సాక్షి, విశాఖ : ప్రచండ వేగంతో దూసుకొస్తున్న ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్‌ను దాటడంతో ఉత‍్తరాంధ్రకు ముప్పు తప్పింది. తుపాను శ్రీకాకుళం జిల్లాను దాటినా, దాని ప్రభావం 30 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను ప్రస్తుతం పూరికి 40 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయం లేదా మధ్యాహ్ననికి పూరికి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ, క్రమేణా బలహీనపడి అతి తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించనుంది. తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు వీయనున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో 60 నుంచి 115 కిమీ వరకూ పెనుగాలులు వీచే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఫొని తుపాను జిల్లాను దాటింది: కలెక్టర్
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ...ఫొని తుపాన్ జిల్లాను దాటిందని, కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని, సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను తరలించినట్లు వెల్లడించారు. ఇచ్ఛాపురంలో మూడు ఇళ్లు మినహా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. విద్యుత్ స్తంభాలు కొన్ని దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని, వాటిని తక్షణమే పునరుద్ధరణ చేస్తామన్నారు.
రహదారిపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తామని, తుపాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బహుదా, వంశధార నదులుకు వరదలు వస్తాయని, ఇసుక తవ్వకాలు లేదా ఇతర పనులకు నదుల్లోకి వెళ్లరాదని కలెక్టర్ సూచించారు. నదీతీరంలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కమ‍్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సెల్ సర్వీసులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. తుపాను ప్రభావిత మండలాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్ విధానం అమల్లో ఉందని, ఓ ఆపరేటర్ టవర్ పనిచేయకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న ఇతర ఆపరేటర్ల టవర్ ద్వారా సెల్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి.
ఓడ రేవుల్లో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు..
మరోవైపు ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment