వారెవ్వా... వాస్తు శిల్పి! | Architects are in huge demand in job market | Sakshi
Sakshi News home page

వారెవ్వా... వాస్తు శిల్పి!

Published Sat, Mar 1 2025 5:38 AM | Last Updated on Sat, Mar 1 2025 5:38 AM

Architects are in huge demand in job market

జాబ్‌ మార్కెట్‌లో భారీగా పెరుగుతున్న డిమాండ్‌ 

సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవసరాల్లో వచ్చిన మార్పులకు ప్రతిబింబం  

మనం ఒక పురాతన దేవాలయానికి వెళతాం. ఆ దేవాలయం అద్భుత నిర్మాణం గురించి చర్చించుకుంటాం. ఆధునిక ప్రపంచంలో ఒక నగరానికి వెళతాం. అక్కడి ఆకర్షణీయమైన భవనాల గురించి మాట్లాడుకుంటాం. మన ఆఫీసులో ఏర్పాటు చేసిన వసతుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ... ఈ ఆకర్షణీయమైన నిర్మాణ రూపకల్పలో కీలక వ్యక్తి.. అప్పటి వాస్తు శిల్పి... ఇప్పటి ఆర్కిటెక్ట్‌. ఆధునిక సమాజంలో ఆర్కిటెక్ట్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.

చాలా బిజీ ప్లేస్‌లో ఉన్న ఒక  చిన్న స్థలంలో సైతం అద్భుత, ఆకర్షణీయమైన వాణిజ్య నిర్మాణ రూపకల్పన వారి ప్రత్యేకం. తక్కువ చోటైనా... అన్ని సదుపాయాలతో చక్కటి ఇంటి నిర్మాణానికి డిజైన్‌ వేయడం వారి ప్రతిభ.  మన కలలను నిజం చేయగల సామర్థ్యం వారి సొంతం. ఇవే అంశాలు  వారిని ఇప్పుడు ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. జాబ్‌ మార్కెట్‌ డిమాండ్‌ విషయంలో ఇంజనీర్లను కాదని వారిని అగ్ర స్థానాన నిలబెడుతోంది.  – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

ఆర్కిటెక్ట్‌లు ఇప్పుడు దేశంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న నిపుణులుగా మారారు. ప్రపంచంలో నంబర్‌ వన్‌ జాబ్‌ సైట్, గ్లోబల్‌ జాబ్‌ మ్యాచింగ్, హైరింగ్‌ ప్లాట్‌ఫామ్‌– ఇండీడ్ఙ్‌ ‘బెస్డ్‌ జాబ్స్‌ ఫర్‌ 2025 ఇన్‌ ఇండియా’  పేరుతో విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని చెబుతోంది. పలు రంగాలను పరిశీలిస్తే, ఉపాధి అవకాశాల పెరుగుదల రేటు ఆర్కిటెక్ట్‌ విభాగంలో ఏకంగా  81 శాతంగా ఉందంటే  ప్రస్తుత సమాజంలో వారి ప్రాధాన్యత అర్థం అవుతుంది.

నివేదిక ప్రకారం వారి సగటు వార్షిక వేతనం రూ.14,95,353.  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నిపుణులకు ఉన్న డిమాండ్‌తో పోల్చితే భారత్‌ కార్పొరేట్‌ రంగంలో ఆర్కిటెక్ట్‌ల డిమాండ్‌ అధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవసరాల్లో వచ్చిన మార్పులకు ఇది ప్రతిబింబం. 

ప్రత్యేకత   ఎందుకు?
ఆర్కిటెక్ట్‌ లను ఇంజనీర్లతో పోల్చి కొందరు వారిని తక్కువగా అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి ఇంజనీర్లతోపాటు ఆర్కిటెక్ట్‌లు కూడా  ఒక భవనాన్ని రూపుదిద్దడానికి ఎంతో అవసరం. అందమైన, బలమైన, సుస్థిరమైన భవనాల రూపకల్పనలో  ఇంజనీర్‌తో పాటు ఆర్కిటెక్ట్‌ పాత్ర కూడా ఎంతో కీలకం. ఆర్కిటెక్టŠస్‌ భవనాన్ని కేవలం నిర్మాణం కోణంలోనే కాకుండా, దానిని అందంగా, వినియోగదారులకు అనువుగా డిజైన్‌ చేస్తారు. వారు ఫంక్షనాలిటీ అలాగే   ఎస్తెటిక్‌ని సమతుల్యం చేస్తారు. 

ఇంజనీర్‌ పటిష్ట  నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తే, ఆర్కిటెక్ట్‌ అందమైన, వినియోగదారులకు అనువైన ప్రదేశాలను సృష్టిస్తారు.  కస్టమర్‌ అవసరాలు, ఆర్థిక పరిమితులు, పర్యావరణ అంశాలు, నగర విస్తరణ– ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేస్తారు. ఆర్కిటెక్టŠస్‌ కొత్త, విభిన్నమైన డిజైన్‌ ఆలోచనలను ప్రతిపాదిస్తారు. ఇంజనీర్లు వాటిని సాధ్యమయ్యేలా చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆర్కిటెక్టŠస్‌ సృజనాత్మకతను జోడించి వినూత్నమైన భవనాలు రూపొందిస్తారు. ఇంజనీర్లు వాటిని ప్రాక్టికల్‌గా మార్చుతారు. 

ఆధునికతతో అగ్రస్థానం
ఉద్యోగ నియామకాలు, జీతం పోకడలు,  వృద్ధి అవకాశాలు,  వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిర, ఆకర్షణీయ మైన నిర్మా ణాలు, ప్రాధాన్యతలు ఇలా ఎన్నో అంశాలు ఆర్కిటెక్ట్‌ను జాబ్‌ మార్కెట్‌ డిమాండ్‌లో అగ్రభాగాన నిలబెట్టింది. 

మెట్రోల విస్తరణ, స్మార్ట్‌ నగరాల రూపకల్పన, పర్యావరణ సానుకూలతలు అలాగే పర్యావరణానికి అనుకూలమైన ఇంధన సమర్థ వినియోగ కార్యాలయాల నిర్మాణాలు  వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్‌ కార్పొరేట్‌  కార్యాలయ స్థలాలలో పెట్టుబడి పెడతాయి, ఆర్కిటెక్ట్‌లు ఈ పరివర్తనకు కేంద్రంగా ఉండడం గమనార్హం.

కీలక పాత్ర
కస్టమర్‌ అవసరాలను అర్థం చేసుకుని, వారి అభిరుచులకు అనుగుణంగా డిజైన్‌ చేయడం వీరి ప్రత్యే కత. నియమాలు,  భద్రతా ప్రమాణాలు పాటించడం,  ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ల అనుమతుల కోసం సమర్పించాల్సిన ప్లాన్లు సిద్ధం చేయడం, సంపదను,  వనరులను సమర్థవంతంగా వినియోగించడం, భవనం నిర్మాణాన్ని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్లానింగ్‌ చేయడం,  ప్రా జెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయం, ఆధునిక సమాజంలో గ్రీన్‌ బిల్డింగ్స్, ఎనర్జీ–ఎఫిషియెంట్‌ డిజైన్‌ల రూపకల్పన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధు నిక నిర్మాణ రంగంలో వారి పాత్ర అపారం. 

డిమాండ్‌ ఎక్కడ?
»  వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం
»    అపార్ట్‌మెంట్‌లు, షాపింగ్‌ మాల్స్, ఆఫీస్‌ బిల్డింగ్‌లు
»   రోడ్లు, బ్రిడ్జీలు, గవర్నమెంట్‌ భవనాల వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు 
»   మల్టీనేషనల్‌ కంపెనీల క్యాంపస్‌ డిజైన్‌లు
»  మ్యూజియం, హోటల్స్, ఎయిర్‌పోర్ట్, స్టేడియం, దేవాలయాల వంటి ప్రత్యేక భవనాల డిజైన్‌ఇంజనీర్లు భవనానికి ప్రాణం పోసే గుండె లాంటి వారు అయితే, ఆర్కిటెక్ట్‌ ఆ భవనానికి జీవం పోసే ఆత్మ. ఆర్కిటెక్ట్‌ లేకపోతే భవనాలు కేవలం ‘నిర్మాణాలు’గానే ఉంటాయి.  అందమైన, ఆకర్షణీయమైన వినియోగదారులకు అనుకూలమైన, చిరస్థాయిగా నిలిచే నిర్మాణాలను రూపొందించేది ఆర్కిటెక్ట్‌లే!

ఆర్కిటెక్ట్‌ కావాలంటే?
భారతదేశంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయాలంటే బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ.ఆర్క్‌) అనే 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేయాలి.  దీనికి నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) లేదా జేఈఈ పేపర్‌ 2 ద్వారా అర్హత పొందాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement