సాక్షి, హైదరాబాద్: సంస్థ నిర్వహణకు అవసరమైన మూలధనం సమీకరణ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. గురువారంతో ఈఓఐ ప్రక్రియ గడువు ముగిసిపోగా, సింగరేణి బొగ్గు గనుల సంస్థ గానీ మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖ/సంస్థ గానీ బిడ్ దాఖలు చేయలేదు. ఈఓఐలో అవకాశం చేజిక్కించుకుంటే సంస్థ పెట్టాల్సిన పెట్టుబడులు, ఇతర అంశాలను సింగరేణి డైరెక్టర్ల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
నిర్వహణ మూలధనంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఏడాదికి రూ.3,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అందించాల్సి ఉంటుందని తేల్చినట్టు సమాచారం. అయితే సింగరేణి సంస్థ వద్ద బాండ్లు, డిపాజిట్ల రూపంలో నిధులున్నా, నగదు రూపం (లిక్విడ్ రిజర్వ్స్)లో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే నిధులు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉండటంతో సర్కారు వెనక్కి తగ్గినట్టు సమాచారం.
మరోవైపు సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండడం, ఈఓఐ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతోనూ బిడ్డింగ్‌కి దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. కాగా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం/సింగరేణి యాజమాన్యం వెల్లడించలేదు.
స్టీల్‌ప్లాంట్ ఈఓఐకు 29 బిడ్లు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రతిపాదించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ప్రక్రియ గడువు గురువారం ముగిసింది. మొత్తం 29 బిడ్లు దాఖలైనట్లు సమాచారం. మార్చి 27న బిడ్‌లు ఆహ్వానించగా తొలి గడువు ఏప్రిల్ 15 నాటికి 22 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మరికొన్ని సంస్థల విజ్ఞప్తి మేరకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment