ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌ | Tata group submits EOI to acquire Air India | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా రేసులో ఉద్యోగులూ- టాటాలు

Published Mon, Dec 14 2020 1:42 PM | Last Updated on Mon, Dec 14 2020 7:47 PM

Tata group submits EOI to acquire Air India  - Sakshi

ముంబై, సాక్షి: విమానయాన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎయిర్‌ ఇండియా కొనుగోలు రేసులో ఎట్టకేలకు టాటా గ్రూప్‌ బరిలో నిలిచింది. మరోపక్క ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు సైతం కంపెనీ కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం. భారీ రుణ భారంతో కుదేలైన ఎయిర్‌ ఇండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలలుగా సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) బిడ్స్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు నేటి(14)తో ముగియనుంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ ఈవోఐను దాఖలు చేసింది. మరోవైపు ఒక ఆర్ధిక సంస్థ సహకారంతో 209 మంది ఉద్యోగులు సైతం కన్సార్షియంగా ఏర్పడి ఈవోను దాఖలు చేశారు. వివరాలు చూద్దాం..

టాటా గ్రూప్‌
ఎయిర్‌ ఇండియా వాటా కొనుగోలుకి టాటా గ్రూప్‌ డిజిన్వెస్ట్‌మెంట్ శాఖకు ఈవోఐను దాఖలు చేసింది. ఇది ఆసక్తిని వ్యక్తం చేయడం మాత్రమేనని, ఫైనాన్షియల్‌ బిడ్‌ను మరో రెండు వారాల్లోగా దాఖలు చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ప్రస్తుతం టాటా గ్రూప్‌ దేశీయంగా ఎయిర్‌ ఏషియా, విస్తారా బ్రాండ్లతో భాగస్వామ్య సంస్థలను నిర్వహిస్తోంది. తద్వారా విమానయాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి సొంతంగానే ముందుకెళుతుందా.. లేక భాగస్వాములను కలుపుకుని రేసులో నిలుస్తుందా అన్న అంశాలపై స్పష్టత లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు)

ఉద్యోగులు ఇలా
మొత్తం 209 మంది ఉద్యోగుల తరఫున ఎయిర్‌ ఇండియా కొనుగోలుకి.. కంపెనీ కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షి మాలిక్‌ ఈవోఐను దాఖలు చేశారు. ఇందుకు ఒక ఆర్థిక సంస్థ భాగస్వా‍మిగా నిలవనున్నట్లు తెలియజేశారు. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ నిబంధనల్లో భాగంగా ప్రయివేట్‌ సంస్థతో ఉద్యోగులు జత కట్టేందుకు వీలు లేదని నిపుణులు తెలియజేశారు. బ్యాంక్‌ లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌తో మాత్రమే భాగస్వామ్యానికి వీలున్నట్లు వివరించారు. కాగా.. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. లక్షకు మించకుండా కంట్రిబ్యూషన్‌ వసూలు చేయనున్నట్లు మాలిక్‌ తెలియజేశారు. తద్వారా ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగులకు 51 శాతం, ఆర్థిక సంస్థకు 49 శాతం వాటాను కేటాయించే వీలున్నట్లు తెలియజేశారు. (లాజిస్టిక్స్‌ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్‌)

రూ. 23,286 కోట్లు
ఎయిర్‌ ఇండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ. 23,286 కోట్ల రుణాలను స‍్వీకరించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌ ఇండియాకున్న మొత్తం రూ. 60,000 కోట్ల రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎస్‌పీవీకు బదిలీ చేయనున్నారు. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్స్‌ పేరుతో ప్రభుత్వం ఎస్‌పీవీకి తెరతీయనుంది. ఎయిర్‌ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌ విలువను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, బ్యాలన్స్‌షీట్లో ఉన్న నగదు తదితరాల ఆధారంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తో్ంది. కాగా.. గతంలో ప్రభుత్వం 2018లో ఒకసారి ఎయిర్‌ ఇండియాను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement