బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి సాహసోపేతంగా ప్రత్యర్దులకు రాజకీయ సవాల్ విసిరారు. ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలని ఆశిస్తూ, వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్‌కు, అలాగే గట్టి పోటీ ఇవ్వాలని సంకల్పించిన బీజేపీకి ఒక రకంగా షాక్ ఇచ్చే విధంగా అభ్యర్దుల జాబితాను ప్రకటించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాలకు టికెట్లు ఇచ్చేశారు. దీంతో పోటీచేసే బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు ఒక భరోసా ఇచ్చినట్లయింది.
విశ్వాసమా? బలహీనతా!
బహుశా ఈ జాబితాలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మహా అయితే పరిస్థితిని బట్టి, సర్వేలను బట్టి ఎక్కడైనా రెండు, మూడు చోట్ల అభ్యర్ధులను మార్చితే మార్చవచ్చు. ఉదాహరణకు మంత్రి హరీష్ రావుపై ఘాటైన ఆరోపణలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ప్రకటించినా, దానిని ఖరారు చేస్తారా అన్న డౌట్ ఉంది. ఆయన తన కుమారుడికి మెదక్ టిక్కెట్ అడుగుతుండడం విశేషం. కొన్ని విశ్లేషణలలో ఈ రకంగా కేసీఆర్ దాదాపు పూర్తి స్థాయిలో సీట్లు ప్రకటించడం విశ్వాసమా?బలహీనతా అన్న చర్చకు ఆస్కారం ఇచ్చినా, ఆయనకు ఉన్న సర్వేల సమాచారంతోనే ఇలా చేసి ఉండవచ్చు.
లేదా ఎవరినైనా మార్చవలసివస్తే అది తన చేతిలోనే ఉంటుంది కదా అన్న ధీమా కావచ్చు. అందుకే అవసరమైతే మార్చుతామని షరతు పెట్టి జాబితాను ప్రకటించారు. టికెట్లురాని వారిలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నా,వారికి టికెట్లుఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. దళిత బందు వంటి స్కీంలో పలువురు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన గతంలో విమర్శించినా, ఆ పాయింట్ ఆధారంగా టిక్కెట్లను నిరాకరించడం జరిగినట్లు లేదు.
చదవండి: నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ
కేవలం ఏడుగురికే టికెట్లు నిరాకరణ
108 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. తొమ్మిది ఏళ్ల పాలన తర్వాత ఇంత ధైర్యంగా కేసీఆర్ టికెట్లు ఇవ్వడం ఆయనలోని ఆత్మ విశ్వాసాన్ని తెలియ చేస్తుంది. ఈసారి ఎన్నిక కేసీఆర్‌పాలన కావాలా?వద్దా అన్నదానిపైనే జరుగుతుందని, ఎమ్మెల్యేల పాత్ర అంతగా ఉండకపోవచ్చన్నది ఒక అంచనా కావచ్చు. సాధారణంగా రెండు టర్మ్‌లు పూర్తి అయ్యాక కొంత ఎక్కువ సంఖ్యలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చుతుంటారు. ఒక్కోసారి అది మూడో వంతు కావచ్చు. రెండో వంతు కావచ్చు. కాని కేసీఆర్ కేవలం ఏడుగురికే టికెట్లునిరాకరించారు.
గంపా గోవర్దన్‌ను మార్చినట్లు అనుకోనవసరం లేదు
అందులో ఒక చోట కామారెడ్డిలో తానే పోటీలో దిగుతున్నందున అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌ను మార్చినట్లు అనుకోనవసరం లేదు. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీకి తలపడుతున్నారు. దీనిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌లు ఓటమి భయంతోనే అని కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తున్నా, సీఎం హోదాలో ఉన్న ఆయనకు ఆ సందేహం ఉంటుందని అనుకోజాలం. ఆయన తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా రెండు సీట్లలో పోటీచేస్తున్నారు. కాకపోతే గతంలో రెండుసార్లు అసెంబ్లీకి, లోక్‌సభ కలిపి పోటీచేశారు.
చదవండి: Jangaon: ‘పల్లా’కు టికెట్ ఇస్తే అగ్నిగుండమే..!
కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలిచి కేంద్ర మంత్రి
ఇంతవరకు 1985, 1989, 1994, 1999 లలో టీడీపీ పక్షాన , 2001,2004,2014,2019 లలో టీఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. ఈసారి పేరు మారిన బీఆర్‌ఎస్ పక్షాన నిలబడుతున్నారు. 2004, 2014లలో ఆయన అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా పోటీచేశారు. 2004లో కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తదుపరి రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలుపొంది ఒక రికార్డు నెలకొల్పారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు గెలిచారు. 2014లో గజ్వేల్ తో పాటు మెదక్ నుంచి లోక్‌సభకు విజయం సాదించి, ముఖ్యమంత్రి బాద్యత తీసుకున్న తర్వాత లోక్‌సభకు రాజీనామా చేశారు.
8 సార్లు గెలిచిన రికార్డు కేసీఆర్ సొంతం
తెలంగాణలో ఎనిమిది సార్లు అసెంబ్లీకి గెలిచిన రికార్డు కేసీఆర్ సొంతం. ఆరుసార్లు సిద్దిపేట నుంచి రెండుసార్లు గజ్వేల్ నుంచి విజయం సాదించారు. ఈసారి గెలిస్తే తొమ్మిదో సారి గెలిచినట్ల అవుతుంది. అలాగే తెలంగాణ నుంచి రెండుచోట్ల గెలిచిన నేతగా కూడా నమోదు అవుతారు. గతంలో ఎన్టీఆర్. 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాదించారు. 1989లో రెండుచోట్ల పోటీచేసి ఒక చోట ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. అంటే నాలుగు ఎన్నికలలో తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిది స్థానాలలో గెలిచారన్నమాట.
పోచారం శ్రీనివాసరెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు
కేసీఆర్1983లో మాత్రం ఓటమి చెందినా, ఆ తర్వాత ఆయనకు అపజయం అన్నది లేదు. 2004లో సిద్దిపేట నుంచి గెలిచి రాజీనామా చేసిన తర్వాత ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్‌రావుకు ఆ సీటు కేటాయించారు.కేసీఆర్ కుమారుడు, మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి సిరిసిల్ల నుంచి రంగంలో దిగుతున్నారు. ఆయన ఒక ఉప ఎన్నికతో సహా ఐదోసారి పోటీలో ఉంటున్నారన్నమాట. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మళ్లీ బాన్సువాడ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. ఆయన కుమారుడికి ఈసారి టిక్కెట్ ఇస్తారని అనుకున్నా, కేసీఆర్‌మాత్రం ఈయన వైపే మొగ్గు చూపారు.
ఏడోసారి ఎన్నికల బరిలో హరీష్ రావు
పోచారం ఏడోసారి ఎన్నికల గోదాలో నిలబడుతున్నారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి ఏడోసారి ఎన్నికల బరిలో ఉంటున్నారు. హరీష్ రావు మూడు ఉప ఎన్నికలలో గెలవడం ఒక ప్రత్యేకత. 2004లో ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2008, 2011 లలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు.
ఆరోసారి తలసాని
మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోసారి పోటీలో ఉంటున్నారు. ఇక మూడోసారి, నాలుగోసారి పోటీచేసేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. టికెట్లురానివారిలో డాక్టర్ టి.రాజయ్య ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు కొంతకాలం నిర్వహించినా, అనతికాలంలోనే పదవి పోగొట్టుకున్నారు.
పెండింగ్‌లో జనగామ
కాంగ్రెస్‌కు,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన రాజయ్య నాలుగుసార్లు గెలిచినా, ఈసారి టిక్కెట్ పొందలేకపోయారు. ఆయన ఒక మహిళతో వివాదంలో చిక్కుకోవడం టికెట్ రాకపోవడానికి కారణమయి ఉంటుందని భావిస్తున్నారు. దేశ పౌరసత్వ వివాదంతోనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్ ఈసారి టికెట్ సాధించలేకపోయారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్న వ్యతిరేకత రీత్యా టికెట్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో పార్టీలో గొడవ జరుగుతున్న జనగామ సీటును పెండింగ్‌లో ఉంచారు. కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులందరికి టికెట్లు ఇచ్చేశారు.
వివాదాలున్న మళ్లీ ఆయనకే టికెట్
ఇటీవలి కాలంలో ఆయా చోట్ల ఎమ్మెల్యేలకు కొందరు పోటీ అభ్యర్ధులు సిద్దమైనా, వారిని పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై కాన్ఫిడెన్స్ అయి ఉండాలి, లేదా తన నాయకత్వంపై విశ్వాసంతోనే ప్రజలు అబ్యర్దిని పట్టించుకోకుండా ఓట్లు వేస్తారని అనుకుని ఉండవచ్చు. ఉదాహరణకు బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కొన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేశారు. అలాగే బీజేపీ కొనుగోలుకు ప్రయత్నించినట్లు ప్రచారంలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు తిరిగి బీఆర్‌ఎస్ టికెట్లు లభించాయి. ముందుగా ప్రకటన వల్ల అభ్యర్ధులు తమపై ప్రజలలో ఏదైనా నెగిటివ్ ఉంటే పోగొట్టుకునే యత్నం చేయవచ్చు.
మంత్రి వర్గంలోకి పట్నం
లేదా మరీ ఎక్కువ వ్యతిరేకత ఉందనుకుంటే కాండిడేట్‌ను మార్చవచ్చు. అయితే అదే సమయంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలవైపు చూడవచ్చు. కాగా తాండూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆయనను బుజ్జగిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఎన్నికల రాజకీయాలలో ఇలాంటివి తప్పవు. బీఆర్‌ఎస్ ఈ స్థాయిలో టికెట్లు ఇచ్చేస్తుందని కాంగ్రెస్, బీజేపీలు ఊహించి ఉండకపోవచ్చు.గతంలో ఇంత ముందుగా కాదు కానీ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధాన నాయకుడిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో 290 సీట్లకు ఓకే సారి టిక్కెట్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
రేవంత్ గట్టి ప్రయత్నం
ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కాంగ్రెస్‌కు ఉంటుందని ఇప్పటికైతే చెప్పజాలం. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. నిజానికి గ్రామాలలో ప్రభుత్వంపై కొంత నెగిటివ్ ఉందని అంటారు. కాని ఇటీవల లక్ష రూపాయలలోపు రైతుల రుణాల మాఫీ, పలు సంక్షేమ పథకాల అమలు ద్వారా దానిని కొంత తగ్గించే యత్నాన్ని కేసీఆర్ చేశారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంకోవైపు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లడానికి కేసీఆర్ వ్యూహరచన చేసినట్లుగా ఉంది.
కసరత్తులోనే బీజేపీ
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించేవారి దరఖాస్తులను కోరింది. బీజేపీ ఇంకా కసరత్తులోనే ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్‌ఎస్ టికెట్లు పొందినవారికి ధీటైన్ అభ్యర్థులను వెతకవలసి ఉంటుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్లడానికి చాలా సమయం దొరుకుతుంది. కాకపోతే కొంత అధిక ఖర్చు అవుతుంది. అదే సమయంలో ప్రత్యర్ది పార్టీలకు వీరికి పోటీ ఇవ్వగల నేతలను వెతుక్కోవడం కూడా సులువు కావచ్చు.
బీఆర్‌ఎస్‌లో టికెట్లుదొరకని వారు కాంగ్రెస్,బీజేపీలవైపు చూడవచ్చు.అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో గ్రూపులు అధికంగా ఉన్న పరిస్థితిలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ఎంత మేర అవకాశం ఇస్తారన్నది చెప్పలేం. అయితే బీజేపీ ఇలాంటి వారిని ఆకర్షించవచ్చు. ఏది ఏమైనా కేసీఆర్‌వేసిన ఈ వ్యూహానికి కాంగ్రెస్,బీజేపీలు కాస్త విలవిలలాడతాయన్న అభిప్రాయం లేకపోలేదు.
--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment