సాక్షి, అమరావతి: ‘వచ్చే వారం కేబినెట్ మీటింగ్ పెడతా. అధికారులు రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తా. ఈసీ వద్దంటే రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. బిజినెస్ రూల్స్‌ను అతిక్రమించే వారిపై సీరియస్ చర్యలు తీసుకుంటా’ అని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. ‘అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌లు సీఎంల దగ్గరకు వచ్చి వివరిస్తారు. కానీ మన దగ్గర మాత్రం సీఎం దగ్గరకు సీఎస్ రారు. సీఎస్ రావాలని నేను అడుక్కోవాలా? అధికారులు చదువుకోలేదా? రాజ్యాంగం ఏం చెబుతోందో తెలియదా?’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
22 ఏళ్లుగా ఎన్నో ఎన్నికలు చూశా...
‘అధికారులు మాకు కాకుండా ఎన్నికల సంఘానికి నివేదించాలని ఎక్కడ ఉంది? ఎన్నికల వరకు అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించాలి. మిగిలిన అన్ని విషయాలు నాకు నివేదించాలి. అధికారులు చదువుకోలేదా? ఎన్నికలు, ఎన్నికలేతర విషయాల్లో ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలియదా? అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఎన్నికల సంఘానికి నివేదిస్తారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం. సమీక్షలకు రామంటే ఎలా? బిజినెస్ రూల్స్ ఏం చెబుతున్నాయి? అధికారుల్లో చీలిక తేవాలని నేను అనుకోవడం లేదు. కానీ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకోను. ఈ ప్రధాన కార్యదర్శి మూడు నెలలు ఉండొచ్చు. కానీ 22 ఏళ్లుగా, సీఎంగా ఎన్నో ఎన్నికలు చూశా. కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేసినా, విర్రవీగినా తర్వాత వ్యవస్థను సరిదిద్దాల్సి ఉంటుంది.
ఈసీ హద్దులు తెలుసుకోవాలి
ఈవీఎంలు అంటే ఏమిటో మన దేశంలో సగం మందికి అవగాహన లేదు. అర్థంకాని వ్యవస్థలను పెట్టి లేనిపోని సమస్యలు ఎందుకు తెస్తారు? ఈ దేశానికి పేపర్ బ్యాలట్ ద్వారా ఎన్నికలు మినహా మరో మార్గం లేదు. ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు ఓట్లలో తేడా వస్తే వీవీ ప్యాట్‌ల ఓట్లే పరిగణిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. కానీ అలా తేడా వస్తే మొత్తం అన్ని వీవీ ప్యాట్లు లెక్కించాలి. తెలంగాణాలో ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు ఓట్లలో తేడా రాలేదా? మోదీ నచ్చారు కాబట్టే ఎన్నికల సంఘం రూల్స్ పెడుతోంది. మోదీ ఏం మాట్లాడినా ఎన్నికల సంఘం చెవులకు సంగీతంలా బాగుంటుంది. ఎన్నికల నియమావళి అందరికీ ఒకేలా ఉండాలి. కేబినెట్ మీటింగ్‌లు, సమీక్షలు నిర్వహించకూడదని రూల్స్ ఎక్కడున్నాయి? మోదీ నాలుగు కేబినెట్ మీటింగ్‌లు పెట్టలేదా? ఈసీ కూడా హద్దులు తెలుసుకోవాలి. రాజ్యాంగమే మీకు, మాకు అధికారాలు ఇచ్చిందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో త్వరలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్‌లు పెట్టాలి.
నాకున్న అనుభవం ఎవరికి ఉంది?
మోదీ మళ్లీ అధికారంలోకి రారని దేశమంతా నిర్ణయానికి వచ్చేసింది. నాలుగు దశల ఎన్నికల తరువాత పార్టీలు కూడా తమ విధానాలను మార్చుకుంటున్నాయి. 22 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా, విభజన తరువాత కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాకున్నంత అనుభవం ఎవరికి ఉంది? 2002కు ముందు మోదీ ఎవరికి తెలుసు? 2014కు ముందు అమిత్ షా ఎవరికి తెలుసు?
తుపాన్‌పై సమర్థంగా వ్యవహరించాం..
ఫొని తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసి సమర్థంగా వ్యవహరించాం. తుపాను వల్ల 14 మండలాలు నష్టపోయాయి. ఇప్పటికే 9 మండలాల్లో నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టాం. మిగిలిన ఐదు మండలాల్లో రేపటికి అంచనా పూర్తి అవుతుంది. మొత్తం 733 గ్రామాలు దెబ్బతిన్నాయి. 33 కేవీ ఫీడర్స్ 19 దెబ్బతింటే 16 పునరుద్ధరించాం. 11 కేవీ ఫీడర్స్ 101 దెబ్బతింటే 57 పునరుద్ధరించాం. 14 లక్షల మందికి ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించాం. ఆర్టీజీఎస్ సేకరించిన సమాచారాన్ని ఒడిశాకు కూడా అందించాం’’
నిష్క్రమించిన అధికారులు...
తుపాను సహాయక చర్యలపై చంద్రబాబు వివరిస్తున్న సమయంలో ఆర్టీజీఎస్ సీఈవో బాబు మరికొందరు అధికారులు అక్కడే ఉన్నారు. అయితే చంద్రబాబు సీఎస్, ఎన్నికల సంఘంపై విమర్శలకు దిగగానే వారంతా అక్కడి నుంచి నిష్క్రమించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment