ఏపీకి తప్పిన పెను ముప్పు | Cyclone Effect Is Minor In Uttarandhra | Sakshi
Sakshi News home page

ఏపీకి తప్పిన పెను ముప్పు

Published Sat, May 4 2019 2:49 AM | Last Updated on Sat, May 4 2019 8:51 AM

Cyclone Effect Is Minor In Uttarandhra - Sakshi

శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో పునరావాస కేంద్రంలో ప్రజలు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌: ఐదారు రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ‘ఫొని’ తుపాను ముప్పు తప్పిపోయింది. ఈ తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరి సమీపంలో ఎట్టకేలకు తీరాన్ని తాకింది. అక్కడే అధిక ప్రభావం చూపించింది. ఆ సమయంలో గంటకు 175–205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

తుపాను ధాటికి ఒడిశాలో ఎనిమిది మంది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతి తీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు నైరుతిగా 60 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు నైరుతి దిశగా 160 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ శనివారం నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 
తుపాను దిశ ఇలా.. 

ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర 
పెను తుపాను వల్ల ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కొద్దిరోజులుగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ తుపానుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ‘ఫొని’ ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందోనని ఉత్తరాంధ్ర వాసులు క్షణమొక యుగంగా గడిపారు. శ్రీకాకుళం జిల్లా వాసులైతే మరింతగా హడలెత్తిపోయారు. కానీ, ఉత్తరాంధ్రలో పెద్దగా నష్టం లేకుండానే ఫొని తుపాను రాష్ట్రాన్ని దాటిపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం 
తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు శుక్రవారం సాయంత్రానికి అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోవడం, ఫీడర్లు దెబ్బతినడం, వైర్లు తెగిపోవడం వల్ల 733 గ్రామాల్లో కరెంటు సరఫరా ఆగిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులు వీచాయి. తీరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఉద్యాన పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. అరటి, మామిడి, జీడిమామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఉద్ధానం ప్రాంతంలో 7,600 కొబ్బరి చెట్లు కూలిపోయాయి.

187 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వేరుశనగ, వంగ, పత్తి, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు తదితర పంటలు ధ్వంసమయ్యాయి. 162 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 141.6 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. తుపాను హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సముద్ర తీరం, లోతట్టు గ్రామాల్లోని సుమారు 3,334 కుటుంబాలను 142 పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రహదారులపై కూలిపోయిన చెట్లను తొలగించాయి. శ్రీకాకుళం జిల్లాకు తుపాను ముప్పు తప్పిపోయిందని కలెక్టర్‌ జె.నివాస్‌ శుక్రవారం ప్రకటించారు. 

విజయనగరం జిల్లాలో ప్రభావం స్వల్పమే 
ఫొని తుపాను ప్రభావం విజయనగరం జిల్లాలో స్వల్పంగానే కనిపించింది. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడా పెద్దగా గాలులు వీయలేదు. పార్వతీపురం డివిజన్‌లో స్వల్పంగా గాలి వీచినా నష్టం కలిగించలేదు. తీరప్రాంతంలో అలలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఇక ఎలాంటి ముప్పు లేదని గ్రహించిన అధికారులు పునరావాస కేంద్రాల్లో ఉన్న 2 వేల మందిని వారి స్వగ్రామాలకు పంపించారు. నెల్లిమర్లలో ముద్దుర్తి శ్రీను(34) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలమట్టమైంది. తెర్లాం, మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో వందలాది ఎకరాల్లో మామిడితోటలు ధ్వంసమయ్యాయి. పలు మండలాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అరటి చెట్లు కూడా విరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ఫొని తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో రూ.6.09 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో కేవలం 12.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 

కొనసాగుతున్న రైళ్ల రద్దు 
తుపాను ప్రభావం వల్ల పలు రైళ్లను శనివారం కూడా రద్దు చేసినట్లు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డివిజన్‌ అధికారులు తెలిపారు. రైళ్ల రద్దు గురించి ముందే తెలుసుకున్న ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమే చేశారు. కానీ, అప్పటికే బయల్దేరి రైళ్లలో ఉన్న ప్రయాణికులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే శాఖ పూర్తి టికెట్‌ రిఫండ్‌ అందజేసింది. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, హౌరా వెళ్లే ప్రయాణకులు రైల్వేస్టేషన్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రైళ్లు ఎప్పుడు నడుస్తాయో తెలియక స్టేషన్‌లో వేచి చూస్తున్నారు.  

ఐఎండీ అంచనాలు భేష్‌ 
భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాలు మరోసారి నిజమయ్యాయి. ఏప్రిల్‌ 25న ఏర్పడిన అల్పపీడనం దశల వారీగా ఎలా బలపడుతుంతో ఐఎండీ తెలియజేసింది. తొలుత తుపాను ఉత్తర తమిళనాడు– దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనించి, ఆ తర్వాత ఉత్తర–ఈశాన్య దిశగా పయనిస్తుందని వెల్లడించింది. ఈ తుపాను తీవ్రరూపం దాల్చి పెనుతుపానుగా మారుతుందని పేర్కొంది. తుపాను పెనుతుపానుగానే ఒడిశాలోని పూరి సమీపంలో శుక్రవారం ఉదయం తీరాన్ని దాటుతుందని ఐదు రోజుల క్రితమే ప్రకటించింది. ఐఎండీ అంచనా వేసినట్లు కచ్చితంగా పూరి వద్ద శుక్రవారం తుపాను తీరాన్ని దాటింది. ఐఎండీ శాస్త్రవేత్తల అంచనాలు నిజం కావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

పూరి ఏరియల్‌ వ్యూ చిత్రీకరించిన నౌకాదళం

ఫొని తుపాను ప్రభావంతో అతలాకుతలమైన పూరి పరిసర ప్రాంతాల పరిస్థితిని భారత నౌకాదళం సమీక్షించింది. తూర్పు నౌకాదళానికి చెందిన రెండు డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో తుపాను ప్రభావానికి సంబంధించిన ఏరియల్‌ వ్యూని శుక్రవారం చిత్రీకరించింది. ముంపునకు గురైన ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సేకరించింది. లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగిన దృశ్యాలు, వరద ముంపులో ఉన్న రహదారుల ఫోటోలతో పాటు పూరి, చిల్కా సరస్సు మధ్య ప్రాంతాల్లో తుపాను కారణంగా నెలకొన్న విషాద పరిస్థితులకు సంబంధించిన ఫుటేజీని నేవీ బృందాలు ఒడిశా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ ఫుటేజీ ఆధారంగా సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement