ఆ శ్మశానంలో... సినిమాల్లో చూపించినట్లుగానే ఒక పెద్ద ఊడలమర్రి ఉంది. దీనికి పాతిక అడుగుల దూరంలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్టకు చాలా దగ్గర్లో ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో నుంచి లేచిన అస్థిపంజరం, సమాధిపై కూర్చొని ఏదో పెద్దగా అరుస్తున్నాడు.ఆ అరుపులు విని చుట్టుపక్కల సమాధుల వాళ్లు దగ్గరికి వచ్చారు.‘‘ఏమోయి నూకరాజూ...ఎప్పుడూ సైలెన్స్ మోడ్‌లో ఉండేవాడివి.ఇవ్వాలేమిటీ రకరకాల రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి’’ అని అడిగాడు పక్క సమాధాయన. (సమాధి+ ఆయన)‘‘అయాం వెరీ బోర్‌డ్ యార్. ఈ శ్మశానంలో చాలా బోర్ కొడుతుంది’’ అసంతృప్తిగా అరిచాడు నూకరాజు.‘‘నెలరోజుల క్రితం వచ్చిన నువ్వే ఇలా అంటే....ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన నేనెంత బోర్‌గా ఫీల్ కావాలి? థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.... సర్దుకుపో నూకరాజు’’ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు వెనక సమాధాయన.‘‘నూకరాజు మన మనసులో మాటను తన మాటగా చెప్పాడు. నిజానికి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరం బోర్‌గా ఫీలవుతున్నాం. ఏదైనా చేయాలి! కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి’’ అని పట్టుదలగా అన్నాడు నూకరాజు ముుందు సమాధాయన.‘‘బయట సభ్య సమాజంలో ఉన్నట్లే... మనకూ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉండాలి. బార్‌లు ఉండాలి. బ్యూటీ పార్లర్‌లు ఉండాలి. పేకాట క్లబ్‌లు ఉండాలి. టీవీ సీరియల్స్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అసలు మనకంటూ ఒక ప్రెసిడెంట్ ఉండాలి’’ అన్నాడు నూకరాజు.‘ప్రెసిడెంట్’ అనే మాట వినబడగానే శ్మశానంలో ఉత్సాహం పొంగి పొర్లింది.
‘‘ఇంత పెద్ద శ్మశానానికి నేను ప్రెసిడెంట్ అయితే...ఆ మజానే వేరు...ఆ రెస్పెక్టే వేరు’’ అని ఎవరికి వారు రహస్యంగా మనసులో అనుకున్నారు.ఆ మరుసటి రోజే... ఎన్నికల ప్రకటన వెలువడింది.‘ప్రపంచ శ్మశాన చరిత్రలోనే ఇదో అరుదైన అవకాశం.ఈ శ్మశానానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వండి.శ్మశానాన్ని స్వర్గంగా మార్చండి.ఈ సవాలు స్వీకరించడానికి మీలో ఎవరు రెడీ?’....పెద్ద పెద్ద అక్షరాలతో ఊడల మర్రి కాడలకు కట్టిన ఈ బ్యానర్ అందరినీ ఆకట్టుకుంది.శ్మశానంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1872.ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నవారి సంఖ్య 1872.???!!!!అందరూ పోటీలో నిలబడితే మరి ఓటేసే వాళ్లు ఎవరు?ఎవరి ఓటు వాళ్లు వేసుకుంటే...గెలిచేవారుండరు...ఓడే వారుండరు! ఇలా అయితే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది కాబట్టి శ్మశాన పెద్దలు ఒకఐడియా ఆలోచించారు.ఎలక్షన్‌లో అయిదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాటరీ పద్ధతిలో ఈ అయిదుగురిని ఎంపిక చేశారు.రెండో రోజు పొద్దున ఎనిమిదింటికే పోలింగ్ మొదలైంది.పోలింగ్ మొదలైన పదినిమిషాలకు గొడవ మొదలైంది.అస్థిపంజరాల గుంపు ఒకటి... ఒక సింగిల్ అస్థిపంజరాన్ని పట్టుకొని చావబాదుతుంది.‘‘ఎందుకు వాడ్ని అలా చావ బాదుతున్నారు? ఏమైంది?’’‘‘అసలు వీడు మన శ్మశానపోడే కాదు. దొంగ ఓటు వేస్తున్నాడు’’‘‘ఇక్కడ నీకేం పనిరా?’’‘‘మా ఫ్రెండ్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు కదా అని దొంగ ఓటు వేయడానికి వచ్చాను. బుద్ధిగడ్డి తిని ఇలా చేశాను. నన్నుక్షమించండి’’‘‘క్షమించాలట...క్షమించాలి...వీడి పుర్రె పగలగొట్టండ్రా’’‘‘ఇప్పటి వరకు వీడిని కొట్టింది చాలు...వదిలేయండి. ఇకముందు ఎప్పుడైనా ఇక్కడ కనిపిస్తే నీ ఎముకలు సున్నం చేసి రథం ముగ్గు వేస్తాం’’ఒక గంట తరువాత... ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన అయిదుగురిలో ముగ్గురు ధర్నాకు దిగారు.
‘నశించాలి...నశించాలి’‘డౌన్ డౌన్ డౌన్’.... ఇలా రకరకాల నినాదాల మధ్య ఆ ముగ్గురిలో ఒకరు ఆవేశంగా మైక్ అందుకొని...‘‘ఇంత దుర్మార్గంగా, అక్రమంగా నియంతల దేశాల్లో కూడా ఎలక్షన్‌లు జరగవు. ఈ ఎలక్షన్‌లో ఇవియం మెషిన్ల ట్యాంపరింగ్ జరిగింది. ఈ ఎలక్షన్‌ను రద్దు చేసి రీపోలింగ్ జరిపించాలి’’ అని డిమాండ్ చేశాడు.ఈవీయం ట్యాంపరింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఒక సబ్ కమిటీ ఏర్పటైంది. ఆ కమిటీ తన రిపోర్ట్‌ను సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేసింది.‘ఈవీయం ట్యాంపరింగ్’ జరిగింది నిజమేనని ఆ రిపోర్ట్ చెప్పడంతో ఎలక్షన్ రద్దయింది.మరుసటి రోజు రీపోలింగ్ మొదలు కావడానికి ముందే...క్రికెట్ బ్యాట్లు, హాకీ బ్యాట్లు, సైకిల్ చైన్లు, సోడాలు, కూల్ డ్రింక్ బాటిళ్లతో... అస్థిపంజరాల బ్యాచ్ ఒకటి శ్మశానంలోకి వచ్చింది.‘‘నిన్న ఎవడ్రా మావాడిని కొట్టింది?’’ అడిగాడు ఆ బ్యాచ్‌లోని ఒక అస్థిపంజరం.‘‘ఆ మూలన నిల్చున్నాడే....వాడే అన్నా నన్ను చావబాదమని ఆర్డర్ వేసింది’’ ఏడుస్తూ అన్నాడు నిన్న తన్నులు తిన్న అస్థిపంజరం.అంతే...‘ఎటాక్’ అంటూ...ఆయుధాలతో వచ్చిన అస్థిపంజరాల గుంపు ఒక మూలన ఉన్న అస్థిపంజరంపై పడింది.‘‘రేయ్ మనోడ్ని కొడుతున్నారు.. మనలో మనకు ఏవైనా తగాదాలు ఉంటే రేపు చూసుకుందాం. ఆ పీనుగల అడ్డ çశ్మశానపోళ్లను తరిమికొట్టండ్రా’’ అని ఒక అస్థిపంజరం అరిచాడు.బొందల గడ్డ, పీనుగుల అడ్డ శ్మశాన వర్గాల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఆరోజు మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు శ్మశానాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. ఆ శ్మశానంలో వాలిన రాబందు ఈ çశ్మశానంలో వాలడం లేదు.ఒకరోజు నూకరాజు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.‘‘ఏమైంది?’’ అని అడిగాడు పక్క సమాధాయన.‘‘బుద్ది తక్కువై ఆరోజు ఏదో వాగాను. సభ్యసమాజంలో ఉన్నట్లే మన శ్మశానంలోనూ ఉండాలన్నాను. ఆనాటి నిశ్శబ్దమే చాలా గొప్పగా ఉంది’’ అని నూకరాజు అన్నాడో లేదో...‘‘రేయ్ ఆ పీనుగల అడ్డోళ్లు మళ్లీ వస్తున్నారు. లేవండ్రా’’ అన్న అరుపు పెద్దగా వినిపించింది!
– యాకుబ్ పాషా
ఈ శ్మశానానికి ఏమైంది
Published Sun, Jul 8 2018 12:07 AM | Last Updated on Sun, Jul 8 2018 12:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment