
సాక్షి, హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రత్యర్థి పార్టీల నేతలకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మేం పింక్ బుక్ (pink book) రాస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ (brs) నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.
కాంగ్రెస్ చేపట్టిన కుల గణన సర్వే తప్పుడు తడకగా ఉంది. 2014 కేసీఆర్ (kcr) జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. నేటి కాంగ్రెస్ సర్వే 46 శాతం బీసీలు ఉన్నట్లు చెబుతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేది’అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, నాగర్ కర్నూల్ సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణం.
జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష్య గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జూపల్లి నియోజకవర్గానికి రావాలి. టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్‌లా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. మేం పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు.