విమానాల్లో చెకిన్ బ్యాగేజీకీ చార్జీల బాదుడు | Stroke on charges | Sakshi
Sakshi News home page

విమానాల్లో చెకిన్ బ్యాగేజీకీ చార్జీల బాదుడు

Published Fri, Jun 26 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

విమానాల్లో చెకిన్ బ్యాగేజీకీ చార్జీల బాదుడు

విమానాల్లో చెకిన్ బ్యాగేజీకీ చార్జీల బాదుడు

న్యూఢిల్లీ : దేశీ విమానయాన సంస్థలు ఇకపై చెకిన్ బ్యాగేజీపైనా చార్జీలు విధించేందుకు అనుమతించడాన్ని పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్‌ఏషియా సంస్థలు ఈ మేరకు ‘జీరో బ్యాగేజ్ ఫేర్’ ప్రతిపాదనను డీజీసీఏకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులోని అంశాలపై మరింత స్పష్టతనివ్వాలంటూ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ సూచించినట్లు అధికారులు వివరించారు.

ప్రతిపాదన ప్రకారం అసలు బ్యాగేజీ లేని ప్రయాణికులకు టిక్కెట్ రేటులో డిస్కౌంటు లభించనుంది. ప్రస్తుతం 15 కేజీల దాకా బరువుండే బ్యాగేజీని ప్రయాణికులు విమానాల్లో తమ వెంట ఉచితంగానే తీసుకెళ్లవచ్చు. అయితే, కొత్త ప్రతిపాదన గానీ అమల్లోకి వస్తే ప్రతి కేజీకి ఇంత చొప్పున కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే, టికెట్ నుంచి ఇతరత్రా సర్వీసులను విడగొట్టి (ప్రయాణికులు లాంజ్‌ను ఉపయోగించుకోవడం, నచ్చిన సీటు ఎంపిక చేసుకోవడం మొదలైనవి) ఎయిర్‌లైన్స్ చౌకగా విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి.

 మరోవైపు, రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో దేశీ విమానయాన కంపెనీలు గడిచిన అయిదేళ్లుగా వసూలు చేస్తున్న టికెట్ చార్జీల తీరుతెన్నులను పరిశీలించాలంటూ డీజీసీఏని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. రద్దీ సీజన్‌లో విమానయాన సంస్థలు టికెట్ చార్జీలను భారీగా పెంచేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చార్జీలపై గరిష్ట పరిమితులు విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement