సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కీలకమైన విశాఖ నగరం దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించడంలో తనవంతు పాత్ర పోషించనుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు దిక్సూచిగా విశాఖను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు దీనిని పరిపాలన రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నగరాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. ఇక్కడి పలు ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఇటీవల ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థలో విశాఖ నగర ప్రాధాన్యాన్ని తాజాగా నీతి ఆయోగ్ కూడా గుర్తించింది.
భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే కీలక నగరాల్లో విశాఖపట్నం కీలకపాత్ర పోషించనుందని ప్రకటించింది. వికసిత్ భారత్–2047 కింద దేశీయ ఆర్థికవ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.2,500 లక్షల కోట్లు)కి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్‌తో ముందుకెళుతోంది. 2047 నాటికి భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా తొలిసారిగా 2047 వరకు దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం ప్రకటించారు. వీటితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ హబ్స్‌గా కీలకపాత్ర పోషించే మరో 20 నుంచి 25 పట్టణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు పట్టణాల ఆర్థిక ప్రణాళికలు కాకుండా కేవలం పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు పరిమితమయ్యామని, కానీ ఇప్పుడు ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నంలను ఆర్థిక చోదకశక్తులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లు వివరించారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా దేశ యువతను కోరింది.
ఇప్పటివరకు 10 లక్షలకుపైగా వివరణాత్మకమైన సూచనలు, సలహాలు వచ్చాయని, వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్–2047ను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
ఐటీకి అనుకూలమని గతంలోనేగుర్తించిన నాస్కామ్–డెలాయిట్
ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రాంతమని గతంలో నాస్కామ్–డెలాయిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్క్–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖను ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతన తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా, మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
అంతర్జాతీయ బ్రాండింగ్
శక్తిమంతమైన ఈ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు, అంతర్జాతీయంగా విశాఖ బ్రాండింగ్‌ను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. జీ20 సమావేశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, అంతర్జాతీయ వైద్యసదస్సు, మారిటైమ్ సదస్సు.. ఇలా అనేక అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడం ద్వారా విశాఖకు గ్లోబల్ బ్రాండింగ్‌ను తీసుకొచ్చింది. తద్వారా మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం ఏర్పడింది.
ఇటీవల ప్రధానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ–కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానిస్తూ భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టును కలిపే 55 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment