Temperature Touch 45 Degrees Celsius In Coastal Andhra Pradesh | AP Weather Report - Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి.. తీవ్రమైన వేడి ప్రాంతంగా రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాలు

Published Tue, May 16 2023 4:16 AM | Last Updated on Tue, May 16 2023 9:23 AM

Southern coastal districts of Andhra pradesh are Summer hot spots - Sakshi

నిర్మానుష్యంగా ఉన్న రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్డు

సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్ర­తలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి­పోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూ­రు, కాకి­నాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 

అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది.

వచ్చే రెండు రోజులు మరింత తీవ్రం
వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్‌ వేవ్‌ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. 



ఎక్కువగా నీరు తాగాలి
ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోయి హెపటైటిస్‌–బి వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్లరసాలు, బార్లీ, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం, తల విసిరేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకుని సేదతీరాలి. కళ్లకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్లద్దాలు వాడాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలు వరకు ప్రయాణాలు చేయకూడదు.
– డాక్టర్‌ వడ్డాది సురేష్, ఎండీ, రాజమహేంద్రవరం.



వడదెబ్బకు ప్రకాశంలో నలుగురు మృతి 
ఒంగోలు: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఉదయం నుంచే ఎండ తీవ్రత..
ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 డిగ్రీలు, 2, 3 గంటల సమయానికి 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్ర­తలు సైతం 30 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement