
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.
ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.
ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
Comments
Please login to add a commentAdd a comment