కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు
విజయనగరం జిల్లా: ఎయిర్ ఏషియా స్కాంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు స్పందించారు. విజయనగరంలో జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ..ఎయిర్ ఏషియా సీఈఓల మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు. అది ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సంభాషణ అని చెప్పారు. ఈ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. నేటి నాయకులు ఎన్‌టీ రామారావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
రాజకీయాల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత అవగాహన, నిబద్ధత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిసార్టుల్లో దీక్ష చేస్తే ఎవరికి ప్రయోజనమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఏడాదిలోగా ఎన్నికలు వస్తుండగా ఇప్పుడు ఈ రాజీనామాల డ్రామా ఎందుకని అన్నారు. రాజీనామాలు ఆమోదించుకోవడంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలకు చిత్తుశుద్ధి లేదని విమర్శించారు.
అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కి, విమానయాన శాఖ ఉద్యోగులకు లంచాలు ఎర వేసి సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెల్సిందే. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment