న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్(డీసీడబ్ల్యూఏ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న లోధి హయాం నాటి సమాధిని ఆక్రమించుకోవడం పట్ల మండిపడింది. ఆ సమాధిని ఎందుకు పరిరక్షించకపోతున్నారని భారత పురావస్తు పరిశోధన విభాగాన్ని(ఏఎస్‌ఐ) ప్రశ్నించింది. ఆ ప్రాచీన కట్టడానికి ఎంత మేరకు నష్టం జరిగిందో అధ్యయనం చేయడానికి, పునరుద్ధరణకు అవసరమైన చర్యలను సూచించడానికి పురావస్తు నిపుణుడిని నియమిస్తామని వెల్లడించింది.
15వ శతాబ్దంలో నిర్మించిన సమాధికి చెందిన స్థలాన్ని, కట్టడాలను 1960వ దశకంలో డీసీడబ్ల్యూఏ ఆక్రమించుకుంది. ఓ గదిలో కార్యాలయం సైతం ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాచీన కట్టడాన్ని సంఘ విద్రోహ శక్తులు చాలావరకు ధ్వంసం చేశామని, అందుకే తాము ఆ«దీనంలోకి తీసుకున్నామని డీసీడబ్ల్యూఏ వాదించింది. ప్రాచీన కట్టడాన్ని ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిఫెన్స్ కాలనీకి చెందిన రాజీవ్ సూరీ తొలుత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. ఆ సమాధిని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని, దాన్ని పరిరక్షించేలా ప్రభుత్వ అధికారులకు ఆదేశించాలని కోరారు.
ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మానం బుధవారం విచారణ చేపట్టింది. సమాధికి చెందిన గదిలో ఏసీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఆక్షేపించింది. దానికి అద్దె చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రాచీన కట్డడాలను కాపాడాల్సిన ఏఎస్‌ఐ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమాధి స్థలాన్ని ఖాళీ చేయాలని డీసీడబ్ల్యూఏను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment