సాక్షి, అమరావతి: తెలుగుదనం ఉట్టిపడే భవనాలు... సంప్రదాయం, ఆధునికత కలబోతగా నిర్మాణాలు... సకల సౌకర్యాలతో చూడముచ్చటైన సముదాయాలు... కేటగిరీలవారీగా ఏకీకృత డిజైన్లు... వెరసి రాష్ట్రానికి ఓ బ్రాండింగ్ తెచ్చేలా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం. డిజైన్ల కోసం దశాబ్దాలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీలకు భారీగా ప్రజాధనం ధారపోసే ఆనవాయితీకి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రభుత్వ భవనాలన్నీ ఏకీకృత డిజైన్లతో రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ తేవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డ్ (ఎస్‌ఏబీ) కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఆరు కేటగిరీల కింద నిర్దిష్ట డిజైన్లను రూపొందించింది. ఇకపై నిర్మించే భవనాలన్నీ ఈ ఆకృతుల ప్రకారమే ఉండాలని నిర్దేశించింది. సుదీర్ఘకాలం నిలిచేలా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, అన్ని వసతులతో ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు.
సరైన ప్రణాళిక లేకపోవడంతో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భవనాలు రెండు రీతుల్లో ఉండేవి. సీమాంధ్రలో ఎక్కువ బ్రిటీష్ హయాంలో నిర్మించినవి కాగా తెలంగాణలో నిజాం కాలం నాటి కట్టడాలున్నాయి. నాణ్యతతో నిర్మించిన ఆ భవనాలు సుదీర్ఘకాలం సేవలు అందించాయి. తదనంతరం నిర్మించిన ప్రభుత్వ భవనాలపై ఓ నిర్దిష్ట విధానం లోపించింది. ఎక్కడికక్కడ వేర్వేరు డిజైన్లతో భవనాలను నిర్మించడంతో ఏకరూపత లేకుండా పోయింది. వాతావరణ పరిస్థితులు, మట్టి స్వభావం మొదలైనవి శాస్త్రీయంగా అంచనా వేయకుండా కట్టిన భవనాలు సరైన ప్రయోజనాన్ని అందించలేకపోతున్నాయి. అత్యధిక వ్యయం కావడంతోపాటు విలువైన స్థలం వృథా అయింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో భవిష్యత్ అవసరాల కోసం విస్తరించే అవకాశం లేకుండాపోయింది. ఈ అంశంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ భవనాలకు కేటగిరీల వారీగా నిర్దిష్ట డిజైన్లు ఖరారు చేయాలని ఎస్‌ఏబీని ఆదేశించారు.
చదవండి: (వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్‌పోర్ట్)
ఆరు కేటగిరీలుగా ఏకీకృత డిజైన్లు
ప్రభుత్వ భవనాలకు ఆరు కేటగిరీలవారీగా ఏకీకృత డిజైన్లను ఎస్‌ఏబీ రూపొందించింది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలం నిలిచేలా భవనాల నిర్మాణానికి ప్రమాణాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని రెండు వాతావరణ జోన్లు, ఆరు వ్యవసాయ జోన్లను పరిగణనలోకి తీసుకుని భవనాల డిజైన్లను రూపొందించడం విశేషం. భవిష్యత్ అవసరాల కోసం భవనాల విస్తరణకు అవకాశం కల్పించింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా హేతుబద్ధమైన వ్యయంతో భవనాలను నిర్మించేలా డిజైన్లను రూపొందించింది. గ్రామాల్లో నిర్మించే పాఠశాలలు, పోలీస్ స్టేషన్ల నుంచి జిల్లా కేంద్రాలు, రాజధానిలో నిర్మించే పరిపాలన భవనాల వరకు అన్నింటినీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేలా నిర్దిష్ట డిజైన్లను ప్రభుత్వ ఆర్కిటెక్ట్‌లే రూపొందించడం విశేషం. రాష్ట్రంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలన్నీ ఈ డిజైన్ల ప్రకారమే నిర్మిస్తారు. ఏ శాఖ అయినా నూతన భవనం నిర్మించాలంటే ఎస్‌ఏబీ నుంచి నిర్దిష్ట డిజైన్ పొందాలి. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ నిర్వహించి భవన నిర్మాణాలు చేపట్టాలి.
కన్సల్టెన్సీల దోపిడీకి అడ్డుకట్ట
రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డు(ఎస్‌ఏబీ)ను ఇటీవల పునరుద్ధరించిన ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ కార్యాలయాల డిజైన్లు ఖరారు చేసే ఈ బోర్డును 1990– 2000 మధ్య అప్పటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. అప్పటి నుంచి కన్సల్టెన్సీల పెత్తనం సాగుతోంది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం భవన నిర్మాణాల డిజైన్ల కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఏకంగా రూ.500 కోట్ల వరకు ధారపోయడం ఈ దోపిడీకి పరాకాష్ట. ఆర్‌అండ్‌బీ శాఖలో సమర్థులు, నిపుణులైన ఇంజనీర్లను పక్కనపెట్టి డిజైన్ల రూపకల్పన కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలకు పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపారు. వీటికి తెర దించుతూ ‘ఎస్‌ఏబీ’ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఆర్థిక మంత్రి అధ్యక్షుడుగా, ఆర్థిక, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు పలువురు నిపుణులను సభ్యులుగా నియమించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన ఆర్కిటెక్ట్, మరో ఇద్దరు ఆర్కిటెక్ట్‌లతోపాటు కొత్తగా 12 మంది ఆర్కిటెక్ట్‌లను నియమించింది.
రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్
‘తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఎస్‌ఏబీ నిర్దిష్ట డిజైన్లను రూపొందించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి దీర్ఘకాలం నిలిచేలా డిజైన్లు ఖరారు చేసింది. రాష్ట్రానికి ఓ బ్రాండ్ ఇమేజ్ కల్పించేలా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం ఉంటుంది’
– కణితి నవీన్, ఓఎస్డీ, రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డ్
ఇవీ ఆరు కేటగిరీలు...
1. విద్యాసంస్థల భవనాలు
( పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు)
2. వైద్య, ఆరోగ్య శాఖ భవనాలు
( సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ
హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు,
జిల్లా ఆసుపత్రులు)
3. పరిపాలన భవనాలు
( హెచ్‌వోడీ భవనాలు, అన్ని శాఖల భవనాలు)
4. వివిధ వ్యవస్థల భవనాలు
( న్యాయస్థానాలు, రవాణా సముదాయాలు, శాస్త్రవిజ్ఞాన క్యాంపస్‌లు)
5. నివాస సముదాయాలు
( క్వార్టర్లు, అతిథి గృహాలు, బంగ్లాలు,
ఇతర వసతులు)
6. కమ్యూనిటీ భవనాలు
( స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆర్ట్ గ్యాలరీలు, కమ్యూనిటీ హాళ్లు, మ్యూజియంలు)
Comments
Please login to add a commentAdd a comment