
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment