architect
-
An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం!
అద్భుతమైన కళాకృతిని సృష్టించాలంటే అతిపెద్ద కాన్వాస్లే అక్కర్లేదు.. అంగుళం చోటు చాలు.. అని నిరూపిస్తున్నారీ సృజనాత్మక చిత్రకారులు. నగరానికి చెందిన యువ ఆర్కిటెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాన్ ఇంచ్ ఆగస్ట్.. సృజనలోని లోతుల్ని స్పృశిస్తూ కళా ప్రపంచంలోని విశేషాలను, విచిత్రాలను ఆవిష్కరిస్తోంది.ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించే ఆన్లైన్ ప్రాజెక్ట్ ‘యాన్ ఇంచ్ ఆగస్ట్’ ఈ నెల అంతా జరుగుతుంది. అత్యంత చిన్నదైన ప్రదేశంలో అత్యుత్తమ కళాప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీలో వైవిధ్యం. కేవలం ఒక అంగుళం చతురస్రంలో క్లిష్టమైన, అర్థవంతమైన కళాఖండాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఈ ఆన్లైన్ ఈవెంట్ ఆహా్వనిస్తోంది. సూక్ష్మ కళారూపాలలో సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రేరేపిస్తూ యువ ఆరి్టస్టులకు సవాల్ విసురుతోంది. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని కళాభిమానులు, ఆర్కిటెక్ట్స్ మేఘాలికా, నేహా శర్మలు 2018లో వార్షిక ఛాలెంజ్‌గా ప్రారంభించారు. డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్పి్టంగ్, 3డీ మోడలింగ్, మ్యాక్రో ఫొటోగ్రఫీలలో ప్రవేశం ఉన్నవారి కోసం దీనిని నిర్వహిస్తున్నారు.అంగుళంలో భళా.. అనిపించండి ఇలా..ఈ ఆన్లైన్ ఛాలెంజ్ అధికారికంగా ప్రారంభం అవడానికి ముందు, ఎప్పటిలాగే బేగంపేటలోని పంచతంత్ర కెఫెలో జులై ఆఖరి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కళాభిమానులకు ప్రీ–ఓపెనింగ్ మీట్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్ గురించి విశేషాలు వివరించడంతో పాటు తోటి కళాకారులతో పరస్పర చర్చలు జరిగాయి. ఒక అంగుళం పరిమితిలో సృజనాత్మక ఆవిష్కరణ ప్రక్రియ ఎలా అనేదానిపై సూచనలు కూడా ఈ మీట్ ద్వారా నిర్వాహకులు అందించారు. రోజుకు ఒకటికి తగ్గకుండా కళాకృతిని పోస్ట్ చేయడం ద్వారా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.ఇంచ్ ఇంచై.. వటుడింతై.. అంగుళం–పరిమాణంలోని ఆవిష్కరణల్లో పాల్గొనడానికి వయస్సు, నైపుణ్య స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆన్లైన్ పోటీ అవకాశం అందిస్తోంది. దీంతో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7వేలకు పైగా వన్ ఇంచ్ ఆర్ట్ వర్క్స్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా కళాకారులతో సమావేశాలు నిర్వహించడం, టీ–వర్క్స్‌లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా ఈ ఛాలెంజ్ ఇంచ్ ఇంచై వటుడింతై అన్నట్టుగా ప్రాచుర్యం పెంచుకుంటోంది.సృజనకు పదును పెట్టడమే లక్ష్యం..కళలకైనా, సృజనకైనా ఆకాశమే హద్దు. చిట్టి చిట్టి కళాకృతులను సృష్టించడం ద్వారా కళాసృష్టిలోని వైవిధ్యాన్ని చూపించడమే ఈ యాన్ ఇంచ్ ఆగస్ట్ ముఖ్యోద్దేశ్యం. ఈ కార్యక్రమం తొలిదశలో ఫొటోగ్రఫీ యాడ్ చేయలేదు. కానీ కొందరి అభ్యర్థన మేరకు అంగుళం లోపల ఉన్న సబ్జెక్ట్‌ని ఫొటో తీయడాన్ని కూడా జతచేశాం. హైదరాబాద్‌లో ఇంత మంది మ్యాక్రో ఫొటోగ్రాఫర్స్ ఉన్నారని మాకు తెలీదు అని మాతో ఇప్పుడు చాలా మంది అంటున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది కళాకారులకు గుర్తింపు లభిస్తోంది. అంతకు మించి మేం దీని నుంచి ఏమీ ఆశించడం లేదు. ఛాలెంజ్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో పోస్ట్ మీటప్ను నిర్వహించనున్నాం. దానిలో కళాకారులు పాల్గొని నెల రోజుల పాటు తాము అందుకున్న సృజనాత్మక అనుభవాలను పంచుకుంటారు. – మేఘాలిక, నేహాశర్మ, నిర్వాహకులుఇవి చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
సోషల్ మీడియాతో పాపులర్ సింగర్ అయిన డిసోజా
బెంగళూరుకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ ఫ్రిజెల్ డిసోజా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రకరకాల పాటల గురించి పోస్ట్‌లు, వీడియోలు పెట్టడం ద్వారా ఇండియన్ ఇండీ మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చింది. లాక్డౌన్ కాలంలో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘సమ్‌థింగ్ న్యూ’ పాట ఐడియా వచ్చింది. ఈ డెబ్యూ సాంగ్ ద్వారా డిసోజా మెలోడియస్ వాయిస్‌కు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించి, వినిపించే డిసోజా లైవ్ ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొంది. ఫస్ట్ టూర్లో వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక రచన విషయానికి వస్తే...లవ్, హార్ట్‌బ్రేక్‌కు సంబంధించిన అంశాలపై పాటలు రాయడం డిసోజాకు ఇష్టం.‘వ్యక్తిగత అనుభవాల నుంచి చూసిన, విన్న విషయాల ఆధారంగా పాటలు రాయడం నాకు సులభం’ అంటుంది. మొదట్లో తన పాటల్లో ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్‌ల శబ్దం లిరిక్స్‌ను డామినేట్ చేసేది. ఇప్పుడు మాత్రం లిరిక్స్ కూడా స్పష్టంగా వినబడే ఈజీ–టు–లిజెన్ వైబ్కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ అయిన డిసోజా ఫుల్–టైమ్ మ్యూజిషియన్‌గా ఉండడమే తనకు ఇష్టం అంటుంది. View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) -
ప్రపంచంలోని టాప్ 10 ఆర్కిటెక్చర్ రైల్వే స్టేషన్లు
-
అపురూప కల్పన
ముంబైకి చెందిన ఆష్తి మిల్లర్‌ను ‘ఆర్కిటెక్ట్’ అంటే మాత్రమే సరిపోదు. అలా అని ‘ఆర్ట్’కు మాత్రమే పరిమితం చేయలేము. ఇలస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైన్లతో తనప్రోఫెషనల్ కెరీర్‌కు కొత్త మెరుపు తీసుకువచ్చింది. అదే తన ప్రత్యేకశైలిగా మారింది... నేను చేసే వర్క్స్‌లో వీలైనన్ని వివరాలు ఉండేలా జాగ్రత్త పడతాను. దీంతో వీక్షకులు అందులో కొత్తదనాన్ని చూస్తారు. నా ఆలోచన విధానం ఏమిటో తెలిసిపోతుంది. నా మది ఎప్పుడూ రకరకాల ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో నుంచి కొన్ని ఐడియాలను తీసుకొని పనిచేస్తాను. – మిల్లర్ ముంబైలోని ఆష్తి మిల్లర్ ఇల్లు క్రియేటివిటీకి సంబంధించిన విషయాలకు కేంద్రంగా ఉండేది. తల్లి ఫైన్ ఆర్టిస్ట్. తండ్రి ఆర్కిటెక్ట్. ఇంటినిండా ఆర్ట్‌కు సంబంధించిన ముచ్చట్లే! చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు రకరకాల మ్యూజియమ్లు, ఆర్ట్గ్యాలరీలకు వెళుతుండేది మిల్లర్. అవి ఊరకే ఉండనిస్తాయా! తనలో సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించాయి. సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్‌గా తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేందేమీ కాదు. ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టం తనకు ఆదర్శం అయింది. తండ్రి బాటలోనే ఆర్కిటెక్చర్ కోర్సు చదువుకుంది. ‘మిల్లర్ ఇంక్ స్టూడియో’ మొదలు పెట్టింది. ఈ స్టూడియో ద్వారా ప్రోఫెషనల్ కెరీర్ ‘ఆర్కిటెక్ట్’ను తన క్రియేటివిటీకి సంబంధించిన ఇలస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్లతో మిళితం చేసి యూనిక్ స్టైల్‌తో తిరుగులేని విజయం సాధించింది మిల్లర్. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. మారథాన్లకు సంబంధించిన మెడల్స్‌ను యూనిక్ స్టైల్లో డిజైన్ చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించుకుంది. ఒక ఫిన్‌టెక్ కంపెనీ బ్రాండ్‌కు సంబంధించి మనీఆర్ట్ సిరీస్ కోసం మిల్లర్ సృష్టించిన 14 లేయర్లతో కూడిన ఆర్ట్ వర్క్‌కు మంచి పేరు వచ్చింది. ప్రతి లేయర్లో వివిధ దేశాలకు చెంది కరెన్సీ, వివిధ భౌగోళిక ప్రాoతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ప్రతిఫలిస్తాయి. మిల్లర్ ఆర్ట్‌వర్క్స్ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. ‘మిల్లర్ ఆర్ట్‌వర్క్‌లో తాజాదనం కనిపిస్తుంది. సూటిగా మనసును తాకే ఆకర్షణీయత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని తన కళలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది’ అంటుంది క్యూరెటర్ అమ్బ్రోగి. ‘మిల్లర్లోని ప్రత్యేకత ఏమిటంటే ఒకే సమయంలో భిన్నమైన విషయాల గురించి ఆలోచించడం. వాటిని సృజనాత్మకంగా సమన్వయం చేసుకోవడం. ఆమె ఆర్ట్వర్క్స్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, శిల్పం, చిత్రం మిళితమై కనిపిస్తాయి’ అంటున్నాడు ఆర్కిటెక్చరల్ సంస్థ పికార్ట్‌కు చెందిన ఆంథోనీ మార్కెస్.ఆంథోనితో కలిసి అర్బన్ మాస్టర్ ప్లాన్స్ నుంచి పర్సనల్ స్పేసెస్ వరకు ఎన్నోప్రాజెక్ట్లలో పనిచేసింది ఆష్తి మిల్లర్.‘మోర్ ఈజ్ బెటర్’ అనే ఫిలాసఫీని నమ్ముతున్న ఆష్తి మిల్లర్ తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’లో చోటు సంపాదించింది. -
పద్మభూషణ్ బాలకృష్ణ దోషి కన్నుమూత.. ప్రధాని సంతాపం
ఢిల్లీ: దశాబ్దాల పనితనంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ ఆర్కిటెక్ట్ నిపుణులు, పద్మ భూషణ్ బాలకృష్ణ దోషి(95) ఇక లేరు. మంగళవారం అహ్మదాబాద్‌లోని తన స్వగృహంలో ఆయన అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లె కార్బూజియెగా(ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్), లూయిస్ కాన్ లాంటి విదేశీ ఆర్కిటెక్ట్‌లతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. అహ్మదాబాద్ ఐఎంఎంతో పాటు పలు ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణంలో ఆయన పాలు పంచుకున్నారు. దోషి మృతిపై పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. డాక్టర్ బివి దోషి జి ఒక తెలివైన వాస్తుశిల్పి. గొప్ప సంస్థకు నిర్మాత. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి... అని ట్వీట్ ద్వారా సంతాపం తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ. Dr. BV Doshi Ji was a brilliant architect and a remarkable institution builder. The coming generations will get glimpses of his greatness by admiring his rich work across India. His passing away is saddening. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/LLdrZOCcQZ — Narendra Modi (@narendramodi) January 24, 2023 1927 పూణే(మహారాష్ట్ర)లో జన్మించిన బాలకృష్ణ విఠల్దాస్ దోషి.. బెంగళూరు ఐఐఎంతో పాటు అహ్మదాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీ, సీఈపీటీ యూనివర్సిటీ, కార్నియా సెంటర్లను డిజైన్ చేశారు. వీటితో పాటు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని అరణ్య లో కాస్ట్ హౌజింగ్ టౌన్‌షిప్‌నకు రూపకల్పన చేయగా.. అది ప్రతిష్టాత్మక అగాఖాన్ అవార్డును 1995లో దక్కించుకుంది. ఇక వాస్తుశిల్ప పేరుతో సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని అహ్మదాబాద్‌లో ఆయన సెటిల్ అయ్యారు. ఆయన కుటుంబంలో చాలామంది ఆర్కిటెక్ట్‌లు ఉన్నారు. 2018లో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ అవార్డు(ఈ ఘనత సాధించిన తొలి ఆర్కిటెక్ట్) అందుకున్నారు. పద్మశ్రీతో పాటు 2020లో భారత ప్రభుత్వం ఆయన చేసిన కృషికిగానూ పద్మ భూషణ్ పురస్కారం అందించింది. ఇక 2022లో దోషి రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ నుంచి రాయల్ గోల్డ్ మెడల్ పురస్కారం అందుకున్నారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఓ కాదల్ కన్మణి, షాద్ అలీ ఓకే జాను చిత్రాల్లోనూ బాలకృష్ణ దోషి ఒక చిన్న పాత్రలో మెరిశారు. తన ప్రాజెక్టులు దాదాపుగా అహ్మదాబాద్‌తో ముడిపడి ఉండడంతో శేషజీవితాన్ని అక్కడే గడిపారాయన. -
ఆధునిక దేశ నిర్మాత
ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసినవాడు జవహర్లాల్ నెహ్రూ. వలసవాద వ్యతి రేకిగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజా స్వామ్యవాదిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి నెహ్రూ... భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ రోజుల్లో 1936లో ఆటో బయోగ్రఫీ, 1946లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచించి, ఆనాటి రాజకీయ, సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజ నీతిజ్ఞునిగా ప్రసిద్ధి కెక్కారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ కుమా రుని విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సైన్స్‌లో డిగ్రీ చదివించారు. లండన్‌లోని ‘ఇన్నర్ టెంపుల్ ఇన్’లో న్యాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించారు నెహ్రూ. 1912 నుండి అఖిల భారత కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ జీతో పాటు పాల్గొన్నారు. 1946లో ఏర్పడిన ప్రొవి జనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. నెహ్రూ భారతదేశం లౌకిక తత్వంతో సోష లిస్టు భావజాలంతో ముందుకు వెళ్లడానికి తోడ్ప డ్డారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీక రించడం కష్టమవుతున్న నాటి పరిస్థితులలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ధీశాలి నెహ్రూ. బహుళార్థ సాధక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్ర యాలు, ఇనుము, ఉక్కుకర్మాగారాలు, శాస్త్ర పరి శోధన సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారం భించిన దార్శనికుడాయన. ప్రముఖ ఆర్థిక వేత్త మహలనోబిస్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళి కలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తటస్థ వైఖరి అవలంబించి, అలీన ఉద్యమానికి నేతృత్వం వహించారు. ప్రతిరోజు భారత ప్రజలు వివిధ సమస్యలపై దాదాపు రెండు వేలకు పైగా ఉత్తరాలు రాసేవారు. ప్రతి రాత్రి అదనంగా నాలుగు లేదా ఐదు గంటలు పని చేసి, ఆ ఉత్తరాలను అధ్యయనం చేసి సమాధానాలను రాయడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం. 12 శాతం అక్షరాస్యతతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశంగా ఉన్న భారత దేశాన్ని నెహ్రూ తన రాజకీయ పరిజ్ఞా నంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా నిలబెట్టారు. ఇంతటి గొప్ప దార్శనికుడు నెహ్రూజీకి బాలల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అందుకనే పిల్ల లందరూ చాచా నెహ్రూగా పిలిచేవారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. నిజా నికి 1956 నుంచి అంతర్జాతీయ బాలల దినో త్సవం జరిగే రోజునే ఇండియాలోనూ బాలల దినోత్సవాన్ని జరిపేవారు. అయితే 1964 మే 27న పిల్లల్ని ఎంతగానో ఇష్టపడే నెహ్రూజీ తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన పుట్టిన రోజును భారత ప్రభు త్వం బాలల దినోత్సవంగా జరపాలని నిర్ణ యించింది. ఈ తరుణంలో ఆ మహనీయుని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం అవసరం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్: 99499 30670 -
నిలువెత్తు గెలుపు సంతకం
‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి మనిషిని తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేస్తాయి’ అనేది మంచిమాట. ఈ మాటకు తన వంతుగా మరో మాట చేర్చాడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లారీ బేకర్... ‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి అత్యుత్తమ నిర్మాణాలకు కారణం అవుతాయి’ ఆర్కిటెక్ట్‌గా దేశవిదేశాల్లో రాణిస్తున్న శ్వేతా దేశ్‌ముఖ్ లారీ బేకర్ చెప్పిన ప్రతి మాటను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ది ఇండియన్ అలర్ట్ ‘టాప్ టెన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్–2022’ జాబితాలో చోటు సంపాదించిన శ్వేతాదేశ్ముఖ్ గురించి... ముంబైకి చెందిన శ్వేతాదేశ్ముఖ్కు చిన్నప్పటి నుంచి స్కెచ్చింగ్, పెయింటింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనను ఆర్కిటెక్చర్ వైపు తీసుకువచ్చింది. నాగ్‌పుర్‌లో బీ.ఆర్క్, పుణెలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఉద్యోగంలో చేరితే ఎలా ఉండేదో తెలియదుగానీ, సొంతంగా ప్రాక్టిస్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వివాహం తరువాత ముంబైలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన శ్వేత ఆ తరువాత ‘డిజైన్బాక్స్’ పేరుతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టింది.‘డబ్బులు ఎక్కువ వచ్చినా సరే, తక్కువ క్రియేటివిటీ ఉండే ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాలి’ అనే నిబంధన విధించుకుంది. క్లయింట్స్ నుంచి సైట్ ఫోటోలు, వీడియోలు, డ్రాయింగ్స్ తీసుకోవడమే కాదు డిజైన్ ప్రాసెస్‌లో కూడా వారిని భాగం చేస్తుంది. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్... ఇలా ఎన్నో విషయాలలో ఎంతోమంది క్లయింట్స్‌కు సేవలు అందించిన ‘డిజైన్బాక్స్’ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది. తన ఫేవరెట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఇరవై అయిదు ఎకరాల పరిధిలోని భీమాశంకర్ హిల్స్(కర్జత్, మహారాష్ట్ర), పుదుచ్చేరిలోని మలీప్లె్లక్స్,గ్రీన్‌హౌజ్, చెంబూర్‌లోని ఏడు ఎకరాల కమర్షియల్ ఇంటీరియర్... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. క్లయింట్స్ అభిరుచి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తాను’ అంటున్న శ్వేత నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ కోణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదా: స్క్రాప్ మెటీరియల్‌ను రీసైకిలింగ్ కంపెనీలకు తరలించడం, వర్షపునీటి నిల్వ, స్థానిక వనరులను సమర్థవంతంగా వాడుకోవడం... మొదలైనవి. ‘నా డిజైనింగ్‌కు ప్రకృతే స్ఫూర్తి ఇస్తుంది’ అని చెబుతున్న శ్వేత బాగా అభిమానించే ఆర్కిటెక్ట్ లారీ బేకర్. బ్రిటన్‌లో పుట్టిన బేకర్ ఇండియాకు వచ్చి నిర్మాణరంగం లో అనేక ప్రయోగాలు చేసి ‘లెజెండ్’ అనిపించుకున్నాడు. సామాన్యుల ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందడం కంటే సామాన్యులు సృష్టించిన వాటిలో నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందుతాను’ అనే లారీ బేకర్ మాట తనకు ఇష్టమైనది. ఆయన చెప్పిన ‘లోకల్ విజ్డమ్’ను అనుసరిస్తుంది. ‘ఒక డిజైన్ చేసే ముందు ఆ పరిసరాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని లారీ చెప్పిన మాటను ఆచరణలో చూపుతుంది శ్వేత. గౌతమ్ భాటియా రాసిన ‘లారీ బేకర్: లైఫ్, వర్క్ అండ్ రైటింగ్’ పుస్తకం అంటే ఇష్టం. ‘ప్రతి వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతి సవాలు మన విజయానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. మొదట్లో మాకు కూడా రకరకాల సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా స్టార్ట్ చేశాం. ఇలాగే ఉంటాం... అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు మా ప్రణాళికలో మార్పు చేసుకుంటూ వచ్చాం’ అంటుంది శ్వేతాదేశ్ముఖ్. చదువుకునే రోజుల్లో, వృత్తిలోకి వచ్చిన తొలిరోజుల్లో మూర్ఛవ్యాధి సమస్యతో సతమతమయ్యేది శ్వేత. అలా అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంటికి పరిమితం కాలేదు. పనిలో దొరికే ఉత్సాహన్నే ఔషధంగా చేసుకొని ముందుకు కదులుతుంది. -
ఆర్కిటెక్చర్ వాక్.. అడుగు అడుగులో నిర్మాణం
నడవాలి.. నడతలు మార్చడానికి నడవాలి.. నడతలు నేర్పడానికి ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్ ‘నడక’ గురించి తెలుసుకుంటే ఈ మాటలు ముమ్మాటికి నిజం అనిపిస్తుంటుంది. 1700 కిలోమీటర్లు... కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు దాదాపు రెండు నెలల ప్రయాణం 54 ఏళ్ల వయసులో వందల కిలోమీటర్ల నడక దేనికోసం..? ‘నవభారత నిర్మాణం’ కోసం అంటూ ఆర్కిటెక్చర్ వాక్ గురించి ఆనందంగా వివరిస్తారు ఆమె. గీతా బాలకృష్ణన్ పుట్టింది చెన్నైలో. చదివిందంతా హైదరాబాద్‌లో. 1982లో కలకత్తాకు వెళ్లిపోయి, అక్కడే ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో భవన నిర్మాణ రంగం గురించి రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ఒంటరిగా 1,700 కిలోమీటర్లు నడిచిన ఈ ఆర్కిటెక్ట్ దారి గురించి మరింత వివరంగా.. ► ప్రయాణంలో గ్రహించిన విషయాలు.. అనుకున్న ప్లాన్ ప్రకారం గత శనివారం ఉదయం 5:30కి ఢిల్లీకి చేరుకోవడంతో నా ‘వాక్’ పూర్తయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఆర్కిటెక్చర్ గురించి చాలా మందికి తెలియదని ఈ ‘వాక్’ ద్వారా మరింతగా అర్థమయ్యింది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటారు తప్ప ఆర్కిటెక్ట్ కావాలని, అదొక రంగం ఉంటుందని తెలియదు. చిన్న చిన్న టౌన్లు మొదలు పల్లెల్లో జనానికి భవన నిర్మాణాల డిజైన్స్ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలనుకుని ఫిబ్రవరి 13న ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణం మొదలైన మొదటి రోజు భవన నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వెళ్లాను. ‘ఎందుకు కడుతున్నారు, ఏం పనిచేస్తున్నారు.. ప్లానింగ్ ఏంటి?’ అని అడిగితే ‘అవేమీ మాకు తెలియదు. కాంట్రాక్టర్ వస్తారు. ఇంత ఎత్తులో కట్టండి, అలా పని చేయండి.. అని చెబితే అలాగే చేస్తాం’ అని చెప్పారు. ఆర్కిటెక్ట్ వచ్చి వారితో మాట్లాడి, తగిన డిజైన్ ఇస్తే కదా.. ఆ పనివాళ్లలో నిర్మాణం పట్ల ప్రేమ కలిగేది. ఇల్లు, భవనం అంటే.. నాలుగు గోడలు రూఫ్ మాత్రమే కాదు కదా! ఇది కూడా బాధ్యతగా చేయాల్సిన పని అని ఎవరికీ తెలియడం లేదు. ► ఈ ‘వాక్’ వల్ల జనాల్లో అవగాహన వస్తుందంటారా? నా ఒక్కదాని వల్ల అందరిలోనూ అవగాహన వస్తుందని చెప్పలేను. కానీ, జనాల్లోకి కొంతవరకు సందేశం వెళుతుంది. ప్రభుత్వం, ఆర్కిటెక్ట్ అసోషియేషన్స్.. అందరూ కలిసి అవగాహన కల్పించడానికి ఇదో మార్గం అనుకున్నాను. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కౌన్సిల్స్ నేను చేసే వాక్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జర్నీలో చాలా సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించాను. వాటిని గుర్తించి, ఒక డాక్యుమెంట్ చేసే పనిలో ఉన్నాను. నాకు ఇది ఒక పరిశోధనగా ఉపయోగపడింది. ఈ వాక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ► మీ రోజువారీ ప్రయాణం ఎలా ఉండేది? మొదట ఉదయం 6 గంటలకు ప్రారంభించినా, ఎండకారణంగా ఉదయం 4 గంటలకే నడక మొదలుపెట్టేదాన్ని. ఈ జర్నీలో చాలామంది నుంచి చాలా ప్రేమ దక్కింది. కొందరు వచ్చి యోగక్షేమాలు అడిగేవారు. కొందరు మంచి నీళ్లు, టీ ఇచ్చేవారు. మరికొందరు టిఫిన్‌కు ఆహ్వానించేవారు. కొన్ని చోట్ల వాళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి, మరీ పిలిచారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజల్లో ఉన్న ఇంత మంచిని నేరుగా చూడగలిగాను. నేను నడుస్తూ వెళుతుంటే స్థానిక మీడియా వాళ్లు చూసి, విషయమేంటో కనుక్కొని, నన్ను అనుసరిస్తూ నా గురించి పేపర్లలో రాశారు. నేను ముందుకు వెళ్లినప్పుడల్లా స్థానికులు ‘మీ గురించి చదివాం, చూశాం..’ అని చెబుతుండేవారు. ► ప్రయాణంలో అద్భుతం అనిపించినవి? మార్గంలో నా చూపంతా భవననిర్మాణాలవైపుగా ఉండేది. వెస్ట్ బెంగాల్ ఆర్కిటెక్చర్, జార్ఞాండ్లోని ఆర్కిటెక్చర్ చాలా భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో భర్రా అని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కట్టిన ఒక ఇంటికి వెళ్లాను. మట్టితో కట్టిన ఇల్లు అది. వాళ్ల కుటుంబసభ్యులే కలిసి స్వయంగా కట్టుకున్నారు. రూఫ్‌కి కూడా వాళ్లే తయారు చేసుకున్న మట్టి పెంకులు వాడారు. ఇంట్లో బెడ్ నుంచి ప్రతీది వారి రూపకల్పనే. అలాంటి ఇళ్లు అక్కడ మరికొన్ని చూశాను. ఇంటి నిర్మాణాల్లో వారి ప్రతిభ చాలా వండర్ అనిపించింది. ► వందల కిలోమీటర్ల వాక్ ఒంటరిగా చేయడానికి మీ కుటుంబం ఒప్పుకుందా? ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. ఇన్నేళ్లకు ఓ ఉదయం లేచి సడెన్‌గా ఇంట్లోవారికి నా కల గురించి చెబితే వెంటనే సపోర్ట్ చేయరు. మొదటి నుంచి నా కుటుంబ సభ్యులకు నా ఇష్టాయిష్టాలేంటో తెలుసు. నేను చేస్తున్నపని తెలుసు. అలాగే, సొంతంగా తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసు. వారితో నా రంగానికి సంబంధించిన విషయాలనూ చర్చిస్తూనే ఉంటాను. నా భర్త, నా కొడుకు కూడా నాతో కలిసి 200 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ప్రమాదాల గురించి మనం భయపడినా, ఇంట్లో వాళ్లు ఆపేసినా ముందడుగు వేయలేం. గ్యాలియర్‌లో ఒక సైక్లింగ్ యాక్సిడెంట్లో కింద పడిపోయాను. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందన్నారు. చేరాల్సిన గమ్యం ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను. కానీ, పర్వాలేదు. 4–5 రోజుల్లో కోలుకుని, నా నడకను కొనసాగించాను. ► మీరు మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లారు కదా... అక్కడి వారికి ఏం చెప్పారు? గ్రామాల్లో ఎవరైనా పిల్లవాడిని ‘భవిష్యత్తులో ఏమవుతావు’ అంటే ‘టీచర్’ అనే సమాధానం ఎక్కువ విన్నాను. అంటే, వాళ్ల కళ్ల ముందు రోజూ టీచర్ ఒకరే కనిపిస్తారు. మరో వృత్తి గురించి వారికి అంతగా తెలియదు. అందుకే, టీచర్లను కలిసి ఆర్కిటెక్చర్ వృత్తి గురించి, బిల్డింగ్ డిజైన్ గురించి పిల్లలకు చెప్పమని, వారిని ట్రెయిన్ చేయమని వివరించాను. ► మీరు రన్నర్ అని కూడా విన్నాం. ఈ వాక్‌కి మీరు ముందు చేసిన కార్యక్రమాలు..? 2014లో రన్నింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసేదాన్ని. అప్పటినుంచి 10 కిలోమీటర్ల వాక్, 20 కిలోమీటర్లు రన్, 30 కిలోమీటర్ల మారథాన్ చేశాను. ఇలా లాంగ్ వాక్ చేయడం మాత్రం మొదటిసారి. ఈ వాక్‌లో ఒక రోజు వాక్ అండ్ రన్, మరో రోజు వాక్. మిక్స్‌డ్‌గా చేశాను. రోజూ 20–30 కిలోమీటర్లు నడిచాను. ఈ వాక్ రాబోయే రోజుల్లో చేసే పనులకు ముందడుగు అనుకుంటున్నాను. ► ఆర్కిటెక్ట్‌గా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నవి..? ఈ వాక్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డాక్యుమెంటరీ చేయడానికి మరో 3–4 నెలల సమయం పడుతుంది. వాక్ గురించి కాకపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక... లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నాను. దేశంలోని అన్ని జిల్లాలకు వెళ్లాలని, ఆర్కిటెక్చర్ రంగం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ రంగంలోకి రావాలని, ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్‌కి ఫెలోషిప్స్ ఇస్తూ ప్రోత్సహించాలి. ఎక్కడ ఆర్కిటెక్చర్ రంగంలో సమస్యలు ఉన్నాయో గుర్తించి, పరిష్కరిస్తూ వెళ్లాలనుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
Manushi: అఫ్గానిస్థాన్ యుద్ధంలో దెబ్బతిన్న 5 నగరాలలో..
Manushi Ashok Jain- Urban Design- నిర్మాణానికి పర్యావరణహితం తోడైతే...సమాజానికి ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది! ఆర్కిటెక్ట్, సిటీ ప్లానర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 29 సంవత్సరాల మానుషీ అశోక్ జైన్ (చెన్నై) పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటుంది... ‘నీ గురించి మాత్రమే కాదు, పొరుగువారి గురించి కూడా ఆలోచించు’‘ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి నీ వంతుగా ఇవ్వు’....ఇలాంటి మంచి మాటలు బాల్యంలోనే మానుషీ జైన్ మనసులో బలంగా నాటుకుపోయాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో గోల్డ్‌మెడలిస్ట్ అయిన జైన్ ఆర్కిటెక్ట్‌గా బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలతో పాటు సింగపూర్, న్యూయార్క్‌లలో పనిచేసింది. యూఎస్‌లో ససకి అసోసియేట్స్(ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్,ప్లేస్ బ్రాండింగ్...మొదలైన విభాగాలలో పనిచేసే సంస్థ)తో కలిసి పనిచేసింది. ఫలితంగా అర్బన్ డిజైనర్‌గా తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. ఈ అనుభవంతో అఫ్గానిస్థాన్ యుద్ధంలో దెబ్బతిన్న అయిదు నగరాలలో స్ట్రాటిజిక్ డెవలప్మెంట్ ఫ్రేమ్‌వర్క్ చేసే అవకాశం లభించింది. ‘ప్రపంచం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలు ఏమిటో అక్కడ తెలుసుకోగలిగాను’ అంటుంది జైన్. ‘ఫ్యూచర్ సిటీ ఆఫ్ కోచి’కి బాటలు వేసే అర్బన్ డిజైన్ పోటీ కేరళలో జరిగింది. జైన్ తన టీమ్‌మెట్స్‌తో ఒక కన్సార్టియంగా ఏర్పడి ఈ పోటీలో పాల్గొంది. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ, వరదలను తట్టుకునేలా జైన్ బృందం రూపకల్పన చేసిన ‘లో కాస్ట్ అల్టర్నేటివ్ డిజైన్’ మొదటి బహుమతి గెలుచుకుంది. ‘అర్బన్ డిజైన్‌ను అర్థం చేసుకోవడం, అర్బన్ డిజైనర్ విలువ గురించి తెలియడం మన దగ్గర తక్కువే’ అంటున్న జైన్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో పనిచేసింది. ఏ ప్లస్ డి మ్యాగజైన్ ‘క్రియేటివ్ థీసిస్ డిజైన్ మెడల్’ అవార్డ్ అందుకుంది. ‘ప్రతిభకు వృత్తినిబద్ధత, పర్యావరణ స్పృహ తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి జైన్ బలమైన ఉదాహరణ’ అని చెబుతున్నారు ససకి సీనియర్ అసోసియెట్ రోసెన్ క్రాంజ్. ఆశావాదం, భవిష్యత్ దార్శనికత నుంచే ఏ డిజైనర్‌కు అయినా శక్తి వస్తుంది...అని బలంగా నమ్మే జైన్ ‘పచ్చటి భవిష్యత్’కు అవసరమైన నిర్మాణాలకు సృజనాత్మక ఆలోచనలు అందిస్తుంది. ఆర్కిటెక్చర్ అనేది స్థలకాలాల గురించి మాట్లాడటమే కాదు...పర్యావరణ హితమై ఉండాలి. భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించాలి.– మానుషీ జైన్ చదవండి: Samrat Nath: శెబ్బాష్ సామ్రాట్.. ఈ సైకిల్‌ను ఎవరూ దొంగిలించలేరు! -
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
మట్టి ఇళ్లను.. ప్రింట్ చేసుకుందాం..
