‘టీడీపీ–జనసేన’ విస్తృత స్థాయి సమావేశానికి దాడి, పరుచూరి డుమ్మా
కొణతాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కేడర్ దూరం
దాడి వీరభద్రరావు సమావేశానికి వస్తున్నట్లు విస్తృత ప్రచారం
మూడు రోజుల క్రితమే సయోధ్య కుదిరినట్లు ప్రచారం
దాడి వర్గీయుల గైర్హాజరుతో రేగుతున్న దుమారం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పొత్తు పాట్లు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన “టీడీపీ–జనసేన’ పార్టీల విస్తృత స్థాయి ఉమ్మడి సమావేశానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కర్‌రావు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, వారి వర్గీయులు ఈ సమావేశానికి హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు. సమావేశం చివరి వరకూ అందరూ ఎదురుచూశారు. కానీ వారెవరూ రాలేదు. వీరికి తోడుగా జనసేన నేత పరుచూరి భాస్కర్‌రావు, ఆయన వర్గీయులు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేవలం 150 నుంచి 200 మందితోనే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగడం, జనసేన, టీడీపీ కేడర్ రాకపోవడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులు డీలా పడ్డారు.
కొణతాల మదిలో ఓటమి భయం
టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుక్షణం నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు వర్గీయులైతే పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. నిన్న కాక మొన్న పారీ్టలో చేరిన వారికి టికెట్ ఎలా ఖరారు చేస్తారని ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టికెట్ ఆశించారు. టీడీపీ–జనసేన పారీ్టల మొదటి జాబితాలో అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి కొణతాలకు ఖరారు చేశారు.
దీంతో పీలా, పరుచూరి, దాడి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. వారి మదిలో కొణతాలను ఓడించాలనే ఉంది. వ్యతిరేక వర్గంగా ఉన్న పీలా, దాడి వీరభద్రరావులను కొణతాల స్వయంగా కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందు తామంతా కలిసి ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇదే సరైన సమయంగా భావించిన కొణతాల సోమవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరం కలిసి ఉన్నారనే సంకేతాన్ని కేడర్‌కు అందిద్దామని ఆశించారు. కానీ విస్తృత స్థాయి సమావేశానికి కీలకమైన దాడి వీరభద్రరావు, పరుచూరి భాస్కర్‌రావుతో పాటు వారి వర్గీయులు సైతం రాకపోవడంతో కొణతాల మదిలో ఓటమి భయం పట్టుకుంది. అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేడర్ కూడా పూర్తిగా హాజరు కాలేదు.
అలిగిన నాగ జగదీష్
టీడీపీ–జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని పీలా గోవింద సత్యనారాయణతో కలిసి కొణతాల నడిపించడంతో పీలా వ్యతిరేకవర్గ నాయకుడైన బుద్ధ నాగజగదీష్ అలకబూనారు. విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన జగదీష్ ను, ఆయన వర్గీయులను పట్టించుకోకుండా పీలాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అనకాపల్లి నియోజవర్గంలో టీడీపీ–జనసేన పొత్తుతో కేడర్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
Comments
Please login to add a commentAdd a comment