మృతదేహాలతో శ్మశానానికి వెలుగులు
అపర ధనవంతుడైనా, కటిక పేదవాడైనా చివరకు వెళ్లేది ఆరడుగుల గోతిలోకే. అయితే ప్రస్తుతం ఆ కాసింత స్థలం కోసం కూడా చావుతిప్పలు పడాల్సి వస్తోంది. నగర సరిహద్దుల పరిధిలో సమాధి చేయడం నిషేధిస్తూ కొన్ని నగరాల్లో చట్టాలు కూడా చేస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సమస్య పరిష్కారానికి ‘సమాధుల ఆకాశహర్మ్యాలు’ నిర్మించాలని పలువురు ఆర్కిటెక్ట్‌లు సూచిస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... కొలంబియా యూనివర్సిటీ డెత్ ల్యాబ్ డిజైనర్లు మాత్రం విభిన్న ఆలోచన చేస్తున్నారు. మృతదేహాలను డీకంపోజిషన్ చేయడం ద్వారా శ్మశానానికి వెలుగులు నింపాలన్నది వీరి ప్రతిపాదన. ఈ పద్ధతిలో డీకంపోజిషన్(కుళ్లడం) ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చనున్నారు.
సమాధుల లోపల, శ్మశాన రహదారుల వెంబడి ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలపై అమర్చే ‘మెమోరియల్ వెసెల్స్’లో మానవ అవశేషాలు, సూక్ష్మజీవులను నింపుతారు. దీని ద్వారా డీకంపోజిషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. మృతదేహం శిథిలం అవుతుండడంతో ఈ వెసెల్స్ కాంతివంతంగా వెలుగుతాయి. దీంతో ఆప్తులు మరణించినా ఈ వెలుగుల్లో వారు జీవించి ఉన్నారనే భావన కలుగుతుందని డిజైనర్లు చెబుతున్నారు. ‘భవిష్యత్తు స్మృతివనాలు’ అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ బాత్ నిర్వహించిన పోటీలో వీరు విజేతలుగా కూడా నిలిచారు. దీనికి సంబంధించి ప్రాథమిక నమూనా రూపొందించడానికి ఈ వేసవిలో నెలరోజుల పాటు వీరు యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో అధ్యయనం చేపట్టనున్నారు.