air asia
-
విశాఖ నుంచి చౌకగా విమానయానం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, ఇందుకోసం ఈ నెల 23వ తేదీలోపు టికెట్ బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా సూచించింది. సాధారణంగా వైజాగ్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్‌కు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్ ధర ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా రూ.4,400 నుంచి రూ.5వేల లోపే టికెట్ ధర ఉంటుందని ఎయిర్ ఏసియా తెలిపింది. అన్ని వర్గాల ప్రయాణికులకు విమానయాన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించింది. -
సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లేటర్లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్‌లో ఫ్లైయింగ్ బీస్ట్‌గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్‌స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో
ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ వివాదంలో చిక్కుకున్నారు. తమ కంపెనీ వర్క్ కల్చర్‌పై గొప్పలు చెప్పారు. ఆపై అబాసు పాలయ్యారు? బాడీ మసాజ్ చేయించుకునే సమయంలో కూడా మేనేజ్మెంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలు కల్పిస్తుందంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఫెర్నాండేజ్ షర్ట్ లేకుండా ఓ వైపు మసాజ్ చేయించుకుంటూ మరోవైపు ఆఫీస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం మనం చూడొచ్చు. వారంలో పని ఒత్తిడి, వెరానిటా యోసెఫిన్ సలహా మేరకు మసాజ్ చేయించుకుంటున్నాని క్యాప్షన్ ఇచ్చారు. మసాజ్ చేయించుకునేందుకు అనుమతి ఉందని.. ఇండోనేషియా, ఎయిర్ ఏషియా కల్చర్ ఇష్టపడతానని చెప్పారు. ఆఫోటోపై నెటిజన్స్ మండి పడుతున్నారు. పలువురు నెటిజన్లు ఇలాంటి చర్యల వల్ల ఎయిర్ ఏసియా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. వెంటనే ఫెర్నాండేజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. సంస్థ గొప్పతనం గురించి ఇలా వివరించడం సరైంది కాదని అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు ఏవియేషన్ విభాగంలో కాక రేపుతుండగా.. ఈ ఫోటోలు ఫెర్నాండెజ్ షేర్ చేశారా? లేదంటే ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఇలా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి లింక్డిన్లో పోస్ట్ చేశారా? అని తెలియాల్సి ఉంది. -
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ ఝలక్!
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో డీజీసీఏ భారీగా జరిమానా విధించింది. ట్రైనింగ్ సమయంలో పైలట్ల నెపుణ్యతకు సంబంధించిన టెస్ట్(లేదా) ఇన్స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎయిర్ ఏషియా చేయడం లేదని తేలడంతో డీజీసీఏ రూ. 20 లక్షల జరిమానా విధించింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు సదరు ఎయిర్ ఏషియా హెడ్ ట్రైనీని కూడా మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఏషియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్లకూ కూడా ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమాన విధించింది. ఈ మేరకు డీజీసీఏ సంబంధిత మేనేజర్, శిక్షణ అధిపతి, ఎయిర్ ఏషియా నియమించిన ఎగ్జామినర్లు తమ విధులను సరిగా నిర్వర్తించనందుకు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు ఎయిర్‌లైన్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి రాత పూర్వక సమాధానాలను పరిశీలించాకే డీజసీఏ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. (చదవండి: వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్టేషన్‌కి వచ్చి..) -
బంఫర్ ఆఫర్: రూ.1497కే ఎంచక్కా గాల్లో ఎగిరిపోండి.. త్వరపడాలి!
దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా(AirAsia) న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోతున్న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'న్యూ ఇయర్, న్యూ డీల్స్' పేరిట తమ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను కేవలం రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అమలులో ఉంటుందని, దీని కింద బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది(2023) జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు, దాని నెట్వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్సైట్, యాప్‌లో బుకింగ్ చేసే (నియో పాస్) NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్, ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్‌తో పాటు 8 శాతం నియో కాయిన్స్ (NeuCoins) వరకు కూడా పొందుతారు. మరోవైపు, ప్రముఖ సంస్థ ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. Bank your new year resolutions now! Ring in 2023 with our #NewYearNewDeals sale, with fares starting ₹1,497! Book till 25 Dec for travel till 15 Apr 2023 on https://t.co/QiptjwMRjT or the AirAsia India mobile app. pic.twitter.com/bEwWXFlcLY — AirAsia India (@AirAsiaIndia) December 23, 2022 -
ఎయిరిండియాకు ఎయిర్ ఏషియా వాటా
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో మిగిలిన వాటాను ప్రయివేట్ రంగ దిగ్గజం ఎయిరిండియా సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మలేషియన్ కంపెనీ ఎయిర్ఏషియా తాజాగా వెల్లడించింది. అయితే ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడికాలేదు. టాటా గ్రూప్, మలేషియన్ కంపెనీ భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. టాటా సన్స్‌కు 83.67 శాతం, ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌కు 16.33 శాతం చొప్పున వాటా ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఎయిరేషియాలో పూర్తి వాటాను ఎయిరిండియా కొనుగోలు చేసేందుకు సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లను టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తదుపరి ఈ రెండింటితోపాటు.. విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా బిజినెస్‌లను కన్సాలిడేట్(ఏకీకృతం) చేసే సన్నాహాలు ప్రారంభించింది. -
అదిరిపోయే బంఫర్ ఆఫర్.. రూ.1475కే విమాన ప్రయాణం!
భారతదేశం ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా( AirAsia) తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ.1475కే తమ కంపెనీ విమానంలో ప్రయాణించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. ఢిల్లీ-లక్నో వంటి రూట్లతో పాటు సంస్థ నెట్వర్క్ అంతటా ఇదే విధమైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుంచి 13 వరకు ఎయిర్ ఏషియా విమానాలను బుక్ చేసుకున్న ప్యాసింజర్ అర్హులుగా పేర్కొంది. వీటితో పాటు మీ బుకింగ్ టికెట్ ప్రయాణం 25 ఆగస్టు 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య ఉండేలా చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ ఆఫర్ అంతర్జాతీయ విమానాలకు వర్తించదు. కంపెనీ పేర్కొన్న తేదీలో బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ఎంచక్కా గాల్లో ఎగరవచ్చు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి. ఆగస్టు 5 నుంచి ఈ ఎయిర్‌లైన్స్ లక్నో నుంచి బెంగళూరు, గోవా, న్యూఢిల్లీకి రోజువారీ డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నివేదించిన ప్రకారం, ఈ ఎయిర్‌లైన్ భారతదేశంలో అత్యంత సమయపాలన కలిగిన విమానయాన సంస్థగా కొనసాగుతోంది. Freedom never felt better. Celebrate 75 years of India’s Independence with special fares starting at ₹1,475! Book now till 13 August on https://t.co/4gF7kebVg3, the AirAsia India and @tata_neu mobile apps and earn #NeuCoins! #AzadiKaAmritMahotsav #IndependenceSale pic.twitter.com/4gJzMY1t8E — AirAsia India (@AirAsiaIndia) August 10, 2022 చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్ ఏసియా నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొంద వచ్చని తెలిపింది. ఆఫర్‌తో పాటు అదనంగా డిస్కౌంట్లు పొందవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది వరకు ఎయిర్ ఏసియా జూలై 7 నుంచి జులై 10వరకు స్ప్లాష్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్ మార్గాల్లో ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.1497గా ఉంటుందని, ఈ సేల్‌లో బుక్ అయిన టికెట్స్‌ను జూలై 26, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. పరిమిత ఇన్వెంటరీ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు మొత్తం బుకింగ్ అయితే .. జులై 10 తరువాత బుకింగ్‌కు రెగ్యులర్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్ పేర్కొంది. కాగా, ఎయిర్ ఏషియా ఇండియా తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టాటాదే బెంగళూరులో ప్రధాన కేంద్రంగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా (ఇండియా) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జూన్12,2014నుంచి ఎయిర్ ఏసియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కి పైగా 100 కనెక్టింగ్ రూట్లలో ఎయిర్ ఏసియా విమానాల రాకపోకల్ని నిర్వహిస్తుంది. -
ఎయిరిండియాపై టాటా గురి..
న్యూఢిల్లీ: ఆర్థిక భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, ఎయిరిండియా ఉద్యోగులు బరిలోకి దిగారు. బిడ్డింగ్‌కు ఆఖరు తేదీ అయిన సోమవారం నాడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) సమర్పించారు. దశాబ్దాల క్రితం తాము వదులుకోవాల్సిన వచ్చిన ఎయిరిండియాను దక్కించుకోవాలని భావిస్తున్న టాటా గ్రూప్.. తమకు మెజారిటీ వాటాలు ఉన్న మరో విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా ద్వారా ఈవోఐ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, టాటా గ్రూప్ స్వంతంగా బిడ్ చేసిందా లేక కన్సార్షియం తరఫున చేసిందా అన్నది వెల్లడి కాలేదు. దీనిపై స్పందించడానికి టాటా గ్రూప్ నిరాకరించింది. మరోవైపు, ఎయిరిండియాకు చెందిన సుమారు 219 మంది ఉద్యోగుల బృందం.. అమెరికాకు చెందిన ఇంటరప్స్ అనే ఫండ్‌తో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఈవోఐ దాఖలు చేసింది. ఉద్యోగులు తలో రూ. 1 లక్ష వేసుకుని కన్సార్షియంలో 51 శాతం వాటా తీసుకోగా, మిగతా 49 శాతం వాటా ఇంటరప్స్‌కి ఉంది. అర్హత పొందిన బిడ్డర్లకు జనవరి 6 లోగా సమాచారం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయా సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఎయిరిండియాలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పలు ఈవోఐలు దాఖలయ్యాయి. ఇక రెండో దశ మొదలవుతుంది’’ అని పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే, ఎన్ని బిడ్లు వచ్చాయి, ఏయే సంస్థలు దాఖలు చేశాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఎయిర్ఏషియా ద్వారా ఎందుకంటే... టాటా గ్రూప్ ప్రస్తుతం రెండు విదేశీ సంస్థలతో కలిసి రెండు విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్ఏషియా ఇండియాను నడుపుతోంది. తమ ఆర్థిక సమస్యల కారణంగా మరిన్ని నిధులు పెట్టలేమంటూ ఎయిర్ఏషియా చేతులెత్తేయడంతో ఎయిర్ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ ఇటీవలే తన వాటాలను 51 శాతానికి పెంచుకుంది. ఇక కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో భారీగా నష్టపోయిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ .. సొంత కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రస్తుతం నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తామే సంక్షోభ పరిస్థితుల్లో ఉండగా.. మరింత సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాపై ఇన్వెస్ట్ చేసేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిర్ఏషియా ఇండియా ద్వారా టాటా గ్రూప్ ఈవోఐ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి మూడేళ్లుగా యత్నాలు.. 2007లో దేశీయంగా సేవలు అందించే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అయినప్పట్నుంచీ ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. తీవ్ర ఆర్థిక భారంతో కుంగుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు 2017 నుంచి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడటం లేదు. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణభారం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇప్పటిదాకా నిర్వహించిన బిడ్డింగ్ ప్రతిపాదనల ప్రకారం చూస్తే .. ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంస్థ దాదాపు రూ. 23,286 కోట్ల రుణభారాన్నీ తీసుకోవాల్సి వచ్చేది. మిగతాదాన్ని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ (ఏఐఏహెచ్ఎల్) అనే స్పెషల్ పర్పస్ సంస్థకు బదలాయించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. అయితే, కొనుగోలుదారులెవరూ దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటాలు, ఎయిరిండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో 50% వాటా విక్రయ ప్రతిపాదనతో బిడ్లు ఆహ్వానించింది. టాటా ఎయిర్‌లైన్స్ నుంచి ఎయిరిండియాగా.. టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో దీని పేరు ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం ఈ సంస్థను జాతీయం చేయడంతో టాటా గ్రూప్ చేజారింది. అయితే, 1977 దాకా జేఆర్డీ టాటానే చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత టాటా సన్స్ పలుమార్లు విమానయాన సంస్థను ప్రారంభించేందుకు ప్రయత్నించింది. 1995లో సాధ్యపడలేదు. అటుపైన 2001లో ఎయిరిండియా కోసం బిడ్ చేసినా .. ప్రభుత్వం విక్రయించకూడదని నిర్ణయించుకోవడంతో కుదరలేదు. ఈ పరిణామాలతో 2013లో టాటా గ్రూప్ విదేశీ సంస్థలతో కలిసి విస్తార, ఎయిర్ఏషియా ఇండియా ఏర్పాటు చేసింది. తాజాగా తాము ఆరంభించిన కంపెనీని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
తప్పిన ప్రమాదం, విమానంలో మంత్రి
సాక్షి, కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిస్వాస్‌తో సహా 171 మంది ప్రయాణికులతో బాగ్డోగ్రాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు సహా, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన వెంటనే వడగండ్ల వర్షం కురవడంతో పైలట్ అప్రమత్తమై తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని విమానయాన సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విండ్‌షీల్డ్‌కు నష్టం వాటిల్లిందనే అనుమానంతో పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ విమానయాన సంస్థ ముఖ్య భద్రతా అధికారి క్షమాపణలు చెప్పారు. -
కుంభకోణం సెగ, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!
కౌలాలంపూర్ : మలేషియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినీతి, లంచాల ఆరోపణలపై ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దర్యాప్తు ముమ్మరమవుతున్న నేపథ్యంలో సంస్థ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తాత్కాలికంగా పదవినుంచి తప్పుకున్నారు. ఫెర్నాండెజ్‌తో పాటు, విమానయాన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కమారుద్దీన్ మెరానున్ కూడా పదవినుంచి వైదొలగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందనీ, రెండు నెలల కాలానికి లేదా కంపెనీ సరిపోతుందని భావించే సమయానికి వారు ఎగ్జిక్యూటివ్ పదవులకు దూరంగా ఉంటారని ఎయిర్ ఏషియా ప్రకటనలో తెలిపింది. అలాగు గ్రూపు ప్రెసిడెంట్ కనకలింగంను తాత్కాలిక సీఈవోగా నియమించింది. అనుమానాస్పద లంచాలు, అవినీతిపై బహిరంగ దర్యాప్తుకు సంబంధించి ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికన్ అధికారులతో ఒప్పందం చేసుకున్నామని ఎయిర్‌బస్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ఏషియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మధ్యంతర సీఈవో కనకలింగం యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 180 విమానాల కొనుగోలు, ఎయిర్ ఏషియాఎక్స్ క్రీడా జట్టుకు స్పాన్సర్‌షిప్‌గా ఎయిర్‌బస్ నుండి సుమారు 50 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై మలేషియా అవినీతి నిరోధక కమిషన్(ఎంఏసీసీ) తెలిపింది. దేశానికి వెలుపల ఎక్కడైనా పౌరులు లేదా శాశ్వత నివాసితులు చేసిన అవినీతి చర్యలపై దర్యాప్తు చేసే అధికారం ఉందని శనివారం ప్రకటించింది. ఎయిర్ బస్-ఎయిర్ ఏషియా వివాదంలో యూకే అధికారులతో సంప్రదింపులతోపాటు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని ఎంఏసీసీ చీఫ్ కమిషనర్ లతీఫా కోయా చెప్పారు. మరోవైపు యూరోపియన్ తయారీదారుతో చర్చలు జరపడానికి మధ్యవర్తులను ఎప్పుడూ ఉపయోగించలేదని ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారించేందుకు కంపెనీ బోర్డు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సలహాదారులుగా, ఫెర్నాండెజ్, మెరానున్కు బోర్డులో కార్యనిర్వాహక అధికారం ఉండదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. తాముగానీ, సీఈవో ఫెర్నాండెజ్, మెరానున్గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్ ఏషియా మరియు ఎయిర్ ఏషియా ఎక్స్ షేర్లు పడిపోయాయి. కాగా పౌర, సైనిక ఒప్పందాలను పొందటానికి ఎయిర్ ఏషియా కంపెనీ మధ్యవర్తులను ఉపయోగించిందన్న ఆరోపణలపై బ్రిటీష్ మోసపూరిత నిరోధక సంస్థ ఎస్ఎఫ్వో (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్) 2016 లో దర్యాప్తు ప్రారంభించింది. -
ఎయిర్ హోస్టెస్ ముఖంపై వేడి నీళ్లు.. జరిగిందేమిటంటే!
చూడటానికి అందంగా కనిపించే ఎయిర్ హోస్టెస్ తమ విధులు సక్రమంగా నిర్వహించడానికి ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు. విమానంలోని ప్రయణికులకు ఆహారం అందించడంతో పాటు వారిని జాగ్రత్తగా చూసుకోవడమనేది చిన్న విషయం కాదు. ప్రయాణికులు తమ పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించిన వారు నిస్సహాయులుగా ఉండిపోవాల్సిందే. వారు కోపానికి వచ్చిన, అసభ్య పదజాలం వాడిన కూడా భరించాల్సిందే. వారికి తిరిగి ఎదురుచెప్పే అవకాశం ఉండదు.. ఒకవేళ అలా చేస్తే ఉద్యోగం ఉండదనే భయం. ఇది వారి పరిస్థితి. గత కొంతకాలంగా ఎయిర్ హోస్టెస్‌లతో కొందరు ప్రయాణికులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు బయటికొస్తున్న.. ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అటువంటి వారిపై సంబంధిత అధికారులు కానీ, సంస్థలు కానీ కఠిన చర్యలు తీసుకోకపోవడమే అందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట ఎయిర్ ఏషియాకు చెందిన ఫ్లైట్‌లో జరిగిన ఓ భయానక సంఘటనను తాను ఇప్పటికి మరచి పోలేకపోతున్నానని చెబుతున్నారు ఓ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ ఏషియాలో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్న నురాలియా మజ్లాన్.. తన సహోద్యోగిపై జరిగిన దాడిని వివరించారు. ‘కొన్నాళ్ల కిందట ఆ ఎయిర్ హోస్టెస్‌తో చైనాకు చెందిన ఓ ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. అదే ఫ్లైట్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్ పక్కన ఆమెకు కూర్చొనే అవకాశం దక్కలేదు. సీట్ల మార్పుకు ఇతర ప్రయాణికులు అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి లోనైన ఆమె ఎయిర్ హోస్టెస్‌పై దాడి చేసింది. ఎయిర్ హోస్టెస్ ముఖంపై న్యూడిల్స్ కప్‌లోని వేడి నీళ్లను విసిరింది. అంతటితో ఆగకుండా ఎయిర్ హోస్టెస్‌పై పెద్దగా కేకలు వేసింది. అసలు ఏ మాత్రం సంబంధం లేని అంశంలో ఎయిర్ హోస్టెస్‌పై తన కోపాన్ని ప్రదర్శించింది. ఎందుకంటే తిరిగి ఆమె ప్రశ్నించలేదనే ధీమాతో. దీనిని గమనించిన ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెని సముదాయించే ప్రయత్నం చేస్తూంటే.. ఆమె మాత్రం ఇంకా తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి చేరుకున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా విమానాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత విమానం ల్యాండ్ కాగానే ఆమెను ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించిన ఆమెను మాత్రం సదురు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించార’ని నురాలియా తెలిపారు. తాము యూనిఫామ్ ధరించి నిస్సహాయంగా ఉంటాం కాబట్టే కొందరు ప్రయాణికులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.999కే ఎయిర్ఏషియా టికెట్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ రూట్లలో కేవలం రూ.999 లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. జనవరి 21 నుంచి 31 వరకు జరిగే ఒకవైపు ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుండగా.. ఇందుకు సంబంధించిన బుకింగ్స్‌ను జనవరి 7 నుంచి 20 వరకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 19 గమ్యస్థానాలకు డిస్కౌంట్ అమల్లో ఉంది. ఈ జాబితాలో బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, గౌహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, చెన్నైలు ఉన్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ రూట్లలో రూ.2,999లకే ప్రారంభ ధరను నిర్ణయించింది. కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి ప్రాంతాలకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
రూ.399 లకే విమాన టికెట్
సాక్షి,న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ప్రమోషనల్ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. రూ.399 లకే విమాన టికెట్లు అందిస్తోంది. నవంబరు 18 దాకా ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మే 6, 2019 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వన్‌వేలో దేశీయంగా రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో 1999 రూపాయలకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. హైదరాబాద్, విశాఖపట్నం తోపాటు, బాగ్దోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గోవా, గువహటి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోలకతా, న్యూఢిల్లీ, పుణ్, రాంచీ, శ్రీనగర్ నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం లభ్యం. అయితే బిగ్ లాయల్టీ ప్రోగ్రాంలోని ‘బిగ్ మెంబర్స్’ కు మాత్రమే ఈ ఆఫర్‌ను దక్కించుకునే అదృష్టాన్ని కల్పించింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఇండోర్-హైదరాబాద్, రాంచి- కోలకతా మార్గాల్లో రూ .399గా టికెట్ లభ్యమవుతోంది. వివిధ మార్గాల్లో టికెట్ల ప్రారంభ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. బెంగళూరు-హైదరాబాద్ : రూ. 500 బెంగళూరు-విశాఖపట్నం : రూ. 999 కోలకతా-రాంచీ : రూ. 967 బెంగళూరు-భువనేశ్వర్ : రూ .1,399 బెంగళూరు-కొచ్చి : రూ. 500 బెంగళూరు-చెన్నై: రూ. 500 ఇక అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. భువనేశ్వర్- కౌలాలంపూర్ మధ్య రూ .1999 ప్రారంభ ధరగా ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా తమ బిగ్ సభ్యులు 20 మిలియన్ల మార్క్‌ను చేరుకున్నారని, ఆగస్టు 29న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎయిర్ ఏసియా వెల్లడించింది. టాటాసన్స్ , మలేసియా ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఎయిర్ ఏసియా 25 దేశాల్లో 165 ప్రదేశాలకు సర్వీసులను నిర్వహిస్తోంది. -
ఎయిర్ ఏషియా బంపర్ సేల్
సాక్షి,ముంబై: ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. బై మోర్, సేవ్ మోర్ ఆఫర్లో భాగంగా దేశీయ,అంతర్జాతీయ ప్రయాణాలపై 40 శాతం (వన్ వే)రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లపై రేపటి నుంచి (31 జూలై)నవంబరు 30 మధ్య ప్రయాణించవచ్చు. ఆగస్టు 5 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలోనూ 40 శాతం డిస్కౌంట్ అందించనుంది. ఎయిర్ ఏషియా అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్రిడిట్, డెబిట్, చార్జ్కార్డ్ ద్వారా జరిగే పేమెంట్స్ ప్రాసెసింగ్ ఫీ నాన్-రిఫండబుల్. సీట్లు పరిమితంగా ఉంటాయి. ఎంపిక చేసిన విమానాలకు ఆఫర్ టికెట్లు వర్తించనున్నాయి. టికెట్లన్నీ సింగిల్ జర్నీకి ఉద్దేశించినవనీ, ఆఫర్లో భాగంగా జరిగే ఫేమెంట్స్ రిఫండ్ చేయనమని ఎయిర్ ఏషియా వెల్లడించింది. -
రూ.999కే ఎయిర్ఏషియా టికెట్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘ఎయిర్ఏషియా’తాజాగా ‘లో ఫేర్ మ్యాడ్నెస్’ పేరుతో ప్రత్యేకమైన ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999 ప్రారంభ ధరతో దేశీ విమాన టికెట్లను అందిస్తోంది. జూలై 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు 2019 ఫిబ్రవరి 1 నుంచి 2019 ఆగస్ట్ 13 వరకు మధ్య ఎప్పుడైనా ప్రయాణిం చొచ్చని కంపెనీ తెలిపింది.airasia.com ద్వారా చేసుకునే బుకింగ్స్‌కు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు రూ.1,699 ప్రారంభ ధరగా పేర్కొంది. -
ఎయిర్ ఏషియా విమానంలో వాంతులు, ఏడుపులు..
-
ఎయిర్ ఏషియా విమానంలో వాంతులు, ఏడుపులు..
గువాహటి : ఎయిర్ ఏషియా విమానంలో కోల్‌కతా నుంచి బగ్డోగ్రాకు బయల్దేరిన ప్రయాణీకులకు చేదు అనుభవం ఎదురైంది. విమానాన్ని దాదాపు నాలుగు గంటల పాటు నిలిపివుంచి ఆ తర్వాత దించివేయడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణీకులు ఎయిర్‌లైన్ స్టాఫ్‌తో వాగ్వాదానికి దిగారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(పశ్చిమ బెంగాల్) దీపాంకర్ రే సైతం ఎయిర్ లైన్ స్టాఫ్ ప్రయాణీకులతో మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. ఉదయం 9 గంటలకు బయల్దేరాల్సిన విమానం తొలుత 30 నిమిషాల పాటు ఆలస్యమైందని తెలిపారు. అనంతరం 2 గంటలకు పైగా విమానంలోనే ఉంచారని వెల్లడించారు. వెయిటింగ్ సమయంలో ఎయిర్‌లైన్ స్టాఫ్ ప్రయాణీకులకు కనీసం నీరు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఆ తర్వాత విమానం కెప్టెన్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణీకులందరినీ దిగిపోమ్మని అన్నారని వివరించారు. బయట విపరీతంగా వర్షం కురుస్తుండటంతో ప్రయాణీకులు ఎవరూ దిగటానికి ఆసక్తి చూపలేదని తెలిపారు. దీంతో కోపగించుకున్న కెప్టెన్ ప్రయాణీకులు దిగిపోవడానికి ఎయిర్ కండిషనర్ను విపరీతంగా పెంచేశారని చెప్పారు. దీంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారని, కొందరు వాంతులు చేసుకున్నారని, పిల్లలు బిగ్గర ఏడుపు ప్రారంభించారని తెలిపారు. చాలా మంది శ్వాస ఆడక విమానం నుంచి కిందికి దిగిపోయారని దీపాంకర్ వివరించారు. కాగా, విమానం ఆలస్యం కావడంపై ఎయిర్ ఏషియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాలుగున్నర గంటల పాటు ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరింది. -
ఆడియో టేపుల్లో పేర్లు ఎఫ్ఐఆర్లోకి!
సాక్షి, అమరావతి: ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి బహిర్గతమైన ఆడియో టేపుల్లో ప్రస్తావనకు వచ్చిన పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఎయిర్ ఏషియా ఉన్నతాధికారుల సంభాషణ ఆడియో టేపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుల పేర్లు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. జీవీఎల్ బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. తప్పు చేయకుంటే భయమెందుకు? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎయిర్ ఏషియా కుంభకోణంలో కొన్ని ఆడియో టేపులు బయటకు రాగానే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొదలైన సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని, విచారణలో వెల్లడైన అన్ని అంశాలపై చర్యలు ఉంటాయన్నారు. ఆడియో టేపుల్లో తమ పేర్లు ప్రస్తావనకు రావటంపై ఆ నాయకులు స్పందించాన్నారు. ముహూర్తాలు ఎందుకు? ఎయిర్ ఏషియాకు సంబంధించి టీడీపీ పెద్దల పేర్లు బయటకు రాగానే రెండు నెలల్లో రెండు భారీ కుంభకోణాలు బయట పెడతామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొనటంపై జీవీఎల్ స్పందించారు. కుంభకోణాలు బయట పెట్టడానికి ముహూర్తాలు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా షేర్ మార్కెట్ వ్యాపారం చేసుకునే కుటుంబరావు లాంటి వ్యక్తులను ఆ పదవిలో నియమించడం ఏపీలోనే జరిగిందన్నారు. ఆ నిధులు ఏమయ్యాయి? రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తే కేంద్ర నిధులు వస్తాయి కానీ అబద్ధాలు ప్రచారం చేస్తేనో, రాజకీయాలు చేస్తోనో నిధులు రావని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీల్లో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా రాజధాని పనులు జరగలేదని కేంద్ర అధికారుల పరిశీలనలో తేలిందని చెప్పారు. వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం ఇచ్చిన రూ.1,050 కోట్లతో ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలువురి ఫోన్ల ట్యాపింగ్... రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతల టెలిఫోన్లను చంద్రబాబు ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని జీవీఎల్ సంచలన ఆరోపణ చేశారు. పూర్తి అభద్రతా భావంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వందలాది ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తన ఫోనును ట్యాప్ చేస్తున్నారని చెప్పారని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. -
బాబు నిప్పూ.. ఎయిర్ ఏషియాపై స్పందించు
సాక్షి, అమరావతి: తాను నిప్పునని చెప్పుకునే సీఎం చంద్రబాబు, నీతిమంతుడినని ప్రచారం చేసుకునే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.. ఎయిర్ ఏషియా కుంభకోణంపై స్పందించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిర్ ఏషియా సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసుల అనుమతి కోసం సీఎం చంద్రబాబును దళారీగా ఎంచుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా విభాగం సీఈవో మిట్టూ శాండిల్య మధ్య జరిగిన సంభాషణ బహిర్గతమైనా.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఇదంతా జరిగిన తర్వాతే ఎయిర్ ఏషియా సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుకునేందుకు అనుమతినిస్తూ 2016లో జీవో విడుదలైందని గుర్తు చేశారు. దీనికోసం నిబంధనలు సైతం మార్చారని చెప్పారు. ఈ వ్యవహారంలో లాబియింగ్ చేసినందుకు సింగపూర్‌కు చెందిన హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ కంపెనీకి రూ.12.28 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ కంపెనీకి చెందిన రాజేంద్ర దూబే.. మీరు సింగపూర్ వెళ్లినప్పుడల్లా పక్కనే ఉంటుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య సంబంధమేంటో తేల్చాలని డిమాండ్ చేశారు. అశోక్‌గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో.. ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాల కొనుగోలు, రక్షణ శాఖకు సంబంధించి ఆయుధాల విడిభాగాల కొనుగోలులోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీతో అశోక్ గజపతిరాజు ఓఎస్డీ అప్పారావుకు సంబంధాలున్నాయని.. ఈ అప్పారావు నారా లోకేశ్‌కు అత్యంత ఆప్తుడని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
ఎయిర్ ఏషియా స్కాంపై స్పందించిన టీడీపీ నేత
విజయనగరం జిల్లా: ఎయిర్ ఏషియా స్కాంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు స్పందించారు. విజయనగరంలో జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ..ఎయిర్ ఏషియా సీఈఓల మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు. అది ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సంభాషణ అని చెప్పారు. ఈ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. నేటి నాయకులు ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత అవగాహన, నిబద్ధత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిసార్టుల్లో దీక్ష చేస్తే ఎవరికి ప్రయోజనమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఏడాదిలోగా ఎన్నికలు వస్తుండగా ఇప్పుడు ఈ రాజీనామాల డ్రామా ఎందుకని అన్నారు. రాజీనామాలు ఆమోదించుకోవడంలో వైఎస్సార్సీపీ ఎంపీలకు చిత్తుశుద్ధి లేదని విమర్శించారు. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కి, విమానయాన శాఖ ఉద్యోగులకు లంచాలు ఎర వేసి సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెల్సిందే. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. -
అనేక కుంభకోణాల్లో చంద్రబాబు పేరు..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు ఎన్నో అవినీతి కుంభకోణాల్లో వినిపించిందని, స్టేలు తెచ్చుకుని పబ్బం గడుపుతున్నారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ను దోచుకుతిన్న తెలుగుదేశం పార్టీ కన్ను ఇప్పుడు దేశాన్ని దోచుకోవడంపై పడిందని ఆరోపించారు. విమానయాన శాఖలో ఈ నాలుగేళ్లలో ఎన్నో రకాలుగా అవినీతి జరిగిందని చెప్పారు. వాటిలో ఎయిర్ ఏషియా కుంభకోణం ఒకటని వెల్లడించారు. దేశ రక్షణ శాఖలో సైతం ఆయుధాల విడిభాగాల కొనుగోళ్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ఓఎస్డీతో తెలుగుదేశం పార్టీకి లింకులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ పరుడినని చెప్పుకుంటూ అశోక్ గజపతి రాజు ఎయిర్ ఏషియాలో కుంభకోణంలో పాలు పంచుకున్నారని అన్నారు. 2016 మే 20న పర్మిట్లలో మార్పులు చేస్తూ జీవో జారీ అయిందని చెప్పారు. ఈ జీవోలో ఎయిర్‌ఏషియాకు అనుకూలంగా నిబంధనలను సవరించారని ఆరోపించారు. అంతకుముందే ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవోలు అడ్డదారిలో పర్మిషన్లు సంపాదించే విషయంపై ఫోన్లో సంభాషించుకున్నారని, ఆ ఆడియో క్లిప్పే ఇప్పుడు వెలుగులోకి వచ్చిందన్నారు. చంద్రబాబు, అశోక్ గజపతి రాజులకు కుంభకోణంలో కచ్చితంగా వాటా ఉందని ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ టూర్లో స్కాంలో ఉన్నవారిని కలిసింది నిజామా? కాదా? అని ప్రశ్నించారు. అశోక్ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు మంత్రా నారా లోకేశ్‌కు సన్నిహితుడని, ఆయనే కొందరితో ఒప్పందం కుదిర్చారని ఆరోపణలు గుప్పించారు. ఏపీ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారని, ఎయిర్ ఏషియా కుంభకోణంపై చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందులో చంద్రబాబుకు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణపై ఉలుకెందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే ఆయనే స్వయంగా సీబీఐ దర్యాప్తును కోరాలని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై కుటుంబరావు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షనేత గురించి మాట్లాడే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోండి అంటూ బొత్స కుటుంబరావుపై ఫైర్ అయ్యారు. -
ఆ స్కాం బయటకు రాగానే టీడీపీ నేతలు..!
సాక్షి, విజయవాడ : ఎయిర్ ఏషియా స్కాంలో వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. దర్యాప్తు సంస్థలు తమ పనిని తాము చేసుకుపోతాయని చెప్పారు. కుటుంబరావు షేర్ మార్కెట్ నిపుణుడు.. కాగా ఆయనను తీసుకొచ్చి ప్రణాళికా సంఘంలో పెట్టారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలు మానుకొని అభివృద్ధికి పాటుపడాలని జీవీఎల్ హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తుదంటూ విమర్శించారు. ‘ఎయిర్ ఏషియా కుంభకోణం బయటకు రాగానే టీడీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ స్కాంలో సింగపూర్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. అయినా టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫోన్ ట్యాపింగ్‌లు చేసే నీచ సంస్కృతి టీడీపీదే. చంద్రబాబు ప్రభుత్వమే కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ను ట్యాప్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. మీ దగ్గర ఏ ఆధారాలుంటే అవి బయటపెట్టండి. మేం సమాధానం చెబుతాం. అయినా కుంభకోణాలు బయటపెట్టడానికి ముహుర్తాలు ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌కి ఇప్పటివరకు రాష్ట్రం భూమి ఇవ్వలేదు. అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులిచ్చిందని.. అయితే అడ్డగోలుగా ఖర్చు చేయడం సబబు కాదన్నారు. కాగా, ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారన్న’ ఆడియో టేపులు సీబీఐ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. -
ఆ నిధులు సీఎంల రాయబేరాల కోసమే..
సాక్షి, అమరావతి: ఎయిర్ ఏషియా కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపై రోజుకో అంశం వెలుగు చూస్తోంది. ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలతో రాయబేరాల కోసం ఎయిర్ ఏషియా భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు డెలాయిట్ ఇండియా ఫోరెన్సిక్ ఆడిట్ స్పష్టం చేసింది. టాటా గ్రూపు నుంచి ఎయిర్ ఏషియాకు జరిగిన రూ.22 కోట్ల అనుమానపు చెల్లింపులపై అప్పటి గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసిన ఆడిట్ సంస్థ.. అప్పటి ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు శాండిల్య ఈ మొత్తాన్ని సీఎంలు, రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడానికి వినియోగించినట్లు స్పష్టంచేసింది. విమానాలకు వినియోగించే ఇంధనం (ఏటీఎఫ్)పై ఉన్న పన్నుల భారాన్ని, ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు దళారి రాజేంద్ర దుబే సహకారంతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాండిల్య సమావేశాలు నిర్వహించినట్లు కూడా స్పష్టంచేసింది. 2016లో విడుదలైన ఈ నివేదికను అప్పుడు అన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. వెలుగులోకి తెచ్చిన మిస్త్రీ మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా.. భారత్‌లో టాటా గ్రూప్‌తో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా పేరుతో విమాన రంగంలోకి అడుగు పెట్టింది. టాటా గ్రూపు నుంచి ఎయిర్ ఏషియాకు చేసిన చెల్లింపులపై అనుమానం వ్యక్తంచేసిన అప్పటి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. కానీ, నివేదిక వచ్చిన 15 రోజుల తర్వాత మిస్త్రీని పదవి నుంచి తొలగిస్తూ టాటా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ మరునాడే అంటే 2016 అక్టోబరు 25న టాటా గ్రూపు నుంచి రూ.22 కోట్ల అనుమానపు లావాదేవీలు ఎయిర్ ఏషియాకు చెందిన కంపెనీలతో జరిగినట్లు నివేదికలు స్పష్టం చేశాయంటూ టాటా బోర్డుకు మిస్త్రీ ఈ–మెయిల్ పంపడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైజనింగ్ కోసం ఏర్పాటుచేసుకున్న సింగపూర్ కంపెనీ హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్‌కు, ఈ గ్రూపునకు మధ్య కేవలం ఖాళీ కాగితాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, వివిధ ఇన్వాయిస్ ఫార్మాట్లో చెల్లింపులు జరిగిన విషయాన్ని డెలాయిట్ నివేదిక బహిర్గతం చేసింది. హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ డైరెక్టర్‌గా ఉన్న దుబే రూ.12.28 కోట్లు తీసుకున్నారు కానీ, ఈ మొత్తాన్ని ఏ సేవలకు వినియోగించారన్నది ఎక్కడా సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. అలాగే, మరో డొల్ల కంపెనీ అయిన మీడియా ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కు, శాండిల్య తండ్రికి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఆ ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. బాబు రాగానే భారీగా వ్యాట్ తగ్గింపు 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల్లోపే ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను 16 శాతం నుంచి ఏకంగా ఒక శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం డెలాయిట్ నివేదికకు మరింత బలం చేకూరుస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్ ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉన్న టాటా గ్రూపు.. రాయబేరాల కోసం రూ.22 కోట్లు వ్యయం చేయగా, దాదాపు ఇంతే మొత్తం ఎయిర్ ఏషియా గ్రూపు కూడా వ్యయం చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఏషియా నేరపూరిత కుట్ర ఎయిర్ ఏషియా వ్యవహారాలతో సంబంధం ఉన్న ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ యజమాని సునీల్ కపూర్‌ను సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు. క్విడ్ ప్రోకో కింద కపూర్‌ను ఎయిర్ ఏషియా డెప్యూటీ సీఈఓ బో లింగం.. కపూర్‌ను దళారీగా నియమించుకుని తమ విమానాల్లో కేటరింగ్ కాంట్రాక్టును అప్పజెప్పిందన్న అనుమానంతో సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. పౌర విమానాయాన శాఖ అధికారులు, ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశాలు నిర్వహించడంపై సీబీఐ అధికారులు ఈ సందర్భంగా ఆరా తీశారు. ఇదిలా ఉంటే.. 5/20 నిబంధనను సడలించేందుకు లేదా తొలగించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖలో ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తు సంస్థ అధికారి ఆర్కే గౌర్ వెల్లడించారు. అంతేకాక, దళారుల ద్వారా ప్రభుత్వంలోని పలువురు అధికారులతో కలిసి ఎయిర్ ఏషియా ప్రమోటర్లు, డైరెక్టర్లు నేరపూరిత కుట్ర పన్నినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, బుధవారం విచారణకు హాజరుకావాలంటూ ఫెర్నాండెజ్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది. -
‘ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ’
సాక్షి, హైదరాబాద్: ‘‘అక్రమ మార్గంలో ఏ పని జరగాలన్నా ఆయనను కలిస్తే సరిపోతుంది.. ఆయన అవినీతి ప్రపంచ స్థాయికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ చంద్రబాబు నాయుడే. ఓట్లు వేసిన ప్రజల్ని దారుణంగా వంచించిన ఆయన.. పక్కరాష్ట్రాలకు వెళ్లి ఏపీ పరువు తీస్తున్నారు..’’ అంటూ ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి తీరును తూర్పారపట్టారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. ఎయిర్ ఏషియా కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్లు బయటపడటంతో వారి అవినీతి స్థాయి ఏమిటో మరోసారి బట్టబయలైందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!) ‘‘చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంతదాకా విస్తరించిందో ఎయిర్ ఏషియా కుంభకోణంతో మరోసారి బయటపడింది. అక్రమ మార్గాల్లో ఆయన చేయలేని పనులంటూ లేవని రుజువులు దొరికాయి. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఎల్లో మీడియా మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. పెట్రోల్‌పై వ్యాట్ పేరుతో వాహనదారుల నడ్డివిరుస్తున్నారు. గిట్టుబాటు ధర రానీయకుండా రైతులను దగాచేస్తున్నారు..’’ అని భూమన అన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రచురించిన కథనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణలో చంద్రబాబు దళారీల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అంతర్జాతీయంగా కలకలం రేపుతోన్న ఈ ఉదంతంపై టీడీపీతోపాటు పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయంది. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!) మీడియాతో మాట్లాడుతున్న భూమన -
చంద్రబాబు అవినీతి ఆకాశయానం
-
ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు
-
ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు
-
ఎయిర్ ఏషియా స్కాం : చంద్రబాబు పేరు
న్యూఢిల్లీ : ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్ ఏషియా లంచాలు ఎర వేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను అరెస్టు చేసింది. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్(ఎడమ), ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యా(కుడి) ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారు.’ అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడారు. అయితే, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. బీజేపీతో తెగదెంపుల సందర్భంగా అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. -
ఎయిర్‌లైన్స్ సీఈవోపై సీబీఐ కేసు
సాక్షి, ముంబై: ఎయిర్ ఆసియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ఫ్లైయింగ్ లైసెన్సింగ్‌లో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫెర్నాండెజ్ సహా ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందుకోసం ఫెర్నాండెజ్ ప్రభుత్వ ఉద్యోగులకు కుమ్మక్కయ్యారని పేర్కొంది. సీఈఓతో ఫెర్నాండెజ్‌పాటు సింగపూర్‌కు చెందిన ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ డైరెక్టర్ రాజేంద్ర దూబే, ఎయిర్ ఆసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, ఎయిర్ పోర్ట్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్, మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తమ దాడులు జరుగుతున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమానయాన సేవల కోసం లైసెన్సు విధానంలో అక్రమాలతోపాటు, విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపిబి) నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ అధికారులు చెప్పారు. విమానయాన రంగంలోని 5/20 నియమాల సడలింపు కోసం ఎయిర్ ఏసియాకు చెందిన డైరెక్టర్లు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. 5/20 నియమావళి అంటే, ఒక సంస్థకు ఐదు సంవత్సరాలు అనుభవం, 20 విమానాలను కలిగి వుండాలి. అపుడు మాత్రమే అంతర్జాతీయ లైసెన్స్ కోసం అర్హత వుంటుంది. -
ఎయిర్ ఏషియా నుంచి రూ.799కే విమాన టికెట్
బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ రూ.799 నుంచే దేశీయ ప్రయాణ టికెట్లను, రూ.999 నుంచి అంతర్జాతీయ ప్రయాణ టికెట్లను అందిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 నుంచి వచ్చే ఏడాది మే 29 మధ్య ప్రయాణాల కోసం ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కార్పొబ్రీఫ్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్‌పీఐ) పరిమితిని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. భారత్‌లో అతి పెద్ద సిమెంట్ కంపెనీ ఇది. ఈ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.8 కోట్ల టన్నులు. టాటా మోటార్స్: ఆర్థిక ఫలితాలు అధికారికంగా వెల్లడికాకముందే వాట్సాప్ ద్వారా లీకైన విషయంలో దర్యాప్తు జరపాలని టాటా మోటార్స్‌ను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశించింది. సంబంధిత నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని పేర్కొంది. -
ఎయిర్ ఏసియాతో ప్రపంచాన్ని చుట్టేయండి!!!
బిజీ లైఫ్‌లో పరుగులు పెట్టి అలసిపోయారా.. ల్యాప్‌టాప్ స్క్రీన్లతో తృప్తి పడతున్నారా?ఇలా ఎంతకాలం? లాప్టాప్ స్క్రీన్లలో మాత్రమే ప్రపంచాన్ని ఎందుకు చూడాలి? బయటకు వెళ్లి అన్వేషించండి! మీకు ఎయిర్ ఏసియా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎయిర్ ఏసియా ఆకర్షణీయమైన ధరలతో ప్రపంచాన్ని చుట్టి రండి.. అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకోండి..!!! మెల్బోర్న్ యారా నది ఒడ్డున ఒద్దికగా అందంగా రూపుదిద్దుక్ను నగరం మెల్బోర్న్. ఆస్ట్రేలియా ఖండంలోని ఆధునిక మెట్రోపాలిస్ మెల్బోర్న్ను "మార్వెలస్ మెల్బోర్న్" అని కూడా పిలుస్తారు. ఇక్కడ భోజనమైనా, రిలాక్సింగ్ కోసం అయినా, షాపింగ్ అయినా ఏదైనా ప్రతీదీ చాలా ఆకర్షణీయంగా కళాత్మంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిటీ లైన్వేస్(గోడలమీద చిత్రకారులు గీసిన గోడబొమ్మలు), విక్టోరియన్ భవనాలు, కృత్రిమ పార్కులు, తోటలు, పాత ట్రామ్నెట్వర్క్లాంటి చూడవలసిన ముఖ్య విషయాలు. సిడ్నీ అద్భుతమైన వాతావరణంతో అలరారే కాస్మోపాలిటన్ దిగ్గజ నగరంసిడ్నీ. ఐకానిక్ బీచ్‌లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు దీని సొంతం. ఆస్ట్రేలియాలో ఎక్కువగా సందర్శించే నగరం సిడ్నీనే. అర్బన్ గ్లామర్‌తో పాటు సహజ సౌందర్యం ఉట్టిపడే శ్రేష్టమైన నగరం సిడ్నీ. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, డైనమిక్ ఆర్ట్స్, కల్చరల్ ల్యాండ్ స్కేప్స్, అవుట్ డోర్ ల్యాండ్ స్కేప్స్, ఆసక్తికరమైన షాపింగ్ ప్రాంతాలు సిడ్ని మహానగరం సొంతం. కౌలాలంపూర్ మలేషియా రాజధాని కౌలాలంపూర్ అత్యాధునికమైన, భిన్నమైన నగరం. మీరు ఖచ్చితంగా లవ్‌లో పడిపోయే నగరాల్లో ఇదొకటి. అద్భుతమైన ఈ నగరంలో ప్రాచీనమైన బీచ్‌లు, అద్భుతమైన షాపింగ్ ప్రాంతాలు, ప్రపంచ స్థాయి వంటకాలతోపాటు ఇక్కడి నైట్ లైఫ్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అంతేకాదు ఇక్కడి పచ్చదనం మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అన్నట్టు..ఇక్కడి స్ట్రీట్ పుడ్‌ను మర్చిపోవద్దు. ఇండియన్ వంటకాలతో పాటు థాయ్, చైనీస్, మాలే వంటకాల మిశ్రమంగా ఉండే ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ తిని తీరాల్సిందే.. సింగపూర్ సింగపూర్‌లో కేవలం ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ మాత్రమే కాదండీ. ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. కుటుంబంతో సెలవులను ఎంజాయ్ చేయడానికి అద్భుతమైన ప్లేస్ సింగపూర్. అన్ని వయసుల వారిని సమానంగా ఆకట్టుకునే అద్భుతనగరం ఇది. ఇక్కడి నైట్ లైఫ్, ఆశ్చర్యపరిచే నాచురల్ లాండ్‌స్కేప్స్ వైవిధ్యమైన సంస్కృతుల మేళవింపుతో అలరారే చిత్రరూపదర్శిని (కలేడోస్కోప్) సింగ్‌పూర్ అని నిరూపిస్తాయి. హవాయి అమెరికా ఉష్ణమండల స్వర్గంగా అలరారే హవాయి ప్రతీ టూరిస్టుకు వెరీ వెరీ స్పెషల్. ఓహు సర్ఫింగ్ మొదలు మాయి అద్భుతాలకు, హోనోలులు-హవాయ్ అందాలకు హవాయి ద్వీపం చాలా ప్రత్యేకమైనది. అందమైన బీచ్‌లు, అద్భుతమైన అరణ్యాలు, అపారమైన జలపాతాలతో హనీమూన్ వెళ్లే జంటలకు సాహసాలు చేయాలనుకునేవారికి, సర్ఫర్స్కి ఇదే స్పెషల్ డెస్టినేషన్. తెల్లటి ఇసుక, మణి జలపాతాలను ఆస్వాదించాలంటే హవాయి దీవులలో అడుగు పెట్టండి! ఒక విధంగా చెప్పాలంటే భూమిపై అత్యంత అద్భుతమైన ప్రదేశం హవాయి!! మై మరపించే హవాయి అందాలు వీక్షించి తరించాల్సిందే.. జకార్త ఇండోనేషియా నడిబొడ్డున వెలసిన విశాలమైన నగరం జకార్త. నోరూరించే వంటకాలు, ఆకర్షణీయమైన సందర్శనా స్థలాలు, షాపింగ్‌మాల్స్, అద్భుతమైన నైట్ లైఫ్‌తో టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకునే నగరమిది. మోడర్ రిక్రియేషన్స్, మోడరన్ ఎమ్యూజ్మెంట్ పార్కులకు జకార్త నెలవు. తీవ్ర వైరుధ్యాలతో ఉన్న డైనమిక్ నగరం. ఇండోనేషియాలోని వివిధ సంస్కృతులు, నేపథ్యాల ప్రజలను ఈ నగరంలో మనం చూడొచ్చు. ఇక్కడి విభిన్నమైన భోజనం మీ మనసులో చెరగని ముద్ర వేస్తుంది. మనీలా "మనీలా" అంటే "పుష్పించే మడ అడవుల ప్రదేశం". మళ్లీ మళ్లీ సందర్శించాలనుకునే ఆకర్షణ ఈ మెగా నగరం సొంతం. విభిన్న సంస్కృతుల మేళవింపుతో మీకు స్వాగతం పలుకుతుంది. ఉల్లాసభరితమైన ఇండీ మ్యూజిక్‌తో మనీలా నిజమైన ఆసియా మెగాసిటీగా వర్ధిల్లుతున్న ప్రదేశం. ఆక్లాండ్ దేనికీ కొరతలేని, అన్నిటికీ పుష్కలమైన ప్రదేశం ఆక్లాండ్. అతిథులకు మంచి ఆతిథ్యం దొరికే ప్రదేశం ఆక్లాండ్.మిరుమిట్లు గొలిపే నౌకాశ్రయాలు, అద్భుతమైనవారసత్వ ప్రదేశాలు, ఓపెన్ థియేటర్లతోపాటు, స్థానికుల వినోద భరితమైన అనేక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ స్పెషలే. కెఫేలు, చక్కటి భోజన రెస్టారెంట్లు, ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్స్ సందర్శకులతో నిత్యం నిండి ఉంటాయి. స్కై డైవింగ్, జెట్ బోటింగ్, బంగీ జంప్ అదనపు ఆకర్షణలు. అంతేకాదండోయ్.... అనేక రకాల, విశిష్టమైన వైన్‌కు ఆక్లాండ్ పెట్టింది పేరు. లాంగ్ కావి సుందరమైన బీచ్ లకు ప్రసిద్ది చెందింది లాంగ్కావి. ముఖ్యంగా ఉష్ణమండలం. 'ది జ్యువెల్ ఆఫ్కెడా' గా పిలిచే లాంగ్కావి ప్రశాంతత కోరుకునే వారికి స్వర్గంలాంటిది. మొత్తం 99 ద్వీపాలకు నెలవై ప్రధాన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సూర్యాస్తమయం సమయంలో బీచ్ వాక్, బీచ్ బార్లు, నోరు ఊరించే వంటకాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాక్ట్ర్చర్, మడ అడవులు, వృక్షజాలం, జంతుజాలం, మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే లాంగ్కావీని తప్పనిసరిగా సందర్శించండి! చైనా విస్తారమైన భూభాగం, అందమైన ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన సంస్కృతి చైనాలో మనకు కనిపించే ప్రధాన అంశాలు. సుదీర్ఘ తీరరేఖలు, అందమైన లోయలు, నిటారుగా ఉన్న పర్వతాలు, ఎడారులు, క్రిస్టల్ సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, ఉష్ణమండల సతతహరిత అడవులు ఈ దేశానికి లభించిన వరాలు. ఈ సుందరమైన సౌందర్యం, ప్రత్యేకమైన సంగీతం, నాటకం, ప్రసిద్ధ వంటకాలు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి ప్రపంచంలోనే గొప్ప ప్రాచుర్యం పొందిన ఆకర్షణలు చాలానే ఉన్నాయి. తైవాన్ ఉప ఉష్ణమండల చిన్న ద్వీపం తైవాన్. ఆదిమ సంస్కృతితో, అద్భుతమైన, ఆకుపచ్చ ద్వీపం మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలిచే తైవాన్ రంగురంగుల పండుగలకు నెలవు. అందమైన తూర్పు తీరం, మర్మమైన సుదూర దీవులు, ముఖ్యంగా అందమైన పర్వతాలు హిచ్ హైకర్స్కి మంచి అవకాశాన్ని అందిస్తాయి. జపాన్ పురాతన సంస్కృతి, సహజ ప్రకృతి దృశ్యాలతోపాటు మిరుమిట్లు గొలిపే ఆధునిక సంసృతికి చక్కటి మేళవింపు జపాన్. ఈ సున్నితమైన కలయికే మీలాంటి సందర్శకుల హృదయాలను చూరగొంటుంది. అందమైన దేవాలయాలు, విగ్రహాలు, పరిపూర్ణ సహజ ప్రకృతి దృశ్యాలు, ఇంకా యమ్మీ యమ్మీ సుఫీతో ప్రేమలో పడకుండా ఉండలేరంటే నమ్మండి.. దక్షిణ కొరియా ఆధునిక, వేగవంతమైన సాంకేతిక పురోగమనాల కోసం అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన దేశం దక్షిణ కొరియా. సహజ అందాలతో, దాని సంప్రదాయాలను అబ్బురంగా కాపాడుకుంటుంది. పారిశ్రామిక, పట్టణీకరణ, విలాసవంతమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సాంస్కృతిక భిన్నత్వానికి ప్రసిద్ధి చెందింది. 5వేల వేళ్ల నాటి సంస్కృతి , చరిత్రతో అలరారుతున్న దక్షిణ కొరియా తప్పనిసరిగా సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. -
రూ.99కే విమాన ప్రయాణం
ముంబై: మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణంపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. దేశీయ మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ను కేవలం రూ.99(బేస్ ఫేర్/పన్నులు, సర్‌చార్జీలు, ఫీజులు కాకుండా)కే పొందొచ్చని ఈ సంస్థ తెలిపింది. అలాగే, అంతర్జాతీయ మార్గాల్లో కేవలం రూ.444కే టికెట్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. పరిమిత కాలం పాటే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి – మే నెల మధ్య ప్రయాణాలకు సంబంధించి తాజా ఆఫర్లతో టికెట్లను ఈ నెల 19వ తేదీ వరకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌తోపాటు యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా కోల్‌కతా నుంచి జోహార్ బహ్రు వెళ్లే వారికి ఎయిర్ ఏషియా బెర్హాద్ జీరో బేస్ చార్జీతోనే ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. విమాన ప్రయాణానికి కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. -
ఆఫర్లతో దిగొస్తున్న విమానాలు
♦ జాబితాలో స్పైస్‌జెట్, ఇండిగో, జెట్, ఎయిర్ఏసియా ♦ బుక్ చేసుకోవటానికి మరో నాలుగు రోజుల సమయం ♦ వచ్చే ఏడాది మార్చి వరకూ ప్రయాణించే వీలు న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగంలో మరోసారి ధరల యుద్ధానికి తెరలేచింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు పోటీపడి మరీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వార్షికోత్సవ ఆఫర్ అంటూ తొలుత స్పైస్‌జెట్ ఈ పోటీకి తెరతీయగా... ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ఏసియా వంటి సంస్థలన్నీ వరస కట్టాయి. స్పైస్‌జెట్: రూ.12 బేసిక్ ఫేర్‌తో టికెట్ స్పైస్‌జెట్ తన 12వ వార్షికోత్సవమంటూ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.12ల బేసిక్ ఫేర్‌తో వన్‌వే టికెట్లను ఆఫర్ చేస్తోంది. దీనికి ట్యాక్స్‌లు, సర్‌చార్జ్‌లు అదనం. మే 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు 2017 జూన్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దేశీ, అంతర్జాతీయ ఫ్లైట్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక టికెట్లను బుక్ చేసుకున్న వారు సంస్థ నిర్వహించే లక్కీడ్రాలో ఉచిత టికెట్లతోపాటు పలు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇండిగో టికెట @ రూ. 899 ఈ రేసులో చేరిన ‘ఇండిగో’ తాజాగా రూ.11 బేసిక్ ఫేర్‌తో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌కు తెరలేపింది. ఈ ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా కంపెనీ వన్‌వే టికెట్లను రూ.899 ప్రారంభ ధరతో ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు 2017 జూన్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇండిగో తాజా ఆఫర్ కింద విశాఖపట్నం–హైదరాబాద్ టికెట్‌ను రూ.1,104లకు, హైదరాబాద్–విశాఖపట్నం టికెట్‌ను రూ.1,441లకు, బెంగళూరు–హైదరాబాద్ టికెట్‌ను రూ.1,250లకు, శ్రీనగర్–జమ్మూ టికెట్‌ను రూ.899లకు అందిస్తోంది. పలు రూట్లలో ఇలాంటి ఆఫర్లున్నాయి. రేసులోకి జెట్ ఎయిర్వేస్ ఈ విమానయాన సంస్థ కూడా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా కంపెనీ రూ.1,079 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇది గ్రూప్ బుకింగ్స్‌కు వర్తించదు. ఈ నెల 26 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఎయిర్ ఏసియా కూడా.. టాటా–ఎయిర్‌ఏíసియా జాయింట్ వెంచర్ అయిన ఎయిర్ఏసియా ఇండియా కూడా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌వే రూట్లకు మాత్రమే వర్తించే ఆఫర్ ఇది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది నవంబర్ 23 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. దీనికి టికెట్ ప్రారంభ ధర రూ.1,699. -
ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్:‘బై నౌ-ఫ్లై నౌ’
న్యూఢిల్లీ: ఎయిర్ఏసియా విమాన ప్రయాణికులకు బంపర్ఆఫర్ ప్రకటించింది. ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ తదితర ఎయిర్ లైన్స్‌తో పోటీ పడుతున్న నేపథ్యంలో ఎయిర్ ఆసియా ఇండియా సోమవారం సరికొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో లాంచ్ చేసిన ఈ ఆఫర్లో ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు అందించనుంది. ఇందులో ప్రారంభ ధర రూ.1,031లుగా నిర్ణయించింది. మే 21 వరకూ అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు తన వెబ్సైట్లో పూర్తి వివరాలను ఎయిర్ఏషియా అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కోసం ముందస్తు బుకింగ్ అవసరమని పేర్కొంది. ఎయిర్ ఏషియా ఇండియా వెబ్సైట్ ఆధారంగా ఈ ప్రోత్సాహక పథకంలో కొన్ని ప్రత్యేక ఛార్జీలు ఇలా ఉన్నాయి. గోవా-హైదరాబాద్‌కు రూ. 1,237 హైదరాబాద్ నుండి గోవా కు రూ .1,722 గోవా-బెంగళూరు రూ .1,428, జైపూర్-పూణే రూ. 2.908, న్యూ ఢిల్లీ-బెంగళూరు రూ. 1,927, పూణే-బెంగళూరు రూ. 1,758, విశాఖపట్నం-బెంగళూరు రూ. 1,640 మరియు బెంగళూరు-హైదరాబాద్ రూ. 1,565 ఢిల్లీనుంచి ఇతర ప్రాంతాలకు ఛార్జీలు బెంగళూరు రూ. 1927.00 గౌహతి రూ.3765.00 గోవా రూ. 3364.00 బాగ్డోగ్రా రూ .2565.00 రాంచి రూ. 2924.00 పూణే రూ. 3364.00 శ్రీనగర్ రూపాయలు 2062.00 ఇంఫాల్ రూ 4364.00 కోల్‌కతా రూ.2697.00 ఇతర నిబంధనలు: * క్రెడిట్, డెబిట్ లేదా ఇతర కార్డులపై ప్రాసెసింగ్ ఫీజులు తిరిగి చెల్లించబడవు. * అన్ని విమానాలలోను సీట్స్ అందుబాటులో ఉండవు * క్రొత్త టికెట్ కొనుగోలులో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. * ఈ ఆఫర్ వన్-వన్ ట్రిప్ కు మాత్రమే * ఒకసారి చెల్లింపు చేసిన తర్వాత, వాపసు చేయబడదు. -
ఎయిర్ ఏసియా భారీ ఆఫర్
డొమెస్టిక్, అంతర్జాతీయ ప్రయాణాలపై ఎయిర్ ఏసియా సోమవారం భారీ ఆఫర్లను ప్రకటించింది. జాతీయ స్ధాయిలో రూ.899/- నుంచి అంతర్జాతీయ స్ధాయిలో రూ.4,999/- నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పింది. ఈ నెల13 నుంచి 19 వరకూ అందుబాటులో ఉండే ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1, 2017 నుంచి జూన్ 5, 2018 మధ్య ప్రయాణించొచ్చని పేర్కొంది. ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఏసియా బెర్హాద్, థాయ్ ఎయిర్ ఏసియా, ఎయిర్ ఏసియా ఎక్స్ సర్వీసులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. జాతీయ స్ధాయిలో రూట్స్ వివరాలు: బెంగుళూరు, కోచి, గోవా, జైపూర్, చంఢీఘర్, పూణె, న్యూఢిల్లీ, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్, బగ్డొగ్రా రూట్లలో ఎయిర్ ఏసియా సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ స్ధాయిలో రూట్స్ వివరాలు: కౌలాలంపూర్, బ్యాంకాక్, ఫుకెట్, సింగపూర్, బాలి, మెల్బోర్న్ రూట్లలో ఆఫర్ ఉంది. భువనేశ్వర్-కౌలాలంపూర్‌ల మధ్య ఎయిర్ ఏసియా బర్హాద్ కొత్త సర్వీసును ఈ మధ్యనే ప్రారంభించింది. ఆఫర్ ఈ రూట్లో కూడా వర్తిస్తుందని ఎయిర్ ఏసియా తెలిపింది. -
ఎయిర్ ఏషియా మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ : బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.తన కొత్త ప్రమోషనల్ స్కీంలో భాగంగా తగ్గింపు ధరల ఆఫర్ కింద విమాన టిక్కెట్లను రూ.899లకే ( అన్నీ కలుపుకొని) అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 23తో ముగియనున్న ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు 2017 మార్చి 31 మధ్య ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. రూ. 899 ధరలు గౌహతి-ఇంఫాల్ మధ్య ప్రయాణానికి వర్తించనున్నట్టు తెలిపింది. అలాగే ఈ ఆఫర్ కింద కొచ్చి- బెంగుళూరు టిక్కెట్టు ధర రూ.999ల నుంచి ప్రారంభమవుతాయి. కొచ్చి-హైదరాబాద్ 2,699గా, గోవా- రూ.3199గా, జైపూర్ - పుణే రూ. 2399 గా ఉండనున్నాయి. మరిన్ని వివరాలు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ లో.. -
ఎయిర్ఏసియా టికెట్ రూ.899కే
న్యూఢిల్లీ: మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ గ్రూప్ ‘ఎయిర్ఏసియా’ తాజాగా విమాన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులకు ఈ ఆఫర్ అక్టోబర్ 16 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఎయిర్ఏసియా తాజా ఆఫర్లో భాగంగా బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, న్యూఢిల్లీ, గువాహటి, జైపూర్, పుణే, ఇంపాల్ వంటి పలు ఇతర దేశీ విమాన ప్రయాణపు టికెట్లను రూ.899ల నుంచి (ఒక వైపునకు) అందిస్తోంది. ప్రయాణికులు కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, మెల్బోర్న్, సిడ్నీ వంటి విదేశీ ప్రయాణ టికెట్లను రూ.3,599ల నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని సంస్థ పేర్కొంది. కాగా ఎయిర్ఏసియా మలేసియా, ఎయిర్ఏసియా థాయ్‌లాండ్, ఎయిర్ఏసియా ఇండోనేసియా, ఎయిర్ఏసియా ఫిలిప్పిన్స్, ఎయిర్ఏసియా ఇండియా, మలేసియా ఎయిర్ఏసియా ఎక్స్, థాయ్ ఎయిర్ఏసియా ఎక్స్ సంస్థలు నడిపే విమానాల్లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. -
2018 నాటికి 20 విమానాలు
♦ విదేశాలకు సర్వీసులపై కసరత్తు ♦ ఎయిర్ఏషియా ఇండియా సీఈవో ♦ అమర్ అబ్రోల్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా 2018 ఆఖరు నాటికల్లా విమానాల సంఖ్యను 20కి పెంచుకోవాలని యోచిస్తోంది. తద్వారా నిబంధనలకు అనుగుణంగా విదేశాలకూ సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కంపెనీ సీఈవో అమర్ అబ్రోల్ బుధవారమిక్కడ విలేకరులకు ఈ విషయాలు తెలిపారు. ఇటీవల సవరించిన పౌర విమానయాన నిబంధనల ప్రకారం దేశీ విమానయాన సంస్థ.. విదేశాలకు సర్వీసులు నడపాలంటే కనీసం 20 విమానాలు కలిగి ఉండాలి. టాటా సన్స్, ఎయిర్ఏషియా బెర్హాద్ ఏర్పాటు చేసిన ఎయిర్ ఏషియా ఇండియాకు ప్రస్తుతం ఏడు విమానాలుండగా.. తాజాగా ఎనిమిదో విమానాన్ని సమకూర్చుకుంది. వచ్చే నెల 8 నుంచి దీనితో కొత్తగా హైదరాబాద్-కొచ్చి రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు అమర్ తెలియజేశారు. ఈ రూట్లో ప్రమోషనల్ ఆఫర్ కింద రూ.2,999కి పరిమిత సంఖ్యలో టికెట్లు అందిస్తున్నామని, సెప్టెంబర్ 14 నుంచి బుకింగ్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా మరిన్ని విమానాలను సమకూర్చుకునేందుకు, సిబ్బంది నియామకాలకు, కార్యకలాపాల విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలియజేశారు. ‘‘రెండేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన తొలినాళ్లలో తొలి విడతగా దాదాపు 30 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాం. ఇపుడు రెండో విడత నిధులు సమీకరిసున్నాం. ఒకటిరెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం’’ అని అమర్ వివరించారు. అటు కొన్ని ప్రాం తీయ విమానయాన సంస్థలు సమస్యలు ఎదుర్కొంటున్న దరిమిలా ఇతర కంపెనీల కొనుగోళ్ల అంశంపై స్పందిస్తూ .. వృద్ధికి సంబంధించి అన్ని అవకాశాలు పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విలీనాలు, కొనుగోళ్లు ఎయిర్‌ఏషియాకు కొత్తేమీ కాదన్నారు. నెట్వర్క్ నిర్మాణంపై దృష్టి... దేశీయంగా యువజనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో యువత ఎక్కువగా ప్రయాణిస్తున్న ప్రాంతాల ప్రాతిపదికన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు అమర్ చెప్పారు. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలు, అభివృద్ధికి అవకాశమున్న కొత్త మార్గాలు, లాభసాటి రూట్లలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు వివరించారు. తమ సిబ్బంది నైపుణ్యాల మెరుగుదల కోసం బెంగళూరులో కొత్తగా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అమర్ చెప్పారు. ప్రస్తుతం 11 నగరాల మధ్య తమ సర్వీసులు నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా 330 సిటీ పెయిర్స్ ఉన్న నేపథ్యంలో విమానయాన సేవల విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో రైలు ప్రయాణం కన్నా విమాన టికెట్ల చార్జీలు చౌకగా ఉంటున్నప్పటికీ.. చాలా మందికి ఈ విషయంపై అంతగా అవగాహన ఉండటం లేదన్నారు. ఎయిర్‌లైన్స్ పోటాపోటీగా చార్జీలు తగ్గించడం వల్ల, విమాన ప్రయాణ వ్యయాలు దాదాపు సగానికి తగ్గిపోయాయని చెప్పారు. మరోవైపు, ఎయిర్ఏషియా ఇండియా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి స్థూల లాభాలు నమోదు చేయగలిగిందని, త్వరలో పూర్తి స్థాయి లాభాలు సాధించగలమని అమర్ ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు అమర్ వివరించారు. స్వర్ణ పతక విజేతలకు జీవితకాలం, రజత పతకం సాధించిన వారికి అయిదేళ్లపాటు, కాంస్య పతక విజేతలకు మూడేళ్ల పాటు ఎయిర్ఏషియా, ఎయిర్ఏషియా ఎక్స్ నెట్‌వర్క్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేశారు. -
172 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు
ఎయిర్‌బస్‌తో ఎయిర్ ఏషియా, గో ఎయిర్ ఒప్పందం ఫార్న్‌బరో: విమానయాన సేవలకు గిరాకీ నేపథ్యంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా తోపాటు తక్కువ ధరల విమానసేవల సంస్థ గో ఎయిర్ భారీ ఎత్తున ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఈ సంస్థలు ఎయిర్‌బస్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంగ్లండ్‌లోని ఫార్న్బరోలో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ఎయిర్ ఏషియా 100 విమానాలు ఎయిర్ ఏషియా సంస్థ 100 ఎయిర్‌బస్ ఏ321 నియో మోడల్ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు 1260కోట్ల అమెరికన్ డాలర్లు (రూ.84,420కోట్లు సుమారు) ఖర్చు చేయనుంది. ఇందులో ఒకే తరగతిలో 236 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. తాజా కొనుగోలుతో కలిపి చూస్తే... ఎయిర్ ఏషియా ఇప్పటి వరకు మొత్తం 575 ఏ320 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వీటిలో 170 విమానాలను ఎయిర్‌బస్ అందించింది. గో ఎయిర్ 72 విమానాలు గో ఎయిర్ సంస్థ కూడా తన సేవల విస్తరణకు వీలుగా ఎయిర్‌బస్ 72 ఏ320 నియో మోడల్ విమానాల కొనుగోలుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 770 కోట్ల డాలర్లు (రూ.51,590 కోట్లు సుమారు). దీంతో వాడియా గ్రూపునకు చెందిన గో ఎయిర్ మొత్తం 144 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు అయింది. -
ఇండియాలో తొలి సినిమాగా 'కబాలీ'!
లేటు వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఘాటుగా మాయ చేస్తున్నాడు. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, నిరుప్పుడా సాంగ్, ఫస్ట్ పోస్టర్ లతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు కోట్ల ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను సూపర్ స్టార్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నాడు. చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో నిండిపోతున్నాయి. తాజాగా విమానాలపై సినిమా పోస్టర్లు అంటించి ప్రచారం చేయడంతో 'కబాలీ' మేనియా ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఏయిర్ ఏషియా విమానాలపై కబాలీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేశారు. గతంలో దేశంలో ఏ చిత్రానికి లేని తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ మూవీగా కబాలీ సెన్సెషన్ గా నిలువనుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క సినిమాకు మాత్రమే ఈ తరహా ఆదరణతో కూడిన ప్రచారం లభించింది. ఎయిర్ న్యూజీలాండ్ విమానసంస్థ వారు 'ద హాబిట్' మూవీకి మాత్రమే విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు. రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా రజనీ పోస్టర్లతో కబాలీ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు. -
ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్
చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్‌ను (ఒకవైపునకు మాత్రమే) రూ.786 ప్రారంభ ధరతో అందిస్తోంది. ‘ఫ్లై లైక్ ఏ సూపర్‌స్టార్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్.. జూలై 3 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలియజేసింది. పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకూ ఒకవైపునకు సంబంధించి రూ.2,999 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘కబాలి’ ప్రమోషన్స్‌లో భాగం గా సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ఏషియా ఇటీవలే కబాలి సినిమా నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మొబైల్ బుకింగ్‌లపై 20 శాతం డిస్కౌంట్
ఎయిర్ ఏషియా ఆఫర్ హైదరాబాద్: మొబైల్ యాప్, మొబైల్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసే విమాన టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ అందిస్తోంది. ఈ ఆఫర్ నేటి(3 జూన్) నుంచి ప్రారంభమై ఈ నెల 5 వరకూ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లు ఈ నెల 6 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణాలకు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ీ సీగ్ట్రాండ్ టెహ్ పేర్కొన్నారు. మొబైల్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన తొలి విమానయాన సంస్థల్లో ఎయిర్ ఏషియా కూడా ఒకటని వివరించారు. 2010లో ఈ మొబైల్ యాప్‌ను డెవలప్ చేశామని, ఇప్పటిదాకా కోటి డౌన్లోడ్లు జరిగాయని పేర్కొన్నారు. -
హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారులకు ఎయిర్ ఏషియా ఆఫర్
హైదరాబాద్: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు విమాన ప్రయాణ చార్జీల్లో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు బేస్ధరలో 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నామని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 21వరకూ జరిగే బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఈ ఏడాది జూలై 1 నుంచి 30 సెప్టెంబర్ వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ, ఎండీ మిట్టు చాండిల్య పేర్కొన్నారు. ఏయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఏషియా బెర్హాద్, ఎయిర్ ఏషియా ఎక్స్, థాయ్ ఎయిర్ ఏషియా విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. అందరికీ విమానయానం తమ లక్ష్యమని, అందుకు ఈ ఆఫర్లనిస్తున్నామని పేర్కొన్నారు. -
బెంగళూరు విమానాశ్రయంలో కలకలం
-జైపూర్ నుంచి వచ్చిన విమానంలో బెదిరింపు లేఖ దొడ్డబళ్లాపురం(కర్ణాటక) విమానంలో బాంబు బెదిరింపు లేఖ లభించిన సంఘటన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కలకలం రేగింది. జైపూర్ నుంచి నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 160 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విమానాన్ని సిబ్బంది శుభ్రం చేస్తుండగా బాంబు బెదిరింపు లేఖ లభించింది. అందులో 'బాంబ్ ఈజ్ కెప్ట్' అని రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉత్తుత్తి బాంబు బెదిరింపు లేఖగా తేల్చారు. అయితే లేఖ ఎవరు రాశారనే విషయంపై ఎయిర్ పోర్టు సెక్యూరిటీ విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా 1.30 గంటలకు ఇక్కడి నుంచి గోవాకు బయల్దేరాల్సిన ఈ విమానం తనిఖీల వల్ల రెండు గంటల ఆలస్యంగా బయల్దేరింది. -
ఢిల్లీ-విశాఖ మార్గంలో ఎయిర్ఏషియా విమానాలు
చవక విమానయాన ఆఫర్లతో తరచు ఆకట్టుకునే ఎయిర్ ఏషియా సంస్థ మరో రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు ప్రారంభించింది. న్యూఢిల్లీ- విశాఖపట్నం, న్యూఢిల్లీ- గువాహటి మార్గాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు మార్గాల్లోను ప్రమోషనల్ ఆఫర్లను ఎయిర్ ఏషియా ప్రకటించింది. న్యూఢిల్లీ- విశాఖ మార్గంలో టికెట్ రూ. 3490గా తెలిపింది. ఈ ఆఫర్ కింద నవంబర్ ఒకటోతేదీ లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి, నవంబర్ 20 నుంచి అక్టోబర్ 29 వరకు ప్రయాణాలు చేయొచ్చు. ఇది కాక, కొచ్చి- బెంగళూరు, బెంగళూరు-గోవా మార్గాల్లో రూ. 1590కే టికెట్లు అంటూ మరో ఆఫర్‌ను కూడా ఎయిర్ ఏషియా ప్రకటించింది. బెంగళూరు నుంచి పుణుకు రూ. 1990 టికెట్ పెట్టింది. ఇక దీపావళి సందర్భంగా కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, గోవా, హాంకాంగ్, మిరి నగరాలకు రూ. 850 నుంచి మొదలుపెట్టి మరో ఆఫర్ ప్రకటిచింది. ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. నవంబర్ 1 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. -
విమానాల్లో చెకిన్ బ్యాగేజీకీ చార్జీల బాదుడు
న్యూఢిల్లీ : దేశీ విమానయాన సంస్థలు ఇకపై చెకిన్ బ్యాగేజీపైనా చార్జీలు విధించేందుకు అనుమతించడాన్ని పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ఏషియా సంస్థలు ఈ మేరకు ‘జీరో బ్యాగేజ్ ఫేర్’ ప్రతిపాదనను డీజీసీఏకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులోని అంశాలపై మరింత స్పష్టతనివ్వాలంటూ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ సూచించినట్లు అధికారులు వివరించారు. ప్రతిపాదన ప్రకారం అసలు బ్యాగేజీ లేని ప్రయాణికులకు టిక్కెట్ రేటులో డిస్కౌంటు లభించనుంది. ప్రస్తుతం 15 కేజీల దాకా బరువుండే బ్యాగేజీని ప్రయాణికులు విమానాల్లో తమ వెంట ఉచితంగానే తీసుకెళ్లవచ్చు. అయితే, కొత్త ప్రతిపాదన గానీ అమల్లోకి వస్తే ప్రతి కేజీకి ఇంత చొప్పున కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే, టికెట్ నుంచి ఇతరత్రా సర్వీసులను విడగొట్టి (ప్రయాణికులు లాంజ్‌ను ఉపయోగించుకోవడం, నచ్చిన సీటు ఎంపిక చేసుకోవడం మొదలైనవి) ఎయిర్‌లైన్స్ చౌకగా విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు, రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో దేశీ విమానయాన కంపెనీలు గడిచిన అయిదేళ్లుగా వసూలు చేస్తున్న టికెట్ చార్జీల తీరుతెన్నులను పరిశీలించాలంటూ డీజీసీఏని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. రద్దీ సీజన్లో విమానయాన సంస్థలు టికెట్ చార్జీలను భారీగా పెంచేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చార్జీలపై గరిష్ట పరిమితులు విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. -
విశాఖ నుంచి మలేసియాకు నేరుగా విమానం
కౌలాలంపూర్: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా కౌలాలంపూర్-విశాఖపట్నం రూట్లో డెరైక్ట్ ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మే 7 నుంచి వారానికి మూడు విమానాలు నడుపుతామని తెలియజేసింది. ప్రారంభ ఆఫర్ కింద కౌలాలంపూర్-వైజాగ్ ఫ్లయిట్లో సుమారు రూ.4000కే టికెట్లు (వన్‌వే చార్జీ) అందిస్తున్నట్లు ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఏడాది మే 7 నుంచి 2016 మార్చి 26 దాకా చేసే ప్రయాణాలకు ఈ నెల 22 దాకా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పర్యాటక, వాణిజ్య కేంద్రంగా వైజాగ్ ఎదుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఈ ఫ్లయిట్ సేవలు ఉపయోగపడగలవని ఎయిర్ ఏషియా హెడ్(కమర్షియల్ విభాగం) స్పెన్సర్ లీ తెలిపారు. బ్యాంకాక్, కొలంబోలకు కూడా.. ఇక్కడి విమానాశ్రయం నుంచి ఇప్పటికే ఎయిరిండియా దుబాయ్‌కి, సిల్క్ ఎయిర్వేస్ సింగపూర్‌కి, మలిందో ఎయిర్‌లైన్స్ కౌలాలంపూర్‌కి విమా న సర్వీసులు కల్పించాయి. విశాఖ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న నేపధ్యంలో బ్యాంకాక్, కొలంబో దేశాలకూ విశాఖ నుంచి విమాన సర్వీసులు రాబోతున్నాయని భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. -
699 రూపాయలకే.. విమానం టికెట్టు!!
-
రూ.699కే ఎయిర్ ఏషియా టికెట్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా రూ.699 ధర నుంచి విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లతో బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని బుధవారంతో ముగుస్తాయని కంపెనీ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. బెంగళూరు నుంచి చెన్నైకి రూ.699, బెంగళూరు నుంచి కోచికు రూ.899, బెంగళూరు-గోవా రూ.1,099, బెంగళూరు-పుణేకు రూ.1,499, బెంగళూరు-జైపూర్, బెంగళూరు-చండీగఢ్‌లకు రూ.1,999లకే టికెట్లను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. -
ఎయిర్ ఆసియా బ్లాక్ బాక్స్ లభ్యం
జకార్తా/సింగపూర్: రెండువారాల కిందట జావా సముద్ర జలాల్లో కూలిన ఎయిర్ ఆసి యా విమానం ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను సోమవారం డైవర్లు కనుగొన్నారు. ఇందులో ఫ్లైట్ డాటారికార్డర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను కూడా దీనికి 20 మీటర్ల దూరంలో గుర్తించినప్పటికీ ఇంకా వెలికి తీయలేదు. విమానం సముద్రంలో కూలినప్పుడు నీళ్లను బలంగా ఢీకొనడంతో ఆ రాపిడికి పేలిపోయిందని ఇండోనేసియా అధికారులు తెలిపారు. కీలకమైన ఈ పరికరాలు లభ్యంకావడంతో విమానం కూలిపోవడానికి గల కారణాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. అంతకు ముందు ఈ పరికరాల నుంచి వచ్చే సంకేతాలను స్పష్టంగా గుర్తించడానికి పరసరప్రాంతాలనుంచి వెళ్లే నౌకలను అక్కడ తమ పనులకోసం రేడియో సందేశాలు పంపకుండా చూశామని సెర్చ్ ఆపరేషన్ డెరైక్టర్ సుప్రియాది తెలిపారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, కూలిన విమానం రెక్క కింద భాగం లో ఉన్నట్టు తెలుస్తోందని, ఆ రెక్క చాలా బరువుగా ఉండటంతో వాయిస్ రికార్డర్నుఇంకా వెలికి తీయలేదన్నారు. -
మా నాన్నను తప్పుపట్టొద్దు
విమానం కుప్పకూలిపోవడంలో తమ తండ్రిని తప్పు పట్టొద్దని ఎయిర్ ఏషియా విమాన పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజెలా చెబుతోంది. చిట్ట చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులో ప్రయాణికులను కాపాడేందుకే ప్రయత్నించారని, ఆమాటకొస్తే.. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణికులకు హాని కలిగించాలని అనుకోరని ఆమె చెప్పింది. పైగా కెప్టెన్ ఇర్యాంటో కూతురిగా తాను ఆ విషయాన్ని అసలు ఒప్పుకోనని తెలిపింది. ఆయన కూడా ప్రమాదంలో మరణించారని, ఇప్పటికి ఇంకా అసలాయన మృతదేహం కూడా లభించలేదని.. దాంతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని చెప్పింది. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం క్యూజడ్850లో సిబ్బంది సహా మొత్తం 162 మంది ఉండగా కేవలం 34 మృతదేహాలను మాత్రమే ఇంతవరకు వెలికితీశారు. బ్లాక్ బాక్స్ కూడా ఇంకా బయటపడలేదు. అది వస్తే తప్ప చివరి నిమిషంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే అవకాశం లేదు. ఈలోపు పైలట్ ఇర్యాంటోను తప్పుబట్టడం సరికాదని ఆయన కుమార్తె ఏంజెలా చెప్పింది. -
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'
-
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'
కౌలాంలాపూర్: ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విమానం అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టినా.. తాజాగా కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి ఆ పరిధిలోనే అన్వేషణ కొనసాగిస్తున్నామని నావీ చీఫ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇప్పటి వరకూ 16 ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టినా ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. 90కు పైగా నౌకలు, పలు దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, యూఎస్ తదితర దేశాలు పాల్గొంటున్నాయి. -
ఆ విమానం నీటిపై సురక్షితంగా దిగిందా..!
జకార్తా/లండన్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501ను పైలట్ సురక్షితంగా సముద్రపు నీటిపై దింపి ఉండొచ్చని నిఫుణులు భావిస్తున్నారు. అయితే ఉవ్వెత్తున ఎగసిపడిన అలల కారణంగా విమానం నీటిలో మునిగిపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా విమానం కుప్పకూలితే కనిపించే శకలాలు, అత్యవసర ట్రాన్స్మిషన్లు, ఇతర డాటా లాంటివి లభించకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కాగా, విమానంలోని బ్లాక్ బాక్స్ గురించి ఇంకా వేట కొనసాగుతోంది. గురువారం మరో ప్రయాణికుడి మృతదేహం లభించింది. -
బ్లాక్ బాక్స్ కోసం మరో వారం అగవలసిందే!
జకార్తా/సింగపూర్: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం మరో వారం రోజులు ఆగవలసిందేనని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఆ బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోయిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం ఐదో రోజు గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విమానంలో 162 మంది ఉండగా, ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు సాధ్యం కావడంలేదు. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బలమైన అలల వల్ల విమాన శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. -
జావా సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఇండోనేషియా: జావా సముద్రంలో ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదో రోజు రెస్క్యూ టీమ్స్ సముద్రంలో మృతిదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీసిన సంగతి తెలిసిందే. బుధవారం గాలింపు చర్యలకు ప్రతికూల వాతావరణం వల్ల తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. -
మృత్యు సముద్రం...
తేలుతున్న విమాన ప్రయాణికుల మృతదేహాలు ప్రతికూల వాతావరణంతో స్వాధీనానికి ఆటంకం జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాలు, విమాన శకలాల స్వాధీనానికి ప్రతికూల వాతావరణం వల్ల బుధవారం తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా గాలింపు, సహాయకచర్యల సంస్థ అధిపతి సోలిస్తియో చెప్పారు. వీటిలో ఎయిర్ ఆసియా యూనిఫామ్ ధరించిన ఎయిర్‌హోస్టెస్ మృతదేహం ఉందన్నారు. చాలా మృతదేహాలు సముద్రంలో తేలాడుతున్నాయన్నారు. మృతదేహాలు, బ్లాక్‌బాక్స్ ఫ్లైట్ రికార్డర్ల కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని, అయితే భారీ వర్షం, మూడు మీటర్ల ఎత్తున లేస్తున్న అలల వల్ల గాలింపును నిలిపేశామని తెలిపారు. ధ్వనితరంగాలతో వస్తువులు గుర్తించే సోనార్ చిత్రాల్లో కూలిన విమానానివిగా భావిస్తున్న పెద్ద శకలాలు గుర్తించామని, అవి అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయన్నారు. శకలాలు మంగళవారం కనిపించిన చోటికి 50 కి.మీ దూరానికిపైగా వెళ్లాయని ఇండోనేసియా మరో అధికారి తెలిపారు. మృతదేహాలు తీరానికి వస్తాయని భావిస్తున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో రెండింటిని సురబయకు తీసుకొచ్చారు. ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్8501 విమానం ఆదివారం 162 మందితో ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కూలిపోవడం తెలిసిందే . కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న ఓ ప్రయాణికుడి మృతదేహంపై లైఫ్ జాకెట్ కనిపించింది. దీంతో ప్రమాదం ఎలా జరిగి ఉంటుందన్నదానిపై ఊహాగానాలు పెరిగాయి. విమానం నీటిని తాకడానికి ముందే లైఫ్ జాకెట్‌ను తొడుక్కుని ఉండొచ్చని, అదే నిజమైతే విమానం కూలడానికి ముందు ఆపదలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు
న్యూఢిల్లీ: అదృష్టమంటే ఇండోనేసియాకు చెందిన ఈ జంటదే. మృత్యువు దగ్గరగా వెళ్లబోయి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. హర్టనో, లానో హర్టనో అనే దంపతులు.. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో వారు ప్రయాణించాల్సివుంది. ఇందుకోసం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. క్రిస్మస్ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలసి గడపాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సురబయ నుంచి 162 మందితో బయల్దేరిన విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే హర్టనో దంపతులు షాక్ తిన్నారు. తాము ప్రాణాలతో బయటపడినా.. ఈ ప్రమాదం జరగడం తమను కలచి వేసిందని లానో హర్టనో అన్నారు. -
ఎయిర్ ఏషియా ప్రమాదం: 40 మృతదేహాలు లభ్యం
జకార్తా : సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం ప్రమాదం ఘటనలో మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు చర్యలను వేగవంతం చేశారు. విమానం కూలిపోయినట్టుగా ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన ప్రాంతంలో తొలుత శకాలలను గుర్తించారు. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతుండటంతో వాటిని వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. -
ఎయిర్ ఏషియా ప్రమాదం: మృతదేహాలు లభ్యం
ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన కొద్దిసేపటికే.. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా.. కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. -
జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం !
-
మా విమానాలు ఎప్పటికీ కూలిపోవు!
న్యూఢిల్లీ: మార్చి 8, 2014..239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేషియన్ ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యమైంది. ఆ విమానం అదృశ్యం అయిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకూ తెలియకపోయినా.. ఆ మరుసటి నెల ఏప్రిల్ లో ఏయిర్ ఏషియా చేసిన ప్రకటన ఇప్పడు సర్వత్వా చర్చనీయాంశమైంది. తమ విమానాలు ఎప్పుడూ తప్పిపోవని ఏయిర్ ఏషియా గర్వంగా చెప్పుకుంది. తమ పైలెట్ ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకువస్తాడని.. తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం లేదనేది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చేసి ఈ డిసెంబర్ కు సరిగ్గా ఎనిమిది నెలలు. అయితే ఇప్పుడు అదే సంస్థకు చెందిన విమానం అదృశ్యం అయిన ఘటన విషాదం నింపింది. ఆదివారం మలేసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి నిన్న ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్(ఏ320-200) విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు వరకూ ఇండోనేషియా దేశస్థులు ఉన్నారు. ఇప్పటికే మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొని ఆ విమానం ఆచూకీ కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. -
జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం !
రెండు రోజుల క్రితం తప్పిపోయిన ఎయిర్ ఏషియా విమానం శకలాలు జావా సముద్రంలో కనిపించాయి. బోర్నియో ద్వీపం వద్ద విమనం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు కనిపించినట్లు ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 162 మందితో వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం తలుపు ఒకటి కనిపించినట్లు ఇండోనేషియా టీవీ చానళ్లు తొలుత చెప్పాయి. మెట్రో టీవీ, కొంపాస్ టీవీలు తాము చూసినట్లు చెబుతున్న ఎమర్జెన్సీ స్లైడ్ ఫొటోలను ప్రసారం చేశాయి. ఈ తలుపు, స్లైడ్ సముద్రపు నీటిలో తేలియాడుతున్నాయి. అచ్చం ఎమర్జెన్సీ స్లైడ్, విమానం తలుపులాగే కనపడుతున్న వస్తువులు గాలింపు సందర్భంగా కనిపించినట్లు ఇండోనేషియా వైమానిక దళాధికారి ఆగస్ డ్వి పుట్రాంటో తెలిపారు. తర్వాత ఈ విషయాన్ని ఇండోనేసియా సర్కారు కూడా నిర్ధారించింది. మొత్తం పది పెద్ద వస్తువులు తమకు కనిపించాయని, వాటితో పాటే చాలా చిన్న వస్తువులు కూడా ఉన్నాయని, కొన్ని తెల్లటి వస్తువులున్నా, వాటిని ఫొటోలు తీయలేకపోయామని పుట్రాంటో అన్నారు. విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ వస్తువులు కనిపించడం గమనార్హం. -
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు
హైదరాబాద్: అందేంటోగాని ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు నీడలా వెంటాడుతున్నాయి .... ఓ విమానం అదృశ్యమైంది... దాని జాడ ఇప్పటికి తెలియలేదు. మరో విమానాన్ని వేర్పాటు వాదులు క్షిపణులతో కూల్చివేశారు. మరో విమానం అదృశ్యం. అలాగే మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 గగనతలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండొనేసియా మీడియా ప్రకటించింది. ఈ అదృశ్యమైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలపి 162 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది వరుసగా ... *మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ తెలియలేదు. * జూలై 17న ఎమ్ హెచ్ 17 విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు బయలుదేరింది. ఈ విమానం ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల శక్తిమంతమైన క్షిపణితో దాడి చేశారు. దాంతో విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 298 మంది మరణించారు. * జూలై 23న ట్రాన్స్‌ఏసియా ఎయిర్వేస్ విమానం తైవాన్‌లో కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు. * ఆగస్టు 10న టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. * ఆగస్టు 25న ఎండీ -83 బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు విమానం బయలుదేరింది. విమానం బయలుదేరిన 50 నిమిషాల అనంతరం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందారు. -
ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్లు...
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా బిగ్సేల్ ఆఫర్లో భాగంగా సంస్థ అనుబంధ సంస్థలు, ఎయిర్ఏషియా బెర్హాద్, థాయ్ ఎయిర్ఏషియా, ఎయిర్ఏషియా ఇండియాలు డిస్కౌంట్లను ప్రకటించాయి. ఎయిర్ఏషియా బెర్హాద్ నిర్వహించే హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ సర్వీసుకు రూ.2,599కే విమాన టికెట్లను పొందవచ్చని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య చెప్పారు. అలాగే చెన్నై, కోచి, కోల్‌కత, బెంగళూరు, తిరుచిరాపల్లి, తదితర నగరాల నుంచి కౌలాలంపూర్ సర్వీసులకు కూడా ఇదే ధరకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామ న్నారు. బుకింగ్స్ ఆదివారం రాత్రి నుంచే ప్రారంభమయ్యాయయని, ఈ నెల 16 వరకూ తమ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. -
2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్!
విమానాలనే కాదు, విమాన టికెట్ల ధరలను కూడా ఆకాశం నుంచి భూమ్మీదకు దించిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా. త్వరలోనే ఈ సంస్థ హైదరాబాద్ నుంచి కూడా తన సేవలను ప్రారంభించబోతోంది. వారంలో అన్ని రోజులూ హైదరాబాద్ నుంచి మలేషియాకు విమానాలు నడిపించనుంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎయిర్ ఏషియా మలేషియా సేవలు ప్రారంభం అవుతాయని ఆ సంస్థ గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీని ప్రారంభ ఆఫర్లో.. మొత్తం అన్ని పన్నులు కలుపుకొని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు కేవలం రూ. 2099కే టికెట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 5వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 8వ తేదీ నుంచి 2015 అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ప్రస్తుతానికి కేవలం బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కోల్‌కతా, తిరుచిరాపల్లి నగరాల నుంచి మాత్రమే ఎయిర్ ఏషియా విమానాలు నడుస్తున్నాయి. -
మరెన్నో టేకాఫ్‌లకు చాన్స్..
బెంగళూరు: జనాభాతోపాటు, టూరిజం పరిశ్రమను పరిగణనలోకి తీసుకుంటే దేశీ విమానయాన రంగంలో భారీ అవకాశాలున్నాయని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. టూరిజంకున్న అవకాశాలతో పోలిస్తే ఈ రంగం చాలా వెనకబడి ఉన్నదని చెప్పారు. వెరసి నాలుగో బడ్జెట్ విమానయాన సంస్థకు సైతం గరిష్ట స్థాయిలో అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఇందుకు పోటీదారులు సంస్థలెన్ని ఉన్నాయన్న లెక్కలుమాని, చౌక ధరల్లో సర్వీసులను అందించాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. గత నెల 12న తొలిసారి బెంగళూరు నుంచి గోవాకు విమాన సర్వీసును నిర్వహించడం ద్వారా ఎయిర్ ఏషియా దేశీయ కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా గురువారమిక్కడ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో కంపెనీ సీఈవో టోనీతోపాటు సంస్థ ముఖ్య సలహాదారు రతన్ టాటా, చైర్మన్ ఎస్.రామదొరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో టోనీ మాట్లాడుతూ దేశీ విమానయాన రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యధికులకు చాన్స్... పోటీ సంస్థలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా అందుబాటు ధరల్లో సర్వీసులను నిర్వహించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ సూచించారు. తద్వారా అత్యధిక శాతం ప్రజలకు విమానయానాన్ని చేరువ చేయవచ్చునని తెలిపారు. చౌక ధరల సర్వీసులతో వ్యాపారాలు తదితర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించే వారి సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించాలని సలహా ఇచ్చారు. ఇదే విధంగా స్వదేశీ సందర్శనకు వచ్చే విదేశీయులకు అవకాశాలు పెంచాలని చెప్పారు. టికెట్ ధరలను సాధ్యమైనంతమేర తగ్గించడం ద్వారా వృద్ధి అవకాశాలను అందుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వ్యయాలతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా, ఈ నెల 20 నుంచి ఎయిర్ ఏషియా కొచ్చికి సైతం విమాన సర్వీసులను నిర్వహించనుంది. ఏడాది కాలంలో బ్రేక్ఈవెన్ సాధిస్తాం ఏడాది కాలంలో ఎయిర్ ఏషియా లాభనష్టాలులేని స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుకుంటుందని టోనీ అంచనా వేశారు. ఇందుకు మరిన్ని ప్రణాళికలను అమలు చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఆరు విమానాలతో సర్వీసులను విస్తరించనున్నట్లు తెలిపారు. -
ఎయిర్ ఏషియా ఎగిరింది..
విమానయాన సేవలు షురూ.. తొలి ఫ్లయిట్ బెంగళూరు నుంచి టేకాఫ్ బెంగళూరు: దేశంలో ఎయిర్ ఏషియా విమాన సేవలు గురువారం మొదలయ్యాయి. తొలి విమాన సర్వీసును బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి గోవాకు నడిపారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియాలోనే అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా భారతీయ విభాగమే ఎయిర్ ఏషియా ఇండియా. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ రంగంలోకి ఎయిర్ ఏషియా ప్రవేశంతో ధరల పోరు తీవ్రతరం కానుంది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ తర్వాత దేశంలో చౌకగా విమాన సేవలందించే కంపెనీగా ఎయిర్ ఏషియా ఆవిర్భవించింది. ప్రారంభ ఆఫరుగా బెంగళూరు - గోవా టికెట్‌ను రూ.990గా ప్రకటించారు. అందుబాటు ధరలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం, విమానంలో ప్రయాణించే అవకాశాన్ని భారతీయులందరికీ కల్పించడమే తమ లక్ష్యమని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య మీడియాకు తెలిపారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే తమ చార్జీలు 35 శాతం తక్కువగా ఉంటాయని చెప్పారు. స్థిరమైన కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామనేది తమ విశ్వాసమనీ, అందుకే చార్జీలను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.డీజీసీఏ గణాంకాల ప్రకారం.. స్థానిక మార్కెట్లో 31.6% వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జెట్‌ఎయిర్‌వేస్-జెట్‌లైట్ 21.8%, ఎయిర్ఇండియా 18.3%, స్పైస్‌జెట్ 17.9%, గోఎయిర్ 9.5% మార్కెట్ వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎయిర్ ఏషియాపై స్వార్థశక్తుల పన్నాగం: టాటాసన్స్ న్యూఢిల్లీ: చౌక ధరలకే విమాన సేవలను అందించే ఎయిర్ ఏషియా కార్యకలాపాలను అడ్డుకోవడానికి కొన్ని స్వార్థశక్తులు యత్నిస్తున్నాయని ఈ సంస్థ వాటాదారు టాటా సన్స్ ఆరోపించింది. దేశంలో ఎయిర్ ఏషియా సర్వీసులు గురువారం ప్రారంభమైన కొద్దిసేపటికే టాటా సన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి ఎయిర్ ఏషియాపై చేసిన ఆరోపణలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. విమాన ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన పోటీని వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ఎయిర్ ఏషియా కార్యకలాపాలకు భంగం కలిగేలా దుష్ర్పచారం సాగిస్తున్నాయి’ అని టాటా సన్స్ ఘాటుగా విమర్శించింది. భారత్‌లో విమాన సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి, డీజీసీఏ నుంచి అన్ని అనుమతులూ పొందామని ఉద్ఘాటించింది. స్వామి తో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ కార్యకలాపాల నిలిపివేతకు ఇంజంక్షన్ ఉత్తర్వులేమీ రాలేదని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందనీ, న్యాయస్థానం ఆదేశాలను తాము, ఎయిర్ ఏషియా ఇండియా గౌరవిస్తామనీ టాటా సన్స్ తెలిపింది. కాగా, ఎయిర్ ఏషియా వ్యవహారం కోర్టులో ఉందనీ, కనుక ఆ సంస్థకు అనుమతి మంజూరు చేయవద్దంటూ ఎన్నికల సంఘం, డీజీసీఏకు, పౌర విమానయాన శాఖకు డాక్టర్ స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. -
ఆనందం ఆకాశమంత!
విశాఖకు తరలివస్తున్న విమాన సర్వీసులు రేపటి నుంచి ఎయిర్కోస్టా విమానం త్వరలో విశాఖ-కోలాలంపూర్ సర్వీసు 1న ఎయిరేషియా ప్రతినిధుల రాక విమానయాన రంగానికి సంబంధించి విశాఖ ప్రగతి ఇప్పుడు ఆకాశమే హద్దులుగా సాగుతోంది. అంబర వీధిలో పరుగులు తీస్తోంది. ఒక్కొక్కటిగా విమాన సర్వీసులుపెరుగుతూ ఉండడంతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు మరిన్ని ప్రారంభమవుతున్న తరుణంలో విశాఖ విమానాశ్రయానికి మరిన్ని మంచి రోజులు ఖాయంగా వస్తాయనిపిస్తోంది. విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయం కొత్త విమానాల రాకపోకలతో కళకళలాడబోతోంది. అహర్నిశలూ విమానాల రాకపోకలకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో.. నగరానికి మరిన్ని సర్వీసులు నడపడానికి విమాన సంస్థలు ఉత్సాహం చూపుతూ ఉండడం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎయిర్ ఏషియా విమానం విశాఖలో వాలడానికి రంగం సిద్ధమవుతోంది. నగరానికి ఉగాది కానుకగా మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. విస్తృత సర్వీసులపై దృష్టి విశాఖనుంచి విదేశీ సర్వీసులు నడపడానికి ఎయిర్ ఏషియా సంస్థ ఆసక్తి చూపుతోంది. విశాఖకు వచ్చివెళ్లే దేశవిదేశీ ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, పారిశ్రామిక వేత్తలను కలిసి డిమాండ్‌పై ఆరా తీయడానికి ఏప్రిల్ 1న ఆసంస్థ ప్రతినిధులు రానున్నారని భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. విశాఖ,కోలాలంపూర్ మధ్య నిత్యం విమానాలు నడిపడానికి ఆసంస్ధ యోచిస్తోందని చెప్పారు. విశాఖ నుంచి కోల్‌కతకు, విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు సర్వీసుల నిర్వహణపై అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. 30 నుంచి ఇంకా తాకిడి ఈనెల 30 నుంచి విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఇంకా పెరగనుంది. బ్రెజిల్ ఎంబ్రియార్ సంస్థకు చెందిన ఎయిర్ కోస్టా విమానం విశాఖకు రానుంది. ఈ విమానం హైదరాబాదులో ఉదయం ఏడుకు బయలు దేరి విశాఖకు ఉదయం 8.20కి చేరుతుంది. మరో అరగంటకు బెంగళూరు బయలు దేరుతుంది. బెంగళూరు నుంచి రాత్రి 8.20కి విశాఖ చేరుతుంది. 8.50కి బయ లు దేరి హైదరాబాదు వెళ్తుంది. అదే రోజు బెంగళూరు- విశాఖ- భువనేశ్వర్ మధ్య ఇండి గో విమానం నడవనుంది. మధ్యాహ్నం 12.30 కి బెంగళూరులో బయల్దేరి 01.40కి విశాఖ వస్తుంది. 02.10కి బయల్దేరి భువనేశ్వర్‌కు 03.00 గంటలకు చేరుతుంది. అక్కడ 03.30కి బయలు దేరి సాయంత్రం 04.10కి విశాఖ వస్తుంది. ఇక్కడి నుంచి 04.30కి బయలు దేరి బెంగళూరుకి 05.50కి చేరుతుంది. -
మళ్ళీ ఎయిర్‌బస్ బస
-
మళ్ళీ ఎయిర్‌బస్ బస
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాలరు బలపడటం, ఆర్థిక మందగమనం వంటివి కొత్త విమానాల ఆర్డర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదని విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రకటించింది. దేశీయ విమానరంగం వేగంగా విస్తరిస్తుండటంతో విమానాలకు డిమాండ్ బాగుందని ఎయిర్‌బస్ మార్కెటింగ్ హెడ్ (ఆసియా) జూస్ట్ వాన్ డెర్ హెయిజ్‌డెన్ తెలిపారు. ఇండియా ఏవియేషన్ 2014 ప్రదర్శన సందర్భంగా కలసిన విలేకరులతో జూస్ట్ మాట్లాడుతూ ఇండియా నుంచి ఇప్పటి వరకు మొత్తం 600 విమానాలకు ఆర్డర్లు రాగా అందులో 234 డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇండిగో అత్యధికంగా 280 విమానాలకు, గోఎయిర్, ఎయిర్ ఇండియా 90కిపైగా ఆర్డర్లు ఇచ్చినట్లు జూస్ట్ వివరించారు. ఇండియాలో ఏ-330, ఎ-320 రకం విమానాలకు డిమాండ్ అధికంగా ఉందని, ఇక్కడ ఎగురుతున్న విమానాల్లో సగం ఎయిర్‌బస్‌వేనని పేర్కొన్నారు. ఇరవైలో ఒక్కరే ఎగురుతున్నారు 120 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇండియాలో విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని జూస్ట్ తెలిపారు. చైనాలో ప్రతి నలుగురిలో ఒకరు విమానంలో ప్రయాణిస్తుంటే ఇక్కడ ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో మధ్యతరగతి ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతుండటమే కాకుండా తలసరి ఆదాయం, జీడీపీ వృద్ధి చెందుతుండటంతో విమానయాన రంగానికి మంచి అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. భారీ విహంగానికి టైమ్ పడుతుంది దేశంలో అతిపెద్ద విమానంగా పేరొందిన ఏ-380కి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నట్లు జూస్ట్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 సంస్థల నుంచి 324 విమానాలకు ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఏ-380కి సంబంధించి ఇండియా నుంచి ఇంత వరకు ఒక్క ఆర్డరు కూడా రాలేదని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఏవియేషన్ షోకు ఎయిర్‌బస్ ఏ380 ప్రపంచంలోనే అతిపెద్దది; సీట్లు 517 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అతిపెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380-800 హైదరాబాద్ వచ్చింది. విమాన సేవల సంస్థ ఎమిరేట్స్ ఈ లోహ విహంగాన్ని ఏవియేషన్ షో కోసం బుధవారం తీసుకొచ్చింది. ప్రయాణికుల విమానాల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది. రెండంతస్తులుగా సీటింగ్ ఉంటుంది. బేస్ ఫ్లోర్లో 427 (ఎకానమీ క్లాస్) సీట్లున్నాయి. పై అంతస్తులో బిజినెస్ క్లాస్ 76, ఫస్ట్ క్లాస్‌లో (సూట్స్) 14 సీట్లు ఉన్నాయి. దీని ఖరీదు మన కరెన్సీలో రూ.2,500 కోట్లపైనే. ఎక్కడా ఆగకుండా 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సూట్ ప్రత్యేకతే వేరు.. పై అంతస్తులో 14 ఫస్ట్ క్లాస్ సీట్లున్నాయి. ఏకాంతం కోసం స్లైడింగ్ డోర్ ఉంది. ప్రతీ సీటుకు మినీ బార్, అడ్జస్టబుల్ లైటింగ్, పెద్ద టీవీ ఉంది. 1,600 చానెళ్లను వీక్షించవచ్చు. పడుకోవాలంటే సీటు కాస్తా బెడ్‌గా మారిపోతుంది. సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ నొక్కితే చాలు. ఇందుకోసం టచ్ స్క్రీన్ కంట్రోలర్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడుకునే శాటిలైట్ ఫోన్ ఉంది. ముందున్న టచ్ స్క్రీన్‌లో ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. ప్రయాణికులు తమ సొంత ఫోన్లను కూడా వినియోగించవచ్చు. విమానం మొత్తం వైఫై కనెక్ట్ అయి ఉంది. పానీయాల కోసం ప్రత్యేకంగా బార్ ఉంది. సమావేశాల కోసం రెండు లాంజెస్ ఉన్నాయి. 125 విమానాలు.. ప్రస్తుతం ఏ380 మోడల్‌కు చెందిన 125 విమానాలు వివిధ దేశాల్లో సేవలందిస్తున్నాయి. మరో 324 విమానాలకు ఆర్డరు ఉందని ఎయిర్‌బస్ మార్కెటింగ్ మేనేజర్ క్లాడీ డెబ్యూక్వెన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్‌లో హైదరాబాద్‌లోని శంషాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలు మాత్రమే ఏ380 దిగేందుకు అనువైనవి. బ్యాంకాక్ నుంచి దుబాయి వెళ్తున్న ఎమిరేట్స్ ఏ380 విమానం 2011 అక్టోబరు 23న శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. 2008లో హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌షోలో ఇక్కడి వారిని తొలిసారిగా కనువిందు చేసింది. -
ఎయిర్ ఏషియా 50 లక్షల ఉచిత సీట్లు
ముంబై: మలేసియాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా 50 లక్షల ఉచిత సీట్లను(హోటల్ ప్యాకేజీతో కలుపుకుని) ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు కౌలాలంపూర్ నుంచి ఎంపిక చేసిన రూట్లలో 18 లక్షల ప్రమోషనల్ సీట్లను చౌక ధరల్లో ఆఫర్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని, మార్చి 2 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ చేసే ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. కోచి, కోల్‌కతా, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరుల నుంచి కౌలాలంపూర్‌కు చార్జీరూ.6,999గా ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. ఇక చెన్నై-బ్యాంకాక్ సెక్టర్ చార్జీలు రూ.7,999 అని వివరించింది. ఉచిత సీట్ల ఆఫర్ కింద చౌక ధరలకే విమాన ప్రయాణాన్ని చేసే అవకాశం అందిస్తున్నామని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, సీగ్ట్రాండ్ టెహ్ పేర్కొన్నారు. తమ వెబ్సైట్, లేదా ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ జెడ్ 10, విండోస్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్ఏషియా మొబైల్ యాప్‌లతో టికెట్లను బుక్ చేయవచ్చని వివరించింది. కాగా ఈ సంస్థ దేశీయ కార్యకలాపాల కోసం దరఖాస్తు చేయడం తెలిసిందే. -
ఎయిర్కోస్టా విమాన సేవలు షురూ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో / గన్నవరం, న్యూస్‌లైన్: రాష్ట్రానికి చెందిన తొలి విమానయాన సంస్థ ఎయిర్కోస్టా సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో విజయవాడకు బయలుదేరిన విమానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన కంపెనీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రంగం మరింత వృద్ధి చెందేలాగా త్వరలోనే పౌర విమానయాన విధానాన్ని ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలంతో పాటు స్వీకర్ నాదెండ్ల మనోహర్, ఎయిర్ కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నుంచి సర్వీసులు ప్రారంభం: ఎయిర్కోస్టా తొలి విమానం మంగళవారం విజయవాడ నుంచి 56 మంది ప్రయాణికులను తీసుకుని బెంగళూర్‌కు బయలుదేరి వెళ్లింది. తొలి ప్రయాణ టికెట్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టు డెరైక్టర్ బీజీ పాటిల్ జ్యోతి ప్రయాణికులకు అందజేశారు. మరో 3 నెలల్లో ఈ సంస్ధ ఇక్కడి నుంచి చెన్నై, గోవా, త్రివేండ్రం, వైజాగ్‌కు విమానాలను నడపనున్నట్లు తెలిపారు. ఎయిర్కోస్టా మేనేజర్ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతిరోజూ ఈ సర్వీస్ గన్నవరం నుంచి ఉదయం 6.45కు బయలుదేరి 7.45కు బెంగళూర్‌కు చేరుకుంటుందని, అక్కడి నుంచి 10.30కు జైపూర్ వెళ్తుందన్నారు. తిరిగి ఈ సర్వీసు బెంగళూర్‌లో సాయంత్రం 4.40కు బయలుదేరి 5.40కు ఇక్కడికి చేరుకుంటుందని చెప్పారు. -
ఎయిర్ఏషియా ఇండియా టేకాఫ్‌కు లైన్‌క్లియర్
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు కీలకమైన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ లభించినట్లు ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. పౌర విమానయాన శాఖ దీన్ని గత వారమే ఇచ్చిందని, ప్రస్తుతం లాంఛనంగా ఇది వెల్లడిస్తున్నామని కంపెనీ మాతృ సంస్థ ఎయిర్ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. ఎన్వోసీ చేతికి రావడంతో, సర్వీసులు వేగవంతంగా ప్రారంభించే దిశగా.. షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (ఫ్లయింగ్ పర్మిట్) పొందేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఎయిర్ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య పేర్కొన్నారు. భారత్‌లో విమానయానాన్ని మరింత అందుబాటు స్థాయిలోకి తెచ్చి, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలమన్నారు. మలేషియన్ సంస్థ ఎయిర్ఏషియా, టాటా గ్రూప్, టెలిస్ట్రా కలిసి ఎయిర్ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ముందుగా చెన్నై, బెంగళూరు, తిరుచిరాపల్లి, కొచ్చి, కోల్‌కతా వంటి నగరాలకు ఎయిర్ఏషియా ఇం డియా సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది. -
టాటా ఎయిర్‌లైన్స్ టేకాఫ్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దేశీ విమానయాన రంగంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎయిర్‌ఏషియాతో కలిసి చౌక విమాన సేవలు అందించడంపై దృష్టి పెట్టిన టాటా గ్రూప్ .. తాజాగా ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ముచ్చటగా మూడోసారి జతకట్టింది. గురువారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే కొత్త కంపెనీకి అనుమతుల కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ముందుగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడితో కొత్త ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతులన్నీ లభిస్తే వచ్చే ఏడాది కార్యకలాపాలు మొదలుకావొచ్చని వివరించాయి. దేశీయంగా పౌరవిమానయాన రంగంలో టాటా సన్స్‌కి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1932లోనే జేఆర్డీ టాటా ..టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత 1946లో ఎయిరిండియాగా మారింది. దీన్ని 1953లో జాతీయం చేశారు. టాటా గ్రూప్‌కి 5% వాటాలు..: కొత్త ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌కి 51%, సింగపూర్ ఎయిర్‌లై న్స్‌కి 49% వాటాలు ఉంటాయి. బోర్డులో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఇద్దరిని టాటా సన్స్, ఒకరిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ నామినేట్ చేస్తాయి. టాటా క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ చైర్మన్ ప్రసాద్ మీనన్.. దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తరఫు నుంచి మాక్ స్వీ వా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్)గా ఉంటారు. టాటా గ్రూప్ ఇప్పటికే చౌక విమానయాన సర్వీసులు అందించేందుకు మలేసియాకి చెందిన ఎయిర్‌ఏషియాతో జట్టు కట్టింది. అయితే, ప్రతిపాదిత ఎయిర్ఏషియా వెంచర్లో టాటా సన్స్‌కి 30% వాటాలు ఉన్నా నిర్వాహక పాత్ర లేదు. కానీ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో వెంచర్లో మాత్రం అదే సారథ్య బాధ్యతలు చేపట్టనుంది. నియంత్రణపరమైన ప్రశ్నలు .. టాటా గ్రూప్ ఇలా ఒకే రంగంలో రెండు వేర్వేరు వెంచర్లు ఏర్పాటు చేస్తుండటం తాజా డీల్‌కి ఆటంకాలేమైనా తెచ్చిపెట్టవచ్చని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్నర్ అంబర్ దూబే తెలిపారు. మరోవైపు, ఈ విషయంలో ఏవియేషన్ నిబంధనలపరంగా అడ్డంకులేమీ లేవని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. అయితే సెబీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చని, అవే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక, భారత్‌లో పౌర విమానయాన రంగం నిలకడగా వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని టాటా సన్స్ అంచనా వేసినట్లు ప్రసాద్ మీనన్ తెలిపారు. భారత్ మార్కెట్లో విస్తరించేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈవో గోహ్ చూన్ ఫోంగ్ తెలిపారు. 18 ఏళ్లలో ముచ్చటగా మూడోసారి.. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయత్నించడం ఇది మూడోసారి. 1995లో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ కోసం ఎఫ్ఐపీబీకి ఇవి తొలిసారిగా దరఖాస్తు చేసుకున్నాయి. ఏడాది తర్వాత అనుమతులు లభించాయి. అయితే, దేశీ ఎయిర్‌లైన్స్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు తీసుకోకూడదంటూ 1997లో విధానాలను మార్చేయడంతో ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. ఒక కేంద్ర మంత్రికి లంచమివ్వడానికి నిరాకరించినందునే ఇలా జరిగిందంటూ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానిం చారు కూడా. ఇక 2000లో టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరోసారి దేశీ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశాయి.