![Delhi Air Quality Improves, Supreme Court Allows Withdrawal Of GRAP 4](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/5/Supreme-Court.jpg.webp?itok=8gJ33WJP)
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. గురువారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 161గా నమోదైంది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య కట్టడికి విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన ప్లాన్-4 (జీఆర్‌ఏపీ) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. గాలి నాణ్యత మెరుగుపడిన నేపథ్యంలో జీఆర్‌ఏపీ ఆంక్షలను ఉపసంహరించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
గా గత నెల రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యంగా తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఒకానాక దశలో ఏక్యూఐ 500 స్థాయికి కూడా చేరడంతో. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేసింది. దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు నిర్వహించారు.
ఇదిలా ఉండగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment