సమావేశంలో మాట్లాడుతున్న నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్‌టీఎస్ నెట్‌వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు.
విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్‌డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment