‘ఫొని’ హెచ్చ‌రిక‌, ప్ర‌జ‌ల‌కు ఆర్టీజీఎస్ విజ్ఞప్తి | cyclone Fani located ESE of Kakinada about 250Km | Sakshi
Sakshi News home page

అతి తీవ్ర తుపాన్‌గా మారిన ఫొని

Published Thu, May 2 2019 11:43 AM | Last Updated on Thu, May 2 2019 2:40 PM

cyclone Fani located ESE of Kakinada about 250Km - Sakshi

సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బంగాళాగాతంలో అతి తీవ్ర తుపాన్‌గా మారిన ఫొని ప్రభావంతో ఉత్త‌ర శ్రీకాకుళం, తీర‌ప్రాంత శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో రెండురోజుల పాటు అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫొని తుపాన్  ప్రస్తుతం కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశ‌గా 250 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన ఉంది. దీని ప్రభావంతో  విశాఖ‌ప‌ట్నం,తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు పడనున్నాయి. 

నిన్న సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుఫాన్‌ దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుఫానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 

శ్రీకాకుళం ఉత్త‌ర, తీర‌ప్రాంత మండ‌లాల్లో రెడ్ అలర్ట్‌
ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెండురోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ కొనసాగనుంది. శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీట‌ర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాల‌లు వీస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. శ్రీకాకుళంలో తీవ్ర ప్ర‌భావ‌మున్న మండ‌లాలు : గార‌, ఇచ్చాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగం, వ‌జ్ర‌పుకొత్తూరు, శ్రీకాకుళం అలాగే విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వేస్తాయని... ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. 

ప్రజలు అప‍్రమత్తంగా ఉండాలి
విజ‌య‌న‌గ‌రం: భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌ మండ‌లాల్లోని ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలని, తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దని అధికారులు హెచ్చరించారు. సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని, వాహ‌నాల‌పైన బ‌య‌ట సంచ‌రించ‌కూడ‌దని ప్రజ‌ల‌కు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సూచించింది. ఆర్టీజీఎస్‌ తుపాన్ గ‌మ‌నాన్ని నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తూ...తీర‌ప్రాంతాలను స‌ర్వైలెన్స్ కెమెరాల‌ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

పర్యాటకులకు అనుమతి నిరాకరణ
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. తుపాను హెచ్చరికలతో పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొగల్తూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. తుఫాన్‌ ప్రభావంతో తీర ప్రాంతంలో సముద్రపు అలలు సాధారణం కంటే రెండు, మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుందంటూ హెచ్చిరించారు. తీర ప్రాంతంలోని ప్రతీ మండలానికి అందుబాటులో 108, 104 వాహనాలు ఉంచారు. 

ప్ర‌జ‌ల‌కు ఆర్టీజీఎస్ (రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ) విజ్ఞ‌ప్తి 

  • తుపాన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌రిష్కార వేదిక‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు 
  • ఆర్టీజీఎస్ నుంచి స‌ర్వైలెన్స్ కెమెరాల ద్వారా తుపాను ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌వేక్ష‌ణ 
  • కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశ‌గా 250 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన ఫోని తుపాన్‌
  • శ్రీకాకుళం ఉత్త‌ర, తీర‌ప్రాంత మండ‌లాల్లో కొన‌సాగుతున్న‌ రెడ్ అలర్ట్‌
  • శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు  120 నుంచి 130 కిలోమీట‌ర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాల‌లు
  • విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు
  • ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌పై తీవ్ర ప్రభావం చూప‌నున్న ఫొని తుపాన్
  • ఉత్త‌ర, తీర‌ప్రాంత శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఈరోజు మరియు రేపు అతి భారీ వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement