సాక్షి, అమరావతి: ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల యంత్రాంగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఫొని తుపాను ముప్పు పరిస్థితులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం ఢిల్లీ నుండి పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు. తుపాను ప్రభావం మే 2, 3 తేదీల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా సమీక్ష సమావేశంలో వివరించారు. ఆయా రాష్ట్రాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు కలిగితే తక్షణ నీటి సరఫరా ఏర్పాట్లు చేసేందుకు తగిన స్టాండ్ బై జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, కోస్టుగార్డు, షిప్పింగ్, టెలికం సంస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి సిన్హా ఆదేశించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తుపాను ప్రభావం ఉండే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మెన్ అండ్ మెటీరియల్‌ను తరలించి పూర్తి సన్నద్ధతో ఉన్నామని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు వివరించారు. తుపాను ప్రభావంతో మే 3, 4 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 13 సెం.మీ.ల వరకూ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు వాటి పరివాహక ప్రాంతాల్లోని మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని అలాంటి చోట్ల పూర్తి అప్రమత్తతో ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే రోడ్ల వెంబడి చెట్లుపడి రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే తొలగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగి కొన్ని రైళ్లు నిర్దేశిత స్టేషన్లకు చేరేందుకు చాలా ఆలస్యం కావడం లేదా చిన్న చిన్న స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోవడం జరుగుతుందన్నారు. అలాంటి సమయంలో ప్రయాణికులు తాగునీరు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేలా రైల్వే బోర్డుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు సూచించారు.
‘ఫొని’ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం
Published Wed, May 1 2019 4:38 AM | Last Updated on Wed, May 1 2019 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment