సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. అంతేకాదు ఈ ఏడాది ముందుగానే భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరగనుంది. తీవ్ర వడగాడ్పులకూ అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇవి మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది.
ఈ వేసవి ఎందుకిలా..?
ఏటా ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతాయి. దీంతో ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణతీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అవి చురుకుదనాన్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు సముద్రం నుంచి నైరుతి, దక్షిణ గాలులు కూడా ప్రస్తుతం రావడం లేదు. ఈ గాలులొస్తే చల్లదనాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ ఆటంకాల చురుకుదనం తగ్గడం, సముద్ర గాలులు రాకపోవడంతో ముందుగానే వేసవి తాపం పెరగడానికి కారణమవుతోందని ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ‘వాస్తవానికి మే నుంచి సముద్ర గాలుల రాక తగ్గుతుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే చల్లగాలులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వివరించారు.
మొదలైన వేసవి తాపం..
ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల నాలుగు రోజుల క్రితమే ప్రస్తుత ఉష్ణోగ్రతలకంటే అధికంగా నమోదు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment