వచ్చే నాలుగు రోజులూ 3–5 డిగ్రీలు పెరిగే అవకాశం
రాయలసీమలో నెలరోజుల ముందే ప్రభావం
కోస్తాంధ్రలోనూ పెరగనున్న ఉష్ణతాపం
పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ తీవ్రతరం
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి.
సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది.
రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది.
ఉత్తర, కోస్తాంధ్రలో..
మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment