Cyclone Fani
-
విపత్తులో.. సమర్థంగా..
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమర్థ నిర్వహణకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలలు తమవంతు కృషి చేస్తున్నాయని సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే తెలిపారు. ఇటీవలి ఫానీ తుపాను సమయంలో చెన్నైలోని సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ ఎస్ఈఆర్సీ డిజైన్ చేసి, రెడ్‌క్రాస్ సంస్థ నిర్మించిన తుపాను బాధితుల కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయని, అలాగే గుజరాత్‌లోని మరో పరిశోధన సంస్థ తుపాను బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మొబైల్ నీటి శుద్ధీకరణ ప్లాంట్లను సరఫరా చేసిందని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో పద్మభూషణ్ ఎ.వి.రామారావు ‘కిలో’ల్యాబ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ, తుపాను బాధితులకు అందించే ఆహారం శుభ్రంగా ఉండేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మైసూరులోని సీఎస్ఐఆర్ సంస్థ సీఎఫ్టీఆర్ఐ ప్రత్యేక ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసిందని, దీని సాయంతో అతితక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో ఆహారపు పొట్లాలను సిద్ధం చేయగలిగామ ని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రపు నీటితోపాటు ఎలాంటి మురికి నీటినైనా శుద్ధి చేసి గంటకు నాలుగు వేల లీటర్ల తాగునీరు ఇవ్వగల మొబైల్ వ్యాన్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశం మొత్తమ్మీద పదుల సంఖ్యలో సీఎస్ఐఆర్ సంస్థలు ఉన్నాయని.. వేర్వేరు పరిశోధన సంస్థలు కలిసికట్టుగా ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోందని, వ్యవసాయ సంబంధిత ఆగ్రో మిషన్‌లో ఎనిమిది సంస్థలు పాల్గొంటుండగా.. ఫార్మా మిషన్‌లోనూ ఐదు సంస్థలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని వివరించారు. కిలో ల్యాబ్ ప్రత్యేకమైంది: శ్రీవారి చంద్రశేఖర్ ఐఐసీటీ ప్రాంగణంలో ఆవిష్కృతమైన పద్మభూషణ్ ఎ.వి.రామారావు కిలో ల్యాబ్ చాలా ప్రత్యేకమైందని.. అత్యంత పరిశుద్ధమైన వాతావరణంలో మం దుల తయారీకి అవసరమైన రసాయనాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు వీలు కల్పిస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ల్యాబ్ ప్రత్యేకతలను వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి పరిశోధనశాల ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. మొత్తం రూ.పదికోట్ల వ్యయంతో నిర్మించామని, ఫార్మా రంగపు స్టార్టప్ కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. యాంటీ వైరల్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతోనూ సురక్షితంగా పనిచేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ పరిశోధన శాలలో తయారైన రసాయనం మరే ఇతర శుద్ధీకరణ అవసరం లేకుండా ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుకోవచ్చునన్నారు. 2021 నాటికి దేశీయంగానే కీటకనాశినులు, పురుగుల మందులు తయారు చేసేందుకు ఐఐసీటీ ప్రయత్నాలు చేస్తోందని.. డ్యూపాంట్, సిన్జెంటా తదితర అంతర్జాతీయ కంపెనీల 15 కీటకనాశినుల పేటెంట్లకు కాలం చెల్లనున్న నేపథ్యంలో వాటిని మరింత మెరుగుపరిచి సొంతంగా తయారు చేస్తామని చెప్పారు. -
ఫొనిపై ఒడిశా కీలక నిర్ణయం
భువనేశ్వర్: ఫొని తుపాను సృష్టించిన వినాశనం నుంచి ఒడిశా ఇప్పడిప్పుడే కోలుకుంటుంది. గత నెల ఫొని వినాశనానికి రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యవరణం తీవ్రంగా దెబ్బతిన్నది. అనేక వృక్షాలు నేలకొరిగాయి. ఫొని ధాటికి దాదాపు 20 లక్షలకు పైగా వృక్షాలు కుప్పకూలినట్లు కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయన్ వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టారు. పర్యవరణ పరిరక్షణ నిమిత్తం ఐదేళ్ల కాలానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఫొని కారణంగా నష్టపోయిన వృక్ష సంపదను తిరిగి సాధించేందుకు రూ.188ను కేటాయించారు. ఆ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్నారు. ఫొను నష్టంపై శనివారం ఉన్నతాధికారులతో సమావేశమైన నవీన్ ఈ మేరకు అంచనాలను వేసి నష్టనివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,780 హెక్టార్ల పంట నష్టం కూడా సంభవించింది. కాగా ఫొని తుపాను విరుచుకుపడినప్పుడు తన ప్రజలకు తక్షణ సహాయ సహకారాలను అందించడంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న చర్యలు యావద్దేశం ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. -
‘టాయ్‌లెటే.. మాకు ఇళ్లుగా మారింది’
భువనేశ్వర్ : ఫొని తుపాను తన జీవితాన్ని ఆగమ్యగోచరంగా మార్చిందని ఓ దళిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తుపాను ధాటికి తన గుడిసె కూలిపోవడంతో ప్రస్తుతం టాయిలెట్లో నివసిస్తున్నానంటూ దీనస్థితిని వివరించాడు. వివరాలు.. భారీ వర్షాలు, గాలులతో ఫొని తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రపర జిల్లాలోని రఘుదీపూర్ గ్రామం అల్లకల్లోమైంది. ఈ ప్రకృతి వైపరీత్యంలో ఖిరోడ్ జేనా అనే దళిత వ్యక్తి గుడిసె కూలిపోయింది. దీంతో రోజువారీ కూలీ అయిన జేనా కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తమకు కేటాయించిన బాత్రూంలోనే జేనా కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం గురించి జేనా మాట్లాడుతూ..‘ తుపాను కారణంగా నా ఇళ్లు నాశనమైంది. అయితే ఈ పక్కా టాయిలెట్ ఎండా వానల నుంచి ప్రస్తుతం మమ్మల్ని రక్షిస్తోంది. నాతో పాటు నా భార్య, ఎదిగిన ఇద్దరు కూతుళ్లను కాపాడుతోంది. అయితే ఇక్కడ ఎన్నాళ్లు ఉండనిస్తారో తెలియదు. ఇక్కడ ఉంటున్న కారణంగా బహిరంగ విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. మళ్లీ ఇళ్లు కట్టుకునేందుకు నాకు ఎటువంటి జీవనాధారం లేదు. కూలీ చేస్తేనే రోజు గడుస్తుంది. తుపాను సహాయక నిధులు అందేదాకా మాకు ఈ దుస్థితి’ తప్పదు అని తుపాను బాధితులు ఎదుర్కునే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. కాగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్లుకు దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ అధికారి జేనా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తుపాను సహాయక నిధులతో పాటు పక్కా ఇళ్లు కూడా మంజూరయ్యేలా చేస్తామని పేర్కొన్నారు. -
ఒడిశాకు మన కరెంటోళ్ల సాంత్వన
సాక్షి, హైదరాబాద్: ఫొని తుపాను సృష్టించిన విధ్వంసంతో అతలాకుతలమైన ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మన రాష్ట్ర విద్యుత్ సిబ్బంది పడుతున్న శ్రమ ఆ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకుంటోంది. తుపాను దెబ్బకు విద్యుత్ సరఫరా కుదేలై అంధకారం నెలకొన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు సాయం చేస్తున్నారు. మన రాష్ట్ర విద్యుత్ సిబ్బంది సహకారంతో మంగళవారం నాటికి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు చుట్టుపక్కల 34 కిలోమీటర్ల మేర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఫొని తుపాను కారణంగా భీకరంగా వీచిన గాలులతో ఒడిశావ్యాప్తంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. దీంతో 16 జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సహకరించాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో భాగం కావాలని సీఎస్ ఎస్కే జోషి, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు 1,000 మంది ఉద్యోగులను ఈ నెల 7న ఒడిశాకు పంపాయి. మన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సామగ్రి, ఆహార సామగ్రి, గుడారాలు కూడా వెంట తీసుకెళ్లారు. టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎల్.గోపయ్య పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో 34 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. 537 కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న 74 ట్రాన్స్ ఫార్మర్లను మళ్లీ పనిచేసేలా చేశారు. భువనేశ్వర్‌తో పాటు, పూరీ జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేశారు. తెలంగాణ ఉద్యోగులు కష్టపడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారని కోర్దా కలెక్టర్ భూపేందర్‌సింగ్ పూనియా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రశంసలు ఒడిశాలో తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న విద్యుత్ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఒడిశాకు వెళ్లి సహాయక చర్యలు అందిస్తున్నారని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే అక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులు విజయవంతం చేశారని అభినందించారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనియాడారు. కొన్ని గంటల సమయంలోనే అక్కడికి చేరుకుని, వర్షంలో కూడా పనిచేసి సామాజిక బాధ్యత నెరవేర్చారని కొనియాడారు. -
ఒడిశాకు అక్షయ్‌కుమార్ భూరి విరాళం..!
ముంబై : గత కొన్ని రోజులుగా కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ మాతృదేశం పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఫొని తుపానుతో నష్టపోయిన ఒడిషాకు భూరీ విరాళం ప్రకటించారు. ఒడిశా సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళమిచ్చారు. పలు సామాజిక సమస్యలపై స్పందిస్తూ తన వంతుగా సాయమందించడంలో ముందుండే అక్షయ్.. ఒడిశాకు విరాళం ప్రకటించిన మొదటి యాక్టర్‌గా నిలవడం విశేషం. (చదవండి : దేశం మీద ప్రేమను నిరూపించుకోవాలా?) గతంలో కేరళ, చెన్నై వరదల సమయంలో కూడా ఆయన విరాళం అందించారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారు. భద్రతా బలగాల కుటుంబాలకు సాయం చేసేందుకు ‘భారత్ కే వీర్’ వెబ్సైట్ కూడా నెల కొల్పారు. కొంతకాలం క్రితం నిరుపేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించే కార్యక్రమంలో పాల్గొని ఒక్కో జంటకు లక్ష రూపాయల చొప్పున అందజేశారు. అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. (చదవండి : ఇదేంది అక్షయ్.. ఇట్లా చేస్తివి!?) -
ఈదురు గాలుల విధ్వంసం
ఎస్.కోట నియోజకవర్గంలోని వేపాడ, జామి, ఎల్.కోట మండలాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. చెట్లు నేలకూలాయి. అరటి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పల్లెల్లో అంధకారం అలముకుంది. పిడుగుపాటుకు జామి మండల కేంద్రంలోని దొండపర్తి కూడలిలో ఒక ఆవు మృతి చెందింది. గాలుల ధాటికి జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్లకు పరుగుతీశారు. తీరా.. చిరుజల్లులే కురవడంతో రైతులు నిరాశచెందారు. వేపాడ/జామి/ఎల్.కోట: ఎస్.కోట నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు జనం భయంతో పరుగు తీశారు. ఎక్కడికక్కడే చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో భయపడ్డారు. గాలుల ధాటికి వేపాడ మండలంలోని ఎస్‌కేఎస్‌ఆర్ పురంలో విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దిబ్బపాలెంలో పశువుల పాకలు కూలిపోయాయి. ఎస్కేఆర్ పురానికి చెందిన రైతు శిరికి ఈశ్వరమ్మకు చెందిన సుమారు 5.60 ఎకరాల బొప్పాయి తోట ధ్వంసమైంది. సుమారు రూ.25 లక్షల పంట చేతికొచ్చేదశలో నష్టపోయామంటూ ఆమె గగ్గోలు పెడుతోంది. చామలాపల్లి పంచాయతీ పోతుబందిపాలెంగిరిజన గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఇళ్లపై పడడంతో జనం పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. లక్కవరపుకోట మండలంలో సాయంత్రం కురిసిన చిరుజల్లులకు వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులకు ఎల్.కోట బీసీ కాలనీలో తాటి చెట్టు బి.పార్వతమ్మ ఇంటిపై కూలిపోయింది. దీంతో ఇంటిగోడ కూలిపోయే స్థితికి చేరింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అరకు–విశాఖ ప్రధాన రోడ్డులో సోంపురం జంక్షన్ సమీపంలో తాటిచెట్టు విద్యుత్ తీగెలపై పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్సై ప్రయోగమూర్తి జేసీబీ సాయంతో తాటిచెట్టును తొలిగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈదురు గాలులకు సుమారు 8 విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మండలంలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం కలిగింది. జామి మండలంలో పిడుగులు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఫొని తుపాను ఎలాంటి ప్రభావం చూపకపోగా ఒక్కసారి ఈదురుగాలులు ధాటిగా వీయడం, పిడుగులు పడడంతో జనం భయపడ్డారు. జామి మండలంలో మొత్తం 21 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కె.భీమసింగిలో–5, జామి, శ్రీచక్ర సిమ్మెంట్ ఫ్యాక్టరీ మధ్యలో 7, ఏ.ఆర్.పేటలో 5, కొత్తూరులో 2, గొడికొమ్ములో ఒకటి, అలమండలో ఒకటి చొప్పున విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ తీగెలు తెగిపోయాయి. గాలుల బీభత్సానికి విద్యుత్ శాఖకు సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం చేకూరిందని జామి విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కె.భీమసింగి, యాతపాలెం, చిల్లపాలెం తదితర గ్రామాలకు మంగళవారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. మామిడి పంటకు అపారనష్టం అసలే ఈ ఏడాది అరకొరగా మామిడిపంటతో మామిడి రైతులు ఆందోళనలో ఉన్నారు. సోమవారం వీచిన గాలులకు మామిడిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో ఎక్కడికక్కడ మామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పిడుగుపడి ఆవు మృతి.. జామి మండల కేంద్రంలోని దొండపర్తి జంక్షన్ వద్ద కొత్తలి రాంబాబుకు చెందిన సుమారు రూ.50వేలు విలువ చేసే ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కల్లాంలోని ఓ చెట్టుకింద ఉన్న ఆవుపై పిడుగు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎక్కడికక్కడే భారీ శబ్దంతో పిడుగులు పడడంతో మండల వాసులు భయాందోళన చెందారు. -
ఒడిశాకు రూ.1,000 కోట్లు
భువనేశ్వర్: ప్రధాని మోదీ సోమవారం ఒడిశాలోని ‘ఫొని’ తుపాను బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ప్రకృతి బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ఇప్పటికే అందజేసిన రూ.381 కోట్లకు అదనంగా తక్షణం రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన 34 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందిస్తామని ప్రధాని తెలిపారు. ఏటా ప్రకృతి విపత్తులు సర్వసాధారణంగా మారిన ఒడిశా, మిగతా తీరప్రాంత రాష్ట్రాల కోసం దీర్ఘకాలిక పరిష్కారం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాదాపు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణనష్టాన్ని కనిష్టానికి తగ్గించిన సీఎం నవీన్ పట్నాయక్‌ను ఆయన అభినందించారు. అనంతరం భువనేశ్వర్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.ఫొని కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన నీట్‌ను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. ఫోన్ చేస్తే మమత మాట్లాడలేదు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఫోన్‌కాల్‌ను స్వీకరించలేదని, ఆమె తిరిగి తనకు ఫోన్ చేయలేదని మోదీ చెప్పారు. రాష్ట్రంలో ఫొని తుపానుతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు రెండు సార్లు ఫోన్ చేసినా ఆమె మాట్లాడలేదని, తుపాను నష్టంపై సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా ఆమె స్పందించలేదని పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో, జార్ఖండ్‌లోని చైబాసాలో సోమవారం ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం తెల్సుకునేందుకు బెంగాల్ సీఎం మమతకు రెండుసార్లు ఫోన్ చేశా. అయినా, ఆమె నాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఆమెకు ప్రజల బాగోగులు పట్టవు’ అని అన్నారు. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ మిగతా విడత ఎన్నికల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుతో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ సవాల్ విసిరారు. బోఫోర్స్ కుంభకోణం తదితర అంశాలపైనా చర్చకు రావాలన్నారు. ‘కోల్‌కతాలోని నా కార్యాలయానికి మోదీ ఫోన్ చేసినపుడులో ఖరగ్‌పూర్‌లో తుపాను సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా. అందుకే ఫోన్ మాట్లాడలేదు’ అని మమత వివరణ ఇచ్చారు. -
ఆపన్నుల బాసటకు ఆర్భాటమేల?
ఫొని తుపాను విరుచుకుపడినప్పుడు తన ప్రజలకు తక్షణ సహాయ సహకారాలను అందించడంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న చర్యలు యావద్దేశం ప్రశంసలను పొందుతున్నాయి. ఏపీ సీఎం బాబులాగా తన చుట్టూ అధికారుల్ని తిప్పుకుంటూ, పచార్లు కొడుతూ ప్రజల దృష్టిని ప్రచార ఆర్భాటం కోసం ఆకర్షించుకోవడానికి పట్నాయక్ ఆస్కారం ఇవ్వలేదు. ఒడిశా లోతట్టు ప్రాంతాల్లోని 10 వేల గ్రామాల నుంచి, 12 లక్షల మంది ప్రజల్ని 4 వేల సురక్షిత కేంద్రాలకు, 860 ఉచిత ఆహార సదుపాయ కేంద్రాలకు జయప్రదంగా లక్షమంది అధికారులు తరలించగలగడానికి పట్నాయక్ చుట్టూ అధికారులు వందిమాగధుల్లా నాట్యం ఆడకపోవడమే ప్రధాన కారణమని గుర్తించాలి. వేసవిలో తుపానులు రావటం అందులో అరుదైన ప్రకృతి వైపరీత్యం. కానీ మారిన వాతావరణ పరిస్థితుల్లో, వేసవి కాలాన్ని కూడా తుపానులు విడిచిపెట్టడం లేదు. గత 43 సంవత్సరాల్లో ఎదురైన తుపానుల్లో ‘ఫొని’ వేసవి తుపాను దేశంలోనే అత్యంత బలీయమైన దృశ్యం. బంగాళాప్రాంతం నానాటికీ వేడెక్కిపోతున్న ఫలితంగానే ఈ అసాధారణ పరిణామం’’. – భారత వాతావరణ శాఖ ప్రకటన ‘‘ఈసారి భారత వాతావరణ శాఖ చేసిన ముందస్తు హెచ్చరికలు, భారీ జన నష్టాన్ని నివారించడానికి దోహదం చేశాయి. ఆ సంస్థ ఈ సారి ఆచి తూచినట్లు చేసిన అంచనా జననష్టాన్ని అదుపు చేయగలిగింది. ఫలి తంగా అధికారులు తుపాను ధాటికి గురి కానున్న ప్రాంతాల ప్రజల్ని ముందస్తు వ్యూహంతో, తక్కువ జననష్టంతో సురక్షిత కేంద్రాలకు చేర్చి రక్షించడానికి దోహదం చేసింది’’ – ఐక్యరాజ్యసమితి ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ సంస్థ కితాబు. వాన బడాయి చవిటి పర్రమీద’ అన్నట్లుగా వాతావరణ కాలుష్యంపై ప్రపంచ దేశాలు ఎన్ని అంతర్జాతీయ సమావేశాలు నిర్ణయించుకున్నా, జనాల ఉనికిని, ఉసురునూ పంటల్నీ, పంట పొలాలను, పారిశ్రామిక వాడల్ని పలు వర్గాల జనావాసాల్ని అతలాకుతలం చేసి, భారీ ధన ప్రాణ నష్టాలకు దారి తీస్తాయి అకాల వర్షాలూ, తుపానులూ. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలను చుట్టుముట్టిన తిత్లీ తుపా నుకూ, కొన్ని రోజుల క్రితం పొరుగు రాష్ట్రమైన ఒడిశాను పెనవేసుకుని భారీనష్టానికి పగబట్టి మరీ గురిచేసిన ఫొనికీ నష్ట విస్తృతిలో పెద్ద తేడా ఉంది. అయితే ఏ ప్రకృతి వైపరీత్యం ఉన్న ఫళాన విరుచుకుపడినా, దాని నివారణకు, నష్టాల వ్యాప్తి నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు సర్వసన్నద్ధంగా ఉండాల్సిన ధర్మం పాలకులదీ, అధికారులదీ. నష్టాలను అంచనా కట్టడంలోనే కాదు, వాటిని దొరికిందే అదనుగా భావించి పాలకులు, వారి అవినీతి ప్రవర్తన స్థాయిని బట్టి సంబంధిత అధి కారులు వాస్తవాలను కేంద్రానికి సహాయార్థం సమర్పించడంలో కూడా చొరవ, నిజాయితీ అవసరం. ఇక్కడ అన్నింటికంటే ప్రధానమైన అంశం.. వాతావరణ శాఖ ఫలానా తుపాను విరుచుకుపడబోతున్నదని ప్రకటించిన మరుక్షణమే ఆ ఉపద్రవం ఘటిల్లడానికి ముందే తొలి ఇరవైనాలుగు గంటలలోనే తుపానుకు గురికాగల ప్రాంతాలనుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, సహాయక కేంద్రాలకు హుటాహుటిన తరలించే చైతన్యం పాలకుల్లో ఉండాలి. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో 1970లలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన తుపాను సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్త వహించిన ఆనాటి పాల కుల మూలంగా, 72 గంటల ముందుగానే అమెరికా వాతావరణ సంస్థలు అంత దూరంనుంచి మన బంగాళాఖాతం జలాల్లో రగులు తున్న, మసులుతున్న, సుడులు తిరుగుతూ పైకి ఎగసిపడుతున్న జ్వాలా తోరణాన్ని పసిగట్టి హెచ్చరించినా పట్టించుకోకుండా నిద్రావ స్థలో ఉన్న నాటి రాష్ట్ర పాలకుల అలసత్వం వల్ల దివిసీమ గ్రామాలను 12 అడుగుల ఎత్తున ముంచివేసి 10నుంచి, 12 వేలమంది నిండు ప్రాణాలను నిమి షాల్లో బలిగొన్నది. అలాంటి దారుణ విషాద ఘట్టాన్ని చవిచూడకుండా ఒడిశా ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వాతా వరణ శాఖ హెచ్చరికలు ప్రారంభమైన మరుక్షణం నుంచి శరవేగాన కదిలి, అధికార యంత్రాంగాన్ని తనచుట్టూ తిప్పుకోకుండా తుపాను నష్టనివారణ పనులకు వారిని హుటాహుటిన సంబంధిత ప్రాంతాలకు తరలించి ప్రజల రక్షణకు, పునరావాస, సదుపాయాల కల్పనకు ప్రాధా న్యమివ్వడంతో యావత్తు దేశ ప్రజల ప్రశంసలకు పాత్రులయ్యారు. ముఖ్యమంత్రి తన చుట్టూ అధికారుల్ని తిప్పుకుంటూ పచార్లు కొడుతూ ప్రజల దృష్టిని ప్రచార ఆర్భాటం కోసం ఆకర్షించుకోవడానికి పట్నాయక్ ఆస్కారం ఇవ్వలేదు. అధికారుల్ని స్వేచ్ఛగా రంగంలోకి దించి, తాను మాత్రం హెలికాప్టర్లో వెళ్లి నష్టాలకు గురైన ప్రాంతాలలో పర్యటించి, నష్టాన్ని అంచనా కట్టడానికి అధికారులతో సంప్రదించడానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం– పరమ ఆచరణ సాధ్యమూ నికార్సయిన వైఖరిగా మనం భావించాలి. ఇంతవరకు హుదూద్ తుపాను బీభత్సంవల్ల ఆంధ్ర ప్రదేశ్‌లోని బాధిత ప్రాంతాల పంటలకు, ఆస్తులకు, ప్రజలకు వాటిల్లిన నష్టాన్ని ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. 1,600 కోట్ల సహాయానికి లెక్క జమా చూపలేదని ఈ క్షణం దాకా కేంద్రం ఫిర్యాదు చేయడాన్ని స్థానిక పాలకులు సిగ్గుగా, రాష్ట్రానికి తలవంపులుగా చంద్ర బాబు భావించడం లేదు. ఇప్పుడు పడగవిప్పి ఒడిశాకు భారీ నష్టం కలగజేసిన ‘ఫొని’ మాత్ర మేకాదు, రానున్న రోజుల్లో కాలుష్య వాతావరణం వ్యాప్తిని అరికట్టడా నికి శ్రద్ధ వహించని ప్రపంచ పాలకుల వైఫల్యం కారణంగా ఆ కాలుష్యం రానున్న రోజుల్లో వచ్చే సాధారణ వర్ష రుతువు చక్రగతిని కూడా భారీ ఎత్తున నిరోధించే అవకాశం ఉందని ‘నేచర్’ అనే అంతర్జాతీయ సాధి కార పరిశోధనా పత్రిక హెచ్చరిస్తోందని మరచిపోరాదు. ‘ఫొని’ వల్ల కలి గిన నష్టం ఒడిశాలో ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే–లోతట్టు ప్రాంతా ల్లోని 10 వేల గ్రామాల నుంచి, 12 లక్షల మంది ప్రజల్ని 4 వేల సురక్షిత కేంద్రాలకు, 860 ఉచిత ఆహార సదుపాయ కేంద్రాలకు జయప్రదంగా లక్షమంది అధికారులు తరలించగలగడం ముఖ్యమంత్రి పట్నాయక్ చుట్టూ అధికారులు వందిమాగధులా ‘హల్లీసకం’ (నాట్యం) ఆడకపోవ డమే ప్రధాన కారణమని గుర్తించాలి. ఎందుకంటే, వసుంధర (భూమి) సౌందర్యానికి మూలం వానలు గదా. అందుకే ‘వరిపొట్టుకు పుట్టెడు నీరు’ కావాలన్న సామెత వచ్చింది. మనకు ఇంగ్లిష్ నెలలపట్టీ వచ్చి, తెలుగు వెలుగు నుంచి తప్పుకుని అక్కడ ‘మరక’ లేదు, ఇక్కడ ‘మచ్చ’ లేదనడానికి బదులు వ్యాపారకర్తల నోట్లో తెలుగు ‘నో మచ్చ’ ‘నో మరక’ అన్న అవతారం ఎత్తింది. తెలుగు పదాల వాడకానికే ‘నామోషీ’ అవుతున్నప్పుడు తెలుగు మాసాలు, రుతువులు, తిథులు, నక్షత్రాలు, దిక్కులు తెలియకుండా ‘దిక్కులు’ చూడ్డం ఆనవాయితీగా మారింది. రత్న శాస్త్రం మాదిరిగా వర్ష శాస్త్రం కూడా ఉంది. ఆకాశంలో పుట్టిన మబ్బుల ఆకారాన్ని, రంగుల్ని బట్టి ఉరుములూ, మెరుపులూ చూసి, వానలు కురిసే తీరుతెన్నుల్ని అంచనా కట్టారు ప్రాచీనులు. ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరైన వరాహమిత్రుడు మబ్బులు చెట్ల ఆకారంలో కన్పించినా, నిగనిగలాడుతూ, తెల్లతెల్లగా వెలిమబ్బుల్లా కన్పించినా అలాంటి మబ్బులు నేలపైన అధికంగా వాన కురిపిస్తాయట. వాటి ఆకా రాలను వర్ణిస్తూ ఆయన మేఘాల సమూహాన్ని రకరకాలుగా వర్ణించడం ఒక విశేషం: అతనికెలా అనిపించిందట? ఆ మేఘాలు ఒక్కో కోణంలో ఒక మంచంలా, ఒక సింహంలా, ఏనుగు కుంభ స్థలంలా, ఒక విసనకర్ర (వింజామరం)లా, చంద్రబింబపు సొగసులా, గుడి గోపురంలా, వెండి కొండలా, ఓ చెరువులా, ఓ కొలనులా, గొడుగులా, మొసళ్లలా, దేవతా విమానాల్లో కనిపించాయట. మేఘాలు ఉంటే ధ్వనిని బట్టి అవి కురిసే మబ్బులా అరిచే మబ్బులా అని ఆయా మబ్బు రంగుల్ని బట్టి ఆయా ప్రాంతాల ప్రజల్లో పెరిగే కలహాలను కూడా ఊహించగలిగేవారట. విత్త నాలు జల్లాల్సిన కాలాల్ని, అందుకు అనుకూలించే కార్తెల్ని, నక్షత్రాల్ని పేర్కొనేవారు, ధాన్యాదుల తరగతుల్ని బట్టి, వేసే పైరుల్నిబట్టి పంట ‘జాతకం’ లెక్క గట్టేవారు, కోతల కాలాల్ని నిర్ణయించేవారు. భారత వాతావరణశాఖ అయినా ఈ ఏడాది నిక్కచ్చిగా ఉజ్జాయింపున సరిగానే తుపానుల అవకాశాన్ని అంచనా వేసినా, ఫ్రెంచి పరిశోధకులు మాత్రం సముద్రజలాల ఆధారంగా ఏర్పడే మెరైన్ మేఘాలు వాతావరణ మార్పులవల్ల వేడెక్కిపోతున్న భూమివల్ల వ్యాపించే సెగ నుంచి మానవు లకు రక్షణ కవచంగా తోడ్పడవచ్చునని ఊహిస్తున్నారు. సముద్ర ఉపరి తలంపై ఏర్పడే ఈ మేఘాలు వేడెక్కిపోతున్న వాతావరణంలో మరి రెండుమూడు రెట్లు పెరిగిపోయే బొగ్గుపులుసు వాయువుల్ని ఒక మేరకు చెదరగొట్టవచ్చునని కూడా వారు అంచనా వేశారు. ఈ ప్రమాదకర దృశ్యాన్ని వివరిస్తూ ఆ శాస్త్రవేత్తలు ‘మనకు తెలియని ఈ ప్రమాదకర వాతావరణం వాకిళ్లు తెరుచుకుని ఉందన్న వాస్తవాన్ని మరవరాదని’ కూడా హెచ్చరిస్తున్నారు. మన దేశం ఇరుగు పొరుగు దేశాలలో వచ్చే వేసవి తుపానులు వాయుగుండాలుగా గానీ, లేదా క్రమంగా అల్ప పీడ నం గానీ ఏర్పడవచ్చు. ఇలాంటి బాపతు తుపానులు 35 శాతం సంభ వమని కూడా వారు చెబుతున్నారు. అయితే వీటిలో అత్యంత భీకర రూపం దాల్చి వినాశనం సృష్టించగలవిగా ఉంటే 7 శాతానికి మించవు. మన ఆలోచనలు, మనసులు, సభలు, సమావేశాలు అరుణారుణం కావచ్చుగానీ, మేఘం మాత్రం అరుణారుణం అయితే మాత్రం అతి తక్కువ వర్షం పడుతుందట. కనుకనే బహుశా మన ప్రాచీనులు పొలంలో విత్తనాలు చల్లడానికి (బీజావాపన) అనుకూలించే కార్తెల జాబితాను ఎంచుకుని ‘ఉత్తర’తో మొదలయ్యే మూడు నక్షత్రాలున్న (ఉత్తర ఫల్గుని, ఉత్తారాషాడ, ఉత్తరాభాద్ర) రోజున పొలంలో విత్తనాలు చల్లితే ఆయా ధాన్యాల రాబడి ఇబ్బడిముబ్బడిగా ఉంటుందని ఒక విశ్వాసం. కాగా ప్రపంచ విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా సంస్థలు శాఖోపశాఖలుగా పెరిగి వాటితోపాటు విత్తన పరిశోధనలు కూడా తామ రతంపరగా వృద్ధి అవుతున్న ఆధునిక యుగంలో ఏ పంట వంగడమైనా అంటూ సొంటూ అన్న భేదం తొలగిపోయింది. అందుకే అన్నారు– ‘అదను ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు’ అని! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ కృషి ప్రశంసనీయం
ప్రకృతి ప్రకోపించి విరుచుకుపడినప్పుడు దాన్ని శాంతింపజేయడం ఎవరి తరమూ కాదు. ఇప్పటి కున్న శాస్త్ర పరిజ్ఞానం మేరకు మనిషి చేయగలిగిందల్లా దాని ఆనవాళ్లను ముందుగా పసిగట్టి, అది సృష్టించగల విధ్వంసాన్ని అంచనా వేసుకుని ప్రజలందరినీ అప్రమత్తం చేయడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి జన నష్టం లేకుండా శాయశక్తులా ప్రయత్నించడం మాత్రమే. ఇవిమాత్రమే కాదు...వైపరీత్యం సమయంలోనూ, అది నిష్క్రమించాకా సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టగలగాలి. అందుకవసరమైన సమస్త మౌలిక సదుపాయాలనూ సిద్ధం చేయాలి. వీటన్నిటినీ ఎంత ఒడుపుగా, ఎంత నేర్పుగా, ఎంత సమన్వయంతో చేయగలుగుతుం దన్నదే ఏ ప్రభుత్వ పనితనానికైనా గీటురాయి. దాదాపు పదిరోజులపాటు తీర ప్రాంత రాష్ట్రాలను ఊపిరాడనీయకుండా చేసిన ‘ఫొని’ తుపాను శుక్రవారం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటినప్పుడు అది సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. గంటకు దాదాపు 205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. కుండపోతగా వర్షాలు పడ్డాయి. లక్షలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించవలసి వచ్చింది. 30మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా పూరి, ఖుర్దా జిల్లాలు తుపాను తాకిడికి చివురుటాకుల్లా వణికాయి. ‘ఫొని’ ఆచూకీ పదిరోజుల ముందే తెలిసినా అది ఉన్నకొద్దీ బలం పుంజుకుంటూ, వంపులు తిరుగుతూ సాగిన తీరు శాస్త్రవేత్తలను కూడా అయోమయంలో పడేసింది. దాని నడకను గమనిస్తూ అది తమిళనాడు దగ్గర తీరం దాటొచ్చునని ఒకసారి, ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడొచ్చునని మరోసారి వారు అంచనా వేశారు. కానీ గాలులు వీచే తీరు, సముద్రంలో అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు దాని దిశను మార్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఒరుసుకుంటూ అది సాగించిన ప్రయాణం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నష్టాన్ని చవిచూడక తప్పలేదు. జన నష్టం లేక పోయినా వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. 958 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ రెండు జిల్లాల్లో రూ. 58.61 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి పంపిన ప్రాథమిక అంచనా నివేదికలో తెలియజేశారు. ‘ఫొని’ విలయాన్ని ఒడిశా ఎదుర్కొన్న తీరు అత్యంత ప్రశంసనీయమైనది. ప్రభుత్వం 43,000 మంది వలంటీర్లను రంగంలోకి దించింది. విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి మరో వేయిమంది సిబ్బందిని ముఖ్యప్రాంతాలకు తరలించింది. ఎస్సెమ్మెస్‌లు, టీవీ చానెళ్లు, సైరన్లు, మైక్‌లు... ఒకటేమిటి అన్నిటినీ సంపూర్ణంగా వినియోగించుకుంది. ‘తుపాను విరుచుకుపడబోతోంది... సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండ’న్నదే ఆ సందేశాల సారాంశం. రంగంలోకి దిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేసే వేలాదిమంది వలంటీర్లతో, సహాయ సిబ్బందితో సమన్వయపరచుకుంటూ సహాయశిబిరాలకు 12 లక్షలమంది తరలివెళ్లేలా చూశారు. అక్కడ కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆహారం, మంచినీరు ప్యాకెట్లు ప్రతి ఒక్కరికీ చేరేయగలిగారు. 1999నాటి పెనుతు పాను 10,000మందిని పొట్టనబెట్టుకున్నదని గుర్తుంచుకుంటే...‘ఫొని’ రాక్షసిని ఇప్పుడు ఒడిశా ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొన్నదో అవగాహనకొస్తుంది. పాలకులకు ముందు చూపుంటే, తీవ్రతను అంచనా వేయగలిగితే, దానికి తగ్గట్టుగా సర్వ శక్తుల్ని కేంద్రీకరించగలిగితే నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయడం కష్టం కాదని ఒడిశా నిరూపించింది. కేవలం అయిదు పేజీల కార్యాచరణ ప్రణాళిక ఈ అద్భుతాన్ని సాధించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రణాళిక ప్రతి అంశాన్నీ స్పృశించింది. షెల్టర్లకు ప్రజల్ని చేరేసేటపుడు ఏ ఏ అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలో ఇది సూచించింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, చిన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పింది. తమ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, అందులో నివసిస్తున్నవారి వివరాలున్న జాబితాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ‘ఫొని’ శుక్రవారం ఉదయం విరుచుకుపడగా అంతకు 24 గంటలకన్నా ముందే ఒక క్రమపద్ధతిలో సహాయచర్యలు మొదలైపోయాయి. విపత్తులు విరుచుకుపడినప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో ఒడిశా తన ఆచరణ ద్వారా దేశానికి మాత్రమే కాదు... ప్రపంచ దేశాలకు కూడా చాటింది. అందువల్లే అది అంత ర్జాతీయ మీడియా ప్రశంసలు కూడా అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వ యంత్రాంగం సమర్థత అందరికీ తేటతెల్లమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సారథ్యంలో తుపానును ఎదుర్కొనడానికి ప్రభుత్వంలో పైనుంచి కిందివరకూ అందరికందరూ ఎవరి బాధ్యతలను వారు అంకితభావంతో, దృఢ సంకల్పంతో నిర్వర్తించారు. కానీ చంద్రబాబు ఏలుబడి దీనికి భిన్నం. ఆయన అధికారంలోకొచ్చాక ఇంచు మించు ఏడాదికొక తుపాను రాష్ట్రంపై విరుచుకుపడింది. ఈ సందర్భాలన్నిటా ఆయనకు ప్రచారయావ తప్ప సామాన్య జనం పడే కష్టాలు కనబడలేదు. అంతటా తానే కనబడుతూ, సిబ్బందిని అదిలిస్తూ కేవలం తన కారణంగా మాత్రమే వారంతా పనిచేస్తున్నారన్న అభిప్రాయం కలిగించ డానికి ఆయన వెంపర్లాడేవారు. పర్యవసానంగా క్షేత్రస్థాయిలో సహాయకార్యక్రమాలు చతికిలబ డేవి. సొంత మీడియా మాత్రం ఆయన్ను ఆకాశానికెత్తేది. హుద్‌హుద్, తిత్లీ తుపానుల సమ యంలో ఆయన చేసిన హడావుడిని, తాగునీరు సైతం అందక ప్రజలు ఇబ్బందిపడిన తీరును ఎవరూ మరిచిపోరు. ఇప్పుడలాంటి అనాలోచిత చేష్టలు లేవు. అధికార యంత్రాంగం స్వేచ్ఛగా, సమర్ధవంతంగా పనిచేయగలిగింది. విపత్తు నిర్వహణ నియమావళిని తు.చ. తప్పకుండా పాటించ గలిగింది. ఫలితంగా బాధిత ప్రజలకెంతో మేలు జరిగింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అనుభవాలు మున్ముందు అందరికీ ఆదర్శం కావాలని ఆశించాలి. -
‘జై శ్రీ రాం అంటే.. జైలుకు పంపిస్తున్నారు’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచార కార్యక్రమాల్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసే వారిని మమతా బెనర్జీ అరెస్ట్ చేయించి.. జైలులో పెడుతున్నారని మోదీ ఆరోపించారు. ఒక వేళ తాను ‘జై శ్రీరాం’ అంటే.. దీదీ తనను కూడా అరెస్ట్ చేయిస్తుందని మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రచారానికి వెళ్తోన్న దీదీ కాన్వాయ్‌ను అడ్డుకుని ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు మమతా. దీనిపై స్పందిస్తూ.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. ‘ప్రస్తుతం దీదీ చాలా చిరాగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె ముందు దేవుడి పేరు ఎత్తినా తప్పే. ప్రధాని కావాలనేది దీదీ కోరిక. కానీ ఆమె కల నెరవేరదు. బెంగాల్లో ఆమె 10 సీట్లు కూడా గెలవద’న్నారు మోదీ. అంతేకాక ‘దీదీకి దేశం పట్ల కొంచెం కూడా ప్రేమ లేదు. ఇప్పటి వరకూ దేశాన్ని పొగుడుతూ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఖరికి మసూద్ అజర్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడలేదు. అలా మాట్లాడితే.. ఆమె ఓటు బ్యాంక్ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అందుకే దీని గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేద’న్నారు మోదీ. అంతేకాక ఫొని తుపాను గురించి ఆరా తీయడానికి తాను దీదీకి ఫోన్ చేశానన్నారు మోదీ. కానీ తనతో మాట్లాడ్డానికి ఆమెకు అహంకారం అడ్డువచ్చిందన్నారు. అందుకే తన కాల్స్ అటెండ్ చేయలేదన్నారు మోదీ. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. గడువు తీరిన ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. -
ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
-
బంగ్లాదేశ్ తీరప్రాంతాలపై విరుచుకుపడిన ఫొని తుపాను
-
ఒడిశాకు అండగా ఉంటాం: ఏపీ సీఎస్
సాక్షి, ఢిల్లీ, అమరావతి : ఫొని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శాయశక్తులా అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒడిశా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని విధాలా అండగా ఉంటారన్నారు. ఆదివారం ఫొని తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూలిపోయన చెట్ల తొలగింపునకు 200 పవర్ షా(కటింగ్ రంపాలు) అందించామన్నారు. 12 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లతో తాగునీరు పంపిణీ చేశామన్నారు. సోమవారం మరో 20 ట్యాంకర్లతో తాగునీరు అందజేస్తామని తెలిపారు. విద్యుత్ సేవల పునరుద్ధరణకు 1100 మంది విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వారిని ఒడిశాకు పంపేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే వారంతా శ్రీకాకుళంలో ఉన్నారని, అక్కడి కలెక్టర్‌తో మాట్లాడి, విద్యుత్ సిబ్బంది ఒడిశాకు తరలిస్తామన్నాని చెప్పారు. ఇనుప విద్యుత్ స్తంభాలు, 5 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన 500 సింటెక్స్ వాటర్ ట్యాంకులు అందజేయాలని ఒడిశా సీఎస్ కోరారన్నారు. వాటర్ ట్యాంకుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఇనుప విద్యుత్ స్తంభాలు తమ దగ్గర లేవని, ఏపీలో సిమెంట్‌తో తయారు చేసిన విద్యుత్ స్తంభాలే వాడుతున్నట్లు తెలిపామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఒడిశా తుపాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.15కోట్లు విరాళం ప్రకటించారు. ఛత్తీస్ఘర్ 11కోట్లు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులు తలా 10 కోట్ల విరాళాలు ప్రకటించాయి. -
ఫొని తుపాను ఖర్చులోనూ భారీ అవినీతి
-
ఫొని తుపాను ఖర్చులోనూ భారీ అవినీతి
సాక్షి, శ్రీకాకుళం : ఫొని తుపాను ఖర్చుల్లోనూ భారీ అవినీతి వెలుగుచూస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో తుపాను నష్టాన్ని పెంచి చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 38 కోట్ల 43లక్షల మేర నష్టం జరిగితే... అధికారులు రూ. 58కోట్ల 61 లక్షలుగా చూపిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఖర్చుల్లోనే ఎక్కువగా అవినీతి ఉందని తెలుస్తోంది. తుపాను బీభత్సం ఘటనాస్థలానికి చేరుకుని వినియోగించని క్రేన్లు, జనరేటర్లు, కూలీలకు కోట్లలో నగదు చెల్లింపులు జరిగాయని చూపిస్తున్నారని, ఈపీడీసీఎల్‌లో మెటీరియల్ కొనుగోళ్లలో ప్రాజెక్ట్స్, ఆపరేషన్ సీజీఎంలు చేతివాటం ప్రదర్శించినట్టు సమాచారం. -
అలర్ట్‌తో తప్పిన ముప్పు..!
-
బంగ్లాదేశ్‌లో ‘ఫొని’ బీభత్సం
ఢాకా/భువనేశ్వర్: భారత్‌లోని ఒడిశా రాష్ట్రాన్ని వణికించిన పెను తుపాన్ ‘ఫొని’ శనివారం బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు తోడుగా వాగులు, వంకలన్నీ ఉప్పొంగడంతో బంగ్లాదేశ్‌లో ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోగా, 63 మంది గాయపడ్డారు. కుండపోత వర్షాలతో నదులు పొంగడంతో 36 గ్రామాలు నీటమునిగాయి. 16 లక్షల మంది ప్రజలను బంగ్లా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలమైన ఈదురు గాలులకు 8 తీరప్రాంత జిల్లాల్లో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒడిశాలో 16కు చేరుకున్న మృతులు ఒడిశాలో ‘ఫొని’ పెను తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16కు చేరుకుంది. ఫొని ప్రభావంతో శుక్రవారం నాటికి 8 మంది చనిపోగా, ఈ సంఖ్య తాజాగా 16కు పెరిగింది. కాగా, ఫొని భారత తీరానికి దూరంగా వెళ్లిపోవడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కుప్పకూలిన 10,000 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ ‘ఫొని’ ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఒడిశా సీఎం కార్యాలయం తెలిపింది. -
‘ఫొని’ నష్టం రూ.58.61 కోట్లు
సాక్షి, అమరావతి : ఫొని తుపాను కారణంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రూ.58.61 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఇది ప్రాథమిక అంచనా అని ఆయన చెప్పారు. తుపాను సహాయక చర్యలపై శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సిన్హా రాష్ట్రంతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నష్టం, తీసుకున్న చర్యలను సీఎస్ ఆయనకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 19.7 సెంమీల వర్షపాతం నమోదైందన్నారు. ఇదే జిల్లాలోని నాలుగు మండలాల్లో 2 లక్షల 74వేల మంది తుపానుకు ప్రభావితమయ్యారన్నారు. 304 ఇళ్లు దెబ్బతినగా, వాటిలో 168 ఇళ్లు పాక్షికంగాను, 19 పక్కా ఇళ్లు.. 35 కచ్చా ఇళ్లు పూర్తిగాను దెబ్బతిన్నాయని సిన్హాకు సీఎస్ వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 15,460 మందిని 139 పునరావాస కేంద్రాలకు, విజయనగరం జిల్లాలో 2వేల మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. బాధితుల కోసం 348 వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు. 958 హెక్టార్లలో పంటలకు నష్టం కాగా, తుపాను కారణంగా ఈ రెండు జిల్లాల్లో 958 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఎల్వీ చెప్పారు. 214 హెక్టార్లలో వరి, 743 హెక్టార్లలో వేరుశనగ, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలకు నష్టం కలిగిందన్నారు. సుమారు 10 వేల కొబ్బరి చెట్లు నేలకూలగా 1,991 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 229 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు. అలాగే, రోడ్లు, భవనాల శాఖకు రూ.21.57 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రహదారులకు రూ.20.05 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.9.75 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.4.09 కోట్లు, మున్సిపల్ పరిపాలనా శాఖకు రూ.1.82 కోట్లు, గ్రామీణ రక్షిత మంచినీటి విభాగానికి రూ.42.68 లక్షలు, గృహ నిర్మాణానికి రూ.85.35 లక్షలు, పశు సంవర్థక శాఖకు రూ.3.94 లక్షలు కేటాయించామన్నారు. కాగా చేనేత జౌళిశాఖ సహా పలు రంగాలకు సంబంధించి ప్రాథమిక నష్టం అంచనాలను కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు 2,100 తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 733 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ చెప్పారు. 33 కేవీ ఫీడర్లు 19, 11 కేవీ ఫీడర్లు 101, 11/33 కేవీ ఫీడర్లు 45 దెబ్బతినగా సుమారు 2,100 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని మండల కేంద్రాలకు ఇప్పటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో 74 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. దెబ్బతిన్న స్తంభాలన్నింటితోపాటు.. లక్షా 73 వేల వ్యవసాయేతర విద్యుత్ సర్వీసులను పునరుద్ధరించామన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా, మున్సిపల్ పరిపాలన, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. సమావేశంలో సిన్హా మాట్లాడుతూ.. నష్టం అంచనాలను త్వరితగతిన అంచనా వేసి పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒడిశాకు రాష్ట్రం చేయూత రాష్ట్రం నుంచి రెండు లక్షల టార్పాలిన్ ప్లాస్టిక్ షీట్లు, 12 లక్షల మంచినీటి ప్యాకెట్లు, యాంత్రిక రంపాలను హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు పంపిస్తున్నట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి తెలిపారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా ఎల్వీ మాట్లాడారు. అవసరాన్ని బట్టి వీటిని యుద్ధప్రాతిపదికన పంపించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి వరప్రసాద్‌ను సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీ, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈఓ బాబు పాల్గొన్నారు. -
సీఎస్ మార్గనిర్దేశంతో తగ్గిన ఆస్తి నష్టం
సాక్షి, అమరావతి: ఎలాంటి హడావిడి లేకుండా అధికార యంత్రాంగాన్ని తమ పని తాము చేసుకోనిస్తే అద్భుత ఫలితాలుంటాయనడానికి ‘ఫొని’ తుపాను సందర్భంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘రేయింబవళ్లు సమీక్షలు లేవు.. అది చేయండి.. ఇది చేయండి.. ఇలా కాదు.. అలా కాదు.. అనే సీఎం చంద్రబాబు హడావిడి అసలే లేదు.. మంత్రులు, సీఎం పర్యటనలు లేవు.. తుపాను సన్నద్ధత, బాధితులకు సహాయ కార్యక్రమాలను గాలికొదిలి సీఎం బాబు కోసం నిరీక్షణ అంతకన్నా లేదు.. వెరసి ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరి బాధ్యతలు వారు పక్కాగా నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో, పునరావాస ప్రాంతాల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? సన్నద్ధత ఎలా ఉండాలి? అనే అంశాలపై వివిధ కీలక హోదాల్లో పని చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు ఉన్న అనుభవం ఇప్పుడు ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగానికి బాగా ఉపయోగపడింది. ‘తుపాను ప్రభావం చూపడానికి రెండు మూడు రోజుల ముందే సీనియర్ అధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముందే తెలిసినందున జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇలా అన్ని అంశాలపై అధికారులకు తన అనుభవంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం మార్గనిర్దేశం చేశారు. సంబంధిత అధికారులంతా అంకిత భావంతో పనిచేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా సహాయ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాయి. హడావిడి మాటే లేదు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేయాలో అవన్నీ యథా ప్రకారం జరిగిపోయాయి. తుపాను తీరం దాటిన రెండో రోజుకే ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. మార్గనిర్దేశం బాగుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’ అని క్షేత్ర స్థాయి అధికారులతోపాటు ఐఏఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు నియమావళి చెప్పిందదే.. ‘విపత్తులు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయి అధికారులను ఎవరి పని వారు చేసుకోనివ్వాలి. వీఐపీలు, ప్రజా ప్రతినిధులు వెళ్లి హడావిడి చేస్తే బాధితులకు సేవలు పక్కన పెట్టి అధికారులు, వీరి వెంట పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది సహాయ కార్యక్రమాలకు ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల విపత్తులు సంభవించినప్పుడు ప్రజా ప్రతినిధులు, వీఐపీలు సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాల పర్యటనలు పెట్టుకోరాదు’ అని విపత్తు నిర్వహణ నియమావళి స్పష్టంగా చెబుతోంది. సీఎం చంద్రబాబు ప్రచార యావతో దీనికి విరుద్ధంగా వ్యవహరించడం రివాజుగా మారింది. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సందర్భంగా చంద్రబాబు విశాఖలో మకాం వేసి సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. గత ఏడాది అక్టోబర్‌లో ‘తిత్లీ’ తుపాను సందర్భంగానూ ఇలాగే హడావిడి చేశారు. అధికారులంతా ఆయన వెంట తిరిగేందుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. దీంతో వారాల తరబడి నిత్యావసర సరుకులు, తాగునీరు సైతం అందక బాధితులు ధర్నాలకు దిగడం తెలిసిందే. ఐఎండీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు ‘ఫొని’ తుపాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అత్యంత కచ్చితమైన ముందస్తు అంచనాతో భారత ప్రభుత్వం చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగిందని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. చక్కటి అంచనాలతో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టం బాగా తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో కొనియాడింది. తుపాను.. తీరం ఎక్కడ దాటుతుంది? ఈ సమయంలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి? దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే అంశాలన్నింటినీ చాలా ముందుగా అత్యంత కచ్చితంగా ఐఎండీ అంచనాలు వేసిందని, అందువల్లే ప్రభుత్వం 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయగలిగిందని ప్రశంసించింది. ఈ మేరకు ఐఎండీకి లేఖ పంపినట్లు తమకు సమాచారం అందిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో హర్షం ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాన్ వల్ల రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పెనుగాలులకు స్తంభాలు వంగిపోవడం, వైర్లు తెగిపోవడం లాంటి కారణాలవల్ల 740 గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయినా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి శనివారం ఒక్కరోజే అత్యధిక గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించారు. గాలుల వేగం ఎలా ఉంటుంది? వర్షం ఏ మోతాదులో కురుస్తుందనే అంశాలపై ఐఎండీ ఇచ్చిన అంచనాల మేరకు సీఎస్ మార్గనిర్దేశం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు. రెండు మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడనుంది. పంట నష్టపోయిన వారికి పెట్టుబడి సాయం తర్వాత అందిస్తారు’ అని విపత్తు నిర్వహణపై అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
నిప్పుల వాన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఓవైపు కణకణ మండుతున్న సూర్యుడు, మరోవైపు భగభగమంటున్న భూతాపంతో వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. నిప్పులు కక్కే ఎండలతో వడగాడ్పులు వీస్తున్నాయి. సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 45 డిగ్రీల సెల్సియస్ పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంది. ఫొని తుపాను వాయవ్య, పశ్చిమ గాలులను తన వైపు లాక్కుంటోంది. ఫలితంగా చల్లదనాన్నిచ్చే దక్షిణ గాలులు వీయడం లేదు. ఫొని తుపాను పూర్తిగా బలహీన పడే దాకా గాలులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫొని అల్పపీడనంగా మారాక మరో రెండు మూడు రోజుల వరకు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. అంటే ఈ నెల పదో తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటోంది. వేడి గాలులను తట్టుకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు అగ్నికీలల్లా తగులుతున్నాయి. వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 11–12 గంటల వరకే పనిచేసి, తర్వాత చెట్ల నీడకు వెళుతున్నారు. గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు వేడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇంట్లోనే ఉన్నప్పటికీ భవనం పైకప్పు నుంచి, గోడల నుంచి వస్తున్న వేడి, ఉక్కపోతను తట్టుకోలేపోతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న మూడు రోజులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంటే విజయనగం, శ్రీకాకుళం మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వడగాడ్పులు తప్పవన్నమాట. వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని ఐఎండీ సూచించింది. 47 డిగ్రీల దాకా నమోదు కానున్న ఉష్ణోగ్రతలు వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ నెల 5న (ఆదివారం) కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 6న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 7న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45–47 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 42– 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 8న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 9న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45–46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలను చైతన్య పర్చండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున వడగాడ్పులు తీవ్రమవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలను చైతన్య పరిచేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపత్తు నిర్వహణ శాఖ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. జాగ్రత్తలు తప్పనిసరి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఎండ సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఇళ్లల్లో గానీ, నీడపట్టున గానీ ఉండాలి. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి నేరుగా ఎండ తగలకుండా గొడుగు ఉపయోగించాలి. తెలుపు లేదా లేత రంగు నూలు వస్త్రాలు ధరించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరినీరు లాంటివి సేవించాలి. డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం ఉప్పు కలిపిన మజ్జిగ సేవించడం ఉత్తమం. ఇళ్లల్లో కూడా వేడి ఎక్కువగా ఉంటే గది వాతావరణాన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం కిటికీలకు వట్టివేర్ల తెరలను కట్టి నీరు చల్లాలి. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, గాలి తగిలేలా చూడాలి. చల్లని నీటిలో తడిపిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్ కింద ఉంచవచ్చు. అప్పటికీ కోలుకోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తగిన వైద్యం అందించాలి’’ అని నిపుణులు చెప్పారు. -
దేశవ్యాప్తంగా నేడే ‘నీట్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్’ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరగనుంది. సుమారు 70 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. ఫొని తుపాను కారణం గా ఒడిశాలో నీట్‌ను వాయిదా వేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు వంద కేంద్రాల్లో పరీక్ష నిర్వ హిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో విద్యార్థులకు తెలుగులో పరీక్ష రాసే వీలు కల్పించారు. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి 2 గంటల ముందే కేంద్రాన్ని తెరుస్తారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. డ్రెస్‌కోడ్ మొదలు ఇతరత్రా అనేక నిబంధనలు విధించారు. ఇంటర్ గందరగోళం విద్యార్థులపై ప్రభావం... రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల వల్ల వేలాది మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధం అవుతుండగా ఇంటర్లో వచ్చిన మార్కులు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో వారంతా ప్రవేశపరీక్షకు సిద్ధం కాలేదని తెలిసింది. కొన్నిచోట్ల నీట్ కోచింగ్ సెంటర్లకు మొదట్లో చేరిన వారిలో కొందరు ఇంటర్ ఫలితాల తర్వాత రాలేదని సమాచారం. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి నీట్‌కు ఇంటర్ వెయిటేజీ ఏమీ ఉండదని, తక్కువ మార్కులు వచ్చినా ఏమీ పరవాలేదని భరోసా కల్పించాయి. -
‘తుపాకి రాముడి కోతలు మొదలయ్యాయి’
సాక్షి, హైదరాబాద్ : తుపాకి రాముడి కోతలు మొదలయ్యాయని సీఎం చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం రేయింబవళ్లు తుపానుకు ఎదురొడ్డి ప్రాణనష్టం లేకుండా చూస్తే అభినందించాల్సింది పోయి వాళ్ల క్రెడిట్ కొట్టేస్తున్నాడని మండిపడ్డారు. కలెక్టర్లు, సిబ్బంది స్పందించిన తీరు ప్రశంసనీయని ట్విటర్లో పేర్కొన్నారు. థాంక్యూ సీఎం అని హోర్డింగులు పెట్టుకోలేక పోయానని చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 'ఫొని నష్టంపై కేంద్రానికి అప్పుడే నివేదిక వెళ్లింది. ఇంతకు ముందు లేని నష్టాన్ని కూడా చూపే వారు. 2800 ఎకరాల్లో పంట, 2 వేల స్థంబాలు, 117 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని సీఎస్ వాస్తవిక రిపోర్టు పంపారు. చంద్రబాబు డిస్టర్బెన్స్ లేక పోవడంతో యంత్రాంగం స్వేచ్ఛగా, వేగంగా పనిచేసింది. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిర్యాలు తాటికాయంత అన్నాడట చంద్రబాబు లాంటి వాడు. వీవీప్యాట్లను తన ఒత్తిడి వల్లే ప్రవేశ పెట్టారని కోస్తున్నాడు. 2013లో నాగాలాండ్ నోక్సెన్ అసెంబ్లీ, 2014 లోక్ సభ ఎన్నికల్లో 8 చోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అప్పుడీయన ఎక్కడున్నాడు. ఫొని తుఫాను సహాయ చర్యలకు తమ హెల్ప్ కావాలంటే చెప్పాలని ఒరిస్సా సీఎంను చంద్రబాబు అడిగారట. గతంలో తిత్లీ తుఫాను తీరం దాటక ముందే.. థ్యాంక్యూ సీఎం సార్, తుఫాను నుంచి మా ప్రాణాలు రక్షించినందుకు అని సొంతంగా హోర్డింగులు పెట్టించుకున్నట్టే ఉంది ఈ వ్యవహారం కూడా. ఉత్తరాంద్రలో తుఫాను పునరావాస పనులు జరుగుతున్నాయి. మరో పక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గ్రూప్-2 పరీక్షలు నిర్వహించడమేమిటి? మరో నెల రోజులు వాయిదా వేయలేరా? ఏపీపీఎస్సీ ఛైర్మన్ దేనికో హడావుడి పడుతున్నట్టు కనిపిస్తోంది. గవర్నర్ జోక్యం చేసుకుని వాయిదా వేయించాలి' అని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. -
‘ఏపీకి రూ. 250 కోట్లు వస్తాయి’
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ప్రస్తుతం ఉన్న కరువు, తుపాను పరిస్థితుల పట్ల బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రతతో నీళ్లు అడుగంటిపోతున్నాయన్నారు. వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రాయలసీమలో తాగడానికి నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారన్నారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో పశుగ్రాసాలు లేక మూగ జీవాలు అల్లాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించాలని బీజేపీ కోరుతుందన్నారు. నకిలీ విత్తనాలతో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం సర్టిఫై చేసిన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఫొని తుపాను బారిన పడిన నాలుగు రాష్ట్రాలకి కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కి రూ. 250 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ నిధుల్ని సక్రమంగా ఉపయోగించాలని కోరారు. ఓడిపోతానని స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టే చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. -
‘ఫొని’ ఎఫెక్ట్.. నీట్ వాయిదా
భువనేశ్వర్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను తుపాను కారణంగా ఒడిశాలో వాయిదా పడింది. ఫొని సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హైయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్.సుబ్రహ్మణ్యం శనివారం వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం మే 5న నీట్ పరీక్షను జరగనుంది. ఒడిశాలో ఈ పరీక్షను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో జరిగే పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు సైక్లోన్ ఫొని కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో నీట్‌ను వాయిదా వేయాలంటూ పలవురు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీనిని పరిశీలించిన సంబంధిత శాఖ.. సహాయక చర్యలను, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. భీకర గాలులు, సైక్లోన్ ఫొని తూర్పు తీర రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. మందుస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. 220కి పైగా రైళ్ల రద్దు ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిన ఫొని తుపాన్