Cemetery
-
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్‌టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్‌పూర్ -
శ్మశానం కోసం 4 కిలోమీటర్ల ప్రయాణం
కోరుట్ల: శ్మశానవాటికకు స్థల కేటాయింపు వివాదాస్పదం కావడంతో.. అంత్యక్రియల కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసికోనిగుట్ట కాలనీకి చెందిన వంగాల ఈశ్వరయ్య (56) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు. ఆ కాలనీ వాసులకోసం గతంలో మున్సిపల్ అధికారులు కేటాయించినట్లుగా భావిస్తున్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తుండగా సమీపంలోని ఇళ్లకు చెందినవారు అడ్డుకున్నారు. అక్కడ శ్మశానం కోసం స్థలం కేటాయించలేదని.. తమ ఇళ్ల ముందు శవదహనం చేయడం కుదరదని పట్టుబట్టారు. దీంతో పాడె మీద ఉన్న మృతదేహాన్ని కిందకి దించలేక సుమారు 2 గంటలపాటు అలాగే ఎత్తుకుని ఉన్నారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో ఎస్సైలు సతీష్, శ్యాంరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. శ్మశానం కేటాయింపు విషయంలో స్పష్టత లేదని మున్సిపల్ అధికారులు కూడా చెప్పడంతో కాలనీకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శనగర్ పూల్వాగు శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. -
వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్ కట్ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది. శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్‌ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. -
చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆ శ్మశాన వాటికలో చితిమంటలు ఉండవు. కట్టెలతో కాల్చే పద్ధతి కానరాదు. ఎల్బీనగర్లో ఆధునిక విధానంలో సోలార్ శ్మశాన వాటిక త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాగోలు వద్ద ఫతుల్లాగూడలో నిర్మించే శ్మశాన వాటిక ఇందుకు వేదిక కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇక్కడి శ్మశాన వాటిక పనులు తుది దశకు చేరుకున్నాయి. సోలార్ బర్నింగ్ శ్మశాన వాటిక నిర్మాణ పనులు హెచ్ఎండీఏ పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో దీని పనులు పూర్తి కావస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విదేశాల్లో ఉన్నవారు సైతం తమ బంధువుల అంత్యక్రియలను ఇంటర్నెట్ ద్వారా చూసే అవకాశముంది. ఇందుకోసం తెర ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సీసీ కెమెరాలతో పాటు ఒక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం నగరంలోనే మొదటిది. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని సుమారు 6 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇక్కడ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలను రూపుదిద్దుకుంటున్నాయి. హిందు, క్రిస్టియన్, ముస్లింలకు వేర్వేరుగా అత్యున్నత ప్రమాణాలతో అన్ని హుంగులతో నిర్మాణం సాగుతోంది. సుందరమైన లాన్లు, పచ్చిక బయళ్లు, కూర్చునేందుకు విశాలమైన హాల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశాం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే (చదవండి: ఇదేమి ‘పని’ష్మెంట్!) -
శ్మశాన వింత! చితిపై పడుకోబెట్టబోతుంటే హఠాత్తుగా కళ్లు తెరిచి..
న్యూఢిల్లీ: మరికొన్ని సెకన్లలో చితిపై పడుకోబెట్టి, నిప్పంటించబోతుంటే మృతి చెందిన వ్యక్తి ఒక్క సారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం.. నారేలాలోని టిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సతీష్ భరద్వాజ్ (62) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడిని దహన సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులు శ్మశానికి తరలించారు కూడా. ఐతే చితిపై పడుకోబెట్టడానికి మృతుడి శరీరంపైనున్న గుడ్డను తొలగించగానే, అకస్మాత్తుగా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వారు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటన ఈ రోజు మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వృద్ధుడి బంధువులు మీడియాకు తెలిపారు. చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్! -
1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు..
World's largest cemetery where more than 5 million dead people are buried: ఈ సృష్టిలో నా అంతటి వాడులేడని విర్రవీగే మనిషి.. కట్టుబట్టలతో మాత్రమే తన చివరి మజిలీని చేరుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.! ఐనా ఎత్తుకు పైఎత్తులు వేసి మరొకరిని చిత్తుచేయాలనే కుబుద్ధి ఎన్ని జన్మలెత్తినా మారదు. అంత పోరాటం చేసి చివరికి చేరేది అంతశయ్యకే..! జీవన్మరణాలు ఎంత విచిత్రమైనవో స్మశానాన్ని చూస్తే అర్ధమవుతుంది. తారతమ్య భేదాలు లేకుండా ఒకే చోట ఖననం అవుతారు. ప్రేతభూమి మహత్యమదే!! ఎంతటివారినైనా కాదనకుండా తనలో ఇముడ్చుకుంటుంది. ఐతే ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక తప్పక ఉంటుంది. సాధారణంగా రెండు మూడు ఎకరాల్లో శ్మశానవాటికలు ఉంటాయి. ఆ దేశంలో వేల ఎకరాల్లో ఒక శ్మాశానవాటిక ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటికది.. ఎక్కడుందో తెలుసా! వారికి చాలా ప్రత్యేక స్థలమిది! ఇరాక్ దాదాపు 1485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. ‘వాడీ ఉస్ సలామ్’ అని ఈ శ్మశానాన్ని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్ పీస్’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారిక్కడ. షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట. ఆ యుద్ధకాలంలో అధిక సంఖ్యలో.. ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక. గత 1400 యేళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి. 18వ శతాబ్ధంలో ఇరాన్ - ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంలో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతాదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాగడం మూలంగా అనేక సమాధులను ఇరాక్ సైన్యం పడగొట్టారు. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలో ఖననం చేశారిక్కడ. శ్మశానికి కూడా కథలుంటాయని, వాటికీ చరిత్ర ఉంటుందనడానికి వాడీ ఉస్ సలామ్ ఓ ఉదాహరణ. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
వైద్య విద్యార్థిని అవస్థలు .. శ్మశానంలో ‘డాక్టర్’ చదువు
మల్యాల(చొప్పదండి): ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకులగది శ్మశానంలోనిది.. అందులోనే ఆన్లైన్క్లాసులు వింటోంది ఓ వైద్య విద్యార్థి.. ఎందుకంటే.. ఇంట్లో ఉంటే సెల్‌ఫోన్ సిగ్నల్స్ కరువు. మేడ మీదికి వెళ్తే కోతుల బెడద. అందుకే సిగ్నల్స్ సరిపడా ఉన్న శ్మశానవాటికనే ఆన్లైన్ క్లాసులకు వేదికగా చేసుకుంది జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన. ఆమె ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది. ‘మా ఊర్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉంది. గతేడాది కూడా కుటుంబసభ్యుల సహకారంతో నిత్యం శ్మశానవాటికలోనే ఆన్లైన్ పాఠాలు విన్నాను. నాలాంటి వారికోసం సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’అని కల్పన కోరుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ -
గ్రామాల మధ్య శ్మశానం చిచ్చు
చంద్రగిరి: శ్మశానం ఆక్రమణ యత్నం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు.. ఎగువరెడ్డివారిపల్లె గ్రామ లెక్క దాఖల సర్వే నంబరు 1లో మూడు ఎకరాల శ్మశాన వాటిక ఉంది. దాని పక్కనే ఉన్న నరసింగాపురం గ్రామస్తులు ఆ భూమిలో కత్తులు, గొడ్డలతో చెట్లు తొలగించి చదును చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎగువరెడ్డివారిపల్లె వాసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వీఆర్ఓ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ రేవతి ప్రకాష్‌రెడ్డి, ఔరంగజేబు ఘటన స్థలానికి చేరుకుని ఇరు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం రెడ్డివారిపల్లెకు చెందినదిగా నిర్ధారించారు. నరసింగాపురం గ్రామస్తులకు సర్ధి చెప్పి, సమస్యను పరిష్కరించారు. -
బతికుండగానే ‘బలి’చేద్దామనుకున్నారు..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : అది విశాఖ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటిక.. సాయంత్రం వేళలో అక్కడకు ఏపీ31 డీఎఫ్ 0741 నంబర్ గల ఓ కారు చేరుకుంది. అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు. వారి చేతిలో ఓ శిశువు కవర్లో చుట్టి ఉంది. పాప చనిపోయిందని అక్కడి సిబ్బందితో చెప్పారు. ఏ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించాడు శ్మశాన వాటిక ఇన్చార్జి. అందుకు వాళ్లు.. రైల్వే న్యూకాలనీలోని కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నుంచి తెచ్చామంటూ.. ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు. శిశువును పూడ్చడం కోసం సిబ్బంది కవర్‌ను తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడ్వడం ప్రారంభించింది. ఒక్కసారిగా హతాశులైన సిబ్బంది.. తర్వాత తేరుకుని.. ఆ నలుగురినీ నిలదీశారు. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన శ్మశానవాటిక సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. వెంటనే వారు శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆస్పత్రి సిబ్బంది కూడా వీరితో దురుసుగా ప్రవర్తించారు. బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వెళ్లమంటూ కసురుకోవడంతో బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వచ్చారు. దీనిపై శ్మశాన వాటిక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అసలు శిశువును ఆ ఆస్పత్రి నుంచే తీసుకొచ్చారా? లేక నకిలీ రశీదు సృష్టించారా? ఇంతకీ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన ఆ నలుగురు ఎవరు? తదితర విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఘటనపై శనివారం శ్మశానవాటిక ఇన్చార్జి ప్రసన్నకుమార్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచినట్టుగా తనకు సమాచారం తెలిసిందని ‘సాక్షి’తో చెప్పారు. -
Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్/నవాబుపేట: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాల ని నిర్ణయించారు. తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మొత్తం 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో మొదట ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ వాప్తి చెందితే.. మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు. దీంతో అందరూ కోవిడ్ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఆ వైకుంఠధామంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు రెండు పూటలా భోజనం సమకూర్చారు. ప్రస్తుతం రుద్రారానికి చెందిన యువత వీరికి నిత్యం ఆహారం సమకూరుస్తూ సేవలందిస్తోంది. వైకుంఠధామంలో ఉంటున్న పాజిటివ్ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి -
శ్మశానవాటికలో నిప్పంటించుకుని..
ఆత్మకూరు: పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ తల్లి శ్మశానవాటికకు వెళ్లి శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లీ కూతురు మరణించగా కుమారుడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులోని నవాబుపేట యనమలపాళేనికి చెందిన ఆదినారాయణ తన కుమార్తె వెంకటసుబ్బులు(27)ను తన అక్క కుమారుడైన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పేర్లపేట గ్రామానికి చెందిన కొండ్రెడ్డి బాబుకి ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి మహేష్ బాబు (7), మధురవాణి (5) సంతానం. బాబు కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగిరి గ్రామంలో పండ్ల తోట కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం వెంకటసుబ్బులు పిల్లలతో కలిసి బళ్లారి నుంచి నెల్లూరుకు బయల్దేరింది. నెల్లూరుపాళెం సెంటర్లో శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో బస్సు దిగింది. సెంటర్లో టీ తాగి, అనంతరం వింజమూరు మార్గంలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలోకి వెళ్లి పిల్లలతో పాటు తన ఒంటిపై శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంకటసుబ్బులు, మధురవాణి మంటల్లో కాలి మరణించారు. తప్పించుకున్న మహేష్ బాబు భయంతో నెల్లూరుపాళెం సెంటర్‌కు పరుగెత్తాడు. ఆ సమయంలో పొలాల్లోకి వెళ్తున్న వ్యవసాయ కూలీలు గమనించి కౌన్సిలర్ కామాక్షయ్యనాయుడుకు సమాచారం అందజేశారు. కౌన్సిలర్ స్థానికులతో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే తల్లి, కుమార్తె మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ ద్వారా వివరాలు తెలుసుకుని బం«ధువులకు సమాచారం అందజేశారు. సొంత మేనల్లుడే తన అల్లుడని, కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని మృతురాలి తండ్రి చెప్పాడు. ఇటీవల అల్లుడు మద్యానికి అలవాటు పడటంతో కుమార్తె వద్దని వారిస్తుండేదని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై..
సాక్షి,న్యూఢిల్లీ: భార్యపై ప్రేమతో ‘తాజ్‌మహల్’ లాంటి ప్రేమ సౌధాన్ని నిర్మించలేదు. గుడి కట్టి దేవతనూ చేయలేదు. కానీ తనకు శాశ్వతంగా దూరమైన భార్య శవంతోనే 16 ఏళ్లుగా కాలం గడుపుతున్న కథనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ అభినవ షాజహాన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. వివరాలను పరిశీలిస్తే.. వియత్నాంకు చెందిన లీవాన్, 1975లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే 2003లో అకస్మాత్తుగా వాన్ భార్య చనిపోయింది. దీంతో భార్యపై అమితమైన ప్రేమను చంపుకోలేక, భార్యనువిడిచి ఉండలేక ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. రోజూ శ్మశానానికి వెళ్లి ఆమె సమాధిపైనే నిద్రించేవాడు. అలా నెలలు తరబడి అక్కడే గడిపేవాడు. ఒక రోజు వర్షం కురవడంతో ఆందోళన చెందిన వాన్, ఏం చేయాలా అని ఆలోచించాడు. భార్యకు దగ్గరగా ఉండటానికి ఏం చేయాలా తపన పడ్డాడు. ఆమె సమాధి పక్కన ఒక సొరంగం తవ్వి, అక్కడే ఆమె పక్కనే పడుకోవచ్చని అదే ఉత్తమమైన మార్గం అని నిర్ణయించు కున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వాన్ సంతానం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అతని మనసు శాంతించలేదు.. భార్యపై ఉన్న ప్రేమ ఏమాత్రం చావలేదు. అందుకే రాత్రికి రాత్రి భార్య సమాధిని తవ్వి, అవశేషాలన్నింటినీ ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే కుళ్లి, పాడైపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికలను భద్రంగా ఎలా దాచాలా అని మధనపడ్డాడు. ఇక్కడే అతని బుర్రలో మరో ఆలోచన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో ఒక మహిళ బొమ్మను తయారు చేసి, అందులో తన భార్య అస్థికలను పొందికగా అమర్చాడు. అలా ఆ బొమ్మను కాదు కాదు.. తన భార్యను తన పడకగదిలో పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నాడు. -
అత్యాధునిక వసతులతో శ్మశానవాటిక
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్న బేగంపేట్ స్మశానవాటిక పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. '5 ఎకరాల విస్తీర్ణంవున్న ఈ స్మశానవాటికలో నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి 150 లారీలలో తరలించారు. అలాగే 50 లారీల తుమ్మ, ఇతర కంప చెట్లను తొలగించారు. అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు, నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నారు. (శవాలపైనా కాసులవేట!) ఒక వైపు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కాంపౌండ్ వాల్ ఉండగా.. అభివృద్ధిలో భాగంగా రోడ్డు వైపు కాంపౌండ్ వాల్ నిర్మించారు. ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫార్మ్స్, దింపుడుకల్లం, పార్కింగ్, సీటింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. తదుపరి విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నారు. ఈ దహన వాటికకు ఎదురుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థలంలో ఇప్పటికే చెట్లు ఏపుగా, దట్టంగా పెరిగాయి. ఈ స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులతో మరో ఆరు నెలల్లో ఆహ్లాదకరమైన స్మశానవాటికగా మారనుంది' అని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
కడచూపునకు ‘కరోనా’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ భూతం శ్మశానవాటికలనూ తాకింది. దగ్గరి బంధువులను సైతం చివరి చూపు చూడకుండా కట్టడి చేస్తుంది. వివిధ కారణాలతో ఎవరైనా చనిపోతే వారి బంధువులు, స్నేహితులు శ్మశానవాటిక వరకు వస్తారు. అంతిమయాత్రకు కూడా పరిమితమైన సంఖ్యలోనే సందర్శకులు రావాలని, దీనికి కూడా నిబంధనలు వర్తిస్తాయంటూ శ్మశానవాటిక నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 50 మందితో మాత్రమే అంతిమయాత్రకు అనుమతి ఉంటుందని, అది కూడా సాయంత్రం నాలుగు గంటలలోపు ఈ తంతు పూర్తి చేయాలని శ్మశానవాటిక నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. చివరిచూపు లేకుండా... బంధువుల్లో ఎవరైనా చనిపోతే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వచ్చి చివరిచూపు చూసి ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అంతిమయాత్రలో 50 మందికి మించొద్దని ఆదేశించింది. పరిమిత సంఖ్యలో హాజరు కావాలని ప్రభుత్వం సూచించడంతో ఎవరెవరిని అంతిమ యాత్రకు అనుమతించాలి అనేది ఆయా కుటుంబాల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఎవర్నీ కాదనే పరిస్థితి లేకపోవడం సమస్యగా మారి, కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు కూడా దారితీస్తోంది. -
ఆఖరి మజిలీకీ అవస్థలే !
సాక్షి, నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): శ్మశానవాటికకు సరైన దారిలేక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పెద్దఆత్మకూర్, చిన్నఆత్మకూర్ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా చనిపోతే పాడెను పంటపొలాల ఒడ్లపై నుంచి అవస్థలు పడుతూ శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పెద్దఆత్మకూర్ గ్రామానికి చెందిన నాయికోటి రాములు అలియాస్ దుబాయి రాములు అనారోగ్యంతో గురువారం మృతి అదే పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సమాజంలో మంచితనం పరిఢవిల్లితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు’ అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మాట్లాడిందీ దళితులు, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి. ‘చట్టాన్ని మార్చకుండానే రిజర్వేషన్లపై కొనసాగుతున్న సామాజిక సంఘర్షణను ఒక్క నిమిషంలో పరిష్కరించవచ్చు. వీటిని వ్యతిరేకిస్తున్నవారు, సమర్థిస్తున్న వారి మధ్య సామరస్య భావన ఏర్పడితే చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పట్లో సాధ్యమా ? అది సాధ్యమయ్యే పని కాదని గత శనివారం తమిళనాడులోని వెల్లూరి జిల్లాలో ఓ దళితుడి అంత్యక్రియల విషయంలో జరిగిన పరాభవమే అందుకు కారణం. వెల్లూరు జిల్లాలోని వనియంబమ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని నట్రంపల్లి గ్రామంలో 55 ఏళ్ల కుప్పన్ అనే దళితుడు మరణించాడు. ఊరి శ్మశానంలో దళితుల అంత్యక్రియలకు అనుమతి లేదు. దాంతో వారు పాలర్ నది అవతలి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే ఓ అగ్రవర్ణ కులస్థుడి పొలం బాట గుండా వెళ్లాలి. దళితులకు ఆ స్థలం గుండా కూడా ప్రవేశం లేదు. అందుకని దళితులు ఆగస్టు 17న పాలం నది వంతెనపైకి కుప్పన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. 45 అడుగుల ఎత్తున ఉన్న ఆ వంతెన మధ్య నుంచి తాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి నిర్దేశిత చోటుకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి దళిత కుటుంబాల్లో ఇంటి పెద్ద కుమారుడిని పూడ్చి పెట్టడం, మిగతా కుటుంబ సభ్యులను తగులబెట్టడం సంప్రదాయమట. అది వేరే విషయం. ఇలా వంతెన మీది నుంచి మృత దేహాన్ని దించడం, అక్కడి నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్లడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక మరుసటి రోజే హుటాహుటిన నట్రంపల్లి గ్రామాన్ని సందర్శించి ఊరవతల అర ఎకరం పోరంబోకు స్థలాన్ని దళితుల అంత్యక్రియల కోసం కేటాయించారు. సామాజిక న్యాయం చేశామనిపించుకున్నారు. హిందువులందరికి ఒకే శ్మశాన వాటిక ఉండాల్సిన చోట వేరు స్థలం కేటాయించడంతోపాటు అందుకు దారితీసిన పరిణామాలన్నీ సమాజంలోని వివక్షతను, వైషమ్యాలను స్పష్టం చేస్తున్నాయి. కుల వివక్షత పోయే వరకు రిజర్వేషన్లు తప్పవనే విషయం విజ్ఞులందరికి తెల్సిందే. హిందువులంతా ఒక్కటే దళితులందరు తమ వెంటే ఉన్నారని గత ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ ప్రకటించుకుంది. అవును దళితుల మద్దతు లేకపోయినట్లయితే ఆ పార్టీకి లోక్‌సభలో అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. అయినా కేంద్ర కేబినెట్లో అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు లభించాయి. కులాల పేరిట ఎక్కువనో, తక్కువనో మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలోనే ఇలా రిజర్వేషన్లు కొనసాగితే విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగడం తప్పా!? -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
శ్మశానంలో శివపుత్రుడు
కర్ణాటక,కృష్ణరాజపురం : అప్పుడెప్పుడో 16 ఏళ్ల క్రితం విక్రమ్ నటించిన శివపుత్రుడు చిత్రం గుర్తుందా? అందులో చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు కనీసం శ్మశానం గేటు కూడా దాటకుండా శ్మశానంలోనే ఉంటూ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటాడు. అచ్చం అలాగే బెంగళూరు నగరంలో కూడా ఓ శివపుత్రుడు ఉన్నాడు. అంథోణిస్వామి అనే వ్యక్తి నిత్యావసరవస్తువులు లేదా అత్యవసర పనులు మినహా సుమారు మూడు దశాబ్దాలుగా కనీసం శ్మశానం గేటు కూడా దాటకుండా కుటుంబంతో సహా శ్మశానంలోనే ఉంటూ ప్రతీరోజూ శ్మశానానికి తీసుకువచ్చే శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. 90 ఏళ్ల క్రితం అంథోణిస్వామి తాత ప్రస్తుతం బెంగళూరు నగరంలోని అతిపెద్ద శ్మశానవాటికైన కల్పళ్లి శ్మశానవాటికలో శవాలు పాతిపెట్టడానికి గుంతలు తీసే పనిని వృత్తిగా ఎంచుకున్నాడు. అనంతరం అదేపనిని అంథోణి స్వామి తండ్రి కూడా కొనసాగించాడు. దీంతో అంథోణిస్వామి కూడా చిన్న వయసు నుంచే తండ్రికి సహాయం చేస్తూ అక్కడే పెరిగాడు. తండ్రి మరణించాక శవాలకు అంత్యక్రియలు చేసే పనిని అంథోణిస్వామి కొనసాగించసాగారు. ఈ క్రమంలో దాదాపుగా మూడు దశాబ్దాలుగా ప్రతీరోజూ కనీసం ఎనిమిది నుంచి పది శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ తల్లి, భార్య, నలుగురు పిల్లలతో కలసి స్మశానంలోనే నిర్మించిన ఇంట్లో ఉంటున్నాడు. నిత్యావసరాలు ఏదైనా అత్యవసర పనులు మినహా ఈ మూడు దశాబ్దాలలో ఇప్పటివరకు కుటుంబంతో కానీ ఒక్కడే కానీ ఏదైనా ప్రాంతాలకు విహారానికి వెళ్లడం లేదా కనీసం దేవాలయాలకు, సినిమాలకు కూడా వెళ్లకుండా శ్మశానంలోనే ఉంటున్నాడు. ప్రతీరోజూ శ్మశానానికి తీసుకువచ్చే శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం బాధ్యతగా భావిస్తున్నానని అంతేకాకుండా రోజుకు కనీసం పది శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండడంతో బయటకు వెళ్లడానికి తీరిక దొరకడం లేదని అంథోణి స్వామి చెబుతున్నారు. సంవత్సరానికి సుమారు 3,500 శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తానని అందులో అనాథ శవాల సంఖ్య కూడా ఎక్కువేనని చెప్పారు. మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఇలా బెంగళూరు నగరంలో ఏమూల అనాథ శవాలు లభించినా కల్పళ్లి శ్మశానవాటికలోనే అంత్యక్రియలకు తీసుకువస్తుంటారు. పేరుకు క్రైస్తవుడే అయినా శ్మశానానికి తీసుకువచ్చే హిందువుల శవాలకు హిందూ పద్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహిస్తూ అంథోణిస్వామి ప్రశంసలు అందుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్థివదేహానికి కూడా అంత్యక్రియలు నిర్వహించానని అప్పుడు తనకు 13 ఏళ్ల వయసు ఉంటుందని అంథోణిస్వామి తెలిపారు. దీంతోపాటు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తండ్రి, సినీనటుడు దేవరాజ్ తండ్రి ఇలా ఎంతో మంది ప్రముఖుల సంబంధీకుల పార్థివదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చారు. అనాథ శవాలకు కుటుంబ సభ్యుడిలా,బంధువులా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ అంథోణిస్వామి పలువురు నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు నీలం సంజీవరెడ్డి సమాధిని ప్రతీరోజూ శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లో సంజీవరెడ్డికి చిత్రపటానికి పత్రిరోజూ పూజ కూడా చేస్తారు. ఇటీవల కొంత అనారోగ్యం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న వేతనం సరిపోవడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇద్దరు
ధైర్యం అంటే అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్లి రావడం కాదు. ఉదయాన్నే ఇంటి నుండి బయల్దేరాక, లోకంలో నానా రకాలైన మనుషులతో తలపడి మనసు పాడు చేసుకోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి చేరడం. పిరికితనం అంటే ‘బాబోయ్ దెయ్యం’ అని భయపడి పరుగెత్తడం కాదు. కష్టం రాగానే, ‘దేవుడా కాపాడు’ అని వలవల ఏడ్చేయడం. నలుగురు మనుషులు ఆ చీకట్లో కూర్చొని ఉన్నారు. ఆ నలుగురూ నాలుగు రకాల వయసుల వాళ్లు. ఒక యువకుడు. ఒక వృద్ధుడు. ఒక మధ్యస్థుడు. నాలుగో వ్యక్తి వయసే.. సరిగ్గా తెలియడం లేదు. పుట్టినప్పట్నుంచీ అతడు ప్రతి వయసులోనూ పదేళ్లు తక్కువగానే కనిపించేవాడు. వాళ్లు నలుగురూ కూర్చొని ఉన్న చోటు.. ఒక ప్రమాద స్థలి. అదొక మలుపు. అక్కడెప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడికి సమీపంలోనే రైలు పట్టాలు ఉన్నాయి. అక్కడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అవి అనుకోని ప్రమాదాలు కావు. అనుకుని చేసుకునే ఆత్మహత్యలు! యువకుడు బాధపడుతున్నాడు. అందానికి కిరీటం ఉంటుంది. తెలివికి స్కాలర్షిప్ ఉంటుంది. ధైర్యానికి పతకం ఉంటుంది. అందవిహీనులకు, తెలివిలేనివాళ్లకు, భయస్థులకు ఈ లోకంలో చోటు లేదా? వారినెవరూ గుర్తించరా? అని ఆవేదన చెందుతున్నాడు. వృద్ధుడు యువకుడి వైపు ప్రేమగా చూశాడు. ‘‘చూడబ్బాయ్. లోకంలో ఏదైతే తక్కువగా ఉంటుందో దానికే విలువ ఉంటుంది తప్ప, తక్కువైనదేదీ ఈ లోకానికి విలువైనది కాదు’’ అన్నాడు. అర్థం కానట్లు చూశాడు యువకుడు. వృద్ధుడు నవ్వాడు.‘‘అందం తక్కువ. లోకం పట్టించుకోదు. చదువు తక్కువ. పట్టించుకోదు. ధైర్యం తక్కువ. పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే.. ఇలా తక్కువగా ఉండేవాళ్లే మనుషుల్లో ఎక్కువ. అందం, ప్రతిభ, ధైర్యం.. ఇవి ఉండేవాళ్లు మనుషుల్లో తక్కువగా ఉంటారు కనుక, ఆ తక్కువగా ఉండేవాళ్లను పట్టించుకుంటుంది. లోకం నైజమిది. ఇందులో బాధపడవలసిందీ, వెళ్లి బావిలో పడవలసిందీ ఏమీ లేదు’’ అన్నాడు యువకుడి తలపై జుత్తును చేత్తో నిమురుతూ. నాలుగో వ్యక్తి మౌనంగా వింటున్నాడు. అతడికీ ఈలోకం ఏ రూపంలోనూ గుర్తింపును ఇవ్వలేదు. అతడి జీవితం ఓ రోజు అకస్మాత్తుగా ‘మలుపు’ తిరిగే వరకు ‘వయసు తక్కువతనమే’ అతడి గుర్తింపు. ‘‘అయినా లోకం తీరింతే? నన్ను పిరికివాడు అంది. నిజానికి నేను పిరికివాడిని కాదు’’ అన్నాడు మధ్యవయస్కుడు.. మాటల మధ్యలోకి వచ్చి. ‘‘ఒంటి మీద కండలున్నాయ్. కళ్లు చురుగ్గా ఉన్నాయ్. మీకు పిరికితనం ఏంటి?’’ అన్నాడు యువకుడు.. మధ్యస్థుడితో. వృద్ధుడు పెద్దగా నవ్వాడు. ‘‘పిరికితనం బాడీలో ఉండదబ్బాయ్. మైండ్‌లో ఉంటుంది’’ అని ఆ యువకుడితో అని.. ‘‘ఎందుకు నిన్ను ఈ లోకం పిరికివాడు అంది చెప్పు? నీ బాధలు లోకానికి చెప్పుకున్నావా? లేక, లోకంలోని బాధలు నువ్వు చూడలేకపోయావా?’’ అని మధ్యస్థుడిని అడిగాడు. మధ్యస్థుడు విరక్తిగా నవ్వాడు. ‘‘అర్థం చేసుకోవలసిన వాళ్లే నన్ను పిరికివాడు అన్నారు’’ అన్నాడు. ‘‘ఎవరు ఆ అర్థం చేసుకోవలసినవాళ్లు’’.. అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘మా డాక్టర్’’ చెప్పాడు మధ్యస్థుడు. ‘‘నిజమే.. డాక్టర్లకు వెటకారం ఎక్కువైంది ఈ మధ్య. ‘తల తిరుగుతోంది డాక్టర్’ అంటే.. ‘భూమి తిరుగుతోంది కదా.. అందుకే తల తిరుగుతోంది’ అంటున్నారు..’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అసలు.. డాక్టర్ దగ్గరకి మీరెందుకు వెళ్లారు అంకుల్’’ అన్నాడు యువకుడు ఆ మధ్యస్థుడిని. ‘‘ఓ రోజు ఒంట్లో గాబరాగా ఉంటే వెళ్లాను. బీపీ ఉందన్నాడు. వరుసగా నాలుగు వారాలు బీపీ చూశాక మందులు రాసిచ్చాడు. నాకిదేం ఖర్మ అనుకున్నాను. లైఫ్ లాంగ్ వాడాలన్నాడు. రోజూ ఒకే టైమ్‌కి మాత్ర పడాలన్నాడు. మాత్రకు ముందు ఏదైనా తినాలని అన్నాడు’’ అని చెప్పాడు మధ్యస్థుడు.‘‘ఎందుకాయన మిమ్మల్ని పిరికివాడు అన్నాడు అంకుల్..’’ కుతూహలంగా అడిగాడు యవకుడు. ‘‘హాహ్హాహా.. పేషెంట్‌ని పిరికివాడు అంటే.. డాక్టర్ ధైర్యస్థుడు అయిపోతాడు. అందుకని అలా అని ఉంటాడు’’ అని పెద్దగా నవ్వాడు నాలుగో వ్యక్తి.వృద్ధుడు ఏం మాట్లాడ్డం లేదు. రయ్యిన మలుపు తిరుగుతున్న వాహనాలను చూస్తూ మౌనంగా వీళ్ల మాటలు వింటున్నాడు. అతడికనిపించింది..మలుపు దగ్గర కూడా ఈ మనుషులు రయ్యిన ఎందుకు తిరుగుతారోనని!యువకుడి వైపు చూసి చెప్పాడు మధ్యస్థుడు.. ‘‘మాత్ర వేసుకోవడం మర్చిపోయి, ఓ రోజు డాక్టర్ దగ్గరికి పరుగెత్తుకెళ్లాను. ‘ఏమైంది?’ అన్నాడు. ‘బీపీ మాత్ర వేసుకోవడం మర్చిపోయాను డాక్టర్’ అన్నాను. ‘అయితే ఏమైంది?’ అన్నాడు. ‘ఏదో తేడాగా ఉన్నట్లుంది’ అన్నాను. బీపీ చెక్ చేశాడు. ‘నార్మల్’ అన్నాడు. ‘ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏం కాదు’ అని చెప్పాడు’’.‘‘అప్పుడన్నాడా.. మిమ్మల్ని పిరికివాడని’’ అడిగాడు యువకుడు. ‘‘అప్పుడు కాదు. ఇంకోసారి వెళ్లాను. ‘బీపీ టాబ్లెట్ వేసుకున్నానో, వేసుకోలేదో గుర్తుకు రావడం లేదు. ఒకవేళ వేసుకుని ఉండి, మళ్లీ వేసుకుంటే బీపీ డౌన్ అవుతుందా? వేసుకుని ఉంటాన్లెమ్మని ఊరుకుంటే.. బీపీ రైజ్ అయ్యే అవకాశం ఉందా?’’ అని డాక్టర్ని అడగడానికి వెళ్లాను. ‘‘అప్పుడన్నాడా నిన్ను పిరికి అని’’ అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘అప్పుడు కాదు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘మరి!’’‘‘మళ్లీ ఓ రోజు పరుగున వెళ్లాను డాక్టర్ దగ్గరకి. ‘మళ్లీ ఏమైంది!’ అన్నాడు. ‘వేసుకోవలసిన టైమ్ కంటే ఓ గంట ముందు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను డాక్టర్. ఏమైనా అవుతుందా?’ అని అడిగాను.అప్పుడన్నాడు.. ‘నీ అంత పిరికి మనిషిని నేనింత వరకూ చూళ్లేదు’ అని. అప్పట్నుంచీ నన్నంతా పిరికివాడిలా చూడ్డం మొదలుపెట్టారు. ఈ పాడులోకంలో బతకడం వేస్ట్ అనిపించింది.. అందుకే ఓ రోజు..’’అని ఆగి, యువకుడి వైపు చూశాడు మధ్యస్థుడు. అతడలా చూడగానే వృద్ధుడు అకస్మాత్తుగా పైకి లేచాడు. యువకుడి భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి చీకట్లోకి నడిపించుకు వెళ్లాడు!‘‘ఈరోజు ఎలాగైనా ఆ కుర్రాణ్ణి మోటివేట్ చేసి పట్టాల మీదకు తీసుకెళ్దామనుకున్నా. ముసలాడు పడనివ్వలేదు’’ తిట్టుకున్నాడు మధ్యస్థుడు. ‘‘నేను కూడా.. మలుపులో ఎవరైనా దొరక్కపోతారా అని కూర్చున్నాను. ఆ ముసలి పీనుగ కళ్లన్నీ మలుపు మీద, నా మీదే ఉన్నాయి’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అడుగో మళ్లీ ఇటే వస్తున్నాడు చూడు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘అవునవును ఇక రాత్రంతా ఇక్కడే డ్యూటీ చేసేస్తాడు..’’ తిట్టుకున్నారు ఇద్దరూ. ‘‘ఏంటి? నా గురించేనా?’ అంటూ వాళ్లను సమీపించాడు వృద్ధుడు. అతడి పక్కన ఆ యువకుడు లేడు. భద్రంగా ఇంటికి పంపించేసినట్లున్నాడు. - మాధవ్ శింగరాజు -
కాటి ఊపిరి
ఊపిరి ఆగాక చివరగా చేరే చోటు అది. కాని ఆ చోటే ఆమెకు ఊపిరి పోస్తోంది. చీకటి, చితి భయపెట్టే స్థలం అది. కాని అక్కడే ఆమె తన బతుక్కి వెలుగు వెతుక్కుంటోంది. తల కొరివి పెట్టే హక్కు, కాటి కాపరిగా ఉండే అధికారంమగవాడికే సొంతం అని లోకరీతి.జన్మనిచ్చే సమయంలో స్త్రీ చేతులు ఉన్నప్పుడు సాగనంపే సమయంలో స్త్రీ చేతులు ఎందుకు ఉండరాదు అని ప్రశ్నిస్తోంది జయలక్ష్మి. గుండె దమ్ము అనే మాట మగవాళ్ల విషయంలోనే వింటూ ఉంటాం. స్త్రీకి గుండె ఉండదనీ అందులో దమ్ము ఉండదని లోక ప్రచారం. ధైర్యంగా చేయాల్సిన పనులు, భయం పుట్టించే క్రతువుల్లో స్త్రీని భాగస్వామ్యం చేయలేదు మన సంస్కృతి. ముఖ్యంగా చావులో, అంత్యక్రియల్లో పురుషులే విధులు నిర్వర్తించాలని స్థిరపరిచి ఉన్నారు. కాటికాపరిగా అనాదిగా మగవాళ్లే ఉంటూ వస్తున్నారు. స్మశానంలో ఉంటూ శవాలతో సహవాసం చేయడం మగవాడికే చేతనైన పని అని నిరూపిస్తూ వస్తున్నారు. కాని జయలక్ష్మి ఈ ఆనవాయితీకి సవాలుగా నిలిచింది. ఈ పని తానూ చేయగలనని నిరూపించింది. అనకాపల్లి గవరపాలెం శ్మశానంలో పదహారేళ్లుగా కాటికాపరిగా ఉన్న తట్టా జయలక్ష్మి (45) జీవిత గాథ ఆమె మాటల్లోనే.‘‘చనిపోయినవాళ్లు దేవుడి దగ్గరకు వెళతారని పెద్దలు అంటారు. దేవుడితో ముడిపడిన ఈ పని ఎంతో పుణ్యమైన పని అని నేననుకుంటాను. చనిపోయినవారు సక్రమంగా దేవుని దగ్గరకు చేరుకోవడానికి కాటికాపరులు సాయం చేస్తారు. జీవుడు ఈ కట్టె మీద మమకారం పూర్తిగా వదులుకునేందుకు శరీరాన్ని దహనం చేసే పని మాది. ఆ పని అందరూ చేయలేరు. రాసి పెట్టిన వారికే ఆ పుణ్యం దక్కుంది’’ అందామె. భయం నుంచి బయటపడి... ‘‘మాది ఈ ఊరే. మా అమ్మా నాన్న చేతనైన పని చేసి మమ్మల్ని సాకేవారు. మా ఇళ్లల్లో కాటికాపరి పని ఉంది. ఊరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని శారదా నది ఒడ్డు శ్మశానంలో మా పెద మావయ్య తట్టా కొండయ్య కాటికాపరిగా పని చేసేవాడు. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు కాటి కాపరిగా ఉన్న ఆయనకు చద్ది అన్నం పట్టుకెళ్లేదాన్ని. అంతి చిన్న వయసులో శ్మశానమంటే ఎవరికైనా భయమే. నాక్కూడా చాలా భయం వేసేది. ఒకరోజున మామయ్య నాకు చిన్న పని అప్పగించాడు. దూరంగా ఉన్న నూతి గట్టు దగ్గరి నుంచి బకెట్ తీసుకురమ్మన్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం. మంచి ఎండ ఉంది. శ్మశానంలో మా మావయ్య, నేను తప్ప ఎవరం లేము. మావయ్య చెప్పాడని గుండె చేతబట్టుకుని బిక్కుబిక్కుమంటూ నూతి దగ్గరకు వెళ్లాను. వెనుక నుంచి ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది.కాళ్లు ఒణికాయి. అంతే భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి జరిగినదంతా అమ్మతో చెప్పి కళ్లు తిరిగి పడిపోయాను. దాంతో మా ఇంట్లో నా చేత చద్ది పంపే పని మానుకున్నారు. కాని దేవుడి లీల చూడండి. ఎక్కడైతే నేను భయపడ్డాను అక్కడే బతికే ధైర్యం ఇచ్చాడు’’ అందామె. పెళ్లి తర్వాత బాధ్యత ‘‘నాకు పద్నాలుగేళ్లు వచ్చాక నూకేశ్వరరావుతో వివాహం జరిగింది. అప్పటికి గవరపాలెం స్మశానవాటికి కాటికాపరి పని మా బావగారు చేస్తూ ఉన్నారు. కాని ఆయన ఆ పని మానుకుని బేల్దారు మేస్త్రిగా పని వెతుక్కున్నాడు. తరాలుగా వస్తున్న పని కదా ఎందుకు వదులుకోవాలి అని నా భర్త ఆ పని తీసుకున్నాడు. అప్పటికి నాకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. జీవితం బాగానే ఉందనిపించేది. కాని సరిగ్గా 16 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా నా భర్త చనిపోయాడు. నన్ను నా పిల్లలను గతి లేని వాళ్లను చేసి వెళ్లిపోయాడు. మేము ఎలా బతకాలి. బతుకు వల్లకాడు చేసుకోవడం కన్నా వల్లకాడునే బతుగ్గా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నలుగురు పిల్లల్ని సాకుతూ శ్మశానంలో కళేబరాల సేవ చేయడం సాధ్యమేనా ఒక ఆడది ఈ పని చేయగలదా అని బంధువులు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్లు తర్జన భర్జనలైతే పడగలరుకాని అన్నం పెట్టలేరు కదా. అందుకే ధైర్యంగా కాటికాపరి పని తీసుకున్నాను’’ అందామె. శివయ్యకు మొక్కి ‘‘రోజూ ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శ్మశానంలోనే ఉంటాను. ఉదయం శ్మశానం తలుపులు తీయగానే శివునికి మొక్కుతాను. ఆ తరవాత పరిసరాలను శుభ్రం చేస్తాను. పిచ్చిమొక్కలను తొలగిస్తాను. ఎవరయినా చనిపోతే శవాన్ని కాల్చడానికి కర్రలు పేరుస్తాను. తల కొరివి పెట్టి అయినవాళ్లు తప్పుకున్నాక శవం చివరి వరకూ కాలేదాకా జాగ్రత్త తీసుకుంటాను. శవాన్ని కాల్చేటప్పుడు ఒక్కోసారి చమురు ఎగిరి ఒంటి మీద పడుతుంది. అయినా బెదరకుండా ధైర్యంగా పని పూర్తి చేస్తాను. ఒక్కోసారి కాలుతున్న శవం అమాంతం ఎగిరిపడుతుంది. ఏ మాత్రం జంకు లేకుండా కర్రతో అదుముతూ శవ దహనం పూర్తి చేస్తాను. అర్ధరాత్రి వేళ ఒంటరిగా అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వెళుతుంటే అందరూ ఒక రకమైన ఉద్వేగంతో చూస్తుంటారు. నేను పట్టించుకునేదాన్ని కాదు. తొలి రోజుల్లో మా అమ్మ చాలా భయపడిపోయేది. నేను ఇంటికి రావడం ఆలస్యమైతే వణికిపోయేది. కాని నా ధైర్యం చూసి మానుకుంది. నన్ను చూసి కొందరు ఆడవాళ్లు గర్వపడుతుంటారు. కొందరు బెరుకుపడతారు. అందరి పనిలాగా నాదీ ఒక పనే అని అర్థం చేసుకుంటే ఇదంతా ఏమీ ఉండదు’’ అందరూ చేరాల్సింది అక్కడికే ‘‘మనం ఎక్కడ పుట్టినా చివరికి చావు తప్పదు. తల్లి ఒడిలో పుట్టిన మనం శివయ్య తండ్రి ఒడిలోకి చేరాల్సిందే. ఈ పదహారేళ్లుగా రోజుకి కనీసం ఒక్క శవాన్నయినా చూస్తున్నాను. అర్ధాయుష్కుతో ఎవరైనా పోయినప్పుడు మాత్రం చాలా బాధ పడుతుంటాను. ఆ రోజంతా అన్నం తినలేకపోతాను. చిన్నప్పుడు కథలు వినేటప్పుడు అందరిలాగే నాకు కూడా శ్మశానం అంటే భయమేసింది. ఇప్పుడు శ్మశానమే ఆవాసంగా మారింది. ఈ పనిలో ఒక వేదాంతం అలవడుతుంది. అత్యాశ చచ్చిపోతుంది. అందరూ పోయేవాళ్లమే అయినప్పుడు మంచి చేసి పోవడమే మేలనిపిస్తుంది. ఇప్పుడు నా పెద్దకొడుకు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను. నెల జీతం నాకు సంతృప్తికరంగానే ఉంది. ఈ పనిలో నేను చేయదగ్గ సేవ చేస్తున్నాను. నా పిల్లలు ఇతర వృత్తుల్లోకి ఇంకా మంచి పనుల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని ముగించారామె. బతుకు వల్లకాడు చేసుకోవడం కన్నా వల్లకాడునే బతుగ్గా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నలుగురు పిల్లల్ని సాకుతూ శ్మశానంలో కళేబరాల సేవ చేయడం సాధ్యమేనా ఒక ఆడది ఈ పని చేయగలదా అని బంధువులు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్లు తర్జన భర్జనలైతే పడగలరుకాని అన్నం పెట్టలేరు కదా. అందుకే ధైర్యంగా కాటికాపరి పని తీసుకున్నాను. సంభాషణ: దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి -
హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా
పుట్టుకకు చావుకు ఉందా ధర్మం వ్యాధికీ బాధకూ ఉందా మతం నీటికీ నిప్పుకూ ఉందా భేదం మనుషులందరికీ అంతిమంగా ఉండాల్సింది సంస్కారం... ఆ యువతి ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది... కట్టుకున్న భర్తతోపాటు, మామ కూడా మంచానికే పరిమితమైనా.. మొక్కవోని దీక్షతో వారిద్దరికీ సపర్యలు చేస్తూ... ఉన్న ఒక్కగానొక్క ఇంటిని తాకట్టు పెట్టి, వారిద్దరి వైద్యానికి ఖర్చు చేసింది. ఈ కష్టానికి ముప్పులా ఆదివారం (అక్టోబర్ 21) ఆమె మామ మృతి చెందాడు. మృతదేహాన్ని తమ సొంతింటికి తీసుకురాగా, దానిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అడ్డుగా నిలిచాడు. శవాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఏకమై, వారి బాకీని వారంలోగా తీరుస్తామని హామీ ఇవ్వడంతో, మృతదేహాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ తర్వాత ఆ యువతే కొడుకులా నిలిచి, హిందూ ధర్మం ప్రకారం తానే బద్దె వేసుకుని, కాటివరకూ వచ్చి, శ్మశానంలో తన మామకు తలకొరివి పెట్టింది. టీవీ సీరియళ్లలో దుర్మార్గమైన కోడళ్లను చూపుతున్న ఈ కాలంలో ఈ కోడలు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏం జరిగింది? గూడూరు గమళ్లపాళానికి చెందిన పర్వతాల రమణయ్య, రమణమ్మల ఏకైక కుమారుడు శ్రీనివాసులు. తండ్రి రమణయ్య చెన్నై దుకాణదారులకు అవరసమైన వస్తు సామాగ్రిని తీసుకొచ్చి అందజేస్తూ సీజ వ్యాపారం చేస్తుండేవారు. శ్రీనివాసులు కూడా తండ్రికి చేదోడుగా, అప్పుడప్పుడూ చెన్నై వెళ్లి అవసరమైన వారికి సామాగ్రిని తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం తల్లి రమణమ్మ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. దాంతో తండ్రి బాగోగులు కొడుకు శ్రీనివాసులు ఒక్కడే చూసుకుంటూ ఉన్నాడు.రెండేళ్ల క్రితం శ్రీనివాసులుకు రెహానా అనే యువతితో పరిచయమై, అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కోడలిగా ఆ ఇంట అడుగు పెట్టిన రెహానా ఇంటిని చక్కదిద్దే పనిలో పడింది. అయితే ఏడాది క్రితం రమణయ్యకు కూడా క్యాన్సర్ వ్యాధి సోకింది. కొత్త కోడలు మామ సేవలను చూసుకుంటూ ఉండగా, శ్రీనివాసులు సీజ¯Œ వ్యాపారం చేస్తూ ఇల్లు లాక్కొచ్చేవాడు. విధికి అంతటితో సంతృప్తి కలగలేదు. మూడు నెలల క్రితం శ్రీనివాసులు కూడా అనారోగ్యానికి గురయ్యాడు.రోజురోజుకూ శుష్కించిపోతూ మంచం పట్టాడు. దీంతో రెహానాకు ఏం చేయాలో తెలీక కుంగిపోయింది. డబ్బు అవసరమయ్యింది. అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి తాముంటున్న ఇంటిని తాకట్టుపెట్టి 3 లక్షలు తీసుకుని, భర్తతోపాటు, మామకూ వైద్యం చేయిస్తూ బతుకుబండిని లాక్కురాసాగింది. ఇంతలో మరో అశనిపాతం. ‘‘ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేయాల్సిందే’’నని ఇంటిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కరాఖండీగా చెప్పాడు. చేసేదిలేక రెహానా, తన మామ రమణయ్యతోపాటు, శ్రీనివాసులును తీసుకుని నెల్లూరుకు వెళ్లి, అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని, ఉన్న కాస్త డబ్బుతో మామ, భర్తలకు వైద్యం చేయిస్తూ బతుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం రమణయ్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో, తిరుపతికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రమణయ్య ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో రెహానా బతుకులో చీకట్లు మరింత చిక్కనయ్యాయి. ఒకవైపు మంచంలో ఉన్న భర్త, మరోవైపు మృతి చెందిన మామ... చేసేది లేక నెల్లూరులోని అద్దె ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్తే రానివ్వరని, అంబులెలో గూడూరుకు తీసుకొచ్చింది. తాము తాకట్టుపెట్టిన ఇంటిని అద్దెకు ఇచ్చి ఉన్నారని తెలియడంతో, రమణయ్య పార్ధివ దేహాన్ని ఎక్కడ ఉంచి అంత్యక్రియలు చేయాలా... అని ఆందోళనకు గురైంది. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్నవారికి సంగతి తెలిసింది. వారంతా రమణయ్య మృతదేహాన్ని సొంతింటికే తీసుకురావాలని సలహా ఇచ్చారు. దాంతో మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఈలోగా ఇల్లు తాకట్టుపెట్టుకున్న వ్యక్తికి సమాచారం అందడంతో అక్కడకు వచ్చాడు.మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించనంటూ తలుపునకు అడ్డుగా నిలుచున్నాడు. అది న్యాయం కాదంటూ కొందరు చెప్పిచూశారు. కొంత వాగ్వివాదం జరిగాక కూడా ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన ససేమిరా అన్నాడు. ఆ ఇంటి పక్కనే రమణయ్య సోదరులూ ఉన్నారు. ‘‘మీరైనా ఇంట్లోకి రానివ్వ’’మంటూ రెహానా ఎంతో ప్రాధేయపడింది. అయినా వారికి కనికరం కలగలేదు.మా ఇంట్లోకి రానివ్వమని తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా కలసి, ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వారిపై ఎలాంటి కనికరం చూపించకుండా, తానేమీ చేయలేనని పోలీసు కేసు పెట్టుకోండంటూ పంపేశారు. దీంతో చేసేది లేక, అర్ధరాత్రి వరకూ ఆ ఇంటి బయటే మృతదేహాన్ని ఉంచారు. దాంతో ఆ ఇంట్లో అద్దెకున్నవారు వెళ్లిపోయారు. ఇంత జరిగినా తాకట్టుపెట్టుకున్న వ్యక్తి మాత్రం తాను వెళ్లిపోకుండా గడియపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఇరుగుపొరుగు వాళ్ల మనసు కరిగింది. వారు అతడిని పిలిచి... ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తామని, ఇలా శవాన్ని బయట ఉంచడం బాగుండదని, ఈలోపు తమదీ పూచీ అని హామీ ఇవ్వడంతో శవాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా ముస్లిం యువతి అయిన రెహానా తన మామకు సోమవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. ఆమే కుమారుడిలా బద్దె వేసుకుని, ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకూ వెళ్లింది. అక్కడ హిందూ ధర్మం ప్రకారం తానే తలకొరివి పెట్టి, అంత్యక్రియలు జరిపించింది. మధ్యలో దింపుడు కళ్లం వద్ద కూడా మామ పేరును తానే మూడుసార్లు పిలవడం, అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇదిరా ప్రేమంటే. కలసిన మనసులకు ఉదాహరణ ఆ దంపతులేరా’’ అంటూ రెహానాను చూసి కంటతడి పెట్టారు. ఆ సంఘటనకు చలించిపోయిన ఆ ప్రాంతంలోని వారంతా కూడా సాయం అందించి రెహానాకు బాసటగా నిలిచారు. యావత్ స్త్రీ జాతికే రెహానా ఆదర్శమంటూ కొనియాడారు. దాతలు ముందుకొచ్చి ఆ త్యాగమూర్తికి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, సాక్షి, గూడూరు -
ఈ శ్మశానానికి ఏమైంది
ఆ శ్మశానంలో... సినిమాల్లో చూపించినట్లుగానే ఒక పెద్ద ఊడలమర్రి ఉంది. దీనికి పాతిక అడుగుల దూరంలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్టకు చాలా దగ్గర్లో ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో నుంచి లేచిన అస్థిపంజరం, సమాధిపై కూర్చొని ఏదో పెద్దగా అరుస్తున్నాడు.ఆ అరుపులు విని చుట్టుపక్కల సమాధుల వాళ్లు దగ్గరికి వచ్చారు.‘‘ఏమోయి నూకరాజూ...ఎప్పుడూ సైలెన్స్ మోడ్‌లో ఉండేవాడివి.ఇవ్వాలేమిటీ రకరకాల రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి’’ అని అడిగాడు పక్క సమాధాయన. (సమాధి+ ఆయన)‘‘అయాం వెరీ బోర్డ్ యార్. ఈ శ్మశానంలో చాలా బోర్ కొడుతుంది’’ అసంతృప్తిగా అరిచాడు నూకరాజు.‘‘నెలరోజుల క్రితం వచ్చిన నువ్వే ఇలా అంటే....ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన నేనెంత బోర్‌గా ఫీల్ కావాలి? థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.... సర్దుకుపో నూకరాజు’’ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు వెనక సమాధాయన.‘‘నూకరాజు మన మనసులో మాటను తన మాటగా చెప్పాడు. నిజానికి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరం బోర్‌గా ఫీలవుతున్నాం. ఏదైనా చేయాలి! కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి’’ అని పట్టుదలగా అన్నాడు నూకరాజు ముుందు సమాధాయన.‘‘బయట సభ్య సమాజంలో ఉన్నట్లే... మనకూ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉండాలి. బార్లు ఉండాలి. బ్యూటీ పార్లర్లు ఉండాలి. పేకాట క్లబ్‌లు ఉండాలి. టీవీ సీరియల్స్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అసలు మనకంటూ ఒక ప్రెసిడెంట్ ఉండాలి’’ అన్నాడు నూకరాజు.‘ప్రెసిడెంట్’ అనే మాట వినబడగానే శ్మశానంలో ఉత్సాహం పొంగి పొర్లింది. ‘‘ఇంత పెద్ద శ్మశానానికి నేను ప్రెసిడెంట్ అయితే...ఆ మజానే వేరు...ఆ రెస్పెక్టే వేరు’’ అని ఎవరికి వారు రహస్యంగా మనసులో అనుకున్నారు.ఆ మరుసటి రోజే... ఎన్నికల ప్రకటన వెలువడింది.‘ప్రపంచ శ్మశాన చరిత్రలోనే ఇదో అరుదైన అవకాశం.ఈ శ్మశానానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వండి.శ్మశానాన్ని స్వర్గంగా మార్చండి.ఈ సవాలు స్వీకరించడానికి మీలో ఎవరు రెడీ?’....పెద్ద పెద్ద అక్షరాలతో ఊడల మర్రి కాడలకు కట్టిన ఈ బ్యానర్ అందరినీ ఆకట్టుకుంది.శ్మశానంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1872.ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నవారి సంఖ్య 1872.???!!!!అందరూ పోటీలో నిలబడితే మరి ఓటేసే వాళ్లు ఎవరు?ఎవరి ఓటు వాళ్లు వేసుకుంటే...గెలిచేవారుండరు...ఓడే వారుండరు! ఇలా అయితే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది కాబట్టి శ్మశాన పెద్దలు ఒకఐడియా ఆలోచించారు.ఎలక్షన్లో అయిదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాటరీ పద్ధతిలో ఈ అయిదుగురిని ఎంపిక చేశారు.రెండో రోజు పొద్దున ఎనిమిదింటికే పోలింగ్ మొదలైంది.పోలింగ్ మొదలైన పదినిమిషాలకు గొడవ మొదలైంది.అస్థిపంజరాల గుంపు ఒకటి... ఒక సింగిల్ అస్థిపంజరాన్ని పట్టుకొని చావబాదుతుంది.‘‘ఎందుకు వాడ్ని అలా చావ బాదుతున్నారు? ఏమైంది?’’‘‘అసలు వీడు మన శ్మశానపోడే కాదు. దొంగ ఓటు వేస్తున్నాడు’’‘‘ఇక్కడ నీకేం పనిరా?’’‘‘మా ఫ్రెండ్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు కదా అని దొంగ ఓటు వేయడానికి వచ్చాను. బుద్ధిగడ్డి తిని ఇలా చేశాను. నన్నుక్షమించండి’’‘‘క్షమించాలట...క్షమించాలి...వీడి పుర్రె పగలగొట్టండ్రా’’‘‘ఇప్పటి వరకు వీడిని కొట్టింది చాలు...వదిలేయండి. ఇకముందు ఎప్పుడైనా ఇక్కడ కనిపిస్తే నీ ఎముకలు సున్నం చేసి రథం ముగ్గు వేస్తాం’’ఒక గంట తరువాత... ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన అయిదుగురిలో ముగ్గురు ధర్నాకు దిగారు. ‘నశించాలి...నశించాలి’‘డౌన్ డౌన్ డౌన్’.... ఇలా రకరకాల నినాదాల మధ్య ఆ ముగ్గురిలో ఒకరు ఆవేశంగా మైక్ అందుకొని...‘‘ఇంత దుర్మార్గంగా, అక్రమంగా నియంతల దేశాల్లో కూడా ఎలక్షన్లు జరగవు. ఈ ఎలక్షన్లో ఇవియం మెషిన్ల ట్యాంపరింగ్ జరిగింది. ఈ ఎలక్షన్‌ను రద్దు చేసి రీపోలింగ్ జరిపించాలి’’ అని డిమాండ్ చేశాడు.ఈవీయం ట్యాంపరింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఒక సబ్ కమిటీ ఏర్పటైంది. ఆ కమిటీ తన రిపోర్ట్‌ను సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేసింది.‘ఈవీయం ట్యాంపరింగ్’ జరిగింది నిజమేనని ఆ రిపోర్ట్ చెప్పడంతో ఎలక్షన్ రద్దయింది.మరుసటి రోజు రీపోలింగ్ మొదలు కావడానికి ముందే...క్రికెట్ బ్యాట్లు, హాకీ బ్యాట్లు, సైకిల్ చైన్లు, సోడాలు, కూల్ డ్రింక్ బాటిళ్లతో... అస్థిపంజరాల బ్యాచ్ ఒకటి శ్మశానంలోకి వచ్చింది.‘‘నిన్న ఎవడ్రా మావాడిని కొట్టింది?’’ అడిగాడు ఆ బ్యాచ్‌లోని ఒక అస్థిపంజరం.‘‘ఆ మూలన నిల్చున్నాడే....వాడే అన్నా నన్ను చావబాదమని ఆర్డర్ వేసింది’’ ఏడుస్తూ అన్నాడు నిన్న తన్నులు తిన్న అస్థిపంజరం.అంతే...‘ఎటాక్’ అంటూ...ఆయుధాలతో వచ్చిన అస్థిపంజరాల గుంపు ఒక మూలన ఉన్న అస్థిపంజరంపై పడింది.‘‘రేయ్ మనోడ్ని కొడుతున్నారు.. మనలో మనకు ఏవైనా తగాదాలు ఉంటే రేపు చూసుకుందాం. ఆ పీనుగల అడ్డ çశ్మశానపోళ్లను తరిమికొట్టండ్రా’’ అని ఒక అస్థిపంజరం అరిచాడు.బొందల గడ్డ, పీనుగుల అడ్డ శ్మశాన వర్గాల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఆరోజు మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు శ్మశానాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. ఆ శ్మశానంలో వాలిన రాబందు ఈ çశ్మశానంలో వాలడం లేదు.ఒకరోజు నూకరాజు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.‘‘ఏమైంది?’’ అని అడిగాడు పక్క సమాధాయన.‘‘బుద్ది తక్కువై ఆరోజు ఏదో వాగాను. సభ్యసమాజంలో ఉన్నట్లే మన శ్మశానంలోనూ ఉండాలన్నాను. ఆనాటి నిశ్శబ్దమే చాలా గొప్పగా ఉంది’’ అని నూకరాజు అన్నాడో లేదో...‘‘రేయ్ ఆ పీనుగల అడ్డోళ్లు మళ్లీ వస్తున్నారు. లేవండ్రా’’ అన్న అరుపు పెద్దగా వినిపించింది! – యాకుబ్ పాషా -
శివుడు శ్మశానవాసి అని ఎందుకంటారు?
‘అరిష్టం శినోతి తనూకరోతి’ అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి... ఇలా దేనికీ చలించవు. ఎవరు ప్రతి కర్మను (పనిని) కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖ దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్థం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనులు సక్రమంగా, అనుకున్న కాలానికన్నా ముందే, మరింత గొప్పగా పూర్తి చేయగలుగుతాం. అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైనా, ఎంత తప్పించుకుందామన్నా ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్థం. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు. అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని, శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు... -
కాటికాపరి...యశోద...
బొమ్మనహళ్లి : స్మశానంలో అంత్య సంస్కారాలను కాటికాపరి నిర్వహిస్తారనేది జగద్వితమే. అయితే తుమకూరులోని గార్డెన్ రోడ్డులో ఉన్న స్మశానంలో ఓ మహిళ ఈ విధులను నిర్వర్తిస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆర్య వైశ్య బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ రుద్ర భూమిలో యశోద రాత్రి 11 గంటల వరకు ఈ విధుల్లో ఉంటారు. నెలకు సుమారు 20 శవాలకు సంస్కారాలను నిర్వహిస్తున్న ఈ ధీశాలి గురించి.... యశోద భర్త గూళయ్య తొలుత ఇక్కడ కాటికాపరిగా ఉండేవారు. అనారోగ్యం కారణంగా ఆయన మృత్యువాత పడడంతో భర్త విధులను తాను స్వీకరించింది. భర్త చనిపోయే నాటికి ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. బతుకు బండిని లాగడానికి తానే కాటికాపరిగా పని చేస్తానంటే సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ మహిళ ఈ పని చేస్తుందా...అసలు మన ఆచారం ప్రకారం మహిళలు స్మశానంలో అడుగే పెట్టకూడదు. అలాంటిది కాటికాపరిగా పని చేస్తుందా...అనే ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. అందరూ ఆచారాల గురించి మాట్లాడే వారే కానీ...ఆమె ఇద్దరు పిల్లల పోషణ గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. ఆ పిల్లల కోసమే తాను రెండేళ్ల కిందట కాటికాపరి విధులను చేపట్టాల్సి వచ్చిందని యశోద వివరించారు. అన్నీ తానై...... అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ యశోద పూర్తి చేస్తారు. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు....అంతిమ సంస్కారానికి అవసరమైన సామాగ్రినంతటినీ సిద్ధం చేసుకుంటారు. బంధువులు శవానికి తలకొరివి పెట్టి వెళ్లిపోతారు. అయితే చితి మంటలు చల్లారే దాకా శవం పూర్తిగా కాలేదాకా...యశోద దగ్గరుండి చూసుకుంటారు. మగాడి లాగా యశోద భయంగొలిపే ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నా నెలకు ఆమెకు దక్కేది కేవలం రూ.2 వేలే. అంత్య సంస్కారాలకు హాజరయ్యే మృతుని తాలూకా వారు ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు లేదా వెళ్లిపోవచ్చు..గ్యారంటీ లేదు అని యశోద చెబుతారు. అయితే తన ఇద్దరి పిల్లల చదువు సంధ్యలకు తనకీ పని తప్పదని అంటారు. భర్త నుంచి సంక్రమించిన ఈ ఉద్యోగం తనకు పూర్తి సంతృప్తినిస్తోందని తెలిపారు. అంత్య సంస్కారాల్లో తానూ పాలు పంచుకున్నాననే తృప్తీ మిగులుతోందన్నారు. త్వరలోనే ఇక్కడ విద్యుత్ స్మశాన వాటికను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ తర్వాత ఈ ఉద్యోగం ఉంటుందో...ఊడుతుందో తెలియడం లేదని యశోద ఆందోళన వ్యక్తం చేశారు. దానిని ఏర్పాటు చేసినా తనకిక్కడ ఓ చిరుద్యోగమైనా ఇవ్వాలని ఆమె నగర పాలికె అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
అకాల దెయ్యం
అక్కంటే అతడికి ప్రాణం. పల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్లు, కాయలు దొరుకుతాయో అవన్నీ బుట్టల్లో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు. ఆ మధ్యాహ్నం క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. మంచి ఎండ కాస్తున్న సమయంలో ముసురు పట్టేసింది. సాయంత్రానికి సన్నటి జల్లులు. రాత్రికి వర్షం.‘‘అకాల వర్షం’’ అన్నాడు రామ్మూర్తి..గొణుక్కున్నట్లుగా. ‘‘అంటే ఏంటి మామయ్యా?’’ అన్నాడు పండు. ‘‘ఎండాకాలం ఎండ కాస్తుంది. వర్షాకాలం వర్షం పడుతుంది. చలికాలం చలేస్తుంది. ఇది ఎండాకాలం కదా. అయినాగానీ వర్షం పడిందంటే.. అకాల వర్షం అన్నమాట’’.. చెప్పాడు రామ్మూర్తి. ‘‘అకాల వర్షం లాగా అకాల చలి, అకాల ఎండ కూడా ఉంటాయా మామయ్యా?’’.. మళ్లీ ఇంకో ప్రశ్న వేశాడు పండు. రామ్మూర్తి నవ్వాడు. ‘‘కాలం కాని సమయంలో ఏది వచ్చినా అది అకాలమే’’ అన్నాడు. ఆ మాట పిల్లలిద్దరికీ అర్థం అయీ కానట్లుగా ఉంది. దాన్ని వదిలేసి మామయ్యను కథ చెప్పమని అడిగారు. పండు, వాడి తమ్ముడు ఆ మామయ్య ఎప్పుడు ఊర్నుంచి వచ్చినా, మళ్లీ ఆయన ఊరు వెళ్లేవరకు ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. ఎప్పుడో గాని అక్కను చూడ్డానికి రాడు రామ్మూర్తి. ‘వచ్చిపోరా’ అని అక్క అడగాల్సిందే గానీ తనకై తను రాడు. పల్లెలో ఉంటాడు. పల్లె పనుల్లో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం. పల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్లు, కాయలు దొరుకుతాయో అవన్నీ బుట్టల్లో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు. ‘‘కథ చెప్పు మామయ్యా’’ మళ్లీ అడిగారు పిల్లలు. ‘‘ఏం కథ చెప్పన్రా?’’ అన్నాడు రామ్మూర్తి. ‘‘మామయ్యా.. మామయ్యా.. ఇప్పుడు అకాల వర్షం పడుతోంది కదా. అందుకని అకాల దెయ్యం కథ చెప్పు మామయ్యా..’’ అన్నాడు పండు తమ్ముడు.. మామయ్య చేతిని పట్టుకుని కుదిపేస్తూ. రామ్మూర్తికి నవ్వొచ్చింది. వాడు కనుక అకాల దెయ్యం అని అనకపోయి ఉంటే, జీవితంలో తనకు ఏనాటికీ అకాల దెయ్యం అనే మాటే స్ఫురించేది కాదు. ఊహకు అందని విధంగా భలే మాట్లాడతారు పిల్లలు అనుకున్నాడు రామ్మూర్తి. ‘‘ఓరేయ్.. అకాల దెయ్యాలు ఉండవురా. సమ్మర్లో, రెయినీ సీజన్లో, వింటర్లో.. అన్ని కాలాల్లో దెయ్యాలు ఉంటాయి’’ అని తమ్ముడి అజ్ఞానానికి పెద్దగా నవ్వి, మామయ్య వైపు చూసి.. ‘‘కదా మామయ్యా..’’ అన్నాడు పండు. రామ్మూర్తి మాట్లాడలేదు. గది బయటికి దీక్షగా చూస్తున్నాడు. ఆ చీకట్లో నీడలేవో కదులుతున్నాయి! వీళ్లున్న గదిలో కూడా ఏమంత వెలుతురు లేదు. ఎప్పుడు వేశారో గానీ పిల్లలు మెయిన్ ౖలైట్ ఆఫ్ చేసి, బెడ్ లైట్ వేశారు. ఆ మాత్రం ఎఫెక్ట్ ఉంటే గానీ దెయ్యం కథను వాళ్లు ఎంజాయ్ చెయ్యలేరు!‘‘చెప్పు మామయ్యా.. ’’ మళ్లీ మామయ్యను పట్టుకుని ఊపేశారు పండు, వాడి తమ్ముడు. రామ్మూర్తి అప్పటికప్పుడు దెయ్యం కథల్ని సృష్టించగలడు. కానీ ఆ రోజు ఎందుకనో సృష్టించలేకపోయాడు. గదిలో ఓ మూల ఊర్నుంచి తను తెచ్చిన మామిడి పండ్ల బుట్ట కనిపించింది. అక్కే వాటిని మగ్గబెట్టడానికి అక్కడ ఉంచింది. వాటిని చూడగానే ఎక్కడో తను విన్న దెయ్యం కథ గుర్తుకొచ్చింది రామ్మూర్తికి. చెప్పడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు తోటలోకి వెళ్లి దొంగతనంగా మామిడి కాయలు కోస్తారు. వాటిని సంచిలో వేసుకుంటారు. మరి వాటిని రహస్యంగా పంచుకోవాలి కదా. ఎక్కడా చోటు దొరకదు. దగ్గర్లో ఒక పెద్ద గేటు కనిపిస్తుంది. దాన్నెక్కి అవతలి వైపుకు దూకేస్తారు. అది శ్మశానం! దూకేటప్పుడు సంచిలోంచి రెండు మామిడి కాయలు సంచీలోంచి ఇవతలే పడిపోతాయి. వాటిని అలాగే వదిలేస్తారు. శ్మశానంలో ఎవరికీ కనిపించని చోట కూర్చొని.. ‘నీకొకటి, నాకొకటీ.. నీకొకటి, నాకొకటి..’ అని పంచుకుంటూ ఉంటారు. అప్పుడే ఓ తాగుబోతు శ్మశానం గేటు పక్కగా వెళుతూ వీళ్ల మాటలు విని ఆగిపోతాడు. మనుషులు కనపడరు. మాటలు వినబడుతుంటాయి! భయం వేసి వెంటనే చర్చి ఫాదర్ దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘‘ఫాదర్.. శ్మశానంలో దెయ్యాలు శవాల్ని పంచుకుంటున్నాయి’’ అని చెప్తాడు. ‘‘నువ్వు చూశావా?’’ అని అడుగుతాడు ఫాదర్. ‘‘ఈ చెవులతో విన్నాను ఫాదర్.. ‘నీకొకటి, నాకొకటి’ అని పంచుకుంటున్నాయి’’ అని చెబుతాడు తాగుబోతు. ఫాదర్ వెంటనే.. ‘సరే.. చూద్దాం పద’ అని బయల్దేరుతాడు. ఇంతవరకు చెప్పి కథను ఆపేశాడు రామ్మూర్తి. పిల్లలు నిద్రపోతే రేపటికి ఒక కథ మిగిలి ఉంటుందని అతడి ఆలోచన. ‘‘చెప్పు మామయ్యా.. తర్వాత ఏమైంది?’’ అన్నారు పిల్లలిద్దరూ. కథను కంటిన్యూ చేయక తప్పలేదు రామ్మూర్తికి. ఫాదర్, తాగుబోతు వెళ్లి శ్మశానం గేటు బయట నిలుచుంటారు. లోపల్నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ‘నీకొకటి నాకొకటి’ అని!ఆ తర్వాత సడెన్‌గా కొన్ని క్షణాలు మాటలు ఆగిపోతాయి. ఆ వెంటనే.. ‘‘మరి గేటు దగ్గర ఉన్న ఆ రెండిటి సంగతేంటి?’’ అనే మాట వినిపిస్తుంది. అంతే.. ఫాదర్, తాగుబోతు ఇద్దరూ ఒక్కసారిగా భయంతో ‘మేమింకా చావలేదు నాయనోయ్’ అనుకుంటూ.. అక్కణ్నుంచి పరుగుతీస్తారు.. అని కథను ముగించాడు రామ్మూర్తి. ‘‘ఇది దెయ్యం కథ కాదు మామయ్యా. జోకు. నా వాట్సాప్‌లో కూడా ఉంది చూడు’’ అంటూ చూపించబోయాడు పండు. ‘‘దెయ్యం కథలన్నీ జోకులేరా’’ అన్నాడు రామ్మూర్తి.‘‘అయితే నిజంగా దెయ్యాలు లేవా మామయ్యా..’’ అడిగాడు పండు, నిరుత్సాహంగా. వాడిని మరీ అంతగా నిరుత్సాహ పడనివ్వదలచుకోలేదు రామ్మూర్తి. ‘‘ఉన్నాయనుకుంటే ఉన్నట్లు. లేవనుకుంటే లేనట్లు. ఇందాకట్నుంచీ ఆ చీకట్లో నాకేదో కనిపిస్తోంది. మీకేమైనా కనిపిస్తోందా?’’ అన్నాడు రామ్మూర్తి.పిల్లలిద్దరూ గబుక్కున మామయ్య డొక్కల్లో ముఖం దాచుకున్నారు. రామ్మూర్తి నవ్వుకున్నాడు. ఏ కాలంలోనైనా మనిషిలోని భయమే అకాల దెయ్యం అని పిల్లలకు చెప్పాలనుకున్నాడు. - మాధవ్ శింగరాజు -
పకీర్ బాషా
అదొక్క సమాధే అక్కడెందుకు ఉందో తెలీదు. అయితే అక్కడ రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందనీ, ఎవరూ ప్లాట్లు కొనేందుకు రారనీ ప్రచారం జరుగుతోంది. ‘‘అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నం కొట్టిన సమాధిపై నిమ్మకాయ ఉంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయను తీసుకొస్తాను. నాక్కొంత డబ్బు ఇప్పిస్తావా?’’ అన్నాడు మిల్టన్.. అవధానితో.. ఎండకు వగరుస్తూ వచ్చి. ఆ మాటకు అవధాని, మిల్టన్ వైపు చూడకుండా తన పక్కనే ఉన్న పకీర్‌బాషా వైపు చూశాడు. పకీర్‌బాషా ఒక్క క్షణం మిల్టన్ వైపు చూసి, వెంటనే అవధానిని చూశాడు. ఆ చూడ్డంలో.. ‘వీడెవడు.. వింత మనిషి’ అనే అర్థం ఉంది. అది పకీర్‌బాషా ఇల్లు. మిల్టన్ మొదట అవధాని ఇంటికి వెళ్లి.. అవధాని ఇంట్లో లేడు, పకీర్‌బాషా ఇంటికెళ్లాడని తెలుసుకుని, పకీర్‌బాషా ఎవరో, అతడి ఇల్లెక్కడుందో కూడా తెలుసుకుని నేరుగా అక్కడికే వెళ్లాడు. అంతగా అతడికి అవధాని అవసరం ఏదో పడినట్లుంది. అవధాని, మిల్టన్ స్నేహితులు. తనకు తెలియకుండా అవధానికి పకీర్‌బాషా అనే మనిషితో పరిచయం ఉందంటే.. ఆ పరిచయమేదో ఈ మధ్యే అయి ఉంటుందని మిల్టన్ ఊహించాడు. పకీర్‌బాషా ఇంకా అలాగే మధ్యమధ్యలో మిల్టన్‌ని చూస్తూ, అవధాని వైపు చూస్తున్నాడు.. ‘వీడెవడు.. వింత మనిషి’ అన్నట్లుగానే. ‘ఇతనెవరో దెయ్యాల్ని పట్టే మనిషిలా ఉన్నాడే..’ అనుకున్నాడు మిల్టన్.. పకీర్బాషాను చూసి. వాళ్లిద్దరికీ ఒకరికొకరు నచ్చలేదని అవధానికి అర్థమైంది. ‘‘వీడు నా చిన్ననాటి ఫ్రెండు. మిల్టన్’’ అన్నాడు అవధాని పకీర్బాషాతో. ‘‘రేయ్.. మిల్టన్, ఇతను పకీర్‌బాషా. ఇద్దరం కలిసి ఓ వెంచర్ చేస్తున్నాం. ఫైనల్ అయ్యాక నీకు చెబుదామనుకున్నాను’’ అన్నాడు అవధాని. చెప్పకపోయినా హర్ట్ అయ్యే మనిషి కాదు మిల్టన్. అతడి లోకంలో ఈ వెంచర్లు, అడ్వెంచర్లు ఉండవు. చిన్న ప్రాణి. అయినా మిల్టన్‌కు ఏదీ చెప్పకుండా ఉండడు అవధాని. కాస్త ముందో, వెనకో చెబుతుంటాడు. ఆ ఇద్దరి చిన్ననాటి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ‘‘ఎందుకురా అంత డబ్బు?’’ అన్నాడు అవధాని మిల్టన్‌తో. మిల్టన్ ఎప్పుడూ ఎంత అవసరమో చెప్పడు. అవసరం ఎంతటిదో చెబ్దాడు. ఇప్పుడూ అలాగే చెప్పాడు. అర్ధరాత్రి, శ్మశానం, తెల్లసున్నం, సమాధి, నిమ్మకాయ.. అన్నాడంటే.. అతడేదో చచ్చేంత అవసరంలో ఉన్నాడని. మిల్టన్ మితంగా బతికే మనిషి. చెయ్యి చాచాడూ అంటే.. బతుకు ఆ మాత్రం మితంగా కూడా అతణ్ణి ఉండనివ్వడం లేదనే అనుకోవాలి. మిల్టన్ బతుకులో మిల్టన్, అతడి భార్యా పిల్లలు మాత్రమే లేరు. మరికొందరికి కోసం కూడా అతడు రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన బాంధవ్యాలు ఉన్నాయి. ఆ బాంధవ్యాల గురించి బయటెక్కడా చెప్పుకోడు. పుట్టుకతో చెయ్యీ కాలూ ఉన్నట్లే తన బాధ్యతల్ని కూడా దేహావయవాలే అనుకుంటాడు. కాలు, చెయ్యి ఉన్నవాళ్లు తమకు కాలుందనీ, చెయ్యుందనీ చెప్పుకుంటారా?! అలాగే తనకు బాధ్యతలు ఉన్నాయని మిల్టన్ చెప్పుకోడు. అలాంటి మిల్టన్‌కి అకస్మాత్తుగా కొంత డబ్బు కావలసి వచ్చింది. ఎంత డబ్బో అతడు చెప్పలేదు. కొంత అన్నాడు. ఆ కొంత ఒక కోటి అయినా, చిన్న నోటే అయినా.. అతడు మళ్లీ తీర్చలేడు. తీర్చడానికి అసలు అతను అప్పుగా ఇవ్వమని అడగడు. పని చేసిపెడతానంటాడు. పని చేశాకే చెయ్యి చాపుతాడు. ‘‘సరే చూద్దాంలేరా..’’ అని మిల్టన్‌కి చెప్పి పంపాక, మిల్టన్ గురించి పకీర్బాషాకు ఈ విషయాలన్నీ చెప్పాడు అవధాని. ‘‘ఎంత అడుగుతున్నాడని ఇప్పుడు మనం అనుకోవాలి?’’ అన్నాడు పకీర్‌బాషా ఆశ్చర్యంగా.‘‘ఎంతైనా అవొచ్చు’’.‘‘తెలిస్తేనే కదా ఇవ్వగలం’’‘‘వాడికీ తెలీదు. పని తీసుకుంటాడు. చేశాక ఇచ్చింది తీసుకుంటాడు’’ ‘‘ముందైతే డబ్బు తీసుకో. పనేదైనా ఉన్నప్పుడు వచ్చి చేసుకో అంటే?’’‘‘పండించకుండా తిండి తినే హక్కు తనకు లేదంటాడు’’‘వింత మనిషే’ అనుకున్నాడు పకీర్‌బాషా. ‘‘సరే.. చెప్పు. నా దగ్గర పనుందని నీ ఫ్రెండుకి చెప్పు’’ అన్నాడు. ‘‘ఏ పని?’’ అన్నాడు అవధాని.‘‘అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నం కొట్టిన సమాధిపై నిమ్మకాయ ఉంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయను తీసుకురావాలి’’ అన్నాడు పకీర్‌బాషా. పెద్దగా నవ్వాడు మిల్టన్. ‘‘పకీర్బాషాగారు.. మా అవధాని మీకు చెప్పే ఉంటాడు. డబ్బు నాకు ఎంత అవసరమో చెప్పడానికి ‘శ్మశానంలోకైనా వెళ్లొస్తానని’ నేను అంటుంటానే కానీ, నిజానికి నాకదేం పెద్ద పని కాదు. అది మీకు పనికొచ్చే పనైతే నాకూ సంతోషంగా ఉంటుంది. నా సంతోషం కోసం మీరొక పని సృష్టించడం నాకేమాత్రం ఆనందాన్నివ్వదు’’ అన్నాడు మిల్టన్. ఆ మాట నిజం. మిల్టన్ ఏమిటో తెలిశాక, అతడికి ఏదో ఒక విధంగా డబ్బు సాయం చేయాలని మాత్రమే పకీర్‌బాషా అనుకున్నాడు. అలా అని మిల్టన్తోనూ అనలేదు, అవధానికీ చెప్పలేదు. ‘‘నీ ధైర్య సాహసాలతో నాకు పన్లేదు మిల్ట . పని కావాలంటున్నావు కాబట్టి నా దగ్గర ఉన్న పనేమిటో చెబుతున్నాను. మేము మొదలుపెడుతున్న వెంచర్లో ఓ సమాధి ఉంది. అదొక్క సమాధే అక్కడెందుకు ఉందో తెలీదు. అయితే అక్కడ రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందనీ, ఎవరూ ప్లాట్లు కొనేందుకు రారనీ ప్రచారం జరుగుతోంది. నువ్వొకసారి వెళ్లొస్తే, అక్కడేం లేదని జనానికి తెలిస్తే మంచిదే కదా’’ అన్నాడు పకీర్‌బాషా. ఆ రాత్రి ఒక్కడే.. వెంచర్లో సమాధి ఉందని పకీర్‌బాషా చెప్పిన చోటుకు వెళ్లొచ్చాడు మిల్టన్. ఆ ఉదయాన్నే మంచం పట్టాడు! అక్కడేం జరిగిందీ అతడు ఎవరికీ చెప్పలేదు. అసలు అక్కడికి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. పకీర్‌బాషా ఇంటికొచ్చి మరీ మిల్టన్‌కు డబ్బు ఇచ్చి వెళ్లాడు. అతడు వెళ్తుంటే వెనక్కు పిలిచి మెల్లిగా చెప్పాడు.. మిల్టన్. ‘‘నిజమే. ఉంది’’ అన్నాడు. ‘‘ఎలా తెలిసింది?’’.. అడిగాడు పకీర్‌బాషా. ‘‘ఆ దెయ్యం నాకు సమాధి కూడా కనిపించకుండా చేసింది’’ అన్నాడు మిల్టన్ సన్నగా మూలుగుతూ. పకీర్‌బాషా బయటికి వస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. - మాధవ్ శింగరాజు -
రేపటి ఫన్డేలో... అబద్ధపు బాణం
సూర్యం ఇంటికి వెళ్లాలి. పట్నంలో చదువుకుంటున్న అతను ఆర్నెల్లకొకసారి ఊరొస్తూ ఉంటాడు. ఈసారి భారీ వర్షం కురుస్తోంది. రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఊరవతల వరకే రవాణా సౌకర్యం ఉంది. ఇప్పుడతను ఊర్లోకి నడిచెళ్లాలి. వర్షం తగ్గేవరకూ ధర్మన్న ఇంటిముందు ఆగితే సరిపోతుందనుకున్నాడు. ధర్మన్న కాటికాపరి. ఆ ఊరి శ్మశానం పక్కనే చిన్న గుడిసెలాంటి ఇంట్లో ఉంటాడు. ‘‘దార్లో నీకేమైనా ఆ సుబ్బిగాడు కనిపించాడా?’’ అనడిగాడు ధర్మన్న, సూర్యాన్ని ఇంట్లోకి పిలుస్తూ. సుబ్బిగాడు చచ్చి ముప్ఫై సంవత్సరాలవుతోంది. అప్పుడప్పుడు చుట్టుపక్కల కనిపిస్తూంటాడని ఊర్లో వాళ్లంతా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎవరు ఆ సుబ్బిగాడు? చనిపోయాక కూడా ఎలా కనిపిస్తున్నాడు? ధర్మన్న ఆ రాత్రి, ఆ వర్షంలో సూర్యానికి చెప్పిన కథేంటీ? చదవండి.. ‘అబద్ధపు బాణం’ కథలో... -
నాతో వచ్చేయ్
ఇరవై ఏళ్ల వయసులో ఊరి నుంచి వెళ్లిపోయినవాడు, ఇరవై ఏళ్ల తర్వాత ఊళ్లోకి దిగాడు బెనర్జీ. ఊళ్లో బస్సు దిగేటప్పటికి రాత్రి ఒంటి గంట అవుతోంది. అతడిని దించేసి బస్సు ముందుకు వెళ్లిపోయింది. రోడ్డు మీద ఒక్కడే మిగిలాడు. బస్సులోంచి బెనర్జీ తనొక్కడే దిగాడు. లగేజీలాంటిదేమీ అతడితోపాటు దిగలేదు. ఒంటి మీద ఖరీదైన బ్లూ జీన్స్, టక్ చేసిన లేత నీలం రంగు ప్లెయిన్ షర్ట్. అన్ని గంటల ప్రయాణంలో అవి రెండూ కాస్త అలసిపోయినట్లు అయ్యాయే కానీ, బెనర్జీ మాత్రం బస్సు కుదుపుల్లో ఎక్కడా నలిగినట్లు లేడు. బస్సులోంచి దిగగానే కాసేపటి వరకు అలా నిలబడిపోయాడు బెనర్జీ. వేసవికి ఉక్కపోతగా ఉంది. ఇరవై ఏళ్ల తర్వాత ఉక్కపోస్తున్నట్లుగా ఉంది అతడికి. అప్పుడు గానీ అతడికి ఊళ్లోకి వచ్చిన అనుభూతి కలగలేదు. చిన్నప్పటి చర్చి అలాగే ఉంది. చిన్నప్పటి చెట్లూ అలాగే ఉన్నాయి. చిన్నప్పటి అంటే.. ఇరవై ఏళ్ల క్రితానివని కాదు. అంతకన్నా ముందువి. బెనర్జీకి ఊహ వచ్చిననాటి నుండీ అతడు చూస్తున్నవి. ఇన్నేళ్ల తర్వాత అతడు ఊళ్లోకి వచ్చాడే కానీ, ఊళ్లోకి అతడు ఎవరి కోసమూ రాలేదు. తన కోసం తను వచ్చాడు. బెనర్జీ సిటీలో ఉంటాడు. ఎందుకో అతడికి ఊరు గుర్తొచ్చింది. అంతే. వచ్చేశాడు. ఊరంటే అతడికి ఊరే. ఊళ్లోని అమ్మానాన్న కాదు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములూ కాదు. బంధువులు కాదు. స్నేహితులు కాదు. చీకట్లో ఊళ్లోకొచ్చి, చీకట్లోనే ఊళ్లోంచి వెళ్లిపోవాలనుకుని వచ్చాడు. ఊళ్లో తననెవరూ చూడకముందే వెళ్లిపోవాలనుకున్నాడు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. వాళ్లందర్నీ ఇంకోసారి ఎప్పుడైనా తీరిగ్గా చూడొచ్చనుకున్నాడు. ముందైతే ఊరిని చూడాలి.మెల్లిగా ఊళ్లోకి నడక మొదలుపెట్టాడు బెనర్జీ. దారులన్నీ డస్సిపోయినట్లు పడి ఉన్నాయి. మలుపుల్లో ఒకట్రెండు కుక్కలు బెనర్జీ వైపు తలెత్తి చూసి, మొరిగే ఓపికలేనట్లుగా తిరిగి పడుకున్నాయి. ఊళ్లో నడకయ్యాక ఊరి చెరువు దగ్గరికి చేరుకున్నాడు బెనర్జీ. చెరువుగట్టున చిన్నప్పటి మర్రిచెట్టు అలాగే ఉంది. వెళ్లి ఆ మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. అది వట్టి మర్రి కాదు. ఊడలమర్రి. అతడిని కనుక ఆ సమయంలో అలా ఎవరైనా చూస్తే.. మనిషి అని మాత్రం అనుకోరు. టైమ్ చూసుకున్నాడు బెనర్జీ. మూడయింది. మర్రిచెట్టు కింది నుంచి అతడికి లేవాలనిపించడం లేదు. బాల్యంలో ఆ ఊడలు చూస్తే అతడికి భయం. యవ్వనంలో ఆశ్చర్యం. ఇప్పుడు భయమూ లేదు, ఆశ్చర్యమూ లేదు. మర్రిచెట్టుకు కాస్త దూరంలో శ్మశానం ఉంటుంది. అమావాస్య రాత్రిళ్లల్లో ఆ శ్మశానంలోంచి దెయ్యాలొచ్చి ఈ ఊడలకు వేలాడుతూ కష్టం సుఖం చెప్పుకునేవని ఊళ్లోవాళ్లు అనుకునేవారు. అది గుర్తొచ్చి బెనర్జీకి నవ్వొచ్చింది. ఆ రోజు అమావాస్యేమో అతడికి తెలీదు. బాగా చీకటిగా మాత్రం ఉంది. కాసేపు కళ్లు మూసుకున్నాడు బెనర్జీ. అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలీదు. ఏదో అలికిడి అయినట్లనిపిస్తే కళ్లు తెరిచాడు. ఎదురుగా.. ఎవరో పెద్దావిడ. చెరువులో ముంచుకొచ్చిన నీళ్ల బిందె ఆమె చేతుల్లో ఉంది. ‘‘ఏయ్యా.. బెనర్జీ.. ఎప్పుడొచ్చా! బాగున్నావా? నువ్వు బెనర్జీవే కదా. ఇంత రాత్రప్పుడు ఇక్కడేమిటీ?’’ అంటోంది. కొన్ని క్షణాలకు గానీ ఆమెను పోల్చుకోలేక పోయాడు బెనర్జీ. చప్పున లేచి నిలబడ్డాడు. ఆమె కళ్లల్లో ఆపేక్ష. ‘ఎన్నాళ్లయింది నాయనా.. నిన్ను చూసి’ అన్నట్టుగా చూస్తోంది. బెనర్జీ ఆమెనే చూస్తున్నాడు. ‘‘సిటీకి వెళ్లిపోయావంట.. అమ్మకీ నాయినకీ చెప్పకుండా! మంచిదేలే. నాయిన ఎంత సంపాదించినా మగ పిల్లోడు వాడి కాళ్ల మీద వాడు బతికితేనే కదా గౌరవం’’ అంది. ఇంకా.. ఒకట్రెండు మాటలు మాట్లాడింది. వెళ్లేటప్పుడు.. ‘‘ఇంక వెళ్తాను నాయనా.. తెల్లారితే పనులు తెమలవు’’ అని చెప్పి వెళ్లింది. అంతసేపూ బెనర్జీ మౌనంగానే ఉన్నాడు. ఆమె వెళ్లాక టైమ్ చూసుకున్నాడు. నాలుగు అవుతోంది. ముందైతే.. బస్టాండ్‌కి వెళ్లిపోయి, అక్కణ్ణుంచి ఏదో ఒక బస్ ఎక్కేసి, అక్కడినుంచి సిటీకి వెళ్లిపోదాం అనుకున్నాడు బెనర్జీ. అయితే అతడికి శేఖర్ని కలవకుండా వెళ్లడం కరెక్ట్ కాదనిపించింది. ఊరి చెరువులా, ఊడల మర్రిలా.. బెనర్జీకి శేఖర్ కూడా ఒకడు! బెస్ట్ ఫ్రెండ్. అయితే బెనర్జీ ఊరొదలడానికి ముందే, బెనర్జీతో శేఖర్ స్నేహం వదిలిపోయింది! ‘ఊళ్లో ఉండి ఏం చేస్తావ్? నాతో వచ్చేయ్’ అని అన్నాడు బెనర్జీ.. ఊరొదిలి వచ్చేడానికి ముందు రోజు. ఆ మాటకు శేఖర్ ఏమన్నాడో, అందుకు బెనర్జీ ఏమన్నాడో.. బెనర్జీ మర్చిపోలేదు. ఆ తర్వాతెప్పుడూ బెనర్జీ, శేఖర్ ఒకర్నొకరు చూసుకోలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరి నెంబర్లూ ఇద్దరి దగ్గరా ఉన్నాయి. ఈ ఇరవై ఏళ్లలో ఏ నెంబర్ నుంచీ ఏ నెంబర్‌కీ ఫోన్ వెళ్లలేదు. ‘‘ఒరే.. బెనర్జీ! నువ్వా! ఏమిటిలా? ఇంత ఉదయాన్నే! ఎప్పుడొచ్చావ్రా’’ అన్నాడు శేఖర్, బెనర్జీని ఇంట్లోకి రమ్మంటూ. బెనర్జీ వెళ్లలేదు. ‘వెళ్లిపోతాను’ అన్నాడు. ‘‘ఇంట్లో అంతా బాగానే ఉన్నారా?!’ అన్నాడు శేఖర్. ‘‘ఇంటికి వెళ్లలేదు. ఊరు చూసి వెళ్దామని వచ్చాను. చూశాను. వెళ్తున్నాను. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను’’ అన్నాడు బెనర్జీ. శేఖర్‌కి ఏమీ అర్థం కావడం లేదు. ‘‘మీ ఇంట్లోవాళ్లను చూడకుండా.. నన్ను చూడడం ఏంట్రా?’’ అన్నాడు. ‘‘నీకు సారీ చెబ్దామని వచ్చాను’’ అన్నాడు బెనర్జీ.‘దేనికి?’ అన్నట్లు చూశాడు శేఖర్. బెనర్జీ కళ్లు తుడుచుకున్నాడు. శేఖర్ కంగారు పడ్డాడు. ‘‘ఒరే శేఖర్.. ‘ఊళ్లో ఉండి ఏం చేస్తావ్? నాతో వచ్చేయ్’ అన్నప్పుడు నువ్వేమన్నావ్! ‘తల్లి లాంటి ఊరిని వదిలి రాలేనురా’ అనే కదా. అప్పుడు నేనేమన్నాను? ‘తల్లే పోయాక, తల్లిలాంటి ఊరేమిట్రా’అన్నాను కదా’’ అన్నాడు బెనర్జీ.‘‘అంటే ఏమైందిరా?’’ అన్నాడు శేఖర్. ‘‘అలా అన్నందుకు.. సారీ..రా’’.. అని శేఖర్ చేతిని కళ్లకు తాకించుకుని, వెంటనే అక్కడి నుంచి ఆ చీకట్లో బస్టాండ్‌కి బయల్దేరాడు బెనర్జీ.ఆ రాత్రి ఊడలమర్రి దగ్గర శేఖర్ తల్లి తనకు కనిపించిన విషయాన్ని అతడు తన మనసులోనే ఉంచేసుకున్నాడు. - మాధవ్ శింగరాజు -
రన్‌వేపై.. వదల బొమ్మాళీ.. వదల..
అమెరికాలోని సవన్నా నగరంలోని ఎయిర్పోర్ట్.. ఇక్కడి రన్‌వేపై రిచర్డ్, క్యాథరీన్ డాట్సన్ సమాధులుంటాయి.. ఫొటోలోని వృత్తంలో చూశారుగా.. అవే! సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టేటప్పుడు అవసరమైతే తగు పరిహారం ఇచ్చి ప్రైవేటు ఆస్తులను కూడా తీసుకుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో అప్పట్లో ఇక్కడ చిన్నస్థాయి సైనిక ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిన అమెరికా ప్రభుత్వం.. ఇందుకోసం డాట్సన్ కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమిని కూడా తీసుకుంది. అయితే, ఆ భూమిలోనే వీరి కుటుంబ సభ్యులు, వారి బానిసలకు చెందిన వందలాది సమాధులు ఉన్నాయి. దీంతో సైనికులు ఓ నాలుగు తప్ప మిగిలిన సమాధులను తవ్వి, వాటిని సమీపంలోని మరో శ్మశానానికి తరలించారు. అప్పట్లో వీటి వల్ల పెద్ద ఇబ్బంది లేకపోవడంతో వదిలేశారు. తదనంతర కాలంలో ఇది పౌర విమానాశ్రయంగా మారింది. 1970ల్లో రన్‌వేలను విస్తరించాలని నిర్ణయించారు. అయితే, రిచర్డ్, క్యాథరీన్ సమాధులు ఓ రన్‌వేకు మధ్యలో వచ్చేలా ఉన్నాయి. అక్కడి చట్టాల ప్రకారం వారి సంబంధీకులు ఒప్పుకుంటే తప్ప.. సమాధులను వేరే ప్రాంతానికి తరలించకూడదు. డాట్సన్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో అవి ఉంటుండగానే.. రన్‌వే నిర్మాణం కానిచ్చేశారు.. దీంతో అవిలా రన్‌వే మధ్యలో మిగిలిపోయాయి. అలాగే అమెరికాలోని మాథిస్ ఎయిర్‌పోర్టు(ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు) కూడా.. ఇక్కడైతే.. ఓ 20 మందివి ఉంటాయి. 1960ల్లో రన్‌వే కట్టినప్పుడు చనిపోయినవాళ్ల సంబంధీకులు వాటిని అలాగే ఉంచేయాలని కోరడంతో వాటి మీదుగానే రన్‌వే నిర్మించేశారు. -
మీకు ఇక్కడ భోంచేసే దమ్ముందా?
ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది..? అదేదో విదేశాల్లో శ్మశానం మాదిరిగా ఉందే అనుకుంటున్నారా..? మరోసారి చూడండి.. ఏమైనా మీ అభిప్రాయంలో మార్పు వచ్చిందా..? ఇది ఓ హోటల్.. ఇప్పటివరకు రకరకాల హోటళ్లను చూసి ఉంటారు కానీ ఇలాంటి ఓ ప్రదేశం గురించి మీరు ఎక్కడా విని ఉండకపోవచ్చు. ఎందుకంటే శ్మశానం మాదిరిగా ఈ హోటల్‌ను నిర్మించారు. దీని పేరు కిడ్ మాయ్ డెత్.. ఇది ఎక్కడుందంటే థాయ్‌లాండ్‌లో. ఇక్కడి ప్రతి ఏరియా శ్మశానం మాదిరిగా కనిపించేలా డిజైన్ చేశారు. అంతెందుకు అందులో ఉన్నంత సేపు మనం ఓ హోటల్లో ఉన్నామనే అనుభూతి కన్నా ఓ శ్మశానంలో ఉన్నట్లు భయంగా ఉంటుందట. ఆఖరికి అక్కడి పూలను కూడా మృతదేహాల మీద పెట్టే పూల బొకేలతో అందంగా తీర్చిదిద్దారు. పైగా అక్కడ ఉన్న బోర్డులపై కూడా చాలా భయానకమైన వాక్యాలు రాసి ఉంటాయట. అయితే ఇదంతా ఇలా ఎందుకు చేశారంటే.. చావు గురించి తెలుసుకోవడమే కాకుండా జీవితాన్ని మరింతగా ఆస్వాదించాలనే సూక్తిని తమ కస్టమర్లకు తెలియజేసేందుకేనని చెబుతున్నారు హోటల్ యజమానులు. -
పరుగులు పెట్టించిన ఫోన్ కాల్
రాజేంద్రనగర్: నార్సింగి పోలీసులతో పాటు గండిపేట మండల రెవెన్యూ అధికారులను ఓ ఫోన్ కాల్ ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు గండిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేశాడు. గండిపేట శ్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక శవాన్ని మూటలో కట్టి పూడ్చిపెట్టి వెళ్లారని సమాచారం అందించాడు. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఎక్కడా ఎవరూ మృతి చెందలేదని తెలిపాడు. దీంతో కానిస్టేబుల్ విషయాన్ని ఇన్స్పెక్టర్కు సమాచారం అందించాడు. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ విషయాన్ని గండిపేట మండల తహసీల్దార్‌కు సమాచారం అందించి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. పోలీసులతో పాటు తహసీల్దార్, ఆర్ఐ శ్మశానవాటికలో పూడ్చిన స్థలం వద్దకు వెళ్లి గోతిని తీయడం ప్రారంభించారు. అనంతరం ఒక తెల్లటి వస్త్రం చుట్టిన మూట కనిపించింది. మూటను బయటకు తీసి చూడగా అందులో కుక్క శవం ఉంది. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. తిరిగి ఆ కుక్క శవాన్ని అలాగే పూడ్చిపెట్టారు. దాదాపు 4 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. తాము పెంచుకుంటున్న కుక్క మృతి చెందడంతో యజమానులు దానిని తీసుకొచ్చి శ్మశానవాటికలో పూడ్డారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటిక నిర్వాహకుడికి సమాచారం అందించలేదు. -
అర్ధరాత్రి శ్మశానంలో తిరిగి.. అక్కడే తిని
సాక్షి, సిద్దిపేట : కాలం మారింది.. పెద్ద ఎత్తున టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజల్లో బలంగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి శ్మశానం వైపు వెళ్లకూడదు. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడానికి జన విజ్ఞాన వేదిక నడుంకట్టింది. వాటిపై ప్రజల్లో ఉన్న భ్రమలను, భయాలను తొలగించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసుల సహకారంతో అభ్యుదయ వాదులు అర్ధరాత్రి సమయంలో సిద్దిపేట బైపాస్ రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో గురువారం( అమావాస్య) రాత్రి అక్కడే గడిపారు. పోలీసులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అర్ధరాత్రి వేళ శ్మశాన వాటికలో కలియ తిరిగారు. అంతేకాకుండా శవాలను తగుల పెట్టే చోట అల్పాహారం తిన్నారు. అమావాస్య, పౌర్ణమిలు అంటే ఖగోళంలో వచ్చే మార్పులేనని, వాటిని నమ్మి మూఢనమ్మకాలకు పోవద్దని ప్రజలకు వివరించారు. మనుషులు శాస్త్రీయ పద్ధతుల్లో జీవించాలని అంతేకానీ, మూఢనమ్మకాలు జోలికి నమ్మొద్దంటూ సూచించారు. -
అర్ధరాత్రి స్మశానంలో తిరిగి.. అక్కడే తిని
-
శవాన్ని వదిలి పరుగులు తీసిన జనం
దేవనహళ్లి (దొడ్డబళ్లాపురం): శవ సంస్కారం చేయడానికి శ్మశానానికి వచ్చిన వారిపై తేనెటీగలు దాడిచేయడంతో జనం శవాన్ని వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటనలో 15 మంది గాయపడ్డారు. దేవనహళ్లి తాలూకా విజయపురం పట్టణంలో ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. విజయపుర పట్టణంలో నరసింహ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని తీసుకుని పట్టణంలోని శ్మశానానికి వచ్చారు. అందరూ శవసంస్కారానికి ఏర్పాట్లు చేస్తుండగా శ్మశానంలో ఉన్న చెట్టుకి కట్టిన తేనెపట్టు నుంచి హఠాత్తుగా ఎగిరి వచ్చిన తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో జనం శవాన్ని వదిలి పరుగులు తీశారు. అయినా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
శ్మశాన సౌందర్యం
చలి ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి. ‘దెయ్యాలకు ఎముకలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ చలికి చచ్చి, మనుషులయ్యేవి’.. అని చిన్న స్లిప్పులో బాల్‌పెన్‌తో రాసుకుని ఆ స్లిప్పునీ, పెన్నునీ తిరిగి జేబులో పెట్టుకున్నాడు కల్పేశ్.ఆ ముక్క రాసుకోడానికి కాస్త ముందు, కల్పేశ్ అదే స్లిప్పులో ఇంకో ముక్క కూడా రాసుకున్నాడు. ‘వెన్నెలే లేకపోయుంటే ఇంత శ్మశాన సౌందర్యం మనిషికి దక్కేది కాదేమో!’ అని. శ్మశానంలో అంత రాత్రప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కల్పేశ్. ఎంత రాత్రప్పుడో కల్పేశ్ చూసుకోలేదు. ‘అంత రాత్రప్పుడు’ అని మనం అనుకోవడమే కానీ, కల్పేశ్‌కి అది అంత రాత్రి, ఇంత రాత్రి కాదు. రాత్రి మాత్రమే! మనుషుల్ని చూసినవాడు చీకటిని కొలుచుకుని, చీకటిని తలచుకుని భయపడడు. బాగా చలిగా ఉంది. బాగా చలిగా ఉన్నట్లనిపించడం చలి ఎక్కువై కాదు.. ఆ రోజు అక్కడ.. మండుతున్న చితి ఒక్కటి కూడా లేకపోవడం అని కల్పేశ్ గ్రహించాడు. కల్పేశ్ బాగుంటాడు. శ్మశానంలో రాత్రి పూట, అదీ.. సమాధి అరుగు మీద ఒంటరిగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మనిషి గురించి ఇలా చెప్పడం అసందర్భంగా ఉంటుంది. అయినా చెప్పాలి. కల్పేశ్ బాగుంటాడు. బాగుండడం అంటే లోపల ఎలాగుంటాడో బయటికీ అలాగే ఉంటాడు. ‘‘ఇంత చలిలో బయటికెందుకొచ్చావ్? వెళ్లు లోపలికి..’’ ఉలిక్కిపడి చూశాడు కల్పేశ్.ఎవరో మనిషి! దెయ్యంలా ఉన్నాడు. చేతిలో కర్ర ఉంది కాబట్టి అతడిని మనిషిగా పోల్చుకున్నాడు కల్పేశ్. కర్ర పట్టుకుని ఉన్న దెయ్యాన్ని అతడు ఏ పుస్తకంలోనూ చూడలేదు. అందుకే అతడు మనిషి అని తేలిగ్గా గుర్తుపట్టేశాడు. ‘‘ఇంత చలిలో బయటికెందుకొచ్చావ్? వెళ్లు లోపలకి..’’ అని మళ్లీ గదమాయించాడు ఆ మనిషి. ‘‘బయటికి రావడం ఏంటి? లోపలికి వెళ్లడం ఏంటి?’’ అన్నాడు కల్పేశ్.‘‘నీలాంటి పిల్ల దెయ్యాలను చాలా చూశాను కానీ, శకలు మానెయ్. నన్ను భయపెట్టడానికి సమాధిలోంచి బయటికి వచ్చి కూర్చున్నట్లున్నావ్. చలికి ఛస్తావ్. వెళ్లు లోపలికి’’ అన్నాడు.పెద్దగా నవ్వాడు కల్పేశ్. ‘‘నేను దెయ్యాన్ని కాదు. మనిషిని’’ అన్నాడు. ఆ మనిషి కూడా నవ్వాడు. అయితే కల్పేశ్ నవ్వినంత పెద్దగా మాత్రం నవ్వలేదు.‘‘మనిషివైతే శ్మశానంలో ఎందుకు కూర్చున్నావ్? మీవాళ్లెవరైనా పోయారా’’ అని అడిగాడు. ‘‘మావాళ్లెవరూ పోలేదు. నేనే పోవాలనుకుంటున్నాను’’ అన్నాడు కల్పేశ్. ఆ మనిషి బిత్తరపోయాడు. ‘‘పోయిన తర్వాతే ఎవరైనా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పోవాలనుకోరు’’ అన్నాడు. ‘‘పోయేవరకైనా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ ప్లేస్ నచ్చింది’’ అన్నాడు కల్పేశ్. జాలిగా చూశాడు ఆ మనిషి కల్పేశ్ని. కల్పేశ్‌కి డౌటొచ్చింది. మనిషిని చూసి మనిషి జాలిపడడం తనెప్పుడూ చూడలేదు. ఈ మనిషి తనపై జాలిపడుతున్నాడంటే.. నిజంగా మనిషే అయివుంటాడా?! ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్?’’ అన్నాడు ఆ మనిషి.‘‘నేనేం భయపడను కానీ, నిజంగా నువ్వు మనిషివేనా.. చెప్పు’’ అన్నాడు కల్పేశ్. ఆ మనిషి ఈసారి పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకు నవ్వుతున్నావ్?’’‘‘మనం అడగాలనుకున్నది మనల్నే అడిగితే నవ్వు రాదా’’ అని మళ్లీ పెద్దగా నవ్వాడు ఆ మనిషి. ‘‘ఇలా మాటిమాటికీ నవ్వడం కూడా మనిషి లక్షణంలా లేదు’’ అన్నాడు కల్పేశ్. ‘‘సరే, ఇక్కడెందుకు కూర్చున్నావ్?’’ అన్నాడు ఆ మనిషి. ‘‘రోజూ వచ్చి, ఇక్కడి లైఫ్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసి వెళ్తున్నాను’’‘‘లైఫ్ లేనివాళ్లుండే చోటు కదా ఇదంతా. ఇక్కడ లైఫ్ ఎందుకుంటుంది?’’ ‘‘కానీ ఈ లైఫ్ నాకెందుకో బెటర్‌గా అనిపిస్తోంది. నేనున్న ప్రపంచం నాకు నచ్చడం లేదు.’’‘‘ఏం నచ్చడం లేదు?’’‘‘అదంతా అబద్ధాల ప్రపంచం. ఒక్కరూ నిజమైన మనిషిలా బతకడం లేదు’’.‘‘నీకొచ్చిన నష్టం ఏంటి?’’‘‘నన్నూ వాళ్ల అబద్ధాల్లో కలిపేసుకుంటున్నారు. నేనెవరో తెలియనివాళ్లు కూడా నాపై అబద్ధాలు చెబుతున్నారు. నేనేంటో బాగా తెలిసినవాళ్లు కూడా ఆ అబద్ధాలనే నిజం అని నమ్ముతున్నారు.’’‘‘నీకొచ్చిన నష్టం ఏంటి?’’‘‘నిజాన్ని చంపడమూ, మనిషిని చంపడమూ ఒకటే అని నా ఫీలింగ్. బతికి ఈ అబద్ధాలతో పడలేకపోవడం కన్నా.. చచ్చి, నా మీద అబద్ధాలను పడనివ్వకపోవడం నయం కదా’’ అన్నాడు కల్పేశ్.పెద్దగా నవ్వాడు ఆ మనిషి. ‘‘చనిపోయాకైనా నీ గురించి అబద్ధాలు చెప్పుకోరని ఎందుకు అనుకుంటున్నావ్?’’ అన్నాడు. కల్పేశ్ ఆ మనిషి వైపే కన్నార్పకుండా చూశాడు.‘‘చనిపోయి వచ్చాక, ఇక్కడైనా అబద్ధాలు చెప్పేవాళ్లు ఉండరని ఎందుకనుకుంటున్నావ్?’’ అన్నాడు.కల్పేశ్ ఆ మనిషినే చూస్తున్నాడు. ‘‘ఇవన్నీ కాదు.. ఇంకా నువ్వు బతికే ఉన్నావని ఎందుకనుకుంటున్నావ్?’’ అన్నాడు. ‘‘అదేంటి?’’ అన్నాడు కల్పేశ్, తనని తను చూసుకుంటూ. ఆ మనిషి నవ్వాడు. ఈసారి చిన్నగా నవ్వాడు. తాత్వికంగా నవ్వాడు. మనవడితో మాట్లాడుతున్న తాతయ్యలా నవ్వాడు. ‘‘అబద్ధాలూ నిజాలూ కాదు. అవతలివాళ్లు నీ గురించి ఏమనుకుంటున్నారోనని నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు బతికిలేనట్లే’’ అన్నాడు ఆ మనిషి. విస్మయంగా చూశాడు కల్పేశ్.‘‘ఒకటి చెప్పు.. నువ్వు నిజంగా మనిషివేనా? మనిషి అని నమ్మించడానికి కర్ర పట్టుకుని తిరుగుతున్న దెయ్యానివా?’’ అని అడిగాడు ఆ మనిషిని.ఆ మనిషేం చెప్పకుండా వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ కల్పేశ్తో అన్నాడు..‘‘లోపలికెళ్లు.. చలికి చచ్చిపోతావు.’’ ‘‘ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు పెద్దమ్మా.. మనిషి?’’ అని అడిగాడు వరుణ్. వాడికి పన్నెండేళ్లు. పెద్దమ్మ ప్రతిరోజూ వాడికో దెయ్యం కథ చెప్పాల్సిందే. ‘‘అదేమిట్రా.. వాళ్లిద్దర్లో దెయ్యం ఎవరని అడుగుతావని అనుకున్నానే’’ అని ఆశ్చర్యపోయింది పెద్దమ్మ. -
మరుభూమి మాయం!
ఆ గిరిజనులకు పెద్ద చిక్కొచ్చి పడింది. చస్తే దహనానికి కాసింత జాగా కరువైంది. ఎన్నో ఏళ్లుగా తాము వినియోగిస్తున్న జాగా కాస్తా పెద్దల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఆ పెద్దలకు పాలకుల అండ మెండుగా ఉండటంతో ఇక అమాయక గిరిజనులకు ఆసరా కల్పించేవారు కరువయ్యారు. ఏం చేయాలో తెలీక వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: బొబ్బిలి పట్టణ పరిధిలో ఐటీఐ కాలనీకి కమలా చెరువు ఒడ్డున ఎన్నో ఏళ్లుగా ఓ శ్మశానం ఉంది. అక్కడ నివసిస్తున్న వంద గిరిజన కుటుంబాలకు చెందినవారెవరైనా కాలం చేస్తే ఇదే శ్మశానంలో దహన సంస్కారాలు చేసేవారు. ఈ చెరువుకు ఎదురుగా కందుల అపార్ట్‌మెంట్స్‌ను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. అపార్ట్మెంట్ ఎదురుగా శ్మశానం ఉంటే తనకు నష్టం వస్తుందని భావించిన బిల్డర్ దానిని అక్కడి నుంచి తొలగించాలనుకున్నారు. అతని ఆలోచనకు కొందరు టీడీపీ నాయకులు.... అధికారులు అండగా నిలిచారు. కమలా చెరువుకు రూ.6.80 లక్షలతో నీరు–చెట్టు కింద నిధులు మంజూరుచేయించి, నిబంధనలకు విరుద్ధంగా చెక్‌డ్యాం కట్టారు. దానివల్ల శ్మశానంలోకి నీరుచేరింది. దా నిని సాకుగా చూపించి శ్మశానాన్ని మూసేశారు. శ్మశానం రోడ్డును రాత్రికి రాత్రే తొలగించేశారు. గిరిజనుల మధ్య చిచ్చు ఐటీఐ కాలనీవాసులు శ్మశానం కోసం పోరాడితే రెవెన్యూ వర్గాలు, టీడీపీ నాయకులు పెద్దరికం వహించి చెరువుకు 50 అడుగుల దూరంలో ఉన్న పోలవానివలస గిరిజనుల శ్మశానాన్ని వినియోగించుకోమని సలహా ఇచ్చారు. అయితే తమ గ్రామానికి చెందిన శ్మశానంలోకి ఇతరులు ఎలా వస్తారని, తమకే ఆ స్థలం చాలదని పోలవానివలస గిరిజనులు అభ్యంతరం చెబుతున్నారు. ఇది కాస్తా గిరిజను ల మధ్య చిచ్చుకు దారితీస్తోంది. కాగా చెరువులో శ్మశానానికి ఇబ్బంది కలుగుతుంటే తాము రోడ్డు మార్చామని తహసీల్దార్ కోరాడ సూర్యనారాయణ అంటున్నారు. రాస్తే రాసుకోండి..ఏటవుద్ది ఆ గిరిజనులు మీకు కంప్లైంట్ చేశారా.? రాస్తే రాసుకోండి... ఏటైపోద్ది.. మినిష్టర్ చెపితే పనులు చేశాం. రూ.6లక్షలతో చెరువు పనులు చేశాం. రాసుకో ఏటవుద్ది. – సింగనాపల్లి ఈశ్వరరావు, సర్పంచ్, ఎం.బూర్జవలస మా శ్మశానాన్ని మాకివ్వాల్సిందే... మా శ్మశానాన్ని కందుల అపార్టుమెంట్స్ యజమాని రాత్రికి రాత్రే కప్పించారు. అప్పట్లో గొడవ పడ్డాం. రెవెన్యూ అధికారులు కలుగజేసుకుని పోలవానివలస శ్మశానంలో çస్థలం కేటాయించారు. కానీ మా శ్మశానమే మాకు కావాలి. – వాడపల్లి రజని, బొద్దాన అప్పారావు, ఐటీఐ కాలనీ. నాకేం తెలియదు నీరు–చెట్టు పనులు బాగానే జరిగాయి. చెక్‌డ్యాంను మధ్యలో అడుగుమేర తొలగించాం. మిగతా విషయాలు నాకేమీ తెలియవు. – విద్యాసాగర్, జేఈ, నీటిపారుదలశాఖ సర్పంచ్ చేయించారు అపార్టుమెంట్‌కు శ్మశానం తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదు. జేసీబీ తెస్తే ఎం.బూర్జవలస సర్పంచ్ ఈశ్వరరావు దానిని తీసుకెళ్లి పనులు చేయించారు. – కందుల వినోద్, కందుల అపార్టుమెంట్స్ యజమాని -
చావు కథ..శ్మశాన వ్యథ!
► కట్టెకాలాలంటే.. అష్టకష్టాలే.. ► దశాబ్దాలుగా వేధిస్తున్న వైనం ► శ్మశానవాటిక స్థలం లేక గోళ్లమూడి వాసుల అవస్థలు ► అన్ని వర్గాలదీ ఇదే పరిస్థితి ► ఏటికి వరదొస్తే శవాన్ని పడవలో తరలించాల్సిందే.. మరణం.. బంధాలను వీడి.. బాధను మిగిల్చే క్షణం. పుట్టినవాడు గిట్టకమానడు.. మరణించిన వేళ కన్నీటిధారతో అశ్రునివాళి అర్పిస్తాం. ఇది బతుకున్న అందరూ సాగించే క్రతువే. ఓ గ్రామంలో మాత్రం వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే.. గిట్టిన వారిని తలచుకుని పడే బాధకంటే.. దహనసంస్కారాల కోసం పడే వేదనే ఎక్కువగా ఉంటోంది. శ్మశానవాటిక లేక దశాబ్దాలుగా ఆ ఊరి జనం పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఎప్పటికి ఈ బాధ తీరేనో.. వేదన వీడేనో వేచిచూడాలి. నందిగామ : ఆ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినా కట్టె కాలేందుకు అడుగు భూమి లేని దుస్థితి. మృతదేహాన్ని కాల్చాలన్నా, పూడ్చాలన్నా.. సంబంధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఎదుర్కొనే కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. శవాన్ని భుజాన వేసుకొని దారి కూడా సక్రమంగా లేని మార్గంలో నరక యాతన పడాల్సిన దుస్థితి. ఈ దుస్థితి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు.. ఇలా అందరికీ బాధలు తప్పడం లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సమస్య గ్రామస్తులను వెంటాడుతూనే ఉంది. నందిగామ మండల పరిధిలోని గోళ్లమూడి గ్రామస్తుల దీనావస్థ ఇది. ఏరే శ్మశానవాటిక గ్రామంలో హిందువులకు శ్మశానవాటిక కోసం ఎటువంటి స్థలం లేదు. గ్రామంలో మహాప్రస్థానం లేకపోవడంతో కట్టెకాలాలంటే సమీపంలోని వైరా ఏరుకు వెళ్లాల్సిందే. ఏటి ఒడ్డునే దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు పగోడికి కూడా రాకూడదనిపిస్తుంది. ఏటికి నీరొస్తే ఏకంగా పడవలో వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాలి. కాడితో శవాన్ని మోసుకొచ్చి పడవలో ఇసుక దిబ్బను అన్వేషిస్తూ వెళ్లి ఎక్కడ ఒడ్డు కనిపిస్తే అక్కడ దహన సంస్కారాలు నిర్వహించి తిరిగి గ్రామానికి చేరుకోవాల్సిందే. ముస్లింలు మరో ఊరు వెళ్లాల్సిందే.. హిందువుల పరిస్థితి ఇలా ఉంటే, ముస్లిం సోదరుల దుస్థితి మరింత దయనీయం. వీరి మతాచారం ప్రకారం శవాన్ని పూడ్చి పెట్టాల్సిఉంటుంది. ఇందుకోసం గ్రామంలో ఎటువంటి స్థలం లేకపోవడంతో ఏకంగా మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించి రుద్రవరం గ్రామానికి చేరుకొని అక్కడ ఖననం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు. స్థలం ఉన్నా తొలగని కష్టాలు గ్రామంలో వైరా ఏటి ఒడ్డున ఉన్న స్థలాన్ని క్రైస్తవులు శ్మశానవాటికగా వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ స్థలంలో అధిక శాతం కోతకు గురైంది. ఇక అక్కడకు వెళ్లేందుకు సరైన దారి కూడా లేకపోవడంతో వారికి సైతం కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలి గ్రామంలో శ్మశానవాటిక స్థలం లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కనీసం రెండు ఎకరాల స్థలం కేటా యిస్తే, అందరికీ మేలు జరుగుతుంది. వర్షాకాలం లో మా కష్టాలు వర్ణనాతీతం – గాదెల వెంకటేశ్వరరావు(బాబు), గోళ్లమూడి ఎవరైనా చనిపోతే మా పరిస్థితి దారుణం వర్షాకాలం వచ్చిందంటే మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం ఓ ప్రహసనంగా మారుతోంది. వైరా ఏటికి వరద వస్తే మరింత దయనీయంగా ఉంటోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శవాన్ని దహనం చేయాల్సివస్తోంది. –సూర్యదేవర సూర్యనారాయణ, గోళ్లమూడి ఉన్న స్థలాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు గ్రామంలోని అన్ని వర్గాల వారు వినియోగించుకునేందుకు సర్వే నంబరు 162లో 1.53 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొంత కోతకు గురైనా, ఇంకా 73 సెంట్ల స్థలం ఉంది. దారి కోసం రైతుల వద్ద నుంచి దాదాపు 60 సెంట్ల స్థలం సేకరించాం. దీని అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. అన్ని వర్గాల వారు ఈ స్థలాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీరామకృష్ణ, తహసీల్దార్ -
శ్మశానంలో కల్యాణ వైభవం
సాక్షి ముంబై: కొత్తదనం కోసం నీటిలో, గాలిలో వివాహాలు జరుపుకుని అందరిని ఆకట్టుకునే జంటలను చూశాం. కాని, మహారాష్ట్ర జాల్నా జిల్లా పరతూర్‌లో ఓ వివాహం ఎవరూ ఊహించని లేని విధంగా శ్మశానంలో జరిగింది. పరతూర్‌లోని వైకుంఠధాం శ్మశానవాటికలో మంజుశ్రీ, ఆకాష్ ఒక్కటయ్యారు. ఈ వేడుకుకు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరుకావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే పరతూర్‌లో శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే మసన్‌జోగి (కాటికాపరి) వర్గానికి చెందిన సుభాష్ గైక్వాడ్ కూతరు మంజుశ్రీ వివాహం మకుంద్‌వాడీలోని అదే వర్గానికి చెందిన సాహెబ్రావ్ కుమారుడు ఆకాష్‌తో కుదిరింది. అయితే, శ్మశానంలోనే వివాహం చేయాలని మంజుశ్రీ, ఆకాష్‌ల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బంధుమిత్రులఅందరికీ శుభలేఖలు వెళ్లాయి. అయితే, అందరు ముందుగా వివాహం జరిగే స్థలం పేరు తప్పుగా ముద్రించారని భావించి ఫోన్ చేసి మరీ తెలుసుకున్నారు. అయితే అదే సరైన అడ్రస్ అని తెలువడంతో వారంతా అవాక్కయ్యారు. ముస్తాబైన శ్మశానవాటిక... మంజుశ్రీ, ఆకాష్‌ల వివాహం కోసం వైకుంఠధామ్ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించారు. అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేశారు. రంగుల రంగుల పుష్పాలతోపాటు రంగవల్లులు వేశారు. ఈ తంతును వింతగా భావించిన వారు కూడా అక్కడికి చేరుకున్నారు. కొందరు శ్మశానంలో నిజంగా పెళ్లి జరుగుతుందా అనే సందేహంతో కూడా వచ్చిన వారున్నారు. ఆడంబరాలు, కట్నకానుకల పేరుతో భారంగా మారిన పెళ్లి వ్యవహారాన్ని ఇంత సులభంగా పూర్తి చేయటం అందరినీ ఆకట్టుకుంది. -
మానవత్వం మంటగలిసింది..
► శ్మశానంలో మృతదేహం ► చెరువుగట్టుపై చర్చలు మందస : మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. మనిషి జీవితం డబ్బే ప్రధానంగా ముందుకు సాగుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు విలువలేకుండా పోతోంది. ఇలాంటి ఘటనే మండలంలో చోటుచేసుకుంది. మందస మండలంలోని పితాతొళి గ్రామానికి చెందిన అంపోలు ప్రమీల(35) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని తల్లి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, ప్రమీల మృతిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మృతదేహాన్ని శనివారం సోంపేట సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమ్తితం తరలించారు. సమయం మించిపోవడంతో వైద్యులు ఆదివారం పోస్టుమార్టం చేస్తామని చెప్పి, మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం జరగడంతో అంత్యక్రియలు నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని పితాతొళి శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అక్కడే వివాదం మొదలైంది. ప్రమీల భర్త తిరుపతిరావు వీఆర్వోగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుమారుల భవిష్యత్ ఆలోచించిన పెద్దలు.. తిరుపతిరావు నుంచి హామీ కావాలని పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే రెండు రోజుల నుంచి ప్రమీల మృతదేహం ఉండగా.. అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు నిలిపివేశారు. మృతురాలి వర్గం, తిరుపతిరావు వర్గం మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం వచ్చిన మృతదేహానికి మధ్యాహ్నం రెండు గంటలైనా అంత్యక్రియలు కాలేదు. శ్మశానంలో మృతదేహాన్ని ఉంచేసి, పెద్దలు పంచాయితీకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒప్పందం అమలయ్యేలా బాండ్ పేపర్లు తీసుకువచ్చి, వాటిపై సంతకాలు చేయించినట్టు తెలిసింది. మృతదేహం ముందుంచుకుని డబ్బే ప్రధానంగా వాదోపవాదాలు చేసుకోవడం విస్మయపరిచిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. శుక్రవారం రాత్రి మరణించిన ప్రమీలకు.. ఆదివారం మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు జరగకపోవడం విచారకరం. -
మానవతకు పాతర
►మూడు రోజుల పురిటిగుడ్డును ప్రాణాలతో పాతిపెట్టే పాతకం ►కన్నతండ్రి ప్రోద్బలంతో ఆస్పత్రి గార్డు అకృత్యం.. ►నెలలు నిండకుండా.. అవయవాలు వృద్ధి చెందకపోవడమే కారణమట ►శ్మశానంలో ఆ ఘాతుకాన్ని గమనించి అడ్డుకున్న పలువురు ►సెక్యూరిటీ గార్డుకు దేహశుద్ది.. పాప క్షేమంగా ఆస్పత్రికి.. నెలలు నిండకుండానే ఈ లోకంలోకి వచ్చేయడమే ఆ పురిటిగుడ్డు చేసిన పాపం.. అవయవాలు అంకురించకుండానే పుట్టిన ఆడబిడ్డ.. వైద్యానికే లక్షలు పోయాలన్న బెంగ.. ఆ తండ్రి హృదయాన్ని కఠిన పాషాణంగా మార్చేశాయి.. కన్నపేగు అన్న కనికరాన్ని కూడా దూరం చేశాయి.. పురిటి వాసన కూడా పోని పసికూనను ప్రాణాలతోనే పాతిపెట్టే పాతకానికి పురిగొల్పాయి.. బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రికి చెందిన సెక్యూరిటీ గార్డే తోడ్పాటునందించి.. మానవ విలువలకు.. పేగు బంధానికి పాతరేసే అకృత్యానికి తెగబడితే.. మరుభూమిలో ఆ దారుణాన్ని గుర్తించి.. గార్డును చితకబాది.. పసిగుడ్డు ప్రాణాలు పోకుండా కాపాడారు కొందరు మానవతామూర్తులు.. చివరికి చైల్డ్‌లైన్, చైల్డ్ ప్రొటెక్షన్, పోలీసు విభాగాలు స్పందించి.. పసికూనకు రక్షా కవచంగా నిలిచారు. పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : పసికందు బతికుండగానే కడతేర్చాలనుకున్న కసాయితనం. నెలలు నిండకుండా పుట్టిందనే నెపంతో కాటికి తీసుకువెళ్లిన కూృరత్వం. గుక్కతిప్పకుండా కేరుమంటున్నా గుండె కరగని అమానుషత్వం.. ఆ నరరూప రాక్షసుడి పైశాచికత్వాన్ని వివరించడానికి ఎన్ని పదాలు చాలుతాయి? ఆ కర్కోటకుడి నిర్దాక్షిణ్యాన్ని చెప్పాలంటే ఏ భాషలో ఏ మాటలు సరిపోతాయి? అయితే ఏ దేవతలు పుణ్యం కట్టుకున్నారో.. అంత ముష్కరుడి చేతుల్లో పడి కూడా పసిపాప ప్రాణాలు నిలిచాయి. పట్టపగలు శ్మశానం నుంచి పసిపాప మృత్యుఘోష విన్న స్థానికులు వెంటనే స్పందించడంతో చిట్టితల్లికి పంచప్రాణాలు నిలిచాయి. జరుగుతున్న దారుణాన్ని తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయి కర్కోటకుడికి దేహశుద్ధి చేశారు. బొడ్డుతాడు ఊడని ఆ పసికందును రక్షించేందుకు పోలీసులకు సమాచారం అందించారు. బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో శిశువుకు వైద్యం సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ చిన్నయిదేవి.. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి ఆనంద్‌ను సంఘటన స్థలానికి పంపించారు. ఆయన హుటాహుటిన శ్మశానానికి వెళ్లి పసికందును అక్కున చేర్చుకున్నారు. వెంటనే తదుపరి వైద్యం కోసం కృష్ణా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కారా ప్రతినిధుల ఆగ్రహం ఈ విషయం తెలిసి కారా (సెంట్రల్ ఎడ్పాప్షన్ రిసోర్స్ అథారిటీ) సభ్యుడు కంభంపాటి వాసుబాబు ఆస్పత్రికి వెళ్లి యాజమాన్యం, శిశువు తండ్రితో మాట్లాడాడు. శిశువు నెలలు నిండకుండా పుట్టిందని, దీంతో అవయవాలు సంపూర్ణంగా వృద్ధి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొనగా, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారని శిశువు తండ్రి తెలిపాడు. బతికున్న పసికందును ఎలా కప్పిపెడతారంటూ కారా సభ్యుడు వాసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి బిడ్డలు పుట్టినప్పడు వైద్యం చేయించే స్తోమత లేకపోతే బాలల రక్షణ విభాగానికి ఆశ్రయిస్తే నిధులు కేటాయిస్తారని చెప్పారు. అలా కాకుండా పసికందు ప్రాణాలు తీయడానికి పూనుకోవడం నేరమన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపైన, శిశువు తల్లిదండ్రులను, పూడ్చిపెట్టడానికి ప్రయత్నించి సెక్యూరిటీ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శిశువుకు వైద్యం శిశువుకు వైద్యంతోపాటు సంరక్షణ బాధ్యతలను చైల్డ్ వెల్పేర్ కమిటీకి అప్పగించామని కారా సభ్యుడు వాసుబాబు పేర్కొన్నారు. వైద్యానికి కావాల్సిన నిధులు సమకూర్చుతామని తెలిపారు. శిశువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శిశు గృహం సిబ్బంది సైతం బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చొరవ ప్రశంసనీయం పసికందును ప్రాణాలతో పూడ్చిపెడుతున్నారన్న విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం కన్వీనర్ గొండు సీతారాం స్థానికులతో కలిసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి శిశువును సంరక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. బిడ్డకు ఆసరాగా అధికారుల నిలబడేందుకు వీలుగా వారితో సంప్రదింపులు జరిపారు. దీంతోపాటు పసికందు విషయాన్ని అందించిన స్థానికులు మహాలక్ష్మి, రాజులను సైతం కారా ప్రతినిధులు అభినందించారు. నెలలు నిండ లేదని... నర్సీపట్నానికి చెందిన మామిడి గోవింద్ గర్భిణి అయిన తన భార్యను జిల్లా పరిషత్ జంక్షన్లో గల కృష్ణా ఆస్పత్రిలో చేర్పించాడు. మూడు రోజుల క్రితం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యం సవ్యంగాలేదు. దీంతో వైద్య పరీక్షలు చేశారు. నెలల నిండకుండా ఏడో నెలలో బిడ్డ పుట్టడంతో అవయవాలు పూర్తిగా వృద్ధి చెందలేదు. పసిబిడ్డ వైద్యానికి పెద్దమొత్తంలో ఖర్చవుతుందని ఆస్పత్రి వర్గాలు బిడ్డ తల్లిందండ్రులకు తెలిపారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో ఏమో కానీ బతికి ఉన్న ఆ బిడ్డను పెదజాలారిపేట శ్మశాన వాటికలో మంగళవారం సాయంత్రం పూడ్చేందుకు కృష్ణా ఆస్పత్రికి చెందిన సెక్యూరిటీ గార్డు గొయ్యి తవ్వతున్నాడు. అదే సమయంలో శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానికులకు పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అనుమానంతో స్థానికులు అక్కడి వెళ్లి చూసేసరికి హృదయ విదారక దృశ్యం వారి కంట పడింది. చలించిపోయిన స్థానికులు బతికి ఉన్న పసికందును పూడ్చిపెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని నిలదీశారు. అతడు సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. అతనికి దేహశుద్ధి చేశారు. దీంతో తాను కృష్ణా ఆస్పత్రి చెందిన సెక్యూరిటీ గార్డునని పేర్కొన్నాడు. స్థానికులు బాలల సంరక్షణ విభాగానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించి పసిబిడ్డను రక్షించారు. ఈ విషయమై కృష్ణా ఆస్పత్రి నిర్వాహకుడు సీతారామరాజును ‘సాక్షి’ వివరణ అడగడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం నెలల నిండని శిశువును పెదజాలారిపేట శ్మశానవాటికలో పూడ్చిపెట్టేందుకు యత్నిస్తున్న విషయాన్ని స్థానికుల సమాచారం మేరకు తెలుసుకున్నాం. అక్కడికి వెళ్లి ఆ బిడ్డను రక్షించి వెంటనే కృష్ణా ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో బిడ్డ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – సీఐ మళ్ల మహేష్ పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు -
శ్మశానంలో రూ.20 లక్షల నగదు
బొమ్మనహళ్లి(బెంగళూరు): ఏటీఎంలో పెట్టాల్సిన రూ.20 లక్షల నగదున్న ట్రంక్ పెట్టెను, వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్ సెబన్ హుస్సేన్ కోసం సిటీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతను మడివాళలో ఉన్న సెక్యూర్ వాల్యూ ఇండియా అనే సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఇక్కడి కోరమంగళలో అద్దెకు దిగిన ఇంటి చిరునామా, అసోంలోని ఒక చిరునామాను సంస్థకు ఇచ్చాడు. ఆదివారం రాత్రి పోలీసులు కోరమంగళ అడ్రస్‌కు వెళ్లగా అక్కడ దొరకలేదు. దీంతో సొంత రాష్ట్రం అసోంకు వెళ్లి ఉంటాడని పోలీసు ప్రత్యేక బృందం అక్కడకు బయల్దేరింది. శనివారం సాయంత్రం వాహనంతో పాటు రూ.20 లక్షల నగదున్న పెట్టెను ఎత్తుకెళ్లిన అతను.. వాహనాన్ని యమళూరు చెరువు వద్ద, డబ్బు ఉన్న పెట్టెను బెళ్లండూరు సర్కిల్ వద్ద ఉన్న శ్మశానం వద్ద ఆదివారం వదిలివెళ్లాడు. పోలీసులు పెట్టె తెరిచి చూడగా భారీగా డబ్బు బయటపడింది. ఏటీఎం ల్లో పెట్టాల్సిన డబ్బును అతను దొంగిలించడానికి యత్నించాడని, పట్టుబడతాననే భయంతోనే వదిలేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. -
దెయ్యం 'మాయం'
చేత'న'బడి ‘ఎవరికీ దెయ్యం కనిపించడం లేదు’ ఆ ఊరిలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. నిజమే ఆ ఊళ్లో ఎవరికీ దెయ్యం కనిపించడం లేదిప్పుడు. జ్వరాలతో మంచాలు పట్టిన వాళ్లకీ కనిపించడం లేదు. బడికెళ్లే పిల్లలకూ కనిపించడం లేదు. తొలి జామున పొలానికెళ్లే రైతులనూ పలకరించడం లేదు. మిట్టమధ్యాహ్నం భర్తలకు అన్నం తీసుకెళ్లే ఆడవాళ్లనూ భయపెట్టడం లేదు. అజ్ఞానం చీకట్లో కొరివి దెయ్యం వీర విహారం చేసిందొకప్పుడు విజ్ఞానం వెలుగులో మాయమైపోయిందిప్పుడు. ‘‘మరి దెయ్యం ఎక్కడికెళ్లింది నాన్నా’’ తండ్రి భుజాన్ని గుంజుతూ అడుగుతోంది గాయత్రి. ‘‘దెయ్యం మంటల్లో కాలిపోయింది. ఇక ఎవరికీ కనిపించదు’’ కూతురికి నచ్చే రీతితో ఆమె సమాధానపడేటట్లు చెప్పాడు గోవిందయ్య. ‘‘అయినా లేని దెయ్యాన్ని ఉందని నమ్మించి ఎంత డబ్బు గుంజాడయ్యా ఆ మాయగాడు’’ బుగ్గలు నొక్కుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చుంది కమలమ్మ. ‘‘నెల్లాళ్ల కిందట ఈ ఊరు ఊరులా ఉండిందా, ఇంటికో జబ్బు మంచంతో ఆసుపత్రి వార్డులా ఉండేది’’ అన్నదామె. ఆమె ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ‘‘రాజమ్మొదినా! మీ పిల్లాడుంటే నాలుగు వేపమండలు కోసిమ్మని చెప్పవే. నా కొడుకు ఒళ్లు కాగిపోతోంది. మూసిన కన్ను తెరవలేదు. నిన్న పొలం పోయినోడు రాత్రికి ఇంటికి రావడమే మంచం మీద వాలాడు. ఇంకా లేవలేదు. ఆ కొరివిదెయ్యం చూపు నా బిడ్డ మీద పడ్డట్టుంది దేవుడా’’ అంటూ వరండాలో కూర్చుంది నాగమ్మ. రాజమ్మలో సానుభూతి, సహాయం చేయాలనే సహృదయత కంటే ఎక్కువగా భయం గూడుకట్టుకుంటోంది. దెయ్యం పట్టిన ఇంటి వాళ్లను తన ఇంటికి రానిస్తే వాళ్లతోపాటు ఆ పీడ కూడా వస్తుందేమోననే భయం ఆమెది. ‘‘నువ్వింటికి పో వదినా, పిల్లాడిని ఒక్కణ్నీ వదిలి వస్తే ఎట్టా, మా పిల్లాడు బడి నుంచి వచ్చాక వేపాకు కోయిస్తాలే’’ అన్నది. నాగమ్మను త్వరగా పంపించేయాలని తొందరపడుతోంది రాజమ్మ. వారం రోజుల్లోనే ఊళ్లో ఆడమగ, చిన్నా పెద్దా అంతా కలిసి వందమంది దాకా మంచం పట్టారు. ఒక్కో ఇంట్లో ఒకరికి జ్వరం తగ్గితే ఇద్దరు మంచాన పడుతున్నారు. అందరిదీ ఒకటే జ్వరం... అది భయం జ్వరం. కొరివిదెయ్యం భయంతో వచ్చిన చలిజ్వరం. అది పొరుగురిలోని భూతవైద్యుడి ఇల్లు. గ్రామ పెద్దల వంటి నలుగురు ఆయన ఎదురుగా ఉన్నారు. ‘‘రాత్రి దీపాలు పెట్టాక నట్టింట్లో కూర్చోబెట్టి జ్వరం వచ్చిన వాళ్ల కుడి చేతికి కట్టండి’’ జ్వరాలకు అంత్రాలు మంత్రించి ఇస్తూ చెప్పాడు భూతవైద్యుడు. వాటిని భక్తిగా చేతిలోకి తీసుకుని సంచిలో దాచుకున్నాడు ఊరిపెద్ద. ‘‘ఆ శ్మశానం దారిని వదిలేసి మరొక దారిలో నడవమని చెప్పండి’’ అని ముక్తాయించాడు భూతవైద్యుడు. వాళ్లు అయోమయంగా చూశారు. ‘‘ఊరంతా పొలం పనులు చేసుకునే వాళ్లమే. శ్మశానం మీదుగా వెళ్లాల్సిందే. మరో దారి లేదు’’ అన్నాడు వారిలో ఒకతడు. సాలోచనగా తల పంకించాడు భూతవైద్యుడు. వ్యవసాయం మీద ఆధారపడిన ఆ ఊరికి - ఊరి పొలాలకి మధ్యలో శ్మశానం ఉందని అర్థమైందతడికి. ‘‘అలా ఉంటే ఊరికి అరిష్టం కాక మరేమవుతుంది’’ అని శక్తిమంతమైన బాణాన్ని వదిలాడు భూతవైద్యుడు. నలుగురూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు. ఒకతడు ఊరికి పట్టిన అరిష్టం వదిలే మార్గం చెప్పమంటూ అమాయకంగా చక్కటి అవకాశాన్ని భూతవైద్యుడి చేతిలో పెట్టాడు. ‘‘రాజమ్మా! నా కొడుకుని పట్టుకుంది ఆ అరవదెయ్యమేనంట! భూతవైద్యుడు ఎల్లుండి ఆదివారం నుంచి పదిహేన్రోజులు మనూళ్లోనే ఉండి ఇంటింట్లో పూజ చేస్తాట్ట. ఆయన చేత్తో పూజ చేయించుకుంటే దెయ్యం రాకుండా లక్ష్మణరేఖ గీసినట్లేనని చెప్పుకుంటున్నారే రాజమ్మా! నువ్వు కూడా చేయించుకో పిల్లలు గల దానివి’’ సమాచారంతోపాటు ఓ సలహా ఇచ్చేసి వెళ్లింది నాగమ్మ. ఆదివారం మధ్యాహ్నం... నాగమ్మ ఇల్లు. భూతవైద్యుడు, అతడి ఎదురుగా నాగమ్మ కొడుకు. పక్కనే భూతవైద్యుడి అనుచరులిద్దరు. ‘‘నువ్వేం చూశావ్’’ ఆ గొంతులోని గంభీరానికి నోరు పెగల్లేదు నాగమ్మ కొడుక్కి. ‘‘రాత్రి ఎనిమిది గంటలప్పుడు పొలం నుంచి పిల్లాడొక్కడే వస్తూన్నాడు. వల్లకాట్లో కొరివి మండడం చూశాడు, ఊపిరి బిగపట్టుకుని వస్తుంటే వెనక ఎవరో వెంట వస్తున్నట్లు చప్పుడు విన్నాడు. దెయ్యమే వెంటపడింది. చెమటలతో ఇంటికొచ్చిన వాడు పది రోజులైనా మంచం మీద నుంచి లేవలేదు’’ చేత్తో గుండెలను బాదుకుంటూ చెప్పింది నాగమ్మ. నట్టింట్లో ముగ్గు వేసి క్షుద్రపూజలు, నల్లకోడిని కోసి రక్తం ధారపోయడం, కళ్లెర్ర చేసి వేపమండలు చరుస్తూ కర్ణకఠోరంగా మంత్రాలు వల్లించడం వంటివన్నీ పూర్తయ్యాయి. నాగమ్మకు ఐదు వేల ఖర్చు లెక్కకొచ్చింది. ‘‘పిల్లవాడిని బాగా భయపెట్టింది కొరివిదెయ్యం. ఎంత పెద్ద దెయ్యమైనా సరే... దాన్ని భయపెట్టే వైద్యుడు వచ్చే వరకే ఆ ఆటలన్నీ. ఇప్పుడు తోక ముడుచుకుని శ్మశానం దారి పట్టింది’’ అంటూ రక్తి కట్టించాడు ఓ అనుచరుడు. ఇదే తంతు దాదాపుగా ఇరవై ఇళ్లలో జరిగింది. మరి... కొరివి దెయ్యం ఇప్పుడు శ్మశానం దారి పట్టింది సరే. మళ్లీ పట్టదని నమ్మకమేంటి. రోజూ ఆ దారిన నడవాల్సిన వాళ్లమే కదా! సందేహం రావడం అది వేళ్లూనుకోవడం గంటల్లోనే జరిగిపోయింది. దానికి విరుగుడుగా ఊరంతటికీ రక్షణ కల్పించడం లేదా దెయ్యాన్ని శ్మశానం దాటకుండా దిగ్బంధనం చేయడం... తరుణోపాయం చెప్పాడు ఇంకోఅనుచరుడు. దిగ్బందనం చేయించాలంటే ఎంత ఖర్చవుతుంది... పెద్దలు ఆలోచనలో పడ్డారు. ‘పంట కాలువ కోసం ఎకరాకి వెయ్యేసి రూపాయలు పోగు చేశాం కదా పెద్దయ్యా! ఆ డబ్బుతో కొరివి దెయ్యం రాకుండా దిగ్బందం చేయిద్దాం. పంట కాలువ వచ్చే ఏడు తవ్వుకోవచ్చు’’ తోచిన సలహా ఇచ్చాడొక మధ్యవయస్కుడు. అందరికీ అదే ఆమోదయోగ్యంగా కనిపిస్తోంది. భూతవైద్యుడికి ఆ ఊరు లాభసాటిగా కనిపిస్తోంది. ఇంతలో ఓ రోజు... ‘‘మనూర్లో దెయ్యం ఉందని పేపర్లో ఏశారంట’’ ఉద్వేగంతో చెప్తోంది రాజమణి. ఈ సమాచారం ఊరంతటినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని ప్రభావం మరుసటి రోజు కనిపించింది. గ్రామం రచ్చబండ దగ్గర సమావేశం. ఊరిపెద్దలంతా ఉన్నారు. ఊరికి కొత్తవాళ్లు ఐదుగురు కూడా ఉన్నారు. ‘‘పెద్దయ్యా! ఈ పని చేస్తే అంతా మనమీదకే వస్తుందేమో! కొరివిదెయ్యాన్ని దిగ్బందం చేద్దామని ఊరంతా ఒక్కమాట మీద ఉంది. పంటకాలవ డబ్బు బయటకు తీయడానికి ఇష్టం లేకే నువ్వీపని సేత్తన్నావనుకుంటారంతా’’ చెవిలో గుసగుసలాడాడు ఒకాయన. ‘‘నాకూ అయోమయంగానే ఉందిరా వెంకటయ్యా! ఏది నిజమో తెలవడంలా. ఏం చేద్దామన్నది పాలుపోవడం లేదు. చూద్దాం! వీళ్లేం చెబుతారో’’ సర్ది చెప్పాడు పెద్దయ్య. ఊరికి వచ్చిన వాళ్లు జ్వరంతో మంచం పట్టిన ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడుతున్నారు. పదిమందికి పైగా వాళ్లు చూసింది చెప్పారు. ఒక్కో ప్రశ్న సంధిస్తే స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు. అందరి మాటల్లో కామన్‌గా ఉన్నది మాత్రం శ్మశానంలో మంట ఒక్కటే. అదెలా వస్తుందో చెప్పారు. ఊరంతా సమాధానపడే వరకు శాస్త్రీయంగా వివరించారు. అంతా విన్న తర్వాత ఒక కుర్రాడు లేచి ‘‘చెప్పడానికి మేమూ చెప్తాం. రాత్రి ఆ దారెంట మీరు నడిచి చూడండి, మీకు జ్వరం రాకపోతే మీరు చెప్పింది నమ్ముతాం’’ సవాల్ విసిరాడు. ‘‘ఆ హేతువాదులు ఎక్కడా వెనకగుడు వేయలేదు చూడయ్యా! మీ ఊళ్లో దెయ్యం ఉంటే మాకేంటి, మీ చావు మీరు చావండని వెళ్లిపోయుంటే ఈ రోజు ఇంకా కొరివి దెయ్యం పట్టకుండా ఉండడానికి అంత్రాలు కట్టించుకుంటూ, భూతవైద్యులకు వేలకు వేలు సమర్పించుకుంటూ ఉండేవాళ్లం’’ అన్నది కమలమ్మ. ఆమె మాటల్లో అజ్ఞానం చీకటి వదిలిన ధైర్యం. విజ్ఞానం వెలుగు దారి చూపిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతున్నాయి. అరవదెయ్యం పుకారు! ఆ ఊరికి చెందిన ఒక కుటుంబం తమిళనాడుకి వలసవెళ్లింది. కొన్నేళ్ల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చింది. వారిలో ఒకావిడ అనారోగ్యంతో మరణించింది. ఆమెను తమిళనాడులో దెయ్య పట్టుకుందని, ఆమె పోయాక కొరివి దెయ్యమై ఊళ్లో వాళ్లను భయపెడుతోందని పుకారు పుట్టింది. ఇది పూర్తిగా భయం నుంచి మొదలైన అపోహ మాత్రమే. ఆ కుటుంబం పట్ల ఎవరికీ కక్షలు, కార్పణ్యాలు లేవు. భయమే దెయ్యం... ఇది మూడేళ్ల కిందట ఖమ్మం జిల్లా మణుగూరు మండలం, పాతర్లపాడు గ్రామంలో జరిగింది. ఆ కుర్రాడు సవాల్ చేశాడు. కానీ ఊళ్లో అందరి ఉద్దేశం అదే. అతడిని ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదు. మా వివరణతో పూర్తిగా కన్విన్స్ కాలేకపోతున్నారనిపించింది. శ్మశానానికి మేమూ వస్తాం అని సవాల్‌ను స్వీకరించాం. ఆ రాత్రి అక్కడే ఉండి శ్మశానానికి వెళ్లాం. మంటలు ఎందుకు వస్తున్నాయో వివరిస్తూ ప్రాక్టికల్‌గా చూపించాం. ఇక వాళ్లను ఎవరో వెంబడిస్తున్నారనే భ్రాంతికి కారణం వాళ్ల పాదాల చప్పుడే. రాత్రిళ్లు నిశ్శబ్ద వాతావరణంలో తమ చెప్పుల చప్పుడు కొద్ది క్షణాల తర్వాత ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దెయ్యం వెంబడిస్తోందని భయపడతారు. వెనక్కి చూడడానికీ భయమేయమడంతో వెనుక ఏమీ లేదని తెలిసే అవకాశం ఉండదు. - అలవాల నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక, రాష్ట్ర కోశాధికారి శ్మశానంలో మంటలు! శవాన్ని దహనం చేసిన తర్వాత కూడా కొన్ని ఎముకలు మిగిలే ఉంటాయి. ఎముకల్లో క్యాల్షియంతోపాటు భాస్వరం కూడా ఉంటుంది. కాలి బూడిదవుతూ ఒక్కొక్క పొర గాలికి ఎగిరి పోతూ ఉంటుంది. లోపలి పొరల్లో భాస్వరం గాలిలోని ఆక్సిజెన్‌తో సమ్మేళనమై మండుతూ ఉంటుంది. పగలు కూడా ఇదే రసాయన చర్య జరుగుతుంటుంది. కానీ పగలు వెలుతురులో మంటలు దూరానికి కనిపించవు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చడమైంది -
శ్మశానవాటికలో శవాల కలకలం
విచారణ చేపట్టిన పోలీసులు జవహర్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి రెండు మృతదేహాలను స్థానికంగా పూడ్చిపెట్టడం కలకలం లేపింది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం కారులో వచ్చిన నలుగురు రెండు శవాలను జవహర్‌నగర్‌లోని అరుంధతినగర్ శ్మశానవాటికలో పూడ్చి వెళ్లారు. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకన్న శ్మశాన వాటికకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శవాలను తీసుకువచ్చిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. కీసర మండలం నాగారంలో గల మెర్సి హార్వెస్టిం గ్ మిషన్ సొసైటీ వృద్ధాశ్రమంలోని ఇద్దరు అనాథ వృద్ధులు జోసఫ్ (75), రాజు (69) బుధవారం రాత్రి చనిపోగా వృద్ధాశ్రమం వారే రెండు మృతదేహాలను తీసుకువచ్చి పూడ్చిపెట్టారని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
శ్మశానంపై పెత్తనం
► ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం ► శవం పూడ్చాలంటే అనుమతి పొందాలంటూ హుకుం ► బాపురంలో బరితెగించిన తెలుగు తమ్ముడు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ ఎంపికచేసుకున్న హాలహర్వి పంచాయతీ అది. దాని మజరా గ్రామమే హెచ్ బాపురం. ఆ గ్రామంలో ఎవరు మృతి చెందినా టీడీపీ నాయకుడి కుటుంబం అనుమతితోనే శ్మశానంలో పూడ్చుకోవాలి. వారు కాదంటే ఎవరి ఇంటిముందు వారు పూడ్చుకోవాల్సిందే. ఏకంగా శ్మశానాన్నే కబ్జాచేసేశాడు ఆ ఘనుడు..! - ఎమ్మిగనూరు నందవరం మండలంలోని హాలహర్వి గ్రామ పంచాయతీ మజరా గ్రామం హెచ్.బాపురం. తరతరాలుగా ఆ గ్రామప్రజలకు శ్మశానవాటికగా గ్రామకంఠం బావిగడ్డ ఉపయోగపడుతోంది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రామ టీడీపీ నాయకుడు కిష్టప్ప కుటుంబం.. శవరాజకీయాలకు తెరలేపింది. బావిగడ్డ ప్రాంతం తమ పూర్వీకులదనీ, అక్కడ ఎవరైనా శవాన్ని పూడ్చాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ హుకూం జారీ చేశారు. శ్మశానంలో ఉన్న కంపచెట్లను తాము తప్ప ఎవరూ కొట్టుకోరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు కూడా. మూడు రోజుల క్రితం శుక్రవారం అదే గ్రామానికి చెందిన తెలుగు జయమ్మ(57)మృతి చెందింది. బంధువుల సమక్షంలో ఆమెను ఖననం చేయడానికీ కుటుంబసభ్యులు శ్మశానవాటికకు వెళ్లారు. తీరా అక్కడ తవ్విన గుంతవద్ద టీడీపీ నాయకుడు కిష్టన్న కుటుంబసభ్యులు ఖననాన్ని అడ్డుకొన్నారు. తమకు తెలపకుండా శవం ఎట్లా పూడ్చుతారంటూ వాదనకు దిగారు. గుంతను తవ్వే వారిపై దాడికి దిగడంతో శోక తప్త హృదయాలతో అక్కడివారంతా నిశ్చేష్టులయ్యారు. శ్మశానం దగ్గర గొడవలెందుకనీ చివరకు జయమ్మను తమ ఇంటిముందే పూడ్చుకొని అంత్యక్రియలు జరుపుకొన్నారు. వివిధ గ్రామాల నుంచీ ఖననానికి వచ్చిన వారంతా ఇదెక్కడి ఆచారం.. ఇదేమీ అధికారం.. కాటికాపరులకంటే కఠినంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ శాపనార్థాలు పెట్టడడం గమనార్హం. ఇది దుర్మార్గం శత్రువైనా చనిపోయిన తరువాత అయ్యో పాపం అంటూ సానుభూతి చూపుతాం. కానీ చచ్చిన శవాలమీద రాజకీయాలు చేసి పైశాచిక ఆనందం పొందటం టీడీపీ నాయకులకే చెల్లింది. అధికారంలో ఉన్నామనీ కిష్టప్ప కుటుంబం విర్రవీగుతోంది. మా ముత్తాతల కాలం నుంచీ ఎవరు చచ్చినా బావిగడ్డ దగ్గరే పూడ్చుతాం. తవ్విన గుంతలో శవాన్ని పూడ్చకుండా అడ్డుకోవటం బాధాకరం. శవం పూడ్చాలంటే వీళ్ల అనుమతీ తీసుకోవాలా..ఇదేమీ ఊరు? - వెంకటమ్మ, మృతురాలి ఆడపడుచు మా అనుమతి తీసుకోవాల్సిందే బావిగడ్డ శ్మశానంలో శవాలను పూడ్చాలంటే మా అనుమతి తీసుకోవాల్సిందే. జయమ్మ కుటుంబం అడక్కుండానే గుంత తవ్వడంతో మా వాళ్లు అడ్డుకొన్నారు. ఎవరు చచ్చినా పూడ్చాలంటే అనుమతి తీసుకోవాల్సిందే. - కిష్టప్ప, టీడీపీ నాయకుడు శ్మశానానికి స్థలం కేటాయించాలి చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 ఎకరాలు శ్మశానం కోసం ఇచ్చారు. గ్రామానికి దూరంగా ఉండటంతో గ్రామస్తులంతా బావిగడ్డ వద్దే శవాలను పూడుస్తున్నారు. బావిగడ్డ శ్మశానానికి దగ్గరలో ప్రభుత్వం స్థలం కేటాయించాలి. - ఎంకన్న,గ్రామస్తుడు -
పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుని
యువకుడి ఆత్మహత్య అడ్డగుట్ట: పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయిన ఓ యువకుడు మారేడుపల్లిలోని స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..వెస్ట్ మారేడుపల్లికి చెందిన మహేష్‌గౌడ్(22) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న రేతిఫైల్ బస్టాండ్ వద్ద ఒక ఆటోలో సీటు కింద ఉన్న రూ. 20 వేలను తన స్నేహితుడు ఆజామ్‌తో కలిసి దొంగలించాడు. దీనిపై ఆటో యజమాని సుందర్‌ప్రసాద్ గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా మహేష్, ఆజామ్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. శుక్రవారం రాత్రి స్టేషన్నుంచి పారిపోయిన మహేశ్ అర్థరాత్రి మారేడుపల్లిలోని స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థాని కులు గుర్తించి తుకారాంగేట్ పోలీసులకు సమాచారం అందించగా మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనతంరం మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. గోపాలపురం పోలీసుల వేధింపుల కారణంగానే మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. -
స్మశాన వాటిక కబ్జా
- దళితుల ఆందోళన జహీరాబాద్ టౌన్: తమకు ప్రభుత్వం ఇచ్చిన స్మశాన వాటిక స్థలం కబ్జా అవుతోందంటూ గ్రామస్తులు ధర్నాకు పూనుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని బుర్దిపాడ్ గ్రామంలోని దళితులకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మూడెకరాల స్థలాన్ని సర్వే నంబర్ 83లో స్మశాన వాటిక కోసం కేటాయించింది. అయితే, ఈ స్థలం ఆనుకుని ఉన్న రైతులు దానిని కొద్దికొద్దిగా కలుపుకుంటున్నారు. దీనిపై దళితులంతా కలసి శుక్రవారం మధ్యాహ్నం జహీరాబాద్‌కు తరలివచ్చారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. స్మశాన వాటికను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి ఇస్తామని డిప్యూటీ తహశీల్దార్ దశరథ్ హామీ ఇచ్చారు. సోమవారం తహశీల్దార్ అనిల్, ఆర్ఐ. షఫీ, సర్వేయర్లు గ్రామానికి వస్తారని తెలపటంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. -
సమాధుల చెంతనే హాయిగా పడుకోవచ్చు!
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో చైనా కమ్యూనిటికి సుందరమైన సమాధులున్నాయి. వీధి వీధంతా ఎప్పుడూ సమాధులతో కళకళలాడుతుంటుంది. తమ అప్తులను సమాధి చేసిన కుటుంబాలు తరచుగా అక్కడికెళ్లి సమాధులను సందర్శించడమే కాకుండా కొన్ని రోజుల పాటు సమాధుల చెంతనే నివసించి పిల్లా పాపలతో సేదదీరుతుంటారు. అందుకు వారికి కావాల్సిన ఏసీ బెడ్ రూమ్‌లు, విశాలమైన హాళ్లు, అటాచ్డ్ కిచెన్లు, బాతురూమ్‌లు ఉన్నాయి. పోయిన వారిని తలుచుకుంటూ ఉన్నవారు అక్కడ ఆనందంగా గడిపేయవచ్చు. అందుకనే ఆ టూంబ్స్కు ‘ది బెవర్లీ హిల్స్ ఆఫ్ ది డెడ్’ అని నిక్ నేమ్ కూడా వచ్చింది. ఈ మధ్య సందర్శకుల తాకిడీ కూడా పెరగడంతో వారి సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వేడి వేడి వంటకాలను వడ్డించే ఏసీ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ స్పానిష్ ఆక్రమణలో ఉన్నప్పుడు కేథలిక్ శ్మశానాలకు చైనీయులను రాణించేవారు కాదు. దాంతో సంపన్న వర్గానికి చెందిన చైనీయులు పోయిన తమ వారి కోసం ఇలా కళావైభవం ఉట్టిపడేలా సమాధులను నిర్మించారు. ప్రాచీన వాస్తుకు ఆధునిక హంగులను జోడించడంతో టూంబ్స్ కాస్త సందర్శనీయ స్థలాలుగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా చనిపోయిన చైనా నాయకులను కూడా ఇక్కడే సమాధి చేశారట. అందుకని గత చరిత్రపట్ల ఆసక్తిగల పర్యాటకులు కూడా వస్తున్నారు. కానీ వారు ఇందులో నివసించడానికి వీల్లేదు. సమాధులున్న కుటుంబాలకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది. బతికున్న వారికే ఉండడానికి ఇల్లులేక చస్తుంటే చచ్చిన వారికి ఇంత సుందరమైన సమాధులు ఎందుకో! అంటూ పర్యాటకులు చేసే కామెంట్లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయి. ఇదేమైనా ఈ ప్రాంతంలో సమాధులకు డిమాండ్ విపరీతంగా పెరిగిన దృష్ట్యా టూంబ్స్ ప్రాంతాన్ని విస్తరించాలని మనీలా నగర పాలిక సంస్థ ఇప్పుడు నిర్ణయించింది. -
గ్రామాల మధ్య చిచ్చుపెట్టిన శ్మశానం
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల శివారులో ఉన్న శ్మశాన వాటిక రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. శ్మశానానికి చెందిన భూమి విషయంలో వివాదం తీవ్ర రూపం దాల్చింది. శ్మశాన వాటికకు ఇచ్చిన స్థలం తమ గ్రామానికి చెందిందని మోతే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో జగిత్యాల- మోతే గ్రామస్థుల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో గురువారం రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం శ్మశాన వాటికలో సమావేశమయ్యారు. చర్చల మధ్యలో ఇరు వర్గాలు దూషణలకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్మశానం పరిధిలో మోతే గ్రామస్తులు తవ్విన బావిని జగిత్యాల వాసులు పూడ్చేయడంతో వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఎవరిదీ.. 'పాపం'
నవమసాలు మోసి పండంటి ఆడ బిడ్డను జన్మనిచ్చిన ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం వచ్చిందా.. లేక ఆడపిల్ల పుటి ్టందనే వివక్షతో వదిలేసిందో తెలియదుకాని పుట్టిన గంటకే ఆ చిన్నారిని శ్మశానికి చేర్చి వెళ్లిపోయింది. సమాదుల మధ్య అమ్మకోసం పరితపించిన పసికందు ఏడుపు విన్న కొందరు మహిళలు అక్కున చేర్చుకొని ప్రాణాలు నిలబెట్టారు. రక్తబంధం విలువలు దిగజార్చేలా చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలోని వెంకిర్యాల గ్రామంలో వెలుగుచూసింది. - బీబీనగర్ రోజులాగే వెంకిర్యాల గ్రామస్తులు శుక్రవారం ఎవరిపనుల్లో వారున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా రైతులు పొలాలకు, కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వెంకిర్యాల గ్రామం నుంచి రాఘవాపురం వెళ్లే రహదారిపై ఉన్న శ్మశానవాటిక దారిలో పనులకు వెళ్తున్న ఉపాధి కూలీలకు చిన్నారి ఏడుపులు వినిపించాయి. శ్మశానం నుంచి ఏడుపులు రావడంతో ముందుగా భయపడిన వారు తర్వాత ధైర్యంచేసి లోనికి వెళ్లారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో కట్టి సమాధుల వద్ద పడేశారు. చిన్నారి ఊపిరాడక కాళ్లూచేతులు కొట్టుకోవడంతో కవర్ముడి విడిపోయింది. కవరు తెరుచుకోవడంతో పసికందు ఎడువడం వినిపించడం, శ్వాస ఆడడంతో ప్రాణాలతో బయటపడింది. ఏడుపుల శబ్ధం పెరగడంతో బిడ్డకోసం వెతికిన మహిళలకు రక్తంలో తడిసి విలపిస్తున్న చిన్నారి ఎట్టకేలకు కనిపించింది. నివ్వెరపోయిన వారు వెంటనే అక్కున చేర్చుకొని గ్రామంలోకి తీసుకొచ్చారు. స్థానికుల పనేనా? జన్మించిన అరగంట వ్యవధిలోనే ఆడ శిశువును వదిలేసి వెళ్లడంతో ఇది ముమ్మాటికీ స్థానికుల పనేనని అందరూ అనుమానిస్తున్నారు. పడేసిన కాసేపటికే విషయం బయటపడటంతో ఈ దారుణానికి ఒడిగట్టిందెవరని ఆరా తీస్తున్నారు. పసికందును వేసి ఉన్న కవర్లో డెలివరీకి వాడిన బ్లౌస్‌లు ఉండడంపై ఆర్ఎంపీ డాక్టర్లు డెలివరీ చేసి ఉండవచ్చని బీబీనగర్ పీహెచ్సీ వైద్యాధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత పసికందును చేరదీసిన గ్రామ మహిళలు స్థానిక నాయకుల సహకారంతో ఓ పాఠశాలకు చెందిన బస్సులో బీబీనగర్ పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వెంటనే వైద్య సిబ్బంది శిశువును శుభ్రం చేసి చికిత్స చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలు ఆసుపత్రికి చెరుకొని జరిగిన విషయం తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పీహెచ్‌సీకి చెరుకొని పసికందును నల్లగొండలోని శిశు సంక్షేమ గ ృహానికి తీసుకెళ్లారు. -
లక్కీ రెస్టారెంట్!
సమ్‌థింగ్ స్పెషల్ మీరు ఎప్పుడూ బయటికెళ్లినప్పుడు టీ, టిఫిన్ ఎక్కడ కానిస్తారు? ఏ రెస్టారెంట్లోనో, హోటల్లోనో చేస్తారు... మరి ఆ హోటల్ లేదా రెస్టారెంట్లో మీరు కూర్చున్న టేబుళ్ల కింద సమాధులు కనిపిస్తే ఏం చేస్తారు. ఓ పెద్ద కేక వేసి దెబ్బకు ఆ రెస్టారెంట్ యజమాని దగ్గరకు వెళ్లి రెండు చివాట్లు పెట్టి ‘‘నీ రెస్టారెంట్ వద్దు... నీ టీ వద్దు, టిఫిన్ వద్దు అంటారు’’ అంతే కదా..కానీ అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఓ రెస్టారెంట్ గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. ఆ రెస్టారెంట్ పేరు ‘లక్కీ రెస్టారెంట్’. దాని యజమాని కృష్ణన్ కుట్టి నాయర్. అక్కడ కుర్చీల కింద, లోపలికి వెళ్లే దారి పొడుగునా సమాధులే! అది శ్మశానంలోనే కట్టారని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆ రెస్టారెంట్ మొదటి నుంచీ శ్మశానంలో లేదు. 1950లో మహమ్మద్ అనే వ్యక్తికి శ్మశానం బయట ఓ టీ కొట్టు ఉండేది. అతనికి సహాయం చేసే కృష్ణన్ కుట్టి నాయర్ నెమ్మదిగా అతని వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు. వారి వ్యాపారం లాభాల్లో సాగుతూ ఆ స్థలాన్ని విస్తరించడం మొదలు పెట్టారు. అలా వారు కొట్టు విస్తీర్ణం కోసం మెల్లి మెల్లిగా శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అలా ఆ కొట్టు కాస్తా పెద్ద రెస్టారెంట్‌గా మారింది. ఆ ఆకుపచ్చ రంగు సమాధులు కలిసి రావడంతో వాటిని తొలగించలేదు. ప్రస్తుతం ఆ ‘లక్కీ రెస్టారెంట్’ను నడిపిస్తున్న నాయర్‌ను ఆ సమాధుల సంగతి అడిగితే ‘‘ ఈ సమాధులే నాకు అదృష్టాన్ని తెచ్చి పెట్టాయి. ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఎంతో ఆనందంగా వచ్చి టీ, పాలు తాగి, టిఫిన్, భోజనం చేసి వెళ్తుంటారు. ఎంతోమంది నాకు సలహా ఇచ్చారు ఆ సమాధులను తొలగించమని. కానీ నాకు మనసు రాలేదు. ఎందుకంటే అవే నా బిజినెస్‌కు లక్కీ అని నేను భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు నాయర్. కొందరు ఆ రెస్టారెంట్‌కు టీ తాగడానికి వచ్చి తమ బంధువుల సమాధి చూసి వెళ్తుంటారు. ఆ రెస్టారెంట్లో ఎవరెవరి సమాధులున్నాయో కూడా కృష్ణన్ కుట్టి నాయర్‌కు తెలీదు. అందులో 16వ శతాబ్దానికి చెందిన సుఫీ మహర్షి సమాధి కూడా ఉందని అక్కడి ప్రజల నమ్మకం. ప్రతిరోజూ ఉదయం నాయర్ నిద్రలేవగానే ఆ సమాధులను తుడిచి వాటిపై కప్పిన బట్టను మార్చి డెకరేట్ చేస్తాడు. కస్టమర్లు పెరగడంతో రూములు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నా సరే, ఏనాడూ వాటిని తొలగించాలని అనుకోలేదు నాయర్. ఆ రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. -
శ్మశానానికి తరలిపోతున్న చెట్లు
విశ్లేషణ ⇒అవినీతిని నిలదీసే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం ఇచ్చింది. పెద్ద ⇒అవినీతి కుంభకోణాలను మాత్రమే మీడియా పట్టించుకుంటుంది. కాని ⇒కొన్ని లక్షల సంఖ్యలో చిన్న స్థాయి అవినీతి రోజూ జరుగుతూ ఉంటుంది. రాజధాని ఢిల్లీలో గాంధీ పేరున ఒక పెద్ద ప్రదర్శన శాల, గ్రంథాలయం ఉంది. దాని చుట్టూ తోటలు, చెట్లు, పచ్చదనం పుష్కలం. ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ అవి నీతి నరకం, ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ అవినీతి నరకడం ఉంటుంది. భ్రష్టాచా రానికి ఎవరు ఏమిటీ అనే తేడా ఉండదు. నిర్వాహకులు సహకరిస్తే అవినీతి ఎవరి పేరునైనా పరిఢవిల్లుతుంది. జాతీయ గాంధీ ప్రదర్శనశాల ఆవరణలో చెట్లను నరక డం వెనుక అవినీతిని ఒక ఆర్టీఐ మిత్రుడు నిలదీశాడు. డబ్బేమైనా చెట్లకు కాస్త్తుందా అని మనవాళ్లు అంటూ ఉంటారు. చెట్లు నరికితే డబ్బే డబ్బు అని ఈ ఆర్టీఐ కథ నిరూపించింది. జీఎల్ వర్మ తరచూ గాంధీ గ్రంథాల యానికి వెళ్తూ ఉంటారు. ఓ రోజు 25 చెట్లు కుప్పకూలి పోవడం చూసి ఆశ్చర్యపోయాడు. తుపాను, గాలి వాన కాదు, డబ్బు గొడ్డలి దెబ్బకు కూలిపోయాయి. మ్యూజి యం వెనుక కూడా కొన్ని చెట్లు కూల్చారు. కూలే ప్రమా దం లేనపుడు చెట్లను కూకటివేళ్లతో సహా కూల్చవలసిన అవసరం ఏమిటి? ఈ మ్యూజియం నిర్వహణ బాధ్యత తీసుకున్న ఎన్జీఓకు అప్పగించారు వారే చెట్లు కూల్చా రని అందుకు కారణాలు, ఏ చర్యలు తీసుకున్నారో, చెట్లు కూల్చడానికి అనుమతుల వివరాలు ఇవ్వాలని అడిగారు. మామూలుగానే ఇటువంటి ప్రశ్నలకు జవా బు ఇవ్వరు. ఇవ్వలేదు. మొదటి అప్పీలులో అధికారి ఇచ్చి తీరాలని ఆదేశించారు. అయినా ఇవ్వకపోవడం పీఐఓలకు అలవాటైంది. పెరిగిపోయిన చెట్లను సమంగా కత్తిరించడానికి ఉన్న అనుమతిని చెట్లను పూర్తిగా నరికివేయడానికి వాడుతున్నారు. 2013లో గాంధీ మ్యూజియం నుంచి 67 చెట్లు శ్మశానాలకు తరలిపోయాయి. సమంగా కత్తి రించే అనుమతి ఇవ్వడానికి కొన్ని షరతులు ఉన్నాయి. కత్తిరించే ముందు, తరువాత చెట్లను ఫొటో తీయాలి. తీయలేదు. కత్తిరించిన కొమ్మలను పుల్లలను శ్మశానా లకు విక్రయించే అవకాశం ఉంది. సత్ నగర్ అనే శ్మశా నంలో ఆ పుల్లలను అమ్మినట్టుగా దొంగ రశీదులు తయారు చేశారని వర్మ అనుమానిస్త్తున్నారు. నిజంగా మామూలు పుల్లలే అయితే దగ్గరలో ఉన్న ఏ శ్మశాన వాటిక నిర్వాహకులైనా తీసుకునేవారు. దగ్గరలో రెండు చోట్ల అటువంటి రశీదులు ఇవ్వడానికి నిర్వాహకులు అంగీకరించకపోవడం వల్ల చాలా దూరం వెళ్లి రశీదులు సంపాదించారని. అంటే చెట్లు ఎక్కడో అమ్మేసి శ్మశా నాల్లో అమ్మినట్టు రికార్డు తయారు చేసి ఉంటారని దర ఖాస్తుదారు వర్మ ఆరోపించారు. కనుక ఆ పనులకు సం బంధించిన అన్ని కాగితాలు రశీదులు అనుమతులు ఫొటోల ప్రతులు ఇవ్వాలని, అందుకు కాపీ తయారు చేసే ఖర్చు భరిస్తానని వర్మ వాదించారు. అవినీతి బయ టపడుతుందనే భయంతో ఏవో సాకులతో జవాబులు ఇవ్వడం లేదని, కావలసిన కాగితాల ధృవపత్రాలు ఇవ్వ డం లేదని వర్మ కమిషన్‌కు వివరించారు. నాలుగు నెలల కాలహరణం తరువాత ఇచ్చిన సమాచారం అసం పూర్ణం అనీ, ఇంకా ఎంతో దాచారని, ఇచ్చిన సమాచా రం కూడా తప్పుల తడకలుగా ఉందని ఆయన వాదిం చారు. చెట్లు నరికి, తరలించి అమ్మివేయడంలో కొందరు అటవీ సంరక్షణాధికారుల హస్తం కూడా ఉందని ఆయ న అన్నారు. ఉప అటవీ సంరక్షణాధికారి ఈ చెట్లను నర కడానికి ముందు తరువాత కూడా ఇక్కడికి వచ్చి చూశా రు. అంటే ఖచ్చితంగా వారి హస్తం కూడా ఉన్నట్టే అని ఆయన వివరించారు. ఉద్యానవనం మధ్య ఉన్న మ్యూజియం నిర్వహణలో ఇటువంటి అక్రమ లాభాల ను పొందే అవకాశాలున్నాయి. ఒక్క చెట్టు విలువ కనీ సం 28 వేల రూపాయలు ఉంటుందని, మొత్తం 19 లక్షల రూపాయల దాకా అక్రమార్జన ఉండి ఉంటుందని ఆయన అనుమానం. ఇంతే కాదు 2012లో కూడా ఈ విధంగానే చెట్లు నరికారని కనీసం ఐదు లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపైన ఓపీ నారంగ్ అనే అధికారి విచారణ జరిపారు. ఎస్ఎస్ రహేజా అనే అధికారి చెట్లు నరికినా, వాటిని బయటకు తరలించినా మౌనంగా ఉన్నారంటే దానికి కారణం స్వప్రయోజనాలే అనే అనుమానం వస్తుందని నారంగ్ తమ నివేదికలో వివరించారు. వర్మ అడిగిన మొత్తం సమాచారం ఇవ్వాలని, కోరిన కాగితాల ధృవీకరించిన ప్రతులను కూడా ఇవ్వా లని రెండో అప్పీలులో సమాచార కమిషనర్‌గా ఆదేశిం చవలసివచ్చింది. మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా సమాచారం ఇవ్వకపోవడం ద్వారా సమాచార హక్కును భంగపరిచారని, అసమగ్ర సమాచారం తప్పుడు సమా చారం ఇచ్చారని, అందుకు సెక్షన్ 20 కింద జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. అవినీతిని నిలదీసే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం ఇచ్చింది. పెద్ద అవినీతి కుంభకోణాలను మాత్ర మే మీడియా పట్టించుకుంటుంది. కాని కొన్ని లక్షల సం ఖ్యలో చిన్న స్థాయి అవినీతి రోజూ జరుగుతూ ఉంటుం ది. దీన్ని ఏసీబీ కూడా పట్టించుకోదు. బ్లాక్ మెయిల్ చేసుకుని బతికే వారికి తప్ప పత్రికలకు ఈ విషయం పట్టదే. పెద్ద కుంభకోణాలు పెద్ద నేరాలు, వీఐపీ లంచా లకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇవ్వకపోవడం వల్ల ఆర్టీఐ ఒక్కటే దిక్కు. మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com. -
శ్మశాన వాటిక విషయంలో గొడవ : పరిస్థితి ఉద్రిక్తం
ప్రకాశం : మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటిక లేకపోవడంతో.. ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నించగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొండెపి మండలం అనకర్లపుడి గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనకర్లపుడి గ్రామానికి చెందిన పి.శ్రీను(40) వెలుగులో ఔట్సోర్సింగ్ కార్మికునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో సంప్రదాయబద్ధంగా ఖననం చేయడానికి అతని కుటుంబ సభ్యులు గురువారం ఏర్పాట్లు చేశారు. కానీ గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో ఎక్కడ పూడ్చాలో తెలియక ఇంటి సమీపంలోనే పూడ్చడానికి ప్రయత్నాలు చేయడంతో.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్మశానవాటికే వారి నివాసం!
చనిపోరుున భర్త.. రానివ్వని అద్దింటి వారు.. ఇద్దరు పిల్లలతో తల్లి సమాధుల వద్ద ఆవాసం వరంగల్ నగర పరిధిలోని కరీమాబాద్‌లో ఘటన కరీమాబాద్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో బిజ్జ ముకుందం, ఆయన భార్య శారద, కుమారుడు హర్షిత్, కూతురు మానసతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమం లో ముకుందం(32) ఆర్థిక ఇబ్బందులతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దె ఇంటివారు మృతదేహాన్ని మా ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. చేసేది లేక భర్త మృతదేహాన్ని శారద పోస్టుమార్టం నుంచి నేరుగా తోట్లవాడలోని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించింది. ఆ తర్వాత శారద తన ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక శ్మశానవాటిక వద్ద గోడ నీడకు రెండు రోజులుగా ఉంది. పగలు ఎండకు, రాత్రి దోమలు, దుర్వాసన భరిస్తూ గడిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు శ్మశానవాటిక పక్కన ఓ చిన్న రేకుల షెడ్డు వేరుుంచడంతో అక్కడే ఉన్నారు. కాగా, అద్దింటివారు పది రోజుల తర్వాత రావొచ్చని చెప్పారని శారద తెలిపింది. -
లోహ విహంగాల మరుభూమి!
వరుసగా నిలబడి హొయలు పోతూ ర్యాంప్‌వాక్‌కు సిద్ధమైన మోడళ్లలా కనిపిస్తున్నాయి కదూ ఈ విమానాలు..! ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విమానాల శ్మశాన వాటిక..! అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో బోన్‌యార్డ్ అమెరికా రక్షణ రంగంలో ఎన్నో సేవలందించి కాలం చెల్లిపోయిన యుద్ధవిమాలను ఇక్కడికి చేరుస్తారు. ఇది దాదాపు 2,600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఏ10 థండర్ బోల్ట్‌లు, హెర్క్యులెస్ ఫ్రైటర్స్, ఎఫ్-14 టామ్‌క్యాట్ ఫైటర్స్ వంటి గొప్ప విమానాలు ఇక్కడకు చేరుకున్నాయి. వీటి విలువ మొత్తం దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పైమాటే. కొన్నింటికి మరమ్మతులు చేసి మళ్లీ ఎగిరేలా చేస్తారు. కొన్నింటి విడి భాగాలను కొత్తగా తయారు చేసే విమానాలకు అమర్చి తయారీ ఖర్చును తగ్గించుకుంటారు. -
శ్మశానంలో పసికందు
సిద్దిపేట: అప్పుడే పుట్టిన పసికందును శ్మశానంలో వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం చోటుచేసుకుంది. ఉదయం కోమటి చెరువు పక్క నుంచి స్థానికుడు తోడెంగల కృష్ణ (26) వెళుతుండగా.. శ్మశానంలో ఒక మూల నుంచి ఏడుపు వినిపించింది. దగ్గరకెళ్లి పరిశీలించగా ఓ శిశువు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. వెంటనే శిశువును 108 లో సిద్దిపేట మాతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించి అత్యవసర చికిత్సలను చేపట్టడంతో ప్రాణాపాయం తప్పింది. ఐసీడీఎస్ అధికారులు సంగారెడ్డిలోని శిశు వివాహార్కు తరలించారు. -
కన్నుమూసిన వారినీ కనికరించలేదు
పిఠాపురం: పచ్చటి బతుకులను కకావికలం చేసిన హుదూద్ తుపాను చివరికి కంకాళాల్నీ విడిచి పెట్టలేదు. రెచ్చిపోయిన ఆబోతులా.. నేలను పెళ్లగించి సమాధుల్లోని అస్థిపంజరాల్నీ పెకలించింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటలో ు ప్రత్యేకంగా శ్మశానం లేకపోవడంతో సముద్రతీరానికి సమీపంలోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. తుపాను ప్రభావంతో కడలి విరుచుకుపడడంతో పలు సమాధులు కొట్టుకుపోయి కంకాళాలు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం భీతావహంగా ఉంది. అయినవారి అవశేషాలు ఇలా దిక్కులేనివిగా చెల్లాచెదురు కావడాన్ని చూసి గ్రామస్తులు వేదనకు గురవుతున్నారు. -
ఆధునిక హంగులతో స్మశాన వాటికలు
-
వల్లకాట్లో కొత్త సంవత్సరం..!
లండన్: కొత్త ఆశలు, ఆశయాలతో మొదలయ్యే న్యూ ఇయర్ సంబరాలను బంధుమిత్రులతో కలసి ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటి శుభ వేడుకను ‘ఊరంతా ఒకదారి, ఉలిపికట్టెది మరొకదారి’ అన్నట్లు వల్లకాట్లో జరుపుకుంటే? వింతల్లో వింతేగా మరి. అందుకే ఈ ఉల్టా వ్యవహారం ప్రపంచ వింత ఆచారాల జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. బాదూ అనే సోషల్ వెబ్సైట్ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ జాబితాను రూపొందించింది. చిలీ మధ్యభాగంలోని తాల్కా నగర ప్రజలు జనవరి 1న శ్మశానంలోకి వెళ్లి, చచ్చిపోయిన తమ బంధుమిత్రుల సమాధుల మధ్య తిష్టవేసి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. బాదూ సర్వేలో పాల్గొన్న నెటిజన్లు ఈ వింతకు విస్తుబోయి అందలమెక్కించారు. 18 దేశాల ఆచారాలపై నవంబర్, డిసెంబర్లలో నిర్వహించిన ఈ సర్వేలో దేశానికి 400 మంది చొప్పున 7,500 మంది పాల్గొన్నారు. టాప్ 10లో నిలిచిన వింత ఆచారాల్లో మిగతా తొమ్మిది వరుసగా.. జంతువుల ‘మాటలు’ వినేందుకు ప్రయత్నించడం. మాటలు అర్థం కాకపోతే శుభసూచకమట(రుమేనియా) దుష్టశక్తులను తరిమికొట్టేందుకు బ్రెడ్లను గోడలకేసి కొట్టడం(ఐర్లాండ్) కిటికీలోంచి బల్లలు, కుర్చీలు బయటకు విసిరేయడం(జొహన్నెస్‌బర్గ్-దక్షిణాఫ్రికా) చెట్టును చేతిలో ఉంచుకుని గడ్డకట్టిన సరస్సులోకి డైవింగ్ చేయడం(సైబీరియా) కిక్కిరిసిన జనం మధ్యలోకి పైనుంచి పోజం (పిల్లిజాతి జంతువు)ను జారవిడవడం(అమెరికా) పాత కక్షలను పిడిగుద్దులతో తీర్చుకోవడం(పెరూ) అగ్నిగోళాల(ఫైర్‌బాల్స్) మధ్య వీధిలో పరిగెత్తడం(స్కాట్లాండ్) ఒంటరిగా భోంచేయడాన్ని చిత్రించిన పాత బ్రిటిష్ టీవీ కామెడీ షోను చూడడం(జర్మనీ) వాటర్ బెలూన్లు, బకెట్లతో మూడు రోజులపాటు ‘వాటర్ ఫైట్’ చేసుకోవడం (థాయ్‌లాండ్). -
ఐస్‌క్రీంలకూ శ్మశానవాటిక..
నిజమే.. బ్రిటన్‌లోని వెర్మాంట్‌లో ఐస్క్రీంల కోసం ప్రత్యేకంగా ఓ శ్మశానవాటిక ఉంది. ఈ ఊర్లో బెన్ అండ్ జె ర్రీ ఐస్‌క్రీం చాలా ఫేమస్. ఈ కంపెనీయే వీటి కోసం ఈ శ్మశానవాటికను కట్టించింది. ఐస్క్రీంలలో ఎన్నో రుచులు ఉంటాయి. ఉదాహరణకు చాక్లెట్, వెనీలా వంటివి. కొత్త ఫ్లేవర్స్ వచ్చినప్పుడు పాత ఫ్లేవర్లు తెరమరుగైపోతాయి. ఒక్కోసారి వినియోగదారుల నుంచి డిమాండ్ లేకున్నా.. వాటిని తయారుచేయడం మానేస్తారు. ఈ లెక్కన సదరు కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 200 ఫ్లేవర్స్ తయారీ పలు కారణాలతో ఆపేశారు. దీంతో ‘చనిపోయిన’ ఆయా రుచుల ఐస్క్రీంల గౌరవార్థం ఈ శ్మశానవాటికను కట్టించారు. ‘నచ్చని’ వంట వడ్డిస్తారు.. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే..మనకు నచ్చిన వంటకాలు వడ్డిస్తారు. కానీ ఈ రెస్టారెంట్లో అమెరికాకు ‘నచ్చని’ దేశాల వంటకాలు మాత్రమే వడ్డిస్తారు! అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఉన్న ఈ ‘కాన్ఫ్లిక్ట్ కిచెన్’ రెస్టారెంట్లో(పార్శిల్ సర్వీస్) ఆ దేశానికి శత్రుత్వం లేదా ఘర్షణ ఉన్న దేశాల వంటకాలు మాత్రమే తయారవుతాయి. అంటే ఇరాన్, ఉత్తర కొరియా, వెనిజులా వంటివన్నమాట. అంతేకాదు.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు అమెరికాకు ఆ దేశంతో ఉన్న ఘర్షణకు సంబంధించిన చరిత్రనూ వీరు తెలియజేస్తారు.