సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ పదే పదే చెప్పారని, కానీ, ఏకపక్షంగా బీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అనంతరం వామ పక్ష నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘మునుగోడులో మద్ధతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. బీజేపీ దూకుడును నిలువరించాలన్నది అప్పుడు మా విధానం. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్‌ఎస్‌కు మద్ధతు ఇవ్వాల్సి వచ్చింది. లెఫ్ట్‌పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. మేం కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదు. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని అన్నారు.
మాతో చర్చలకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇండియా కూటమిలో ఉండడం నచ్చలేదని చెప్పారు. ఎన్డీయేకు దూరంగా ఉంటామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని పదే పదే కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. కేసీఆర్ రాజకీయ విధానంతో సమస్య వచ్చింది అని తమ్మినేని పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తుంది. ఎవరితో కలవాలనేది భవిష్యత్తులో నిర్ణయిస్తాం. మాతో కలిసి వచ్చేవారితో పని చేస్తాం. కమ్యూనిస్ట్‌లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం. నిర్ణయాత్మక పాత్ర రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో పోషిస్తాం. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎక్కడో మిత్రత్వం జరిగింది. బీజేపీకి దగ్గరైతే.. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా. లెఫ్ట్‌లేకపోతే మునుగోడులో బీఆర్‌ఎస్ గెలిచేదా?. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఇవాళ ఇంతటి ప్రశాంత వాతావరణ ఉండేదా?. ఎంతటి బేరసారాలు జరిగాయో కేసీఆర్ మర్చిపోయారా? కేసీఆర్‌కు బీజేపీ అండదండలు ఉంటే చాలు అనుకుంటున్నారా? అని కూనంనేని మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉందని.. ఈ నెల 27 తర్వాత వామపక్ష పార్టీలు మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యచరణ ప్రకటిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment