సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) పేరిట గత మూడేళ్లుగా ప్రైవేట్ దోపిడీ భారీ ఎత్తున జరిగిపోయింది. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏదో ఘనకార్యం అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారు. వాస్తవం ఏమిటంటే 1100 నెంబర్‌కు ప్రజలు ఫోన్‌చేసి, తమ సమస్యలు చెప్పుకోవచ్చు. దీన్నే ఆర్టీజీఎస్ అంటారు. ఆర్జీజీఎస్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులకు ఫోన్ చేసి, టీడీపీ సర్కారు పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడుగుతారు. దాని ఆధారంగా పథకాల సంతృప్తి స్థాయిని లెక్కిస్తారు. దీనిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా అధికార తెలుగుదేశం పార్టీకి ఆర్టీజీఎస్ సర్వేలను నిర్వహించింది. మొత్తం మీద ఆర్టీజీఎస్ అనేది ఒక కాల్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఇందుకుగాను గత మూడేళ్లుగా ఖజానా నుంచి ప్రైవేట్ సంస్థకు రూ.వందల కోట్లు దోచిపెట్టారు. అందులో నుంచి ముఖ్యమంత్రి తన వాటా కమీషన్లు దండుకున్నారు.
సింగిల్ టెండర్‌కు ఆమోదం
ఆర్టీజీఎస్ పేరుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు బాగా కావాల్సిన కార్వీ సంస్థకు కాల్ సెంటర్ నిర్వహణను నామినేషన్‌పై అప్పగించేశారు. తొలుత కుటుంబరావు ఆధ్వర్యంలోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్ సెంటర్ ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తొలుత 750 మందితో ఈ కాల్‌సెంటర్ నెలకొల్పారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించగా కార్వీ సంస్థ ఒక్కటే ముందుకొచ్చింది. అలాంటప్పుడు నిబంధనల ప్రకారం ఆ టెండర్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా టెండర్లను ఆహ్వానించాలి.
కానీ, ఆ నిబంధనను తుంగలో తొక్కారు. రూ.109.66 కోట్లకు కార్వీ సంస్థకు కాల్ సెంటర్ సర్వీసును కట్టబెట్టారు. ఈ మేరకు 2016 డిసెంబర్ 29న కార్వీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ తతంగం మొత్తం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ కుటుంబరావు నడిపించారు. కార్వీ సంస్థ కళటుంబరావు బంధువుకు చెందినది కావడంతో సింగిల్ టెండర్‌కు 1100 కాల్ సెంటర్ సర్వీసును అప్పగించారు. ఆ తరువాత 2017 జూలై 29న పరిష్కార వేదిక, కాల్ సెంటర్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
ఆదేశాలు, అనుమతులు లేకుండానే...
సీఎం సూచన మేరకు కుటుంబరావు 1100 కాల్ సెంటర్‌ను విస్తరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మళ్లీ అదే కార్వీ సంస్థ నుంచి ప్రతిపాదనలు తీసుకుని రూ.185.73 కోట్లకు కాల్ సెంటర్ విస్తరణ సర్వీసులను కూడా అప్పగించేశారు. దీనికి ఆర్టీజీఎస్ అని పేరుపెట్టారు. తొలుత 750 మంది నుంచి ఉద్యోగులను తీసుకున్నారు. తర్వాత 2,064 మందికి పెంచారు. ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు, పరిపాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం కుటుంబరావు నోటి మాటపై కార్వీ సంస్థకు తొలుత రూ.109.66 కోట్లు, తరువాత రూ.185.73 కోట్లు కలిపి మొత్తం రూ.295.39 కోట్లను అప్పనంగా దోచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment