
సమాధుల చెంతనే హాయిగా పడుకోవచ్చు!
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో చైనా కమ్యూనిటికి సుందరమైన సమాధులున్నాయి. వీధి వీధంతా ఎప్పుడూ సమాధులతో కళకళలాడుతుంటుంది. తమ అప్తులను సమాధి చేసిన కుటుంబాలు తరచుగా అక్కడికెళ్లి సమాధులను సందర్శించడమే కాకుండా కొన్ని రోజుల పాటు సమాధుల చెంతనే నివసించి పిల్లా పాపలతో సేదదీరుతుంటారు.
అందుకు వారికి కావాల్సిన ఏసీ బెడ్ రూమ్‌లు, విశాలమైన హాళ్లు, అటాచ్డ్ కిచెన్లు, బాతురూమ్‌లు ఉన్నాయి. పోయిన వారిని తలుచుకుంటూ ఉన్నవారు అక్కడ ఆనందంగా గడిపేయవచ్చు. అందుకనే ఆ టూంబ్స్‌కు ‘ది బెవర్లీ హిల్స్ ఆఫ్ ది డెడ్’ అని నిక్ నేమ్ కూడా వచ్చింది. ఈ మధ్య సందర్శకుల తాకిడీ కూడా పెరగడంతో వారి సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వేడి వేడి వంటకాలను వడ్డించే ఏసీ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఫిలిప్పీన్స్ స్పానిష్ ఆక్రమణలో ఉన్నప్పుడు కేథలిక్ శ్మశానాలకు చైనీయులను రాణించేవారు కాదు. దాంతో సంపన్న వర్గానికి చెందిన చైనీయులు పోయిన తమ వారి కోసం ఇలా కళావైభవం ఉట్టిపడేలా సమాధులను నిర్మించారు. ప్రాచీన వాస్తుకు ఆధునిక హంగులను జోడించడంతో టూంబ్స్ కాస్త సందర్శనీయ స్థలాలుగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా చనిపోయిన చైనా నాయకులను కూడా ఇక్కడే సమాధి చేశారట. అందుకని గత చరిత్రపట్ల ఆసక్తిగల పర్యాటకులు కూడా వస్తున్నారు. కానీ వారు ఇందులో నివసించడానికి వీల్లేదు. సమాధులున్న కుటుంబాలకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది.
బతికున్న వారికే ఉండడానికి ఇల్లులేక చస్తుంటే చచ్చిన వారికి ఇంత సుందరమైన సమాధులు ఎందుకో! అంటూ పర్యాటకులు చేసే కామెంట్లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయి. ఇదేమైనా ఈ ప్రాంతంలో సమాధులకు డిమాండ్ విపరీతంగా పెరిగిన దృష్ట్యా టూంబ్స్ ప్రాంతాన్ని విస్తరించాలని మనీలా నగర పాలిక సంస్థ ఇప్పుడు నిర్ణయించింది.