summer Intensity
-
Green Roof : మండుటెండల్లో రేకుల ఇల్లు కూడా చల్లచల్లగా..!
వేసవిలో మండే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎగువ మధ్యతరగతి, ధనికులైతే ఇళ్లలో ఏసీలు పెట్టుకొని సేదతీరుతుంటారు... మరి నగరాల్లోని బస్తీలు, మురికివాడల్లో రేకుల ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏమిటి? పైకప్పుల నుంచి లోపలికి వచ్చే వేడికి తాళలేక, నిద్ర పట్టక వారు విలవిల్లాడా ల్సిందేనా? ఈ ప్రశ్నకు వినూత్న ప్రయోగాలు చవకైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. భూతాపం ఏటేటా పెరిగిపోతున్న ఈ కాలంలో పేదల ఇళ్లను చల్లబరిచే పనిని విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి జూన్ 6న ‘వరల్డ్ గ్రీన్ రూఫ్ డే’ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. (బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలోని ఓ మురికివాడ (ఫావెల్)లో లూయిస్ కాసియానో తన అస్బెస్టాస్ రేకుల ఇంటిపై స్వయంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ రూఫ్ (ఏరియల్ వ్యూ)) జూన్ 6 వరల్డ్ గ్రీన్ రూఫ్ డే పై ఫొటోలో తన ఆకుపచ్చని ఇంటి పైకప్పుపై కూర్చున్న వ్యక్తి పేరు లూయిస్ కాసియానో (53). బ్రెజిల్‌లోని రియో డి జెనీరో మహానగరంలో పార్క్యు అరర అనే మురికివాడలో ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల ఇంట్లో 85 ఏళ్ల తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. వేసవిలో అక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్ దాటిపోతూ ఉంటుంది. ‘ఇటుకలు పగలు వేడిని పీల్చుకొని రాత్రుళ్లు వదులుతూ ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలయ్యే వరకు ఇల్లు చల్లబడేది కాదు. చెమటలు ఆగేవి కాదు. నిద్రపట్టేది కాదు. (మురికివాడలో ఇరుకైన రేకుల ఇళ్ల మధ్య 50 డిగ్రీల సెల్షియస్ ఎండలోనూ మొక్కలతో పచ్చగా లూయిస్ కాసియానో ఇల్లు. పైపు డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు తగుమాత్రంగా నీరు ఇస్తూ లూయిస్ పరిరక్షించుకుంటున్నారు.) భరించలేనంత వేడిగా ఉండేది..’అని పదేళ్ల క్రితం పరిస్థితిని కాసియానో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వయంగా తన ఇంటిపై గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవటంతో పరిస్థితి సానుకూలంగా మారిపోయింది. 2012లో రేకుల ఏటవాలు పైకప్పు మీద మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాక ఇల్లు చల్లబడింది. ‘ఇరుగు పొరుగు ఇళ్లకన్నా మా ఇల్లు 15 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేకపోయినా ఇంట్లో ఉండగలుగుతున్నాం’అని కాసియానో చెప్పారు. (లూయిస్ కాసియానో రేకుల ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచుతున్నది ఇలా) రియో డి జెనీరో యూనివర్సిటీలో గ్రీన్రూఫ్స్పై పరిశోధన చేస్తున్న బ్రూనో రెసెండో సహకారంతో కాసియానో తన ఇంటిపై ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రీసైకిల్ చేసి తీసిన తేలికపాటి పాలిస్టర్ నాన్‌ఓవెన్ జియోటెక్స్‌టైల్ పరదాను పరచి, మట్టి పోసి తీవ్ర ఎండలను సైతం తట్టుకొనే మొక్కలను పెంచుతున్నారు. గ్రీన్‌రూఫ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ ఆయన ప్రచారం చేస్తున్నారు. గ్రీన్‌రూఫ్‌లు.. కొన్ని ప్రయోగాలు ముంబై, బెంగళూరులలో సీబ్యాలెన్స్, హసిరుదల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇళ్ల పైకప్పులపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటి పైకప్పు మీద నీలిరంగు టార్పాలిన్‌పై నీరు నింపిన ప్లాస్టిక్ సీసాలను సీబ్యాలెన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సీసాల్లోని నీరు ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల ఆ మేరకు ఇల్లు తక్కువగా వేడెక్కుతుందని ఆ సంస్థ చెబుతోంది. రేకుల ఇంటిపై నీలిరంగు ప్యానెళ్లను అమర్చడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. రేకుల ఇంటిపై తెల్ల టి ‘ఎకోబోర్డ్ పేనల్స్’ను పరచి అధిక ఉష్ణోగ్రత నుంచి కొంత మేరకు రక్షణ పొందొచ్చు. రేకుల ఇంటిపై అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి.. దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉపాయం సత్ఫలితాలిస్తున్నట్లు సీబ్యాలెన్స్ సంస్థ చెబుతోంది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటిపై ఎకోబోర్డ్ ప్యానల్స్‌ను పరచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం) మొండి మొక్కలతో కూల్‌కూల్‌గా.. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కొన్ని మొండి జాతుల మొక్కలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ పుణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఆర్ఐ) ఇటీవల గుర్తించింది. పశ్చిమ కనుమల్లో కనుగొన్న 62 రకాల మొండి జాతి మొక్కలు 95% తేమను కోల్పోయినా చనిపోవని, తిరిగి తేమ తగిలినప్పుడు చిగురిస్తాయని తెలిపింది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో ఓ రేకుల ఇంటిపైన అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం) నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే రేకులు, శ్లాబ్ ఇళ్ల పైకప్పులపై ఈ జాతులను పెంచితే స్వల్ప ఖర్చుతోనే గ్రీన్‌రూఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందిస్తే ఎంత ఎండైనా ఇవి పచ్చగానే పెరిగే అవకాశం ఉంది. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’?.. ఎందుకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు?
మహారాష్ట్రలోని నవీ ముంబై శివార్లలో భారీ సభ.. లక్షల్లో జనాలు వచ్చారు.. ఎండాకాలమే అయినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు.. అయినా వడదెబ్బ తగిలి ఏకంగా 14 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతకు మరికొన్ని వాతావరణ అంశాలు తోడుకావడమే దీనికి కారణం. అందుకే కేవలం ఉష్ణోగ్రతను కాకుండా.. ‘హీట్ ఇండెక్స్’ను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్ణయించింది. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంచనాలతో కలర్ కోడింగ్ మ్యాప్‌లనూ విడుదల చేస్తోంది. మరీ ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? దీనితో ఏమిటి లాభం? వంటి వివరాలు తెలుసుకుందామా.. ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ కలిస్తే.. ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాస్త వేడిగా అనిపిస్తుంది. కానీ దీంతోపాటు వాతావరణంలో నీటిఆవిరి శాతం (రిలేటివ్ హ్యూమిడిటీ) కూడా పెరిగితే.. వేడికి తోడు ఉక్కపోత మొదలవుతుంది. ఆచోట నీడ లేకపోయినా, గాలివీయకపోయినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. విపరీతంగా చెమటపడుతుంది. అప్పటికీ ఎండ/వేడిలో నే ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఒకదశలో ఊపిరి తీసుకోలేక, స్పృహ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి ఏమిటి సంబంధం? మామూలుగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే.. అందుకు తగినట్టుగా గాలి, నీరు వేడెక్కుతూ ఉంటాయి. వేడెక్కిన నీరు వేగంగా ఆవిరి అవుతూ గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఎండ, వేడి గాలి కారణంగా మన శరీరం వేడెక్కి చెమటపడుతుంది. మామూలుగా అయితే చెమట ఆరినకొద్దీ శరీరం చల్లబడుతుంది. కానీ వాతావరణంలో అప్పటికే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట ఆరక.. శరీరం వేడెక్కిపోతూనే ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపి.. అస్వస్థతకు గురవుతారు. ఎంత ఉష్ణోగ్రతకు, ఎంత హ్యూమిడిటీ ఉంటే.. ఏంటి పరిస్థితి? - ఒక్కో స్థాయిలో ఉష్ణోగ్రతకు, ఒక్కోస్థాయి వరకు హ్యూమిడి టీ ఉంటే ఇబ్బందిగా ఉండదు. అవి పరిమితి దాటితే సమస్యగా మారుతుంది. - 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 40% వరకు హ్యూమిడిటీ ఉంటే వాతావరణం హాయి గా ఉన్నట్టు. ఈ పరిస్థితిని మన శరీరం సులువుగా తట్టుకోగలుగుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. - ఈ ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీకి తోడు నేరుగా ఎండలో ఉండటం, వడగాడ్పులు వంటివి కూడా ఉంటే హీట్ ఇండెక్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏమిటి దీనితో ప్రయోజనం? ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా తొలుత బాగానే అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఇతర అంశాల ప్రభావంతో ఇబ్బందిగా మారుతుంది. అదే ‘హీట్ ఇండెక్స్’తో పరిస్థితి ఎలా ఉందన్నది తెలిస్తే.. ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ, విశాఖపట్నం రెండు చోట్లా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఢిల్లీలో 40%, విశాఖలో 50% హ్యూమిడిటీ ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ విశాఖలో మాత్రం ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువ. ఇప్పటికే ‘ఫీల్స్ లైక్’పేరిట.. ఉష్ణోగ్రత, ఇతర అంశాలను కలిపాక.. వాతావరణం ఎంత వేడిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుందనే దాన్ని ‘ఫీల్స్ లైక్’, ‘రియల్ ఫీల్’వంటి పేర్లతో సూచిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాతావరణ సంస్థలు దీనిని అమలు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోని వెదర్ యాప్స్‌లో కూడా ఈ హీట్ ఇండెక్స్ అంచనాలను చూడవచ్చు. - ఉష్ణోగ్రత, హ్యూమిడిటీతోపాటు మేఘాలు ఆవరించి ఉండటం, గాలి వీచే వేగం, సదరు ప్రాంతం ఎత్తు, సమీపంలో భారీ జల వనరులు ఉండటం, తీర ప్రాంతాలు కావడం, వర్షాలు కురవడం వంటివాటిని బట్టి హీట్ ఇండెక్స్ మారే అవకాశం ఉంటుంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ‘హీట్ ఇండెక్స్’ను నిర్ధారించాల్సి ఉంటుంది. ‘హీట్ ఇండెక్స్’ఏ రోజుకారోజు, ఉదయం నుంచి రాత్రి వరకు సమయాన్ని బట్టి మారుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్. ఇది కూడా చదవండి: అవసరం అయితేనే బయటకు రండి.. రాత్రిపూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు -
నిప్పుల కొలిమి.. తీవ్రమైన వేడి ప్రాంతంగా రాష్ట్రంలోని ఆ జిల్లాలు
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. వచ్చే రెండు రోజులు మరింత తీవ్రం వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలి ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోయి హెపటైటిస్–బి వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్లరసాలు, బార్లీ, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం, తల విసిరేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకుని సేదతీరాలి. కళ్లకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్లద్దాలు వాడాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలు వరకు ప్రయాణాలు చేయకూడదు. – డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ, రాజమహేంద్రవరం. వడదెబ్బకు ప్రకాశంలో నలుగురు మృతి ఒంగోలు: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత.. ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 డిగ్రీలు, 2, 3 గంటల సమయానికి 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
‘సెగ’దరగ.. ఇదేం భగభగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మరింతగా మండనున్నాయి. ఈ నెల మొదటి వారమంతా ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతుండగా రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 42–44 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికం... వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని, ప్రస్తుతం సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల మధ్య హెచ్చుతగ్గులుంటాయని ఐఎండీ అధికారులు వివరిస్తున్నారు. ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే నల్లగొండ, భద్రాచలంలో సాధారణంకంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బలహీన పడుతున్న ‘మోక’ అతి తీవ్ర తుపానుగా కొనసాగిన ‘మోకా’తుపాను మయన్నార్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటడంతో బలహీనపడుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. -
ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది. ఈనెల 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 7వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనావేసింది. ఇది ఈనెల 8న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. -
ఇక ఎండలు మండవు
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. తీవ్రమైన ఎండలు తగ్గిపోయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటివరకు మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, ఆగ్నేయ/నైరుతి గాలుల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తున్నాయి. గత మూడేళ్లుగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైనా మధ్యలో 2, 3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత మే నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలలోపే నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మూడోవారం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడోవారం చివర్లో వర్షాలు మొదలవడంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే రకరమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. మే 9, 12 తేదీల మధ్య బంగాళాఖాతంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మయన్మార్ వైపు వెళ్లినా ఇక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్నిబట్టి మే రెండోవారం కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఒకటి, రెండురోజులు ఎండలు పెరిగినా వర్షాలు మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీవర్షం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీవర్షం కురిసింది. సగటున కర్నూలు జిల్లాలో 27 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లాలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కల్లూరు, కర్నూలు, గోనెగండ్ల తదితర మండలాలు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, బేతంచెర్ల, పాణ్యం, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో ఒక్కరోజు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆస్పరి, కొత్తపల్లి, పెద్దకడుబూరు మండలాల్లో పిడుగులు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామంలో పిడుగుపడటంతో 13 జీవాలు మరణించాయి. ఎమ్మిగనూరు మండలంలో 108.2 మిల్లీమీటర్లు, బనగానపల్లిలో 88, బేతంంచెర్లలో 75.2, కల్లూరులో 70.4, గోనెగండ్లలో 65, పాణ్యంలో 62.4, పగిడ్యాలలో 60.8, కర్నూలు అర్బన్‌లో 54.6, కర్నూలు రూరల్‌లో 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఎంత ఎండకు ఏ అలర్ట్? ► రెడ్ అలర్ట్ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) ► ఆరెంజ్ అలర్ట్ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) ► ఎల్లో అలర్ట్ (హీట్‌వేవ్ వార్నింగ్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) ► వైట్ అలర్ట్ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి. ► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. ► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు...
-
భానుడి ఉగ్రరూపం: భవిష్యత్తులో సమ్మర్లో చుక్కలే..!
తిరువనంతపురం: భారత్‌లో రానున్న సంవత్సరాలలో వేసవి ఉగ్రరూపం చూపిస్తుందని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ముందస్తుగా వేసవి కాలం రావడంతో పాటు వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ప్రపంచంలో వేసవి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పులకు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. ‘‘క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’’ అన్న పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో వరల్డ్ బ్యాంకు రెండు రోజులు నిర్వహించనున్న భారత వాతావరణం, అభివృద్ధి భాగస్వామ్యుల సదస్సులో ఈ నివేదికను విడుదల చేయనుంది. ఈ సారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతుందని, ప్రజల ఆయుష్షు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని, ఆర్థికంగా సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75% మంది అంటే దాదాపుగా 38 కోట్లమంది మండుటెండల్లో చెమటోడుస్తూ పని చేస్తారని, వారందరి ప్రాణాలకు వడగాడ్పులు ముప్పుగా మారుతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పుల వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో 3.4 కోట్ల మంది భారత్‌లో ఉంటారని బ్యాంక్ అంచనా వేసింది. ఇదీ చదవండి: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్ -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
Summer 2021: 'ఎండ' ప్రచండం
రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులతో నిప్పుల వాన కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం 111 మండలాల్లో, రానున్న 48 గంటల్లో 12 మండలాల్లో వడగాడ్పులు సెగలు పుట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వేసవి సెగ పుట్టిస్తోంది. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవైపు తేమ గాలులు, మరోవైపు ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వాన కురిపించనున్నాడని పేర్కొంది. మంగళవారం అనేక మండలాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు, రేపు (బుధవారం) సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రంలోని 111 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 80 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం మొత్తం 42 మండలాల్లో వడగాడ్పులు వీచాయని అధికారులు వివరించారు. 31న తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండే మండలాలు.. గరుగుబిల్లి (విజయనగరం), కొయ్యూరు (విశాఖపట్నం), గొలుగొండ (విశాఖపట్నం), అడ్డతీగల (తూర్పుగోదావరి), రాజవొమ్మంగి (తూ.గో), నెల్లిపాక (తూ.గో), కూనవరం (తూ.గో), చింతూరు (తూ.గో), వేలేరుపాడు (ప.గో), కంచికచర్ల (కృష్ణా), వీరులపాడు (కృష్ణా), ఇబ్రహీంపట్నం (కృష్ణా). -
మార్చిలోనే మంటలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. అంతేకాదు ఈ ఏడాది ముందుగానే భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరగనుంది. తీవ్ర వడగాడ్పులకూ అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇవి మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది. ఈ వేసవి ఎందుకిలా..? ఏటా ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతాయి. దీంతో ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణతీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అవి చురుకుదనాన్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు సముద్రం నుంచి నైరుతి, దక్షిణ గాలులు కూడా ప్రస్తుతం రావడం లేదు. ఈ గాలులొస్తే చల్లదనాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ ఆటంకాల చురుకుదనం తగ్గడం, సముద్ర గాలులు రాకపోవడంతో ముందుగానే వేసవి తాపం పెరగడానికి కారణమవుతోందని ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ‘వాస్తవానికి మే నుంచి సముద్ర గాలుల రాక తగ్గుతుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే చల్లగాలులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వివరించారు. మొదలైన వేసవి తాపం.. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల నాలుగు రోజుల క్రితమే ప్రస్తుత ఉష్ణోగ్రతలకంటే అధికంగా నమోదు కావడం విశేషం. -
ఆంధ్రప్రదేశ్ : నిప్పుల గుండం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/ తాడేపల్లి రూరల్(మంగళగిరి): భగభగ మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అనేకచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా.. దీనికితోడు అగ్నికీలల్లా వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈసీజన్లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య వంద దాటినట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క శుక్రవారమే 28 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వేసవిలో ఏడుగురు వడదెబ్బ వల్ల చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: తెలంగాణ.. నిప్పుల కొలిమి..!) సెగలు.. సెగలు.. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే కొద్దిసేపటికే ఒళ్లంతా చెమటతో తడిసిపోయి కళ్లు బైర్లు కమ్మి పడిపోయేలా పరిస్థితి తయారైంది.ఇళ్లల్లోనూ తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో సైతం ఏసీనో ఎయిర్ కూలరో లేకపోతే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్ల దగ్గర కుళాయి తిప్పితే నీరు సలసలమంటూ పొగలు కక్కుతూ వస్తోంది. రాత్రి పది పదకొండు గంటలు దాటినా ఇళ్ల పైనున్న ట్యాంకుల్లోని నీరు చల్లబడటం లేదు. కుంటలు, చెరువుల్లోని నీళ్లు కూడా కాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూరీడి ప్రతాపానికి జనమే కాదు జంతు జీవాలు, పక్షులు, జలచరాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇదేవిధంగా కొనసాగుతుందన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో 18 మండలాల్లో 44 – 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కూడా వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. వడదెబ్బకు 28 మంది మృతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 28 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 7 మంది, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ప్రాణాలు కోల్పోతున్న పశువులు ఎండకు తట్టుకోలేక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వేడి నుంచి రక్షణ కోసం రైతులు తమ ఇళ్లలోని పాడిగేదెలు, ఆవులను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చల్లని నీటితో తడుపుతున్నారు. అడవుల్లో సైతం నీరు దొరక్క జంతువులు, పక్షలు అలమటిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ కొంత వరకూ జంతువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినా అవి చాలడంలేదు. తక్షణమే చికిత్స చేయించకపోతే చావే.. పొలాల్లో ఒంటరిగా పనులు చేస్తున్నవారు, ఎండలో బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురైతే ఎవరైనా వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణతాపం వల్ల మనిషి శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల సోడియం, పొటాషియం నిల్వల్లో మార్పులు వస్తాయి. వీటి దామాషా పడిపోవడంవల్ల మనిషి శరీరం వేడిని నియంత్రించే శక్తిని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, పొటాషియం, ఇతర లవణాలు తగుమోతాదులో లేకపోవడంవల్ల మనిషి వడదెబ్బకు గురవుతారు. కాగా ప్రస్తుత వేసవిలో ఇప్పటికే వంద మందిపైగా వడదెబ్బవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటే పదుల సంఖ్యలోనే ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారితో ‘సాక్షి’ ప్రస్తావించగా.. ‘గుండె సంబంధిత సమస్యలున్న వారు వడగాడ్పులకు తట్టుకోలేరు. ఇలాంటి వారికి వెంటనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ మరణాలను అధికారులు గుండెపోటుగానే పరిగణిస్తారేగానీ వడదెబ్బ మృతులుగా గుర్తించరు. అందువల్లే వడదెబ్బ మరణాల నిర్ధారించే ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది’ అని వివరించారు. గుండె సమస్యలున్న వారు వీలైనంత వరకు ఎండలో బయట తిరగరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి తెలిపారు. వడదెబ్బ లక్షణాలు - రోజుకు ఐదారుసార్లు కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. - జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం. - అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక పిడచగట్టుకుపోయినట్లు తడారిపోవడం. - పాక్షిక లేదా పూర్తి ఆపస్మారకస్థితిలోకి వెల్లడం. - పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు ఎక్కువ వేడిగా ఉండటం. వడదెబ్బ తగిలితే ఈ లక్షణాలన్నీ ఉండాలని కాదు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. వడదెబ్బకు గురైన వారిని బాగా గాలి తగిలేలా నీడలో పరుండబెట్టి చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరమంతా తుడవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కపర్థి సూచించారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. – ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధ్యమైనంత వరకూ ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. – తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంతోపాటు హృదయ భాగంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. – శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. – రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. ప్రతి అరగంటకొకసారి నీరు తాగుతూ ఉండాలి. – ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మ రసం, ఉప్పు కలిపిన చల్లని నీరు లేదా, మజ్జిగ, కొబ్బరి నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది. – ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచుకుని ఏమాత్రం బడలికగా ఉన్నా నీటిలో కలుపుకుని తాగాలి. దీనివల్ల చెమట రూపంలో వెళ్లిన లవణాల స్థానే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి. – చివరి అంతస్తుల్లో ఉన్న ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. కిటికీలకు వట్టి వేళ్లు, గోనెసంచులు వేసి వాటికి నీరు చల్లడం ద్వారా కొంత వరకూ గది వేడిని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. రానున్న 5 రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వివిధ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మే 11వ తేదీ: 46 – 47 డిగ్రీలు – ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 43 – 45 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ అనంతపురంలలో కొన్ని ప్రదేశాలు 39 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 12వ తేదీ: 45 – 46 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 42 – 44 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 39 – 41 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 13వ తేదీ: 43 – 44 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 40 డిగ్రీలు – విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 14వ తేదీ: 43 – 44 డిగ్రీలు – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 37 – 39 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 15వ తేదీ: 43 – 44 డిగ్రీలు – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 39 డిగ్రీలు – విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రదేశాలు వడగాడ్పులు.. వర్షాలు రాష్ట్రంలో విభిన్న వాతావరణం రాష్ట్రంలో ఒకపక్క వడగాడ్పులు, మరోపక్క తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోపక్క ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. -
మార్చిలోనే మంటలు
ప్రచండ భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన తడాఖా చూపుతున్నాడు. ఎండలతో జనాలను ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్‌లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ఇండెక్స్ (యూవీ) సూచీ ‘పది’పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ యూవీ ఇండెక్స్ అంటే.. రోజులో ఏదైనా ప్రాంతంలో, సమయంలో మానవ చర్మం మంటపుట్టించే అతినీల లోహిత కిరణాల తీవ్రతను (వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద) యూవీ ఇండెక్స్‌గా పరిగణిస్తారు. సూచీ తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్ 6 ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్‌బర్న్ (చర్మం మంటపుట్టడం) వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచీ 12 కనుక ఉంటే 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచీని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచీ ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తుంటాయి. సమస్యలు.. పరిష్కారాలు యూవీ ఇండెక్స్ పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఓజోన్ రక్షణ లేక మనుషులపై నేరుగా పడటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మంట పుట్టడం, రెటీనా దెబ్బతినడం జరుగుతాయి. యూవీ సూచీ సాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఇబ్బందులు ఉండవు. 10 పాయింట్లు నమోదైతేనే ప్రమాదం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని సూచిస్తున్నారు. పలు మెట్రోనగరాల్లో హరితం ఇలా.. దేశంలో 35% గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 20.2%, గ్రీన్‌సిటీగా పేరొందిన బెంగళూరులో 19%, కోల్‌కతాలో 15%, ముంబైలో 10%, చెన్నైలో 9.5% గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం 8 శాతానికే పరిమితం కావడంపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో తగ్గుతున్న హరితం.. హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదపడలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని పేర్కొంటున్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే మేలు.. - ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. - సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వాలి. - నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉం డాలి. లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతోపాటు ఒక్కో మండలానికి కరువు సహాయక చర్యల కోసం రూ.10 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలె క్టరేట్ ఎదుట మండుటెండలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరి పంటకు ఎకరానికి రూ.15వేలు పరిహారం చెల్లించాలని, అన్ని గ్రామాల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, వడదెబ్బతో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, కరువు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పశువుల దాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు తాత్కాలిక పింఛన్ రూ.3వేలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకులు సిరబోయిన కరుణాకర్, పాల్గొన్నారు.