మట్టి గోడలు.. చౌడు మిద్దెలు.. పర్యావరణానికి ఏమాత్రం నష్టం కలిగించని ఒకప్పటి ఇళ్లు. మిద్దె తయారీలో దూలాలు, కలప తప్ప ఏమాత్రం ప్రకృతి హానికారకాలు లేని నిర్మాణాలవి. మళ్లీ అవే ఇళ్లు మనకు భవిష్యత్ చూపబోతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి, మట్టి ఇళ్లను ‘ప్రింట్’ చేసుకునే సరికొత్త అవకాశం వచ్చేస్తోంది. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వందల ఏళ్ల కిందట కేవలం మట్టితో ఇళ్లు కట్టుకునేవారు. పునాదుల కోసమో, మరో అవసరానికో రాళ్లు వాడేవారు. ఆధారం కోసం దూలాలను, పైకప్పు కోసం కలపను వాడేవారు. స్థానికంగా దొరికే మట్టికి సున్నపురాయి కలిపి, ఒకరోజు ముందు నానబోసి, ఎద్దులతో తొక్కించి.. ముద్దలుగా పేర్చుతూ గోడలు కట్టేవారు. ప్రకృతికి ఏమాత్రం హాని చేయని నిర్మాణాలు అవి. ఇప్పుడదే తరహాలో ఆధునిక మట్టి ఇళ్లు కట్టుకునే అవకాశాన్ని ఇటలీ ఆర్కిటెక్ట్, విద్యావేత్త మారియో క్యూసినెల్లా అందుబాటులోకి తెచ్చారు. శతాబ్దాల కిందటి ఎడారి నాగరికతల నాటి ఇళ్లను తలపించేలా.. గుండ్రని ఆకృతిలో వీటి మోడల్‌ను రూపొందించారు. పూర్తిగా ఆధునికమైన త్రీడీ ప్రింటింగ్ విధానంలో ఇటీవలే ఇటలీలో ఈ మోడల్ ఇళ్లను నిర్మించారు. దగ్గర్లో దొరికిన మట్టితోనే.. మారియో డిజైన్ చేసిన త్రీడీ ఇళ్ల నిర్మాణంలో స్థానికంగా దొరికిన మట్టి, ఇతర వనరులనే వాడారు. అదనంగా ఉపయోగించింది తలుపులు, కుర్చీలు వంటివే. ఈ ఇళ్లలో లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూం వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. ‘‘ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి ఇళ్లు కోల్పోయినవారు నివాసం ఉండటానికి ప్రస్తుతం వేగంగా కల్పించగల ప్రత్యామ్నాయం ఇదే. ప్రకృతి విపత్తులు సంభవించిన చోటుకి ఈ త్రీడీ ప్రింటర్‌ను పంపిస్తే చాలు.. మట్టి తవ్వడం నుంచి పూర్తి నివాసయోగ్యమైన ఇల్లు కట్టడం దాకా పూర్తవుతుంది. భవిష్యత్తులో ఈ మట్టి ఇళ్లే కీలకంగా మారనున్నాయి’’ అని మరియో చెప్తున్నారు. త్రీడీ ప్రింటింగ్తోనే ఫర్నిచర్ కూడా.. మట్టి, సాంకేతిక మేళవించిన ఈ ఇళ్లకు మారియో.. ‘టెక్లా’ పేర్లు పెట్టారు. కందిరీగ ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా గమనించారా? బురదమట్టిని పోతపోసి ఉబ్బెత్తుగా నిర్మాణం చేసుకొని అందులోకి వెళ్తుంది. గుడ్లు పెట్టి పిల్లలైన తరువాత బయటికొస్తాయి. ఆ మట్టి నిర్మాణాలు గట్టిగా ఉంటాయి. వేరే కీటకాలూ వాటిని వినియోగించుకుంటాయి. అచ్చం అలాగే.. పొరలు పొరలుగా రెండు వృత్తాలు కలిసి ఉండే ఆకారంలో ఉబ్బెత్తుగా ఇళ్లను నిర్మిస్తారు. సెంట్రింగ్ పనిముట్లు అవసరం లేకుండానే.. 200 గంటల్లో 645 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని నిర్మించవచ్చని మరియో తెలిపారు. చుట్టూ గోడలు, లోపలి గోడలతోపాటు గోడకు ఆనుకుని ఉండే టేబుల్ వంటి నిర్మాణాలూ త్రీడీ ప్రింటర్‌తోనే రెడీ అయిపోతాయన్నారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన ‘కాప్ 26 క్లైమెట్ చేంజ్’ సదస్సులో కర్బన ఉద్గారాలు లేని ప్రాజెక్టుగా ‘టెక్లా’ ఎంపికవడం గమనార్హం. విపత్తులను తట్టుకునేలా నిర్మాణం ఈ మట్టి ఇళ్ల నిర్మాణం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఉద్గారాలు లేని యూరప్‌ను నిర్మించడమే తన లక్ష్యమని మారియో చెప్పారు. మట్టి ఇల్లు కదా.. వానలు, వరదలను తట్టుకుంటుందా అన్న ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా.. వానలు, వరదలు, భూకంపాలను తట్టుకునేలా త్రీడీ ప్రింటింగ్‌లో డిజైన్ చేశామన్నారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. -
చూడముచ్చటగా ఒకే రీతిలో.. ఇక ప్రభుత్వ భవనాలకు ఏకీకృత డిజైన్లు
సాక్షి, అమరావతి: తెలుగుదనం ఉట్టిపడే భవనాలు... సంప్రదాయం, ఆధునికత కలబోతగా నిర్మాణాలు... సకల సౌకర్యాలతో చూడముచ్చటైన సముదాయాలు... కేటగిరీలవారీగా ఏకీకృత డిజైన్లు... వెరసి రాష్ట్రానికి ఓ బ్రాండింగ్ తెచ్చేలా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం. డిజైన్ల కోసం దశాబ్దాలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీలకు భారీగా ప్రజాధనం ధారపోసే ఆనవాయితీకి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రభుత్వ భవనాలన్నీ ఏకీకృత డిజైన్లతో రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ తేవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డ్ (ఎస్‌ఏబీ) కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఆరు కేటగిరీల కింద నిర్దిష్ట డిజైన్లను రూపొందించింది. ఇకపై నిర్మించే భవనాలన్నీ ఈ ఆకృతుల ప్రకారమే ఉండాలని నిర్దేశించింది. సుదీర్ఘకాలం నిలిచేలా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, అన్ని వసతులతో ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భవనాలు రెండు రీతుల్లో ఉండేవి. సీమాంధ్రలో ఎక్కువ బ్రిటీష్ హయాంలో నిర్మించినవి కాగా తెలంగాణలో నిజాం కాలం నాటి కట్టడాలున్నాయి. నాణ్యతతో నిర్మించిన ఆ భవనాలు సుదీర్ఘకాలం సేవలు అందించాయి. తదనంతరం నిర్మించిన ప్రభుత్వ భవనాలపై ఓ నిర్దిష్ట విధానం లోపించింది. ఎక్కడికక్కడ వేర్వేరు డిజైన్లతో భవనాలను నిర్మించడంతో ఏకరూపత లేకుండా పోయింది. వాతావరణ పరిస్థితులు, మట్టి స్వభావం మొదలైనవి శాస్త్రీయంగా అంచనా వేయకుండా కట్టిన భవనాలు సరైన ప్రయోజనాన్ని అందించలేకపోతున్నాయి. అత్యధిక వ్యయం కావడంతోపాటు విలువైన స్థలం వృథా అయింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో భవిష్యత్ అవసరాల కోసం విస్తరించే అవకాశం లేకుండాపోయింది. ఈ అంశంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ భవనాలకు కేటగిరీల వారీగా నిర్దిష్ట డిజైన్లు ఖరారు చేయాలని ఎస్ఏబీని ఆదేశించారు. చదవండి: (వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్పోర్ట్) ఆరు కేటగిరీలుగా ఏకీకృత డిజైన్లు ప్రభుత్వ భవనాలకు ఆరు కేటగిరీలవారీగా ఏకీకృత డిజైన్లను ఎస్‌ఏబీ రూపొందించింది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలం నిలిచేలా భవనాల నిర్మాణానికి ప్రమాణాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని రెండు వాతావరణ జోన్లు, ఆరు వ్యవసాయ జోన్లను పరిగణనలోకి తీసుకుని భవనాల డిజైన్లను రూపొందించడం విశేషం. భవిష్యత్ అవసరాల కోసం భవనాల విస్తరణకు అవకాశం కల్పించింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా హేతుబద్ధమైన వ్యయంతో భవనాలను నిర్మించేలా డిజైన్లను రూపొందించింది. గ్రామాల్లో నిర్మించే పాఠశాలలు, పోలీస్ స్టేషన్ల నుంచి జిల్లా కేంద్రాలు, రాజధానిలో నిర్మించే పరిపాలన భవనాల వరకు అన్నింటినీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేలా నిర్దిష్ట డిజైన్లను ప్రభుత్వ ఆర్కిటెక్ట్‌లే రూపొందించడం విశేషం. రాష్ట్రంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలన్నీ ఈ డిజైన్ల ప్రకారమే నిర్మిస్తారు. ఏ శాఖ అయినా నూతన భవనం నిర్మించాలంటే ఎస్‌ఏబీ నుంచి నిర్దిష్ట డిజైన్ పొందాలి. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ నిర్వహించి భవన నిర్మాణాలు చేపట్టాలి. కన్సల్టెన్సీల దోపిడీకి అడ్డుకట్ట రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డు(ఎస్‌ఏబీ)ను ఇటీవల పునరుద్ధరించిన ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ కార్యాలయాల డిజైన్లు ఖరారు చేసే ఈ బోర్డును 1990– 2000 మధ్య అప్పటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. అప్పటి నుంచి కన్సల్టెన్సీల పెత్తనం సాగుతోంది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం భవన నిర్మాణాల డిజైన్ల కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఏకంగా రూ.500 కోట్ల వరకు ధారపోయడం ఈ దోపిడీకి పరాకాష్ట. ఆర్అండ్బీ శాఖలో సమర్థులు, నిపుణులైన ఇంజనీర్లను పక్కనపెట్టి డిజైన్ల రూపకల్పన కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలకు పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపారు. వీటికి తెర దించుతూ ‘ఎస్‌ఏబీ’ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఆర్థిక మంత్రి అధ్యక్షుడుగా, ఆర్థిక, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు పలువురు నిపుణులను సభ్యులుగా నియమించింది. ఆర్అండ్బీ శాఖ ప్రధాన ఆర్కిటెక్ట్, మరో ఇద్దరు ఆర్కిటెక్ట్లతోపాటు కొత్తగా 12 మంది ఆర్కిటెక్ట్‌లను నియమించింది. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ‘తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఎస్‌ఏబీ నిర్దిష్ట డిజైన్లను రూపొందించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి దీర్ఘకాలం నిలిచేలా డిజైన్లు ఖరారు చేసింది. రాష్ట్రానికి ఓ బ్రాండ్ ఇమేజ్ కల్పించేలా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం ఉంటుంది’ – కణితి నవీన్, ఓఎస్డీ, రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డ్ ఇవీ ఆరు కేటగిరీలు... 1. విద్యాసంస్థల భవనాలు ( పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు) 2. వైద్య, ఆరోగ్య శాఖ భవనాలు ( సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు) 3. పరిపాలన భవనాలు ( హెచ్‌వోడీ భవనాలు, అన్ని శాఖల భవనాలు) 4. వివిధ వ్యవస్థల భవనాలు ( న్యాయస్థానాలు, రవాణా సముదాయాలు, శాస్త్రవిజ్ఞాన క్యాంపస్‌లు) 5. నివాస సముదాయాలు ( క్వార్టర్లు, అతిథి గృహాలు, బంగ్లాలు, ఇతర వసతులు) 6. కమ్యూనిటీ భవనాలు ( స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆర్ట్ గ్యాలరీలు, కమ్యూనిటీ హాళ్లు, మ్యూజియంలు) -
Ramappa Temple: ఇక... అన్ని దారులూ ఇటువైపే!
ఎనిమిది వందల ఏళ్ల కిందటి మాట. రేచర్ల రుద్రుడు ముచ్చటపడి నిర్మించిన ఓ నిర్మాణం. ప్రాశస్త్యానికి కొదువలేదు... కొరవడింది ప్రచారమే. మన వాస్తుశిల్పుల నైపుణ్యానికి ఇది ఓ మచ్చుతునక. అయినా ఇటువైపు తిరిగి చూసిన వాళ్లు ఎందరు? వాస్తుశిల్పి రామప్ప పేరుతో రామప్ప గుడిగా వ్యవహారంలోకి వచ్చిన రుద్రేశ్వర ఆలయం నిర్మాణనైపుణ్యం గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు. ఓ గ్రంథమే రాయాలి. కాకతీయులు స్వతంత్ర రాజులైన తర్వాత నిర్మాణశైలిలోనూ స్వతంత్రతను, సృజనాత్మకతను ప్రదర్శించారు. కాకతీయుల తర్వాత ఈ ఆలయం ఆదరణకు నోచుకోలేదనే అభిప్రాయమే బలంగా ఉంది. కానీ ఇది వాస్తవం కాదంటారు పురావస్తు పరిశోధకులు, స్థపతి డాక్టర ఈమని శివనాగిరెడ్డి. నిజాం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసిన తరవాత ప్రభుత్వం రామప్పగుడికి సమీపంలో ఒక గెస్ట్ హౌస్ కట్టించి పర్యాటక ప్రాధాన్యం కల్పించింది. అయితే పర్యాటక ప్రదేశంగా రావల్సినంత ప్రాముఖ్యత రాకపోవడానికి కారణం ప్రచారం పెద్దగా లేకపోవడమే. డాక్టర్ సి. నారాయణరెడ్డి, పీవీ నరసింహారావు రచనలతో ఈ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా చాలాకాలం శ్రీకాకుళం వాళ్లకు కానీ చిత్తూరులోని సామాన్యులకు కానీ దీని గురించి తెలియనే తెలియదు. పత్రికలు కథనాలు రాయడం, టీవీలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణం ఉందనే సంగతి సామాన్యులకు చేరింది. ఈ ప్రదేశం కేంద్రపురావస్తుశాఖ అధీనంలో ఉండడం కూడా ఒక కారణమే. పురావస్తు శాఖ ఒక సైట్‌ను పరిరక్షిస్తుంది తప్ప ప్రచారం కల్పించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించలేదు. అది రాష్ట్రప్రభుత్వాల పని. ఈ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని చెప్పలేం. కానీ కొంతమేర ఆక్రమణలకు గురైన మాట నిజం. 2008 నుంచి మొదలైన ఒక ప్రయత్నం ఇప్పటికి నెరవేరింది. ఈ మధ్యలో చాలా జరిగాయి. మనదేశంలో ఉన్న హెరిటేజ్ కమిటీ పాలంపేటలో పర్యటించి... ఆక్రమణలను తొలగించమని, నిర్మాణాన్ని రీస్టోర్ చేయమని ఇంకా అనేక సూచనలు చేసింది. కేంద్రప్రభుత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ శాఖ, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో ఈ పదకొండేళ్ల కాలంలో చాలా పనులు జరిగాయి. గుడి వాస్తుశైలి, నీటి మీద తేలే ఇటుకలతో నిర్మాణ ప్రతిభ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ యునెస్కో నియమావళికి తగినట్లు ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పట్టింది. ఇన్నాళ్లూ ఎందుకిలా! రామప్ప గుడి నిర్మాణశైలిపరంగా, శిల్పలాలిత్యపరంగా ఎంత విశిష్టమైనదైనప్పటికీ పర్యాటకుల మనసును పెద్దగా తాకలేదు. కాకతీయుల నిర్మాణాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు సాధారణంగా హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి నేరుగా హన్మకొండకు వెళ్లి వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం చూస్తారు. వరంగల్ కోటను చూస్తారు. వరంగల్ కోట చూడడానికి షెడ్యూల్లో అనుకున్న టైమ్కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రామప్ప గుడి ఉంటుంది ప్రణాళికలో. అయితే భోజనాలు పూర్తయ్యేటప్పటికి మూడున్నర అయిపోతుంది. ఇప్పుడు రామప్పగుడికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు చేరేటప్పటికి ఎంత టైమవుతుందోనని మెల్లగా పునరాలోచన మొదలవుతుంది. గైడ్లు, స్నేహితులు కూడా తమవంతుగా నిరుత్సాహపరిచేవాళ్లు. పర్యాటకుల డైలమాను పోగొట్టడానికి ‘రామప్ప గుడి కూడా వేయిస్తంభాల గుడి ఉన్నట్లే ఉంటుంది. పైగా రెండూ శివాలయాలే. మళ్లీ అంతదూరం వెళ్లడం ఎందుకు? దూరం వంద కిలోమీటర్ల లోపే. అటవీ ప్రాంతం. తిరిగి వచ్చే సమయానికి చీకట్లు అలుముకుంటాయి. అక్కడ ఉన్నవి కూడా ఇలాంటి శిల్పాలే’ అని చెప్పి పర్యాటకులను తిరుగుముఖం పట్టించేవాళ్లు. అలా... వేయిస్తంభాల గుడి పర్యాటకుల్లో రామప్ప గుడి వరకు కొనసాగే వాళ్ల నంబరు సగానికి లోపే ఉండేది. రెండు రోజుల టూర్ ప్లాన్ ఉన్నవాళ్లు మాత్రం... లక్నవరంలో రాత్రి బస చేసి రెండవ రోజు రామప్ప గుడిని కవర్ చేసేవాళ్లు. ఇలాగ... ఈ నిర్మాణం పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోకపోవడంలో అందరి పాత్ర ఉంది. ఇకపై రూట్ మారుతుంది! ఇప్పుడు రామప్ప గుడికి ప్రపంచస్థాయి వచ్చింది. ఇక పర్యాటకుల టూర్ రూట్ కూడా మారిపోతుంది. రామప్ప గుడి దగ్గర మెరుగైన బస సౌకర్యాలు పెరుగుతాయి. రామప్ప గుడిని చూడడానికి ములుగు జిల్లా, పాలంపేటకు వచ్చిన పర్యాటకులు... ఆ తర్వాత రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పచెరువు, హన్మకొండలోని వెయ్యి స్థంబాల గుడి, వరంగల్ ఖిలాలు కవర్ చేస్తారు. ఇకపై పాలంపేటలో బస చేసి ఇవన్నీ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే ట్రెకింగ్, బోటింగ్ వంటివీ పెరుగుతాయి. ఈ పాలంపేట గ్రామం హస్తకళాకారులకు కూడా మంచి మార్కెట్ పాయింట్ అవుతుంది. వరంగల్ డరీస్, పెంబర్తి ఇత్తడి బొమ్మల వంటి స్థానిక హస్తకళలు మన ఖ్యాతిని చాటుతూ గర్వంగా ప్రపంచదేశాలకు చేరతాయి. భవిష్యత్తు బంగారమే! రామప్ప గుడి ప్రాశస్త్యాన్ని ఇప్పటి వరకు మనం మాత్రమే రాసుకున్నాం, చదువుకున్నాం. ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన తర్వాత ఈ నిర్మాణం గురించి దేశవిదేశాల్లో రచనలు వెలువడతాయి. మన దగ్గర కూడా ఈ నిర్మాణం గురించి ఇంకా ఎక్కువ పుస్తకాలు రావాలి. పర్యాటకులు ప్రతి ఒక్కరూ వెళ్తూ వెళ్తూ ఒక పుస్తకం కొనుక్కుని వెళ్తారు. వాళ్ల స్నేహితులకు, బంధువులకు చూపిస్తారు. ఇప్పటి వరకు మల్లారెడ్డి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందుకు అవసరమైనట్లు సంక్షిప్త సమాచారంతో చిన్న పుస్తకాల అవసరం ఉంది. యునెస్కో ప్రకటనతో ఇక ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పర్యాటకుల సంఖ్య పెరిగితే గైడ్లు, బస కోసం లాడ్జిలు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్, భోజనానికి హోటళ్లు పెరుగుతాయి. హౌస్‌కీపింగ్, ఎస్కార్ట్, లాండ్రీ వంటి సర్వీస్ రంగాలకు డిమాండ్ ఎక్కువవుతుంది. డాన్స్ షో ఏర్పాటు చేస్తే కళాకారులు, వాద్యకారులు ఉపాధి పొందుతారు. అలాగే వసతుల కల్పనలో ప్రకృతి సుందరీకరణ చెక్కు చెదరకుండా జాగ్రత్త పడాలి. -
చేతన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది
చేతనాజైన్... ఆర్కిటెక్ట్. యాభై మంది ఉద్యోగులున్న తన సొంత సంస్థకు ఆమె సీఈవో. తండ్రి స్థాపించిన సంస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న మహిళ కాదామె. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఓ ట్రెండ్‌సెట్టర్. ఆర్కిటెక్చర్ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే. కానీ ఎక్కువ మంది మగవాళ్లు స్థాపించిన సంస్థలో ఉద్యోగి గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్ వైపు మరలిపోతుంటారు. అలాంటి సమయంలో ఇరవై రెండేళ్ల కిందట సొంత సంస్థను స్థాపించి, నిర్మాణరంగంలో తనదైన పాదముద్రలు వేసిన మహిళ చేతనా జైన్. అమ్మ అనుసరించిన సూత్రమే.... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చేతనాజైన్ ది గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను విస్తృతంగా చేస్తున్నారామె. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేల మీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించిన సూత్రమే తన విజయానికి పునాది అన్నారు చేతనాజైన్. ‘‘ఏ నేల మనకు జీవితాన్నిస్తుందో ఆ నేలను, అక్కడి భాష ను గౌరవించాలనేది మా అమ్మ. కనీసం బస్సుల మీద పేర్లు చదవగలగాలి కదా అనేది. అలా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాను. ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో నా వంతు వచ్చేటప్పటికి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఖాళీలున్నాయి. ఆర్కిటెక్ట్ ఏం పని చేయాల్సి ఉంటుందని అడిగి తెలుసుకుంది మా అమ్మ. ‘పెళ్లయిన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు’ అని ఆర్కిటెక్చర్లో చేర్చేసింది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ తర్వాత జెమ్షెడ్పూర్లో ఎంబీఏ చేశాను. స్వయంగా ఇన్వాల్వ్ అయినప్పుడే... ఎన్ఆర్ అసోసియేషన్స్‌లో మల్లికార్జునరావుగారి దగ్గర జూనియర్‌గా ఒకటిన్నర ఏడాది పని నేర్చుకున్నాను. కాలేజ్‌లో కాన్సెప్ట్ మాత్రమే తెలుసుకుంటాం. అసలైన పని వచ్చేది ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే. ‘ఒక బిల్డింగ్ పునాది నుంచి పూర్తయే వరకు ప్రతి పనిలోనూ స్వయం గా ఇన్వాల్వ్ అయినప్పుడే పనిలో నైపుణ్యం వస్తుంది’ అని ఆయన చెప్పిన మాటే నా కెరీర్ నిర్మాణానికి పునాది. చేతిలో పని లేకపోతే పాత డిజైన్లను తీసి చూస్తుంటే.. అదే స్థలంలో ఇంకా చక్కని డిజైన్ వేయడానికి ఉన్న అవకాశాలు అవగతమవుతాయని చెప్పారు. హైదరాబాద్, మొజంజాహి మార్కెట్ రెస్టోరేషన్ విజయవంతంగా చేయగలిగానంటే అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలే కారణం. ఆయన పోయిన తర్వాత ఇక ఉద్యోగం చేయలేదు. సొంత ఫర్మ్ పెట్టాను. భవనం జెండర్ చూడదు ‘‘నువ్వు కట్టే భవనం నువ్వు స్త్రీవా, పురుషుడివా అని చూడదు. ఇక్కడ పనిచేసేది జెండర్ కాదు మన మెదడు మాత్రమే. ఆడవాళ్లం కాబట్టి ఆఫీస్‌కే పరిమితం అనుకుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేరు. మీరు వేసిన డిజైన్‌ను సైట్లో భవన రూపంలోకి తెచ్చే పనిలో కూడా భాగస్వాములయి తీరాలి. అప్పుడే ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అర్థమవుతాయి. అవసరమైతే సైట్లో ఆ క్షణంలోనే డిజైన్ని మార్చి ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మహిళలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప మహిళని కదా అని పని లో వెసులుబాటు వెతుక్కోకూడదు’’ అంటారు ఈ రంగంలో కొత్తగా చేరే స్త్రీలతో చేతనాజైన్. నిజానికి ప్రతి రంగమూ అందరిదీ. ఆడవాళ్లు అడుగు పెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యంగా ఒక ముద్ర వేసుకుని ఉంటుంది. కొన్ని కనిపించని పరిధులు విధించుకుని ఉంటుంది. ఆ సరిహద్దు గీతను తుడిచేస్తున్న మహిళల్లో చేతనాజైన్ కూడా ఒకరు. కెరీర్‌కి కిరీటం వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మొజంజాహి మార్కెట్ పునరుద్ధరణ పనిని 2016 చివర్లో మొదలుపెట్టాం. ఆ నిర్మాణం తొలిరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆరునెలలకు పైగా పట్టింది. హబ్సిగూడలో ఉన్న స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఈ భవనానికి సంబంధించిన ప్రతి ఆధారమూ ఉంది. నిజాం నవాబు 1935లో ఈ భవనం కోసం విడుదల చేసిన తొలి మొత్తం 30 రూపాయల డాక్యుమెంట్‌తో సహా ఉన్నాయి. దుకాణదారులు ఎవరికి వాళ్లు తమకు కావల్సినట్లు కరెంట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, ఫ్లోరింగ్ వేసుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి వాళ్ల అవసరాలు నెరవేరేటట్లు చూస్తూనే, భవనం అసలు స్వరూపాన్ని పరిరక్షించగలిగాం. ఇందుకోసం మా టీమ్ రెండేళ్లు పని చేసింది. కమర్షియల్‌గా అయితే రెండేళ్లలో సమాంతరంగా అనేక ప్రాజెక్టులు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి చేయడం కెరీర్‌కి గర్వకారణం. – చేతనాజైన్, సీఈవో, ధ్రుమతారు కన్సల్టెంట్స్ – వాకా మంజులారెడ్డి -
Australia: ఎంత చెత్త దొరికితే.. ఈ దీవిని అంత పెంచుతారట
వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులను ఏం చేస్తాం?.. బయట చెత్తలో పడేస్తాం.. మరి ఈ ప్లాస్టిక్ చెత్తంతా ఎక్కడికిపోతోంది?.. అటూ ఇటూ తిరిగి అంతా సముద్రాల్లోకి చేరుతోంది. ఇటు మనుషులకు, అటు సముద్ర జీవులకు ఇదో పొల్యూషన్ సమస్య. ఈ ఇబ్బందిని ఎంతో కొంత తగ్గిస్తూనే.. అదే సమయంలో ఆహ్లాదం కలిగించేలా.. ప్లాస్టిక్ చెత్తతో సముద్రంపై ఓ రిసార్ట్ కట్టేస్తే..! అలలపై అలా అలా తేలుతూ ఎంజాయ్ చెయ్యగలిగితే..! భలే ఐడియా కదా. ఆ్రస్టేలియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మార్గోట్ క్రసోజెవిక్ నీటిమీద తేలుతూ ఉండే ఈ సరికొత్త ఐలాండ్ రిసార్ట్‌ను డిజైన్ చేశారు. దీనికి ‘రీసైకిల్డ్ ఓసియన్ ప్లాస్టిక్ రిసార్ట్’గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఖండానికి కాస్త దూరంలో ఉన్న కీలింగ్ (కొకోస్) దీవుల దగ్గర సముద్రంలో దీన్ని కట్టేందుకు ఇప్పటికే ప్లానింగ్ మొదలుపెట్టారు. హిందూ మహా సముద్రంలో చేరిన ప్లాస్టిక్ చెత్తతో దీన్ని నిర్మించనున్నామని.. 2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. చెత్త దొరికే కొద్దీ.. దీవి పెరుగుతూ.. ‘ఫ్లోటింగ్ ఐలాండ్ రిసార్ట్’ కోసం.. ముందు కలప, బయో డీగ్రేడబుల్ ఫైబర్ కాంక్రీట్ మెష్ (మెల్లగా క్షీణిస్తూ పర్యావరణంలో కలిసిపోయే ఫైబర్ వల)తో ప్రధాన నిర్మాణాన్ని కడతారు. దానికి చుట్టూ మెష్‌తో వాక్ వేలు (నడిచే దారులు) నిర్మిస్తారు. ఐలాండ్ రిసార్ట్ నీటిపై తేలుతూ, స్థిరంగా ఉండటానికి ఆయిల్ రిగ్స్ (చమురు తవ్వితీసే కేంద్రాల) తరహాలో ప్రత్యేక పరికరాలను అమర్చుతారు. ఈ ఐలాండ్ సముద్రంలో తేలుతూ కదులుతున్న కొద్దీ ఈ వలలో ప్లాస్టిక్ చెత్త చిక్కుతూ ఉంటుంది. దానిని గట్టిగా సంచుల్లో నింపి.. ఈ వాక్వేలలోనే గట్టిగా బిగిస్తారు. వాటిపై కాస్త ఇసుక, మట్టి వంటివి పరిచి, దారుల్లాగా మార్చుతారు. ఈ వాక్‌వేలు పూర్తయ్యాక చుట్టూ మరిన్ని మెష్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిల్లో చిక్కుకునే ప్లాస్టిక్ చెత్తతో వాక్‌వేలను రూపొందిస్తారు. ఇలా దీవిని విస్తరించుకుంటూ వెళ్లవచ్చని రూపకర్తలు చెప్తున్నారు. చదవండి: అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు -
నేల మీద ప్రయాణిస్తొన్న పంజాబ్ రాఫెల్
-
వైరల్: నేల మీద ప్రయాణిస్తొన్న పంజాబ్ రాఫెల్!
చంఢీగఢ్: విమానం అనగానే మనకు వేగం..ఆకాశంలో ఎగరడం గుర్తొస్తుంది. అయితే ఈ ‘పంజాబ్ రాఫెల్’ మాత్రం కాస్త స్సెషల్ . ఇది ఆకాశంలో కాకుండా నేలమీద ప్రయాణిస్తొంది. పంజాబ్‌లోని బతిండాకు చెందిన ఆర్కిటెక్ట్ రాంపాల్ బెహనీవాల్ దీన్ని తయారు చేశాడు. కాగా, రాఫెల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దీన్ని తయారు చేసినట్టు ఆయన తెలిపాడు. ఇది రాఫెల్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ పంజాబ్ రాఫెల్ నేలపై గంటకు 15-20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీని తయారీకి మూడు లక్షలు ఖర్చయ్యిందని రాంపాల్ తెలిపాడు. కాగా, రాఫెల్లో ఎగరలేని వారు తన పంజాబ్ రాఫెల్లో ప్రయాణించి కోరిక నెరవేర్చుకోవచ్చని తెలిపాడు. మొత్తానికి ఈ రాఫెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పంజాబ్ ఆర్కిటెక్ట్ తెలిపాడు. చదవండి: వైరల్: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓడ! -
ఆటోపై లగ్జరీ హౌజ్.. ఆనంద్ మహీంద్ర ఫిదా
న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యాడు. ఆటోపై లగ్జరీ హౌజ్‌ను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అరుణ్ ప్రభు ఏడాది క్రిత న నిర్మించిన ఈ మొబైల్ హౌజ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఆటో మొబైల్ హౌజ్‌లో ఒక చిన్న బెడ్ రూమ్, కిచెన్, లివింగ్ ఏరియా, బాత్రూమ్తో పాటు వర్కింగ్ ఎరియాకు కూడా గది ఉంది. అంతేకాదు ఈ ఇంటిపై ప్రభు 250 లీటర్ల వాటర్ ట్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. ఈ మొబైల్ ఇంటిని నిర్మించడానికి అతడికి లక్ష రూపాయల వరకు ఖర్చయ్యిందట. అది చూసి సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకు అరుణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర సైతం అరుణ్ పనితీరుకు ఫిదా అయ్యారు. ఆదివారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చిన్న చిన్న స్థలాల్లోనూ నివాస సదుపాయాలు ఎలా ఎర్పరుచుకోవచ్చు అనేది అరుణ్ ప్రభు చేసి చూపించాడు. అయితే త్వరలో అరుణ్ దృష్టి ఇంతకంటే పెద్ద ట్రెండ్‌పై పడాలనుకుంటున్నాను. బొలెరోపై కూడా ఇలాంటి ఇంటిని నిర్మిచగలడా అని నేను అతడిని అడగాలనుకుంటున్న. ఎవరైనా అతడి వివరాలను నాకు తెలుపగలరా’ అంటూ ట్వీట్ చేశారు. Apparently Arun did this to demonstrate the power of small spaces. But he was also on to a larger trend: a potential post-pandemic wanderlust & desire to be ‘always mobile.’ I’d like to ask if he’ll design an even more ambitious space atop a Bolero pickup. Can someone connect us? https://t.co/5459FtzVrZ — anand mahindra (@anandmahindra) February 27, 2021 చదవండి: కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా? గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క -
భారీగా ఆలయ నిర్మాణం
అహ్మదాబాద్/అయోధ్య: శ్రీరాముని జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల రామనామంతో పుర వీధులు ప్రతిధ్వనిస్తున్నాయి. మందిర నిర్మాణానికి 5వ తేదీన భూమిపూజ చేస్తున్న నేపథ్యంలో మందిరం డిజైన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంది. మొదట అనుకున్న దానికంటే రెట్టింపు సైజులో మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగర శైలిలో మందిరం ఆకృతి ఉంటుంది. గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయ ఆకృతిలో మార్పులు చేశామని, గతంలో కంటే భారీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆలయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమ్‌పుర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ శిఖరంతో పాటు రెండు గోపురాలు ఉండేలా గతంలో మందిరాన్ని డిజైన్ చేశామని ఇప్పుడు వాటి సంఖ్య అయిదుకి పెంచినట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మందిరానికి ఆకృతి ఆలయాల నిర్మాణంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర వంశస్తులు ప్రఖ్యాతి వహించారు. ఒకప్పుడు సోమనాథ్, అక్షరధామ్ ఆలయంతో పాటు 200పైగా ఆలయాలకు వీరు డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ వంశానికి చెందిన చంద్రకాంత్ సోమ్‌పుర (77) తన ఇద్దరు కుమారులతో కలిసి రామ మందిర నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. 30 ఏళ్ల క్రితమే విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ మందిరానికి డిజైన్ చేయాలని చెప్పినట్టుగా ఆయన వెల్లడించారు. ఆలయ విశిష్టతలు ► ఉత్తరాది ఆలయాల్లో కనిపించే నాగర శైలిలో మందిరం ఉంటుంది. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► మూడు అంతస్తుల్లో నిర్మించే రామ మందిరంలో అయిదు గోపురాలతో మండపాలు, శిఖరం ఉంటాయి. ► ఆలయం ఎత్తు 161 అడుగుల వరకు ఉంటుంది. ► 10 ఎకరాల స్థలంలో మందిరం, మిగతా 57 ఎకరాల్లో వివిధ సముదాయాలను నిర్మిస్తారు. ఢిల్లీలో భారీ తెరలు ఏర్పాటు సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో 5న జరిగే మందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా చెప్పారు. అయోధ్యలో భూమి పూజ రోజు పంచేందుకు మిఠాయిలు సిద్ధంచేస్తున్న దృశ్యం -
కోటల కంటే ఇల్లే కష్టం
రోజుకు ఇరవై నాలుగ్గంటలు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏళ్లకు ఏళ్లు బరువు మోసిన అలసిన స్తంభాలు కత్తి యుద్ధాలు... ఫిరంగి దాడులతో... నెత్తురోడిన గోడలు... ఇంకే ఘోరాలు చూడాల్సి వస్తుందోనని భయపడే పైకప్పులు నేలకు వాలి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధమవుతుంటాయి. అదే జరిగితే... వాటిని అలాగే వదిలేస్తే...‘ఇదీ మా గొప్పతనం’ ఏమి చూపించాలి? భవిష్యత్తు తరాలకు...మన ముఖం ఎలా చూపించాలి? అందుకే వాటిని పునరుద్ధరిస్తోంది ఐశ్వర్య వందల ఏళ్ల నాటి కట్టడాలకు...కొత్తగా పాతరూపుని తెస్తోంది. మన భవన నిర్మాణ కౌశలాన్ని పరిరక్షిస్తోంది.వారసత్వ కట్టడాల వైభవాన్ని పునరుద్ధరిస్తోంది. ‘ఇల్లు కట్టి చూడు– పెళ్లి చేసి చూడు’ అనే నానుడి ఎందుకొచ్చి ఉంటుంది? ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం రెండూ అత్యంత కష్టమైన పనులు కాబట్టి. ఇప్పుడీ పనులన్నీ వ్యవస్థీకృతమైపోయాయి. పెళ్లి చేయాలంటే ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందోననే బెంగ అక్కర్లేదు, పూల మండపం ఎవరు బాగా కడతారని ఆరాలు తీసే పనీ లేదు. మంగళవాయిద్యాల బృందం ఎక్కడ దొరుకుతుందోనని చూడాల్సిన పనీ లేదు. మంచి వంటవాళ్లు ఎవరోనని వాకబు చేయాల్సిన పని అంతకంటే లేదు. ఈ పనులన్నీ ఈవెంట్ నిర్వహకులు చేసి పెట్టేస్తున్నారు. అలాగే ఇల్లు కట్టాలన్నా సరే... స్థలం చూపించి మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ జాబితా ఇచ్చి, ఇంత మొత్తం అని వాళ్ల చేతిలో పెడితే ఇల్లు రెడీ అయిపోతోంది. ఇంటి వారు చేయాల్సింది గృహ ప్రవేశం ఒక్కటే. కొత్త ఇల్లు కట్టడం ఓకే, మరి... ఎప్పుడో కట్టిన ఇంటిని తిరిగి కట్టాల్సి వస్తే? అది మాత్రం చిన్న పని కాదు, దానికంటే కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా సులభం. నిజమే, అలాగని ఉన్న ఇంటిని నేల కూల్చడానికి మనసంగీకరిస్తుందా? చూసే వారికి ఆ ఇల్లు కేవలం గోడలు, కిటికీలు, పైకప్పు మాత్రమే కావచ్చు... ఆ గోడలతో మనకు కొన్ని జ్ఞాపకాలు అల్లుకుని ఉంటాయి. అమ్మ కిటికీలో నిలబెట్టి గోరుముద్దలు తినిపిస్తుంటే... ఆకాశంలో చందమామను చూస్తూ కిటికీ చువ్వలు పట్టుకుని ఊగిన బాల్యం గుర్తుకు వస్తుంది. ఆ ఇంటిని కట్టిన తాతయ్య కళ్ల ముందు మెదలుతాడు. ‘నువ్వు కట్టిన ఈ ఇంటిని నా కంఠంలో ప్రాణం ఉండగా కూల్చను తాతయ్యా, దీనికి మరమ్మత్తులు చేసి ఆధునిక సౌకర్యాలతో నా పిల్లలకు అనువుగా మలుచుకుంటాను’ అని తాతయ్య ఫొటో ముందు మాట ఇచ్చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం పాత ఇంటిని పునరుద్ధరించే పనిలో పడతాం. చూసిన వాళ్లు ‘ఇంత కష్టపడడం ఎందుకు? కొత్త ఇల్లు కట్టుకోవచ్చు’ అని మూతి విరిచినా సరే... ఆ విరుపులేమాత్రమూ బాధించవు. సరికదా... పాత గోడలను తాకినప్పుడు మనల్ని తడిమే జ్ఞాపకాలు మనల్ని ఉయ్యాలలూగిస్తాయి. ఇంటితో ఉండే అనుబంధం అంత గట్టిది. మరి మన పెద్దవాళ్లు మనకోసం మిగిల్చిన జ్ఞాపకాల సంపద వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడమైతే? ఎవరెన్ని అన్నా సరే, తప్పని సరిగా పరిరక్షించుకోవాల్సిందే. ఆ కట్టడం అందులో నివసించే వాళ్లకు మాత్రమే కాదు, దేశానికి కూడా అది జ్ఞాపకాల సంపదే. ఢిల్లీలోని సేత్ రామ్ లాల్ ఖేమ్కా హవేలీలో నివసిస్తున్న దేవకీ నందన్, నేహా దంపతులు కూడా అలాగే అనుకున్నారు. దేవకీ నందన్‌కి ఢిల్లీ, కశ్మీరీ గేట్ సమీపంలో ఉన్న హవేలీ 175 ఏళ్ల నాటి కట్టడం. మొఘలుల కాలం నాటి నిర్మాణం. ఆ హవేలీకి మరమ్మత్తులు చేసుకున్నారు, అప్పుడు ఎలా కట్టారో అచ్చం అలాగే మళ్లీ కట్టారా అనిపించేటట్లు పునరుద్ధరించుకున్నారు. ఢిల్లీ చాందినీ చౌక్‌లోని ధరంపురా హవేలీ కూడా అలాంటిదే. ఈ రకంగా పాతనిర్మాణాలకు కొత్తదనం తెస్తున్న ఆర్కిటెక్ట్ ఐశ్వర్య తిప్నీస్. మాహిద్‌పూర్ కోట పాతతరం కట్టడాలను పరిరక్షిస్తున్న నవతరం ఆర్కిటెక్ట్ ఐశ్వర్యా తిప్నీస్. మధ్యప్రదేశ్‌లోని మాహిద్‌పూర్ కోట, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చదువుకున్న డెహ్రాడూన్ స్కూలు, కోల్‌కతా చందన్ నగర్‌లోని ఫ్రెంచ్ చర్చ్... ఇలా ప్రత్యేకమైన నిర్మాణకౌశలానికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను పటిష్టపరిచారామె. మాహిద్‌పూర్ కోట ఉజ్జయిని జిల్లాలో ఉజ్జయిని పట్టణానికి 50 కి.మీ.ల దూరాన ఉంది. మధ్యయుగం నాటి ఈ నిర్మాణానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఈస్టిండియా కంపెనీకి మరాఠా సమాఖ్యకు మధ్య 1817లో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని మాహిద్‌పూర్ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో స్థానిక హోల్కర్ రాజులు, యువరాజుల నుంచి సామాన్యుల వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ యుద్ధంలో కోట దాదాపుగా ధ్వంసమైందనే చెప్పాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత చాలాకాలం భారత ప్రభుత్వం కోటల నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో నిర్మాణాలు మరింతగా శిథిలం కాసాగాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టుల ఆధారంగా చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకునే పని మొదలైంది. అంతటి కీలకమైన, అత్యంత సంక్లిష్టమైన పనిని చేపట్టిన ఆర్కిటెక్ట్ ఐశ్వర్య. దేశంలో పేరు మోసిన ఆర్కిటెక్టుల్లో ఎక్కువ మంది మగవాళ్లే ఉన్నారు. ఓ ఇరవై ఏళ్లుగా అమ్మాయిలు ఎక్కువ మంది ఆర్కిటెక్చర్ కోర్సు చేస్తున్నారు. అయితే వాళ్లలో ఎక్కువ మంది సీనియర్ ఆర్కిటెక్ట్ దగ్గర సహాయకులుగానే ఉంటున్నారు. కొంతమంది సొంతంగా కెరీర్లో నిలదొక్కుకున్నప్పటికీ ఇంత భారీ స్థాయి కోటల పునరుద్ధరణ బాధ్యత తలకెత్తుకున్నది ఐశ్వర్య మాత్రమే. సేత్ రామ్ లాల్ ఖేమ్కా హవేలీలో దేవకీ నందన్, నేహా దంపతులు మన సంప్రదాయమే ఐశ్వర్య ‘న్యూ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ స్టూడెంట్. గ్రాడ్యుయేషన్ 2003లో పూర్తయింది, తర్వాత స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీ నుంచి ‘యూరోపియన్ అర్బన్ కన్జర్వేషన్’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇప్పుడామె సొంత సంస్థ నిర్వహిస్తూ (ఐశ్వర్య తిప్నీస్ ఆర్కిటెక్ట్స్) ఆమె చదివిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారసత్వ కట్టడాల పునరుద్ధరణ ఆమెకు ఇష్టమైన వ్యాపకం. ‘ఆ ఇష్టమే ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టడానికి దారి తీసింది’ అంటారు ఐశ్వర్య. ‘‘పరిరక్షణ అనేది మనకు తెలియని విద్యేమీ కాదు. ఒక వస్తువుని పరిరక్షించడం అనేది మన భారతీయ సంప్రదాయంలోనే ఉంది. యూజ్ అండ్ త్రో విధానం మనది కాదు. ఒక వస్తువుని ఎన్ని రకాలుగా వాడవచ్చో అన్ని రకాలుగా మలుచుకుంటూ ఉపయోగిస్తాం. దానినే ఇప్పుడు ‘గోయింగ్ గ్రీన్ అని, సస్టెయినబులిటీ’ అనీ అంటున్నాం. భవననిర్మాణ రూపకల్పనను వృత్తిగా ఎంచుకోవడం వరకే నా చాయిస్. ఆ తర్వాత నా ఇష్టం ఎటువైపు తీసుకెళ్తే అటు సాగింది నా ప్రయాణం. మన సంప్రదాయ నిర్మాణాలు, చారిత్రక కట్టడాల మీద నాకున్న ఇష్టమే... వాటిని పరిరక్షించడాన్ని కెరీర్‌గా తీసుకునేలా ప్రభావితం చేసింది’’ అన్నారామె. ఐశ్వర్య హెరిటేజ్ కన్జర్వేషన్ ఆర్కిటెక్చర్లో తాను అధ్యయనం చేసిన అంశాలను వార్తా పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ‘వెర్నాక్యులర్ ట్రెడిషన్, కాంటెంపరరీ ఆర్కిటెక్చర్’ అనే పుస్తకం కూడా రాశారు. పునరుద్ధరణ ఓ ఉద్యమం చందన్ నగర్ పట్టణం కోల్‌కతాకు దగ్గరగా ఉంటుంది. అక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉంది. ఫ్రెంచ్ వాస్తుశైలి భవనాలు వంద వరకున్నాయి. అవన్నీ వారసత్వంగా కాపాడుకోవాల్సిన నిర్మాణాలే. అయితే వాటి గొప్పతనం పట్ల స్థానికులకు పెద్దగా పట్టింపు లేదు. స్థానిక యువతను చైతన్యవంతం చేయడంతోపాటు వారసత్వ కట్టడాల మీద ఆసక్తి ఉన్న యువ ఆర్కిటెక్ట్‌లను సమీకరించి, వారందరి సహకారంతో ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగాను. నిజానికి అదొక సోషల్ మూవ్మెంట్ అనాలి. అంత ప్రయాస పడిన తర్వాత మాత్రమే ఆ పట్టణానికి ఉన్న చారిత్రక నిర్మాణ నైపుణ్యాన్ని తిరిగి తీసుకురాగలిగాను. గత ఏడాది జనవరిలో ఫ్రెంచ్ అంబాసిడర్ అలెగ్జాండ్రె జిగ్లర్ నుంచి అవుట్ స్టాండింగ్ కమిట్‌మెట్ అవార్డు అందుకున్నాను. ఇది ఫ్రెంచ్‌లో కళ, సాంస్కృతిక రంగాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ వారసత్వ కట్టడాలను పునరుద్ధరించినందుకు ఈ అవార్డు వచ్చింది. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ పునరుద్ధరణను పూర్తి చేసినందుకు యునెస్కో నుంచి ప్రశంసాపత్రం అందుకోవడం కూడా నాకు అత్యంత సంతోషకరమైన సందర్భమే అయితే నేను చేపట్టిన నిర్మాణ పునరుద్ధరణ పనులన్నీ ఏ ఒక్కరిద్దరితోనో పూర్తయ్యేవి కావు, సమష్టి కృషితోపాటు అందరిలో నాకున్నంతటి పట్టుదల లేకపోతే సాధ్యమయ్యే పనులు కానే కాదు. అందుకే ఏ పురస్కారమైనా నా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుంది. – ఐశ్వర్య తిప్నీస్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ చందన్ నగర్‌లోని ఫ్రెంచ్ చర్చ్ కోటల కంటే ఇల్లే కష్టం కోటలకు మరమ్మత్తులు చేసి పటిష్టపరచడం కష్టం అనుకుంటాం. కానీ ఇళ్లను పరిరక్షించడమే కష్టమైన పని అంటారు ఐశ్వర్య. ‘‘కోటల ఒరిజినల్ డిజైన్‌కు అనుగుణంగా పని చేస్తే సరిపోతుంది. అప్పుడు వాడిన లైమ్, సాండ్ స్టోన్ల స్థానంలో అదే లుక్ తీసుకురావడానికి కొంత వరకు ప్రత్యామ్నాయాలను కూడా వాడవచ్చు. ఇళ్లను పునరుద్ధరించేటప్పుడు ఏ మాత్రం రాజీ పడడానికి వీల్లేదు. ఉదాహరణకు ఆ భవనం కట్టినప్పుడు కిటికీలకు రంగు అద్దాలను వాడినట్లయితే ఇప్పుడా డిజైన్, షేడ్ కోసం మార్కెట్లు గాలించాల్సిందే. మోడల్ అద్దాన్ని పట్టుకుని నెలలపాటు గాలించిన సందర్భాలూ ఉన్నాయి. దానికి తోడు ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్లు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా వాళ్లంతట వాళ్లే కొన్ని మార్పులు చేసుకుని ఉంటారు. గ్రైండర్, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం టెంపరరీ వైరింగ్ చేసుకుని ఉంటారు. కొన్ని వైర్లు బయటకు వేళ్లాడుతూ ఉంటాయి. ఈ ఇరవై ఒకటో శతాబ్దపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటీరియర్ అంతా రీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అటాచ్డ్ టాయిలెట్, క్లోజెట్, మాడ్యులార్ కిచెన్‌తో ఇంటికి మోడరన్ టచ్ ఇవ్వాలి. అదే సమయంలో ఆ భవనం నిర్మాణ కాలం నాటి మనోహరరూపాన్ని కాపాడాలి. నమ్ముతారో లేదో కానీ మాకు మాహిద్ కోట పునరుద్ధరణకు మూడేళ్లు పడితే సేత్ రామ్ లాల్ ఖేమ్కా హవేలీకి దాదాపుగా ఎనిమిదేళ్లు పట్టింది. ఒకటే ప్రాజెక్టు మీద అన్నేసి సంవత్సరాలు పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలంటా’’రామె. తన విజయ రహస్యం గురించి చెబుతూ... ‘‘ఆర్కిటెక్ట్ మిత్రులు... ఒక్కో ప్రాజెక్ట్ కోసం ఇన్నేసి సంవత్సరాలు గడపాలంటే బోర్ అంటారు. చిన్నప్పుడు చదువుకున్న ‘కుందేలు– తాబేలు’ కథలోని తాబేలు గెలుపే నాకు స్ఫూర్తి. ఎన్ని ప్రాజెక్టులు చేశాననే సంఖ్య కంటే ఎంతమంచి ప్రాజెక్టులు చేశాననే సంతృప్తే నాకు ముఖ్యం’’ అన్నారు ఐశ్వర్య తిప్నీస్ సంతోషంగా. – మంజీర -
రామప్పలో కచ్చడాల దురాచారం?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాంఘిక దురాచారాల్లో ఒకటిగా పరిగణించే ఇనుప కచ్చడాల దురాచారం కాకతీయుల కాలంలో అమలులో ఉందా? అంతః పుర కాంతల శీలం కాపాడేందుకు ఈ దుర్మార్గపు సంప్రదాయాన్ని వారేమైనా అమలు చేశారా? లేదా అమానవీయమైన ఈసంస్కృతి కాకతీ యు ల కాలంలోనే అంతరించిపోయిందా ? అంటే.. అవుననే చర్చకు తెరతీస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపేశ్వరాలయంతోపాటు రామప్ప ఆలయంపై ఉన్న స్త్రీల శిల్పాలు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు కావడంతో నాటి పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయుల కాలంలో శిల్పకళ ఉన్నత స్థితిలో వర్ధిల్లింది. రామప్ప ఆలయమే ఇందుకు ఉదాహరణ. కాకతీయుల కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు. వీటిలో రామ ప్ప, గణపురం కోటగుళ్లు ప్రముఖమైనవి. గణపు రం కోటగుళ్లలోని ప్రధాన ఆలయంలో శివుడు ఆరాధ్య దైవం. ఇక్కడ మొత్తం 22 ఆలయాలు ఉన్నాయి. వీటి చుట్టూ మట్టి కోట నిర్మాణం ఉంది. కాకతీయుల కాలంలో గణపురం కోటగుళ్లు ఉన్న ప్రదేశం గొప్ప సైనిక స్థావరంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ నిత్యం పూజలు జరుగుతున్నాయి. పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం ఎడమ వైపు ఉన్న గోడపై వివిధ శిలాకృతులు ఉన్నాయి. ఇందులో రెండు స్త్రీ శిల్పాలు లోహ కచ్చడాలను ధరించినట్లుగా చెక్కారు. అలాగే రామప్ప ఆలయంపైన కూడా ఇలాంటి శిల్పాలే ఉన్నాయి. తేల్చాల్సిన విషయమే.. గణపేశ్వరాలయం ప్రధాన ఆలయం ఎడమవైపు గోడతోపాటు మట్టికోటలోనే హరిత హోటల్ వద్ద భద్రపరచిన శిల్పాల్లో మరొకటి ఇదే తరహాలో ఉంది. ఈ శిల్పం ఉన్న తీరులో ఎలాంటి లైంగిక భంగిమలకు ఆస్కారం లేదు. అంతేగాక శృంగారోద్దీపన లేదు. మిగతా శరీర వస్త్రాలను చూపించడం లేదు. కేవలం అంతవస్త్రంలాంటిది తొలగిస్తున్న మహిళగా ఈ శిల్పం ఉంది. ఈ వస్త్రాన్ని చెక్కిన తీరు అచ్చం ఇనుప కచ్చడాలను పోలి ఉండడంతో సరికొత్త చర్చ మొదలైంది. పూర్వ కాలంలో అంతఃపురం స్త్రీల విషయంలో ఇనుప కచ్చడాలను అమలు చేసే దురాచారం అమలులో ఉండేది. ఆ దిశగా శిల్పాన్ని పరిశీలించగా వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో ఉన్న ఇనుప కచ్చడాలకు ఈ శిల్పానికి సారుప్యతలు ఉన్నా యి. దీంతో ఇది ఇనుప కచ్చడమేనా అనే దిశగా చర్చ మొదలైంది. అయితే కాకతీయుల కాలంలో ఇనుప కచ్చడాల సంస్కృతి అమల్లో ఉన్నట్లుగా నాటి కావ్యాల్లోగానీ మరెక్కడా ఆధారాలు లభించలేదు. ఇప్పటి వరకు లభించిన శాసనాలు, ఆలయాల్లో ఈ తరహా శిల్పాలు లేవు. దీంతో ఈ విషయంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు ఈ శిల్పానికి కాలక్రమంలో మార్పులు చేసినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లభిం చడం లేదు. అందువల్ల గణపురంలో, రామప్ప ఆలయంలో వెలుగు చూసిన స్త్రీ శిల్పాల్లో ధరించింది అంగవస్త్రమా లేక ఇనుప కచ్చడమా తేలాల్సి ఉంది. మరిన్ని ఆధారాలు కావాలి :కట్టా శ్రీనివాస్, చరిత్ర పరిశోధకుడు గణపేశ్వరాలయం నిర్మాణ సమయంలో ఇనుప కచ్చడాల దురాచారం అమలులో ఉందా లేదా అనేది తెలియదు. ఒక వేళ ఉంటే ఆ సమయంలో ఎలాంటి ఉద్యమం నడిచిందో, ఎలాంటి విప్లవా త్మక రాజాజ్ఞ పనిచేసిందో తెలియదు. ఆడామగా సమానమనే కనీస స్పృహ లేకుండా ఆడవాళ్లను కేవలం వస్తువులుగా, పెంపుడు జంతువులుగా లేదా అంతకంటే హీనంగా పరిగణించే ఈ సంస్కృతిని తప్పుబడుతూ వీటిని ఉపయోగించడం నిషిద్ధంలాంటి ఆజ్ఞ వచ్చి ఉంటే ఆ చారి త్రాత్మక పరిణామాన్ని సూచించేందుకు ఈ శిల్పం చెక్కారేమో అని భావించేందుకు ఆస్కారం ఉంది. కాకతీయులకు సంబంధించి మరెక్కడ ఇలాంటి శిల్పాలు లేవు. కాబట్టి ఈ అంశంపై మనకు లభించిన ఆధారాలను క్రమంలో పేర్చుకుంటూ ఇలా అయి ఉండవచ్చు అనేది హైపో థిసీస్ అవుతుంది. ఇది నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించేందుకు పటిష్టమైన ఆధారాలు లభించాలి. దురాచారం వచ్చిందిలా .. పూర్వకాలంలో తమ సంపదను దాచుకునే అనేక పద్ధతుల్లోనే అంతఃపుర కాంతల శీలం కాపాడటం లేదా కేవలం తమ అదుపాజ్ఞల్లో ఉంచడం అనే ఆలోచనలతో ఇనుప కచ్చడాలు అనే దురాచారం రాజులు అమలు చేసేవారు. వీటికి సంబంధించి ఓరగచ్చ, కక్షాపటం, కచ్చ, కచ్చ(డ)(ర)ము, కచ్చటిక, కచ్చము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గో(ణ)(ణా)ము, గోవణము, చీరము, తడుపు పుట్టగోచి, పొట్టము, పొటముంజి, బాలో పవీతం, బొట్టము, లంగోటి ఈ పేర్లన్నీ కూడా లోదుస్తులు అనే దానికి పర్యాయపదాలు. లోహలతో తాళం తీసి వేసేందుకు వీలుగా లో దుస్తులను రూపొందించారు. వీటిని ఇనుముతో చేస్తే ఇనుప కచ్చడాలు అని అని లోహంతో అయితే లోహకచ్చడాలు అని అనడం పరిపాటి. ఈ అంశంపై ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు ఇనుప కచ్చడాలు పేరుతో పుస్తకం రాశారు. కాలకృత్యాలకు అడ్డురాకుండా ఉంటూ లైంగిక కార్యకలాపం జరపడానికి వీలులేకుండా ఇనుము లేదా లోహంతో తయారు చేసిన కచ్చడాలను స్త్రీలు తమ మొల చుట్టూ ధరించడం ఈ దురాచారంలో భాగం. ఇవి శరీరానికి ఒరుసుకు పోకుండా లోపటి వైపు తోలు గుడ్డ వంటి మెత్తలను ఉంచేవారు. బహుశా కాలక్రమంలో ఈ సంస్కృతే సిగ్గుబిల్ల, మరుగు బిళ్లలుకు దారితీశాయనే వాదనలు ఉన్నాయి. సంస్కృతంలో పిప్పలదనము అని, ఆంగ్లంలో ఫిగ్ లీఫ్‌గా పేర్కొన్నారు. జపాన్‌లోనూ ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు ఆధారాలున్నాయి. రావి ఆకు ఆకారంలో ఉండే ఈ కచ్చడాలకు నడుముపై వడ్డాణంతో బంధించేవారు. వీటికి తాళాల ను బిగించేవారు. ఎవరుగాని, ఎలాంటి మారుతాళంతోగాని వీటిని తెరవడానికి వీలులేకుండా ఉండే విధంగా కొత్త తాళాలు తయారుచేసేవారు. కాలక్రమంలో అమానవీయ దురాచారం కనుమరుగైంది. -
ఆనందనగర్ కాలనీలో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనందనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఆర్కిటెక్ట్ సుజాత ఆనందనగర్‌లో కాపురం ఉంటోంది. ఇటీవల ఆమె విదేశాలకు వెళ్ళింది. మంగళవారం ఉదయం నగరానికి వచ్చింది. ఇంట్లో చూడగా 60 తులాల బంగారు నగలు, వజ్రాభారణాలు కనిపించలేదు. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆమె పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్ట్‌లపైనా జీఎస్టీ!
లైసెన్స్డ్ సర్వేయర్లు, సీఏలూ పన్ను కట్టాల్సిందే ► వాణిజ్య సముదాయాల అద్దెల మీద సర్వీస్ జీఎస్టీ ► సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌కూ పన్ను కట్టాల్సిందే ► ప్రచురణ హక్కుల బదలాయింపు, సినిమా, టీవీ హక్కులకూ అదే పద్ధతి సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. కొత్తగా సర్వీస్ జీఎస్టీ కింద పన్ను పరిధిలోకి వచ్చే జాబితా బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా గతంలో సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) పరిధిలోకి రాని చాలా అంశాలు.. తాజాగా జీఎస్టీ సేవల పన్ను కిందకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన తెలంగాణ జీఎస్టీ చట్టం ప్రకారం.. టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్టులు, లైసెన్స్డ్ సర్వేయర్లు, చార్టర్డ్ ఇంజనీర్లు వంటివారు కూడా జీఎస్టీ సేవా పన్ను పరిధిలోకి వస్తున్నారు. అంటే ఏదైనా టెంట్‌హౌస్ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల కన్నా మించితే... ఆ కంపెనీ కూడా కచ్చితంగా జీఎస్టీ కట్టాల్సిందే. ఈ లెక్కన పెద్ద పెద్ద ఫంక్షన్లకు టెంట్ సామగ్రి సరఫరా చేసే ఏజెన్సీలన్నీ ఈ పన్ను పరిధిలోనికి రానున్నాయి. ఇక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కేటగిరీలో సాహిత్య పుస్తకాల ప్రచురణ హక్కుల బదలాయింపు జరిగినా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. అయితే ఈ హక్కులు తీసుకునే సంస్థల వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు మించితేనే ఇది వర్తిస్తుంది. ఇదే కేటగిరీలో మ్యూజిక్ డెవలప్ మెంట్, సినిమా, టీవీ హక్కుల బదలాయింపు లు కూడా రానున్నాయి. అద్దెలపైనా బాదుడే... వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చే భవనాలు లేదా సము దాయాలపై వసూలు చేసే అద్దెలు కూడా జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. వాణిజ్య కోణంలో అద్దెకు ఇచ్చే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లపైనా పన్ను వసూలు చేయాలని రాష్ట్ర చట్టంలో పేర్కొన్నారు. ఈ కేటగిరీ కింద నగరాల్లో పన్నుల వసూళ్లు ఎక్కువగా ఉంటాయని, పదుల కోట్లలో ఈ ఆదాయం వస్తుందని పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఓ పెద్ద వాణిజ్య భవనాన్ని ఏదైనా బంగారు ఆభరణాల దుకాణానికి అద్దెకిస్తే.. ఆ అద్దె ఏడాదికి రూ.20 లక్షల కన్నా మించితే దానిపై సర్వీస్ జీఎస్టీ వసూలు చేస్తారు. అదే విధంగా ఫంక్షన్‌హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంకెట్ హాళ్లు, హోమ్ సర్వీసెస్‌లను కూడా పన్ను పరిధిలోనికి తీసుకువచ్చారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు సమ్మెట పోటు! సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్లపైనా సర్వీసెస్ జీఎస్టీ విధించాలని రాష్ట్ర జీఎస్టీ చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ప్రోగ్రామ్‌ను తయారు చేసి ఇన్వాయిస్పై ఇతరులకు విక్రయిస్తే.. ఆ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలకు మించితే ఆ లావాదేవీపై పన్ను వసూలు చేస్తారు. గతంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మీద సర్వీస్‌ట్యాక్స్ మాత్రమే ఉండేది. కానీ 2013లో టీసీఎస్ సంస్థకు ఇచ్చిన పన్ను బిల్లులో సర్వీస్ ట్యాక్స్‌తో పాటు వ్యాట్‌ను కూడా విధించారు. దానిని టీసీఎస్ యాజమాన్యం హైకోర్టులో సవాలు చేసింది. తమకు ద్విపన్ను విధానం వర్తించదని, సర్వీసుట్యాక్స్ మాత్రమే కట్టేందుకు అనుమతించాలని కోరింది. కానీ కోర్టు మాత్రం వాణిజ్య పన్నుల శాఖకు అను కూలంగా తీర్పునిచ్చి.. వ్యాట్‌ను కూడా కట్టాలని టీసీఎస్‌కు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. కాగా ఏయే సర్వీసులు జీఎస్టీ పరిధిలోనికి వస్తాయనే దానిపై నాలుగైదు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. -
మృతదేహాలతో శ్మశానానికి వెలుగులు
అపర ధనవంతుడైనా, కటిక పేదవాడైనా చివరకు వెళ్లేది ఆరడుగుల గోతిలోకే. అయితే ప్రస్తుతం ఆ కాసింత స్థలం కోసం కూడా చావుతిప్పలు పడాల్సి వస్తోంది. నగర సరిహద్దుల పరిధిలో సమాధి చేయడం నిషేధిస్తూ కొన్ని నగరాల్లో చట్టాలు కూడా చేస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సమస్య పరిష్కారానికి ‘సమాధుల ఆకాశహర్మ్యాలు’ నిర్మించాలని పలువురు ఆర్కిటెక్ట్‌లు సూచిస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... కొలంబియా యూనివర్సిటీ డెత్ ల్యాబ్ డిజైనర్లు మాత్రం విభిన్న ఆలోచన చేస్తున్నారు. మృతదేహాలను డీకంపోజిషన్ చేయడం ద్వారా శ్మశానానికి వెలుగులు నింపాలన్నది వీరి ప్రతిపాదన. ఈ పద్ధతిలో డీకంపోజిషన్(కుళ్లడం) ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చనున్నారు. సమాధుల లోపల, శ్మశాన రహదారుల వెంబడి ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలపై అమర్చే ‘మెమోరియల్ వెసెల్స్’లో మానవ అవశేషాలు, సూక్ష్మజీవులను నింపుతారు. దీని ద్వారా డీకంపోజిషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. మృతదేహం శిథిలం అవుతుండడంతో ఈ వెసెల్స్ కాంతివంతంగా వెలుగుతాయి. దీంతో ఆప్తులు మరణించినా ఈ వెలుగుల్లో వారు జీవించి ఉన్నారనే భావన కలుగుతుందని డిజైనర్లు చెబుతున్నారు. ‘భవిష్యత్తు స్మృతివనాలు’ అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ బాత్ నిర్వహించిన పోటీలో వీరు విజేతలుగా కూడా నిలిచారు. దీనికి సంబంధించి ప్రాథమిక నమూనా రూపొందించడానికి ఈ వేసవిలో నెలరోజుల పాటు వీరు యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో అధ్యయనం చేపట్టనున్నారు.