన్ని శశి సమయం అనాలి. కరోనా మహమ్మారి కొన్నాళ్లపాటు అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇంటి గడప దాటి బయటకు రావడానికి వీల్లేని పరిస్థితుల్లో కొందరు విసుగ్గా రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపేస్తే, మరికొందరు తమలోని కళానైపుణ్యాలను వెలికితీసే పనిలో పడ్డారు. రెండవ కోవలోకి వస్తారు కేరళలోని మున్నార్‌లో ఉంటున్న అతిరా శశి. లాక్డౌన్ టైమ్‌లో ఆమె ఓ కొత్త ఆర్ట్ నేర్చుకోవడమే కాకుండా ఆ కళలో రాణించి ఏకంగా రికార్డులే తన ఖాతాలో వేసుకున్నారు! మండల ఆర్ట్ అనేది మన భారతీయ ప్రాచీన కళ. మండలం అంటే సంస్కృతంలో ‘వలయం’ అని అర్థం. వలయాకారంలోఉండే జామెట్రీ డిజైన్ ఈ ‘మండల ఆర్ట్’. మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాలలో వస్త్ర ముద్రణలో ఈ మండల కళను ఉపయోగిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలోనూ ఈ కళ ప్రాచుర్యంలో ఉంది. ఇందులో శశి రికార్డులు నెలకొల్పారు. మండల ఆర్ట్ ఆధారంగా అతిరా శశి పెయింట్స్ వేయడం సాధన చేశారు. భారతీయ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వర్ణమాల, పర్యావరణం, రాశీచక్ర గుర్తులు సహా వంద రకాల పెయింట్స్ వేసినందుకు 21 ఏళ్ల శశి పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్‌లలో నమోదయ్యింది. ఆమె వేసిన పెయింటింగ్స్‌లో గౌతమ బుద్ధ సంస్కృతి మూలాలు లోతుగా పాతుకుపోయిన టిబెట్, భూటాన్, మయన్మార్ వంటి ప్రదేశాలు సైతం ఉండటం విశేషం. అతిరా శశి ఈ కళను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ‘నా చిన్నతనంలో నాన్న ఉద్యోగరీత్యా మేము గుజరాత్లో ఉండేవాళ్లం. మొదట అక్కడే ఈ ఆర్ట్‌ను చూశాను. వాటిని పరిశీలించినప్పుడు దుపట్టా, చీరలపై ఈ ఆర్ట్‌ను అక్కడి కళాకారులు ఎంతో శ్రద్ధగా వేసినట్లుగా అనిపించింది. గుజరాత్ నుంచి మున్నార్ తిరిగి వచ్చాక కాలేజీ చదువులో పడిపోయాను. ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి మాత్రం మండల ఆర్ట్‌ని వేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. లాక్డౌన్ సమయంలో వంద రకాల భిన్నమైన మండల ఆర్ట్‌ను పెయింటింగ్‌గా రూపుకట్టడంతో అవార్డులు వరించాయి’’ అని శశి చెప్పారు. బిబిఎలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అతిరా శశిని చూస్తే ఒక విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ‘అందరికీ సమయం ఒకటే. దానిని సరిగ్గా ఉపయోగించుకున్నవారినే విజయం వరిస్తుంది’ అని.. -
శ్రీవారి సిరా చిత్రాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వరుడు వాహనాల మీద ఊరేగుతాడు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుంది. ఈ రెండు విశేషాలు ఒకసారే జరుగుతాయి. ఒకటి తిరుమల కొండ మీద.. మరొకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన. ఈ రెండు అద్భుతాలను తన కలంతో చిత్రీకరించాడు రాజమండ్రికి చెందిన మాధవ్ చిత్ర. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్ పూర్తి చేసి, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మాధవ్ దసరా సందర్భంగా సాక్షితో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. నా చిన్నతనం నుంచే అంటే ఏడవ ఏట నుంచే బొమ్మలు వేయటం ప్రారంభించాను. అమ్మ ఆ బొమ్మలు చూసి, వాటిమీద తారీకులు వేసి దాచుకోమని చెప్పేది. ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే బొమ్మలు వేసుకునేవాణ్ణి. మొదట్లో వాటర్ కలర్స్‌తో తరవాత పోస్టర్ కలర్స్‌తో వేయటం ప్రారంభించాను. రాజమండ్రిలో చిన్నజీయర్ స్వామి రామానుజ కూటం వారు రామాయణంలోని బాలకాండ మీద పోటీలు పెట్టారు. అందులోని ఏదో ఒక సంఘటనను బొమ్మగా వేయాలి. నేను అహల్య శాపవిమోచనం బొమ్మ వేశాను. దానికి నాకు మొదటి బహుమతి వచ్చింది. బహుమతితో పాటు నాలో ఉత్సాహం కూడా మొదలైంది అప్పటి నుంచి బొమ్మలు వేస్తూనే ఉన్నాను. జెల్ పెన్‌తో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో చార్కోల్తో బొమ్మలు వేయటం ప్రారంభించాను. వాటికి మంచి స్పందన వచ్చింది. ఖరగ్‌పూర్ లో రంగోలీ చాలా ప్రముఖంగా వేసేవారు. నేలమీద మనం అనుకున్న థీమ్‌తో రంగులతో ముగ్గులు వేయాలి. నేను మేఘ సందేశం కావ్యంలోని గంధర్వుడి సన్నివేశం వేశాను. ఆ తరవాత భారతీయ పౌరాణిక సన్నివేశాలు చాలా వేశాను. వాల్మీకి రచించిన రామాయణ మహేతిహాసాన్ని మొత్తం 30 బొమ్మలుగా వేశాను. అన్నీ ఏ 4 సైజులో నల్లరంగు జెల్ పెన్‌తో వేశాను. శివకల్యాణాన్ని దక్షప్రజాపతి దగ్గర నుంచి శివుని కల్యాణం వరకు 15 బొమ్మలుగా నలుపు జెల్ పెన్‌తో వేశాను. మా ఇంట్లో సంప్రదాయ వాతావరణం నా మీద ప్రభావం చూపిందేమో అనిపిస్తుంది. అలాగే టీవీలో ప్రవచనాలు విని వాటికి ప్రభావితమయ్యాను. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై 30 పాశురాలు ఎరుపు రంగు పెన్నుతో వేశాను. నవరాత్రుల నేపథ్యంలో... దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని 2013లో నవదుర్గలు వేశాను. 2019లో నవదుర్గలు రెండోసారి ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌తో వేశాను. ఇదంతా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అట్లతద్ది, మంగళ గౌరి వంటి చిన్న చిన్న పండుగల నుంచి అన్ని పండుగలకు బొమ్మలు వేయాలనుకుంటున్నాను. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి వాహనాలను పెన్సిల్ స్కెచ్‌లుగా వేసి, తిరుమల మ్యూజియమ్ వారికి సమర్పించాను. ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న బొమ్మలు మట్టితో చేస్తున్నాను. జాడీల ప్యాక్టరీ నుంచి మట్టి తెచ్చి ఈ బొమ్మలు చేస్తున్నాను. కృష్ణాష్టమికి పాడ్యమి నుంచి అష్టమి దాకా ఎనిమిది రకాల కృష్ణుడి బొమ్మలు వేశాను. చెన్నై నగరాన్ని నా బొమ్మలలో బంధించటానికి ప్రయత్నించాను. కపాలేశ్వర ఆలయం, పార్థసారథి దేవాలయం, లజ్ చర్చ్... ఇలా చెన్నైకి సంబంధించిన వాటిని గీశాను. సన్నిహితులు ఒకరు వటపత్రశాయి బొమ్మ వేసి, ఇవ్వమని అడిగారు. బొమ్మ పూర్తయ్యాక ఇవ్వాలనిపించలేదు. నా గదిలో పెట్టుకున్నాను. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
కళాత్మకం: స్టోన్.. కాంతి
కొంతమంది జీవనం కళకే అంకితమవుతుంది. కళ కోసమే జీవిస్తుంటారు. కొందరి కళలు అసలు వెలుగు చూడవు. కొందరు వినూత్నంగా తమ కళాభిరుచిని చాటుతుంటారు. వారిలో 45 ఏళ్ల బ్రిటన్ ఆర్టిస్ట్ బెకె స్టోన్‌ఫాక్స్ చేరుతుంది. పేపర్, దారాలతో చేసిన పోర్ట్రెయిట్లు చూసిన వెంటనే కాదు రోజంతా అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాంటి కళను సొంతంగా ఔపోసన పట్టింది స్టోన్ ఫాక్స్. ఇప్పటి వరకు మనం చూసిన చిత్తరువులు రోజులో ఎప్పుడూ ఒకే కాంతిలో దర్శనమిస్తుంటాయి. అయితే స్టోన్ ఫాక్స్ వేసిన పోర్ట్రెయిట్స్ మాత్రం పగటిపూట రంగులను మారుస్తాయి. త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రేరణ పొంది ఈ చిత్తరువులను రూపొందించడమే ఈ కళారూపాల ప్రత్యేకత. ఉదయం నుంచి పగటివేళకు సూర్యరశ్మి పెరుగుతున్నకొద్దీ ఈ పోర్ట్రయిట్ల రంగు పెరగడం లేదా తగ్గడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు మెరుస్తూ ఉంటుంది. సాయంకాలానికి కొన్నిసార్లు లేత రంగులు దర్శనమిస్తాయి. లండన్‌కి చెందిన 45 ఏళ్ల బెకె స్టోన్‌ఫాక్స్ కాగితపు రంగు క్లిప్పింగ్‌లను ఉపయోగించి కేవలం ఆకారాలను తయారు చేయడంలో ప్రత్యేకత చూపుతుంది. ఈ ఆర్ట్‌కి చిన్న చిన్న కాగితపు ముక్కలను, సిల్క్, కాటన్ దారాలను ఉపయోగిస్తారు. చాలా కాలంగా ఈ ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పటికీ, ఐదేళ్ళుగా ఈమె ప్రతిభ ప్రపంచ దృష్టిలో పడింది. ఈమె కళాసేకరణలు కల్పిత మానవ పాత్రల నుండి కుక్క, పిల్లి, గొరిల్లా, గుర్రం మొదలైన వివిధ జీవుల వరకు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడబోతున్నట్లుగా కనిపిస్తాయి. స్టోన్‌ఫాక్స్ ఎవరి ముఖమైనా మొత్తం ఆకారాన్ని కాగితాన్ని ఉపయోగిస్తూ దారాలతో అల్లి తయారు చేస్తుంది. కళతో ప్రపంచంలో దేనినైనా సృష్టించవచ్చు అంటుంది స్టోన్‌ఫాక్స్. ఇప్పటివరకు పురుషులు, జంతువుల బొమ్మలను మాత్రమే తయారుచేసిన స్టోన్ ఇప్పుడు మహిళల మనోభావాలను ప్రతిఫలింపజేసే చిత్తరువులను విభిన్నంగా సృష్టిస్తోంది. -
కాపాడే కళ
లక్షలు పెట్టి పెయింటింగ్స్ కొంటారు. ఇంట్లో నచ్చిన చోట వాటిని అలంకరించి మురిసిపోతారు. ఇంటికి వచ్చిన అతిథుల ప్రశంసలు పొందుతారు. అలాంటి కళాఖండాలు ఏ కాస్త దెబ్బతిన్నా కళను ఆరాధించే ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. ఇలాంటప్పుడు ఆ పెయింటింగ్స్‌కు పూర్వపు కళను తీసుకువచ్చేవారున్నారని తెలిస్తే ప్రాణం లేచి వచ్చినట్టే అనిపిస్తుంది. అలాంటి అరుదైన కళను ఔపోసన పట్టారు హైదరాబాద్ వాసి అర్చన. అద్భుతమైన ప్రాచీన పెయింటింగ్స్, కళాఖండాలను ఐదేళ్లుగా కాపాడుతున్నారు అర్చన దూబె. హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్ వారితో కలిసి హెరిటేజ్ డ్రైవ్స్‌లోనూ పాల్గొంటున్న అర్చన ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియాల్లోని అరుదైన పెయింటింగ్స్‌కు కూడా రక్షించే పనిలో ఉన్నారు. అపురూపమైన చిత్రరాజాలను కాపాడుకోవాలనే ఆకాంక్షలో అరుదైన కళను కెరియర్‌గా ఎంచుకున్న అర్చన నైపుణ్యాలు ఆమె మాటల్లోనే... ‘‘ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌గా కన్సర్వేషన్‌లో కెరీర్ 2015లో ప్రారంభించాను. చారిత్రక, పురాతన, సాంస్కృతిక సంపద మీద ఆసక్తి ఎక్కువ. ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించాలనే ఆలోచన కూడా అందుకే వచ్చిందేమో.. ఆ ఆసక్తితో నేషనల్ రిసెర్చ్ లేబరేటరీ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ (ఎన్ఆర్ఎల్సి)లో ప్రవేశం పొందాను. అక్కడ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాక మైసూర్‌లోని ఎన్ఆర్ఎల్సి ప్రాజెక్టుకు పంపించారు. ఆ సందర్భంగా సీనియర్ కన్సర్వేటర్స్‌తో కలిసి పనిచేశాను. అప్పుడే మ్యూరల్ పెయింటింగ్స్‌కి సంబంధించిన కన్సర్వేషన్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఆర్ట్ గ్యాలరీలు.. కళ తగ్గినవి, రంగు వెలిసిన పెయింటింగ్స్‌ని వాటి పూర్వపు వైభవం ఏ మాత్రం తగ్గకుండా చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో నేర్పు, ఓర్పు ఉండాలి. అలాగే, ఆ కళ పట్ల ఆపేక్ష ఉండాలి. మైసూర్‌లోని చామ్రాజ్య ఆర్ట్ గ్యాలరీలో కొంత కాలం పనిచేసిన అనుభవం కూడా కళను కాపాడేందుకు సహకరంచింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ ఆర్క్వైస్‌లో ఒక కన్సర్వేషన్ ప్రాజెక్టులో భాగం పంచుకున్నాను. ఫొటోలామ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు విభిన్న ప్రాంతాల్లో పని చేశాను. అలాగే కల్చరల్ ప్రాపర్టీ కన్సర్వేషన్పై జరిగిన పలు రకాల వర్క్‌షాప్స్, సెమినార్స్‌కు అటెండయ్యాను. అదే క్రమంలో త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీ, జూలో ఉన్న రాజా రవివర్మ పెయింటింగ్స్ స్థితిగతులపై ఒక డాక్యుమెంట్ తయారు చేశాను. కలెక్షన్స్.. ప్రాజెక్ట్స్.. ప్రస్తుతం సాంస్కృతిక కళా సంపదను కలిగి ఉన్న వ్యక్తులు, ప్రైవేట్ కలెక్షన్స్ ప్రాజెక్ట్స్ తీసుకుని వాటికి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తున్నాను. పెయింటింగ్స్, పేపర్ మెటీరియల్స్, శిల్పకళాకృతులను కాపాడే పనులు చేపడుతున్నాను. అలాగే హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే హెరిటేజ్ డ్రైవ్స్‌లో పాల్గొంటున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళా సంపద తాలూకు స్థితిగతులను అక్షరబద్ధం చేస్తున్నాను’’ అని వివరించారు అర్చన. ఎంచుకున్న కళా రంగాన్ని వినూత్నరీతిలో కెరియర్‌గా మలుచుకుంటున్నవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ మార్పు రేపటితరానికి దారి చూపడమే కాదు గత కాలపు కళావైభవానికీ వారధిగానూ నిలుస్తోంది. – నిర్మలారెడ్డి -
‘అద్భుతం.. ఇంతవరకు చూడలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: అద్బుతమైన దృశ్యం.. ఇటువంటి అరుదైన ప్రతిభ ముందెన్నడు చూసి ఉండరు. సాధారణంగా చేతితో వేసే పెయింటిగ్స్, స్కెచ్ బొమ్మలు, శాండ్ ఆర్ట్‌లను, రోడ్డపై కలర్స్‌తో వేసే బొమ్మలను చూస్తూనే ఉంటాం. కానీ ఎండలో నీటీతో వేసిన ఆర్ట్‌లను చూశారా.. అయితే అది అసాధ్యమే అయినప్పటికీ ఈ అరుదైన అద్భుతాన్ని ఇద్దరూ యువకులు సుసాధ్యం చేసి చూపించారు. రోడ్డుపై నీటీతో వేసిన.. బాస్కెట్ బాల్ కోర్టులో వ్యక్తి ఆడుతున్నట్లుగా చూపించిన వినూత్నమైన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు యువకులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాంప్మాన్ షేర్ చేశాడు. Dopest video I’ve ever seen. Ever. Basketball rocks... pic.twitter.com/spoYDXnfwS — Rex Chapman🏇🏼 (@RexChapman) August 12, 2020 దీనికి ‘ఇంతవరకు నేను ఇలాంటి వీడియోను చూడలేదు. నిజంగా ఇది అసాధారణమైన అద్భుతం. బాస్కెట్ బాల్ రాక్స్’ అంటూ రాక్స్ ట్వీట్ చేశాడు. ఈ అరుదైన ఈ వీడియోకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘ఇది చాలా అద్బుతంగా ఉంది’, ‘‘నిజంగా ఇలాంటి వీడియో ఇంతకు ముందెన్నడు చూడలేదు... మనుషుల్లో కూడా నమ్మలేని రితీలో ప్రతిభ ఉంటుందని ఇది చూస్తే అర్థం అవుతోంది’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్లో ఒక యువకుడు రోడ్డుపై పుడుకుని ఉండగా మరో వ్యక్తి అతడి చూట్టూ వాటర్ స్ప్రేతో లేఅవుట్ గీశాడు. అలా నీటీ తేమతో బాస్కెట్ బాల్ కోర్టులో వ్యక్తి బాస్కెట్ బాల్ ఆడుతూ.. బాల్‌ను గోల్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇది చేయడానికి ఆ యువకులు 5 రోజుల సమయం పట్టిందని, దీని 95 డిగ్రీ వాతావరణంలో చేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. -
ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు...
ఫొటో చూశారుగా.. అమ్మాయి భలే ముద్దుగా ఉంది కదూ. టామ్ జోక్లాండ్ అనే చిత్రకారుడు గీశాడు దీన్ని. అయితే ఏంటి అంటున్నారా? చాలా విశేషాలే ఉన్నాయి ఈ చిత్రం వెనుక. ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు. సుమారు 5,700 ఏళ్ల క్రితం నివసించి ఉండొచ్చని అంచనా. డెన్మార్క్‌లోని సైల్థోలమ్ అనే ప్రాంతంలో తవ్వకాల్లో లభించిన ఓ బబుల్గమ్ (ఓ చెట్టు బెరడు. బబుల్‌గమ్‌లా నమిలేవారట) అవశేషం నుంచి ఈ అమ్మాయి చిత్రాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. అదెలా అంటే ఈ బబుల్గమ్ అవశేషంలో అమ్మాయి తాలూకు డీఎన్ఏ లభించింది. దీని ఆధారంగా మొత్తం జన్యుక్రమాన్ని పునర్నిర్మించారు. అంతేకాకుండా నమిలిన కారణంగా ఆ అవశేషానికి నోటిలోని బ్యాక్టీరియా, ఆ చెట్టులో ఉండే సూక్ష్మజీవుల ఆనవాళ్లూ కనిపించాయి. వీటన్నింటి ఆధారంగా ఆ డీఎన్ఏ కలిగిన వ్యక్తి మహిళ అని గుర్తించారు. అంతేకాకుండా ఒడ్డూ పొడవు, కనులు, చర్మం రంగు వంటి వాటిని నిర్ధారించారు. ఆ విశేషాలను ఆధారంగా చేసుకుని టామ్ జోక్లాండ్ ఈ చిత్రాన్ని గీశారు. -
ఎడిన్‌బరో చెప్పే మన మొక్కల కథ..!
సాక్షి, హైదరాబాద్ : పొడవాటి ఆకులు.. వాటి చివరలు గులాబీ ఆకులకున్నట్టు ముళ్లతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.. వాటికీ పూలు పూస్తాయి, కానీ గులాబీలు కాదు, చిన్నచిన్న కాయలు, అవి పళ్లుగా మారిన దాఖలాలు... అదో విచిత్రంగా కనిపిస్తున్న చెట్టు. తెలుగు నేలపై విస్తారంగా కనిపించేవట.. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. ఒక్క మొక్క కూడా కానరావటం లేదు. అంతరించాయట. ఇలా ఇదొక్కటే కాదు, ఒకప్పుడు మనుగడ సాగించిన ఇలాంటి మొక్కలెన్నో ఇప్పుడు కనుమరుగయ్యాయి. ‘మన మొక్కలు’ఎందుకు మాయమయ్యాయో మన దగ్గర వివరాలు లేవు, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లేవు. కానీ స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బరోలో వాటి చిత్రాలున్నాయి. కొన్ని రకాల మొక్కలు తెలుగు నేలపై ఏ ప్రాంతంలో మనుగడ సాగించాయో కూడా వివరాలు వాటితోపాటు నిక్షిప్తమై ఉన్నాయట. ఇప్పుడు వాటిల్లో కొన్ని చిత్రాల రూపంలో హైదరాబాద్‌కు రాబోతున్నాయి. ఏమా చిత్రాల కథ..? ‘బొటానికల్ ఆర్ట్’...మొక్కను చూసి ఉన్నది ఉన్నట్టుగా చిత్రించటం. ఎప్పటి నుంచో వస్తున్న కళ ఇది. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ, ఐరోపా దేశాల్లో ఇప్పటికీ కళకళలాడుతోంది. మన దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్న సమయంలో దీనికి ప్రాధాన్యం ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ కళాకారులతోపాటు కొందరు స్థానిక కళాకారులు కూడా బొటానికల్ డ్రాయింగ్స్‌లో ప్రతిభ చూపారు. ఈ ప్రాంతంలోని విశేష ప్రాధాన్యమున్న మొక్కల చిత్రాలను సిద్ధం చేశారు. అలా రూపుదిద్దుకున్న చిత్రాలు ఎన్నో ఎడిన్‌బరోలోని విశ్వవిఖ్యాత బొటానికల్ గార్డెన్ మ్యూజియంలో కొలువు దీరాయి. వాటిల్లో ‘తెలుగు మొక్కలు’కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ చిత్రాలతో నగరంలో ఓ ప్రదర్శన ఏర్పాటు కాబోతోంది. మార్చి 6 నుంచి 31 వరకు స్టేట్ మ్యూజియంలోని భగవాన్ మహావీర్ ఆడిటోరియంలో ఇది కొనసాగనుంది. హెరిటేజ్ తెలంగాణ, ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్, గోథె జంత్రమ్ సంయుక్తాధ్వర్యంలో ఇది ఏర్పాటు కాబోతోంది. ఫారెస్ట్స్ అండ్ గార్డెన్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఇది ఏర్పాటవుతోంది. ఆంగ్లేయుల పాలనకాలంలో రూపుదిద్దుకున్న దక్షిణ భారత దేశంలోని మొక్కల పెయింటింగ్స్‌ను ఇందులో ప్రదర్శిస్తారు. కనుమరుగైనట్టు తేల్చినవి ఇవే... గతంలో ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్ మ్యూజియం క్యూరేటర్‌గా పనిచేసిన హెన్రీ నోల్టే ఆ చిత్రాలకు సంబంధించి ఎన్నో వివరాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రాయింగ్స్ ఆధారంగా ఆ మొక్కలను ప్రత్యక్షంగా చూడాలని భావించి గతంలో ఆయన దక్షిణ భారత దేశంలో పర్యటించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రూపం)కు కూడా వచ్చారు. ఇక్కడ మొక్కలను పరిశోధిస్తుండగా, కొన్ని రకాలు అంతరించినట్టు గుర్తించారు. అసలు వాటి మనుగడే లేదని, ప్రస్తుతం అవి బొటానికల్ ఆర్ట్‌కే పరిమితమైనట్టు తేల్చారు. ఆ చిత్రాలను 19వ శతాబ్దంలో చిత్రించినందున, అప్పట్లో అవి మనుగడలో ఉన్నట్టు పేర్కొంటూ తన పరిశోధన వివరాలను పుస్తకంలో నిక్షిప్తం చేశారు. చెన్నై సమీపంలో ఉన్న ‘దక్షిణ్ చిత్ర’నిర్వాహకులు ఇటీవల ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో ఎడిన్‌బరో బొటానికల్ ఆర్ట్ కూడా భాగం కావటంతో సందర్శకులను ఆకట్టుకుంది. దీంతో హెరిటేజ్ తెలంగాణ నగరంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోథె జంత్రమ్, ఎడిన్‌బరో బొటానికల్ గార్డెన్ నిర్వాహకులతో సంప్రదించటంతో వారు అంగీకరించారు. గుర్తింపు పొందిన నేపాల్‌కు చెందిన నీరా జోషి ప్రధాన్, బెంగళూరుకు చెందిన నిరుప రావు, మీన సుబ్రమణియన్‌లు పాల్గొనబోతున్నట్టు హెరిటేజ్ తెలంగాణ డైరక్టర్ విశాలాచ్చి తెలిపారు. -
అద్దమైన ప్రకృతి
పూలు తాజాగా ఒక పూట లేదంటే ఒక రోజు ఉంటాయి. ఆ తర్వాత వాడి నేలరాలిపోతాయి. పూలను ఫొటోలుగా తీసి దాచుకుంటారు కొందరు. కానీ వాటిని ఆభరణాలుగా మార్చి, అలంకరించుకోవచ్చు అంటోంది హైదరాబాద్‌కి చెందిన నవ్యశ్రీ మండవ. పూలను అద్దాలలో పొందుపరిచి ఆభరణంగా రూపుకడుతోంది. గ్లాస్ లిక్విడ్ గులాబీ, మల్లె, చామంతి, బంతి.. తాజా పువ్వులను, ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో 2–3 వారాల పాటు ఎండబెడతారు. గ్లాస్ లిక్విడ్‌ని మౌల్డ్‌లో పోసి ఎండిన పువ్వులను అందులో పొందిగ్గా అమర్చి మరికొన్ని రోజులు ఉంచుతారు. దీంతో పువ్వుతో పాటు గట్టిపడిన గాజు అందాన్ని ఆభరణంగా మార్చుతారు. ‘అమెరికాలో ఈ ఆభరణాల తయారీ ఎప్పటి నుంచో ఉంది. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ ఆర్ట్‌ని నేర్చుకొని వీటిని సొంతంగా తయారుచేస్తున్నాను’ అని చెబుతోంది నవ్యశ్రీ. కాదేదీ అద్దానికి అనర్హం పువ్వులు ఆకులే కాదు డ్రై ఫ్రూట్స్, కాఫీ గింజలు, టీ పొడి, కలప, పేపర్స్.. ఇలాంటి వేటినైనా ప్రకృతిలో ఉన్న ప్రతి అందాన్ని అద్దంలో బంధించవచ్చు. పెండెంట్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్, బ్రాస్లెట్, చోకర్స్ కూడా గాజుతో అందంగా తయారుచేయవచ్చు. పదిలంగా జ్ఞాపకాలని భద్రపరుచుకోవచ్చు. ఆత్మీయులకు వీటిని ప్రేమ కానుకలుగా ఇవ్వచ్చు. వందల నుంచి వేల రూపాయల వరకు డిజైన్, పరిమాణం బట్టి ధరలు ఉన్నాయి. www.instagram.com/srushti_collections_official -
‘అదే దక్షిణాదైతే నిన్ను ముక్కలుగా నరికేవారు’
రుతుచక్రం.. మెన్సురేషన్, పిరియడ్స్ పేరేదైనా కావచ్చు. కానీ ఇప్పటికి మన దేశంలో ఇది ఒక అంటరాని మాటే. ఆడపిల్లగా పుట్టి మహిళగా ఎదిగే క్రమంలో స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన మార్పుల్లో ఇది ఒకటి. కానీ ఇప్పటికి మన సమాజంలో నూటికి తొంభై తొమ్మిది మంది బహిరంగంగా ఈ పేరును పలకడానికి కూడా ఇష్టపడరు. మనిషి జీవితంలో ఆకలి, నిద్ర, బాధ, కోపంలాగానే పిరియడ్స్ కూడా ఓ భాగమైనప్పుడు మరేందుకు దాన్ని గురించి మాట్లాడలంటే జంకు. ఇప్పటికి మనదేశంలో పిరియడ్స్ సమయంలో ఆడవారు ఇంట్లో అన్ని గదుల్లో తిరగకూడదు.. మరీ ముఖ్యంగా పూజ గదిలోకి కానీ, ఆలయంలోకి కానీ ప్రవేశించకూడదు. పండగలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అరే.. సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు.. పిరియడ్స్ పేరు చెప్పి ఆ స్త్రీనే దేవునికి దూరంగా ఉంచడం ఎంత వరకూ సమంజసం. ఇదే ఆలోచన వచ్చింది ముంబైకు చెందిన అనికేత్ మిత్రా అనే కళాకారునికి. ఈ విషయం గురించి సమాజంలో చైతన్యం కల్గించడం కోసం కాస్తా విభిన్నమైన ఆర్ట్ వర్క్‌ని రూపొందించారు. అయితే మంచిని ఆలోచించి చేసిన ఆర్ట్ వర్క్ కాస్తా ఇప్పుడు అతనికి సమస్యలు తెచ్చిపెట్టింది. వివరాలు.. రానున్న నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని అనికేత్ అమ్మవారి రూపాన్ని ఎవరి ఊహకు అందనటువంటి విధంగా రూపొందించారు. స్త్రీ సహజమైన రుతుక్రమాన్ని ప్రధాన థీమ్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా శానిటరీ నాప్కిన్ మీద ఎరుపు రంగులో ఉన్న కమలాన్ని చిత్రించారు. ఈ ఎరుపు రంగును పిరియడ్స్ సమయంలో జరిగే బ్లీడింగ్‌కు ప్రతి రూపంగా ఎంచుకున్నానని చెప్తారు మిత్రా. శానిటరీ నాప్కిన్ వెనక భాగాన దుర్గమాతాను అలంకరించే విధంగా డెకరేట్ చేసి ఫొటో తీసి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఆర్ట్ వర్క్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆర్ట్ వర్క్ గురించి ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడింది. ‘ఇది కోల్‌కతా కాబట్టి కేవలం నీ మీద కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తున్నాం. అదే దక్షిణ భారతదేశంలో నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ఈ పాటికే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవారు’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకే ప్రమాదం అంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలిపారు అనికేత్. కానీ మరో వర్గం నెటిజన్లు అనికేత్ సృజనను మెచ్చుకోవడమే కాక ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 4 వేల మంది ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ విషయం గురించి అనికేత్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో స్త్రీలు పిరియడ్స్ సమయంలో తమను తామే అపవిత్రంగా భావించుకుంటారు. అందువల్లే ఎటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ ఆలోచనను తప్పు అని చెప్పి వారిలో చైతన్యం కల్గించడం కోసమే నేను ఇలాంటి ఆర్ట్ వర్క్‌ని రూపొందించాను. నన్ను విమర్శించేవారిని, బెదిరించేవారిని నేను పట్టించుకోను. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తున్నవారే నాకు ముఖ్యం’ అన్నారు. పిరియడ్స్ కారణంగానే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 - 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం చెల్లదంటూ.. శారీరక కారణాలు చెప్పి మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడం నేరమని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
‘పుంజు’ తెచ్చిన అవార్డు
గుంటూరు, నరసరావుపేట ఈస్ట్: విశాఖజిల్లా చౌడవరం చిత్ర కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్స్ కాంపిటేషన్‌లో పట్టణానికి చెందిన చిత్రకారుడు జి.దేవదానానికి అవార్డు లభించింది. దేవదానం కుంచె నుంచి జాలువారిన కోడిపుంజు సజీవ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. అక్టోబర్ 7వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి చిత్రకారుల సమ్మెళనంలో అవార్డును తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని ప్రగతి ఆర్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు దేవదానాన్ని అభినందించారు.