ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నీతి ఆయోగ్ బృందం సభ్యులు
సాక్షి, అమరావతి : విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమం‘త్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్థసారథిరెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్ తదితరుల ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి జగన్ ఈ సందర్భంగా వారికి వివరించారు. నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో విశాఖకు చోటుకల్పించడం శుభపరిణామమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌పోర్టు–సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్డు, డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్.. ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, విద్యారంగం, నాడు–నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా.. ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్ బృందం అభినందించింది. ఈ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ సమగ్ర నివేదిక రూపంలో తమకు అందజేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని బృందం కోరింది. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పాల్గొన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి
మరోవైపు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టిసారించింది. అందుకు రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ.. రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధించే విషయంలో అభివృద్ధి వ్యూహాల రూపకల్పనకుగాను రానున్న రెండేళ్లలో నీతి ఆయోగ్ రూ.5.28 కోట్లు అందించడంతోపాటు అవసరమైన ఇతర సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో నగరీకరణ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని ఆమె అన్నారు. రానున్న సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ వైపు భారత్ పరుగులు తీస్తోందని.. అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని రాధ అన్నారు.
నవరత్నాలతో అధిక వృద్ధి రేటు: సీఎస్
ఇక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. నవరత్నాలు పేరిట పెద్దఎత్తున సంక్షేమాభివృద్ధి పధకాలను అమలుచేయడంవల్ల రానున్న రోజుల్లో అధికవృద్ధి రేటు సాధనకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ సలహాదారు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ఆయా రంగాల వారీగా ఆర్థికాభివృద్ధికి గల అంశాలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment