
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మరింతగా మండనున్నాయి. ఈ నెల మొదటి వారమంతా ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతుండగా రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో 42–44 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికం...
వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని, ప్రస్తుతం సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల మధ్య హెచ్చుతగ్గులుంటాయని ఐఎండీ అధికారులు వివరిస్తున్నారు.
ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే నల్లగొండ, భద్రాచలంలో సాధారణంకంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
బలహీన పడుతున్న ‘మోక’
అతి తీవ్ర తుపానుగా కొనసాగిన ‘మోకా’తుపాను మయన్నార్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటడంతో బలహీనపడుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment