జీవీఎల్ నరసింహారావు
సాక్షి, విజయవాడ : ఎయిర్ ఏషియా స్కాంలో వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. దర్యాప్తు సంస్థలు తమ పనిని తాము చేసుకుపోతాయని చెప్పారు. కుటుంబరావు షేర్ మార్కెట్ నిపుణుడు.. కాగా ఆయనను తీసుకొచ్చి ప్రణాళికా సంఘంలో పెట్టారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలు మానుకొని అభివృద్ధికి పాటుపడాలని జీవీఎల్ హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తుదంటూ విమర్శించారు.
‘ఎయిర్ ఏషియా కుంభకోణం బయటకు రాగానే టీడీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ స్కాంలో సింగపూర్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. అయినా టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫోన్ ట్యాపింగ్‌లు చేసే నీచ సంస్కృతి టీడీపీదే. చంద్రబాబు ప్రభుత్వమే కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ను ట్యాప్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. మీ దగ్గర ఏ ఆధారాలుంటే అవి బయటపెట్టండి. మేం సమాధానం చెబుతాం. అయినా కుంభకోణాలు బయటపెట్టడానికి ముహుర్తాలు ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌కి ఇప్పటివరకు రాష్ట్రం భూమి ఇవ్వలేదు. అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులిచ్చిందని.. అయితే అడ్డగోలుగా ఖర్చు చేయడం సబబు కాదన్నారు.
కాగా, ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారన్న’ ఆడియో టేపులు సీబీఐ చేతికి చిక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment