సాక్షి, హైదరాబాద్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు మూలధనం కోసం ఇచ్చిన ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ) ప్రక్రియలో పాల్గొనేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంస్థకు మూలధన పెట్టుబడితో పాటు, ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి.. తమ ఉత్పత్తులను తీసుకునేందుకు ఆసక్తి కలిగిన వారికి ఆహ్వానం పలుకుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మార్చి 27వ తేదీన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ప్రకటించింది.
అయితే ఇది బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు స్టీల్‌ప్లాంట్‌ను అప్ప జెప్పే, అంతిమంగా ప్రైవేట్ పరం చేసే ప్రక్రియలో తొలి అడుగని పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోకి ప్రైవేట్ కంపెనీలను చొప్పించే కుట్రకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. ‘వైజాగ్ ఉక్కు..తెలుగు ప్రజల హక్కు’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.
చదవండి: చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు
సింగరేణి సంస్థ ద్వారా..
తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్‌ను వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచే నేరుగా కొనుగోలు చేయాలని, దీని కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనాలని పలువురు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. కాగా బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్న సింగరేణి ఇందుకు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ మెజారిటీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ మేరకు ఒకటీ రెండురోజుల్లో అధికారుల బృందాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు పంపించనున్నారు. ఈ బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా సేకరించాలనుకుంటున్న నిధులు, ఆ నిధులు అందిస్తే తిరిగి ఇచ్చే ఉత్పత్తులు, లేదా తిరిగి చెల్లించే విధానాలు, ఇందుకోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విధించే నిబంధనలు, షరతులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయనుంది. కాగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా.. ఇప్పటికే కొంతకాలంగా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తీసుకున్న వ్యతిరేక వైఖరిని మరింత బలంగా చాటాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది.
ఈ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తే, ప్రభుత్వ రంగ సంస్థలను సంరక్షించేందుకు ఒక ప్రభుత్వంగా వ్యవహరించాల్సిన తీరుపై ఒక బలమైన సందేశం ప్రజల్లోకి వెళుతుందన్న భావన ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అంతిమంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయకుండా, గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మూలధన నిధులను అందించిన తీరుగానే వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment