An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం! | Success Story Of Meghalika And Nehasharma At One Inch August Under The Auspices Of Architects | Sakshi
Sakshi News home page

An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం!

Published Tue, Aug 6 2024 10:08 AM | Last Updated on Tue, Aug 6 2024 10:08 AM

Success Story Of Meghalika And Nehasharma At One Inch August Under The Auspices Of Architects

అంగుళం సైజులో కళాకృతులు

వందలాది మంది కళాకారుల సృజనకు పట్టం

ఏడేళ్లుగా ఆగస్టులో నెలరోజుల పాటు సందడి

మినియేచర్‌ కళాకారుల కోసం ఆన్‌లైన్‌ ఛాలెంజ్‌

అద్భుతమైన కళాకృతిని సృష్టించాలంటే అతిపెద్ద కాన్వాస్‌లే అక్కర్లేదు.. అంగుళం చోటు చాలు.. అని నిరూపిస్తున్నారీ సృజనాత్మక చిత్రకారులు. నగరానికి చెందిన యువ ఆర్కిటెక్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాన్‌ ఇంచ్‌ ఆగస్ట్‌.. సృజనలోని లోతుల్ని స్పృశిస్తూ కళా ప్రపంచంలోని విశేషాలను, విచిత్రాలను ఆవిష్కరిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించే ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ ‘యాన్‌ ఇంచ్‌ ఆగస్ట్‌’ ఈ నెల అంతా జరుగుతుంది. అత్యంత చిన్నదైన ప్రదేశంలో అత్యుత్తమ కళాప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీలో వైవిధ్యం. కేవలం ఒక అంగుళం చతురస్రంలో క్లిష్టమైన, అర్థవంతమైన  కళాఖండాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఈ ఆన్‌లైన్‌ ఈవెంట్‌ ఆహా్వనిస్తోంది. సూక్ష్మ కళారూపాలలో సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రేరేపిస్తూ యువ ఆరి్టస్టులకు సవాల్‌ విసురుతోంది. ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని కళాభిమానులు, ఆర్కిటెక్ట్స్‌ మేఘాలికా, నేహా శర్మలు 2018లో వార్షిక ఛాలెంజ్‌గా ప్రారంభించారు. డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్పి్టంగ్, 3డీ మోడలింగ్, మ్యాక్రో ఫొటోగ్రఫీలలో ప్రవేశం ఉన్నవారి కోసం దీనిని నిర్వహిస్తున్నారు.

అంగుళంలో భళా.. అనిపించండి ఇలా..
ఈ ఆన్‌లైన్‌ ఛాలెంజ్‌ అధికారికంగా ప్రారంభం అవడానికి ముందు, ఎప్పటిలాగే బేగంపేటలోని పంచతంత్ర కెఫెలో జులై ఆఖరి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కళాభిమానులకు ప్రీ–ఓపెనింగ్‌ మీట్‌ నిర్వహించారు. ఈ ఛాలెంజ్‌ గురించి విశేషాలు వివరించడంతో పాటు తోటి కళాకారులతో పరస్పర చర్చలు జరిగాయి. ఒక అంగుళం పరిమితిలో సృజనాత్మక ఆవిష్కరణ ప్రక్రియ ఎలా అనేదానిపై సూచనలు కూడా ఈ మీట్‌ ద్వారా నిర్వాహకులు అందించారు. రోజుకు ఒకటికి తగ్గకుండా కళాకృతిని పోస్ట్‌ చేయడం ద్వారా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.

ఇంచ్‌ ఇంచై.. వటుడింతై.. 
అంగుళం–పరిమాణంలోని ఆవిష్కరణల్లో పాల్గొనడానికి  వయస్సు, నైపుణ్య స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆన్‌లైన్‌ పోటీ అవకాశం అందిస్తోంది. దీంతో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7వేలకు పైగా వన్‌ ఇంచ్‌ ఆర్ట్‌ వర్క్స్‌తో మంచి రెస్పాన్స్‌ అందుకుంది. కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా కళాకారులతో సమావేశాలు నిర్వహించడం, టీ–వర్క్స్‌లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా ఈ ఛాలెంజ్‌ ఇంచ్‌ ఇంచై వటుడింతై అన్నట్టుగా ప్రాచుర్యం పెంచుకుంటోంది.

సృజనకు పదును పెట్టడమే లక్ష్యం..
కళలకైనా, సృజనకైనా ఆకాశమే హద్దు. చిట్టి చిట్టి కళాకృతులను సృష్టించడం ద్వారా కళాసృష్టిలోని వైవిధ్యాన్ని చూపించడమే ఈ యాన్‌ ఇంచ్‌ ఆగస్ట్‌ ముఖ్యోద్దేశ్యం. ఈ కార్యక్రమం తొలిదశలో ఫొటోగ్రఫీ యాడ్‌ చేయలేదు. కానీ కొందరి అభ్యర్థన మేరకు అంగుళం లోపల ఉన్న సబ్జెక్ట్‌ని ఫొటో తీయడాన్ని కూడా జతచేశాం. హైదరాబాద్‌లో ఇంత మంది మ్యాక్రో ఫొటోగ్రాఫర్స్‌ ఉన్నారని మాకు తెలీదు అని మాతో ఇప్పుడు చాలా మంది అంటున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది కళాకారులకు గుర్తింపు లభిస్తోంది. అంతకు మించి మేం దీని నుంచి ఏమీ ఆశించడం లేదు. ఛాలెంజ్‌ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో పోస్ట్‌ మీటప్‌ను నిర్వహించనున్నాం. దానిలో కళాకారులు పాల్గొని నెల రోజుల పాటు తాము అందుకున్న సృజనాత్మక అనుభవాలను పంచుకుంటారు. – మేఘాలిక, నేహాశర్మ, నిర్వాహకులు

ఇవి చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement