real time governance
-
‘కార్వీ’కి నిధుల కానుక!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) పేరిట గత మూడేళ్లుగా ప్రైవేట్ దోపిడీ భారీ ఎత్తున జరిగిపోయింది. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏదో ఘనకార్యం అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారు. వాస్తవం ఏమిటంటే 1100 నెంబర్‌కు ప్రజలు ఫోన్‌చేసి, తమ సమస్యలు చెప్పుకోవచ్చు. దీన్నే ఆర్టీజీఎస్ అంటారు. ఆర్జీజీఎస్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులకు ఫోన్ చేసి, టీడీపీ సర్కారు పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడుగుతారు. దాని ఆధారంగా పథకాల సంతృప్తి స్థాయిని లెక్కిస్తారు. దీనిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా అధికార తెలుగుదేశం పార్టీకి ఆర్టీజీఎస్ సర్వేలను నిర్వహించింది. మొత్తం మీద ఆర్టీజీఎస్ అనేది ఒక కాల్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఇందుకుగాను గత మూడేళ్లుగా ఖజానా నుంచి ప్రైవేట్ సంస్థకు రూ.వందల కోట్లు దోచిపెట్టారు. అందులో నుంచి ముఖ్యమంత్రి తన వాటా కమీషన్లు దండుకున్నారు. సింగిల్ టెండర్‌కు ఆమోదం ఆర్టీజీఎస్ పేరుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు బాగా కావాల్సిన కార్వీ సంస్థకు కాల్ సెంటర్ నిర్వహణను నామినేషన్‌పై అప్పగించేశారు. తొలుత కుటుంబరావు ఆధ్వర్యంలోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్ సెంటర్ ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తొలుత 750 మందితో ఈ కాల్‌సెంటర్ నెలకొల్పారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించగా కార్వీ సంస్థ ఒక్కటే ముందుకొచ్చింది. అలాంటప్పుడు నిబంధనల ప్రకారం ఆ టెండర్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా టెండర్లను ఆహ్వానించాలి. కానీ, ఆ నిబంధనను తుంగలో తొక్కారు. రూ.109.66 కోట్లకు కార్వీ సంస్థకు కాల్ సెంటర్ సర్వీసును కట్టబెట్టారు. ఈ మేరకు 2016 డిసెంబర్ 29న కార్వీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ తతంగం మొత్తం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ కుటుంబరావు నడిపించారు. కార్వీ సంస్థ కళటుంబరావు బంధువుకు చెందినది కావడంతో సింగిల్ టెండర్‌కు 1100 కాల్ సెంటర్ సర్వీసును అప్పగించారు. ఆ తరువాత 2017 జూలై 29న పరిష్కార వేదిక, కాల్ సెంటర్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఆదేశాలు, అనుమతులు లేకుండానే... సీఎం సూచన మేరకు కుటుంబరావు 1100 కాల్ సెంటర్‌ను విస్తరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మళ్లీ అదే కార్వీ సంస్థ నుంచి ప్రతిపాదనలు తీసుకుని రూ.185.73 కోట్లకు కాల్ సెంటర్ విస్తరణ సర్వీసులను కూడా అప్పగించేశారు. దీనికి ఆర్టీజీఎస్ అని పేరుపెట్టారు. తొలుత 750 మంది నుంచి ఉద్యోగులను తీసుకున్నారు. తర్వాత 2,064 మందికి పెంచారు. ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు, పరిపాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం కుటుంబరావు నోటి మాటపై కార్వీ సంస్థకు తొలుత రూ.109.66 కోట్లు, తరువాత రూ.185.73 కోట్లు కలిపి మొత్తం రూ.295.39 కోట్లను అప్పనంగా దోచిపెట్టారు. -
‘ఫొని’ హెచ్చరిక, ప్రజలకు ఆర్టీజీఎస్ విజ్ఞప్తి
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బంగాళాగాతంలో అతి తీవ్ర తుపాన్‌గా మారిన ఫొని ప్రభావంతో ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫొని తుపాన్ ప్రస్తుతం కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉంది. దీని ప్రభావంతో విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నిన్న సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుఫాన్ దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుఫానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెడ్ అలర్ట్ ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు వీస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. శ్రీకాకుళంలో తీవ్ర ప్రభావమున్న మండలాలు : గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం అలాగే విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వేస్తాయని... ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విజయనగరం: భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవరూ బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, వాహనాలపైన బయట సంచరించకూడదని ప్రజలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. ఆర్టీజీఎస్ తుపాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ...తీరప్రాంతాలను సర్వైలెన్స్ కెమెరాల ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకులకు అనుమతి నిరాకరణ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. తుపాను హెచ్చరికలతో పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొగల్తూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో సముద్రపు అలలు సాధారణం కంటే రెండు, మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుందంటూ హెచ్చిరించారు. తీర ప్రాంతంలోని ప్రతీ మండలానికి అందుబాటులో 108, 104 వాహనాలు ఉంచారు. ప్రజలకు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) విజ్ఞప్తి తుపాన్ పర్యవేక్షణకు పరిష్కార వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు ఆర్టీజీఎస్ నుంచి సర్వైలెన్స్ కెమెరాల ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోని తుపాన్ శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్ శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఫొని తుపాన్ ఉత్తర, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈరోజు మరియు రేపు అతి భారీ వర్షాలు కురిసే సూచనలు -
‘చంద్రబాబు రియల్ టైం’పై పవన్ కల్యాణ్ సెటైర్లు
సాక్షి, పోలవరం/పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే రోడ్డు శనివారం ఒక్కసారిగా పైకి చొచ్చుకొచ్చి బీటలువారిన సంగతి తెలిసిందే. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఏజెన్సీ ప్రాంతానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. (పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం) ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ పోలవరం రోడ్డు ఘటనపై వివరణ ఇవ్వాలి. రోడ్డు కిలోమీటర్ మేర ఇంత దారుణంగా దెబ్బతినడాన్ని రియల్ టైం గవర్నెన్స్ టీమ్ గ్రహించిందా? కారణాలేంటో చెప్తారా? కొంపతీసి పోలవరం ప్రాంతంలో భూకంపం వచ్చిందంటారా? ప్రజలను అయోమయంలో పడేయకుండా.. కొంచెం క్లారిటీ ఇవ్వండని పవన్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. I hope Hon. CM Sri. CBN garu’s real time governance has noticed how a road of one kilometre near Polavaram Project had split as if some earthquake occurred. Please give a clarity to peoplewhy it happened. pic.twitter.com/P51oInegy2 — Pawan Kalyan (@PawanKalyan) November 4, 2018 -
డ్రోన్లు, కెమెరాలతో పరిపాలన: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో డ్రోన్లు, నిఘా కెమెరాల పర్యవేక్షణలో పరిపాలన(రియల్ టైమ్ గవర్నెన్స్) సాగిస్తామని, ఆ విధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ విధానం ద్వారా ఇది సాధ్యపడుతుందని, ఆమేరకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఫైబర్ నెట్వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో డ్రోన్ల వినియోగం గురించి ముఖ్యమంత్రి చర్చించారు. గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణతోపాటు అన్ని రంగాల్లోనూ డ్రోన్లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్లు, సర్వైలెన్స్ కెమేరాల పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీని, ఈ విధానంపై అవగాహన కోసం ఒక శిక్షణ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాల రూపకల్పనకు నలుగురైదుగురు అధికారులు, నిపుణులతో ఒక కమిటినీ నియమించి దానికి పూర్తి అధికారాలిస్తామన్నారు. ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో నగర స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటుచేసి వాటన్నింటినీ అమరావతిలోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎండీ సాంబశివరావు డ్రోన్ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్న సేవల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మంత్రి నారాయణ, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.