సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు కడపకు విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్ నుంచి జూలై వరకు విమాన ప్రయాణికుల గణాంకాలను గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్యలో 33.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి 7,74,925 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది అదే సమయానికి 10,37,656 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయం 36.1 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య 20,289 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య ఈ ఏడాది 27,612కు పెరిగింది.
ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు 19.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 3.09 లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు కూడా గణనీయంగా ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సంఖ్యలో 22.6 శాతం వృద్ధి నమోదైంది.
తిరుపతి, కర్నూలు ఎయిర్‌పోర్టుల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప క్షీణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 18,84,926 మంది ప్రయాణించారు. దేశం మొత్తం మీద చూస్తే ఆ నాలుగు నెలల కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 10.04 కోట్ల నుంచి 12.30 కోట్లకు చేరుకుంది.
పెరిగిన విదేశీ ప్రయాణికులు
రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి మాత్రమే విదేశీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. విశాఖ నుంచి విదేశీ ప్రయాణికుల సంఖ్య 20.9 శాతం వృద్ధితో 20,097 నుంచి 24,143కు చేరితే, విజయవాడలో 14.4 శాతం వృద్ధితో 14,978 నుంచి 17,135కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment