EOI
-
వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం
సాక్షి, హైదరాబాద్: సంస్థ నిర్వహణకు అవసరమైన మూలధనం సమీకరణ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. గురువారంతో ఈఓఐ ప్రక్రియ గడువు ముగిసిపోగా, సింగరేణి బొగ్గు గనుల సంస్థ గానీ మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖ/సంస్థ గానీ బిడ్ దాఖలు చేయలేదు. ఈఓఐలో అవకాశం చేజిక్కించుకుంటే సంస్థ పెట్టాల్సిన పెట్టుబడులు, ఇతర అంశాలను సింగరేణి డైరెక్టర్ల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నిర్వహణ మూలధనంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఏడాదికి రూ.3,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అందించాల్సి ఉంటుందని తేల్చినట్టు సమాచారం. అయితే సింగరేణి సంస్థ వద్ద బాండ్లు, డిపాజిట్ల రూపంలో నిధులున్నా, నగదు రూపం (లిక్విడ్ రిజర్వ్స్)లో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే నిధులు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉండటంతో సర్కారు వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరోవైపు సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండడం, ఈఓఐ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతోనూ బిడ్డింగ్‌కి దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. కాగా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం/సింగరేణి యాజమాన్యం వెల్లడించలేదు. స్టీల్‌ప్లాంట్ ఈఓఐకు 29 బిడ్లు ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రతిపాదించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ప్రక్రియ గడువు గురువారం ముగిసింది. మొత్తం 29 బిడ్లు దాఖలైనట్లు సమాచారం. మార్చి 27న బిడ్లు ఆహ్వానించగా తొలి గడువు ఏప్రిల్ 15 నాటికి 22 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మరికొన్ని సంస్థల విజ్ఞప్తి మేరకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. -
విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్ యూ దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రమోటర్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు . తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నాయి. -
ఫ్యూచర్ రిటైల్ రేసులో అంబానీ, అదానీ
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూప్‌లు సహా 13 కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేసిన కంపెనీల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్), అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్.. ఫ్లెమింగో గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్ కూడా ఉన్నాయి. వీటితో పాటు క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్, యునైటెడ్ బయోటెక్, ఎస్ఎన్వీకే హాస్పిటాలిటీ మొదలైన సంస్థలు ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్ రిటైల్ తెలిపింది. దివాలా ప్రక్రియ కింద కంపెనీ నుంచి రూ. 21,060 కోట్ల మేర బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 31 బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. -
కేజీ బ్లాకులో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లోని గ్యాస్ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్‌గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్ సంస్థలకు ఆఫర్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది. ఈ బాటలో గ్లోబల్ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్ దయాళ్ వెస్ట్(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది. భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్ నిల్వలను కనుగొన్న ఓఎన్జీసీ 2017 ఆగస్ట్‌లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్ ప్రభుత్వ కంపెనీ జీఎస్పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్‌గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఓఎన్జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది. -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్‌కు బ్రేక్! ముగ్గురిలో ఇద్దరు వెనక్కి
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీలో వాటా కొనుగోలుకి బిడ్స్ దాఖలు చేసిన మూడు సంస్థలలో రెండు వెనకడుగు వేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో బిడ్డర్లు రేసు నుంచి తప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. కంపెనీలోగల 52.98% వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. నవంబర్‌కల్లా కనీసం 3 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం ఒకే సంస్థ రేసులో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
తుది దశకు రిలయన్స్ క్యాప్ బిడ్డింగ్
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు రుణపరిష్కార(రిజల్యూషన్) ప్రణాళిక అభ్యర్థన పత్రాల(ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ)పై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో తుది అనుమతి కోసం వచ్చే వారం ఆర్ఎఫ్ఆర్పీని రుణదాతల కమిటీ(సీవోసీ) ముందుంచవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిజల్యూషన్ ప్రణాళిక దాఖలు, విలువ మదింపు తదితర అంశాలలో ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలవనుంది. రిజల్యూషన్ ప్రణాళికను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) కంపెనీలన్నిటికీ అందించనున్నారు. తద్వారా తుది బిడ్స్ దాఖలుకు వీలుంటుంది. బుధవారం సమావేశమైన సీవోసీ ఆర్ఎఫ్ఆర్పీని అనుమతించినట్లు తెలుస్తోంది. తుది అనుమతికి వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కన్సార్షియం క్లస్టర్ బిడ్డర్లు మొత్తం నగదు ప్రాతిపదికన బిడ్ చేయవలసి ఉన్నప్పటికీ ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ ప్రకారం వాయిదా పద్ధతిలో చెల్లింపులకు వీలు కల్పించనున్నట్లు తెలిపాయి. రిలయన్స్ క్యాప్ కార్పొరేట్ దివాలా రిజల్యూషన్ ప్రాసెస్ పూర్తిచేసేందుకు సీవోసీ 3 నెలల గడువును కోరవచ్చని వెల్లడించాయి. -
ఎయిరిండియాపై టాటా గురి..
న్యూఢిల్లీ: ఆర్థిక భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, ఎయిరిండియా ఉద్యోగులు బరిలోకి దిగారు. బిడ్డింగ్‌కు ఆఖరు తేదీ అయిన సోమవారం నాడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) సమర్పించారు. దశాబ్దాల క్రితం తాము వదులుకోవాల్సిన వచ్చిన ఎయిరిండియాను దక్కించుకోవాలని భావిస్తున్న టాటా గ్రూప్.. తమకు మెజారిటీ వాటాలు ఉన్న మరో విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా ద్వారా ఈవోఐ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, టాటా గ్రూప్ స్వంతంగా బిడ్ చేసిందా లేక కన్సార్షియం తరఫున చేసిందా అన్నది వెల్లడి కాలేదు. దీనిపై స్పందించడానికి టాటా గ్రూప్ నిరాకరించింది. మరోవైపు, ఎయిరిండియాకు చెందిన సుమారు 219 మంది ఉద్యోగుల బృందం.. అమెరికాకు చెందిన ఇంటరప్స్ అనే ఫండ్‌తో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఈవోఐ దాఖలు చేసింది. ఉద్యోగులు తలో రూ. 1 లక్ష వేసుకుని కన్సార్షియంలో 51 శాతం వాటా తీసుకోగా, మిగతా 49 శాతం వాటా ఇంటరప్స్‌కి ఉంది. అర్హత పొందిన బిడ్డర్లకు జనవరి 6 లోగా సమాచారం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయా సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఎయిరిండియాలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పలు ఈవోఐలు దాఖలయ్యాయి. ఇక రెండో దశ మొదలవుతుంది’’ అని పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే, ఎన్ని బిడ్లు వచ్చాయి, ఏయే సంస్థలు దాఖలు చేశాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఎయిర్ఏషియా ద్వారా ఎందుకంటే... టాటా గ్రూప్ ప్రస్తుతం రెండు విదేశీ సంస్థలతో కలిసి రెండు విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్ఏషియా ఇండియాను నడుపుతోంది. తమ ఆర్థిక సమస్యల కారణంగా మరిన్ని నిధులు పెట్టలేమంటూ ఎయిర్ఏషియా చేతులెత్తేయడంతో ఎయిర్ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ ఇటీవలే తన వాటాలను 51 శాతానికి పెంచుకుంది. ఇక కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో భారీగా నష్టపోయిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ .. సొంత కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రస్తుతం నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తామే సంక్షోభ పరిస్థితుల్లో ఉండగా.. మరింత సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాపై ఇన్వెస్ట్ చేసేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిర్ఏషియా ఇండియా ద్వారా టాటా గ్రూప్ ఈవోఐ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి మూడేళ్లుగా యత్నాలు.. 2007లో దేశీయంగా సేవలు అందించే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అయినప్పట్నుంచీ ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. తీవ్ర ఆర్థిక భారంతో కుంగుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు 2017 నుంచి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడటం లేదు. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణభారం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇప్పటిదాకా నిర్వహించిన బిడ్డింగ్ ప్రతిపాదనల ప్రకారం చూస్తే .. ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంస్థ దాదాపు రూ. 23,286 కోట్ల రుణభారాన్నీ తీసుకోవాల్సి వచ్చేది. మిగతాదాన్ని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ (ఏఐఏహెచ్ఎల్) అనే స్పెషల్ పర్పస్ సంస్థకు బదలాయించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. అయితే, కొనుగోలుదారులెవరూ దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటాలు, ఎయిరిండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో 50% వాటా విక్రయ ప్రతిపాదనతో బిడ్లు ఆహ్వానించింది. టాటా ఎయిర్‌లైన్స్ నుంచి ఎయిరిండియాగా.. టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో దీని పేరు ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం ఈ సంస్థను జాతీయం చేయడంతో టాటా గ్రూప్ చేజారింది. అయితే, 1977 దాకా జేఆర్డీ టాటానే చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత టాటా సన్స్ పలుమార్లు విమానయాన సంస్థను ప్రారంభించేందుకు ప్రయత్నించింది. 1995లో సాధ్యపడలేదు. అటుపైన 2001లో ఎయిరిండియా కోసం బిడ్ చేసినా .. ప్రభుత్వం విక్రయించకూడదని నిర్ణయించుకోవడంతో కుదరలేదు. ఈ పరిణామాలతో 2013లో టాటా గ్రూప్ విదేశీ సంస్థలతో కలిసి విస్తార, ఎయిర్ఏషియా ఇండియా ఏర్పాటు చేసింది. తాజాగా తాము ఆరంభించిన కంపెనీని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్
ముంబై, సాక్షి: విమానయాన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో ఎట్టకేలకు టాటా గ్రూప్ బరిలో నిలిచింది. మరోపక్క ఎయిర్ ఇండియా ఉద్యోగులు సైతం కంపెనీ కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం. భారీ రుణ భారంతో కుదేలైన ఎయిర్ ఇండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలలుగా సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు నేటి(14)తో ముగియనుంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఈవోఐను దాఖలు చేసింది. మరోవైపు ఒక ఆర్ధిక సంస్థ సహకారంతో 209 మంది ఉద్యోగులు సైతం కన్సార్షియంగా ఏర్పడి ఈవోను దాఖలు చేశారు. వివరాలు చూద్దాం.. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ డిజిన్వెస్ట్‌మెంట్ శాఖకు ఈవోఐను దాఖలు చేసింది. ఇది ఆసక్తిని వ్యక్తం చేయడం మాత్రమేనని, ఫైనాన్షియల్ బిడ్‌ను మరో రెండు వారాల్లోగా దాఖలు చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ప్రస్తుతం టాటా గ్రూప్ దేశీయంగా ఎయిర్ ఏషియా, విస్తారా బ్రాండ్లతో భాగస్వామ్య సంస్థలను నిర్వహిస్తోంది. తద్వారా విమానయాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి సొంతంగానే ముందుకెళుతుందా.. లేక భాగస్వాములను కలుపుకుని రేసులో నిలుస్తుందా అన్న అంశాలపై స్పష్టత లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు) ఉద్యోగులు ఇలా మొత్తం 209 మంది ఉద్యోగుల తరఫున ఎయిర్ ఇండియా కొనుగోలుకి.. కంపెనీ కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ ఈవోఐను దాఖలు చేశారు. ఇందుకు ఒక ఆర్థిక సంస్థ భాగస్వామిగా నిలవనున్నట్లు తెలియజేశారు. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ నిబంధనల్లో భాగంగా ప్రయివేట్ సంస్థతో ఉద్యోగులు జత కట్టేందుకు వీలు లేదని నిపుణులు తెలియజేశారు. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో మాత్రమే భాగస్వామ్యానికి వీలున్నట్లు వివరించారు. కాగా.. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. లక్షకు మించకుండా కంట్రిబ్యూషన్ వసూలు చేయనున్నట్లు మాలిక్ తెలియజేశారు. తద్వారా ఎయిర్ ఇండియాలో ఉద్యోగులకు 51 శాతం, ఆర్థిక సంస్థకు 49 శాతం వాటాను కేటాయించే వీలున్నట్లు తెలియజేశారు. (లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) రూ. 23,286 కోట్లు ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ. 23,286 కోట్ల రుణాలను స్వీకరించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ ఇండియాకున్న మొత్తం రూ. 60,000 కోట్ల రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎస్‌పీవీకు బదిలీ చేయనున్నారు. ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్స్ పేరుతో ప్రభుత్వం ఎస్పీవీకి తెరతీయనుంది. ఎయిర్ ఇండియా ఎంటర్ప్రైజ్ విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, బ్యాలన్స్షీట్లో ఉన్న నగదు తదితరాల ఆధారంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తో్ంది. కాగా.. గతంలో ప్రభుత్వం 2018లో ఒకసారి ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం గమనార్హం! -
బీపీసీఎల్ బిడ్ గడువు నాలుగోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణ మరింత ఆలస్యమవుతోంది. బీపీసీఎల్‌లో వాటాను కొనుగోలు చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) దరఖాస్తులను సమర్పించే తేదీని కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ గడువును నవంబర్ 16 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. గడువు పొడిగించడం ఇది నాలుగోసారి. మొదటి గడువు మే 2 కాగా, ఆ తర్వాత జూన్ 13కు, అటు పిమ్మట జూలై 31కు, ఆ తర్వాత సెప్టెంబర్ 30కు, తాజాగా నవంబర్ 16కు గడువును పొడిగించింది. ఆసక్తి గల సంస్థల విన్నపం మేరకు, కరోనా కల్లోలం కారణంగా గడువును పొడిగిస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడం కోసం బీపీసీఎల్‌లో వాటాను త్వరిత గతిన విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ గడువుల పొడిగింపు కారణంగా ఈ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర నిధులు వస్తాయని అంచనా. ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం తనకున్న పూర్తి (52.98 శాతం)వాటాను విక్రయించనున్నది. గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం నష్టంతో రూ. 353 వద్ద ముగిసింది. -
బీపీసీఎల్ పతనం- రామ్‌కో సిస్టమ్స్ జోరు
తొలి సెషన్లో కన్సాలిడేట్ అయిన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 209 పాయింట్లు జంప్‌చేసి 38,182ను తాకగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగసి 11,245 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చమురు దిగ్గజం బీపీసీఎల్ విక్రయానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్గజం నుంచి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. వెరసి బీపీసీఎల్ కౌంటర్ భారీగా నష్టపోగా.. రామ్‌కో సిస్టమ్స్ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. బీపీసీఎల్ చమురు పీఎస్‌యూ.. బీపీసీఎల్‌ను ప్రయివేటైజ్ చేసే బాటలో కేంద్ర ప్రభుత్వం ఈవోఐల దాఖలుకు తాజాగా గడువును నవంబర్ 16వరకూ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 7న తొలిసారి కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కొనుగోలుకి ఆసక్తి చూపగల కంపెనీల నుంచి వినతులమేరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 53 శాతం వాటా ఉంది. కాగా.. బీపీసీఎల్ కొనుగోలుపట్ల విదేశీ దిగ్గజాలు రాస్‌నెఫ్ట్, సౌదీ అరామ్కో విముఖత చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం పతనమై రూ. 352 దిగువకు చేరింది. రామ్‌కో సిస్టమ్స్ లాజిస్టిక్స్ రంగంలోని గ్లోబల్ కంపెనీతో డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన అంతర్జాతీయ పేరోల్ నిర్వహణలో ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు వీలుగా ఐటీ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలలో గల పేరోల్ కార్యకలాపాలను లాజిస్టిక్స్ కంపెనీ ఏకీకృతం చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 425 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! -
ఎయిర్ ఇండియా సేల్- గడువు పెంపు
విమానయాన సేవల పీఎస్‌యూ దిగ్గజం ఎయిర్ ఇండియాలో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు నెలలపాటు గడువు పెంచింది. దీంతో ఆసక్తి కలిగిన సంస్థలు అక్టోబర్ 30లోగా కొనుగోలుకి బిడ్స్(ఈవోఐ) దాఖలు చేయవచ్చని తెలియజేసింది. కోవిడ్-19 కారణంగా తలెత్తిన సవాళ్ల నేపథ్యంలో ఆసక్తి వ్యక్తం చేస్తున్న కంపెనీల అభ్యర్ధనలమేరకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ శాఖ దీపమ్(డీఐపీఏఎం) పేర్కొంది. వెరసి ఎయిర్ ఇండియాలో వాటా విక్రయానికి జనవరి నుంచి మూడోసారి గడువును పొడిగించింది. నవంబర్ 20కల్లా అర్హత సాధించిన బిడ్స్ వివరాలను వెల్లడించగలమని దీపమ్ పేర్కొంది. తొలుత 76 శాతమే ప్రభుత్వం ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. దీంతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ పూర్తి వాటాను అమ్మకానికి పెట్టింది. తొలుత ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని భావించినప్పటికీ బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించింది. కాగా.. జనవరి 27న తొలుత మార్చి 31వరకూ ఈవోఐలకు గడువును ప్రకటించింది. తదుపరి జూన్ 30కు పెంచగా.. ఆపై ఆగస్ట్ 30వరకూ చివరి తేదీని పొడిగించింది. సాధ్యాసాధ్యాలు.. ఎయిర్ ఇండియా కొనుగోలుకి టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకుంటున్నట్లు మీడియా పేర్కొంది. ఎయిర్ ఇండియా కొనుగోలుకి ఆర్థికపరంగా ఎలాంటి భాగస్వామ్యానికీ తెర తీయకపోవచ్చని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లతోపాటు.. గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్లో సైతం 50 శాతం వాటాను పభుత్వం విక్రయించనుంది. ప్రభుత్వం ఎయిర్ ఇండియా రుణ భారాన్ని రూ. 23,286 కోట్లకు కుదించినట్లు మీడియా తెలియజేసింది. -
జెట్‌కు కొత్త బిడ్డర్లు దూరం
ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ‘మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్‌లైన్‌ను ఇక మరింత పొడిగించే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటిదాకా వచ్చిన మూడు సంస్థలతోనే విక్రయ ప్రక్రియ కొనసాగవచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన వాటిల్లో రష్యాకు చెందిన రష్యన్ ఫండ్ ట్రెజరీ ఆర్ఏ పార్ట్నర్స్, పనామాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ అవాంట్యులో గ్రూప్, దక్షిణ అమెరికా సినర్జీ గ్రూప్ ఉన్నాయి. -
గుడ్‌బై.. ఎయిరిండియా!!
న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రక్రియను ఈసారైనా కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడంపై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఎసాప్స్ కోసం అయిదు శాతం వాటాలు మాత్రమే అట్టే పెట్టుకుని మిగతా 95 శాతాన్ని విక్రయించేసేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ పి.కె. సిన్హా సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ చేసిన సిఫార్సులకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా విక్రయం ఎప్పుడు చేపట్టాలి, ఎన్ని షేర్లు విక్రయించాలి, డీల్ ఎంత స్థాయిలో ఉండాలి అన్న అంశాలపై హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్ తొలి వారంలోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ)ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ప్రతిపాదనలు ఇలా.. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం నుంచి ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు దాకా ఎయిరిండియాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది. గతంలో ఎయిరిండియా విక్రయానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషించుకుని, తగు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం 24 శాతం వాటాలను తన దగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని విక్రయ ప్రక్రియకు సలహాదారుగా వ్యవహరించిన ఈవై సంస్థ పేర్కొనడంతో ఏకంగా 95 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇక, వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు.. కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధి లేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది. గతంలో సెంటార్ హోటల్ విక్రయం విషయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతల కారణంగా ఎయిరిండియా వాటాల అమ్మకంలో మూడేళ్ల లాకిన్ వ్యవధి నిబంధనను గత ప్రతిపాదనల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెంటార్ హోటల్‌ను కొనుగోలు చేసిన టులిప్ హాస్పిటాలిటీ సర్వీసెస్.. దాన్ని నిర్వహించే ప్రయత్నాలేమీ చేయకుండా ఆ వెంటనే మరింత అధిక ధరకు దాన్ని అమ్మేసేయడాన్ని కాగ్ తప్పుపట్టింది. ఇలాంటివి మళ్లీ తలెత్తకుండా ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలో లాకిన్ వ్యవధిని చేర్చాల్సి వచ్చింది. అయితే, అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కొనుక్కున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు అని తెలిపాయి. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని లాకిన్ వ్యవధి నిబంధనను పక్కన పెట్టనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. అంతే కాకుండా కొనుగోలుదారు తన ప్రస్తుత వ్యాపారంలో ఎయిరిండియాను విలీనం చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించేలా నిర్దిష్ట నిబంధనను కూడా సడలించనున్నారు. ముచ్చటగా మూడోసారి.. ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2001లో ఒకసారి, మళ్లీ 2018లో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో.. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తోంది. ఆర్థిక సంక్షో భంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేం దుకు కేంద్రం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,465 కోట్లు, 2017–18లో రూ.1,800 కోట్లు, 2018–19లో రూ. 3,975 కోట్ల మేర నిధులు సమకూర్చింది. గోప్యంగా సమాలోచనలు... ప్రస్తుత విధానాలకు భిన్నంగా ఎయిరిండియాను కొనుగోలు చేసే అవకాశాలున్న సంస్థలతో ఒక చిన్నపాటి ప్రభుత్వాధికారుల బృందం నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. కొనుగోలుకు ఆశక్తిగా ఉన్న ఇన్వెస్టర్ల అభిప్రాయాలను తెలుసుకుని ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ సమాలోచనలన్నీ గోప్యంగా జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వరకూ విక్రయ ప్రక్రియపై ప్రభుత్వ వర్గాల ప్రభావమేదీ పడకుండా చూసేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే, పెద్ద మొత్తంలో బిడ్ చేస్తున్నప్పుడు సీఈవో లేదా సీఎఫ్వోల్లాంటివారు కాకుండా ప్రమోటరు స్థాయిలో ఉన్న వారే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రమోటర్లు నేరుగా విక్రేతతోనే సంప్రదింపులు జరిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టే కీలకమైన కొంత మంది ప్రభుత్వ అధికారులను మాత్రమే ఈ చర్చల్లో భాగం చేసినట్లు అధికార వర్గాలు వివరించాయి. -
సింగరేణి... కొత్త బాణీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో బొగ్గు గనులను చేజిక్కించుకోవడానికి సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, మెజాంబిక్ తదితర దేశాల్లోని బొగ్గు గనుల కోసం అక్కడి కంపెనీల నుంచి గత నెలలో సింగరేణి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను కోరగా, 13 విదేశీ బొగ్గు గనులనుంచి ఆఫర్లు వచ్చాయి. వీటిలో ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లోని చెరో మూడు గనులతో పాటు మోజాంబిక్, బోత్సవానల్లోని చెరో రెండు గనులు, నమిబియా, అమెరికా, దక్షిణాఫ్రికాల్లో ఒక్కో బొగ్గు గని వుంది. వాటిని సింగరేణికి కేటాయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ సంబంధిత యాజమాన్య కంపెనీలు దాఖలు చేసిన బిడ్లపై ప్రస్తుతం సింగరేణి అధ్యయనం చేస్తోంది. ప్రతిపాదిత గనుల్లో బొగ్గు నాణ్యత, లభ్యత, దిగుమతికి రవాణా సౌకర్యాలు వంటి వాటిని సింగరేణి యాజమాన్యం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. పై అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఆమోదయోగ్యమైన గనులను నిపుణుల కమిటీ షార్ట్‌లిస్ట్ చేయనుంది. ఈ కమిటీ ఎంపిక చేసిన గనులను సింగరేణి నిపుణులు సందర్శించనున్నారు. ఆయా దేశాల చట్టాలు, గనుల తవ్వకాలకు స్థానికంగా ఉన్న అనుమతులు, బిడ్లు వేసిన కంపెనీలకు గనులపై ఉన్న న్యాయపర హక్కులు తదితర కీలక విషయాలను ఆరా తీయనున్నారు. అన్నీ సవ్యంగా వుంటే వాటితో గనుల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకోనుంది. కనీసం 51 శాతం యాజమాన్య హక్కులను సింగరేణి చేజిక్కించుకోనుంది. ఒక్కో గని నుంచి ఏడాదికి కనీసం రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాలని, ఒక మిలియన్ టన్నును దేశానికి దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంతో సింగరేణి ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూరై్త ఒప్పందాలు జరుపుకోడానికి ఏడాదికాలం పట్టనుంది. ఈ 13 గనుల్లో ఐదారు విదేశీ బొగ్గు గనులను చేజిక్కించుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాఫ్రికా, మోజాంబిక్ గనులపై ఆసక్తి అమెరికా, బోత్సవాన నుంచి వచ్చిన బొగ్గు గనుల ఆఫర్లను తిరస్కరించాలని సింగరేణి ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాంతాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయని, ఆర్థికంగా నష్టదాయకమని అధికారులు తేల్చారు. మిగతా ఆఫర్లతో పోల్చితే కొంత దగ్గరగా ఉన్న ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, మోజాంబిక్లలోని గనులను పరిశీలించాలని భావిస్తున్నారు. మోజాంబిక్‌లో కేవీఎల్ కంపెనీకి చెందిన గనితో పాటు దక్షిణాఫ్రికాలోని కాంటినెంటల్ కంపెనీకి సంబంధించిన గనిని సందర్శించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో సింగరేణి బోర్డు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్తగా మరో మూడు గనుల్లో ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని 60 మిలియన్ టన్ను(ఎంటీ)లకు పెంచాలని సింగరేణి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2013-14లో 50 ఎంటీలు, 2014-15లో 52 ఎంటీలను ఉత్పత్తి చేయగా, ఈ సారి 8 ఎంటీల ఉత్పత్తిని పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అండ్రియాల గని నుంచి ఉత్పత్తి పునః ప్రారంభంతో పాటు ఈ ఏడాది చివరి నాటికి కొండాపూర్(భూగర్భ), బెల్లంపల్లి ఓసీ-2లో ఉత్పత్తి ప్రారంభించడం, రామగుండం-03ని విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంది.