grave
-
సమాధి ఆక్రమణపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్(డీసీడబ్ల్యూఏ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న లోధి హయాం నాటి సమాధిని ఆక్రమించుకోవడం పట్ల మండిపడింది. ఆ సమాధిని ఎందుకు పరిరక్షించకపోతున్నారని భారత పురావస్తు పరిశోధన విభాగాన్ని(ఏఎస్ఐ) ప్రశ్నించింది. ఆ ప్రాచీన కట్టడానికి ఎంత మేరకు నష్టం జరిగిందో అధ్యయనం చేయడానికి, పునరుద్ధరణకు అవసరమైన చర్యలను సూచించడానికి పురావస్తు నిపుణుడిని నియమిస్తామని వెల్లడించింది. 15వ శతాబ్దంలో నిర్మించిన సమాధికి చెందిన స్థలాన్ని, కట్టడాలను 1960వ దశకంలో డీసీడబ్ల్యూఏ ఆక్రమించుకుంది. ఓ గదిలో కార్యాలయం సైతం ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాచీన కట్టడాన్ని సంఘ విద్రోహ శక్తులు చాలావరకు ధ్వంసం చేశామని, అందుకే తాము ఆ«దీనంలోకి తీసుకున్నామని డీసీడబ్ల్యూఏ వాదించింది. ప్రాచీన కట్టడాన్ని ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిఫెన్స్ కాలనీకి చెందిన రాజీవ్ సూరీ తొలుత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. ఆ సమాధిని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని, దాన్ని పరిరక్షించేలా ప్రభుత్వ అధికారులకు ఆదేశించాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మానం బుధవారం విచారణ చేపట్టింది. సమాధికి చెందిన గదిలో ఏసీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఆక్షేపించింది. దానికి అద్దె చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రాచీన కట్డడాలను కాపాడాల్సిన ఏఎస్ఐ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమాధి స్థలాన్ని ఖాళీ చేయాలని డీసీడబ్ల్యూఏను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. -
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా.. -
అమానవీయం: గాజా ఆస్పత్రిలో 179 మంది సామూహిక ఖననం
గాజా: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో 179 మందిని సామూహికంగా ఖననం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహ్మద్ అబు సల్మియా.. మానవతా సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక సమాధి చేసినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఆస్పత్రికి ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో ఉన్న ఏడుగురు పిల్లలతో సహా 29 మంది రోగులు మరణించారు. వారందర్నీ సామూహికంగా పూడ్చిపెట్టామని అధికారులు తెలిపారు. ఏడుగురు పిల్లల్ని ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం బయటకు విడుదల చేసింది. అల్ షిఫా ఆస్పత్రి శవాల నిలయంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. కుళ్లిన శవాల కంపుతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఆరోపించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఆస్పత్రిని చుట్టుముట్టింది. గత వారం 72 గంటల పాటు అల్ షిఫాకు కరెంట్, నీరు, ఆహారం సరఫరా కాకుండా నిలిపివేసింది. కాల్పులతో ఆస్పత్రి చుట్టూ భీకర వాతావరణం ఏర్పడటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తప్పని స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోనే ఖననం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇజ్రాయెల్ సేనలు సొరంగాలను కేంద్రంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. హమాస్ సొరంగాలకు కేంద్రంగా అల్ షిఫా ఆస్పత్రి ఉందని ఇజ్రాయెల్ దళాలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి కేంద్రంగా ఉగ్రవాదుల ఇళ్లకు సొరంగాలు ఉన్నాయని సైన్యం అంటోంది. ఇదీ చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా? -
దళితుల సమాధులు స్వాహా..
హన్మకొండ చౌరస్తా: భూకబ్జాకోరులపై నగర పోలీ స్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు బకాసురులు మాత్రం మమ్మల్నేమీ చేయలేరన్న ధీమాతో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న బకాసురులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా శ్మశానవాటికనే మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వివరా లిలా ఉన్నాయి. హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డలో దళితులే అత్యధికంగా నివసిస్తుంటారు. సుమారు దశాబ్దకాలం క్రితం వరకు కూడా ఇక్కడ సామాజికంగా వెనుకబాటును అనుభవించారు. పెద్దమ్మగడ్డ వాసుల శ్మశానవాటికకు ఎసరు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దళిత ప్రాంతం పెద్దమ్మగడ్డ. అలాంటి దళితులకు చెందిన సమాధుల గడ్డ ఇప్పుడు కనుమరుగవుతోంది. పెద్దమ్మగడ్డ సమీపంలోనే నాలా వెంట ప్రధాన రహదా రికి ఆనుకుని ఉన్న సమాధుల్లో 99శాతం మాయమయ్యాయి. మిగిలిన ఒకటి రెండు సమాధులను సైతం నేలమట్టం చేసే పనిలో కబ్జాదారులు ఉన్నా రు. ప్రధాన రహదారి వెంటే సుమారు రెండెకరాల విలువైన స్థలం కావడంతో కోట్ల రూపాయల ధర పలుకుతోంది. దీంతో ఏడాది కాలంగా కొందరు కబ్జారాయుళ్లు రాజకీయ నాయకుల అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా సమాధులను నేలమట్టం చేస్తూ మొరంతో ఆనవాళ్లు లేకుండా చదును చేస్తున్నారు. అయినా రెవెన్యూ, బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంౖపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. పేదల బతుకుల్లో మార్పు దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. 140 కోట్ల మందిని అవమానించారు విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ దేశాలకు ఆశాకిరణం ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగిసింది. పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు. -
జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడు ఉపఎన్నికల వేళ కలకలం
సాక్షి, చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనాకేంద్రం ప్రతిపాదిత స్థలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది. బుధవారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మట్టితో సమాధిని కట్టి, పూలదండలు వేసి, జేపీ నడ్డా ఫొటో పెట్టి, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అంటూ ఫ్లెక్సీ పెట్టారు. గురువారం ఉదయం పోలీసులు దీనిని తొలగించారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనాస్థలానికి వెళ్లి ఇది అధికార పార్టీ పనేనని మండిపడ్డారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఫ్లోరైడ్ బాధితులే ఈ పనిచేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా, ప్రత్యర్థి పార్టీలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో మర్రిగూడ మండలంలో పర్యటిస్తూ ఫ్లోరైడ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తదనంతర పరిణామాల్లో ఈ కేంద్రం పశ్చిమబెంగాల్‌కు తరలిపోయింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నడ్డా పేరిట సమాధి కట్టడం గమనార్హం. -
పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ..
Puneet Rajkumar : అర్ధాంతరంగా నిష్క్రమించిన యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సమాధిని అభిమానులు పెద్దసంఖ్యలో సందర్శిస్తుండడంతో బెంగళూరు కంఠీరవ స్టూడియో రద్దీగా మారింది. ఆదివారం సెలవు కావటంతో వేల సంఖ్యలో అభిమానులు దర్శించుకుని స్మరించుకొన్నారు. తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అభిమానులు కంఠీరవకు క్యూ కట్టారు. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు అనే తేడా లేకుండా తరలివచ్చారు. సుమారు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. నేడు 11 రోజుల శాస్త్రం పునీత్ మరణించి సోమవారానికి 11 రోజులు అవుతుంది, ఇంటి వద్ద 11వ రోజు సంస్మరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు అన్నదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నేత్రదానాలు ముమ్మరం పునీత్ నేత్రదానంతో స్ఫూర్తి పొందిన వందలాది మంది మరణానంతరం నేత్రాలను దానం చేస్తామని ఆస్పత్రులకు రాసి ఇస్తున్నారు. బెంగళూరు నగరంలో రోజూ రెండు వేల మంది నేత్రదానం చేయడానికి ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు. ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా నేత్రదానం చేస్తానని ప్రకటించారు. -
సమాధిలో మూడు రోజులు: బతికే ఉన్న తల్లి
బీజింగ్: జన్మనిచ్చిన తల్లి భారంగా మారిందంటూ బతికుండగానే ఆమెను పాతిపెట్టి హత్యాయత్నానికి ప్రారంభించాడో దుర్మార్గపు కొడుకు. మూడు రోజుల తర్వాత ఆమెను బయటకు తీసి రక్షించిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనాకు చెందిన యాన్ అనే వ్యక్తి తల్లి వాంగ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమెకు సపర్యలు చేస్తూ, సంరక్షణ చూసుకోవడం భారంగా భావించాడు. దీంతో అతను తన తల్లిని హతమార్చాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా మే రెండో తారీఖున చక్రాలబండిలో ఆమెను బయటకు తీసుకెళ్లాడు. అయితే ఆ రోజే కాకుండా మూడు రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అతని భార్య ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది. (‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం) వెంటనే వారు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఘోరమైన విషయం బయటపడింది. తల్లిని చూసుకోవడం తన వల్ల కాదని అందుకే ఆమెను బతికుండగానే పాతిపెట్టి దుర్మార్గపు పనికి ఒడిగట్టానని నిందితుడు వెల్లడించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన పాతిపెట్టిన స్థలానికి వెళ్లగా అంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ సమాధిలో నుంచి ఆమె నీరసంగా సహాయం కోసం అర్థించడం వినిపించింది. వెంటనే పోలీసులు ఆ ప్రదేశాన్ని తవ్వి ఆమెను రక్షించారు. శరీరమంతా మట్టికొట్టుకుపోయి, కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు మాయం!) -
ప్రపంచానికి వరం పునరుత్థాన శక్తి
రెండువేల యేళ్ళనాటి ఈస్టర్ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆరోజున సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయానికి పూర్వమే చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన విశ్వాసులైన కొందరు స్త్రీలకు అక్కడ తెరువబడి ఉన్న సమాధి దర్శనమిచ్చింది. శుక్రవారం నాడు అసంపూర్తిగా మిగిలిన పరిమళ క్రియల్ని యేసు దేహానికి సంపూర్తి చేసేందుకు వాళ్ళు వెళ్లారు. సమాధికి అడ్డుగా రోమా ప్రభుత్వం ఒక పెద్దబండ రాయిని పెట్టి దానికి ముద్రవేసి అక్కడ కావలి వారిని కూడా పెట్టింది. తీరా స్త్రీలు అక్కడికెళ్తే, అడ్డు రాయి తొలగించబడి ఉంది, కావలివారు లేరు, స్త్రీలలో ఒకరైన మగ్దలీనా మరియ అది చూసి కంగారుపడి పరిగెత్తుకుని వెళ్లి పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులకు ప్రభువు దేహాన్నెవరో ఎత్తుకెళ్లారని చెప్పి వారితోపాటు మళ్ళీ వచ్చి చూసింది. సమాధిలో ప్రభువు దేహం లేదు. సమాధి చేయడానికి ముందు శుక్రవారం నాడు ఆయనకు తొడిగిన నారబట్టలు మాత్రం సమాధిలో పడి ఉన్నాయి. ఆమెకు దుఃఖం ఆగలేదు. మగ్దలీనా మరియ అక్కడే రోదిస్తుండగా ‘అమ్మా ఏడుస్తున్నావెందుకు? ఎవరికోసం వెదుకుతున్నావు?’అని ఎంతో అనునయంగా తనను అడుగుతున్న ఒక వ్యక్తి సమాధి వద్ద కనిపించాడు. చీకట్లో అతను తోటమాలీ కావచ్చనుకొని ‘అయ్యా, నా ప్రభువు దేహాన్ని నీవేమైనా మోసుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టావా?’ అనడిగింది మరియ. వెంటనే ‘మరియా’ అని ఆయన పిలువగా ఆయనే ప్రభువని గుర్తించి ‘రబ్బూనీ’ అంటే హెబ్రీ భాషలో ‘బోధకుడా’ అని ఆమె బదులిచ్చింది. మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను తాను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. పైగా అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశానిర్దేశం చేసి 40వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమేంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తి తో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాలదాకా నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తితోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధమయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మశక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీలోంచి గదిలోకి వస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. అపవిత్రత అంటకుండా జీవించడానికి ఆదిమ చర్చికి ఆ శక్తే తోడ్పడింది. తమకున్నదేదీ తమది కాదని, అదంతా సమిష్టి సొత్తని భావించి ఒకరిపట్ల ఒకరు అద్భుతమైన ప్రేమానురాగాలతో వాళ్ళు జీవించింది కూడా పరిశుద్ధాత్మ శక్తిగా ప్రభువు నిర్వచించి వారందరికీ భాగస్వామ్యాన్నిచ్చింది పునరుత్థానశక్తితోనే!! అదే శక్తిని కొన్నాళ్ల తర్వాత పొందిన అపొస్తలుడైన పౌలు కూడా ‘నాకు లోకసంబంధంగా లాభకరమైన వాటినన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను. ఆయన పునరుత్థానబలాన్ని తెలుసుకోవడానికి సమస్తాన్ని మలంతో సమానంగా ఎంచుకొంటున్నాను’ అన్నది కూడా ఆ పునరుత్థాన శక్తితోనే (ఫిలిప్పి 3:7–11). ఈస్టర్ ఆదివారం ఉదయం నాటి ఈ పునరుత్థానశక్తి చేత కొత్త నిబంధన యుగపు విశ్వాసులంతా నింపబడాలన్నది యేసుక్రీస్తు అభిమతం. పౌలు పత్రికల్లో పౌలు ద్వారా తన ఈ అభిలాషను ప్రభువు వ్యక్తం చేశాడు. ప్రభువు పునరుత్థాన శక్తినెరుగని, ఆ శక్తిని పొందడం ఎంత అత్యవసరమో అవగాహన లేని చర్చి ఎంత పెద్దదైనా, ఆ చర్చిలో వేలు, లక్షలమంది విశ్వాసులున్నా అది నిర్జీవమైనదే, నిస్సారమైనదే. యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురు తదితర శిష్యులకు ప్రభువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్థైర్యం కరువయింది. ఎందుకంటే వాళ్లంతా ఆయన్ను వదిలేసి ప్రాణభయంతో పారిపోయారు. ఇపుడు ఏ మొహం పెట్టుకొని ఆయనతో మళ్ళీ జత కలుస్తారు? అందువల్ల పేతురు గలిలయ సరస్సులో చేపలు పట్టే పనికి మళ్ళీ వెళ్లిపోదామనంటే మిగిలిన శిష్యులు కూడా ఆయనతో వెళ్లిపోయారు. కాని యేసుప్రభువు ప్రేమతో వెళ్లి వారిని అక్కడే కలుసుకున్నాడు. గలిలయ సరస్సులో చేపలు పడుతున్న శిష్యులకు ముఖ్యంగా పేతురుకు ఆయన సాక్షాత్కారం అలా లభించింది. వారిని ప్రభువు మళ్ళీ తన పరిచర్యకు పిలుచుకొని ఈసారి వారిని తన పునరుత్థాన శక్తితో నింపి అజేయులను చేశాడు. దేవుని పేరుతో లోకంలోని మంచివాటిని సంపాదించుకో వడానికి మామూలు శక్తియుక్తులు చాలు. కానీ లోకాన్ని ఆయన ప్రేమ, క్షమాపణ, సమాధానంతో నింపడానికి మాత్రం చాలా త్యాగపూరితమైన జీవితం, పరిచర్య అవసరం. అది ప్రభువిచ్చే పునరుత్థానశక్తితోనే సాధ్యం. దేవుని పేరుతో ఎన్నెన్నో కూడబెట్టుకోవాలి అ నుకునేవారికి, దేవునికోసం అన్నింటినీ నష్టపర్చుకొని, వ్యయపర్చుకొని, పోగొట్టుకునేవారికి, లోకశక్తికి, పునరుత్థాన శక్తికి ఉన్నంత తేడా ఉంది. ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్థాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ శక్తే!!! హ్యాపీ ఈస్టర్.... రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com స్కాట్లాండ్ దేశంలో జాన్ జి. ప్యాటన్ 13 మంది పిల్లలున్న ఒక నిరుపేద కుటుంబంలో 1824లో జన్మించాడు. చాలా చిన్నతనంలోనే ప్రభువును ఎరిగాడు. ప్రభువు పరిచర్య కోసం సిద్ధపడ్డాడు. ఇపుడు మనం వెస్టిండీస్ గా పిలుస్తున్న నల్లజాతీయులుండే ‘కెరీబియన్ దీవులకు’ తనను దయచేసి తనను పంపమని తన చర్చి ముఖ్యాధికారికి ఉత్తరం రాశాడు.‘నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్లిన మన మిషనేరీలను 19 ఏళ్ళ క్రితమే అక్కడి నరమాంసభక్షకులు చంపుకొని తిన్నారని నీకు తెలియదా? వెళ్లిన మరుక్షణమే నిన్ను కూడా వాళ్ళు చంపుకు తినేస్తారు జాగ్రత్త. కావాలంటే సురక్షితమైన, సుఖవంతమైన మరో స్థలానికి నిన్ను పంపుతాను’ అని జవాబిచ్చాడు డిక్సన్ అనే ఆ వృద్ధ మిషనేరీ. ‘కుదరదు. నేనక్కడికే వెళ్తాను. నా మృతదేహాన్ని భూమిలో పురుగులు తింటాయా, లేక నరమాంసభక్షకులు తింటారా? అన్నది నాకు చాలా చిన్న విషయం. చీకట్లో ఉన్న ప్రజలను దేవుని వెలుగులోకి తేవడమే నా జీవిత లక్ష్యం. అందుకు నాకు ప్రభువువారి పునరుత్థాన శక్తి తోడుగా ఉంటుంది. దయచేసి నన్ను అక్కడికే పంపండి’ అని ప్యాటన్ ఆయనకు మరో ఉత్తరం రాశాడు. ఎట్టకేలకు ప్యాటన్ 32 ఏళ్ళ వయసులో తన్నా అనే కెరీబియన్ దీవిలో తన భార్య మేరీతో సహా కాలుబెట్టాడు. అలా అనడం కంటే, కష్టాల కొలిమిలో కాలుబెట్టాడనడం ఉచితమేమో. నరమాంసభక్షకులైన దాదాపు 4000 మంది నల్లజాతీయులు ఆ దీవిలో ఉంటే, వారి నుండి తనను తాను రక్షించుకోవడమే తొలి రోజుల్లో అతనికి ప్రధాన వ్యాపకంగా ఉండేది. అయినా వారిమధ్య ధైర్యంగా తన పరిచర్య కొనసాగించాడు. వారికి బట్టలేసుకోవడం దగ్గరినుండి నాగరికతనంతా నేర్పించాడు. ఈలోగా ఆయన భార్య, కుమారుడు నిమోనియాతో వారం రోజుల వ్యవధిలో చనిపోతే తానుండే ఇంటిపక్కనే తానే స్వయంగా తవ్వి వారిని భూస్థాపన చేశాడు. ఎన్నో రాత్రులపాటు ఆ సమాధుల వద్ద ఒంటరితనంతో రోదిస్తూ గడిపాడు. ఇప్పటికైనా స్వదేశానికి వచ్చెయ్యమన్నారు పెద్దలు. కానీ అది మాత్రం జరగదన్నాడు. ఆ ద్వీపవాసులకు సువార్త చెబుతూనే వారి భాషను నేర్చుకొని వారి భాషకు లిపిని తయారుచేసి, ఆ లిపిని వారికి నేర్పించి ఆ భాషలోకి బైబిల్‌ను అనువదించాడు. అలా అక్షరాస్యతా ఉద్యమాన్ని అక్కడ ఆరంభించాడు. కెరిబియన్ దీవులన్నింటిలో అలా సువార్త ఉద్యమం, సాక్షరతా ఉద్యమం, నాగరికతా ఉద్యమం ఒకేసారి వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా ఆ దీవుల్లోని వాళ్లంతా నరమాంసభక్షణ మానేసి యేసుప్రభువు రక్షణలోకి వచ్చి దేవుని ఆరాధకులుగా మారారు. ఆయన మరణించేనాటికి అంటే 1907 నాటికి ఆ దీవులన్నీ, సువార్తతో, అక్షరాస్యతతో, నాగరికతతో నిండిపోయాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రభువువారి పునరుత్థాన శక్తితో నింపబడితే వచ్చిన విప్లవాత్మకమైన మార్పులివి. -
చచ్చి బతికిన కుక్క..
మాస్కో: చనిపోయిందని సమాధి చేసిన కుక్క తిరిగి తన యాజమానుల దగ్గరకు చేరింది. ఈ ఘటన రష్యాలోని నోవోనికోల్స్క్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... క్రై ప్రాంతంలో నివసించే ఇద్దరు అక్కాచెల్లెలు తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క(డిక్) నిద్రలో చనిపోయిందని భావించారు. చాలా సేపు డిక్లో ఎటువంటి చలనం లేకపోయేసరికి అది చనిపోయిందనే నిర్ధారణకు వచ్చారు. తాము అమితంగా ఇష్టపడే డిక్ తమ నుంచి దూరమైందని బాధపడ్డారు. తర్వాత దాన్ని దగ్గరలోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. అయితే అనుహ్యంగా కొంత సమయం తరువాత డిక్ ఆ మట్టిని తవ్వుకుంటూ పైకి చేరింది. ఒంటి నిండా మట్టితో ఉన్న కుక్కను ఆ పరిసరాల్లో తిరగడం గమనించిన కొందరు వ్యక్తులు దాన్ని దగ్గర్లోని పెట్ షెల్టర్‌కు తరలించారు. అక్కడ డిక్కు చిన్నపాటి చికిత్స అందించారు. పెట్ షెల్టర్ ఉద్యోగి ఒకరు డిక్ యాజమానులు ఎవరో తెలుసుకోవడానికి.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచారు. అయితే ఈ ఫొటోలు చూసిన డిక్ యాజమానులు తొలుత షాక్ గురయ్యారు. ఆ తరువాత డిక్ బతికే ఉందని తెలుసుకుని ఆనందపడ్డారు. ఆ తరువాత దానిని తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఈ సంతోష సమయంలో వారు ఆ పెట్ షెల్టర్‌కు 5,000 రూబెల్స్ డోనేషన్ ఇచ్చారు. ఈ ఘటనపై షెల్టర్ నిర్వాహకులు మాట్లాడుతూ.. డిక్ యాజమానులు దానిని నిద్ర నుంచి లేపడంలో విఫలమయ్యారని తెలిపారు.. అయితే డిక్‌ను తక్కువ లోతులో పూడ్చటంతో అది ప్రాణాలు దక్కించుకోగలిగిందని పేర్కొన్నారు. -
సంస్కార బలం
ఒకసారి ఒక రుషి గాఢమైన సమాధి స్థితిలో ఒక తోవ పక్కన పడి ఉన్నాడు. ఒక దొంగ ఆ దోవలో వెళుతూ, ఆ రుషిని చూసి ఇలా ఆలోచించాడు. ‘‘వీడు కూడా దొంగ అయి ఉంటాడు. నిన్న రాత్రి కొన్ని ఇళ్లలో దొంగతనాలు చేసి అలసిపోయి ఇక్కడ పడి నిద్రపోతున్నాడు. ఈపాటికి పోలీసులు వీడికోసం వెతుకుతూ ఉండి ఉంటారు. వాళ్లు వచ్చేలోపలే నేను పారిపోవడం మేలు’’అనుకుని ఆ దొంగ అక్కడినుంచి పారి పోయాడు. కాసేపటి తర్వాత ఒక తాగుబోతు అక్కడికి తూలుకుంటూ వచ్చాడు. రుషిని చూసి ‘‘ఏరా! తాగి పడిపోయావా? నన్ను చూడరా! ఎంత తాగినా ఎలా నిలబడి ఉన్నానో!’’ అన్నాడు. చివరిగా అక్కడికి ఇంకొక సాధువు వచ్చి ఒక గొప్ప రుషి సమాధిస్థితిలో అక్కడ పడి ఉన్నాడని గ్రహించాడు. ఆ రుషి పక్కనే కూర్చుని ఆయన పాదాలు వత్తడం ప్రారంభించాడు. ప్రాపంచిక సంస్కారాలు నిజమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను గుర్తించకుండా చేస్తాయి. అదెలాగంటే, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా, ఒక మనిషి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టే ఎదుటివారిని అంచనా వేస్తాడని చెప్పడానికి శ్రీ రామకృష ్ణపరమహంస ఈ కథను శిష్యులతో చెప్పారు. -
స్వర్గవనమా..! నరక కూపమా..!!
ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త (స) నమాజుకోసం ఇంటినుండి బయలుదేరి మస్జిదుకు వెళ్ళారు. అప్పుడక్కడ మసీదులో కొంతమంది పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు ఏమరుపాటులో పyì ఉన్నారనడానికి అదొక సూచన. ప్రవక్తమహనీయులు అది గమనించారు. వారిని సంస్కరించాలన్న సత్ సంకల్పంతో ఇలా సెలవిచ్చారు:’మీరు గనక మనోవాంఛలను తుంచివేసే మరణాన్ని తరచుగా గుర్తుచేసుకుంటూ ఉన్నట్లయితే, అది మిమ్మల్ని ఇంతలా ఏమరుపాటులో పడి ఉండనిచ్చేది కాదు. కాబట్టి మీరు ఎక్కువగా మృత్యువును గుర్తుచేసుకుంటూ ఉండండి. ఎందుకంటే, మనందరి చివరి మజిలీ అయినటువంటి సమాధి ప్రతిరోజూ, ‘నేను ఒంటరి గృహాన్ని. మట్టి, పురుగుల పుట్టను’ అని ఎలుగెత్తి నినదిస్తూ ఉంటుంది. సమాధి పలికే ఈ పలుకుల్ని, దైవం ఎవరికైతే సమాధి పలుకులు వినగలిగే చెవులను ప్రసాదిస్తాడో వారు మాత్రమే వినగలరు. అంటే, ఒకవ్యక్తి మరణించిన తరువాత అతణ్ణి సమాధి అనబడే భూభాగంలో ఉంచి, పూడ్చడం జరుగుతుంది. అప్పుడు, విశ్వాసం, కర్మల ప్రాతిపదికన ఆ భూమి(సమాధి)ప్రవర్తన మృతుని పట్ల ఎలా ఉంటుందో ప్రవక్తమహనీయులు ఇలా వివరించారు. ‘ఒక వ్యక్తి సమాధి చేయబడిన తరువాత, అతను గనక నిజమైన విశ్వాసి అయినట్లయితే, భూమి ఒక ఆప్తమిత్రునికి స్వాగతం పలికినట్లుగా ఆహ్వానిస్తూ, ‘స్వాగతం.! సుస్వాగతం.! నీరాక సంతోషం, శుభకరం.! రా.. నా ఇంటిలోకి ప్రవేశించు. నా వెన్నుపై ఎంతమంది నడిచారో వారందరిలో నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడవన్నవిషయం నీకు తెలియాలి. ఈరోజు నువ్వునాదగ్గరికొచ్చావు. నాకు అప్పగించబడ్డావు. ఇప్పుడు నేను నీతో ఎలా ప్రవర్తిస్తానోచూడు.’ అంటూ భూమి (సమాధి) ఆ విశ్వాసి కనుచూపు మేర విశాలమవుతుంది. అతని/ఆమె కోసం స్వర్గద్వారం తెరవబడుతుంది. అలాగే, ఒక పాపాత్ముడు సమాధి చేయబడినప్పుడు భూమి అతనితో ఇలా అంటుంది. ‘ఎంతమంది నాపై నడిచేవారో వారందరిలో నువ్వే నాకు అయిష్టమైనవాడివి, అత్యంత నీచుడివి. ఈరోజు నువ్వు నాకు అప్పగించబడ్డావు. నా అధీనంలో ఉన్నావు. ఇకచూడు, నీపట్ల నాప్రవర్తన ఎలా ఉంటుందో..!’ అంటూ ఆ సమాధి నలువైపులనుండీ అతణ్ణి ఒత్తిపడేస్తుంది. ఆ ఒత్తిడికి పక్కటెముకలు ఒకదానిలోకొకటి చొచ్చుకొనిపోతాయి. అందుకే... ‘సమాధి స్వర్గవనాల్లోని ఓ ఉద్యానవనం లేదా నరకకూపాల్లోని ఓ నరకపు అగడ్త తప్ప మరేమీ కాద’ని ప్రవక్తమహనీయులు సెలవిచ్చారు.అందుకని ప్రతి ఒక్కరూ స్వర్గాన్ని సొంతం చేసుకోడానికి, నరక జ్వాలలనుండి రక్షించబడడానికి శక్తివంచనలేని ప్రయత్నం చెయ్యాలి. ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, సమాజ సంక్షేమానికి పాటుబడాలి. అల్లాహ్ మనందరికీ ఇహలోక, పరలోక సాఫల్యాలు అనుగ్రహించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈ శ్మశానానికి ఏమైంది
ఆ శ్మశానంలో... సినిమాల్లో చూపించినట్లుగానే ఒక పెద్ద ఊడలమర్రి ఉంది. దీనికి పాతిక అడుగుల దూరంలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్టకు చాలా దగ్గర్లో ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో నుంచి లేచిన అస్థిపంజరం, సమాధిపై కూర్చొని ఏదో పెద్దగా అరుస్తున్నాడు.ఆ అరుపులు విని చుట్టుపక్కల సమాధుల వాళ్లు దగ్గరికి వచ్చారు.‘‘ఏమోయి నూకరాజూ...ఎప్పుడూ సైలెన్స్ మోడ్‌లో ఉండేవాడివి.ఇవ్వాలేమిటీ రకరకాల రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి’’ అని అడిగాడు పక్క సమాధాయన. (సమాధి+ ఆయన)‘‘అయాం వెరీ బోర్డ్ యార్. ఈ శ్మశానంలో చాలా బోర్ కొడుతుంది’’ అసంతృప్తిగా అరిచాడు నూకరాజు.‘‘నెలరోజుల క్రితం వచ్చిన నువ్వే ఇలా అంటే....ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన నేనెంత బోర్‌గా ఫీల్ కావాలి? థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.... సర్దుకుపో నూకరాజు’’ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు వెనక సమాధాయన.‘‘నూకరాజు మన మనసులో మాటను తన మాటగా చెప్పాడు. నిజానికి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరం బోర్‌గా ఫీలవుతున్నాం. ఏదైనా చేయాలి! కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి’’ అని పట్టుదలగా అన్నాడు నూకరాజు ముుందు సమాధాయన.‘‘బయట సభ్య సమాజంలో ఉన్నట్లే... మనకూ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉండాలి. బార్లు ఉండాలి. బ్యూటీ పార్లర్లు ఉండాలి. పేకాట క్లబ్‌లు ఉండాలి. టీవీ సీరియల్స్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అసలు మనకంటూ ఒక ప్రెసిడెంట్ ఉండాలి’’ అన్నాడు నూకరాజు.‘ప్రెసిడెంట్’ అనే మాట వినబడగానే శ్మశానంలో ఉత్సాహం పొంగి పొర్లింది. ‘‘ఇంత పెద్ద శ్మశానానికి నేను ప్రెసిడెంట్ అయితే...ఆ మజానే వేరు...ఆ రెస్పెక్టే వేరు’’ అని ఎవరికి వారు రహస్యంగా మనసులో అనుకున్నారు.ఆ మరుసటి రోజే... ఎన్నికల ప్రకటన వెలువడింది.‘ప్రపంచ శ్మశాన చరిత్రలోనే ఇదో అరుదైన అవకాశం.ఈ శ్మశానానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వండి.శ్మశానాన్ని స్వర్గంగా మార్చండి.ఈ సవాలు స్వీకరించడానికి మీలో ఎవరు రెడీ?’....పెద్ద పెద్ద అక్షరాలతో ఊడల మర్రి కాడలకు కట్టిన ఈ బ్యానర్ అందరినీ ఆకట్టుకుంది.శ్మశానంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1872.ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నవారి సంఖ్య 1872.???!!!!అందరూ పోటీలో నిలబడితే మరి ఓటేసే వాళ్లు ఎవరు?ఎవరి ఓటు వాళ్లు వేసుకుంటే...గెలిచేవారుండరు...ఓడే వారుండరు! ఇలా అయితే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది కాబట్టి శ్మశాన పెద్దలు ఒకఐడియా ఆలోచించారు.ఎలక్షన్లో అయిదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాటరీ పద్ధతిలో ఈ అయిదుగురిని ఎంపిక చేశారు.రెండో రోజు పొద్దున ఎనిమిదింటికే పోలింగ్ మొదలైంది.పోలింగ్ మొదలైన పదినిమిషాలకు గొడవ మొదలైంది.అస్థిపంజరాల గుంపు ఒకటి... ఒక సింగిల్ అస్థిపంజరాన్ని పట్టుకొని చావబాదుతుంది.‘‘ఎందుకు వాడ్ని అలా చావ బాదుతున్నారు? ఏమైంది?’’‘‘అసలు వీడు మన శ్మశానపోడే కాదు. దొంగ ఓటు వేస్తున్నాడు’’‘‘ఇక్కడ నీకేం పనిరా?’’‘‘మా ఫ్రెండ్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు కదా అని దొంగ ఓటు వేయడానికి వచ్చాను. బుద్ధిగడ్డి తిని ఇలా చేశాను. నన్నుక్షమించండి’’‘‘క్షమించాలట...క్షమించాలి...వీడి పుర్రె పగలగొట్టండ్రా’’‘‘ఇప్పటి వరకు వీడిని కొట్టింది చాలు...వదిలేయండి. ఇకముందు ఎప్పుడైనా ఇక్కడ కనిపిస్తే నీ ఎముకలు సున్నం చేసి రథం ముగ్గు వేస్తాం’’ఒక గంట తరువాత... ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన అయిదుగురిలో ముగ్గురు ధర్నాకు దిగారు. ‘నశించాలి...నశించాలి’‘డౌన్ డౌన్ డౌన్’.... ఇలా రకరకాల నినాదాల మధ్య ఆ ముగ్గురిలో ఒకరు ఆవేశంగా మైక్ అందుకొని...‘‘ఇంత దుర్మార్గంగా, అక్రమంగా నియంతల దేశాల్లో కూడా ఎలక్షన్లు జరగవు. ఈ ఎలక్షన్లో ఇవియం మెషిన్ల ట్యాంపరింగ్ జరిగింది. ఈ ఎలక్షన్‌ను రద్దు చేసి రీపోలింగ్ జరిపించాలి’’ అని డిమాండ్ చేశాడు.ఈవీయం ట్యాంపరింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఒక సబ్ కమిటీ ఏర్పటైంది. ఆ కమిటీ తన రిపోర్ట్‌ను సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేసింది.‘ఈవీయం ట్యాంపరింగ్’ జరిగింది నిజమేనని ఆ రిపోర్ట్ చెప్పడంతో ఎలక్షన్ రద్దయింది.మరుసటి రోజు రీపోలింగ్ మొదలు కావడానికి ముందే...క్రికెట్ బ్యాట్లు, హాకీ బ్యాట్లు, సైకిల్ చైన్లు, సోడాలు, కూల్ డ్రింక్ బాటిళ్లతో... అస్థిపంజరాల బ్యాచ్ ఒకటి శ్మశానంలోకి వచ్చింది.‘‘నిన్న ఎవడ్రా మావాడిని కొట్టింది?’’ అడిగాడు ఆ బ్యాచ్‌లోని ఒక అస్థిపంజరం.‘‘ఆ మూలన నిల్చున్నాడే....వాడే అన్నా నన్ను చావబాదమని ఆర్డర్ వేసింది’’ ఏడుస్తూ అన్నాడు నిన్న తన్నులు తిన్న అస్థిపంజరం.అంతే...‘ఎటాక్’ అంటూ...ఆయుధాలతో వచ్చిన అస్థిపంజరాల గుంపు ఒక మూలన ఉన్న అస్థిపంజరంపై పడింది.‘‘రేయ్ మనోడ్ని కొడుతున్నారు.. మనలో మనకు ఏవైనా తగాదాలు ఉంటే రేపు చూసుకుందాం. ఆ పీనుగల అడ్డ çశ్మశానపోళ్లను తరిమికొట్టండ్రా’’ అని ఒక అస్థిపంజరం అరిచాడు.బొందల గడ్డ, పీనుగుల అడ్డ శ్మశాన వర్గాల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఆరోజు మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు శ్మశానాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. ఆ శ్మశానంలో వాలిన రాబందు ఈ çశ్మశానంలో వాలడం లేదు.ఒకరోజు నూకరాజు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.‘‘ఏమైంది?’’ అని అడిగాడు పక్క సమాధాయన.‘‘బుద్ది తక్కువై ఆరోజు ఏదో వాగాను. సభ్యసమాజంలో ఉన్నట్లే మన శ్మశానంలోనూ ఉండాలన్నాను. ఆనాటి నిశ్శబ్దమే చాలా గొప్పగా ఉంది’’ అని నూకరాజు అన్నాడో లేదో...‘‘రేయ్ ఆ పీనుగల అడ్డోళ్లు మళ్లీ వస్తున్నారు. లేవండ్రా’’ అన్న అరుపు పెద్దగా వినిపించింది! – యాకుబ్ పాషా -
బరువైన బాధ్యతలు
పాదుషాగారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. రాజుగారు మరెన్నో రోజులు బతకరని వైద్యులు చెప్పారు. ఆయనకు వారసులు లేకపోవడంతో పాలనా పగ్గాలు ఎవరికి అప్పగించాలనే సమస్య వచ్చిపడింది. ‘‘ఎవరైతే నేను చనిపోయాక ఒక్కరోజుపాటు నా సమాధిలో నాతో పాటు నిద్రిస్తారో అలాంటి వారిని రాజుగా ఎన్నుకోవాలి’’ అని వీలునామా రాసి రాజ్యంలోని నలుమూలలా ప్రకటన చేయించాడు రాజుగారు. ఈ వింత ప్రకటనకు అంతా భయంతో కంపించిపోయారు. ఒక్క రాత్రి సమాధిలో ఉంటే చాలు.. రాజ్యమంతా తన హస్తగతమవుతుందనే దురాశతో ఒక దేశదిమ్మరి రాజుగారి షరతుకు అంగీకరించాడు. త్వరలోనే రాజుగారు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ దేశదిమ్మరి రాజుగారి సమాధిలో రాజుగారితో బాటు ఒక్కరోజు గడిపేందుకు సిద్ధమయ్యాడు. రాజుగారితో పాటు ఆ దేశదిమ్మరిని కూడా ఖననం చేశారు. ఆ రోజు రాత్రి సమాధిలోకి భయంకరమైన ఆకృతితో దైవదూతలు వచ్చి ‘‘లే నీ లెక్క చూపు’’ అని గద్దించారు. ‘‘నేను లెక్క చెప్పడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఒకే ఒక్క గాడిదతో జీవితాన్ని నెట్టుకొచ్చాను’’ అని బదులిచ్చాడు ఆ దేశదిమ్మరి. అంతలో దేవదూతలు అతని కర్మల చిట్టా విప్పి చూశారు. ‘‘ఫలానా రోజు నీ గాడిదను పస్తులుంచావు. ఫలానా రోజున గాడిదపై శక్తిని మించిన బరువు మోపి చితకబాదావు’’ అని చదివి వినిపించారు. నిజమేనని ఒప్పుకున్నాడు దేశదిమ్మరి. అతనికి రెండు వందల కొరడా దెబ్బల శిక్ష విధించారు. తెల్లారేవరకూ కొరడా దెబ్బలు పడుతూనే ఉన్నాయి.సూర్యోదయం కాగానే ప్రజలంతా తమ కొత్త పాదుషాను ఘనంగా ఆహ్వానించాలని సమాధిని తవ్వారు. బయటకు రాగానే బతుకుజీవుడా అనుకుంటూ కాలిసత్తువకొద్దీ పరుగు తీశాడు ఆ దేశదిమ్మరి. ‘పాదుషా గారు ఎటు వెళుతున్నారు!’ అని అందరూ కంగారుగా అడిగారు. ‘అయ్యా! కేవలం ఒక్క గాడిద విషయంలోనే లెక్క చెప్పుకోలేకపోయాను. ఇక రాజుగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాజ్యానికి సంబంధించిన లెక్కలు ఇవ్వడం నా వల్ల అయ్యే పనికాదు’’ అందుకే నేను ఈ బాధ్యత తీసుకోదలచుకోలేదు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి పరుగు తీశాడు దేశదిమ్మరి. – ఉమైమా -
కుమారుడు లెనిన్ సమాధి వద్ద చెరుకూరి నిరాహార దీక్ష
-
ఒకే సమాధిలో ఇద్దరు
వేములవాడ అర్బన్: ఏడు పదుల వయసులో ఆ దంపతులు కలసి‘పోయారు’. పెళ్లితో ఏకమైన వారు.. మరణంలోనూ కలిసే సమాధి అయ్యారు. 18 గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శివారులోని శాంతినగర్‌కు చెందిన అల్లం ఇన్నాశమ్మ (72) బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మరణించింది. కుటుంబసభ్యులు హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఉండటంతో వాళ్లంతా రావడానికి సమయం పట్టింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అంతిమ యాత్రకు సిద్ధం చేయగా.. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త అల్లం శివారెడ్డి(75) గుండెపోటుతో మరణించాడు. ఇన్నాశమ్మ అంతిమయాత్రకు వచ్చిన బంధువులు భార్యాభర్తలు కొద్ది గంటల్లోనే మరణించడంతో తట్టుకోలేకపోయారు. శాంతినగర్‌లో ఇన్నాశమ్మ, శివారెడ్ది దంపతుల అంతిమయాత్ర కలసి సాగింది. ఇద్దరిని ఒకే సమాధిలో ఖననం చేశారు. శివారెడ్డి గతంలో నాంపెల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. -
చనిపోయిన యజమానికి 11ఏళ్లు కాపలా!
బ్యూనస్ ఎయిర్స్: విశ్వాసానికి మారు పేరు శునకాలు. అర్జెంటీనాలో ఓ శునకం తన యజమానిపై ఉన్న విశ్వాసాన్ని ఏళ్ల తరబడి నిరూపించుకుంది. తాజాగా ఆ శునకం చనిపోయింది. దీంతో దాని యజమాని కుటుంబంలో విషాదం నిండుకుంది. అదేంటీ కుక్క చనిపోతే ఎందుకంత బాధ అంటారా. ఆ వివరాల్లోకెళ్తే.. అర్జెంటీనా విల్లా కార్లోస్ పాజ్, కార్డోబాకు చెందిన మిగ్యేల్ గజ్‌మ్యాన్ అల్సాటియన్ జాతికి చెందిన కాపిటన్ అనే చిన్న కుక్కపిల్లను 2005లో కొన్నాడు. అప్పుడు కాపిటన్ వయసు దాదాపు రెండేళ్లు. గజ్‌మ్యాన్ తన కుమారుడు డామియన్(15)కు అదే సమయంలో పెట్ డాగ్ కాపిటన్‌ను కానుకగా ఇచ్చాడు. యజమాని గజ్‌మ్యాన్ ఆ కుక్క పిల్లను ఎంతో ముద్దుచేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా కాపిటన్ గజ్మ్యాన్నే అనుసరించేది. కానీ మరుసటి ఏడాది (2006)లో గజ్‌మ్యాన్ మృతిచెందాడు. కొన్నిరోజుల పాటు విషాధంలో ఉన్న కుటుంబసభ్యులు ఆ తర్వాత మామూలు మనుషులయ్యారు. కానీ విశ్వాసానికి మారుపేరైన కాపిటన్ తన యజమాని మరణాన్ని తట్టుకోలేక పోయింది. ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కాపిటన్ వేరే ఇంటిని చూసుకుందో, లేక చనిపోయిందోనని గజ్‌మ్యాన్ ఫ్యామిలీ భావించింది. 2007లో గజ్మ్యాన్కు నివాళి అర్పించేందుకు సమాధివద్దకు రాగా ఆశ్చర్యం.. కాపిటన్ బాధతో సమాధిని చూస్తు కూర్చుంది. కాపిటన్‌ను యజమాని కుమారుడు డామియన్ మళ్లీ ఇంటికి తీసుకెళ్లినా.. అది బయటకు వెళ్లిపోయేది. పగలు ఇంట్లో ఉన్నా.. రాత్రికి మాత్రం ఎక్కడికో వెళ్లేది. ప్రతిరోజు రాత్రి యజమాని గజ్‌మ్యాన్ సమాధి వద్దకు వెళ్తుందన్న విషయం తమకు ఆరేళ్ల తర్వా తెలిసిందని డామియన్ చెప్పాడు. అప్పటినుంచీ కాపిటన్ (శునకం) ఆర్జెంటీనాలో ఫేమస్. ఇలా దాదాపు 11ఏళ్లకు పైగా ప్రతిరోజూ తన తండ్రి సమాధివద్దే నిద్రించే కాపిటన్ నేడు మన మధ్య లేదంటూ వాపోయాడు డామియన్. ఇంటి నుంచి తన తండ్రి సమాధి చాలాదూరం ఉన్నా.. ప్రతిరోజు రాత్రి తమ పెట్ డాగ్ అక్కడికి వెళ్లడం మరిచిపోలేని అంశమన్నాడు. తన తండ్రి సమాధి వద్దకు ఒక్కసారి కూడా తాము కాపిటన్‌ను తీసుకెళ్లకున్నా, కానీ అది తన విశ్వాసాన్ని ఇన్నేళ్లు చూపిందని.. చనిపోయిన తర్వాత కూడా అది(శునకం) ఆయన వద్దకే కాపలాగా వెళ్లి ఉంటుందని ఏడ్చేశాడు డామియన్. -
సమాధి తవ్వి.. పోస్టుమార్టం
అశ్వారావుపేట : మృతురాలి బంధువుల ఏమరుపాటు పోలీసులకు పెద్ద పనే పెట్టింది. అశ్వారావుపేట బీసీ కాలనీలోని జంగాల బజారుకు చెందిన కళ్యాణపు నాగమ్మ(75), జనవరి 31న చలి కాగుతుండగా ఫిట్స్ రావడంతో చలి మంటలో పడి తీవ్రంగా గాయాలపాలైంది. ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మనుమడు సిరిగిరి తిరుపతిరావు చేర్పించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి, ఖమ్మం ఆస్పత్రులకు కుటుంబీకులు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నాగమ్మ మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలపకుండా ఖననం చేశారు. పెండింగులోగల ఈ కేసు వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని సీఐ ఎం.అబ్బయ్య ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. సీఐ దగ్గరుండి ఆ సమాధిని తవ్వించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రత్యూష, మంగీలాల్ పోస్టుమార్టం నిర్వహించారు. -
నిబంధనలు ఉల్లంఘించలేదు
టీ.నగర్: జయలలిత సమాధి ఏర్పాటుచేయడంలో నిబంధనలు ఉల్లంఘించలేదని హై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై హైకోర్టులో సామాజికవేత్త ట్రాఫిక్ రామస్వామి ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ ఆస్తుల కేసులో శిక్షపొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి ప్రభుత్వ ఖర్చుతో మెరీనా స్మారక మండపం ఏర్పాటయిందన్నారు. దీనిపై స్టే విధించాలని కోరారు. మెరైన్ రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘించి తీరం సమీపంలో జయలలిత సమాధి ఏర్పాటయిందన్నారు. ఈ సమాధిని అక్కడి నుంచి తొలగించేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ: ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వం సంజాయిషీ పిటిషన్ దాఖలు చేసింది. మెరైన్ రెగ్యులేటరీ నిబంధనలు రూపొందించక ముందే అన్నా, ఎంజీఆర్ సమాధులు మెరినా తీరంలో ఏర్పాటయ్యాయన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి జయలలిత సమాధి ఏర్పాటుకాలేదని తెలిపారు. తీరం వద్ద రోడ్లకు అతి సమీపంలో సమాధి నిర్మించడం మెరైన్ రెగ్యులేటరీ నిబంధనలకు వ్యతిరేకం కాదన్నారు. ఈ సమాధులను తొలగించడం వీలుకాదని పేర్కొన్నారు. ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ నిరాకరించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. -
నూటా నలభై మూడోసారి
‘‘బ్రేకప్‌కి ముందు నిన్నొక మనిషిగా నేను ప్రేమించాను. బ్రేకప్ అయ్యాక నేనొక మనిషినై నిన్ను ప్రేమిస్తున్నాను.’’ ‘‘గాడ్.. ఆపుతావా! వద్దనుకున్నాం కదా విహాన్.. నాకు నువ్వు. నీకు నేను. నీ మాటలు నాకు అర్థం కావు. మాటలే అర్థం కానప్పుడు మనిషితో రిలేషన్ నిలుస్తుందా చెప్పు’’.. తల పట్టుకుంది. మణిచందన. ‘‘నాకూ ఇష్టం లేదు చందనా నువ్వంటే. కానీ నిన్ను ప్రేమిస్తున్నా. ఇష్టాన్నీ, ప్రేమను వేరు చేసి చూడలేవా నువ్వు?’’ ‘‘చంపుతున్నావ్ విహాన్. ఇష్టాన్నీ, ప్రేమను వేర్వేరుగా ఎలా చూస్తారు చెప్పు?’’ ‘‘ఎలానా?! నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వంటే నాకూ ఇష్టం లేదు. మన ఇష్టాల్ని పక్కన పడేద్దాం. ప్రేమకు ఇష్టాలు ఉండవా? వాటిని మనం గౌరవించలేమా చందనా?’’ ‘‘ప్రేమకు ఇష్టాలేంటి విహాన్? మనుషులకు కదా ఉండేది ఇష్టాలైనా, ప్రేమలైనా?’’‘‘పొరపాటు చందనా. ప్రేమ నన్ను ఎంపిక చేసుకుంది నిన్ను ఇష్టపడమని. అదే ప్రేమ నిన్ను ఎంపిక చేసుకుంది.. నాపై నీ ఇష్టాన్ని తెంపేసుకోమని’’‘‘అంటే.. విహాన్?!’’ ‘‘మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా.. మనల్ని కలపడానికో, విడదీయడానికో ప్రేమ మన ఇద్దరినీ ఒక సెట్‌గా ఎంపిక చేసుకుంది చందనా’’ అన్నాడు విహాన్. చందన భయపడింది. ‘‘విహాన్.. మనం ఎందుకు విడిపోయామో తెలుసా? ఇదిగో ఈ క్యాచ్ ట్వంటీటూ లాంగ్వేజ్ నాకు అర్థం కాకనే! నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేవా విహాన్. ఇప్పుడైనా, విడిపోయాకైనా..’’ వేడుకుంటోంది చందన. ‘‘ఓకే చందనా. నువ్వు నన్ను ప్రేమించొద్దు. కానీ నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నువ్వు తెలుసుకుంటే చాలు నాకు’’. ‘‘అప్పుడేమౌతుంది విహాన్?’’ ‘‘ఏం కాదు. ఏం కాకపోవడమే కదా మీ అమ్మాయిలకు కావలసింది. ఏం కాదు కాబట్టే కాఫీ తాగడానికి వస్తారు. ఏం కాదు కాబట్టే మాటల వరకు వస్తారు. ఏం కానంత వరకూ.. ఎంత దూరమైనా వస్తారు’’.‘‘ఇప్పుడు నీకేం కావాలి విహాన్?’’ ‘‘నాకేం కావాలి అని అడక్కు చందనా. నా ప్రేమకు ఏం కావాలీ అని అడుగు.’’ ‘‘సరే.. నీ ప్రేమకు ఏం కావాలట?’’ ‘‘నీ చెంప పగలగొట్టాలట! కొట్టేదా?’’ అన్నాడు విహాన్. ‘‘నిజంగా ప్రేమ ఉన్నవాళ్లు అడిగి ఏదీ చెయ్యరు విహాన్. నా బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చావు. అడిగే ఇచ్చావా?’’. పెద్దగా నవ్వాడు విహాన్. చందన కూడా నవ్వింది. విహాన్ చందనను దగ్గరకు తీసుకునేలోపే, చందన విహాన్ గుండెల్లోకి వెళ్లిపోయింది. నూటా నలభై మూడోసారి వాళ్లలా కలుసుకోవడం. ‘‘ఏంటి చందనా నాతో మాట్లాడవు?! మొహం మొత్తేశానా? ఇంకెవడినైనా లవ్ చేస్తున్నావా? చెప్పు మీ ఇద్దరికీ పెళ్లి చేసేసి, నేను తప్పుకుంటా. నా ఫోన్లో నీ నెంబరు కూడా ఉంచుకోను. డిలీట్ చే సేస్తా’’. ‘‘పెళ్లి మేమిద్దరం చేసుకుంటాం కానీ, నువ్వు నా నెంబరు డిలీట్ చేస్కో... చాలు.’’‘‘ఎవడు వాడు?’’‘‘నువ్వే చెప్పాలి ఎవడో వాడు. అన్నావ్ కదా.. ఇంకెవడినో లవ్ చేస్తున్నానని!’’‘‘సారీ.. ఏమైంది చెప్పు’’‘‘అయిందని నేను చెప్పానా?’’‘‘మాట్లాడ్డానికి ఏమయ్యిందీ అంటున్నా చందనా.. నీకేదో అయిందని కాదు?’’‘‘నాకు స్పేస్ కావాలి విహాన్. కొన్నాళ్లు నీ నుంచి స్పేస్ కావాలి’’ ‘‘వాట్’’ అన్నాడు విహాన్.‘‘ఎస్’’ అంది చందన.‘‘నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా నుంచి స్పేస్ కోరుకుంటావా చందనా. నీ జీవితానికి నేను అంత ఇరుకైపోయానా?’’‘‘నిజంగా నిన్ను ప్రేమించాను కనుకే.. నువ్వు నాకు ఇరుకైపోయావని నీతో మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను విహాన్’’‘‘నువ్విప్పుడు మాట్లాడేది క్యాచ్ ట్వంటీటూ లాంగ్వేజ్ కాదా చందనా?’’ ‘‘ఏ లాంగ్వేజో నాకు తెలీదు. అర్థం అయ్యేలా చెప్పగలిగానని మాత్రం అనుకుంటున్నా. నీ ప్రేమ బరువును నేను మోయలేకపోతున్నాను విహాన్’’.‘‘చావు’’ అన్నాడు విహాన్. మూడొందలా నలభై ఒకటోసారి వాళ్లలా విడిపోవడం. ‘‘అబ్బ.. చంపుతున్నావ్ విహాన్. ఇష్టాన్ని, ప్రేమను వేర్వేరుగా చూసి ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు. చచ్చిపోనా? ఎప్పుడూ అంటూంటావుగా చావమని’’ అంది చందన. ‘‘చచ్చిపోవద్దు’’ ‘‘మరి!’’ ‘‘బతికించు’’ ‘‘ఎవర్ని?!’ ‘‘నన్నే’’ ‘‘బాగానే ఉన్నావ్‌గా, నన్ను చంపుకు తినడానికి. ఇంకా ఏం బతికించాలి నిన్ను’’.‘‘మనిషిగా నన్ను బతికించు చందనా. ప్లీజ్. ఏడుస్తోంది చందన. విహాన్ సమాధి పక్కనే కూర్చొని. ‘‘వెళ్దాం పద.. చీకటి పడుతోంది’’ అంది యోగిత. ఇద్దరూ నడుస్తున్నారు. ‘‘మనిషిగా బతికించమని అంటే ఏంటి చందనా?! విహాన్ ఎందుకలా అన్నాడు’’ ‘‘తెలీదు యోగిత. కానీ మనిషిగా ఉన్నప్పుడు మాత్రం విహాన్ అలా అనలేదు.’’ ఉలిక్కిపడింది యోగిత. ‘‘అంటే..?! ‘‘ఆ రోజు ఇద్దరం బాగా గొడవ పడ్డాం. ఎప్పుడూ నన్ను చావు.. చావు.. అనేవాడు. ఆరోజు మాత్రం ఫస్ట్ టైమ్ నేను అన్నాను విహాన్ని చావమని’’. కన్నీళ్లు ఆగట్లేదు చందనకి. ‘‘ఊరుకో చందనా.. ప్లీజ్’’ అంటోంది యోగిత. ‘‘చావమనగానే చావడానికి వెళ్లిపోయాడు స్టుపిడ్. చచ్చిపోయాక వచ్చి బతికించమన్నాడు. ఇప్పుడు కూడా వాడు ఇక్కడ ఎక్కడో నా పక్కనే ఉండి ఉంటాడు. బతికించు చందనా.. బతికించు చందనా.. అని బెగ్ చేస్తూ ఉండి ఉంటాడు’’.. ఏడుస్తోంది చందన. ‘‘ఆత్మలు నిజంగానే ఉంటాయంటావా చందనా?’’ అడిగింది యోగిత, చందన చేతిని గట్టిగా పట్టుకుంటూ. చందన వెనక్కి తిరిగి విహాన్ సమాధి వైపు చూసింది. ‘‘తెలీదు యోగితా. కానీ ప్రేమ ఉంటుంది’’ అంది. -
విశ్వాసి నిప్పులా బతకాలి
సువార్త బేతనియలో యేసు గొప్ప అద్భుతం చేశాడు. ఆయనకు ఎంతో దగ్గరి వాడైన లాజరు చనిపోగా అతని సోదరీమణులైన మరియ, మార్తను పరామర్శించేందుకు యేసు ఆ గ్రామానికొచ్చాడు. అంతేకాదు, నేరుగా లాజరు సమాధి వద్దకు వెళ్లి ‘లాజరూ! బయటికి రా!’అని పిలవగా అప్పటికే చనిపోయి నాలుగురోజులైన లాజరు సజీవుడై బయటికొచ్చాడు. గొర్రెలమందను కాసే కాపరుల్లో, జీతగాళ్లుంటారు. వాటి యజమానులు కూడా ఉంటారని, మందపై తోడేళ్లు దాడి చేస్తే, జీతగాడు ప్రాణభయంతో వాటిని వదిలి పారిపోతాడని, యజమానుడైన కాపరి మాత్రం తన ప్రాణాలొడ్డి వాటితోనే పోరాడి మందను కాపాడుకుంటాడని, తాను కూడా యావత్ మానవాళి రక్షణకోసం ప్రాణార్పణ చేయబోతున్న ‘పరమ కాపరి’నని కొద్దిరోజుల క్రితమే ఆయన చేసిన సంచలన బోధ విని ఛాందస యూదులాయన్ను రాళ్లతో కొట్టబోయారు. ‘‘నీవు మంచి కాపరివి, మేము పారిపోయే జీతగాళ్లమా?’’ అంటూ ఆయన మీద వ్యసన పడ్డారు. (యోహాను 10వ అధ్యాయం) రాళ్లతో కొడితే చనిపోవడానికి తాను అందరివాyì లాగా మానవమాత్రుణ్ణి కానని, తానే స్వచ్ఛందంగా ప్రాణ ం పెట్టబోతున్నానని వారికి యేసు స్పష్టం చేశాడు (10:18). ఈ సంచలనాత్మక బోధతో ఆయనకు ఛాందస యూదుల్లో చాలామంది శత్రువులయ్యారు కానీ సామాన్యుల్లో అంతకన్నా ఎక్కువమంది అనుచరులు, మిత్రులయ్యారు (10:42). తాను మాట్లాడిన ప్రతి మాటనూ ఆచరణలో రుజువు చేసే యేసు, మరణం మీద తనకున్న దైవాధికారాన్ని వెల్లడించేందుకే బేతనియలో లాజరుని ఆ తర్వాత కొద్దిరోజులకే సజీవుణ్ణి చేశాడు. ఆ తర్వాత రెండువారాలకు సిలువలో తన ప్రాణ ం పెట్టి మానవాళికంతటికీ ‘మంచి కాపరి’ అయ్యాడు లాజరు అద్భుతానికి ముందు మరియమార్తల గ్రామంగా చెప్పుకునే బేతనియ (యోహాను 11:1) ఆ తర్వాత లాజరు నివసించే గ్రామంగా మారింది (12:1). ఎందుకంటే వంగా మారిన తనలో మళ్లీ ఊపిరిని పోసి బతికించడం ద్వారా దేవుడు అద్భుతాన్ని చేస్తే, అలా పునఃప్రారంభమైన జీవితాన్ని దేవునికే అంకితం చేసి, పరివర్తనతో జీవించి దేవునికి మహిమకరంగా జీవించడం ద్వారా లాజరు తన జీవితాన్ని మహాద్భుతంగా మార్చుకున్నాడు. యేసు ఆరోహణానంతరం లాజరు చేసిన పరిచర్యతో యూదయ ప్రాంతమంతా ఆశీర్వదించబడిందని, చివరికి అతను యేసుకోసం హతసాక్షి అయ్యాడని చరిత్ర చెబుతోంది. యేసు చేసిన అద్భుతానికి లాజరు రుణం తీర్చుకున్న విధానమది. యేసు నా జీవితంలో అద్భుతం చేశాడంటూ చంకలు గుద్దుకోవడం కాదు, ఆ తర్వాత యేసుకోసం, ఆయన ప్రజల కోసం మనం మరెంత అద్భుతంగా జీవిస్తున్నామన్నది ప్రాముఖ్యమైన అంశం. యేసు అద్భుతాలు చేయాలన్న శ్రద్ధ మంచిదే కాని పరివర్తన పొంది యేసుకోసం మహాద్భుతంగా బతకాలన్న శ్రద్ధ మరీ మంచిది. నిప్పుకణికల్లాగా మండాల్సిన చాలా జీవితాలు, చర్చిలు బూడిదలా చల్లబడి చప్పబడి పోవడానికి కారణం ఆ శ్రద్ధ లోపించడమే! బూడిదలా వందేళ్లు బతకడం కాదు, నిప్పులా నిమిషంపాటు కణకణలాడినా చాలు!! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
సమాధిలో మొదటిరోజు ఏమవుతుందో...!
‘‘ఒక్కసారి ఊహించండి... సమాధిలో మీరు, కటిక చీకటిలో ఒంటరిగా. ఓ క్షణమాగి... ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా... సమాధిలో తొలిరాత్రి నాకేమవుతుందని? అంతిమయాత్ర కోసం మీ పార్థివదేహానికి స్నానం చేయిస్తున్న క్షణాన్ని ఊహించుకోండి. కుటుంబీకులు రోదిస్తుండగా... జనం మీ పార్థివదేహాన్ని మోస్తున్న రోజును ఊహించుకోండి. మిమ్మల్ని ఖననం చేస్తున్న క్షణాన్ని ఊహించండి’’ – 2013 జనవరి 18న సబ్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ అహ్మద్ దార్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఇది. కల్లోల కశ్మీరంలో శాంతి నెలకొనాలని ఆశించిన ఫిరోజ్ మనోనేత్రం మరణాన్ని ముందే చూసిందేమో. శుక్రవారం లష్కరే మిలిటెంట్లు పోలీసులపై దాడిచేసి ఆరుగురిని చంపేశారు. ఇందులో 32 ఏళ్ల ఫిరోజ్ అహ్మద్ దార్ ఒకరు. ‘‘ఓ దేవుడా...! ప్రశాంత కశ్మీర్‌ను చూసే రోజు ఎప్పుడొస్తుంది’’ – మార్చి 8, 2013న ఫిరోజ్ పెట్టిన మరో పోస్టు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సమాధిలోంచి తమ్ముడికి ఫోన్ చేయడంతో..
మాస్కో: ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్న విభేదాల కారణంగా రష్యాలో ఓ వ్యాపారవేత్తను బతికుండగానే శ్మశానంలో పాతిపెట్టారు. సమయానికి తమ్ముడు స్పందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. వ్యాపార భాగస్వాములకు 30 మిలియన్ రూబుల్స్‌ను చెల్లించే విషయంలో నెలకొన్న వివాదంతో ఖిక్‌మెట్ సలేవ్(41) అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని మాస్కోలోని ల్యూబర్టీ శ్మశానవాటికకు తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టారు. అయితే.. అతడితోపాటు సెల్‌ఫోన్‌ను మాత్రం ఉండనిచ్చారు. దీంతో సమాధిలో నుంచి ఖిక్‌మెట్ అతికష్టం మీద తన తమ్ముడు ఇస్మాయిల్‌కు ఫోన్‌చేశాడు. 1.2 మిలియన్ రూబుల్స్‌తో పాటు తన బీఎండబ్ల్యూ 535 మోడల్ కారును కూడా ఖిక్‌మెట్ బిజినెస్ పార్ట్నర్లకు ఇచ్చిన తరువాతే ఇస్మాయిల్‌కు సమాధి ఎక్కడుందో తెలిసింది. అప్పటికే 4 గంటలు సమాధిలో ఉన్న ఖిక్‌మెట్‌ను ఇస్మాయిల్ బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దుండగుల దాడిలో కొన్ని పక్కటెముకలు విరిగిన ఖిక్‌మెట్ కోలుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న గ్యాంగ్స్టర్ల ఆగడాలపై స్థానిక మీడియా తీవ్రంగా విరుచుకుపడుతోంది. -
పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో..
ప్రిటోరియా: తాను బిడ్డకు జన్మనివ్వడం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆగ్రహిస్తారని భయపడిన ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా తాను పనిచేసేచోటనే బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. అయితే.. మూడు రోజుల తరువాత ఆ బాలుడు గుర్తించబడి.. ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ టింబర్ ఫ్యాక్టరీలో పనిచేసే 25 ఏళ్ల మహిళకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకూడదని భావించి పనిచేస్తున్న చోటే.. ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకవేసి బాలుడిని పూడ్చివేసింది. ఆ తరువాత మూడు రోజులకు అటుగా వెళ్లిన అక్కడ పనిచేసే వారు శిశువు ఏడుపులు వినిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు బాలుడిని కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ షెప్‌స్టోన్ రీజనల్ ఆసుపత్రిలోని ఐసీయూలో బాలుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులకు భయపడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని వెల్లడించిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
11 రోజులు సమాధిలో..
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా సమాధిలోనే ఉండిపోయారు ఓ స్వామీజీ. అనంతరం ధ్యానముద్ర నుంచి మేల్కొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా చింతనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానిక సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ నెల 11న రాచోటేశ్వర అనే స్వామీజీ ధ్యానముద్రలో కూర్చొన్నారు. తర్వాత గ్రామస్తులు, భక్తులు కలిసి స్వామీజీ చుట్టూ రాళ్లతో సమాధి నిర్మించారు. గాలి, వెలుతురు లేకుండా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం సమాధిని తొలగించారు. ఉజ్జయిని జగద్గురు మరుళు సిద్ధ దేశీ కేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో యోగముద్రలో ఉన్న రాచోటేశ్వర స్వామీజీని ధ్యాన విముక్తుణ్ని చేయించారు. ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామీజీ మాట్లాడుతూ జనం సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా వచ్చి పంటలు బాగా పండాలనే 11 రోజులు ధ్యానం చేశానన్నారు. కాగా.. ఈయన గతంలో కూడా 41 రోజులు ధ్యానంలో ఉన్నారని భక్తులు తెలిపారు.