Desi Airlines Agencies
-
పెద్ద విమానాలు సమకూర్చుకోవాలి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
విమానాల్లో చెకిన్ బ్యాగేజీకీ చార్జీల బాదుడు
న్యూఢిల్లీ : దేశీ విమానయాన సంస్థలు ఇకపై చెకిన్ బ్యాగేజీపైనా చార్జీలు విధించేందుకు అనుమతించడాన్ని పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ఏషియా సంస్థలు ఈ మేరకు ‘జీరో బ్యాగేజ్ ఫేర్’ ప్రతిపాదనను డీజీసీఏకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులోని అంశాలపై మరింత స్పష్టతనివ్వాలంటూ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ సూచించినట్లు అధికారులు వివరించారు. ప్రతిపాదన ప్రకారం అసలు బ్యాగేజీ లేని ప్రయాణికులకు టిక్కెట్ రేటులో డిస్కౌంటు లభించనుంది. ప్రస్తుతం 15 కేజీల దాకా బరువుండే బ్యాగేజీని ప్రయాణికులు విమానాల్లో తమ వెంట ఉచితంగానే తీసుకెళ్లవచ్చు. అయితే, కొత్త ప్రతిపాదన గానీ అమల్లోకి వస్తే ప్రతి కేజీకి ఇంత చొప్పున కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే, టికెట్ నుంచి ఇతరత్రా సర్వీసులను విడగొట్టి (ప్రయాణికులు లాంజ్‌ను ఉపయోగించుకోవడం, నచ్చిన సీటు ఎంపిక చేసుకోవడం మొదలైనవి) ఎయిర్‌లైన్స్ చౌకగా విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు, రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో దేశీ విమానయాన కంపెనీలు గడిచిన అయిదేళ్లుగా వసూలు చేస్తున్న టికెట్ చార్జీల తీరుతెన్నులను పరిశీలించాలంటూ డీజీసీఏని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. రద్దీ సీజన్లో విమానయాన సంస్థలు టికెట్ చార్జీలను భారీగా పెంచేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చార్జీలపై గరిష్ట పరిమితులు విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.