weather experts
-
నైరుతి తిరోగమనం షురూ...
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ మొదలైంది. బుధవారం నుంచి ప్రారంభమైన రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ దేశవ్యాప్తంగా దాదాపు 3 వారాలపాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మే 30న కేరళను తాకిన రుతుపవనాలు... క్రమంగా విస్తరిస్తూ జూన్ 6 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలుత అత్యంత చురుకుగా సాగిన రుతుపవనాలు... జూలైలో మందగించాయి. దీంతో జూలైలో ఎక్కువ రోజులు వర్షాలు కురవలేదు. రాష్ట్రంలోని చాలాప్రాంతాలు ఆగస్టు రెండో వారం నాటికి లోటు వర్షపాతంతోనే ఉన్నాయి. ఆగస్టు మూడో వారం నుంచి రుతుపవనాల కదలికలు చురుకవడంతో వర్షాలు ఊపందుకున్నాయి. ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సీజన్లో రాష్ట్రంలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 72.52 సెం.మీ.. ఈ సీజన్లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 67.42 సెం.మీ. కాగా, నమోదైన వర్షపాతం 89.81 సెం.మీ.. ఈ లెక్కన సాధారణ వర్షపాతం కంటే 22% అధికంగా నమోదైంది.నిష్క్రమణ సమయమూ కీలకమే... రుతుపవనాలు నిష్క్రమించే సమయం కూడా కీలకమైందని నిపుణులు చెప్పారు. ఇప్పటివరకు ముందుకు కదులుతూ దేశాన్ని చుట్టేసిన రుతుపవనాలు... ఇప్పుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గత పదేళ్లలో ఎక్కువగా వర్షాలు తిరోగమన సమ యంలోనే నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇప్పటివరకు వర్షపాతం సాధారణం నుంచి అత్యధిక స్థాయిలో నమోదైంది. ఇందులో ఐదు జిల్లాలు అత్యధిక వర్షపాతం కేటగిరీలో ఉండగా... 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్లో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలేవీ నమోదు కాలేదు. గత మూడేళ్లుగా జిల్లా కేటగిరీలో లోటు వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం. వర్షపాతం ఎక్కడ ఎలా? అత్యధిక వర్షపాతం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణ పేట అధిక వర్షపాతం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు సాధారణ వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, యాదాద్రి–భువనగిరి -
ముందే వచ్చిన వేసవి!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజను ముగియక ముందే సూర్య ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఏప్రిల్ నాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి. ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పట్నుంచే తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడపల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా పలు చోట్ల క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. పెరగనున్న వేసవి తీవ్రత రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అ«దికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే సాధారణంగా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తూ ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. గత సంవత్సరానికంటే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడి, లానినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరు వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు -
మబ్బులు చెదిరి..నిప్పులు కురిసి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ ఎండాకాలంలా మారిపోయింది. ఈసారి వానాకాలం మొదట్లో చినుకు జాడ లేక, తర్వాత భారీ వర్షాలు కురిసి.. ఆగస్టులో అయితే నెలంతా వానలు పడక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో మంచి వర్షాలే పడినా.. మళ్లీ వాతావరణం భిన్నంగా మారిపోయింది. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోతతోనూ ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా ఈ పరిస్థితి ఉండగా.. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మబ్బులు మాయమై.. సాధారణంగా వానాకాలం చివరిలో తేలికపాటి వర్షాలే కురిసే పరిస్థితి ఉన్నా.. ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంటుంది. రుతుపవనాల కదలిక ఎక్కువగా ఉంటే భారీ వర్షాలు కూడా పడుతుంటాయి. కానీ ఇప్పుడు వాతావరణం ఇందుకు భిన్నంగా ఉంది. ఆకాశంలో మబ్బులు కానరావడం లేదు. ఎక్కువై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమశాతం ఎక్కువై ఉక్కపోత పెరిగిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని, ఆ తర్వాత వానలు పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. గణనీయంగా ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఎండాకాలంలో నమోదయ్యే స్థాయిలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండలో 36.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సెపె్టంబర్ మూడో వారంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల మేర ఉండాలని..కానీ ఇప్పుడు 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరవచ్చని అంటున్నారు. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. ఈ అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల వైపు పయనిస్తూ బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఈ ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రెండురోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సరుబుజ్జిలిలో 12 సెంటీమీటర్లు, చిలకలపల్లిలో 10.8, దేవరాపల్లిలో 8.7, డుంబ్రిగుడలో 4.3, పెందుర్తిలో 4, రేచర్లలో 3.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ అల్పపీడనంగానీ, ఉపరితల ఆవర్తనం/ద్రోణిగానీ ఏర్పడితే వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. -
నైరుతి వానలన్నీ పడ్డట్టే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షపాతం సంతృప్తికర స్థాయికి చేరింది. మొత్తం సీజన్లో పడాల్సిన సాధారణ వర్షపాతం అంతా ఇప్పటికే నమోదైంది. ఇకపై రాష్ట్రంలో కురిసే వర్షాలన్నీ అధిక వర్షాలుగా పరిగణించవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వరకు ఉన్న కాలాన్ని నైరుతి రుతపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 72.10 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అదే ఈసారి ఇప్పటికే (సెప్టెంబర్ 6 నాటికే) 74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే పడింది. ఇకపై కురిసే వానలన్నీ అదనంగా కురిసే వానలేనని చెప్తున్నారు. కొంత కలవరపెట్టినా.. నిజానికి ఈసారి నైరుతి సీజన్ వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. జూన్ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందారు. పంటల సాగు కూడా ఆలస్యమైంది. అయితే జూలై మొదటి నుంచే పరిస్థితి మారిపోయింది. ఏకంగా రెట్టింపు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆగస్టులో లోటు వర్షపాతం నమోదవగా.. సెప్టెంబర్‌లో వానలు ఊపందుకున్నాయి. గతేడాది 40శాతం అధికంగా.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నైరుతి సీజన్ వర్షపాతం అధికంగానే నమోదవుతూ వస్తోంది. 2021లో ఏకంగా 49శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. 2022లో 40శాతం అధికంగా (100.97 సెంటీమీటర్లు) వానలు పడ్డాయి. ఈ ఏడాది ఇప్పటికే 74.35 సెంటీమీటర్లు కురవగా.. నెలాఖరు నాటికి ఎంత వర్షపాతం నమోదవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా గణనీయంగానే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని అధికారులు భావిస్తున్నారు. నాలుగు జిల్లాల్లో సాధారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా వానలు పడటంతో జిల్లాల వారీగా కూడా లోటు వర్షపాతం లేకుండా పోయింది. అయితే నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం వర్షపాతం కాస్త తక్కువగా, మిగతా జిల్లాల్లో 20శాతం కంటే అధికంగా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం, 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా.. మిగతా 10 జిల్లాలు సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి. నేడు, రేపు మోస్తరు వానలు రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడిందని.. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రెండ్రోజుల పాటు వానలు పడతాయని పేర్కొంది. -
IMD Alert: నెలాఖరులోగా మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల కిందట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది గురువారం పూర్తిగా బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీనిఫలితంగా రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. -
22 తర్వాత తుపాను!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22వ తేదీ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం స్పష్టతనిచ్చింది. ఐఎండీ తాజా నివేదిక ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ ఈనెల 22 వ తేదీ ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆనంతరం ఈ వాయుగుండం మరింత బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ తెలిపింది. అయితే ఇది మరింతగా బలపడి అతి తీవ్ర/సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తుపాను ఉత్తర కోస్తాంధ్ర–దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై అధిక ప్రభావం తుపాను ప్రభావం మన రాష్ట్రంపై అధికంగా ఉండనుంది.ఫలితంగా ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. -
AP: ఈ నెలలో రెండు తుపానులు!
సాక్షి, విశాఖపట్నం: లానినా (సముద్ర వాతావరణం) పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం డైపోల్ (ద్విధ్రువ) వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీన ఒక తుపాను, 21 తర్వాత మరో తుపాను రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ తుపానులతో రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో కామవరపుకోటలో 69.5 మిల్లీమీటర్లు, విజయవాడ, మంగళగిరిలో 56.3, అనంతగిరిలో 56, సత్తెనపల్లిలో 54, గుంతకల్లులో 49.5, అద్దంకిలో 47.5, గొలుగొండలో 44.5, జి.కొండూరులో 43.8, విస్సన్నపేటలో 42, నల్లజర్లలో 40.5, కొయ్యూరులో 38.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్ -
విశాఖ సురక్షితం.. ఉపద్రవం ఉత్తదే
సాక్షి, విశాఖపట్నం: ‘‘దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో అత్యంత సురక్షిత నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉంటుంది. వందేళ్ల తర్వాత ఒకటి రెండు అడుగులు సముద్రమట్టం పెరిగినా ముంపునకు గురవుతుందన్న ఆందోళనైతే ఏమాత్రం లేదు..’’ ఇదీ జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్ఐఓ) విశ్రాంత శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు తేల్చి చెబుతున్న మాట. ‘నాసా’ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టం పెరుగుతుందన్న ఆందోళన ఉన్నప్పటికీ అది స్వల్పంగా ముందుకు చొచ్చుకు వచ్చే వరకు మాత్రమే ప్రభావం ఉంటుంది కానీ విశాఖకు ముంపు ముప్పు ఉందన్న అవాస్తవ ప్రచారాలను ఎవరూ విశ్వసించవద్దని సూచిస్తున్నారు. భూతాపంతో.. నానాటికీ పెరుగుతున్న భూతాపం మానవాళిని అంపశయ్యపై ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ (ఐపీసీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. భూతాపం వల్ల ఉత్తర ధృవంలోని ఆర్కిటిక్ సముద్రంలో పలకలు క్రమంగా కరుగుతూ నీరుగా మారి సముద్రంలో చేరుతున్నాయని, దీనివల్ల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతాయని పేర్కొంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2100 సంవత్సరంలో దేశంలోని కొచ్చి, భావ్‌నగర్, ముంబై, మంగళూరు, చెన్నైతో పాటు విశాఖపట్నంలోనూ సముద్ర మట్టాలు పెరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. అయితే దీన్ని పట్టుకుని విష కథనాలు వండి వార్చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు నాసా చెప్పిన నిజమేంటి..? విశాఖకు నిజంగానే ఉపద్రవం ఉందా? అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.. నాసా ఏం చెప్పిందంటే..? 1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు, సముద్ర స్థితిగతులు, కర్బన ఉద్గారాలు మొదలైన అంశాలపై ఐపీసీసీ అధ్యయనం చేసి ఐక్యరాజ్యసమితికి నివేదిక అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా భూతాపం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పు ఎదురుకానుందని ఈ ఏడాది సర్వేలో హెచ్చరించింది. హిమనీ నదాలు కరిగి సముద్రంలో కలుస్తుండటం ఒక పరిణామమైతే, రుతుపవనాల్లో మార్పులు, భారీ తుపాన్లు కారణంగా వరదనీరు సముద్రంలోకి భారీగా చేరి నీటి మట్టాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో రానున్న వందేళ్లలో 1.77 అడుగుల ఎత్తున సముద్ర నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నది సారాంశం. విశాఖలో వాస్తవమేంటి..? నాసా చెప్పింది నిజమే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రం ఉప్పొంగనుంది. ఫలితంగా మట్టాలు పెరిగి ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. 2019లో ఎన్ఐవో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2100 నాటికి ప్రస్తుత సముద్ర మట్టం కంటే 70 సెంటీమీటర్లు పెరిగే సూచనలున్నాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని ఐపీసీసీ స్పష్టం చేసింది. ఇదే జరిగితే కోస్తా తీరంలో వందల కిలోమీటర్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే మరో 500 లేదా 600 ఏళ్ల వరకూ విశాఖకు ముంపు ముప్పు లేదన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే విశాఖ నగరం సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. వందేళ్ల తర్వాత నీటి మట్టం పెరిగేది కేవలం 1.77 అడుగులు. అంటే 0.532 మీటర్లు మాత్రమే. . దీనివల్ల విశాఖ మునిగిపోయే ప్రమాదం ఏమాత్రం లేదని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు. తీరం కోతకు గురవడం సాధారణమని పేర్కొంటున్నారు. విశాఖకు భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదాలు లేవు. టెక్టానిక్స్ ప్రకారం లక్షల సంవత్సరాలకు జరగవచ్చన్నది ఒక అంచనా మాత్రమేనని చెబుతున్నారు. తీరం ఎందుకు కోతకు గురవుతుంది..? పరిశ్రమలు, వాహనాలు, యంత్రాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులు భూ ఉపరితల వాతావరణంలో వలయంలా ఏర్పడ్డాయి. ఈ వలయం భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన ఉష్ణోగ్రతను బంధించేయడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని చెబుతారు. పోర్టులు, రిగ్గులు, హార్బర్లు కారణంగా సముద్రంలో సహజసిద్ధంగా ఉన్న నీటి గమనంపై ప్రభావితం చూపుతున్నాయి. దీనివల్ల ఇసుక ప్రవాహానికి అవరోధం ఏర్పడి కొన్ని తీరాల్లో మేట వేయడం, మరికొన్ని తీరాలు కోతకు గురవడం జరుగుతున్నాయి. దీంతో పాటు వరదలు, హిమనీ నదాల నుంచి నీటి ప్రవాహం పెరుగుతుండటం వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. ఆ నివేదిక ఓ అంచనా మాత్రమే.. ఐపీసీసీ నివేదికలు కేవలం వాతావరణంలో మార్పులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయే కానీ శాస్త్రీయపరంగా రుజువైనవి కాదన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగే అవకాశాలున్నాయి. అదంతా దీర్ఘకాలిక ప్రభావం. ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోయేంత ప్రమాదమేమీ లేదు. పైగా సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల అలాంటి భయాందోళనలు అనవసరం. హిమనీ నదాలు కరగడం వల్ల వచ్చే నీరు మయన్మార్ తీరంపై ముందుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓ సంస్థ నివేదికను పట్టుకుని ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోతుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు. – ప్రొ.సునీత, డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలాజీ, ఓషనోగ్రఫీ పూర్వ హెచ్ఓడీ తీర భద్రతకు ప్రమాదం లేదు కోస్తా తీరంలో 2000 మీటర్ల వరకూ జరుగుతున్న పరిణామాలు, సముద్రంలో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏటా కొద్ది సెం.మీ. మేర సముద్ర మట్టం పెరుగుతుంది. దీనివల్ల తీరం కోతకు గురవుతుంది తప్ప నగరం మునిగిపోయేంత ప్రమాదం ఉండదు. ఎప్పుడో వందేళ్లకు సముద్రం కొంత ముందుకు వచ్చినా బీచ్ రోడ్డు వరకూ వచ్చే ఆస్కారం ఉంది తప్ప నగరంలోకి చొచ్చుకు రాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. గ్లోబల్ వార్మింగ్ మూలంగా తీరంలోని పారాదీప్, బంగ్లాదేశ్ తీరాలు ఎక్కువ కోతకు గురవుతాయి. తూర్పు కనుమలు ఉండటం వల్ల విశాఖ నగరానికి, తీర భద్రతకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. – డా. కేఎస్ఆర్ మూర్తి, ఎన్ఐఓ రిటైర్డ్ సైంటిస్ట్ కోతను నియంత్రించే అవకాశాలున్నాయా? తీరం కోతను నియంత్రించేందుకు అనేక అవకాశాలున్నాయి. దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఆ ప్రాంత తీరం, భౌగోళిక, సముద్రం పరిస్థితులను అనుసరించి వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ప్రస్తుతం విశాఖ తీరంలో డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. కోతకు గురికాకుండా చాలా ప్రాంతాల్లో సీ వాల్స్ (సముద్రపు గోడలు) నిర్మిస్తున్నారు. బీచ్ ఫ్రంట్ రీ డెవలప్మెంట్లో భాగంగా ఆర్కే బీచ్‌లో 3 కి.మీ. మేర సీవాల్ నిర్మించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సీఆర్‌జెడ్ అనుమతులు రావాల్సి ఉంది. కోతను నియంత్రించేందుకు అనుసరిస్తున్న వివిధ పద్ధతులు ఇవీ.. గ్రోయెన్స్: సముద్ర ప్రవాహ అవక్షేప కదలికలను పరిమితం చేస్తూ కోతకు గురవుతుండగా ఏర్పాటు చేసే దృఢమైన హైడ్రాలిక్ నిర్మాణమిది. చెక్క, కాంక్రీట్ లేదా రాతితో గ్రోయెన్స్ నిర్మిస్తారు. స్పెయిన్‌లోని కేటలోనియా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, బ్రిటిష్ కొలంబియా, పోలాండ్ బీచ్‌లలో ఏర్పాటు చేశారు. కర్వ్డ్ సీ వాల్: అలల తీవ్రతను తగ్గించి తీరం కోతకు గురికాకుండా కర్వ్డ్ సీ వాల్స్ నిర్మిస్తారు. వక్రంగా ఉండే ఈ గోడలు కెరటాల తీవ్రతను బలహీనపరచడం ద్వారా ఇసుక కొట్టుకుపోకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా తీరం కోతకు గురికాదు. యూకే, పోలాండ్లోని బీచ్‌లలో వీటిని నిర్మించారు. మౌండ్ సీవాల్: కాంక్రీట్ బ్లాక్స్, రాళ్లతో తక్కువ ధరతో వీటిని నిర్మించవచ్చు. ఈ బ్లాక్స్‌ను అలలు తాకి.. బ్లాక్స్ మధ్యలో ఉన్న ఖాళీల్లోకి వెళ్లడం వల్ల వాటి తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా తీరం కోతకు గురికాకుండా ఉంటుంది. ఇవి నెదర్లాండ్స్, ఇంగ్లండ్ తీరాల్లో ఉన్నాయి. బ్రేక్ వాటర్: అలలను ఒడ్డుకు చేరకముందే చీల్చడం వల్ల వాటి తీవ్రత తగ్గి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా కోత సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇందుకు బ్రేక్‌వాటర్ సిస్టమ్‌ను అవలంబిస్తున్నారు. రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలతోనూ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇవి విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోనూ, పోర్టు పరిసరాల్లో ఉన్నాయి. వెర్టికల్ సీ వాల్: సముద్రంలో ఆటుపోట్ల సమయంలో తరంగాల ఉధృతిని తట్టుకునేందుకు వీటిని నిర్మిస్తారు. భారీ అలలను కూడా నియంత్రించగల సామర్థ్యం వెర్టికల్ సీ వాల్స్కి ఉంటుంది. ఇవి ప్రస్తుతం ఆస్ట్రేలియా, ముంబై తీరాల్లో ఉన్నాయి. -
ఇక వడ దడ!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వడగాడ్పులు దడ పుట్టించనున్నాయి. వీటి ప్రభావం శనివారం నుంచే మొదలు కానున్నప్పటికీ ఆదివారం నుంచి మరింత ఉధృతరూపం దాల్చనున్నాయి. మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94 మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అదే సమయంలో విజయనగరం, విశాఖపట్నం, ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ప్రధానంగా తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 36 మండలాలు, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కృష్ణాలో 30, విశాఖపట్నంలో 22, శ్రీకాకుళంలో 20కి పైగా మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 1నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని, వడగాడ్పుల ప్రభావమూ పెరుగుతుందని చెబుతున్నారు. -
మార్చిలోనే మంటలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. అంతేకాదు ఈ ఏడాది ముందుగానే భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరగనుంది. తీవ్ర వడగాడ్పులకూ అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇవి మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది. ఈ వేసవి ఎందుకిలా..? ఏటా ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతాయి. దీంతో ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణతీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అవి చురుకుదనాన్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు సముద్రం నుంచి నైరుతి, దక్షిణ గాలులు కూడా ప్రస్తుతం రావడం లేదు. ఈ గాలులొస్తే చల్లదనాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ ఆటంకాల చురుకుదనం తగ్గడం, సముద్ర గాలులు రాకపోవడంతో ముందుగానే వేసవి తాపం పెరగడానికి కారణమవుతోందని ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ‘వాస్తవానికి మే నుంచి సముద్ర గాలుల రాక తగ్గుతుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే చల్లగాలులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వివరించారు. మొదలైన వేసవి తాపం.. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల నాలుగు రోజుల క్రితమే ప్రస్తుత ఉష్ణోగ్రతలకంటే అధికంగా నమోదు కావడం విశేషం. -
నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. -
‘లోటు’ తీరుతుంది!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే జోన్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ.. ఉత్తర భారతం నుంచి దక్షిణం వైపు పయనిస్తున్నాయి. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో అక్టోబర్ 15 వరకూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గతేడాదికంటే ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉండటంతో ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా.. 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. అక్టోబర్ నాటికల్లా ఆ లోటు తీరేలా పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అనుకూల వాతావరణమే ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 7 శాతం లోటు వర్షపాతం ఉంది. ఇందులో సింహభాగం లోటు దక్షిణ భారత దేశంలోనే ఉంది. ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో వారం నాటికి భర్తీ కానుంది. రుతు పవనాల కాలంలో నెలకు కనీసం అల్పపీడనం, వాయుగుండం, తుపాను వంటి ఏవైనా నాలుగు మార్పులు రావాల్సి ఉంటుంది. గతేడాది రుతుపవనాల కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఒక తుపాను, ఒక తీవ్ర వాయుగుండం, 4 వాయుగుండాలు, 4 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందుకే గతేడాది 91 శాతం సరాసరి వర్షపాతం నమోదైంది. ఈసారి అవి ఆశించిన విధంగా లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. రుతు పవనాలు 13 రోజులు ఆలస్యం కావడంతో వర్షాలు కూడా ఆలస్యమవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉండబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 24 గంటల్లో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్ దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాయలసీమపై చురుగ్గా ప్రభావం చూపుతున్నాయి. గడచిన 24 గంటల్లో రుద్రవరంలో 16 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, ఎస్.కోటలో 9, అవనిగడ్డ, వెంకటగిరి కోట, ఆళ్లగడ్డలో 6 సెం.మీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన తుంపాల కన్నయ్య(53) అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. -
వానొచ్చె.. వరదొచ్చె..
సాక్షి, అమరావతి/ నెట్వర్క్: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటం, ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి పెద్ద ఎత్తున వరద జలాలను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 24 గంటల్లో 16.53 టీఎంసీలు జలాశయంలోకి చేరాయి. ప్రస్తుతం 1,79,709 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 838.7 అడుగుల్లో 59.98 టీఎంసీలకు చేరుకుంది. రానున్న రెండు రోజులు పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కర్ణాటకకు సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కూడా దాదాపుగా నిండింది. ఈ నేపథ్యంలో శనివారం శ్రీశైలానికి వచ్చే వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు భీమా నదిలో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఉజ్జయినిలోకి 39,467 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 78.06 టీఎంసీలకు చేరుకుంది. 24,860 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 30.44 టీఎంసీలకు చేరింది. నేడు మరింత పెరగనున్న గోదారి వరద శబరి, సీలేరు పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో భారీ ఎత్తున వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. శుక్రవారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీకి 8,00,084 క్యూసెక్కుల వరద రాగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,85,089 క్యూసెక్కులను 174 గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. సాయంత్రం ఏడు గంటలకు వరద కాస్త తగ్గడంతో 7,11,439 క్యూసెక్కులను విడుదల చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 24 గంటల్లో 60 టీఎంసీలను ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వదిలారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 340 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. శనివారం కాటన్ బ్యారేజ్‌కు సుమారు 8.50 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరుకుంది. తాలిపేరు రిజర్వాయర్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద నీటి ఉధృతి మరింత పెరిగింది. పునరావాస పనులు వేగవంతం పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 27.34 అడుగులకు చేరుకుంది. స్పిల్ వే రివర్ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్ ఛానల్ మీదుగా గోదావరిలోకి ప్రవాహాన్ని మళ్లిస్తున్న అధికారులు వరదను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నదికి 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వచ్చినా పోలవరం ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు ఉండదని.. కానీ 12 లక్షల కంటే ఎక్కువ వరద వస్తే 41.15 కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలకు పునరావసం కల్పించే పనులను వేగవంతం చేశారు. కంటి మీద కునుకు లేదు.. వరద ప్రవాహం పెరుగుతుండటంతో గోదావరి తీర ప్రాంత గిరిజనం భయాందోళన చెందుతున్నారు. ఇటు గోదావరి పరీవాహక పోలవరం నిర్వాసిత దేవీపట్నం మండలంతో పాటు విలీన మండలాలు నాలుగింటిలో గిరిజనులు కుంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ముంపునీటిలో నానుతున్న ఇళ్లు కూలిపోతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పారుదలకు కాఫర్‌డ్యామ్ అడ్డుగా నిలవడంతో దానిపై నుంచి ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పూడుపల్లి, దేవీపట్నం సెక్టార్లు వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో నాటు పడవలే శరణ్యంగా మారాయి. ఏజెన్సీలోని 22 ముంపు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ కళ్లు మూసుకుని నిర్మించిన కాఫర్ డ్యామ్ తమ కొంప ముంచుతోందని దేవీపట్నం పరిసర ప్రాంతాల గిరిజనులు శాపనార్థాలు పెడుతున్నారు. 5, 6 తేదీల్లో భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిమీ మధ్యలో ఆవరించి ఉంది. అదే విధంగా ఇది వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అనేక చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీనికి తోడు ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని, ఇది మరింత తీవ్రంగా మారే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 5, 6 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావం బంగాళాఖాతంలో తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అరుకు లోయ, సీలేరు, డుంబ్రిగుడ తదితర మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జలాశయం పూర్తిగా నిండిపోయి ప్రమాదస్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షంతో ఈ జలాశయం నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరరామచంద్రాపురం, కూనవరంలో 13, నూజివీడు, ఏలూరులో 9, కోయిడా, వేలరుపాడు, కుకునూరు, భీమడోలులో 8, రాజమండ్రిలో 7, కొయ్యలగూడెం, విజయవాడ, తాడేపల్లిగూడెం, చింతలపూడిలో 6, చింతపల్లి, తణుకు, ప్రకాశం బ్యారేజీలో 5, తిరువూరు, గుడివాడ, పిడుగురాళ్ల, పాలకోడేరు, పోలవరం, డోర్నిపాడు, దేవరకొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగమేశ్వరుడిని చేరిన కృష్ణవేణి కొత్తపల్లి/ఆత్మకూరు రూరల్: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమ ప్రదేశమైన శ్రీ లలితా సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోకి కృష్ణా జలాలు శుక్రవారం ప్రవేశించాయి. ఐదారు రోజుల్లో ఆలయం పూర్తిగా కృష్ణవేణి గర్భవాసంలోకి చేరుకోబోతుండడంతో ఆలయ గోపుర దర్శనం చేసుకునేందుకు భక్తులు సంగం బాట పట్టారు. వర్షాలు ఇక పుష్కలం సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలకు వాతావరణ అనుకూలం ఉందని.. మొదట్లో ఇవి ఆలస్యమైనా ఇప్పటి నుంచి ఇక పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కువ ప్రభావాన్ని చూపే ఈశాన్య, ఆగ్నేయ గాలులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణం వైపుగా పయనించడం ప్రారంభించడంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా ఆగస్టు 15 నుంచి అక్టోబరు 15 వరకూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వాతావరణంలో మార్పులవల్ల దశాబ్ద కాలం తరువాత ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యమయ్యాయని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొ. భానుకుమార్ ‘సాక్షి’కి వివరించారు. వర్షాలకు అనుకూలం.. పసిఫిక్ మహా సముద్రంలో ఈ ఏడాది వాతావరణంలో హెచ్చు తగ్గులు సాధారణంగా ఉండటం.. హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రంలో కూడా తటస్థంగా ఉండటంతో ఈ ఏడాది వర్షాలకు సముద్ర భాగం నుంచి ఎలాంటి ఆటంకం ఏర్పడటంలేదని ఆయన తెలిపారు. దాంతో దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్టోబరు 15వ వరకూ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఆగస్టు ద్వితీయార్థం నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని చెప్పారు. లోటు తీరిపోతుంది.. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8 శాతం లోటు వర్షపాతం ఉందని.. ఇది ఆగస్టు నాటికి భర్తీ అవుతుందని ఆయనన్నారు. రాష్ట్రంలో గతేడాది 91 శాతం వర్షం కురవగా.. ఈ ఏడాది రెండు నెలల కాలంలోనే ఇప్పటివరకూ 92 శాతం వర్షపాతం నమోదైందని.. ఇంకా ఆగస్టు, సెప్టెంబరు నెలలు ఉండటంతో నూరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రొ.భానుకుమార్ వివరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంవల్ల జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని.. ఏపీలో మాత్రం ఆగస్టు, సెప్టెంబరులోనే ఎక్కువగా ఉంటుందన్నారు. -
ఆగస్టు వరకు ఆగాల్సిందే!
సాక్షి, అమరావతి బ్యూరో: ఆశించిన వర్షాల కోసం మరికొన్నాళ్లు ఆగాలా? అవుననే అంటున్నారు వాతావరణ నిపుణులు. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడమే కాక.. ఆపై అవి ముఖం చాటేయడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రుతుపవనాలు ప్రవేశించినప్పట్నుంచి మొక్కుబడి వానలే తప్ప విస్తారంగా వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. సాధారణంగా జూలై మూడో వారం నాటికి బంగాళాఖాతంలో కనీసం 4–5 అల్పపీడనాలు, 2–3 వాయుగుండాలు ఏర్పడాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా రెండంటే రెండే అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అవి కూడా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల రాష్ట్రంపై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాయి. నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపక పోవడానికి, వానలు సమృద్ధిగా కురవకపోవడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో (సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం) కొనసాగుతుండడం కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో నెల రోజుల నాటికి ఎల్‌నినో న్యూట్రల్ స్థితికి చేరుకుని లానినా (సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడం) పరిస్థితులేర్పడతాయని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ (సీపీసీ) తాజా అంచనాల్లో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆగస్టు రెండో వారం నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఐదో వంతుకు పైగా లోటు వర్షపాతం.. జూలై మూడో వారం నాటికి కూడా రాష్ట్రంలో భారీ లోటు వర్షపాతమే (22%) కొనసాగుతోంది. జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 22 వరకు కురవాల్సిన వర్షపాతం కంటే ఐదో వంతుకు పైగా లోటు వర్షపాతం నమోదయింది. కోస్తాంధ్రలో 21, రాయలసీమలో 23% కురవాల్సిన దానికంటే తక్కువ వర్షం కురిసింది. 42% లోటుతో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోకెల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం (+2%) రికార్డయి ఒకింత మెరుగ్గా ఉన్నాయి. ఎందుకిలా..? ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో రుతుపవనాల ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. దీంతో అక్కడ (నేపాల్, ఈశాన్య రాష్ట్రాల్లో) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడి ఖరీఫ్ పంటకు విఘాతం కలిగించాయి. ఈ ద్రోణి వెనక్కి వస్తే మళ్లీ రాష్ట్రంలో వానలకు ఆస్కారం ఉంటుంది. ఇలా వెనక్కి వచ్చి బలపడాలంటే అక్కడ తూర్పు గాలులు ప్రారంభం కావాలి. ఈ పరిస్థితికి మరో రెండు వారాల సమయం పడుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, అవి రబీ పంటలకు భరోసానిస్తాయని తెలిపారు. -
వానలు.. వడగాడ్పులు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, గుంటూరు/నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు, వడగాడ్పులు, మరోపక్క పిడుగులు, వానలు.. వీటికి ఈదురు గాలులు తోడవుతున్నాయి. వీటి ధాటికి ఇటు కోస్తాంధ్ర, అటు రాయలసీమ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ఏకధాటిగా ఎండలు కాస్తూ ఉష్ణతాపాన్ని వెదజల్లుతుండగా అనూహ్యంగా ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ వెనువెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కాసేపటికే ఈ మేఘాలు మాయమై మామూలు వాతావరణం నెలకొంటోంది. రుతుపవనాలకు ముందు ఇలాంటి పరిస్థితులు (ప్రీమాన్సూన్ థండర్ స్టార్మ్) సాధారణమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మంగళవారం కోస్తాంధ్రలో వాతావరణం సాధారణంగాను, రాయలసీమలో సాధారణం కంటే 2–4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగాను నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. బుధవారం నుంచి కోస్తాంధ్రలో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ వివరించింది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో రామగిరిలో 7, కంబదూరులో 6, చెన్నేకొత్తపల్లి, కనుర్పి, పెనుకొండ, కనేకల్, కురుపాంలలో 5, పాడేరు, రోళ్ల, ఆత్మకూరు, రోళ్ల, మడకసిరల్లో 4, ఇచ్ఛాపురం, ఓబులదేవరచెరువు, శాంతిపురం, అమరాపురం, హిందూపురం, ఓరుమామిళ్ల, ఆమడగూరు, ఆలూరుల్లో 3 సెం.మీల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో భారీ వర్షం గుంటూరు జిల్లాలోని పొన్నూరు, చేబ్రోలు, వేమూరు, రేపల్లె, తెనాలి, కొల్లూరు, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం, కొల్లిపర, భట్టిప్రోలు, అమృతలూరు, కర్లపాలెం సహా పలు మండలాల్లో సోమవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పొన్నూరు, చేబ్రోలు సహా పలు మండలాల్లో మామిడి, అరటి, దొండ, కాకరకాయ తోటలు దెబ్బతిన్నాయి. గుంటూరు నగరం, చిలకలూరిపేట, బాపట్ల సహా పలు పట్టణాల్లో సైతం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. పిడుగుపడి 45 గొర్రెల మృతి పిడుగుపడి 45 గొర్రెలు మృతి చెంది.. నాలుగు లక్షల రూపాయల దాకా ఆస్తినష్టం జరిగిన ఘటన చిత్తూరు జిల్లా పూలవాండ్లపల్లెలో జరిగింది. బాధిత దంపతులు వెంకటరమణ, కాంతమ్మ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. అదే సమయంలో 45 గొర్రెలున్న మందపై పిడుగు పడడంతో అవన్నీ అక్కడికక్కడే ప్రాణాలొదిలాయి. వాటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల దాకా ఉంటుంది. గొర్రెల మృతితో జీవనాధారం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరున్నారు. -
ఏపీకి తప్పిన పెను ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ఐదారు రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ‘ఫొని’ తుపాను ముప్పు తప్పిపోయింది. ఈ తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరి సమీపంలో ఎట్టకేలకు తీరాన్ని తాకింది. అక్కడే అధిక ప్రభావం చూపించింది. ఆ సమయంలో గంటకు 175–205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తుపాను ధాటికి ఒడిశాలో ఎనిమిది మంది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతి తీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు నైరుతిగా 60 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు నైరుతి దిశగా 160 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ శనివారం నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తుపాను దిశ ఇలా.. ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర పెను తుపాను వల్ల ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కొద్దిరోజులుగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ తుపానుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ‘ఫొని’ ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందోనని ఉత్తరాంధ్ర వాసులు క్షణమొక యుగంగా గడిపారు. శ్రీకాకుళం జిల్లా వాసులైతే మరింతగా హడలెత్తిపోయారు. కానీ, ఉత్తరాంధ్రలో పెద్దగా నష్టం లేకుండానే ఫొని తుపాను రాష్ట్రాన్ని దాటిపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు శుక్రవారం సాయంత్రానికి అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోవడం, ఫీడర్లు దెబ్బతినడం, వైర్లు తెగిపోవడం వల్ల 733 గ్రామాల్లో కరెంటు సరఫరా ఆగిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులు వీచాయి. తీరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఉద్యాన పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. అరటి, మామిడి, జీడిమామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఉద్ధానం ప్రాంతంలో 7,600 కొబ్బరి చెట్లు కూలిపోయాయి. 187 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వేరుశనగ, వంగ, పత్తి, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు తదితర పంటలు ధ్వంసమయ్యాయి. 162 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో 141.6 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. తుపాను హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సముద్ర తీరం, లోతట్టు గ్రామాల్లోని సుమారు 3,334 కుటుంబాలను 142 పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రహదారులపై కూలిపోయిన చెట్లను తొలగించాయి. శ్రీకాకుళం జిల్లాకు తుపాను ముప్పు తప్పిపోయిందని కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం ప్రకటించారు. విజయనగరం జిల్లాలో ప్రభావం స్వల్పమే ఫొని తుపాను ప్రభావం విజయనగరం జిల్లాలో స్వల్పంగానే కనిపించింది. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడా పెద్దగా గాలులు వీయలేదు. పార్వతీపురం డివిజన్లో స్వల్పంగా గాలి వీచినా నష్టం కలిగించలేదు. తీరప్రాంతంలో అలలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఇక ఎలాంటి ముప్పు లేదని గ్రహించిన అధికారులు పునరావాస కేంద్రాల్లో ఉన్న 2 వేల మందిని వారి స్వగ్రామాలకు పంపించారు. నెల్లిమర్లలో ముద్దుర్తి శ్రీను(34) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలమట్టమైంది. తెర్లాం, మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో వందలాది ఎకరాల్లో మామిడితోటలు ధ్వంసమయ్యాయి. పలు మండలాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అరటి చెట్లు కూడా విరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ఫొని తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో రూ.6.09 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో కేవలం 12.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న రైళ్ల రద్దు తుపాను ప్రభావం వల్ల పలు రైళ్లను శనివారం కూడా రద్దు చేసినట్లు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. రైళ్ల రద్దు గురించి ముందే తెలుసుకున్న ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమే చేశారు. కానీ, అప్పటికే బయల్దేరి రైళ్లలో ఉన్న ప్రయాణికులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే శాఖ పూర్తి టికెట్ రిఫండ్ అందజేసింది. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, హౌరా వెళ్లే ప్రయాణకులు రైల్వేస్టేషన్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రైళ్లు ఎప్పుడు నడుస్తాయో తెలియక స్టేషన్లో వేచి చూస్తున్నారు. ఐఎండీ అంచనాలు భేష్ భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాలు మరోసారి నిజమయ్యాయి. ఏప్రిల్ 25న ఏర్పడిన అల్పపీడనం దశల వారీగా ఎలా బలపడుతుంతో ఐఎండీ తెలియజేసింది. తొలుత తుపాను ఉత్తర తమిళనాడు– దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనించి, ఆ తర్వాత ఉత్తర–ఈశాన్య దిశగా పయనిస్తుందని వెల్లడించింది. ఈ తుపాను తీవ్రరూపం దాల్చి పెనుతుపానుగా మారుతుందని పేర్కొంది. తుపాను పెనుతుపానుగానే ఒడిశాలోని పూరి సమీపంలో శుక్రవారం ఉదయం తీరాన్ని దాటుతుందని ఐదు రోజుల క్రితమే ప్రకటించింది. ఐఎండీ అంచనా వేసినట్లు కచ్చితంగా పూరి వద్ద శుక్రవారం తుపాను తీరాన్ని దాటింది. ఐఎండీ శాస్త్రవేత్తల అంచనాలు నిజం కావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూరి ఏరియల్ వ్యూ చిత్రీకరించిన నౌకాదళం ఫొని తుపాను ప్రభావంతో అతలాకుతలమైన పూరి పరిసర ప్రాంతాల పరిస్థితిని భారత నౌకాదళం సమీక్షించింది. తూర్పు నౌకాదళానికి చెందిన రెండు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో తుపాను ప్రభావానికి సంబంధించిన ఏరియల్ వ్యూని శుక్రవారం చిత్రీకరించింది. ముంపునకు గురైన ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సేకరించింది. లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన దృశ్యాలు, వరద ముంపులో ఉన్న రహదారుల ఫోటోలతో పాటు పూరి, చిల్కా సరస్సు మధ్య ప్రాంతాల్లో తుపాను కారణంగా నెలకొన్న విషాద పరిస్థితులకు సంబంధించిన ఫుటేజీని నేవీ బృందాలు ఒడిశా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ ఫుటేజీ ఆధారంగా సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. -
ఈ సమ్మర్ సలసల!
సాక్షి, విశాఖపట్నం: భానుడు ఈ ఏడాది సెగలు కక్కనున్నాడు. మార్చి ఆఖరు నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి మూడో వారం నుంచే ప్రతాపం చూపడం మున్ముందు వేసవి తాపాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి మార్చి ఆఖరు నుంచి రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ అనూహ్యంగా నెల రోజుల ముందే ఆ పరిస్థితి (సాధారణంకంటే 4–5 డిగ్రీలు ఎక్కువగా) మొదలైంది. ఉత్తర భారతదేశంలో ఉష్ణ ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుంది. ఈ సీజనులో కోస్తాంధ్రలో సాధారణకంటే సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. ఇదేమీ తేలిగ్గా తీసుకోవలసిన అంశం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అటు నుంచి వీచే ఉత్తర గాలుల వల్లే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం కానున్నాయి. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదు. ఈశాన్య రుతుపవనాలు కూడా మరింతగా దెబ్బతీయడంతో అరకొర వానలే కురిశాయి. ఫలితంగా భూమి నుంచి ఆవిరి రూపంలో తాపం పెరగడానికి దోహదపడనుంది. మరోవైపు పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినోకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ వెరసి ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడతాయని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సంవత్సరం ఎండలతో పాటు వడగాడ్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. -
ముందుగానే రుతుపవనాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సానుకూల సంకేతాలు అగుపిస్తున్నాయి. వేసవి ఆరంభం(మార్చి ఆఖరు)లోనే క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడం, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి పరిణామాలు ముందస్తు రుతుపవనాలకు దోహదం చేయనున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి జూన్ మొదటి తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది. కానీ అంతకంటే ఐదు నుంచి 8 రోజుల ముందుగానే ఇవి కేరళను తాకుతాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి నీటి ఆవిరి కలిగిన మేఘాలు భూమధ్యరేఖ దాటి ఉత్తరార్థ గోళంలోకి ప్రవేశిస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో యాంటీ సైక్లోన్లు(అధిక పీడనాలు) బలంగా ఉన్నాయి. ఇవి దక్షిణం వైపు నుంచి తేమ గాలులతో తూర్పు, పశ్చిమతీరాలకు వస్తున్నాయి. ఫలితంగా ఈ ఎండాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల(వాతావరణ పరిభాషలో థండర్ స్టార్మ్ యాక్టివిటీగా పిలుస్తారు)కు కారణమవుతున్నాయి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించేందుకు దోహదపడే పశ్చిమ ఆటంకాలు ఉత్తరం వైపునకు కదులుతున్నాయి. అనుకూలంగా లానినా పరిస్థితులు.. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే ఎల్‌నినో ఏర్పడి వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. అదే ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే లానినా పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రుతుపవనాలకు అనుకూలమన్నమాట. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల లానినా పరిస్థితులేర్పడి జూన్ దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నైరుతి రుతుపవనాలు ముందస్తు ఆగమనానికి అనుకూల పరిణామమని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్ మొదటితేదీకి 5 నుంచి 8 రోజుల ముందుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే వీలుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సా«ధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించడం తెలిసిందే. -
భగ్గుమంటున్న భానుడు
విశాఖపట్నం: రోహిణి కార్తె తడాఖా ఒకరోజు ముందుగానే మొదలైంది. వాస్తవానికి మంగళవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. రోహిణి కార్తెలో రోళ్లు బద్ధలవుతాయన్నది సామెత. అందుకుతగ్గట్టుగానే తీవ్రత చూపుతోంది. వారం కిందట వచ్చిన రోను తుపాను ప్రభావంతో ఈ ఏడాది రోహిణి కార్తె ప్రభావం అంతగా ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు తొలుత అంచనా వేశారు. అందుకు విరుద్ధంగా సోమవారం ఒక్కసారిగా భగ్గుమంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజనులో ఎన్నడూ లేనివిధంగా నగరంలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇది సాధారణంకంటే 6 డిగ్రీలు అధికం కావడం విశేషం. ఈ సీజనులో ఇప్పటిదాకా 39 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఇప్పటిదాకా విశాఖలో 1995 జూన్ 9న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. 2012 జూన్ 2న 44 డిగ్రీలు, మే 25, 2015న 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక సోమవారం జిల్లాలో గరిష్టంగా పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాంబిల్లిలో 45, పాయకరావుపేట 44.5, యలమంచిలి, నక్కపల్లిలో 43, అనకాపల్లిలో 42.4, చోడవరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాతో పాటు నగరంలోనూ వడగాడ్పులు తీవ్రంగా వీచాయి. ఉదయం నుంచీ వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలైనా ఉష్ణతాపం చల్లారలేదు. బస్సుల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన వడగాడ్పుల తీవ్రతను తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. వాహన చోదకులు నరకాన్ని చూశారు. జనం ఇళ్లలో ఉన్నప్పటికీ వేడితీవ్రతను అనుభవించారు. ఒక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చిన వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారు మధ్యాహ్నానికే ఇంటిముఖం పట్టారు. జనసంచారం లేక రోడ్లన్నీ కర్ఫ్యూను తలపించాయి. మరో రెండ్రోజులు మంటలు.. మరో రెండ్రోజులు వడగాడ్పులు కొనసాగుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వీస్తున్న పొడి, వేడిగాలుల వల్లే వడగాడ్పులు ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావడం మంచిదని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
భానుడు భగభగ
♦ నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం ♦ కుతకుతలాడుతున్న కోస్తా, రాయలసీమ సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు భగభగా మండుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉదయం తొమ్మిదన్నరకే ఎండవేడి చురుక్కుమనిపిస్తోంది. సాయంత్రం అయిదు గంటలకూ వేడి సెగలు తగ్గడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను భయపెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ, వడగాడ్పులకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 197 మండలాల్లో, మంగళవారం 186 మండలాల్లోనూ తీవ్ర వడగాడ్పులు నమోదయ్యాయి. మంగళవారం వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 31 మండలాల్లో వడగాడ్పులు రికార్డయ్యాయి. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల రికార్డుల ప్రకారం గత 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో 43 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 47.3, విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో 46.2, ప్రకాశం జిల్లా కంభంలో 46, వైఎస్సార్ జిల్లా కొండాపురంలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న వడగాల్పులు తీవ్రమైన ఎండలకు వడగాల్పులు తోడై ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 24 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి. -
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
కొనసాగుతున్న ఉపరితలద్రోణి సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుంచి కొమరిన్ వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోనూ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉం దని తెలిపింది. తెలంగాణలో రానున్న రెండ్రోజుల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురవవచ్చని పేర్కొంది. వీటి ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉంటుందని వివరించింది. మరోవైపు రాయలసీమలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాలల్లో ఉష్ణోగ్రత లు 40 డిగ్రీలకు దాటుతున్నాయి. అలాగే తెలంగాణలోని హైదరాబాద్, హన్మకొండ, మెదక్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవి సాధారణకంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికం. ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడం మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
వణికిస్తున్న చలి
లంబసింగిలో 3, ఆదిలాబాద్‌లో 8 డిగ్రీలు సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. ఉత్తర, ఈశాన్య గాలులు ఉధృతమవుతుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. సాధారణం కంటే తెలంగాణలో 2 నుంచి 4, ఆంధ్రప్రదేశ్‌లో 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. సోమవారం విశాఖ జిల్లా లంబసింగిలో 3, పాడేరులో 5, చింతపల్లిలో 6, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైయ్యాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 4 రోజులు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారంరాత్రి విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. -
ముందస్తు ‘ఈశాన్య’ పవనాలు
‘నైరుతి’ ఉపసంహరణ వేగవంతం అక్టోబర్ నుంచి ఆశాజనక వర్షపాతం సాక్షి, విశాఖపట్నం : ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఈశాన్య పవనాల రాక అక్టోబర్ మొదటి వారంలో ఆరంభమవుతుంది. కానీ కొద్దిరోజుల ముందే ఇవి ప్రభావం చూపవచ్చని వాతావరణ అధ్యయన కేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (ఐఐటీఎం-పుణే) అంచనాకొచ్చింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పశ్చిమ రాజస్థాన్ నుంచి ఈ నెల ఆరంభంలో మొదలయింది. రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవడానికి మరో 20 రోజుల సమయం పడుతుంది. ఊహించిన దానికంటే నైరుతి తిరోగమనం వేగవంతంగా జరుగుతోంది. దీంతో ఈశాన్య రుతుపవనాలు ఒకింత ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. గతేడాది పది రోజులు ఆలస్యంగా అక్టోబర్ రెండో వారంలో ప్రవేశించాయి. లోటు వర్షపాతమే.. దేశంలో ఏటా రుతుపవనాల ద్వారా 110 సెం.మీ.ల వర్షపాతం కురుస్తుంది. ఇందులో అధిక భాగం అంటే 88 సెం.మీ.లు నైరుతి రుతుపవనాల ద్వారా, మిగిలినది ఈశాన్య రుతుపవనాల ద్వారా లభిస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్ నిరాశాజనకంగానే కొనసాగుతోంది. దేశంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే 12 శాతం లోటు వర్షపాతం నమోదవుతోంది. -
డెడ్‌లైన్.. ఆగస్టు 31
కరువు అంచున రాష్ట్రం అప్పుడే కరువనుకోవద్దు.. ఆగస్టులో పెద్ద వానలు పడే అవకాశం ఉందని ఇటీవల ఒక సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దేవుడు కరుణిస్తే, ముఖ్యమంత్రి నోటి మాట నిజమైతే అంతకన్నా ఏం కావాలి? కానీ వాతావరణ నిపుణులు చెబుతున్న మాటలే నిజమైతే? ఆగస్టులోనూ వర్షాలు కురవకపోతే? ఏంజరుగుతుంది..? - భూగర్భ జలాల పాతాళ యాత్ర వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే సగటు లోతు 20 మీటర్లు దాటింది. - కొన ఊపిరితో మిగిలిన పంటలు కూడా తుదిశ్వాసను తీసుకుంటాయి. రాష్ట్రం మొత్తం దుర్భిక్ష ప్రాంతమవుతుంది. - జూలై చివరి నాటికే తెలంగాణ పల్లెల నుంచి 15 లక్షల మందికిపైగా వలసబాట పట్టారు. ఈ నెలాఖరుకు(వానలు లేకుంటే) ఆ సంఖ్య ఇంకా రెండింతలు అవుతుంది. - హైదరాబాద్‌కు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు చేతులెత్తేస్తాయి. 65 శాతం నగర జనాభాకు ఆధారమైన నాగార్జున సాగర్ ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి దగ్గర పడింది. నీటి సరఫరాకు మరింత నియంత్రణ తప్పకపోవచ్చు. - మరో 67 పట్టణాలు కూడా తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటాయి. -
వడ దడ
వెనక్కి తగ్గని భానుడు అదే ఉష్ణతీవ్రత నగరంలో 39.2 ఉష్ణోగ్రత విశాఖపట్నం : భానుడు వెనక్కి తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. పైగా ఉష్ణతీవ్రతను కొనసాగిస్తున్నాడు. అకాల ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. అదే పనిగా వీస్తున్న వడగాడ్పులను తట్టుకోలేకపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు చెవులకు రక్షణగా హెల్మెట్లు పెట్టుకున్నా, కాటన్ వస్త్రాలు కప్పుకున్నా ఉపశమనం కలగడం లేదు. కిలోమీటరు దూరం ప్రయాణించే సరికే ఏ చెట్టు నీడనో ఆశ్రయిస్తున్నారు. అంతకంటే ముందుకు వెళ్తే ఏమవుతామోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడి వెదజల్లుతూనే ఉండడంతో అట్టుడికిపోతున్నారు. రాత్రి చీకటి పడ్డాక కూడా వేడి ప్రభావం చూపుతోంది. ఆదివారం నగరంలో రికార్డు స్థాయిలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కాస్త ఉపశమనం కలుగుతుందనుకుంటే అంతే స్థాయిలో 39.2 డిగ్రీలు రికార్డయింది. విశాఖలోని వాల్తేరు వాతావరణ నమోదు కేంద్రానికి, నగర శివారులోని ఎయిర్‌పోర్టులో నమోదు కేంద్రానికి ఉష్ణోగ్రతల్లో కనీసం మూడు నాలుగు డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. ఎయిర్‌పోర్టుకంటే వాల్తేరులోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. విశేషమేమిటంటే సోమవారం ఈ రెండు చోట్లా దాదాపు ఒకేలా (వాల్తేరులో 39.0, ఎయిర్‌పోర్టులో 39.2 డిగ్రీలు) ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అందుకే సోమవారం నగరంలో అత్యంత ఎండతీవ్రతను జనం చవిచూశారు. ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో రెండ్రోజుల వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందన్న హెచ్చరికలతో నగర, జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. -
కోస్తాంధ్రలో వడగాడ్పులు
పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు * రానున్న నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి * పశ్చిమ గాలుల వల్లేనంటున్న వాతావరణ నిపుణులు సాక్షి, విశాఖపట్నం: జోరుగా వర్షాలు కురవాల్సిన జూలైలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి అనూహ్య పరిణామాలు వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారానికల్లా తొలకరి ప్రవేశంతో వాతావరణం బాగా చల్లబడుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా జూలై ఆరంభం నుం చి మళ్లీ సెగలు మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితం ఒకట్రెండు చోట్ల మాత్రమే 40 డిగ్రీల దా కా రికార్డయిన ఉష్ణోగ్రతలు ఆదివారం నాటికి అనేక ప్రాంతాల కు విస్తరించాయి. ఆదివారం ఒంగోలు, బాపట్ల, కావలి, నెల్లూరు, తిరుపతిలో 40, విశాఖపట్నం, తుని, మచిలీపట్నంలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిలా ్లల్లో వడగాడ్పులు వీచినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న నాలుగైదు రో జులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉం దని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత అరుదు.. జూలైలో అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు వడగాడ్పులు వీయడం అత్యంత అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటిదాకా జూలైలో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 39.9 డిగ్రీలు. అది కూడా 1997 జూలై 16న నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతే అధికం కావడం విశేషం. ఎందుకిలా.. ప్రస్తుతం రుతుపవనాలు హిమాలయ పర్వతాల వైపు ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. పైగా సముద్రం నుంచి గాలులు వీయడం లేదు. గాలిలో తేమ తక్కువ కావడం, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనంగా ఉండడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా క్యుములోనింబస్ మేఘాలేర్పడి రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం నాటి నివేదికలో తెలిపింది. -
వర్షాభావాన్ని అధిగమిస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ భరోసా ఇచ్చారు. ఈ సీజన్లో వర్షపాత లోటు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి తన శాఖ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని బుధవారమిక్కడ విలేకర్లకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు కొత్త పంటల బీమా పాలసీని తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలపై ప్రభావం పడకుండా దిగుమతులను పెంచుతామని, నిత్యావసరాలకు లోటు రాకుండా చూసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పరంగా వ్యవసాయ, విద్యుత్తు రంగాల్లో తగు ప్రణాళికలతో ‘వర్షపాత లోటు’ వల్ల ఏర్పడే స్థితినుంచి ఒడ్డెక్కే ప్రయత్నిస్తామన్నారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా స్టాక్‌మార్కెట్‌పై కూడా ప్రభావం పడడంతో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాల్లో ప్రత్రామ్నాయ ప్రణాళికలను అవలంబిస్తున్నామన్నారు. -
ఉసురు తీస్తున్న వడగాల్పులు
1,344కు పెరిగిన వడదెబ్బ మృతులు స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిన నేపథ్యంలో వీస్తున్న వడగాలులను తట్టుకోలేక వృద్ధులు, పిల్లలతోపాటు చాలా చోట్ల మధ్యవయస్కులు మరణిస్తున్నారు. ఈ వేసవిలో వడగాల్పుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య గురువారం సాయంత్రానికి అధికారిక గణాంకాల ప్రకారమే 1,344కు చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ధ్రువీకరించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 305 మంది వడదెబ్బతో మృత్యువుపాలయ్యారు. అనధికారిక లెక్పకల ప్రకారం ఈ మృతుల సంఖ్య రెండువేలుపైగా ఉంటుందని అంచనా. ఇక గురువారంనాడు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది చనిపోయారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 16 మంది ఉన్నారు. బుధవారంతో పోల్చితే గురువారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. మరో రెండు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు నిధులు లేవని జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే ట్రెజరీ రూల్-27 కింద నిధులు డ్రా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులిచ్చారు. -
సంక్రాంతి వరకూ వణుకే..
* కోస్తాంధ్ర, తెలంగాణలో చలి తీవ్రం * ఉత్తరాది నుంచి శీతల గాలులు * పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: కొద్ది రోజుల విరామం తర్వాత చలి ఊపందుకుంటోంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఉత్తరాదిలో వాతావరణం కూడా ఇందుకు దోహదపడుతోంది. అక్కడ నుంచి వీస్తున్న శీతల పవనాలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాది వాతావరణ ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలి పారు. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమల్లోను, తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 4, తెలంగాణలో 3 నుంచి 6 డిగ్రీల చొప్పున సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లలో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. -
పొంచివున్న కరువు!
సంపాదకీయం: కీడెంచి మేలెంచాలని నానుడి. చినుకు రాల్చకుండా చోద్యం చూస్తున్న మబ్బుల తీరును గమనిస్తే వర సగా నాలుగో ఏడాది కూడా ఖరీఫ్ కాలాన్ని కరువు కబళిస్తుందేమోనన్న కలవరపాటు కలుగుతున్నది. అప్పుడే అంత నిరాశ అవసరం లేదు...జూలై రెండోవారం దాకా చూడవచ్చన్నది కొందరి ఆశావహుల మాట. నిజమేనా? జూన్ నెలాఖరులోనూ భగభగలాడుతున్న సూర్యుణ్ణి చూసినా...ఊపిరాడనీయకుండా చేస్తున్న ఉక్కబోతను గమనించినా నమ్మకం కలగడంలేదు. పెళ్లి నడకలతో వచ్చిన రుతుపవనాలు ఎలాగో పద్ధతిగా విస్తరించాయిగానీ కాలం కలిసిరాక కదల్లేకపోతున్నాయి. వానమ్మ జాడలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికి సాధారణం కంటే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు లెక్కలుగడుతున్నారు. మన స్థితి మరింత అధ్వాన్నం...ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కన్నా దాదాపు 70 శాతం తక్కువగా, తెలంగాణలో 46 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రధాన జలాశయాలన్నిటా నీరు ఆవిరవుతున్నదంటున్నారు. కనుక సామాన్యుల మాటెలా ఉన్నా, ప్రభుత్వాలు మేల్కొనవలసిన తరుణం మాత్రం ఆసన్నమైంది. ప్రమాదాన్ని శంకించకతప్పని స్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. జూన్ నెల ఇక పూర్తికావొచ్చినట్టే గనుక మిగిలిన మూడు నెలల్లోనే దండిగా వర్షాలు పడాలి. కానీ, కరువుకాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఎల్ నినో ప్రతాపం చూపించే సమయం కూడా ఈ మూడు నెలలే. అందువల్ల దుర్భిక్షం ఏర్పడ్డదని వాతావరణ విభాగం గుర్తించి ప్రకటించకముందే అందుకవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మన ప్రభుత్వాల గత చరిత్ర తిరగేస్తే ఇలాంటి ముందుచూపు ఉన్నట్టు కనబడదు. ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయడం, అరకొరగా పనికానిచ్చేయడం...విషమ పరిస్థితులు ముంగిట్లోకొచ్చాక నెపం ప్రకృతిపైకి నెట్టి అమాయకత్వం నటించడం మామూలైపోయింది. 2002నాటి తీవ్ర దుర్భిక్షాన్ని తలుచుకున్నప్పుడు గుర్తొచ్చేది ఇదే. ఆరుగాలం శ్రమించే రైతుకు ప్రభుత్వాలు కుడిఎడమల దన్నుగా నిలవకపోతే, అవసరమైన సలహాలు, సూచనలతో ఆదుకోకపోతే ముప్పేట ఇబ్బందులు చుట్టుముడతాయి. పంట నష్టానికిచ్చే పరిహారం బకాయిలేమైనా ఉంటే వెనువెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలి. అలాగే ఏ పంటలు వేయాలి...ఏవి వేయకూడదు...ఇప్పటికే అదునుదాటి, వర్షాలస్థితి అగమ్యగోచరంగా ఉన్న స్థితిలో పత్తి వంటి పంటల విషయంలో ఏంచేయాలి అన్న అంశాల్లో సలహాలు అందజేయాలి. ఏంచేస్తే ఉన్నంతలో లాభమో, ఏది అనర్ధమో తెలపాలి. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ విస్తరణ సేవలు మూలమూలనా పరుచుకునేలా వ్యవసాయ సిబ్బందిని అప్రమత్తంచేయాలి. క్షేత్రస్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణ కొరవడుతున్నదని గత అనుభవాలు చెబుతున్నాయి. కనుక ఆ లోటుపాట్లను సమీక్షించుకుని మండల స్థాయి అధికారులను సైతం కదిలించి రైతులకు అవసరమైన సహాయసహకారాలు అందేలా చూడాలి. తక్కువ వర్షపాతం కారణంగా నిరుటితో పోలిస్తే వరి సాగు 53 శాతం తగ్గిందని అంచనా. వరినాట్ల పరిస్థితి ఇలావుంటే నూనెగింజల పంటల స్థితి మరింత అధ్వాన్నం. వాటి సాగు విస్తీర్ణం 85 శాతం తక్కువగా ఉన్నదని చెబుతున్నారు. పత్తి సాగు 28.9 శాతం తక్కువగా ఉంది. కరువు పరిస్థితి ఏర్పడితే పత్తి సాగుచేసిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సివస్తుంది. వ్యవసాయం ఇలావుంటే దానిపై ఆధారపడే కూలీల స్థితి మరీ ఘోరంగా మారుతుంది. అందువల్లే ఉపాధి హామీ పథకంవంటివి పకడ్బందీగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. బాబు ప్రభుత్వం 15,000మంది ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి పంపుతూ జీవో జారీచేసిన నేపథ్యంలో ఈ పథకం అమలు ఎలా ఉంటుందోనన్న సందేహాలు కలుగుతున్నాయి. పశుగ్రాసం అందుబాటులో ఉంచడం మరో సమస్య. ఇంతకుముందు కరువు నెలకొన్నప్పుడల్లా పెద్ద సంఖ్యలో పశువులు కబేళాలకు తరలినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి ఆ దుస్థితి దాపురించకుండా పశుగ్రాసం అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉంచడమెలాగో ప్రణాళికలు రచించాలి. అసలే ఆర్ధిక స్థితి గత కొన్నేళ్లుగా సవ్యంగా లేదు. వృద్ధిరేటు కుంగుతుంటే ద్రవ్యలోటు విజృంభిస్తున్నది. ఆహారద్రవ్యోల్బణం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతున్నది. తిండి గింజల నుంచి కూరగాయల వరకూ అన్నీ ప్రియమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనించి ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాలి. వరసబెట్టి ఖరీఫ్ సీజన్లు దెబ్బతిన్నా రబీ సీజన్లు ఎంతో కొంత కాపాడాయి. అందువల్లే తిండిగింజల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయి. వీటిని సకాలంలో తరలించి పేద ప్రజానీకానికి పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోనట్టయితే బ్లాక్ మార్కెటింగ్ పెరిగి ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏంచేయాలన్న విషయంలో యూపీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడంలో విఫలమైంది. ఎన్డీయే ప్రభుత్వమైనా దీనిపై దృష్టిపెట్టాలి. అలాంటి మార్గదర్శకాలుంటే కిందిస్థాయినుంచే సకాలంలో నివేదికలందుతాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలోనూ స్పష్టత ఉంటుంది. చురుగ్గా స్పందించడానికి వీలుకలుగుతుంది. జూలైలో వర్షాలు పడతాయన్న ఆశాభావంతో ఉంటూనే ప్రత్యామ్నాయాలపై కూడా పాలకులు దృష్టిసారిస్తారని, కష్టకాలంవస్తే రైతులకు అండదండలందించి ఆదుకుంటారని ఆశిద్దాం. -
చినుకు జాడేది?
- ఆవిరవుతున్న రైతన్న ఆశలు - నిండుకుంటున్న జలాశయాలు - తాగునీటికీ తప్పని కటకట - కృత్రిమ వర్షాలపై బీఎంసీ దృష్టి - జూలై రెండోవారంలోనే వర్షాలు - కోతలకు సిద్ధమవుతున్న సర్కార్ పింప్రి, న్యూస్‌లైన్: వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా చినుకు జాడ లేకపోవడంతో అటు రైతుల్లోనూ, ఇటు నగరవాసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికంటే ఈ ఏడాది వర్షం తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు ముందుగానే వెల్లడించిన తక్కువ మాట అటుంచి అసలు చినుకు జాడే లేదని, మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే ఈ సీజన్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఆలస్యంగా విత్తినా దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం అసాధ్యమంటున్నారు. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ఇలా ఏ ప్రాంతమైనా వర్షం కురిసిన జాడే లేదని, దీంతో ఈసారి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనంటున్నారు. మరో పక్షంరోజులు ఇంతే... పుణే వాతావరణ పరిశోధన విభాగం తెలిపిన వివరాల మేరకు.. జూలై మొదటి వారం తర్వాత వర్షాలు కురిసే అవకాశముంది. ఒకవేళ అప్పటికీ వర్షం కురవకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుతం ముంబై, పుణే వంటి పెద్ద నగరాలకు నీటిని సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీటి నిల్వలున్నా అవి అవసరాలకు సరిపడా లేవని, జూన్ రెండో వారంలో వర్షాలు కురిసే వరకు సరిపోతాయనే భరోసాతో ఉన్న అధికారులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నగరవాసులకు నీటి సరఫరాలో 20 శాతం కోత విధించే అంశమై ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ తెలిపారు. అడుగంటుతున్న జలాశయాలు... పుణే, ముంబై వంటి మహానగరాలకు సరఫరా చేసే మంచి నీటి రిజర్వాయర్లు, డ్యాంలలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. రాబోయే రోజులను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికలపై అధికారులు దృష్టి సారించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వీటికితోడు అకాాల వర్షాలు, వడగండ్లతో రాష్ట్ర రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వీరిని ఆదుకోవడానికి రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు రెండు సంవత్సరాలలో 9 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. అయితే ఈ ప్యాకేజీలు ఏమూలకు సరిపోవడం లేదు. ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో వరుసగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 నుంచి 30 శాతం వ్యవసాయ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా కేవలం 1.5 శాతం మాత్రమే పూర్తయినట్లు చెబుతున్నా వర్షాలు కురవకపోతే అవి కూడా నిష్ర్పయోజనంగా మారే అవకాశముంది. రాష్ర్టంలో ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 20 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయా నగరాలలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి నిల్వలు ఏమూలకూ సరిపోక పోవడంతో అధికారులలో కూడా ఆందోళన మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు విభాగాల పరిధిని గమనిస్తే నాగ్‌పూర్‌లో 46 శాతం, మరాఠ్వాడాలో 20 శాతం, నాసిక్‌లో 14 శాతం, పుణే విభాగంలో 13 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం ఇప్పుటి వరకు 1,464 గ్రామాలకు, 3,687 వీధులకు 1,454 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కృత్రిమ వర్షాలతో ప్రయోజనముండదు: పాటిల్ రాష్ర్టంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా? అన్న ప్రశ్నకు.. గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్.. ‘అలాంటి ఆలోచన లేదు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండద’ని సమాధానమిచ్చారు. దీని వల్ల పంటలకు ప్రయోజనంగా ఉంటుందేమో కానీ తాగు నీటి సమస్య తీరదన్నారు. పుణేలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి జయంత్ పాటిల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృత్రిమ వర్షాల వల్ల కేవలం రెండు నుంచి మూడు మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే కురుస్తుందన్నారు. కృత్రిమ వర్షాలపై దృష్టిసారించిన బీఎంసీ వర్షాలు పత్తాలేకుండా పోవడంతో మహానగర పాలక సంస్థ(బీఎంసీ) కృత్రిమ వర్షాలవైపు దృష్టి సారించింది. అందుకు టెండర్లను ఆహ్వానించేందుకు ఈ నెల 17న ప్రకటన జారీచేసింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. ఆ తరువాత 27 నుంచి ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయడానికి అవకాశముంటుందని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా చెప్పారు. కృత్రిమ వర్షం కోసం రూ.15.75 లక్షలు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాసిక్, ఠాణే పరిసరాల్లోని కార్పొరేషన్ పరిధిలోని జలాశయాలున్న ప్రాంతాల్లో కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు జలోటా చెప్పారు. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్నంతమేర ఫలితాలు ఇవ్వలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఈ ప్రయోగం సఫలీకృతం కాకపోవడంతో నిరాశే మిగిలింది. -
నైరుతికి మరో నాలుగు రోజులు!
* కేరళను తాకే అవకాశం.. ఆ తర్వాత వారంలో రాష్ట్రానికి! * తెలంగాణకు వడగాడ్పుల సూచన సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కన్యాకుమారి దక్షిణ ప్రాంతం వరకు వచ్చిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్ని తాకే అవకాశాలున్నట్టు వాతావరణ నిపు ణులు సోమవారం తెలిపారు. ఆ తర్వాత వారం రోజుల్లో నైరుతి రాష్ట్రాన్ని తాకవచ్చన్నారు. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇలా ఉండగా విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వారు తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండురోజుల పాటు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు పడవచ్చని చెప్పారు. తాజాగా కురిసిన వర్షాలకు కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలోని గుంటూరు, రాయలసీమలోని చిత్తూరుతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్టు భారత వాతావరణ కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. సోమవారం రెంటచింతలలో గరిష్టంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది. -
భానుడి భగ భగ
రెంటచింతలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత విశాఖపట్నం: గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా 40 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు సోమవారం ఏకంగా 44 డిగ్రీలు దాటి నమోదయ్యూరుు. సోమవారం గుంటూరు జిల్లా రెంటచింతలలో గరిష్టంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తిరుపతిలో 43, ఒంగోలు 42.8, నెల్లూరు 42.7, హైదరాబాద్ 38.2, విశాఖపట్నంలో 37.6. డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వాతావరణంలోని తేమ ఉక్కబోతకు కారణమవుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే అదే సమయంలో ఏర్పడే క్యూములోనింబస్ మేఘాల కారణంగా మధ్యాహ్నం, సాయంత్రం పూట అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు చెప్పారు. -
వాతావరణంలో అనిశ్చితి వల్లే వడగళ్ల వర్షం
సాక్షి, విశాఖపట్నం: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు ఒకేసారి భూమికి దగ్గరగా రావడం వల్ల వాతావరణంలో అనిశ్చితి పెరిగి వడగళ్ల వర్షం కురుస్తోందని విశాఖలోని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ‘భూమ్మీద ఉన్న తేమ ఎక్కువగా ఆకాశంలోకి వెళ్లటం వల్ల ఎక్కువ ప్రభావం చూపే మేఘాలు ఏర్పడతాయి. దీనినే క్యూములోనింబస్ అంటారు. వేడి ప్రాంతాలు, అరణ్యాలు, కొండలు విస్తరించిన చోట్ల ఇవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల తేమ ఎక్కువై భూమి నుంచి ఆకాశానికి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు మేఘాలు ఏర్పడుతున్నాయి. సాధారణ వర్షాల సమయంలో మే ఘాలు భూమి నుంచి అయిదు కిలోమీటర్ల వరకే విస్తరిస్తే, ఈ మేఘాలు అంతకుమించి దూరం ప్రయాణిస్తాయి. ఇవి ఎత్తుకు వెళ్లేకొద్దీ పైనున్న వాతావరణం మైనస్ డిగ్రీలకు చేరుకుని వడగళ్లుగా మారతాయి. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు ఇవే కారణమ’ని విశాఖ వాతావరణ నిపుణులు భానుప్రకాశ్ విశ్లేషించారు. క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డానికి గంట పడుతుంది. ఇవి చినుకులు రూపంలో పడ్డానికి మరో గంట పడుతుంది. కాని ఈ ప్రక్రియ వేగంగా జరగడంతో వడగళ్లు పడుతున్నాయని విశాఖలోని విశ్రాంత వాతావరణ నిపుణులు అచ్యుతరావు విశ్లేషించారు. -
తుఫాన్లను గుర్తించేదెలా.. నిపుణులకు ఆధారాలేంటి?
యూవీ భాస్కరరావు, విశాఖపట్నం సాక్షి విలేకరి తుఫాను తీరం దాటబోతోందని, తీరానికి ఇంత దూరంలో ఉందని వాతావరణ కేంద్రానికి చెందిన నిపుణులు, ఇతర వాతావరణ నిపుణులు చెబుతుంటారు. అయితే, వాళ్లకు ఆ సమాచారం ఎలా వస్తుందన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు అర్థంకాని విషయాలను నిపుణులు సునాయాసంగా చెబుతూ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తారు. ఆ వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం.. వాతావరణ కేంద్ర నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, ఇంకా అవసరాన్ని బట్టి మరిన్ని సార్లు వాతావరణంలోకి బెలూన్లు వదులుతారు. వాటిలో కొన్ని రసాయనాలుంటాయి. వాటిద్వారా అవి గాలి తీవ్రతను పసిగట్టి, వాతావరణ కేంద్రంలోని కంప్యూటర్లకు పంపుతాయి. అలాగే, వాతావరణ కేంద్రాల్లో ట్రాపికల్ మీటర్లుంటాయి. వాటి ద్వారా కూడా వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. డాప్లర్ రాడార్ సిస్టమ్ ద్వారా గాలిలోని తేమ శాతాన్ని గుర్తిస్తారు. ఇక తీరప్రాంతంలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్) ఉన్నాయి. వాటి పరిధిలో ఎక్కడైనా సరే ఒక్క మిల్లీ మీటరు వర్షం పడినా అవి వెంటనే రికార్డు చేసి, వాతావరణ కేంద్రాలకు పంపుతాయి. ఇది కాక, భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంటుంది. ప్రతి మూడుగంటలకు ఒకసారి చొప్పున విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం స్పెషల్ బులెటిన్లు ఇస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాఖ సిబ్బంది, విశాఖ తుఫానపు హెచ్చరికల కేంద్రం సిబ్బంది, పదవీ విరమణ చేసిన నిపుణులు.. అందరూ ఈసారి రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని రంగరించి, పై-లీన్ తుఫాను గమనాన్ని, అది కలగజేసే ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ భానుకుమార్, వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీ కృష్ణ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం రిటైర్డ్ అధికారి అచ్యుతరావు.. వీళ్లంతా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
విచిత్రమైన తుఫాను.. పై-లీన్
యూవీ భాస్కరరావు, విశాఖపట్నం సాక్షి విలేకరి పై-లీన్ తుఫాను చాలా విభిన్నమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా చాలా తుఫాన్లు వచ్చి వెళ్లినా, వాటన్నింటి కంటే దీని ప్రవర్తన చాలా తేడాగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పై-లీన్ తుఫాను కడపటి వార్తలు అందేసరికి తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. అంటే ఇది అత్యంత వేగంగా పయనిస్తున్నట్లు లెక్క. ఇప్పటికే రాష్ట్రంలో్ని 8 ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. రెండు చోట్ల సెక్షన్ ౩ హెచ్చరికలు కూడా జారీచేశారు. అయితే, ఇంత వేగంగా తుఫాను దూసుకొస్తున్నా, ఇప్పటివరకు వాతావరణంలో మాత్రం మరీ చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదు. గాలులు వేగంగా వీయట్లేదు, అలలు మరీ ఎక్కువ ఎత్తుకు ఎగసిపడటంలేదు. అందువల్ల అసలీ తుఫాను ప్రభావం ఎప్పుడు, ఏ నిమిషంలో ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నట్లు నిపుణులు అంటున్నారు. అర నిమిషంలోనే ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చి, పెనుముప్పునకు కారణం కావచ్చని చెబుతున్నారు. లేదా.. అసలు ఎలాంటి నష్టం కలగజేయకుండా కూడా తీరాన్ని దాటే అవకాశం లేకపోలేదన్నది వాతావరణ నిపుణుల అభిప్రాయం. కేవలం ఈసారి మాత్రమే ఇలా అవుతోంది. ఇంతకుముందు వచ్చిన 73 తుఫాన్లలో ఏ ఒక్కటీ ఇలా ప్రవర్తించలేదని తెలుస్తోంది. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477