న్యూఢిల్లీ: ఆర్థిక భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, ఎయిరిండియా ఉద్యోగులు బరిలోకి దిగారు. బిడ్డింగ్‌కు ఆఖరు తేదీ అయిన సోమవారం నాడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) సమర్పించారు. దశాబ్దాల క్రితం తాము వదులుకోవాల్సిన వచ్చిన ఎయిరిండియాను దక్కించుకోవాలని భావిస్తున్న టాటా గ్రూప్.. తమకు మెజారిటీ వాటాలు ఉన్న మరో విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా ద్వారా ఈవోఐ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, టాటా గ్రూప్ స్వంతంగా బిడ్ చేసిందా లేక కన్సార్షియం తరఫున చేసిందా అన్నది వెల్లడి కాలేదు. దీనిపై స్పందించడానికి టాటా గ్రూప్ నిరాకరించింది.
మరోవైపు, ఎయిరిండియాకు చెందిన సుమారు 219 మంది ఉద్యోగుల బృందం.. అమెరికాకు చెందిన ఇంటరప్స్ అనే ఫండ్‌తో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఈవోఐ దాఖలు చేసింది. ఉద్యోగులు తలో రూ. 1 లక్ష వేసుకుని కన్సార్షియంలో 51 శాతం వాటా తీసుకోగా, మిగతా 49 శాతం వాటా ఇంటరప్స్‌కి ఉంది. అర్హత పొందిన బిడ్డర్లకు జనవరి 6 లోగా సమాచారం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయా సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఎయిరిండియాలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పలు ఈవోఐలు దాఖలయ్యాయి. ఇక రెండో దశ మొదలవుతుంది’’ అని పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే, ఎన్ని బిడ్లు వచ్చాయి, ఏయే సంస్థలు దాఖలు చేశాయన్నది మాత్రం వెల్లడించలేదు.
ఎయిర్‌ఏషియా ద్వారా ఎందుకంటే...
టాటా గ్రూప్ ప్రస్తుతం రెండు విదేశీ సంస్థలతో కలిసి రెండు విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్‌ఏషియా ఇండియాను నడుపుతోంది. తమ ఆర్థిక సమస్యల కారణంగా మరిన్ని నిధులు పెట్టలేమంటూ ఎయిర్‌ఏషియా చేతులెత్తేయడంతో ఎయిర్‌ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ ఇటీవలే తన వాటాలను 51 శాతానికి పెంచుకుంది. ఇక కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో భారీగా నష్టపోయిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ .. సొంత కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రస్తుతం నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తామే సంక్షోభ పరిస్థితుల్లో ఉండగా.. మరింత సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాపై ఇన్వెస్ట్ చేసేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిర్‌ఏషియా ఇండియా ద్వారా టాటా గ్రూప్ ఈవోఐ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఎయిరిండియా విక్రయానికి మూడేళ్లుగా యత్నాలు..
2007లో దేశీయంగా సేవలు అందించే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అయినప్పట్నుంచీ ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. తీవ్ర ఆర్థిక భారంతో కుంగుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు 2017 నుంచి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడటం లేదు. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణభారం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇప్పటిదాకా నిర్వహించిన బిడ్డింగ్ ప్రతిపాదనల ప్రకారం చూస్తే .. ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంస్థ దాదాపు రూ. 23,286 కోట్ల రుణభారాన్నీ తీసుకోవాల్సి వచ్చేది. మిగతాదాన్ని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ (ఏఐఏహెచ్‌ఎల్) అనే స్పెషల్ పర్పస్ సంస్థకు బదలాయించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. అయితే, కొనుగోలుదారులెవరూ దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటాలు, ఎయిరిండియా ఎస్‌ఏటీఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌లో 50% వాటా విక్రయ ప్రతిపాదనతో బిడ్‌లు ఆహ్వానించింది.
టాటా ఎయిర్‌లైన్స్ నుంచి ఎయిరిండియాగా..
టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక దిగ్గజం జేఆర్‌డీ టాటా దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో దీని పేరు ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం ఈ సంస్థను జాతీయం చేయడంతో టాటా గ్రూప్ చేజారింది. అయితే, 1977 దాకా జేఆర్‌డీ టాటానే చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత టాటా సన్స్ పలుమార్లు విమానయాన సంస్థను ప్రారంభించేందుకు ప్రయత్నించింది. 1995లో సాధ్యపడలేదు. అటుపైన 2001లో ఎయిరిండియా కోసం బిడ్ చేసినా .. ప్రభుత్వం విక్రయించకూడదని నిర్ణయించుకోవడంతో కుదరలేదు. ఈ పరిణామాలతో 2013లో టాటా గ్రూప్ విదేశీ సంస్థలతో కలిసి విస్తార, ఎయిర్‌ఏషియా ఇండియా ఏర్పాటు చేసింది. తాజాగా తాము ఆరంభించిన కంపెనీని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment