విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులే టార్గెట్
వరుస దోపిడీలు,దొంగతనాలతో జనం బెంబేలు
గడిచిన నెలలో 4 ఉదంతాలు నమోదు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత కీలక రహదారుల్లో ఒకటైన జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నం. 65 డేంజర్ మార్గ్‌గా మారిపోయింది. హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న దీనిపై అనునిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ప్రయాణంలో అలసిపోయిన కొందరు రహదారి పక్కన, సర్వీస్ రోడ్లలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ఇలాంటి వారితోపాటు లారీ డ్రైవర్లకు ఎర వేసి దోచుకునే ముఠాలతో ఈ రహదారి యమడేంజర్‌గా మారిపోయింది. గడిచిన నెల రోజుల్లో ఈ తరహాకు చెందిన నాలుగు ఉదంతాలు చోటుచేసుకోగా... నిందితులు ఇప్పటివరకు చిక్కలేదు. వీరి కోసం నల్లగొండ జిల్లా, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ 65పై ఆగే ప్రయాణికులకు పోలీసులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.
గత నెలలో కట్టంగూర్ పరిధిలో
⇒ హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని కట్టంగూర్ సమీపంలో సరీ్వస్ రోడ్డులో వాహనం ఆపి విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి దోచుకున్నారు.
⇒హైవేపై ఉన్న మరో ప్రాంతంలో సెల్‌ఫోన్ తస్కరణకు గురైంది. నిద్రిస్తున్న వ్యక్తికి ఏమాత్రం తెలియకుండా కారు డోర్ తెరిచి ఫోన్ దొంగిలించారు.
ఈ నెలలో నార్కట్‌పల్లి, చిట్యాలలో
⇒ ఏపీ లింగోటం దగ్గర టార్చ్‌లైట్లు వేసి నిల్చున్న ఇద్దరు మహిళల్ని చూసి ఆకర్షితుడైన లారీ డ్రైవర్ ఎల్లేష్ వాహనం ఆపి వారితో మాటలు కలిపాడు. అప్పటివరకు చీకటిలో మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు అదును చూసుకుని అతడిపై విరుచుకుపడ్డారు. కాళ్లు, చేతులు కట్టేసి లారీలోని టూల్ బాక్సులో ఉన్న రూ.22 వేల నగదు తీసుకుని నలుగురూ ఉడాయించారు.
⇒ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఓ కుటుంబం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద విశ్రాంతి కోసం ఆగింది. ముసుగులు ధరించి వచి్చన ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు. ఆ శబ్ధానికి నిద్రలేచిన బాధితులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు.
ఎక్కువగా వ్యక్తిగత వాహనాలే...
⇒ ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాల్లో అత్యధికం వ్యక్తిగత వాహనాలైన కార్లు, జీపులు వంటి తేలికపాటివే ఉంటాయి. అటు విజయవాడ, ఇటు హైదరాబాద్‌తోపాటు మధ్యలో ఉన్న కోదాడ, సూర్యాపేట, నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పగటిపూట కంటే రాత్రి వేళల్లోనే ఈ బస్సులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే సమయాభావం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడంతోపాటు అనివార్య కారణాల నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ రెండు నగరాల మధ్య దూరం 277 కిలోమీటర్లే కావడంతో వాహనం నడిపే వాళ్లు అలసిపోవడం అనేది చాలా తక్కువ. హైదరాబాద్, విజయవాడల కంటే దూరమైన ప్రాంతాల నుంచి వీటి మీదుగా ప్రయాణించే వాళ్లు రాత్రి వేళల్లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా రహదారి పక్కన, ట్రక్ లే బైలో, సరీ్వస్ రోడ్లపై నిద్రిస్తున్న వారే దొంగలకు టార్గెట్‌గా మారుతున్నారు.
లైట్ వేశారంటే స్కెచ్ వేసినట్లే..
వాణిజ్య వాహనాలైన లారీలు, ట్రక్కులు తదితరాలు నడిపే వారూ బాధితులుగా మారిన సందర్భాలున్నాయి. అనునిత్యం హైవేలపై సంచరించే వీరికి ఏయే రూట్లలో, ఏయే ప్రాంతాలు సురక్షితం? ఎక్కడ వాహనాలు ఆపుకోవాలి? ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అయితే ఈ కమర్షియల్ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు వారి బలహీనతల కారణంగా దొంగల బారినపడుతున్నారు. కమర్షియల్ వాహనాల డ్రైవర్లు ఉద్యోగనిమిత్తం దీర్ఘకాలం ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటారు.
ఇలాంటి వారిని ఆకర్షించడానికే అనేక ప్రాంతాల్లో హైవే వ్యభిచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ తరహా బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకునే ముఠాలు ఎన్‌హెచ్ 65లో రంగంలోకి దిగాయి. రాత్రివేళల్లో రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రాంతాల్లో నక్కి ఉండే దొంగలు... తమ భాగస్వాములైన మహిళలు టార్చిలైట్లు లేదా సెల్‌ఫోన్ లైట్లు వెలిగించేలా పథకం వేస్తారు. వీటిని చూసి ఆకర్షితులై వచ్చే వాణిజ్య వాహనాల డ్రైవర్లపై దాడి చేసి దోచుకుంటున్నారు.
ఈ లోపాలే ప్రధాన కారణం..
హైవేపై జరుగుతున్న ఉదంతాల్లో అనేకం పోలీసుల వరకు రావట్లేదు. భారీ సొత్తు పోగొట్టుకోవడమో, గాయపడటమో జరిగితేనే ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్తున్నారు. చిన్న చిన్న ఉదంతాలు, బలహీనతల కారణంగా చోటు చేసుకున్నవి బయటకు రావట్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ హైవేపై గస్తీ కోసం ప్రత్యేకంగా వాహనాలు ఉండేవి. ఆపై తేలికపాటి వాహనాల స్థానంలో ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక బృందం చొప్పున విధులు నిర్వర్తించేది.
కొన్నాళ్లు ఈ గస్తీ బృందాలు కనుమరుగయ్యాయి. జాతీయ రహదారి వెంట ఉన్న శాంతిభద్రతల విభాగం ఠాణాలకు చెందిన అధికారులు, సిబ్బందే గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్లలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత నేపథ్యంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ సాధ్యం కావట్లేదు. ఈ హైవేపై వెలిమినేడు వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ, గస్తీ బాధ్యతల్ని వీరికే అప్పగించాలనే ప్రతిపాదన ఏళ్లుగా ఫైళ్లకే పరిమితమైంది. బస్ బేలు, ట్రక్ లే బైలో ఎక్కడా సరైన వెలుతురు, నిఘా లేకపోవడమూ దుండగులకు కలిసొస్తోంది.
ఈ చర్యలు తీసుకోవాలి...
⇒ వాహనచోదకులు కేవలం టోల్‌ప్లాజాల వద్ద, దాబాలు, హోటళ్ల సమీపంలో మాత్రమే తమ వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.
⇒ నిర్మానుష్య ప్రాంతాలు, ట్రక్ లే బైల్లో నిలపాల్సి వస్తే నిరీ్ణత సంఖ్యలో వాహనాలున్న చోటనే ఆపుకోవాలి.
⇒ ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను రాత్రి వేళల్లో హైవేలపై మోహరించాలి. ఒక్కో వాహనానికి నిరీ్ణత ప్రాంతం కేటాయించి పెట్రోలింగ్ చేయించాలి.
⇒మఫ్టీ పోలీసులను కార్లలో ఉంచడం ద్వారా ఆపరేషన్లు చేపట్టాలి. ఇలా వీళ్లు ప్రయాణికుల్లా వ్యవహరిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది.
⇒జాతీయ రహదారుల వెంట ఉన్న బస్ బేలు, ట్రక్ లే బైల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంచాలి.
⇒ఎన్‌హెచ్ 65లో అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే వీటిలో అత్యధికం మరమ్మతులకు గురయ్యాయి. వీటిని తక్షణం వినియోగంలోకి తేవాలి.
నిఘా ఉన్న చోటే పార్క్ చేసుకోండి
ఎన్‌హెచ్ 65పై చోరీలతోపాటు స్నాచింగ్స్ కూడా నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీ విస్తృతం చేయడంతోపాటు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ప్రయాణికులు సైతం తమ వాహనాలను సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లోనే పార్క్ చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆథరైజ్డ్ హోటళ్లలోనే బస చేయాలి. కొత్త వారు ఎవరైనా సమీపంలోకి వస్తున్నా, మాట్లాడాలని ప్రయతి్నస్తున్నా అప్రమత్తం కావాలి.
ఏదైనా నేరం బారినపడితే వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితులు భయాందోళనలకు లోనై గందరగోళానికి గురికాకూడదు. నేరం చేసిన వ్యక్తి ధరించిన దుస్తులు, అతడి వేషభాషలతోపాటు అతడు ఏదైనా వాహనంపై వస్తే దాని నంబర్ తదితరాలు గమనించి నోట్ చేసుకోవాలి. ఎంత త్వరగా పోలీసులకు సమాచారమిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. –ఎం.రాజేశ్ చంద్ర, డీసీపీ, యాదాద్రి
Comments
Please login to add a commentAdd a comment